జూలై 10 గురు పూర్ణిమ

ప్రతి ఆషాఢ పౌర్ణమిరోజున గురుపూజ చేసుకునే ఆచారం అనాదిగా మన సమాజంలో నెలకొని ఉంది.

గురుర్భ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః

గురుసాక్షాత్‌ పరబ్రహ్మ తస్మైశ్రీ గురవే నమః

త్రిమూర్తాత్మక స్వరూపం గురువు. అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానమును అందించేవారు గురువులు. అజ్ఞానం అంటే చదువులేకపోవడం, నిరక్షరాస్యత కాదు. ధర్మనిరతి, కర్తవ్యదీక్ష లేకపోవడం. ధర్మబద్ధమైన జీవనానికి ప్రేరణ ఇవ్వలేని, లేదా అవరోధాలు కల్పించే వాసనలు, భావనలు, కోరికలు వంటివి అజ్ఞానము. హిందూధర్మం అంటేనే మహోన్నత విలువలతో కూడిన జీవన విధానం. మన గురువులు అటువంటి విలువలను అనుష్ఠించారు, తమ శిష్యులతో అనుష్ఠింప చేశారు. మన మహర్షులందరు ఆ విలువలను పాటించినవారే. సాధించిన వారే. సత్యకామ, జాబాలి, శంఖ లిఖితులు, ధౌమ్యుడు మొదలగు తపోధనుల జీవితాలలో ఈ అనుష్ఠానము కనపడుతుంది. అందువల్లనే ఈ దేశ జీవనంలో ఈ విలువలన్ని కొనసాగుతూ వచ్చినాయి.

సత్యం, అహింస, అపరిగ్రహం, ఆస్తేయం, ఇంద్రియ నిగ్రహం, శమదమాదులు వాటిలో కొన్ని. జీవనసమరంలో సతమతమవుతున్న నేటి తరాలకు పరంపరాగతమైన విలువల అనుష్ఠానంలో అనేక అవరోధాలు, ఆటంకాలు ఏర్పడవచ్చు. మన మార్గం నుంచి పక్కకు మళ్లించే ఆకర్షణలు, ప్రలోభాలు తారసపడవచ్చు. వీటి నుంచి మనలను మనం సంరక్షించుకుంటు, సాగటానికి గురువుల మార్గ దర్శనము అత్యంత ఆవశ్యకము.

గురువు వేదవ్యాసులు

లక్షల సంవత్సరాలుగా సాగుతూ వస్తున్న సమాజం కాలానుగుణంగా అనేక మంది గురువులను స్వీకరించింది.వారిలో వేదవ్యాసులను అగ్రగామిగా పరిగణించింది. కనుకనే వ్యాసపూర్ణిమ గురుపూర్ణిమ అయింది. ఎందుకు మన సమాజం వేదవ్యాసుల వారిని గురువుగా స్వీకరించింది?అని ప్రశ్న ఎదురైన వారిని ఉద్దేశించి, హరిద్వార్‌లోని ఒక ప్రముఖ స్వామీజీ ఒకానొక సందర్భంలో వేదవ్యాసులవారి గురించి ఇలా వివరించారు. వేదవ్యాసుల వారి వద్ద ఐదువేల మంది పూర్తి కార్యకర్తలు ఉండేవారట. అందులో సగం మంది ఆయన రచనలను గ్రంథస్థం చేస్తుంటే… మిగతా వారు గ్రామగ్రామాన వాటిని ప్రచారం చేసేవారట.

మహాభారత కాలం మనం ఊహించినంత సాఫీగా సాగి ఉండకపోవచ్చు. భోగలాలసత. రాజ్యగర్వం, ప్రజలను హతాశులను చేసింది. తానే చక్రవర్తిని కావాలని బలి ఇవ్వడానికి ఒకడు 16 వేల మంది రాజకన్యలను అపహరించి తెచ్చాడు. ఇంకొకడు అనుభవించటానికి, దాస్యం చేయించు కోవడానికి ఇంకొక 15వేలమంది కన్యలను తెచ్చాడు. జరాసంధుడిని భీముడు చంపితే నరకాసురుడిని కృష్ణుడు సంహరించాడు. కౌరవాదులు భోగలాలసత, ఈర్ష్యాసూయలకు ప్రతీకలు. సైంధవడు, కీచకుడు…ఇలా అనేక మంది ఆర్ష, సనాతన ధర్మాలను అనేకవిధాల అస్తవ్యస్తం చేశారు. ప్రజలు భోగలాలసత పట్ల ఆసక్తులై దారి తప్పబోతున్న సంధికాలం. అలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆసేతు హిమాచల పర్యంతం విస్తరించిన సువిశాల భూభాగంలో ఈ సనాతన ధర్మ పునః ప్రతిష్ఠకు ఎంత కష్టపడి ఉంటారు? ఎన్ని రాజ్యాలు, ఎన్ని జనపదాలు, అడవులు, వనవాసులు, గిరిజనులు… ఇంత అవిచ్ఛిన్న పరంపరను స్థాపించటానికై ఆ మహానుభావులు పడిన శ్రమ సామాన్యమైనదని భావించ గలమా? అందుకే సమాజం వేదవ్యాసుల వారిని గురువుగా స్వీకరించింది.

తత్వపూజ

హిందుసంస్కృతి ఔన్నత్యం తత్వపూజలోనే ఉంది. వ్యాసపూర్ణిమ నాడు వ్యాసుల వారిని ఆరాధించి, విజ్ఞాన భాండాగారానికి ప్రతీక అయిన ‘వ్యాస పీఠం’ను పూజిస్తారు. గురుగోవిందసింగ్‌ కూడా తన తరువాత గురుగ్రంథ సాహెబ్‌ను సిక్కులకు గురువుగా అనుగ్రహించాడు.‘ ప్రజ్ఞానం బ్రహ్మ’ అంటే ఇదేనేమో?

రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ నిర్మాత డాక్టర్జీ హిందూ సంస్కృతిలోని ఈ మౌలికతను అర్థం చేసుకొని, సంఘానికి కాషాయధ్వజాన్ని గురువుగా ఇచ్చారు. భారత జాతీయ ఆదర్శాలైన త్యాగం, సేవలకు ఈ ధ్వజం ప్రతీక. శ్రీరామచంద్రుడు ఎగురవేసినది ఈ ధ్వజాన్నే. ఇలాంటివి ఎన్నో ఉదాహరణలు మనకు తెలుసు.

కాషాయధ్వజాన్ని మనం భగవాధ్వజము అంటాము. అంటే భగవంతుని ధ్వజము అని అర్థం. కాషాయధ్వజం భగవాధ్వజంగా ఎందువల్ల? ఉదయించే సూర్యుని కాంతి కాషాయం. సూర్యుడు అంటే ప్రత్యక్ష దేవుడని కదా! అలాగే యజ్ఞజ్వాలల రంగు కాషాయం. ఈ యజ్ఞం గురించి గీతాచార్యుడు ఈ విధంగా పేర్కొంటాడు.

అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః

 యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవః

భూతరాశులు అన్నం వలన బతుకుతాయి. అన్నం మేఘాల(వర్షం) వలన పుడుతుంది. మేఘాలు యజ్ఞం నుంచి ఉద్భవిస్తాయి. యజ్ఞం కర్మనుండి వస్తుంది. ఇక్కడ కర్మ అంటే ఏమిటో కూడా గీతాచార్యుడు వివరించాడు.

కర్మబ్రహ్మాద్భవం విద్ధి-బ్రహ్మాక్షర సముద్భవమ్‌

తస్మాత్‌ సర్వగతం బ్రహ్మ-నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితమ్‌॥

కర్మ బ్రహ్మ నుంచి వేదం నుండి ఆవిర్భవిం చింది. వేదాలు నాశరహితుడైన పరమాత్మ నుంచి వచ్చాయి. యజ్ఞమే పరమేశ్వరుడు కనుక యజ్ఞకాంతులను వెదజల్లే కాషాయధ్వజం భగవాధ్వజమైంది. ఇక యజ్ఞకారకమైన వేదోక్తకర్మ అంటే ఏమిటి? ఈ కర్మను అనుసరిస్తే ఏమి వస్తుంది? అనే దానిని భగవద్గీత ఇలా చెబుతోంది.

అభ్యాసే ప్యసమర్థోసి మత్కర్మపరమో భవ।

మదర్థమపి కర్మాణి కుర్వన్సిద్ధిమవాప్స్యసి ॥

యోగాన్ని అభ్యాసం చేయలేకపోతే నాకిష్టమైన కర్మలను ఆచరించు. నా కోసం నీవు చేసే కర్మకు నీకు సిద్ధి లభిస్తుంది.

భగవంతునికి ఇష్టమైన కర్మ ఏమిటి? ధర్మ ప్రతిష్ఠాపనమే భగవంతునికి ప్రీతిపాత్రమైన కర్మ. సంస్కృతి సంరక్షణే వేదోక్తకర్మ. దేవదేవుడు శ్రీమన్నారాయణునికి దేశంలో దేవాలయాలు ఉన్నాయో లేవో తెలియదు కాని భక్తుల ఆర్తిని తీర్చటానికి ఆయన ఎత్తిన దివ్యావతరాలకు మాత్రం గ్రామగ్రామాన ఆలయాలు ఉన్నాయి.

మనం కళ్లు మూసుకొని జపం చేసుకుంటే చాలు.. అంతా పైవాడే చూసుకుంటాడు….అనే నిర్లిప్తతను గీతాచార్యుడు అంగీకరించలేదు.

సక్తాః కర్మణ్యవిద్వాంసో యథా కుర్వంతి భారత

కుర్యాద్విద్వాంస్తథాసక్తః చికీర్షుర్లోకసంగ్రహమ్‌

ఫలాపేక్ష కలిగినవారు ఎంతగా తపిస్తూ కర్మచేస్తారో, విద్వాంసులు, లోక సంఘటనం కావాలనుకునేవారు ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించ కుండా కష్టపడాలి. ఆర్‌ఎస్‌ఎస్‌ నిర్మాత డాక్టర్‌ కేశవరావు జీవితమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. కర్మయోగులైన ఆయన శాస్త్రాలన్నీ అధ్యయనం చేసిన తరువాతనే మనకు భగవాధ్వజాన్ని గురువుగా ఇచ్చారు.

గురుదక్షిణ

గురువుకు మనం ఇచ్చేది దక్షిణ. ‘దక్షిణ’ అనే భావమే శ్రేష్ఠమైనది. ఒక మనిషి ఏదైనా దానమీయ వచ్చు. లేదా త్యాగం చేయవచ్చు. ఈ రెండిరటిలోను ఇచ్చేవాడిది పైచేయి. పుచ్చుకునేవానిది కిందిచేయిగా ఉంటుంది. పొరపాటునో, మానవ తప్పిదం వల్లనో ఇచ్చిన వారికి ‘అహం’ పెరిగే ప్రమాదం ఉంది. శక్తి మేరకు ‘దక్షిణ’ను సమకూర్చుకొని, గ్రహీత పాదాల ముందుంచి ‘స్వామీ! ఈసారికింతే! దయచేసి స్వీకరించండి. మరల అవకాశముంటే ఇంకా ఎక్కువ ఇచ్చుకుంటాను’’ అని నమ్రతతో అర్పించుకునేదే దక్షిణ.

సమర్పణ

డాక్టర్జీ ‘గురుదక్షిణ’ ఇవ్వమనలేదు… సమర్పించ మన్నారు. ‘సమర్పణ’ భావాన్ని మహానుభావులు చాలా మనోహరంగా వ్యక్తంచేశారు.

‘ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు

పూలిమ్మనీ రెమ్మరెమ్మకూ

ఎంత తొందరలే హరిపూజకు

పొద్దు పాడవకమునుపె పూలిమ్మనీ’. అని ఒక సినీకవి అన్నారు.

సూర్యోదయంలోగా తనలోని జవనత్వాలన్నింటిని రంగరించి, సుందర, మనోహర సుమధురమైన పుష్పాలుగా మార్చి ఆ హరిసన్నిధిలో సమర్పించు కోవాలని ఒక చిన్న కొమ్మ అనుకుంటుందట.

శరీరాన్ని పైజన్మ వరకు తల్లిసేవకు అర్పించట మంటే ఎంతటి ధైర్యం, ఆత్మవిశ్వాసం ఉండాలి. పాంచభౌతికమైన ఈ శరీరంలోని ప్రతి అంశం తల్లిసేవకు అర్పణ చేసే భాగ్యం దొరకుట కూడా సామాన్యం కాదు కదా!

సర్వసమర్పణ వల్ల ఏమి వస్తుంది?

ఏవో ఇవన్నీ కవుల కపోల కల్పితాలేనా? లేక సర్వసమర్పణవల్ల ఏదైనా ప్రయోజనం ఉందా? అని అనిపించవచ్చు. ఇందుకు కూడా చరిత్రలో అనేక ఉదాహరణలున్నాయి.

‘కోతికి శక్యమే యసుర

కోటుల గెల్వను? గెల్చెబో, నిజం

బాతని మేన శీతకరుడౌట

దవానలుండెట్టివింత?….’ అనే పద్యం ఈ సందర్భంలో గుర్తుకు వస్తున్నది.

ఒక కోతికి రాక్షసులందరిని సంహరించటం ఎలా సాధ్యమైంది? సరే ఏదో బలవంతుడను కొందాం. మరి అగ్ని దహించివేయకుండా వాలం చల్లబడిర దెట్లా? ఇది రామకార్యానికి అర్పించుకున్న ఫలితమే కాని వేరొకటి గాదు! సమర్పణవల్ల అనంత మైన శక్తి లభిస్తుంది. అద్భుత కార్యాలు జరుగుతాయి. సిక్కువీరులలో భాయి మతిదాస్‌ కథ విన్నాం. తెగిపోయిన తన తలను ఒక చేత్తో పట్టుకుని రెండవ చేత్తో కత్తి తిప్పుతూ మొండెం యుద్ధం చేసింది.

బాజీప్రభు దేశ్‌పాండే! ఆ వీరుడు కూడా అంతే! తల తెగిపోయినా, శివాజీ క్షేమంగా చేరాడనే ఫిరంగి ధ్వని వచ్చేంతవరకు రెండు చేతులలో రెండు ఖడ్గాలను తీసుకొని మొండెం యుద్ధం చేసింది. ఇది అభూత కల్పన కాదు. కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ కావు. నిన్నగాక మొన్న జరిగిన యదార్థ గాథ.

ఆర్‌ఎస్‌ఎస్‌లో అందరం సామాన్య సేవకులం, కార్యకర్తలమే. మహానుభావులం ఎవరమూ లేము. మధ్యతరగతి శ్రేణి అంతకన్న క్రింది శ్రేణి వ్యక్తులే సంఘమంతా. కాని ఈ సంఘం 83 సంవత్సరాల ప్రస్థానంలో ఎన్నో అద్భుతాలు చేసింది. 1948లో సత్యాగ్రహం, 1975 ఎమర్జన్సీకి ప్రతిఘటన, దేశ వ్యాప్తంగా రామజన్మభూమిలో మందిర నిర్మాణానికి ఉద్యమం వగైరా… ఇవన్నీ ఎలా సాధ్యం? ఇదే సమర్పణ శక్తి. ఆ సమర్పణనే మన పూర్వికులు మన నుంచి ఆశించారు.

–  చెన్నకేశవ

(7.7.2008 జాగృతి నుంచి)


గురుపూజ

వ్యాసపూజా మహోత్సవం ఈ యేడు కొత్త శోభనందుకొన్నది. హిందూ విశ్వము నేకత్రిక మొనర్చ కృషి చేస్తున్న విశ్వహిందూ పరిషత్‌ సమస్త హిందూ జాతి సమైక్యమై సామాజికంగా ఆచరించదగిన మహోత్సవాలలో వ్యాసపూజ (ఆషాఢ పూర్ణిమ) నొకదానినిగా ప్రకటించింది.

వ్యాసపూజ ఈ జాతికి కొత్తదికాదు. ఇంటింటా, వ్యాసపూజగనో, గురుపూజగనో, గురుపూర్ణిమగనో (ఆషాఢ పూర్ణిమ) జరుగుతునే ఉంది. ఆరోజు ఆ ఇంటి గురువర్యులను పూజించడం, సత్కరించుట, లేదా ఎవరేని ఒక సాధుపుంగవునికి, సన్యాసికి ఆతిథ్యమివ్వడం ఉండేది. మఠాలు, పీఠాలలో విధిగా, విశేషంగా గురు పరంపరకు పూజ జరిగేది. నాడు సన్యాసులు పీఠాధిపతుల ఆధ్వర్యంలో చాతుర్మాస్య దీక్షలు ప్రారంభమయ్యేవి. అయితే అవి ఎక్కువ భాగం మఠాలకు, సన్యాసులకు పరిమితమై ఉండేవి. గృహస్థులు గురుపూర్ణిమను ఆచరించడం తగ్గసాగింది. చివరకు జాతిలో వ్యాసుడెవరో తెలియనివారు, ఆషాఢ పూర్ణిమ ప్రాముఖ్యం నెరుగనివారు ఉద్భవించనారంభించారు.

గురుర్భ్రహ్మ గురుర్విష్ణుః …..

…..తస్మై శ్రీ గురవే నమః..

ఈ శ్లోక సారాంశమును అంగీకరించని హిందూవర్గం ఉండదనడం అతిశయోక్తి కాదు. గురు సంస్మరణనకు సంబంధించిన ఈ మహత్తర పర్వం యావత్‌ సమాజం నిర్వహించడం జాతీయ ఐక్యత సాధనలో ఒక ముఖ్యమైన అంశము.

ఈ జాతి విజ్ఞానానికి మూర్తిస్వరూపము వ్యాసుడు. అతడెవరు? ఏనాటి వాడు? అనే ప్రశ్నలకు ప్రాముఖ్యమేలేదు. ఒక్క వ్యాసుడు కాదు పలువురు వ్యాసులున్నారని కొందరనవచ్చు. వ్యాసశబ్దము ఒక వ్యక్తికి గాక ఒక పరంపరకు సంబంధించినదని మరికొందరు అనవచ్చు. అతడి వివిధ అవతారాలే వేర్వేరు వ్యాసులు అని మరికొందరు వ్యాఖ్యా నించవచ్చు. వేద విభాగం వలన కలిగిన పేరే వ్యాసశబ్దము. ‘వివ్యాస వేదాన్‌ యస్మాత్‌, వివ్యాస ఏకం వేదం చతుర్ధా’ అని ఇంకొందరు వివరించవచ్చు. కాని వీటన్నిటి సారాంశముగా మిగిలేది మాత్రం అందరికి శిరోధార్యమైన విషయం. మన మెరుగని లోకాల నుంచి మహత్తర విజ్ఞాన సర్వస్వాన్ని ఒక్కనాడుగా గాక అనేకసార్లుగా మనకు అందించిన దివ్యశక్తి అది. అందువల్ల అతడు భగవానుడు, ధర్మ ప్రబోధకుడు, సంస్థాపకుడు, భారతీయ విజ్ఞాన స్వరూపం సర్వస్వం. ఈ జాతికి అతడు గురువు. పరమగురువు. ఆయనకు పూజ గురుపూజ. ఆయన స్థానం గురుస్థానం. అంతేకాదు వివిధములైన పరం పరలతో శోభిల్లే ఈ జాతి ఏకత్వానికి ఆతడు ప్రతీక. దీనిని గుర్తించి, ఆయన చరణ కమలాలను స్మరిస్తూ, ఈ పర్వదినాన జాతి ఏకమై దానిని ఆరాధించడం మనకు ఐక్యతా సాధనమవడమే గాక మన సంస్కృతీ విజ్ఞాన వికాసానికి సాధనం.

గురి కలిగి శ్రద్ధతో ఆరాధించడంలో, అధ్యయనం చేయడంలో వికాసం, విద్యా విజ్ఞానాభివృద్ధులు ఉన్నాయి. ఇది గుర్తించినది భారతీయ గురుశిష్య పరంపర. గురుకులముల నిర్వహణ, విద్యాబోధన ఆ గుర్తింపుతోనే జరిగేది. గురువు, విద్య పట్ల భక్తి శ్రద్ధలతో వ్యవహారించడం ద్వారా విద్యార్థులు విద్యా, వినయ సంపన్నులయ్యేవారు. క్రమశిక్షణ సమస్య ఉత్పన్నమయ్యేదే కాదు. వారి జీవితమే ఒక క్రమశిక్షణగా ఉండేది. గురువులు కూడా అందుకు తగ్గట్లుగానే ఉండేవారు. కాలం మారినా వ్యవస్థలు మారినా మారనిది మానవ నైజము. మానవ మూల్యములు, అనుభవం, అనుభూతులు, భక్తి, శ్రద్ధ, వినయం, క్రమశిక్షణ, ప్రేమ, అభిమానం, బాధ్యత  అనేవి కాలాలతో నిమిత్తం లేనివి. సరియైన సంప్రదాయ పోషణద్వారా సర్వకాల సర్వావస్థలందు నిలుపుకొనదగిన గుణగణాలివి. ఆధునిక విద్యాలయ ములలో సైతం సరస్వతీపూజ, గురుపూజలు నిర్వహించడం మానసికంగా విద్యార్థులనే గాక గురువులను సైతం ప్రభావితం చేయగల్గినట్టివి. వారి వారి విధులను గుర్తు చేసి వారికి మార్గదర్శనం చేయగలిగినట్టివి. వారు బోధించే విద్యా స్వరూపాన్ని గుర్తు చేసెేవి. గురుపూజ, వ్యాసపూజ విద్యారంగానికే కాదు… విశాల జాతీయ రంగంలో ప్రాముఖ్యంగల పర్వం. ముస్లింపాలన, బ్రిటిష్‌పాలన, కాంగ్రెస్‌ పాలనలలో క్రమంగా ప్రాముఖ్యం తగ్గిన వాటిలో ఇదీ ఒకటి. అందువల్లనే విద్యాలయాలు దీనిని గుర్తించలేకపోతున్నాయి. పత్రికల ఊహకు దూరమైనది ఈ పర్వం. రేడియోలో ప్రస్తావనకైనా అర్హంకాని మహాపర్వమైంది ఇది. ఈ స్థితిగతులను దూరం చేసుకొని దివ్య విజ్ఞాన తేజోస్వరూపుడైప వ్యాసభగవానుని గుర్తించ గలగడం ఈ జాతికి అనేక దాస్యముల నుంచి విముక్తికి హేతువు. ఈ విషయమై ప్రజలలో సంస్థలలో ఆనందదాయక పరిణామాలు ప్రారంభమైనవి. ఇక పురోగమనానికై వ్యాసభగవానుని ఆశీస్సులను అర్థిద్దాం.

– 17-07-1967, జాగృతి నుంచి

About Author

By editor

Twitter
YOUTUBE