రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటన్‌కి అట్లీ ప్రధానమంత్రి అయ్యారు. యుద్ధకాలంలో ప్రధానమంత్రిగా ఉన్న చర్చిల్ ప్రతిపక్ష నాయకుడయ్యాడు. యుద్ధంలో బ్రిటన్ విజయం సాధించిన తర్వాత ‘భారతదేశానికి స్వాతంత్య్రం ఇవ్వాల’న్న తీర్మానాన్ని బ్రిటన్ పార్లమెంటులో ప్రవేశపెట్టాలని నిర్ణయం జరిగింది. నిజమైన చరిత్ర ఏమిటీ? ఆంగ్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా అహింసాత్మక పోరాటం చాలదని నమ్మినవాడు సావర్కార్. అంతిమంగా, సాయుధ పోరాటం చేసి తీరాలనే భావనకు, దాని ఆచరణకు, సాఫల్యానికీ సావర్కార్ వ్యూహమే కారణమైంది. ఇది ఎలా జరిగిందో చూద్దాం!
భారతదేశానికి స్వాతంత్య్రం ఇవ్వడం చర్చిల్‌కి ఇష్టంలేదు. దాంతో అతడు అట్లీని కలిసి ‘‘భారత్‌కి స్వాతంత్య్రం ఇవ్వాలంటూ తీర్మానం చేయాల్సిన అవసరం ఇప్పుడు ఏం వచ్చింది? ఇది చేయక తప్పదా?’ అని నిలదీశాడు. అట్లీ ఆయనకు రెండు కారణాలు చెప్పాడు. 1.భారతీయ సైన్యానికి మన దేశం పట్ల విధేయత, విశ్వాసాలు ఇదివరకు ఉన్నట్లుగా ఇప్పుడు లేవు. మనం ఏం చేసినా ఊరుకునే పరిస్థితి ఇదివరకటిలా లేదు. 2.వాళ్లు మన మీద ఏ కాస్త తిరుగుబాటు చేసినా మన సైనికబలంతో అణచివేయగల శక్తి ఇదివరకటిలాగా ఇప్పుడు మన సైన్యానికి లేదు. అందుకే, ఇప్పుడు భారతదేశానికి మనం స్వాతంత్య్రం ఇవ్వక తప్పదు.
దేశానికి స్వాతంత్య్రం రావడానికి దారితీసిన కీలకమైన కారణాలు ఈ రెండే అన్నది చారిత్రక సత్యం. అట్లీ, చర్చిల్ సంభాషణలు దీనికి నిరూపణ అయితే. ఈ సంగతిని ఉన్నది ఉన్నట్లుగా బయటి ప్రపంచానికి ఎవరు చెబుతారు? గాంధీజీ నాయకత్వంలో కాంగ్రెస్ జరిపిన అహింసాత్మక పోరాటాలతోనే ఆంగ్లేయులకు హృదయ పరివర్తన కలిగి, భారత ప్రజలకు స్వాతంత్య్రాన్ని ప్రకటిం చారని ప్రచారం చేయడం ద్వారా మొత్తం ఖ్యాతిని గాంధీకి, కాంగ్రెస్‌కు ఇవ్వడం చరిత్రను వక్రీకరించ డమవుతుంది.
మొదటి స్వాతంత్య్ర సమరం (1857లో) తర్వాత ఆంగ్లేయులు ముందస్తు జాగ్రత్తగా హిందువులను, ముస్లింలను విభజించి పాలించే నీతిని అవలంబించారు. ముస్లింలను బుజ్జగిస్తూ, వారిని హిందువులకు వ్యతిరేకంగా, తమకు అనుకూలంగా ఉండేలా చేసుకున్నారు. తర్వాత భారతీయ సైన్యంలో ముస్లింలను అధిక సంఖ్యలో చేర్చుకుని, హిందువులు అల్పసంఖ్యాకులుగా ఉండేటట్లుగా చూసుకున్నారు. తద్వారా ఇక ముందెప్పుడూ సైనికులు తమపై తిరుగుబాటు చేయకుండా ఉండాలని తపోశారు.
కానీ, రెండో ప్రపంచ యుద్ధం మొదలు కావడంతో సైనికుల సంఖ్యను బాగా పెంచుకో వలసిన అవసరం బ్రిటిష్ పాలకులకు ఏర్పడింది. దాంతో, హిందువులు సైన్యంలో అధిక సంఖ్యలో చేరాలనీ, భవిష్యత్తులో ఎప్పుడైనా ఆంగ్లేయులపై తిరుగుబాటుచేసి, విజయం సాధించాలంటే ఇది తప్పనిసరి అనీ సావర్కార్ వ్యూహరచన చేశాడు. దీనికి భిన్నంగా, సైన్యంలో భారతీయులెవరూ చేరరాదనీ, ఆంగ్ల ప్రభుత్వానికి సహకరించరాదనీ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పిలుపు ఇచ్చింది. గాంధీజీ సహాయ నిరాకరణ పిలుపు దేశానికి స్వాతంత్య్రం ఎలా తేగలదనే దానిపై కాంగ్రెస్ వద్ద జవాబులేదు.
సాయుధ పోరాటం లేకుండా స్వాతంత్య్రం ఎప్పటికీ రాదనీ, అయితే పరాయి పాలకుల సైన్యంలో ముస్లింలు ఎక్కువ సంఖ్యలో ఉన్నంత కాలం సాయుధ పోరాటాలు తలెత్తలేవనీ సావర్కార్ స్పష్టమైన అవగాహనతో ఉన్నారు. సైన్యంలో హిందువులు అత్యధిక సంఖ్యలో ఉండాలని అంటూ దేశమంతా తిరిగి సైన్యంలో చేరేలా హిందువులను ప్రోత్సహించారు సావర్కార్.
‘‘ముందు తుపాకీ పేల్చడం, యుద్ధం చేయడం నేర్చుకోండి! అవసరాన్నిబట్టి, సందర్భాన్నిబట్టి, దానిని ఎవరిమీద పేల్చాలి? ఎవరితో యుద్ధం చేయాలి అనే విషయాలను తర్వాత నిర్ణయించుకోవచ్చు’’ అని ఆయన ప్రచారం చేశారు. హిందువులలో సావర్కార్ వ్యూహాన్ని అర్థం చేసుకోగలిగినవారు సైన్యంలో పెద్ద సంఖ్యలో చేరారు.
ఒక లెక్క ప్రకారం రెండో ప్రపంచ యుద్ధానికి ముందు సైన్యంలో 40 శాతం మాత్రమే ఉన్న హిందువులు, కొత్త సమీకరణలతో 60 శాతానికి పెరిగారు. హిందువులకు దీటుగా ముస్లింలు సైన్యంలో చేరకపోవడంతో, ముందుకు వచ్చిన హిందువులనే సైన్యంలోకి తీసుకోవడం తప్ప, బ్రిటిష్ పాలకులకు గత్యంతరం లేకపోయింది.
ప్రపంచ యుద్ధం ముగిసేనాటికి సైనికపరంగా బ్రిటిష్ ప్రభుత్వం చాలా బలహీనపడింది. ఇదే అదనుగా, హిందువులు అధిక సంఖ్యాకులుగా కలిగిన బొంబాయి నావికాదళం ఆంగ్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటుకు సిద్ధమైంది. అహింస…అహింస అంటున్న గాంధీజీ ప్రభావం నావికాదళ సైనికుల మీద సున్నా. వీరి ఉత్సాహం వైమానిక, పదాతి దళాలకు వ్యాపించే సూచనలు కూడా కనిపించాయి. శాంతి, అహింస ఉద్యమాలను వదలి, భారతీయులు సాయుధ పోరాట మార్గం పడుతున్నారని బ్రిటిష్ పాలకులకు కూడా అర్థమైంది. కాంగ్రెస్ సత్యాగ్రహులను అణచివేసినట్లుగా సైనికుల కొత్త తిరుగుబాట్లను అణచివేసే సైనిక శక్తి తమకు లేదని ఆంగ్లేయులకు బాగా అర్థమైపోయింది.
ఫలితంగా, భారత్‌కు స్వాతంత్య్రం ఇచ్చి తప్పుకోవాలని తెల్లదొరలు నిర్ణయించుకోవలసి వచ్చింది. అట్లీ, చర్చిల్‌ల సంభాషణ ఈ సారాంశాన్ని తేటతెల్లం చేస్తుంది. చారిత్రకంగా గాంధీ ఆధ్వర్యంలో జరిగిన ముఖ్యమైన ఉద్యమాలు మూడు. 1.సహాయ నిరాకరణోద్యమం, 2.ఉప్పు సత్యాగ్రహం, 3. క్విట్ ఇండియా ఉద్యమం. ఈ మూడింటినీ ఆంగ్ల ప్రభుత్వం తన సైనికబలంతో చాలా సులభంగా అణచివేసింది. ఆంగ్లేయులకు అవి పెద్ద సమస్యలే కావు. అందుకనే అట్లీ, చర్చిల్‌ల మధ్య జరిగిన సంభాషణలలో ఆ ఉద్యమాల గురించిగానీ, వాటికి నాయకత్వం వహించిన గాంధీజీ ప్రభావాన్ని గురించి గానీ ప్రస్తావనే లేదు. సాయుధ పోరాటానికి గల గొప్ప శక్తినీ అవసరాన్ని దేశంలోని హిందువులకు విరివిగా ప్రచారం చేసినవాడు, అందుకుగాను బ్రిటిష్‌వారి క్రౌర్యానికి గురై నరమానవుడు కూడా తలచుకోలేని దుర్భర శిక్షలను అనుభవించిన త్యాగధనుడు, అకుంఠిత దేశభక్తుడు వీరసావర్కార్. ఆయన 1966 ఫిబ్రవరి 26న తుదిశ్వాస విడిచారు.
కాంగ్రెస్ పుణ్యమా అని అందరూ అహింస, బాపూజీ సత్యాగ్రహాల గురించే మాట్లాడేవారు. అదే సమయంలో ‘‘జాతిని హైందవీకరించాలి’, హిందువు లను సైనికీకరించాలి’’ అని వీరసావర్కార్ ఇచ్చిన పిలుపు హిందూ జాతికి నిశ్శబ్ద మార్గదర్శి అయింది. స్వాతంత్య్ర ప్రియులకు నిరంతర మార్గదర్శక మయింది.
సావర్కార్ వ్యూహరచన సమగ్రమైనదని అనడానికి గృహనిర్బంధంలో ఉన్న సుభాస్ చంద్రబోస్‌కు ఆయన చేసిన బోధే నిదర్శనం.‘‘ఈ విధంగా గృహనిర్బంధంలో మగ్గుతూ జీవితాన్ని వృథా చేసుకోకు. మారువేషంలో విదేశాలకు వెళ్లు! ఆంగ్ల వ్యతిరేక రాజ్యాలైన జర్మనీ, జపాన్‌లతో కలసి, భారత్‌లోని ఆంగ్ల ప్రభుత్వంపై సాయుధ పోరాటం చేయి’’ అని సలహా ఇచ్చాడు.
సావర్కార్ ప్రేరణతోనే సుభాష్‌చంద్రబోస్ మారువేషంలో జర్మనీ, జపాన్‌లకు వెళ్లాడు. ‘ఆజాద్ హింద్ ఫౌజ్‌వకు నాయకత్వం వహించాడు. ఆంగ్లేయ భారత్‌పై సాయుధ పోరాటంచేసి, ఆంగ్లేయుల మనో ధైర్యాన్ని కుంగదీశాడు. ‘భారతదేశానికి బ్రిటిష్‌వారు స్వాతంత్య్రం ఇవ్వడానికి వెనుక గాంధీ ప్రభావం ఎంత?’ అని ఒక మాజీ హైకోర్టు న్యాయమూర్తి అడిగిన ప్రశ్నకు చాలా స్వల్పం అంటూ అట్లీ పెదవి విరిచారు. అదే సమయంలో తమను అందుకు లొంగదీసినది సుభాస్ చంద్రబోస్ ప్రభావం అని కూడా అట్లీ స్పష్టం చేశారు.
సావర్కార్ చేసిన వ్యూహరచన పుణ్యంగానే మన దేశానికి స్వాతంత్య్రం లభించిందనడానికి అట్లీ మాటలు సాధికారికమైన నిరూపణ. ఈ చారిత్రక వాస్తవాలను ప్రతి భారతీయుడు ఇప్పటికైనా తెలుసుకోవడం న్యాయం.
కె.శ్యాంప్రకాశ్ రావు