ఇప్పటికీ, ఎప్పటికీ ఎమర్జెన్సీ ఒక రాజకీయ అస్త్రమే. దాని ప్రభావం, దాని ఫలితం ఇప్పట్లో తొలగిపోయేదేమీ కాదు. దేశ ప్రజాస్వామిక చరిత్రలో ఇది ఒక ఘోర కళంకంగానే మిగిలిపోతుందనడంలో సందేహం లేదు. కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో దేశ ప్రజలకు నిర్ద్వంద్వంగా క్షమాపణలు చెబితే తప్ప ప్రజలు ఆ పార్టీని, ఇందిరా గాంధీని క్షమించే అవకాశం కూడా ఉండదు. ఏడాది క్రితం పార్లమెంటులో ఎమర్జెన్సీ మీద వాడి వేడి చర్చ జరగడం ఈ సమస్య భూస్థాపితం కాలేదనడానికి ఒక నిదర్శనం. లోక్‌సభలో స్పీకర్ ఎన్నిక తర్వాత మళ్లీ ఎమర్జెన్సీ అంశం రేకెత్తడాన్ని బట్టి ఎమర్జెన్సీ ఒక మరచిపోలేని అంశమని అర్థమవుతోంది. గత ఏడాది జూన్ 26న లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికైన తర్వాత ఓం బిర్లా 1975 నాటి అత్యవసర పరిస్థితిని ఖండిస్తూ ఒక తీర్మానాన్ని ప్రతిపాదించారు. పైగా, కనీవినీ ఎరుగని విధంగా ఆయన దీనిపై రెండు నిమిషాల పాటు లోక్‌సభ సభ్యులతో మౌనం పాటింపజేశారు. భారతీయ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎమర్జెన్సీ ఒక చీకటి దశ అని కూడా ఆయన అభివర్ణించారు. ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించి (జూన్ 26,1975) 50 ఏళ్లు నిండిన సందర్భంగా ఆయన పార్లమెంట్ సభ్యులతో దీనిమీద మౌనం పాటింప జేశారు. ఎమర్జెన్సీ అనుభవాలను మరోసారి గుర్తు చేసుకోవడానికి ఇది అవకాశ మిచ్చింది. సహజంగానే ఇది కాంగ్రెస్ పార్టీకి కంటగింపయింది.
ఈ చరిత్రాత్మక దుర్ఘటనకు సంబంధించి రెండు నిమిషాల పాటు మౌనం పాటించిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించు కున్నాయి. వ్యక్తిగతంగా కూడా ఆయన దీనిపై తీవ్ర స్థాయిలో స్పందించినట్టు కనిపించింది. తానొక నిరంకుశుడుగా, ఆధిపత్య ధోరణి కలిగిన వ్యక్తిగా, కాంగ్రెస్ గత పదేళ్లుగా చేస్తున్న విమర్శలు, ఆరోపణ లను దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ స్మారక దినాన విరుచుకుపడ్డారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ తన పట్ల సాగించిన దుష్ప్రచా రాన్ని మోదీ తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. ‘‘ఎమర్జెన్సీ రోజుల్లో కారాగారాల్లో మగ్గినవారికి, ప్రాణాలు కోల్పోయిన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించడం నిజంగా ఒక గొప్ప విషయం. రాజ్యాంగాన్ని లెక్కచేయకపోయినా, రాజ్యాంగం పట్ల గౌరవాభిమానాలు లేకపోయినా దేశానికి ఎంత అరిష్టం జరుగుతుందనేది ప్రస్తుత యువతరం అర్థం చేసుకోవాలి. ఎమర్జెన్సీ సమయంలో రాజ్యాంగాన్ని భ్రష్టుపట్టించడమే కాకుండా, ప్రజల గొంతుకను నొక్కేయడం, నిరంకుశంగా వ్యవహ రించడం, ప్రజాస్వామిక సంస్థలను నిర్వీర్యం చేయడం తదితర పరిణామాలను భావితరాల వారు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నిరంకుశత్వం అంటే ఏమిటో ఎమర్జెన్సీ ప్రపంచానికి చాటి చెప్పింది’’ అని మోదీ వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచార సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆయనను నిరంకుశుడుగా అభివర్ణిస్తూ ప్రచారం చేసిన విషయం తెలిసిందే.
విష ప్రచారానికి పరాకాష్ఠ
ఎన్నికల ప్రచార సమయంలో కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని తమ ప్రధాన ప్రచారాస్త్ర్రంగా చేసుకుంది. దళిత, వెనుకబడిన తరగతుల ఓట్లను వీలైనంతగా రాబట్టుకోవడానికి అనేక సందర్భాల్లో రాజ్యాంగాన్నే ఉటంకించింది. మోదీ నాయకత్వంలోని బీజేపీ మూడవసారి అత్యధిక మెజారిటీతో అధికారం లోకి వస్తే రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చేస్తుందని, దళితులు, వెనుకబడిన వర్గాల రిజర్వేషన్లను రాజ్యాంగ సవరణ ద్వారా రద్దు చేస్తుందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ సహా పలువురు కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారంలోనే కాకుండా, లోక్‌సభలో మోదీ ప్రసంగిస్తున్న సమయంలో కూడా రాహుల్ గాంధీ రాజ్యాంగ ప్రతిని పదే పదే ప్రదర్శించి తప్పుడు వ్యాఖ్యానాలు చేయడం జరిగింది.
అయితే, ఎమర్జెన్సీ సమయంలోనే కాకుండా ఇతర సమయాల్లో కూడా కాంగ్రెస్ రాజ్యాంగాన్ని దెబ్బతీసిన తీరును రాహుల్ గాంధీకి గుర్తు చేయడానికి గత జూన్ 26 నాటి లోక్ సభ చర్చ బీజేపీకి బాగా ఉపయోగపడిరది. ఇందులో భాగంగా లోక్‌సభ సభ్యులతో మౌనం పాటింప జేయడం ఒక మంచి అవకాశంగా కనిపించింది. దేశంలో ప్రజా స్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య సంస్థలను ఖూనీ చేసింది ఎవరనే విషయాన్ని ఈ తరం యువతీయువకులు అర్థం చేసుకోవాలన్నదే మోదీ ధ్యేయంగా కనిపించింది. కాంగ్రెస్ ఈ విషయంలో తన పాపాలను, దుష్కృత్యాలను కడిగేసుకోవడానికి, మోదీ మీద దుష్ప్రచారం సాగించడానికి రాజ్యాంగాన్ని ఉపయోగించుకున్నట్టుగా దేశ ప్రజలు అర్థం చేసుకోవడానికి ఈ సందర్భం బాగా తోడ్పడిరది. అంతేకాదు, దేశ ప్రజల మీద మోదీ అప్రకటిత ఎమర్జెన్సీని విధించారంటూ ప్రచారం చేసిన రాహుల్ తమ వెనుకటి చరిత్రను ఒకసారి గుర్తు చేసుకోవడానికి ఈ సందర్భం అవకాశమిచ్చింది. లోక్‌సభలో రెండు పర్యాయాలు మోదీ తన ప్రసంగాల్లో రాజ్యాంగానికి కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహాన్ని, రాజ్యాంగం పట్ల చేసిన అపచారాలను గుర్తు చేశారు.
ఒప్పుకోలుకు దూరం
దీనికి కాంగ్రెస్ స్పందన ఏమిటన్నది వెంటనే వెల్లడి కాలేదు. నిజానికి ఎమర్జెన్సీ అంశాన్ని ప్రస్తావించినప్పుడల్లా కాంగ్రెస్‌పార్టీ మండిపడుతూనే ఉంటుంది. 2014 తర్వాత మోదీ వ్యవహరించిన తీరు కన్నా 1975 నాటి ఎమర్జెన్సీ అనేక విధాలుగా నయమని కాంగ్రెస్ చెప్పడానికి ఎక్కడా అవకాశం కనిపించలేదు. కాంగ్రెస్ అదే చేసే పక్షంలో దాని విశ్వసనీయత తగ్గిపోయే అవకాశం ఉంది. దాని మిత్రపక్షాలు సైతం ఆ పార్టీ మీద కినుక వహించడం జరుగుతుంది. మిత్ర పక్షాల్లోని కొందరు సీనియర్ నాయకులు సైతం ఎమర్జెన్సీ బాధితులే. 1975 నాటి ఎమర్జెన్సీని ఖండిస్తూ మున్ముందు జరిగే కార్యక్రమాల్లో కాంగ్రెస్ పాల్గొనగలుగుతుందా? ఎమర్జెన్సీని విధించడం పొరపాటేనని, ఇక ముందు అలా జరగబోదని, రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి కాంగ్రెస్ యథా శక్తి ప్రయత్నిస్తుందని ఈ పార్టీ బహిరంగంగా చెప్పగలుగుతుందా?
నిజానికి, 1978 జనవరిలో ఇందిరాగాంధీ మహారాష్ట్రలోని యావత్‌మల్‌లో ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తూ, ఎమర్జెన్సీ సమయంలో జరిగిన అవకతవకలకు, హింసా విధ్వంసకాండలకు, ఇతర తప్పిదాలకు తాను పూర్తి బాధ్యత వహిస్తున్నట్టు ప్రకటించారు. అయితే, ఆమె తన మాటలను తానే నీరు కారుస్తూ, దేశాన్ని కాపాడడానికే తాను ఎమర్జెన్సీని విధించాల్సి వచ్చినట్టు ప్రకటించడం ఆమె ఉద్దేశాన్ని మరోసారి బయట పెట్టింది. అదే విధంగా 2021 మార్చిలో రాహుల్ గాంధీ కూడా ఎమర్జెన్సీని విధించడం తప్పేనని అంగీకరించారు. అయితే, దేశ ప్రజాస్వామ్యాన్ని కాలరాయడం కాంగ్రెస్ ఉద్దేశం కాదని ఒక మెలిక పెట్టడంతో ఆయన ఒప్పుకోలుకు అర్థం లేకుండా పోయింది. ఆయన మాటల్లో ఏ మాత్రం నిజం లేదు. ఎమర్జెన్సీ సమయంలో కనీవినీ ఎరుగని స్థాయిలో అవినీతి చోటు చేసుకుంది. ప్రజాస్వామ్య సంస్థల ఖూనీ జరిగింది. అధికార వ్యవస్థ, న్యాయవ్యవస్థ ప్రభుత్వానికి పూర్తిగా పాదాక్రాంతం కావడం, చెంచాగిరీకి అడ్డూఆపూ లేకుండా పోవడం అన్నవి అప్పడే ప్రారంభం అయ్యాయి. వంశపారంపర్య పాలనకు అంకురార్పణ కూడా అప్పుడే జరిగింది. మెలికలు పెట్టే బదులు నేరుగా, నిర్ద్వంద్వంగా తప్పు ఒప్పుకోవడం మీదే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంది. అంతవరకూ అది గురివింద గింజ సామెతను గుర్తు చేయకపోవడం మంచిది.
ఇక 1975 నాటి ఎమర్జెన్సీని ఇప్పటి మోదీ ఆధిపత్య ధోరణితో పోల్చడం ఏ విధంగానూ సమంజసం కాదు. అప్పటి పరిస్థితులు వేరు. ఇప్పటి పరిస్థితులు వేరు. మోదీ కొద్దిగా కఠినంగా వ్యవహరించడం అన్నది ఇప్పటి పరిస్థితుల దృష్ట్యా అనివార్యం. కానీ, ఎమర్జెన్సీ మాత్రం ప్రజాస్వామ్యం పట్ల, రాజ్యాంగం పట్ల ఘోరమైన ఘాతుకమనే చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ తన 56 ఏళ్ల పాలనలో రాజ్యాంగాన్ని 90 కంటే ఎక్కువ పర్యాయాలు మార్చింది. బీజేపీ తన పదేళ్ల కాలంలో పదిసార్లు కూడా రాజ్యాంగాన్ని మార్చలేదు. పైగా, కాంగ్రెస్ తన రాజకీయ అవసరాల కోసం, ఓటు బ్యాంకులను అభివృద్ధి చేసుకోవడం కోసం రాజ్యాంగాన్ని మార్చిందనడంలో సందేహం లేదు. మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం చేసిన రాజ్యాంగ సవరణల్లో ఎక్కడా రాజకీయ ప్రయోజనాలు కనిపించవు. వాస్తవానికి లోక్‌సభ ఎన్నికల ఫలితాలను దేశ ప్రజలు, దేశంలోని పార్టీలు జీర్ణం చేసుకుంటున్న సమయానికి, జూన్ 5వ తేదీని కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎమర్జెన్సీ తర్వాత ఆ రోజున జయప్రకాశ్ నారాయణ్ సంపూర్ణ విప్లవానికి పిలుపునిచ్చారు. జూన్ 4 ఫలితాలతో పండగ చేసుకుంటున్న ప్రతి పక్షాలు జూన్ 5న ఈ శుభ సందర్భాన్ని కూడా గుర్తు చేసుకుని ఉంటే బాగుండేది.
– జి.రాజశుక, సీనియర్ జర్నలిస్ట్