అత్యవసర పరిస్థితిని విధించిన పది రోజులకి, జూలై 4,1975న నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఫ్‌ు మీద నిషేధం విధించింది. అదే సమయంలో నిషేధానికి గురైన 26 సంస్థలలో అర్‌ఎస్‌ఎస్‌ అతి పెద్దది. దేశంలో రాబోయే పరిస్థితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అత్యవసర పరిస్థితిని ప్రకటించిన రెండోరోజు, జూన్‌ 27న నాటి సర్‌సంఘచాలక్‌ బాలాసాహెబ్‌ దేవరస్‌ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. జూన్‌ 30, 1975న బాలాసాహెబ్‌ దేవరస్‌ను నాగపూర్‌ రైల్వేస్టేషన్‌ దగ్గర కస్టడీలోకి తీసుకున్నారు. దేశంలో చాలామంది స్వయంసేవకుల ఇళ్ల్లు రహస్యోద్యమానికి ప్రత్యేక స్థలాలుగా మారాయి. చాలామంది స్వయంసేవకులు అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలకు మాత్రమేకాదు, ఇతర సంస్థలకు చెందిన వారికి కూడా స్వయంసేవకుల ఇళ్లే సురక్షిత స్థలాలుగా ఉండేవి.

ఎమర్జెన్సీలో భయంకరమైన నిశ్శబ్దం తాండవించింది. సమాచార లోపంతో నరాల తెగేటంత ఉత్కంఠ నెలకొని ఉండేది. ఏ నాయకుడిని అరెస్టు చేసి ఎక్కడ ఉంచారో కూడా ఆచూకీ తెలిసేది కాదు. ప్రధాన స్రవంతి పత్రికల మీద సెన్సార్‌షిప్‌ అమలులో ఉంది. పోలీసులు ఇచ్చిన ప్రకటనలు మాత్రమే ప్రచురించేవి. వాస్తవాలు చెప్పడానికి చాలామంది స్వయంసేవకుల ఇళ్లు అచ్చు యంత్రశాలలుగా మారాయి. కరపత్రాలు, బులెటిన్లు విడుదలయ్యాయి. కొన్ని జిల్లాల నుంచి, ఢల్లీి నుంచి కూడా ఆ సమాచారం అత్యంత రహస్యంగా కార్యకర్తలకు చేరేది. అలాంటి రహస్య పత్రికలలో ఒకటి ఢల్లీి నుంచి ప్రచురించిన ‘సత్య సమాచార్‌’. ఈ రహస్య పత్రికలకు, కరపత్రాలకు న్యూస్‌వీక్‌, న్యూయార్క్‌ టైమ్స్‌ నుంచి ఎమర్జెన్సీకి సంబంధించిన అందేది.

1975, అక్టోబర్‌లో ఢిల్లీలో కామన్వెల్త్‌ గోష్టి జరిగింది. సంప్రదాయం ప్రకారం దీనికి ప్రతిపక్షాలను కూడా ఆహ్వానించాలి. ప్రతిపక్షాల కార్యకర్తలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. వీరిలో అధికులు స్వయంసేవకులే. 42వ రాజ్యాంగ సవరణ గురించి ఇంటింటికీ తిరిగి, దానిని వ్యతిరేకించవలసిన ఆవశ్యకత గురించి స్వయంసేవకులే చెప్పారు. దేశవ్యాప్తంగా 1,30,000 మంది సత్యాగ్రహం చేస్తే అందులో 1,00,000 స్వయంసేవకులే. మీసా కింద అరెస్టయిన 30,000 మందిలో 25,000 మంది స్వయంసేవకులు. వీరంతా జైలుకు వెళ్లారు. స్వయంసేవకులైన కారణంగా చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. తమ వ్యాపార సంస్థలు మూసివేయవలసి వచ్చింది. విద్యార్థి స్వయంసేవకుల చదువులు ఆగిపోయాయి. దాదాపు 100 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆనాటి అత్యాచారాల మీద దర్యాప్తు కోసం నియమించిన షా కమిషన్‌ వివరాల ప్రకారం 1,11,000 మంది అరెస్టయ్యారు.

సంకెళ్లలో ఉన్నా జీవన శైలికి సంబంధించిన క్రమశిక్షణను వీడకుండా కొనసాగించినవారు స్వయంసేవకులే. జైళ్లలో కూడా వారు క్రీడలు, సాహిత్యం, యోగ, సంగీతం, భజనలు, హోమియో ప్రాక్టీస్‌ వంటివి ఏవీ విడిచిపెట్టలేదు.

ఎమర్జెన్సీలో స్వయంసేవకుల పాత్ర గురించి వెలువడిన కొన్ని అభిప్రాయాలను గమనించడం అవసరం.

క్విట్‌ ఇండియా ఉద్యమంలో పనిచేసిన సోషలిస్ట్‌ అచ్యుత్‌ పట్వర్ధన్‌ జూన్‌ 9, 1979న ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌కు రాసిన వ్యాసంలో ఇలా పేర్కొన్నారు. ‘ప్రతిఘటన విషయంలో మిగిలిన సంస్థల వారి కంటే స్వయంసేవకుల నుంచే నేర్చుకోవలసినది ఎక్కువ. అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా ఎవరు పోరాడుతున్నా వారు మద్దతు ఇచ్చారు.’ ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు ఏకే గోపాలన్‌ చేసిన ఉద్విగ్న భరిత వ్యాఖ్య కూడా అదే రోజు పత్రికలో వెలువడిరది. ‘అంతటి సాహసం చూపడానికి, త్యాగం చేయడానికి వారి సిద్ధాంతం వారికి అత్యున్నత స్ఫూర్తిని ఇచ్చింది’ అన్నారాయన.

అత్యవసర పరిస్థితి సమయంలో దేశంలో పత్రికల నోరు నొక్కారు కాబట్టి, విదేశీ పత్రికలు, రేడియో ఇచ్చే సమాచారమే ఆధారమయింది. అయితే భారతదేశంలో ఉన్న విదేశీ మీడియా ప్రతినిధులు ఆర్‌ఎస్‌ఎస్‌ నిర్వహించిన పాత్ర గురించి, ప్రజాస్వామ్య పునరుద్ధరణ గురించి వార్తలు ప్రచురించారు. జనవరి 24, 1976 నాటి సంచికలో ‘ది ఎకనమిస్ట్‌’ పత్రిక ఒక వ్యాసం ప్రచురించింది. దాని శీర్షిక ‘ఔను అజ్ఞాత ఉద్యమం ఉంది’. ఆ ఉద్యమంలో జనసంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్‌ రాజకీయ విభాగం), సోషలిస్ట్‌ పార్టీ, కాంగ్రెస్‌ చీలిక వర్గం, లోక్‌దళ్‌ ఉన్నాయి. అయితే వేగంగా పనిచేసిన బృందాలు జనసంఘ్ వారివే. అంటే ఆర్‌ఎస్‌ఎస్‌ రాజకీయ విభాగానివే. ఆ సంస్థకు కోటి మంది సభ్యులు ఉంటే, వారిలో 6000 పూర్తి సమయ కార్యకర్తలు సహా, 80,000 మంది జైలుకు వెళ్లారు. రహస్యోద్యమం నడుపుతున్న నలుగురు ప్రముఖులలో ఇద్దరు దత్తోపంత్‌ ఠేంగ్డీ (ఆర్‌ఎస్‌ఎస్‌ సీనియర్‌ ప్రచారక్‌), సుబ్రమణియంసామి (రాజ్యసభ సభ్యుడు) జనసంఫ్‌ు వారేనని కూడా ఆ పత్రిక పేర్కొన్నది. ఏప్రిల్‌ 4, 1976న న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక ఆర్‌ఎస్‌ఎస్‌ మీద ఇందిర ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారం గురించి ఒక వ్యాసమే ప్రచురించింది. కర్రలు, కర్రకత్తులు దొరికితేనే ఫోటోలు వేయించి ప్రచారం చేయాలా అని ఆ వ్యాసకర్త జె. ఆంథోనీ లూకాస్‌ నాటి హోం శాఖ సహాయ మంత్రి ఓం మెహతాను ప్రశ్నించారు. లోహంతో చేసిన కొన్ని కత్తులు కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యాలయాలలో దొరికాయని ఆయన అస్పష్టమైన సమాధానం ఇచ్చాడని ఆ వ్యాసంలో తెలియచేశాడు టూకాస్‌. కర్రలు, కర్రకత్తులు సుశిక్షితమైన, ఆధునిక ఆయుధ సంపత్తి కలిగిన పది లక్షల సైన్యానికి బెడద ఎలా అవుతాయని కూడా ఆయన ప్రశ్నించారు. సైన్యంతో పాటు 85,000 మంది బీఎస్‌ఎఫ్‌, 57,000 సెంట్రల్‌ రిజర్వు ఫోర్సు, 7,55,000 రాష్ట్రాల పోలీసులకు బెడద అని ఎలా చెప్పగలరని లూకాస్‌ నిలదీస్తే, అందుకు మెహతా, నిస్సందేహంగా వాళ్ల దగ్గర కొన్ని రైఫిళ్లు కూడా ఉన్నాయి అని సమాధాన మిచ్చారు. మీరేమైనా స్వాధీనం చేసుకున్నారా అన్న మరొక ప్రశ్నకు, ‘లేదు’ అంటూనే, వాటిని బహుశా వాళ్లు ఇళ్లలో దాచి పెట్టి ఉంటారు. వాళ్లని తక్కువ అంచనా వేయకూడదు అని జవాబు ఇచ్చాడు మెహతా. ఆగస్ట్‌ 2,1976న ‘ది గార్డియన్‌’ పత్రిక ప్రచురించిన వ్యాసంలో చాలామంది ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు అరెస్టును తప్పించుకోవడానికి నేపాల్‌ వెళ్లిపోయారని, వారిలో ఎవరినీ భారత పోలీసులకు అప్పగించడానికి నేపాల్‌ అధికారులు అంగీకరించ లేదని ఆ దేశ దౌత్య కార్యాలయం తెలియచేసిందని పేర్కొన్నది. అంత నిర్బంధంలోను సుదూర కేరళకు, ఇతర దక్షిణాది రాష్ట్రాలకు ఆర్‌ఎస్‌ఎస్‌ విస్తరించిందని నాటి హోంశాఖ మంత్రి ప్రకటనను ది గార్డియన్‌ ఉటంకించింది. కమ్యూనిస్టేతర పక్షాలను అణచివేయడానికి ఎమర్జెన్సీని సీపీఐ ఉపయోగించు కోవాలనుకున్న విషయాన్ని కూడా ఆ పత్రిక వెల్లడిరచింది. ఎమర్జెన్సీని సమర్ధించిన పార్టీలు రెండే – సీపీఐ, ముస్లిం లీగ్‌.

జూన్‌ 25,2024న ‘న్యూస్‌ 18’ చానల్‌ ఇచ్చిన ఒక కథనం ఎమర్జెన్సీలో నరేంద్ర మోదీకి సంబంధించినది. ఆ సమయంలో ఆయన అరెస్టు నుంచి తప్పించుకున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ యువ ప్రచారక్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న మోదీ నాడు గుజరాత్‌లో రాజ్యాంగాన్ని బహిరంగంగా చదివే ఉద్యమం నిర్వహించారు. అలాగే ఎమర్జెన్సీ వ్యతిరేక ప్రచురణలు పంచిపెట్టారు. ఎమర్జెన్సీ వ్యతిరేకోద్య మంతో ఆయన సన్నిహితంగా మెలిగారు కాబట్టి పెద్దల ఆదేశం మేరకు ‘సంఘర్ష్‌ మా గుజరాత్‌’ అన్న పుస్తకం రాశారు. నిద్రాహారాలు లేకుండా నిమ్మ రసం తాగుతూ 23 రోజులలో ఆ రచన పూర్తి చేశారు మోదీ. మరొక పుస్తకం ఆపత్కాల్‌ కె సేనాని: నరేంద్ర మోదీ.

–  జాగృతి డెస్క్‌

About Author

By editor

Twitter
YOUTUBE