ప్రపంచం ప్రస్తుతం ఒక అనూహ్యమైన ఇంధన సంక్షోభం ఎదుర్కొంటోంది. పశ్చిమ ఆసియా ప్రాంతంలో జరుగుతున్న సంఘర్షణలు ముఖ్యంగా హార్ముజ్ జలసంధి ద్వారా ఇంధన సరఫరా అడ్డంకులు ఏర్పడడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగి సరఫరా సమస్యలు తలెత్తాయి. ఈ సంక్షోభం కారణంగా అనేక దేశాలు ఇంధన వినియోగం తగ్గించడానికి వివిధ చర్యలు తీసుకుంటున్నాయి. ప్రజలకు వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్‌ను పరిమితంగా సరఫరా చేయడం నుండి ప్రభుత్వ ఉద్యోగులకు ఇంటి నుండి పని చేయడం (వర్క్ ఫ్రమ్ హోమ్) వరకు అనేక వ్యూహాలు అమలు చేస్తున్నాయి. మొదటగా సంక్షోభం నేపథ్యం అర్థం చేసుకోవాలి. పశ్చిమ ఆసియా నుండి ప్రపంచ ఇంధన సరఫరాలో గణనీయమైన భాగం వస్తుంది. జలసంధి అడ్డంకులు వల్ల రోజువారీ లక్షల బ్యారెల్స్ చమురు రవాణా ప్రభావితమైంది. దీనివల్ల ఆసియా, ఐరోపా, ఆఫ్రికా దేశాల్లో ఇంధన ధరలు ఆకాశాన్నం టాయి. ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ద్రవ్యోల్బణం పెరిగి వృద్ధి రేట్లు తగ్గాయి. ఈ నేపథ్యంలో దేశాలు పొదుపు చర్యలు అనుసరిస్తున్నాయి.
ఆసియా ఖండం ఈ సంక్షోభం నుండి ఎక్కువగా బాధపడుతోంది. ఇక్కడి దేశాలు మధ్యప్రాచ్యం నుండి చాలా ఇంధనం దిగుమతి చేసుకుంటాయి. మన పొరుగుదేశమైన పాకిస్తాన్‌లో సైనిక, ప్రభుత్వ నాయకత్వం సమావేశం అయి సంక్షోభంపై సమీక్షించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో లైట్లు తగ్గించారు. స్కూళ్లు, కాలేజీలు రెండు వారాలు మూసివేశారు. పెట్రోల్ బంకుల అక్రమ నిల్వను అడ్డుకోవడానికి పోలీసులు మోహరించారు. పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు. ఆర్థిక మంత్రి ఇంధన నిల్వలు ఐదు నుండి ఏడు రోజులు మాత్రమే ఉన్నాయని చెప్పారు. ఇంధన దిగుమతు లకు టెండర్లు జారీ చేశారు. ఎల్‌ఎన్‌జి కొనుగోళ్లు పెంచారు. పాకిస్తాన్ ప్రభుత్వం అత్యవసర చర్యలు తీసుకుంది. ప్రభుత్వ కార్యాలయాలకు నాలుగు రోజుల పని వారం అమలు చేసింది. సగం సిబ్బందికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆదేశించారు. ఇంధన వినియోగం తగ్గించడానికి ఈ చర్యలు సహాయ పడతాయి. హైవేలపై వేగ పరిమితులు విధించారు. ప్రభుత్వ అధికారుల విదేశీ ప్రయాణాలు నిషేధించారు. ప్రభుత్వం ఇంధన ధరలను స్థిరంగా ఉంచడానికి సబ్సిడీలు అందిస్తోంది కానీ ఆర్థిక భారం పెరుగుతోంది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఇంధన ఆధారితం కాబట్టి ఈ చర్యలు అనివార్యమయ్యాయి.
బాంగ్లాదేశ్ కూడా తీవ్రమైన చర్యలు తీసుకుంది. ఇంధన రేషనింగ్(పరిమిత పరిమాణంలో ఇంధన సరఫరా) అమలు చేసింది. కార్యాలయాల సమయాలు తగ్గించారు. వివాహాలు వంటి కార్యక్రమాల్లో అనవసరమైన లైటింగ్ నిషేధించారు. యూనివర్సిటీలకు ముందుగా సెలవులు ప్రకటిం చారు. ఇంధన వినియోగం తగ్గించడానికి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ప్రోత్సహించారు. ఎయిర్ కండీషనర్ల ఉష్ణోగ్రతలు నియంత్రించారు. బాంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ గార్మెంట్స్ పరిశ్రమపై ఆధారపడి ఉంది. ఇంధన సమస్య వల్ల ఫ్యాక్టరీలు ప్రభావితమవు తున్నాయి. విద్యుత్ కోతలు ఎదుర్కొంటున్నాయి. ఎల్‌ఎన్‌జి దిగుమతులు పెంచాలని ప్రభుత్వం చూస్తోంది. బిలియన్ డాలర్ల బాహ్య ఫైనాన్సింగ్ కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఇంధన దిగుమతులకు బదులుగా స్థానిక వనరులు పెంచాలని ఆలోచిస్తోంది.
శ్రీలంకలో పబ్లిక్ ఈవెంట్లు తగ్గించడం వల్ల ఇంధనం ఆదా అవుతోంది. ఇంధన రేషనింగ్ వ్యవస్థ అమలవుతోంది. మోటార్ సైకిళ్లకు వారానికి ఐదు లీటర్లు, కార్లకు 15 లీటర్లు, బస్సులకు 60 లీటర్లు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. క్యూఆర్ కోడ్ ఆధారంగా ఈ వ్యవస్థ నడుస్తోంది. విద్యా సంస్థలకు నాలుగు రోజుల పని వారం అమలు చేశాయి. ప్రభుత్వ కార్యకలాపాలు తగ్గించారు. శ్రీలంక ఇంధన దిగుమతులపై ఎక్కువ ఆధారపడి ఉంది కాబట్టి ఈ చర్యలు అవసరమయ్యాయి. ఇంధనం ఆదా చేయాలని ప్రజలకు ప్రభుత్వం పిలుపునిచ్చింది.
ఫిలిప్పైన్స్ ప్రభుత్వం నాలుగు రోజుల పని వారం అమలు చేసింది. పబ్లిక్ సెక్టర్ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రోత్సహించింది. ఎయిర్ కండీషనర్లు నాలుగు డిగ్రీల కంటే తక్కువగా ఉండకూడదని ఆదేశించింది. ఇంధన సబ్సిడీలు అందించి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ప్రోత్సహించింది. ఫిలిప్పైన్స్ జాతీయ అత్యవసర స్థితి ప్రకటించింది. ఇంధన సరఫరా సమస్యలు తీవ్రంగా ఉన్నాయి.
థాయ్‌లాండ్ ఇంధన ధరలను స్థిరంగా ఉంచ డానికి సబ్సిడీలు ఇస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆదేశించింది. ఎయిర్ కండీషనర్ ఉష్ణోగ్రతలను 26, 27 డిగ్రీలుగా ఉంచాలని సూచించింది. బయో ఇంధన మిశ్రమాలు పెంచింది. థాయ్‌లాండ్ ఇంధన దిగుమతులపై ఆధారపడి ఉంది. ఎగుమతులు నియంత్రించింది.
వియత్నాం ఇంధన పన్నులు తగ్గించింది. వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రోత్సహించింది. బొగ్గు ద్వారా విద్యుదుత్పాదన పెంచింది. ఇంధన ధరలు పెరగడం వల్ల ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటోంది.
మయన్మార్ బేసి, సరి వాహన నియమం అమలు చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు బుధవారం వర్క్ ఫ్రమ్ హోమ్ తప్పనిసరి చేసింది. ఇంధన రేషనింగ్ కఠినంగా అమలు చేస్తోంది.
ఇండోనేషియా ప్రభుత్వ ఉద్యోగులకు శుక్రవారం వర్క్ ఫ్రమ్ హోమ్ ఆదేశించింది. ఇంధన వినియోగం తగ్గించడానికి ఈ చర్య సహాయపడుతుందని అంచనా వేసింది.
దక్షిణ కొరియా ఇంధన ధరలకు పరిమితి విధించింది. ప్రభుత్వ ఉద్యోగులకు వాహనాల వాడకంపై నియంత్రణలు విధించింది. బొగ్గు ఆధారిత, అణు శక్తి ఆధారిత విద్యుదుత్పాదనను పెంచింది. జపాన్ తన నిల్వల నుండి ఇంధనం విడుదల చేస్తోంది.
భారతదేశం ఈ సంక్షోభం నుండి రక్షణ కోసం చర్యలు తీసుకుంటోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు ఇంధన సామర్థ్యం పెంచాలని, వినియోగం తగ్గించాలని పిలుపునిచ్చారు. వర్క్ ఫ్రమ్ హోమ్ పునరుద్ధరించాలని సూచించారు. భారత్ రష్యా నుండి ఎక్కువ చమురు దిగుమతి చేసుకుం టోంది. బొగ్గు ఉత్పత్తి పెంచుతోంది. రైతులకు సహాయం అందిస్తోంది. సౌర పంపులు ఎలక్ట్రిక్ వాహనాలు ప్రోత్సహిస్తోంది. భారతదేశం రిఫైనరీల ద్వారా ధరలను స్థిరంగా ఉంచుతోంది కానీ సబ్సిడీలు ఆర్థిక భారం పెంచుతున్నాయి. భారతదేశంలో రవాణా వ్యవసాయం ఇంధనంపై ఆధారపడి ఉన్నాయి. డీజిల్ ధరల పెరుగుదల వ్యవసాయ ఖర్చులు పెంచుతుంది. ప్రభుత్వం రైతులకు సబ్సిడీలు అందిస్తోంది. విండ్‌ఫాల్ ట్యాక్స్ విధించింది. ఎల్‌పిజి ఉత్పత్తి పెంచాలని రిఫైనరీలకు ఆదేశాలు ఇచ్చింది. పైప్డ్ నేచురల్ గ్యాస్ వినియోగదారులకు ఎల్‌పిజి సిలిండర్లు రీఫిల్ చేయకూడదని ఆదేశించింది. ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్‌కు రూ. 3.90 పెంచింది.
చైనా తన పెద్ద నిల్వలను ఉపయోగించి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇరాన్ నుండి ఇంధనం తీసుకుంటోంది. పునరుత్పాదక వనరులు పెంచు తోంది. ఇంధన ఎగుమతులపై నియంత్రణలు విధించింది.
ఈజిప్ట్ షాపులు రెస్టారెంట్లు రాత్రి తొమ్మిది గంటలకు వ•సివేయాలని ఆదేశించింది. స్ట్రీట్ లైట్లు తగ్గించింది. ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి ఒక రోజు వర్క్ ఫ్రమ్ హోమ్ తప్పనిసరి చేసింది. పెట్రోల్ ధరలు పెంచింది. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఛార్జీలు పెంచింది. ప్రధాన మంత్రి ఇంధనం విద్యుత్ రేషన్ చేయాలని చెప్పారు. హోటళ్లు, టూరిస్ట్ స్థలాలకు మినహాయింపు ఇచ్చారు. ప్రభుత్వ భవనాలు సాయంత్రం ఆరు గంటలకు మూసివేస్తున్నారు. ఇల్యూమినేటెడ్ బిల్‌బోర్డులను (దీపాలతో వెలిగే ఉత్పత్తుల ప్రచార బోర్డులు) ఆఫ్ చేస్తున్నారు
యూరప్ దేశాలు కూడా చర్యలు తీసుకుంటు న్నాయి. స్లోవేనియా చర్యలు తీవ్రంగా ఉన్నాయి. స్లోవేనియా ఇంధన రేషనింగ్ అమలు చేసింది. ప్రైవేట్ డ్రైవర్లకు వారానికి 50 లీటర్లు, వ్యాపారాలకు 200 లీటర్లు మాత్రమే సరఫరా చేస్తోంది. జర్మనీ ఇంధన పన్నులు తగ్గించింది. బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. ఇటలీ బొగ్గును తవ్వి తీస్తోంది. ఫ్రాన్స్ అణు శక్తి ఆధారిత విద్యుత్తుపై ఆధారపడుతోంది. బెల్జియం పవన ఆధారిత విద్యుదాత్పదన పెంచుతోంది. ఇతర దేశాలు పన్నుల తగ్గింపు సబ్సిడీలపై ఆధారపడు తున్నాయి. ఆఫ్రికా దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటు న్నాయి. జాంబియా అత్యవసర స్థితి ప్రకటించింది. మొజాంబిక్ ప్రజలకు వర్క్ ఫ్రమ్ హోమ్ సూచిం చింది. ఇథియోపియా ఇంధన సరఫరా సమస్యలు ఎదుర్కొంటోంది. అమెరికా తన వ్యూహాత్మక నిల్వలు విడుదల చేస్తోంది. కెనడా ఇంధన పన్నులు తగ్గించింది.
ఇంకా విస్తృతంగా చెప్పాలంటే ఆసియా దేశాల్లో కంబోడియా పెట్రోల్ బంకులు మూసివేసింది. లావోస్ వినియోగ నియంత్రణలు విధించింది. మలేషియా ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆదేశించింది. ఎయిర్ కండీషనర్ ఉష్ణోగ్రతలు నాలుగు డిగ్రీలు నియంత్రించింది. అధికారుల ప్రయాణాలు పరిమితం చేసింది. సోలార్ ప్యానెల్స్, ఎల్‌ఈడీ లైటింగ్ ఏర్పాటు చేయాలని సూచించింది. మడగాస్కర్ జాతీయ అత్యవసర స్థితి ప్రకటించింది. జోర్డాన్ ప్రభుత్వ కార్యాలయాల్లో ఎయిర్ కండీషనర్లు నిషేధించింది. అధికారుల విదేశీ ప్రయాణాలు నిషేధించింది. ప్రభుత్వ వాహనాల వినియోగం తగ్గించింది.
ఈ చర్యలన్నీ తాత్కాలికమైనవి. దీర్ఘకాలికంగా పునరుత్పాదక ఇంధనాల సామర్థ్యం పెంపు అవసరం. అనేక దేశాలు సౌర విద్యుత్తు, పవన విద్యుత్తు వైపు మళ్లుతున్నాయి. ఈ చర్యలు ప్రజల జీవన విధానాన్ని మారుస్తున్నాయి. ప్రజలు చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి. కార్లకు బదులు సైకిళ్లు, ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించాలి. లైట్లు, ఫ్యాన్లు వినియోగాన్ని పరిమితం చేసుకోవాలి. ఎల్‌ఈడీ లైట్లు, ఇంధన వినియోగాన్ని తగ్గించే ఉపకరణాలు ఉపయోగించాలి. దీర్ఘకాలిక పరిష్కారాలుగా పునరుత్పాదక వనరులు కనిపిస్తున్నాయి. సౌరవిద్యుత్, పవన్ విద్యుత్ ఉత్పాదన పెంచాలి. ఇంధన స్టోరేజ్ గ్రిడ్ మెరుగుపరచాలి. అంతర్జాతీయ సమావేశాల్లో ఈ చర్చలు జరుగుతున్నాయి. దీనిపై ప్రపంచ దేశాలు కలిసి పని చేయాల్సిన అవసరం ఉంది. ఈ సంక్షోభం మనకు గుణపాఠం. ఇంధనంపై ఆధారపడటం తగ్గించాలి. స్థానిక వనరులు అభివృద్ధి చేయాలి. ప్రతి వ్యక్తి బాధ్యత తీసుకోవాలి. ప్రభుత్వాలు పాలసీలు మార్చాలి. అప్పుడే భవిష్యత్ సురక్షితం అవుతుంది.
ఈ చర్యలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను స్థిరపరచడానికి సహాయపడతాయి. కానీ రాబోయే రోజుల్లో మరిన్ని సవాళ్లు ఉండవచ్చు. శీతాకాలం సమీపిస్తుంటే యూరప్‌లో సమస్యలు పెరగవచ్చు. వేసవి కాలంలో ఆసియాలో డిమాండ్ పెరుగుతుంది. ప్రభుత్వాలు అవసరార్థులకు సహాయం అందించాలి. పేదలకు మాత్రమే సబ్సిడీలు ఇవ్వాలి. అంతర్జాతీయ సహకారం పెంచాలి. యావత్ మానవాళి ఈ సంక్షోభం నుండి బయటపడి బలమైన స్వతంత్ర ఇంధన వ్యవస్థను నిర్మించుకోవాలి.
ఈ విధంగా అనేక దేశాలు తమ తమ పరిస్థితుల ప్రకారం చర్యలు తీసుకుంటున్నాయి. పాకిస్తాన్, బాంగ్లాదేశ్, శ్రీలంక వంటి దేశాలు ఇంధన రేషనింగ్, నాలుగు రోజుల పని వారం, వర్క్ ఫ్రమ్ హోమ్ వంటివి అమలు చేస్తున్నాయి. ఈజిప్ట్ షాపింగ్ మాల్స్, రెస్టారెంట్ల మూసివేత, లైటింగ్ తగ్గింపు వంటివి చేస్తోంది. భారతదేశం సబ్సిడీలు, దిగు మతుల పెంపు వంటి మార్గాలు అనుసరిస్తోంది. యూరప్, ఆఫ్రికా దేశాలు కూడా దాదాపుగా ఇలాంటి చర్యలు తీసుకుంటున్నాయి.
ఈ సంక్షోభం ప్రపంచానికి ఒక అతిపెద్ద గుణపాఠం. ఇంధనం అవ•ల్యమైన వనరు. దానిని ఆదా చేయాలి. తద్వారా స్థిరమైన అభివృద్ధి వైపు అడుగులు వేయాలి. ప్రతి దేశం తన వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. దీనికి ప్రజలు సహకరించాలి. అప్పుడే మనం ఈ సవాలును అధిగమించి మంచి భవిష్యత్తును నిర్మించుకోగలం.
ఢిల్లీలో వారానికి రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్

ప్రధానమంత్రి ఇంధన పొదుపు పిలుపును అనుసరించి అనేక చర్యలు తీసుకుంటున్నట్టు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా తెలిపారు. ఈ మేరకు మే 14న ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనకు లోబడి ప్రభుత్వ ఉద్యోగులందరూ వారానికి రెండు రోజులు ఇంటి నుంచి పని (వర్క్ ఫ్రమ్ హోమ్) చేయాలి. ఈ చర్య ఇంధన వినియోగం తగ్గించి విదేశీ మారకాన్ని ఆదా చేయడానికి ఉద్దేశించినది. ప్రభుత్వ అధికారులు వారానికి ఒక రోజు కారు లేని రోజుగా గుర్తించి ప్రజా రవాణా సాధనాలు లేదా సంఘటిత వాహనాలను వాడాలి. అధికారిక సమావేశాలలో సగం ఆన్‌లైన్‌లో నిర్వహించాలి. ఇది ప్రయాణాలు తగ్గించి ఇంధనం ఆదా చేస్తుంది. ప్రతి సోమవారం మెట్రో రోజుగా జరుపుతారు. ఉద్యోగులు మెట్రోను ఉపయోగించాలని ప్రోత్సహిస్తారు.కొత్త ప్రభుత్వ వాహనాల కొనుగోలును ఆరు నెలల పాటు నిలిపివేశారు. అధికారుల విదేశీ ప్రయాణాలను ఒక సంవత్సరం పాటు నిషేధించారు. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించి డీజిల్ పంపులను ఎలక్ట్రిక్ వ్యవస్థలతో భర్తీ చేస్తారు. అధికారులు అధికారిక కార్యక్రమాలకు సంఘటితంగా ప్రయా ణించాలి. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాలు ఉదయం 8:30 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పని చేస్తాయి. వారానికి ఒక రోజు వాహనం లేని రోజుగా పాటించాలని ఢిల్లీ ప్రజలకు ముఖ్యమంత్రి పిలుపు నిచ్చారు. ప్రభుత్వం ఈ చర్యల అమలును పర్యవేక్షి స్తుంది. ప్రైవేట్ సంస్థలకు కూడా ఇలాంటి చర్యలు అనుసరించాలని సూచించారు. ఉద్యోగులు, ప్రజలు ఈ చర్యల అమలుకు సహకరించాలని కోరారు.
సైకిల్‌పై గుజరాత్ గవర్నర్

గుజరాత్ రాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవవ్రత్ మే 14న రైలులో హర్యానాలోని కురుక్షేత్ర ప్రాంతానికి చేరుకున్నారు. ఆయన కురుక్షేత్ర రైల్వే స్టేషన్ నుండి గురుకుల్ వరకు సైకిల్‌పై ప్రయాణిస్తూ, ఇంధనాన్ని ఆదా చేయడం, స్వదేశీని అవలంబించడం వంటి సందేశాలను వ్యాప్తి చేశారు. ఆయన సైకిల్ తొక్కుతూ ప్రజలలో అవగాహన కల్పించారు. దేశం వేగవంతమైన అభివృద్ధి పథంలో ముందుకు సాగాలంటే, ఇంధన పొదుపు సందేశాన్ని ప్రతి ఇంటికీ చేరవేయాలని గవర్నర్ విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. వారానికి ఒక రోజును ‘వాహన రహిత దినం’గా పాటించాలని, ప్రజా రవాణా, సైకిళ్లు లేదా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాలని కోరుతూ గుజరాత్‌లోని అన్ని రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు లేఖలు రాసినట్లు ఆయన చెప్పారు.
ఆటోలో కేంద్ర మంత్రి అర్జున్

కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్‌మేఘ్‌వాల్ ఇంధన పొదుపు చర్యలో భాగంగా మే 14న రాజస్థాన్‌లోని బికనేర్‌లో ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో ప్రయాణించారు. ఇంధనాన్ని పొదుపు చేయాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ నుండి బికనేర్‌కు రైలులో వచ్చిన మంత్రి రైల్వే స్టేషన్‌లో దిగగానే వాహనాల కాన్వాయ్‌ను వద్దన్నారు.బదులుగా ఈ-రిక్షాలో ప్రయాణిం చాలని నిర్ణయించు కున్నారు. బికనేర్ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తికి అనుగుణంగా ఇంధన పొదుపును ప్రోత్సహించడమే ఈ చర్య లక్ష్యమని అన్నారు.
బైక్‌పై మహారాష్ట్ర సీఎం

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మే 14న ముంబైలో విధాన భవన్‌కు మోటార్ సైకిల్‌పై వచ్చారు. అనంతరం కేంద్రం పొదుపు చర్యలను సమర్థించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలను కేవలం ‘‘చిన్న త్యాగాలు చేసుకోమని మాత్రమే కోరారు’’ అని ఆయన అన్నారు. ఈ విషయంపై ‘‘అనవసరమైన వివాదాన్ని’’ సృష్టిస్తున్నందుకు ప్రతిపక్షాలను ఆయన విమర్శించారు. వ్యూహాత్మక పొత్తులు, ఆర్థిక ప్రయోజనాల కోసం చేసే ప్రధాని విదేశీ పర్యటనలను ప్రశ్నించడం ‘‘పచ్చి అవివేకం’’ అని ఆయన అన్నారు. శాసన మండలి కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకు ఫడ్నవిస్ తన నివాసం ‘వర్ష’ నుండి బీజేపీ నాయకుడు, మంత్రి ఆశిష్ షెలార్‌తో కలిసి దక్షిణ ముంబైలోని విధాన భవన్‌కు మోటార్‌సైకిల్‌పై చేరుకున్నారు.
ఒకే కారులో ఒడిశా సీఎం ప్రయాణం

ఇంధన పొదుపునకు మద్దతుగా ఒడిశా ముఖ్య మంత్రి మోహన్ చరణ్ మాఝీ తన అధికారిక భద్రతా వాహన సముదా యంలోని వాహనాల సంఖ్యను సగానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన మే 14న ఒక కారులో ప్రయాణించారు. ప్రధానమంత్రి విజ్ఞప్తికి ప్రతిస్పందనగా ఈ చర్య తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఒడిశా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (OSRTC) కు చెందిన అన్ని బస్సులను దశలవారీగా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చనున్నట్లు రవాణా శాఖ మంత్రి బిభూతి భూషణ్ జెనా తెలిపారు.
మెట్రో రైలులో కేంద్ర మంత్రి అథావలే

కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథావలే మే 12న ముంబైలో బీకేసీ నుంచి విధాన భవన్ స్టేషన్ వరకు మెట్రో రైలులో ప్రయాణించారు. ఇంధనాన్ని ఆదా చేసేందుకు ప్రజా రవాణాను ఉపయోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తన మెట్రో ప్రయాణం అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, మధ్యప్రాచ్య సంఘర్షణ ప్రభావం నుంచి ఆర్థిక వ్యవస్థను కాపాడాలన్న మోదీ విజ్ఞప్తిని రాజకీయం చేయాల్సిన అవసరం లేదని అన్నారు. ‘‘పెట్రోల్, డీజిల్ ఆదా చేసే దృష్ట్యా మెట్రోలో ప్రయాణించడం అత్యవసరం అని నేను వ్యక్తిగతంగా నిర్ణయించుకున్నాను. చాలా మంది కూడా మెట్రోలో ప్రయాణించి ఇంధనాన్ని ఆదా చేయడంలో సహాయపడాలి’’ అని తెలిపారు.
మోదీ ముందడుగు

పశ్చిమాసియా యుద్ధం కారణంగా తలెత్తిన సంక్షోభ పరిస్థితులను ఎదుర్కోవడానికి మన దేశం ముందుకు వచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ ఉద్బోధించిన పొదుపు మంత్రాన్ని ఆచరణలోకి పెట్టడానికి ఉపక్రమించింది. ముఖ్యంగా ఇంధన వాడకం విషయంలో ఆదా మార్గాన్ని అనుసరిస్తోంది. సాక్షాత్తూ ప్రధానమంత్రే పొదుపు దిశగా ఇంతటి మహత్తరమైన పనికి నాంది పలికారు. తన కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను గణనీయంగా తగ్గించుకున్నారు. మే 13న కేవలం రెండు వాహనాలతోనే మోదీ కాన్వాయ్ ముందుకు సాగింది. ఇదే బాటను పలువురు కేంద్ర మంత్రులు అనుసరించారు. మెట్రో రైలులో ప్రయాణించడం వంటి వినూత్న చర్యలతో జాతి జనులకు ఆదర్శంగా నిలిచారు. మరోవైపు బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలూ మోదీ సూచించిన పొదుపు సూత్రం పిలుపును అందిపుచ్చుకున్నాయి. కాన్వాయ్‌లో వాహనాల సంఖ్యను కుదించడంతో పాటు, అధికారిక పర్యటనలో బైక్, కారు ర్యాలీలకు ముగింపు పలికాయి. ఆ దిశగా అధికార యంత్రాంగానికీ తగిన ఆదేశాలు జారీ చేశాయి. ప్రధాని, ముఖ్యమంత్రుల తరహాలో కొందరు అధికారులూ ఇంధన పొదుపు చర్యలను మొదలు పెట్టారు. ఛత్తీస్‌గఢ్‌లో ఇద్దరు పోలీసు ఉన్నతాధి కారులు కార్లను పక్కనపెట్టి, కార్యాలయానికి సైకిళ్లపై వచ్చారు. ఇక ప్రధాని విషయానికి వస్తే సహజంగా ఆయన కాన్వాయ్‌లో సాయుధ మెర్సిడెస్-మేబ్యాక్ ఎస్-650 గార్డ్, రేంజ్ రోవర్లు, •యోటా ఫార్చ్యూనర్లు, ఎస్కార్ట్ వాహనాలు, జామర్ యూనిట్లు సహా కనీసం 12 నుంచి 15 వాహనాల దాకా ఉంటాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందులో 50 శాతం తగ్గించాలని ప్రధాని ఆదేశించినట్టు ప్రత్యేక భద్రతా బృందం-ఎస్‌పీజీ అధికారులు వెల్లడించారు. కేంద్ర మంత్రుల్లో అమిత్ షా, నితిన్‌గడ్కరీ, తదితరులు తమ కాన్వాయ్ పరిమాణాన్ని తగ్గించుకున్నారు. తన కాన్వాయ్‌లో వాహనాల సంఖ్యను 50 శాతం తగ్గించినట్టు మే 13న విడుదల చేసిన ఒక ప్రకటనలో నితిన్ గడ్కరీ తెలిపారు. మంత్రులు కపిల్ మిశ్రా, రాందాస్ అథావలే, తదితర మంత్రులు దేశరాజధానిలో వారి కార్యాలయాలకు చేరుకోవడానికి మెట్రో రైలు లాంటి ప్రజారవాణా సౌకర్యాలను వినియోగించుకోవడం ద్వారా తోటి ప్రయాణికులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. అలాగే వీఐపీ సంస్కృతిని పక్కన పెట్టాలని ఢిల్లీ నుంచి మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ , యూపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిర్ణయించారు. అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. అనవసర విమాన ప్రయాణాలు మానుకోవాలని మంత్రులకు మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. తదనుగుణంగా రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి ఆశిష్ షెలార్ ఫ్రాన్సు దేశ పర్యటనను రద్దు చేసుకున్నారు. జపాన్‌లో అధ్యయన యాత్ర జరపాల్సిన 22 మంది శాసనసభ్యుల పర్యటన కూడా రద్దు అయ్యిందని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. కుటుంబ సమేతంగా ఐరోపాలో చేపట్టాల్సిన పర్యటనను మహారాష్ట్ర పర్యాటక మంత్రి శంభురాజ్ దేశాయ్ విరమించుకున్నారు. మధ్యప్రదేశ్ సీఎం తన కాన్వాయ్‌లో వాహనాల సంఖ్యను 13 నుంచి 8కి తగ్గించుకున్నారు. వాహన ర్యాలీలకు దూరంగా ఉండాలని మంత్రులను ఆదేశించారు. గుజరాత్ సీఎం భూపేంద్రపటేల్ మే 13న తన కాన్వాయ్‌లో 3 వాహనాలను మాత్రమే వినియోగించారు. మంత్రుల్లో కొందరు తమకు ఎస్కార్ట్ వాహనాలు అక్కర్లేదని తేల్చి చెప్పారు. హెలికాప్టర్ ప్రయాణాలకు దూరంగా ఉండాలని మంత్రులు, అధికారులను గుజరాత్ ప్రభుత్వం ఆదేశించింది. ఢిల్లీ, యూపీ సీఎంలు కూడా తాము పొదుపు చర్యలను మొదలు పెట్టినట్టు సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు.
విదేశాలకు వద్దు.. యూపీ రండి:

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తిని రాష్ట్ర ప్రజలు తక్షణం పాటించాలని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పిలుపునిచ్చారు. స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి, విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గించడానికి, రాబోయే ఆరు నెలల పాటు అత్యవసరం కాని విదేశీ ప్రయాణా లకు దూరంగా ఉండాలని ముఖ్యమంత్రి యోగి పౌరులను కోరారు. దానికి బదులుగా, విస్తృత శ్రేణి వారసత్వ, సాంస్కృతిక, పర్యావరణ పర్యాటక ప్రదేశాలను అందించే దేశీయ గమ్యస్థానాలను, ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్‌ను సందర్శించాలని ఆయన యావత్ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మే 12న జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన ఈ విజ్ఞప్తి చేశారు. అనిశ్చిత ప్రపంచ పరిస్థితులలో ప్రభుత్వం, ప్రజలు ఇద్దరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు. కాన్వాయ్‌ల నుండి అనవసర వాహనాలను తొలగించి, పరిపాలనలో సామర్థ్యానికి ఒక ఉదాహరణగా నిలవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేని ఉద్యోగాలలో వర్క్ ఫ్రమ్ హోమ్‌కు యూపీ సీఎం యోగి మద్దతు తెలిపారు. పరిశ్రమలు, స్టార్టప్‌లు దీనిని అనుసరించేలా ప్రోత్సహించాలని అధికారులను కోరారు. ప్రయాణాన్ని, ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు రాష్ట్ర సచివాలయం, డైరెక్టరేట్లలో జరిగే అంతర్గత సమావేశాల్లో కనీసం 50 శాతం ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలని ఆదేశించారు. సైక్లింగ్, కార్ పూలింగ్, ఎలక్ట్రిక్ వాహనాల వాడకం వంటి పర్యావరణ అనుకూల మార్గాలను అవలంబించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇళ్లలో, ప్రభుత్వ భవనాల్లో, వాణిజ్య సంస్థల్లో అనవసర విద్యుత్ వినియోగాన్ని నివారించాలని కోరారు. రాత్రి 10 గంటల తర్వాత ప్రైవేట్ సంస్థలు, వాణిజ్య సముదాయాల్లో అలంకరణ దీపాలను తగ్గించాలని సీఎం ఆదేశించారు.
మన చక్కెర మనకే… ఎగుమతులపై నిషేధం…
ఎల్ నినో ప్రభావం కారణంగా ఉత్పత్తి తగ్గడం, దేశీయ ధరలు పెరగడం వంటి భయాల నేపథ్యంలో భారత ప్రభుత్వం 2026 సెప్టెంబర్ 30 వరకు చక్కెర ఎగుమతులపై నిషేధం విధించింది. దీంతో ప్రపంచ మార్కెట్లో చక్కెర ధరలు 2-3% పెరిగాయి.

ఇరాన్ యుద్ధం ప్రపంచ చమురు సరఫరాలకు తీవ్ర అంతరాయం కలిగించింది. కేంద్ర ప్రభుత్వం దీనిని ముందే ఊహించింది. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బంగారాన్ని కొనవద్దని, పెట్రోలియం, డీజిల్‌ను పొదుపుగా వాడుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దీనికి ప్రతిస్పందనగా, ప్రభుత్వం ఇప్పుడు చక్కెర ఎగుమతులపై తక్షణ నిషేధాన్ని విధించింది.
ఈ నిషేధం సెప్టెంబర్ 30, 2026 వరకు లేదా తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యే వరకు అమలులో ఉంటుంది. ప్రపంచంలో చక్కెరను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశాలలో భారతదేశం రెండవ స్థానంలో ఉంది. దేశీయ మార్కెట్లో చక్కెర ధరలు పెరగకుండా నిరోధించడమే ఈ చర్య ముఖ్య ఉద్దేశ్యం.
నిర్ణయం వెనుక కారణం
ఈ ఏడాది ఎల్ నినో రుతుపవనాలపై ప్రభావం చూపుతుందని అంచనా. దీనివల్ల వచ్చే సీజన్‌లో చక్కెర ఉత్పత్తి తగ్గే అవకాశం ఉంది. ఉత్పత్తి తగ్గితే, ధరలు పెరిగే ప్రమాదం ఉంది. అందువల్ల, ప్రభుత్వం ఎగుమతులను నిలిపివేయాలని నిర్ణయించింది. వరుసగా రెండో ఏడాది కూడా దేశీయ వినియోగం కంటే ఉత్పత్తి తక్కువగా ఉంటుందని అంచనా. గతంలో, ప్రభుత్వం చక్కెర మిల్లులకు 15.9 లక్షల టన్నుల చక్కెరను ఎగుమతి చేయడానికి అనుమతి ఇచ్చింది. ఉత్పత్తి ఎక్కువగా ఉంటుందని ఆశించారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.
నోటిఫికేషన్ వివరాలు
ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం, ముడి చక్కెర, తెల్ల చక్కెర రెండింటి ఎగుమతి నిషేధించారు. కొన్ని షరతుల కింద మాత్రమే అనుమతి మంజూరు చేస్తారు. నోటిఫికేషన్ జారీ చేయడానికి ముందే లోడింగ్ జరిగి ఉంటే, రవాణా కొనసాగించడానికి అనుమతి ఉంటుంది. షిప్పింగ్ బిల్లు దాఖలు చేసి ఓడ ఇప్పటికే భారతీయ ఓడరేవుకు చేరుకున్నట్లయితే, ఎగుమతికి అనుమతి ఉంటుంది. చక్కెరను కస్టమ్స్ లేదా కస్టోడియన్‌కు అప్పగించినప్పటికీ రవాణాకు మార్గం సుగమం అవుతుంది.
వ్యాపారులపై ప్రభావం
ముంబైలోని ఒక ప్రధాన అంతర్జాతీయ వాణిజ్య కేంద్రంలోని డీలర్ మాట్లాడుతూ ఫిబ్రవరిలో ప్రభుత్వం స్వేచ్ఛా ఎగుమతులను నిషేధించిందని చెప్పారు. దీని ఆధారంగా వ్యాపారులు విదేశాలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇప్పుడు ఆ ఆర్డర్లను నెరవేర్చడం కష్టంగా మారింది. వ్యాపారులు సుమారు 8 లక్షల టన్నుల చక్కెర కోసం ఎగుమతి ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఇందులో 6 లక్షల టన్నులకు పైగా చక్కెర ఇప్పటికే విదేశాలకు రవాణా అయ్యింది. ఇప్పుడు విదేశాలకు కొత్త సవాళ్లు ఎదురుకానున్నాయి. రాయిటర్స్ నివేదిక ప్రకారం, భారతదేశం తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచ వ్యాప్తంగా తెల్ల చక్కెర, ముడి చక్కెర ధరలను పెంచగలదు. బ్రెజిల్, థాయ్‌లాండ్ వంటి దేశాలు ఆసియా, ఆఫ్రికాలోని కొనుగోలుదారుల నుండి మరిన్ని ఆర్డర్లను పొందవచ్చు. బ్రెజిల్ తర్వాత ప్రపంచంలోనే భారతదేశం రెండవ అతిపెద్ద చక్కెర ఎగుమతిదారు. ఈ నిషేధం తరువాత, న్యూయార్క్‌లో ముడి చక్కెర ధర 2 శాతానికి పైగా, లండన్‌లో తెల్ల చక్కెర ధర దాదాపు 3 శాతానికి పెరిగింది.