బఏప్రిల్ 17న సిలికాన్ వ్యాలీలో జరిగిన థ్రైవ్ 2026 సదస్సులో ఆరఎసఎస్ సర్‌కార్యవాహ దత్తాత్రేయ హోసబలే విజ్ఞానం, ఆధ్యాత్మికత, సాంకేతికతలతో అనుసంధానమైన ఒక నాగరికతా దృక్పథాన్ని సమర్పించారు. భారతీయ జ్ఞాన వ్యవస్థలలో వేళ్లూనుకున్న నైతిక నవీకరణను సమర్థించారు. అదే సదస్సులో ప్రపంచ నాయకులు కృత్రిమ మేధ-ఏఐ, సుస్థిరత, మానవాళి భవిష్యత్తుపై చర్చించారు.
“మన సంప్రదాయంలో జ్ఞానానికి మూలాలుగా ఇంద్రియ సంబంధితమైనవి, అతీంద్రియ సంబంధితమైనవి రెండూ ఉన్నాయి. జ్జానమనేది అవగాహన,తర్కంపై ఆధారపడి ఉంటుంది. అది పరిమితమైన మానవ జ్ఞానానికి అతీతమైనది. ఆధ్యాత్మిక విషయాలు, ప్రాపంచిక విషయాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. శాస్త్రీయ జ్ఞానంగా నేడు మనం అర్థం చేసుకునేది కూడా మన ఆధ్యాత్మిక జ్ఞానంలో ఇమిడి ఉంటుంది” అని ఏప్రిల్ 17, 2026న సిలికాన్ వ్యాలీలో జరిగిన గ్లోబల్ సైన్స్ ఇన్నోవేషన్ ఫోరమ్ థ్రైవ్-2026 సదస్సులో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్‌కార్యావాహ దత్తాత్రేయ హోసబలే తెలిపారు.
భారతీయ జ్జానపరంపరను పునరుద్ధరించడం ద్వారా అందివచ్చిన శాస్త్రీయ పురోగతికి ఒక అనివార్యమైన దృక్పథాన్ని ప్రకటించారు. అసలైన సాంకేతిక ఆవిష్కరణ ఆర్థిక వ్యవస్థ, జీవావరణం, నైతిక విలువలు ప్రాతిపదికగా ఉండాలని స్పష్టం చేశారు. మరింత వివరణ ఇస్తున్నట్టుగా మాట్లాడుతూ “మానవ దేహ నిర్మాణం, మనస్తత్వం, దేహం పనితీరు, దాని చలనం, నిశ్చలనం, దేహం దేనికి స్పందిస్తుంది? దేనికి స్పందించదు? అనే వాటికి సమాధానాలను చక్కగా వివరించే సూత్రాలు మన దగ్గర ఉన్నాయి. ఈ వివరణలు అత్యంత సమగ్రంగా, అధ్యయనంతో కూడుకున్నవిగా ఉంటాయి. అయినప్పటికీ ఆ సూత్రాలను ఆధ్యాత్మిక సూత్రాలుగా పరిగణిస్తుంటారు. కానీ సారాంశంగా చూసినప్పుడు అవి శాస్త్రీయమైనవి. గడచిన కాలంలో మరీ ముఖ్యంగా అప్పట్లో అదేపనిగా జరిగిన దండ యాత్రలు, విదేశీ పాలన కారణంగా వీటిలో చాలావరకు ధ్వంసమైపోయాయి. అలాంటి కష్టకాలంలో, మనం గత్యంతరం లేని పరిస్థితిలో మన శాస్త్రీయ వారసత్వ సంపదను విస్మరించవలసి వచ్చింది. ప్రస్తుతం ఆ జ్జాన సంపదను పునరుద్ధరించే ప్రయత్నంతో కూడుకున్న దశలో మనం ఉన్నాం. భారతీయ జ్ఞాన వ్యవస్థలను పాఠ్య పుస్తకాల్లో తిరిగి ప్రవేశపెట్టడానికి ఉద్దేశించిన ఒక విద్యా విధానాన్ని ప్రభుత్వం తీసుకొనివచ్చింది” అని తెలిపారు.
ఆవిష్కరణలకు ఒక చట్రాన్ని ఆయన ప్రతిపాదించారు. ప్రతి శాస్త్రీయ ఆవిష్కరణ కూడా నైతిక విలువలు, సమానత్వం, ఆర్థిక వ్యవస్థ అనే మÖడు కీలకమైన గీటురాళ్లకు లోబడి ఉండాలని అన్నారు. ఈ గీటురాళ్లను తోసిరాజన్న పక్షంలో అసమానత్వం, సామాజిక అస్థిరత పెరిగిపోతుందని హెచ్చరించారు. సదస్సుకు హాజరైన నిపుణులు, విద్యావేత్తలు, సాంకేతిక నిపుణులను ఉద్దేశించి హోసబలే ఈ హెచ్చరిక చేశారు. సమకాలీన శాస్త్రీయ ఆందోళన లకు పరిష్కారాన్ని నాగరికతా విజ్ఞానంతో ముడిపెట్టారు. శాస్త్రీయ సంప్రదాయాలను తిరిగి కనుక్కునే క్రతువులో భాగంగా శతాబ్దాల కాలంగా రూపుదిద్దుకున్న మేధోపరమైన వారసత్వ సంపదను పునఃస్థాపించవలసిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. అదే విషయాన్ని ప్రస్తావిస్తూ “దాదాపు ఒక వెయ్యి సంవత్సరాల కాలంలో, విదేశీ ఆధిపత్యంపై మనం జరిపిన పోరాటంలో, మన మేధోపరమైన వారసత్వ సంపదలో అధిక భాగం పక్కదారి పట్టింది. నేడు మనం చేయవలసిన ముఖ్యమైన పని ఒకటి ఉంది. మన నాగరికతా చరిత్రలోని శాస్త్రీయ సంప్రదాయాన్ని మనం కనిపెట్టాలి. దానిని తిరిగి స్థాపించాలి. అటు అంతరిక్షానికి, ఇటు విశ్వానికి సంబంధించిన పరిశీలనతో కూడుకున్న మన సంప్రదాయం సుసంపన్నమైనది. యావత్ జగత్తుకు వ్యామోహం లేదా విభ్రాంతి మూలాధారమై ఉన్నది. మన మూలగ్రంథాలు ఆసాంతం సంభాషణలు, చర్చలతో నిండి ఉన్నాయి. భౌతిక ప్రపంచపు అభివ్యక్తీకరణలకు సంబంధించి మన నాగరికతకు చెందిన శాస్త్ర, సాంకేతిక గ్రంథాలలో సూక్ష్మ జగత్తు, స్థూల జగత్తుల మధ్య సంబంధం గురించి నిరంతరాయంగా సాగిన చర్చ ఉంది” అని వివరించారు. అదే సమయంలో మనం సాధించిన చారిత్రక ఘనతలను ప్రధానంగా ప్రస్తావించారు. వ్యవసాయ విధానాలు, పట్టణ ప్రణాళిక, విశ్వవిద్యాలయాలు, సివిల్ ఇంజినీరింగ్, తదితర రంగాల్లో చేరుకున్న అధునాతన స్థితిని వేలెత్తి చూపారు. ఇదే విషయాన్ని మరింత వివరిస్తున్నట్టుగా మాట్లాడుతూ “వీటన్నింటిని చూసినప్పుడు పేర్కొనదగిన ఘనతలను మనం కనుగొంటాము. అత్యంత అభివృద్ధి చెందిన వ్యవసాయ విధానాలు వేలాది సంవత్సరాల క్రితమే వాడుకలో ఉన్నాయి. అత్యంత అధునాతన స్థితిలో పట్టణ ప్రణాళిక ఉంది. విశ్వవిద్యాలయాలు ఏర్పాటు అయ్యాయి. సివిల్ ఇంజినీరింగ్‌లో గణనీయమైన అభివృద్ధి చోటు చేసుకుంది. ఇవన్నీ కూడా పదార్థ శాస్త్రాల పట్ల లోతైన అవగాహనను ప్రతిబింబిస్తున్నాయి. ఈ అవగాహన దోచుకోవడానికి ఉద్దేశించినది కాదు. ఇదంతా కూడా ప్రకృతిని అర్థం చేసుకోడానికే. దానిని అధ్యయనం చేయాలి, సద్వినియోగం చేసుకోవాలి. అదే సమయంలో ప్రకృతిని పరిరక్షించుకోవాలి. ఇలాంటి ఒక సమతూకం మన సంప్రదాయాలలో శాస్త్రీయ సామీప్యత, ఆవిష్కర ణలు, ప్రయోగాలకు కేంద్రంగా ఉంటుంది” అని తెలిపారు.
విద్యావ్యవస్థ గురించి మాట్లాడుతూ సైన్సును, ఆధ్యాత్మికతను విడదీయడానికి బదులుగా ఆ రెండింటిని సమ్మిళితం చేయాల్సిన ఆవశ్యకతను సర్‌కార్యవాహ నొక్కి చెప్పారు.“మన మన సమాజంలో సైన్సు విద్యకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. కానీ సైన్సును, ఆధ్యాత్మికతను వేరుచేయకుండా చూడటం ఎంతో ముఖ్యం. ఈ రెండూ వేర్వేరు విషయాలు కావు. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఆధ్యాత్మిక తను, సైన్సును వేరువేరుగా పరిగణిస్తుంటారు. కానీ మన సంప్రదాయంలో ఆ రెండూ సమ్మిళితమై ఉంటాయి. అటు శాస్త్రీయ పరిశీలనలోనూ, ఇటు లోతైన ఆధ్యాత్మిక సాధనలలోనూ ఒకే వ్యక్తులు, ఒకే సమూహాలు నిమగ్నమై ఉంటాయి. ఈ సంప్రదాయం నాగరికతా విజ్ఞానంతో మిళితమై ఉంది. మిళితమైన ఈ వైఖరి నైతిక విలువలకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంతో పాటుగా దైనందిన జీవనంలో భద్రత, జీవనోపాధి లాంటి వాటికి ఒక పునాదిగా ఉంటుంది. శాస్త్రీయ పరిశీలన అనేది వేరు కాదు. అది సమాజ అవసరాలతో అను సంధానమై ఉంటుంది. మానవాళికి మహత్తరమైన శక్తిని ప్రసాదించే క్రమంలో ఇవన్నీ కూడా ఒక ప్రవాహం తీరుగా ముందుకు సాగాలి” అని అన్నారు.
ఆర్థిక వృద్ధి, విద్య, నాణ్యమైన జీవనం మధ్య అవినాభావ సంబంధాన్ని ప్రస్తావిస్తూనే అవి ఒకదానిపై ఒకటి ఆధారపడుతున్న వైనాన్ని ప్రముఖంగా పేర్కొన్నారు. “నానాటికి పురోగమిస్తున్న శాస్త్రీయ, సాంకేతిక రంగాలతో పాటుగా సామాజిక, విద్యావ్యవస్థలు ముందుకు సాగని పక్షంలో సమా జంలో అసమానతలు మరింతగా పెరిగిపోతాయి. కనుక వీటి మధ్య సమతూకం ఆవశ్యకతను పాలనాయంత్రాంగం తీవ్రంగా పరిగణనలోకి తీసుకోవాలి. మనం ఒకవైపు అసమానతలు, దురభిమానం లేకుండా చూసుకోవాలి. మరోవైపు నిరంతరాయంగా శాస్త్రీయ పురోగతికి మార్గం సుగమం చేయాలి. ఈ రెండూ అవసరమైనవే. అయితే విద్యావ్యవస్థల ముంగిట ఒక సవాల్ కూడా ఉంది. అవే కనుక మన సంప్రదాయ జ్ఞానభాండ గారపు శాస్త్రీయ దృక్కోణాలు సక్రమంగా విద్యార్థులకు చేరవేయ లేని పక్షంలో అప్పుడిక ఈ సంప్రదాయాలను మÖఢవిశ్వాసంగా తోసిపుచ్చే అవకాశం ఉంది. కనుక శాస్త్రీయమైనవి, అశాస్త్రీయ మైనవి అనే వాటి మధ్య స్పష్టమైన వర్గీకరణ చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఒక ముఖ్యమైన బాధ్యత. మన సమాజానికి ఇది ఒక సవాల్. కానీ శతాబ్దాలుగా సంప్రదాయ వ్యవస్థలలో శాస్త్రీయ పరిశీలన మనుగడ, విద్య ద్వారా అది ప్రసారమవు తున్న వైనాన్ని చూపే అనేక ప్రయత్నాలు జరుగు తున్నాయి. నేడు ఈ భారతీయ జ్ఞాన వ్యవస్థను విద్యా విధానంలో అగ్రగామిగా నిలిపేందుకు సరికొత్త ప్రయత్నం జరుగుతున్నది” అని తెలిపారు. మానవాళి పట్ల విస్తృతమైన భావన, అందరూ కలిసిమెలిసి మనుగడ సాగించడంపై విశ్వవాపిత ఐక్యతకు చెందిన నాగరికతా సూత్రాన్ని హోసబలే నొక్కి చెప్పారు.“మానవాళి, దాని వైఖరి పట్ల తలెత్తే ఒక విస్తృతమైన ప్రశ్నకు సంబంధించినంతవరకు మనం అంతా ఒక శక్తిలో భాగం అనే మౌలిక భావన మన సంప్రదాయంలో ఉంది. ప్రజల హృదయాలలోకి ఈ భావన లోతుగా పాదుకోనంతవరకు వారి ఆలోచనలలో వ్యక్తి పూజ, ఆధిపత్యవాదం ఉంటుంది. ఐక్యమత్య భావన అభివృద్ధి చెందదు. మానవ అవసరాలు, ఆకాంక్షలను తీర్చడానికి మాత్రమే ఉన్నదనే విధంగా ప్రకృతిని పరిగణించిన పక్షంలో అప్పుడిక దోపిడీ మొదలవుతుంది. మన అవసరా లను తీర్చడానికే ఉన్నదంటూ మనం ప్రకృతిని ఒక బానిసగా చూస్తున్నట్టయితే మనం ప్రకృతిలో సమతుల్యతను దెబ్బతీయడానికి ఉపక్రమిస్తున్నట్టుగా భావించాలి. ఒకే శక్తి మానవులలో, జంతువులలో, మొక్కలలో, సమస్త ప్రకృతిలో ఉందనే విషయాన్ని మనం అర్థం చేసుకున్న పక్షంలో అప్పుడు మనలో ఒక మంచి వైఖరి ఉద్భవిస్తుంది” అని తెలిపారు.
ఇదే సూత్రాన్ని మరింత వివరిస్తున్నట్టుగా మాట్లాడుతూ “హిందూ సంప్రదాయంలో ఈ భావన (ఐకమత్య భావన) కేంద్రీకృతమై ఉంది. నాలోనూ, మీలోనూ, అన్ని జీవులలోనూ ఒకే శక్తి ఉంటుంది. కనుక ప్రతి ఒక్క జీవిని తప్పనిసరిగా గౌరవించాలి. ఇతరులతో మన వ్యవహారశైలిని విశ్వవ్యాపిత ఐక్యత అనే భావన తీర్చిదిద్దుతుంది.అది మానవుల్లో మాత్రమే కాకుండా యావత్ ప్రాణికోటిలోనూ గౌరవం, అణకువ, సామరస్యాలను కలుగజేస్తుంది. మనం ప్రకృతి నుంచి విడవడకుడా మనం అందులో భాగమై ఉన్నాం. సాంకేతికతను మనం ఎలా అభివృద్ధి చేయాలి? ఎలా వినియోగించాలి? అనే అంశాలతో సహా మన చర్యలకు ఈ అవగాహన మార్గదర్శనం చేస్తుంది” అని చెప్పారు.
సాంకేతికత పాత్ర, దాని బాధ్యత గురించి హోసబలే మాట్లాడుతూ “ఒక ఉపకరణం లాంటి సాంకేతికత పరిణామక్రమం అత్యంత అప్రమత్తంగా జరగాలి. మన అవగాహన కోసమని అది మూడు పరీక్షలలో ఉత్తీర్ణత సాధించాలి. వాటిలో మొదటిది ఆర్థిక వ్యవస్థ. సాంకేతికత అనేది సమతూకంతో కూడుకున్న ఆర్థిక వృద్ధికి ఊతమిస్తున్నదా? లేక సమాజంలో అసమానత సృష్టిస్తున్నదా? రెండవది జీవావరణం లేదా పర్యావరణం. ప్రకృతిని సాంకేతికత గౌరవిస్తున్నదా? లేక దాని దోపిడీకి, అసమతుల్యతకు దారి తీస్తున్నదా? మూడవది నైతికత. నైతికతను సాంకేతికత సంతరించుకున్నదా? మానవ సంక్షేమానికి ఉపకరించే నైతిక విలువలకు అది కట్టుబడి ఉందా? నైతికత కొరవడిన సాంకేతికత సమాజంలో అసమానతలను సృష్టించిస్తుంది. ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తుంది. ప్రకృతిని దోచుకుంటుంది. పర్యావరణంలో సమతూకాన్ని దెబ్బ తీస్తుంది. తద్వారా అది ఒక సమస్యగా మారుతుంది. అందుకని ఏదేనీ ఒక సాంకేతికతను ఆర్థిక వ్యవస్థ, జీవావరణం లేదా పర్యావరణం, నైతికత అనే మÖడు గీటురాళ్లతో తప్పనిసరిగా పరీక్షించాలి. ఎప్పుడూ కూడా మానవ సంక్షేమం పరమావధిగా సాంకేతికత ఉండాలి. సమాజానికి లేదా ప్రకృతికి ఎలాంటి హాని తలపెట్టకుండా అది మానవ జీవనాన్ని మెరుగు పరచాలి” అని అన్నారు.
జ్ఞానానికి, విజ్ఞానానికి మధ్య భేదాన్ని సర్‌కార్య వాహ వివరిస్తూ “మన సంప్రదాయంలో జ్ఞానానికి, విజ్ఞానానికి మధ్య ఒక స్పష్టమైన భేదం ఉంది. విషయాల పట్ల అవగాహన కలిగి ఉండటాన్ని లేదా వాటిని అర్థం చేసుకోవడాన్ని జ్ఞానం అంటారు. జ్ఞానమనేది సమాచారాన్ని ప్రోది చేసుకోవడం, నేర్చుకోవడానికి సంబంధించినది. అలా పొందిన జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకునే సామర్థ్యమే విజ్ఞానం అవుతుంది. ఏ ప్రయ్పుోనాన్ని ఆశించి, ఎక్కడ, ఎంత మేరకు, జ్ఞానాన్ని వినియోగించాలనేది విజ్ఞానం నిర్ణయిస్తుంది. జ్ఞానం ఒక్కటే ఉంటే సరిపోదు. దానికి విజ్ఞానం మార్గదర్శనం చేయని పక్షంలో అది అహంకారానికి, గర్వానికి దారి తీస్తుంది. దుర్వినియోగమవుతుంది. ఈ తారతమ్యాన్ని వివరించేందుకు మన సంప్రదాయంలో విస్తృతమైన సాహిత్యం ఉంది. జ్ఞానంతో పాటు ఎల్లప్పుడూ విజ్ఞానం ఉండాలి. అప్పుడే అది సార్థకమై, ప్రయోజనకరంగా మారుతుంది. జ్ఞానం విజ్ఞానంతో నడిచినప్పుడు, అది వ్యక్తికి మాత్రమే కాకుండా సమాజానికి కూడా ఉపయోగపడుతుంది. జ్ఞానాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడం అత్యంత ముఖ్యమైన పని. నేడు జ్ఞాన సృష్టి జరుగుతోంది, కానీ అది ఎల్లప్పుడూ స్వేచ్ఛగా ప్రవహించదు. సమాజాలు, దేశాలు, నాగరికతల మధ్య జ్ఞానం స్వేచ్ఛగా ప్రవహించే పరిస్థితులను సృష్టించడం అవసరం. ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు ఉండేలా అది అందరికీ అందుబాటులో ఉండాలి” అని అన్నారు. పరిమితంగా జ్ఞానం అందుబాటులో ఉండటం వల్ల కలిగే నష్టాలపై హెచ్చరిస్తూ, “పరిమితంగా జ్ఞానాన్ని అందించే గుత్తాధిపత్యం విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. మూఢనమ్మకాలతో నిండిన కొన్ని సంప్రదాయాలు ఉన్నాయి. వీటిని నిజమైన జ్ఞానం నుండి వేరు చేసి చూడాలి. జ్ఞానం అందరికీ అందు బాటులోకి వచ్చినప్పుడు, వ్యక్తులు సాధికారత పొందుతారు. సమాజాలు మరింత బలంగా తయారై, సమాజం మరింత సమతుల్యంగా, సమానంగా పురోగమిస్తుంది. జ్ఞానం అందరికీ అందుబాటులో వచ్చినప్పుడు శాస్త్రీయ పరిశోధన, సాంకేతిక ప్రయోజనాలు కొద్దిమందికి మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరికీ చేరువ అవుతాయి. అహంకారం అంటే కేవలం ఒక వర్గం, దేశం లేదా సమాజం తమను తాము ఇతరుల కన్నా ఉన్నతంగా భావించుకోవడం మాత్రమే కాదు. మానవులు తమను తాము ప్రకృతి, సృష్టికర్త కన్నా శ్రేష్ఠులుగా భావించి, వినయం లేకుండా ప్రవర్తించినప్పుడు, అది కూడా ఒక రకమైన అహంకారమే అవుతుంది” అని తెలిపారు.
కృత్రిమ మేధస్సు, ఆరోగ్యం, సుస్థిరత వేగవంత మైన పరిణామం కేవలం ఆర్థిక లాభాలకే పరిమితం కాకుండా, మానవాళి విస్తృత ప్రయోజనాలకు ఉపయోగపడేలా చూడటం అనే ఏకైక అత్యవసరమైన లక్ష్యంపై ఈ సదస్సు దృష్టి సారించింది.
ఏఐని ఎదుర్కోవడమెలా?
కంప్యూటర్ హిస్టరీ మ్యూజియంలో అత్యంత కీలకమైన ఫైర్‌సైడ్ చాట్‌తో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అమెరికా వ్యాపారవేత్త, గూగుల్ వ్యవస్థాపక బోర్డు సభ్యుడు రామ్ శ్రీరామ్, విద్యా రంగంలో విప్లవం వస్తుందని చెప్పారు. ప్రతి వ్యక్తికి అనుగుణంగా ఉండే విధానం ద్వారా కృత్రిమ మేధస్సు`ఏఐ, జ్ఞానాన్ని “ఉచితంగా, ప్రజాస్వామ్య బద్ధంగా” అందిస్తుందని పేర్కొన్నారు. ఇది విస్తృతంగా అందుబాటులోకి రానుంది. ఇందులో కొంత భాగం ఇంటర్నెట్‌తో జరిగింది. కానీ ఇప్పుడు ఏఐతో ఇది మరింత వేగంగా జరుగుతుంది. ఇది ప్రతి వినియోగదారునికి అనుగుణంగా ఉండే విధానం” అని తెలిపారు. “అత్యంత చౌకైన సాంకేతికత అత్యంత సుస్థిరంగా కూడా ఉండేలా మనం కృషి చేయాలి. మనం మనసు పెడితే అది సాధ్యమేనన్నది నా అభిప్రాయం” అని అన్నారు. నోబెల్ బహుమతి గ్రహీత, అమెరికా ఇంధన శాఖ మాజీ మంత్రి ప్రొఫెసర్ స్టీవెన్ చూ పొంచి ఉన్న శ్రామిక సంక్షోభంపై ప్రసంగిస్తూ, ఉద్యోగాలను భర్తీ చేస్తున్న ఏఐ (AI) “సాంకేతిక విప్లవాన్ని” క్షీణిస్తున్న ప్రపంచ జనాభాతో సమాజం ఎలా సమన్వయం చేసుకుంటుందోనని ప్రశ్నించారు. “ఏఐ ఎన్నెన్నో ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఉద్యోగాలను భర్తీ చేయడాన్ని క్షీణిస్తున్న జనాభాతో ఎలా సమన్వయం చేస్తారు? ఈ పరివర్తన ఒక పెద్ద సవాల” అని అన్నారు. “సాంకేతిక రంగంలో అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడానికి, విధాన చట్రాల సమన్వయాన్ని ప్రోత్సహించడానికి శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు, విధాన రూపకర్తల ప్రపంచ సమావేశంగా ‘థ్రైవ్ 2026’ సదస్సును రూపొందిం చారు. ఈ సదస్సుకు గ్లోబల్ ఇండియన్ సైంటిస్ట్స్ అండ్ టెక్నోక్రాట్స్ ఫోరమ్ (GIST USA), పాలో ఆల్టో నెట్‌వర్క్స్ వంటి పారిశ్రామిక దిగ్గజాల నుండి గణనీయమైన మద్దతు లభించింది. GIST USAకు చెందిన డాక్టర్ యెల్లోజీ రావు మిరాజ్కర్ ఈ కార్యక్రమాన్ని “ప్రాచీన జ్ఞానం, ఆధునిక విజ్ఞానం అద్భుతమైన సమ్మేళనం”గా అభివర్ణించారు. “గ్లోబల్ సైన్స్ ఇన్నోవేషన్ ఫోరమ్-థ్రైవ్ 2026 సదస్సు AI, ఆరోగ్యం, సుస్థిరత రంగాలలో కీలకమైన పాలనా సవాళ్లను పరిష్కరించడానికి సాంకేతికత, విధాన రంగాలలోని ప్రపంచ నాయకులను ఒకచోట చేర్చింది.
హిందువులు ఆధిపత్యవాదులు కాదు
ఆరఎసఎస్ శతాబ్ది సంవత్సరాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ 24న వాషింగ్టన్‌లో హడ్సన్ ఇన్‌స్టిట్యూట్ విద్యావేత్త, వాల్‌స్ట్రీట్ జర్నల్ సీనియర్ కాలమిస్ట్ వాల్టెర్ రస్సెల్ మీడ్‌తో ముఖాముఖిలో ఆరఎసఎస్ వందేళ్ల ప్రస్థానాన్ని సర్‌కార్యవాహ దత్తాత్రేయ హోసబలే వివరించారు. ప్రపంచవ్యాప్తంగా సంస్థ విస్తరణపై మాట్లాడారు. దాని సంస్కృతిని, ఉనికిని, సేవను అర్థం చేసుకోవడాన్ని వెల్లడించారు. ఆరఎసఎస్ పట్ల పాశ్చాత్య అపోహలను కాదన్నారు. సంస్థను ప్రజలు స్వచ్ఛందంగా చేపట్టిన ఒక ఉద్యమంగా తెలిపారు. హిందువులు ఆధిపత్యవాదులు అంటూ వస్తున్న ఆరోపణలను విస్పష్టంగా తోసిపుచ్చారు. ముఖాముఖిలో ముఖ్యాంశాలు..
సదస్సులో పాల్గొనటం వల్ల మీకు ఎలాంటి అనుభవం ఎదురైంది?
సదస్సులో భాగం కావడం పట్ల నేను సంతోషిస్తు న్నాను. ఇందులో అనేక మంది ప్రముఖుల ప్రసంగా లను వినడంతో విద్యారంగానికి సంబంధించిన ఒక కసరత్తు చేసినట్టుగా అనిపించింది. సదస్సులో కార్యక్రమాలు ఆసక్తికరంగా, విషయం పట్ల మంచి అవగాహనను కలిగించేవిగా ఉన్నాయి. ఈ సదస్సుకు నన్ను ఆహ్వానించి, నేను ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థ గురించి నాకు మాట్లాడే అవకాశం కల్పించిన హడ్సన్ ఇన్‌స్టిట్యూట్‌కు ధన్యవాదాలు. ఇక్కడి ప్రజలను కలుసుకోవడానికి, వారితో మాట్లాడటానికి నేను ఇక్కడికి వచ్చాను. స్టాన్‌ఫోర్ట్‌లో జరిగిన సదస్సులో కూడా పాల్గొన్నాను. అక్కడి చర్చలు సైన్సు, సాంకేతి కత, అంతర్జాతీయంగా ఆరోగ్యం, సుస్థిరతలపై దృష్టి పెట్టాయి.
వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆరఎసఎస్ నేడు దేనికి ప్రాతినిధ్యం వహిస్తున్నది?
జాతికి, సమాజానికి ఆరఎసఎస్ చేస్తున్న సేవకు 100 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. భారత్‌లో అనేకమందిని మేం చేరుకున్నాము. అమెరికా సహా పశ్చిమ దేశాలు, ఇతర దేశాలలో వేర్వేరు వర్గాల ప్రజలతో మమేకం కావడం ద్వారా వారిని ప్రభావితం చేయడం కూడా అవసరం అని మేం భావించాం. ఇలాంటి విదేశీ పర్యటనల ద్వారా ఆరఎసఎస్, దాని పనితీరు గురించి తెలియపరచడానికి అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులు, మేధావులతో సంభాషించే అవకాశం నాకు దక్కింది.
ప్రపంచంలో అత్యంత పెద్దవైన సంస్థలలో ఒకటిగా ఆరఎసఎస్ ఉన్నప్పటికీ పాశ్చాత్య దేశాలలో దాని పట్ల అవగాహన పేలవంగా ఉంది. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఆర్ఎస్ఎస్ దైనందిన కార్యకలాపాలను వివరించండి.
ఆరఎసఎస్ అనేది భారతదేశ పురాతన సాంస్కృ తిక, నాగరిక విలువల నుంచి స్ఫూర్తి పొందిన స్వచ్ఛంద ప్రజా ఉద్యమ సంస్థ. ఈ స్ఫూర్తినే హిందూ తాత్వికత అని అంటారు. గడచిన 100 సంవత్స రాలుగా స్వయంసేవకులు అని మేం పిలుచుకునే స్వచ్ఛంద కార్యకర్తలను సృష్టించడంలో ఆరఎసఎస్ నిమగ్నమై ఉంది. భిన్నత్వంలో ఏకత్వాన్ని సంతరించుకున్న ఒక సొసైటీని అది నిర్వహిస్తున్నది. వ్యక్తి త్వం, ఆత్మవిశ్వాసం, సమాజానికి సేవ చేయాలనే తత్వం, సంస్థను నిర్వహించే నైపుణ్యంతో కూడుకున్న స్వయంసేవకులను తయారు చేయడానికి దాదాపు 83,000 ప్రాంతాలలో రోజువారీ సమావేశాలను, మరో 30,000 ప్రాంతాలలో వారాంతపు సమావేశాలను ఆరఎసఎస్ నిర్వహిస్తున్నది. వాటినే మేము శాఖలు అని పిలుచుకుంటాము. ఈ గంటసేపు సమావేశంలో పాల్గొన్న వారిలో జీవన విలువలు, ఆత్మవిశ్వాసం, ఐక్యమత్య భావనను పాదుగొల్పుతాము. ఇదంతా సమ్పుాం, జాతి ఐక్యత మెరుగుదల కోసం సామాజిక మానవ మÖలధనాన్ని సృష్టించడం లక్ష్యంగా జరుగుతున్నది. శాఖలలో సమాజంలో అన్ని వర్గాలకు చెందినవారు, అన్ని వయసుల వారు పాల్గొంటారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు అవసరార్థులకు ఆరఎసఎస్ సేవలు అందిస్తున్నది. విద్య, ఆరోగ్యం, గ్రామీణాభి వృద్ధి, పర్యావరణం, తదితర రంగాల్లో కృషి చేస్తున్నది. ఆరఎసఎస్ స్వయంసేవకులు దాదాపు 40 పౌర సంస్థలను నెలకొల్పారు. వాటిలో అత్యధికం దేశవ్యాప్త సంస్థలుగా అవతరించి, జాతి నిర్మాణ కార్యక్రమాలలో పాలుపంచుకుంటున్నాయి.
డాక్టర్ హెడ్గేవార్ నివాసాన్ని సందర్శించిన ఘట్టం నాకు ఇంకా గుర్తు ఉంది. అప్పట్లో తొలి సమావేశానికి ఐదుగురు మాత్రమే హాజరయ్యారు. ఒక చిన్న ఆరంభం నుంచి దేశవ్యాప్తంగా రోజూ 83,000 శాఖలు నిర్వహించే స్థాయికి ఈ సంస్థ ఎదిగింది. ఈ శాఖలకు ప్రజలను మీరు ఎలా సమీకరిస్తారు?
వ్యక్తిగత సంబంధాలు, ఒకరితో ఒకరికి పరిచయాలతో నిబద్ధత ఏర్పడుతుంది. రోజువారీ శాఖలు సోదరభావాన్ని, సామాజిక నిబద్ధతను, కర్తవ్య నిర్వహణ భావన, సమాజానికి నిస్వార్థంగా తిరిగి ఇవ్వాలనే ఆకాంక్షను కలిగిస్తాయి. అనుభవం, సామర్థ్యం ప్రాతిపదికగా బాధ్యతలను అప్పగించ డానికి, సంవత్సరం అంతా కార్యకలాపాలు చేపట్ట డానికి ఒక సంస్థాగత నిర్మాణం ఉంది. కానీ కడకు కార్యకలాపాలు కొనసాగడంలో నిబద్థత, సుహృద్భావ వాతావరణం కీలకమైన పాత్రను పోషిస్తాయి.
కొంతమేరకు ఆరఎసఎస్ అత్యంత వివాదాస్పద మైనది. మీ వరకు ఆరఎసఎస్ గురించి అమెరికన్లు ఎక్కడ తప్పుగా అర్థం చేసుకున్నారు?
అమెరికా కేవలం ఆరఎసఎస్ గురించే కాదు. భారతదేశం గురించి కూడా అపోహపడుతున్నది. భారత్ అధిక జనాభాతో, మురికివాడలతో, పేదరికంతో, పాములు, మురికివాడలు, స్వాములతో కూడిదని, భారతదేశం ఒక టెక్ హబ్ కూడా. భారతదేశం ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. సాధారణ అమెరికన్ అవగాహనలో ఈ విషయాలు ఎందుకో విస్మరణకు గురవుతుంటాయి. అలాగే, ఆరఎసఎస్ గురించి, తెలిసిగానీ తెలియకగానీ, లేదా ఒక అజెండాలో భాగంగాగానీ సృష్టించిన కథనం ఏమిటంటే, ఆరఎసఎస్ ఒక హిందూ ఆధిపత్యవాది, ఒక విధంగా క్రైస్తవ వ్యతిరేకి, మైనారిటీ వ్యతిరేకి, మహిళల అభివృద్ధి వ్యతిరేకి అని. ఆధునీకరణ వ్యతిరేకి. ప్రజలు సానుకూలమైనవి కాకుండా వ్యతిరేకతను కలిగించే విషయాలనే ప్రచారం చేస్తారు.
ఈ భావనను మీరు ఎలా సవాల్ చేస్తారు? అది (ఆరఎసఎస్) ఒక హిందూ ఆధిపత్య సంస్థ అని ప్రజలు అన్నప్పుడు మీరు ఎలా స్పందిస్తారు?
హిందూ తాత్వికత, హిందూ సంస్కృతి ఆధిపత్యాన్ని అనుమతించవు. మేం మొత్తం ప్రపంచాన్ని ఒక కుటుంబంలాగా చూస్తాము. మానవులందరూ మాకు సోదరులు, సోదరీమణులు. ఆధిపత్యం అనే ప్రశ్నకు తావు లేదు. జీవుýలోనూ, నిర్జీవులలోనూ, ఇలా ప్రతిఒక్కదానిలోనూ ఏకత్వాన్ని చూస్తాము. అలాంటి ఒక తాత్వికత హిందువుల మÖలతత్వం అయినప్పుడు వారిలో ఆధిపత్య ధోరణి ఉండనే ఉండదు. అంతేకాకుండా చరిత్ర ప్రకారం చూసినప్పుడు హిందువులు ఏ దేశంపైనా దండయాత్ర చేయలేదు. ఎవ్వరినీ బానిసలుగా చేసుకోలేదు. హిందువులు ఒకరికి క్షమాపణ చెప్పే స్థితిలో లేరు.
భారతదేశం సాంస్కృతికంగా, ఆర్థికంగా ఆధునికీకరణ చెందే కార్యక్రమానికి ఆరఎసఎస్ చాలా దగ్గరగా ఉంది. కొన్ని సందర్భాలలో పురాతన మÖలాలను అనుభవిస్తూనే భవిష్యత్తుకు దారి తీసే ఆధునికీకరణ వేర్వేరు దిశలకు లాగుతున్నట్టు కనిపిస్తుంది. ఆ క్రమంలో తన మÖలలకు తిరిగి వెళ్లడానికి, భవిష్యత్తు వైపు చూడటానికి మధ్య సమతూకాన్ని ఆరఎసఎస్ ఎలా పాటిస్తుంది?
స్పష్టంగా చెప్పాలంటే సందర్భానుసారంగా ఉద్రిక్తతను సృష్టిస్తూ, పాటించాల్సినవిగా అనిపించే సాంస్కృతిక విలువలు, ఆధునికీకరణ పరస్పరం విరుద్ధమైనవి కావు. అవి ఏకకాలంలో మనుగడ సాగించగలవు. పారిశ్రామికీకరణ, సాంకేతికతలను తీసుకొనివచ్చే ఆధునికీకరణ సాంస్కృతిక విలువలతో కలిసి పనిచేస్తుంది. మనం ఈ ధోరణిని ఇటీవలి దశాబ్దాలలో భారత్, జపాన్ లేదా చైనా దేశాలలోని ఓరియంటల్ సొసైటీలలో చూశాము. ఆయా సొసైటీలు వాటి నాగరికతా విలువలను చెక్కుచెదర కుండా కాపాడుకుంటూనే ఆధునికీకరణను అవలంభించాయి.
హిందూ తాత్వికత సనాతనాన్ని ప్రతిపాదిస్తుంది. సనాతనం అంటే నిత్యమైనది, శాశ్వతమైనది అని అర్థము. అది పురాతనమైది అయినప్పటికీ నిత్యమÖ వర్థిల్లుతున్నది. దీనికి తాత్వికమైన తార్కాణంగా మర్రిచెట్టును చెప్పుకోవచ్చు. నాగరికతా విలువలకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్టుగా లోతైన, బలమైన వేళ్లు మర్రిచెట్టుకు ఉంటాయి. కానీ అదే చెట్టుకు అనేక కొమ్మలు ఉంటాయి. ప్రతి రుతువులోనూ కొత్త చిగురులు, ఆకులు పుట్టుకొస్తుంటాయి. పువ్వులు వికసిస్తుంటాయి. ఇది ఎంత కొత్తదనాన్ని సంతరించు కుంటుందో అంతే పురాతనత్వానికి ప్రాతినిధ్యం వహిస్తుంటుంది. సంస్కృతి, ఆధునీకకరణ కలిసి పోగలవు. అలాంటి కలిసిపోవడం అనేది సృష్టిలో ఒక భాగం.
అంతర్జాతీయ రాజకీయాల విషయానికి వస్తే.. భారత్‌ను ఒక అవిభాజ్య వ్యూహాత్మక భాగస్వామిగా, ఆసియా ఖండంలో ఎలాంటి విపత్కర పరిస్థితిని అయినా చక్కదిద్దే ఒక సమవర్తిగా అమెరికా చూస్తున్నది. ఈ పాత్రను పోషించడంలో సుస్థిరమైన ఆర్థిక, సామాజిక అభివృద్ధి భారత్‌కు అవసర మవుతుంది. తన పూర్తి సామర్థ్యాన్ని ఆవిష్కరిం చడంలో భారత్ ఏం చేయవలసి ఉంటుంది?
అన్ని దేశాలతోనూ మరీ ముఖ్యంగా అమెరికా లాంటి అగ్ర రాజ్యాýతో సత్‌సంబంధాలను కలిగి ఉండాలని భారత్ కోరుకుంటుంది. ఎందుకంటే భారత్ పరిమాణం, జనాభా, సాంకేతికంగా ముందంజ, ఆర్థిక పరిపుష్టిని చూసినప్పుడు ఒక వ్యూహాత్మక భాగస్వామ్యం(అమెరికా లాంటి దేశాలతో) సహజంగానే అవసరమవుతుంది. దీనిని సాధించడమనేది పరస్పర విశ్వాసం, పరస్పర గౌరవం, ఒకరి అవసరాలను మరొకరు గుర్తించడం ద్వారానే సాధ్యమవుతుంది. పరస్పరత్వం లేని పక్షంలో విశ్వాసం కొరవడుతుంది.
ఒక బలమైన భారత్‌కు పునాదిగా ఒక పటిష్టమైన హిందూ సంస్కృతి గుర్తింపు అవసరం అని ఆరఎస్ ఎస్ చాలా కాలంగా వాదిస్తున్నది. అది భారత్‌లో మైనారిటీలను పరాధీనంలోకి పడిపోయే ముప్పును తీసుకువస్తుందా? లేకుంటే పొరుగు దేశాలతో సమస్యలను సృష్టిస్తుందా?
ఆరఎసఎస్ దృష్టిలో, హిందూ గుర్తింపు అనేది మతపరమైనది కాదు. అది ఒక నాగరికతా గుర్తింపు. ఆరఎసఎస్ ఎల్లప్పుడూ సాంస్కృతిక నైతిక విలువలు, నాగరికతా విలువలకు ప్రాధాన్యతనిచ్చింది. వీటికి ఏ మతంతోనూ ప్రత్యక్ష సంబంధం లేదు. రాజకీయ ప్రయోజనాలు, చరిత్రను తప్పుగా అర్థం చేసుకోవడం తదితర కారణాల వల్ల ఉద్రిక్తతలు అప్పుడప్పుడు తలెత్తుతూనే ఉన్నాయి. ఈ వర్గాలన్నింటితో నిరంతర, సమగ్ర సంభాషణలు అపోహలను తొలగించడంలో కచ్చితంగా సహాయపడతాయని ఆరఎసఎస్ విశ్వసిస్తుంది. ఆరఎసఎస్ ఒక మైనారిటీ వర్గం, వారి నాయకత్వంతో అటువంటి సంభాషణలలో నిమగ్నమై ఉంది. పొరుగు దేశాల మధ్య వివిధ కారణాల వల్ల, ఆ దేశాల రాజకీయ నాయకత్వం వల్ల ఉద్రిక్తతలు నెలకొన్నాయి. గత దశాబ్దాలలో చాలాసార్లు పరస్పర సంబంధాలు, విశ్వాసం దెబ్బతిన్నాయి. ఒక పొరుగు దేశంతో మాత్రమే సమస్య ఉంది. అది భారత గర్భం నుండి పుట్టిన తర్వాత పొరుగు దేశంగా మారింది. కానీ ఆ దేశం ద్వారా సమస్యలు సృష్టించడానికి దాని వెనుక చాలా మంది ఉన్నారు.
నాగరికతా గుర్తింపు గురించి మీరు మాట్లాడు తున్నప్పుడు అమెరికాలో యÖదుల వ్యవహార శైలి నాకు గుర్తుకు వచ్చింది. వారిలో కొందరు ధార్మికతకు కట్టుబడి ఉంటారు. మరికొందరు ప్రపంచ దృక్కోణం లేదా ఆహారం ద్వారా మతాన్ని సాంస్కృతికంగా అనుసరిస్తుంటారు. భారత్‌లో హిందూ ధర్మాచరణను సైతం మీరు అదేవిధంగా భావిస్తున్నారా?
కొంతవరకు అలాగే ఉండవచ్చును కానీ పోలికలు ఎప్పుడూ కూడా నూటికి నూరు శాతం కచ్చితంగా ఒక్కలాగా ఉండవు. సుసంపన్నమైన సుదీర్ఘకాలపు చరిత్రలో ఉపనిషత్తులు, వేదాలు ప్రాతిపదికగా ఒక ప్రపంచ దృక్కోణాన్ని భారత్ అభివృద్ధి చేసుకుంది. ఆ కారణంగానే సమాజం, ప్రకృతి ప్రాతిపదికగా సామాన్య జనులకు దానిని వివరించిన సాధు, సత్‌పురుషులు ఈ నిర్దేశిత ప్రపంచ దృక్కోణం ఆవశ్యకతను నొక్కి చెప్పారు. అది మన దైనందిన జీవనాన్ని నిర్దేశించింది. భారత్‌కు ఆత్మగా ఆధ్యాత్మికత ఉన్నది. ఆ ఆత్మ వ్యక్తీకరణగా భారతీయ సంస్కృతి విరాజిల్లుతున్నది.
గల్ఫ్ దేశాలు, ఇస్లాం ప్రపంచ దౌత్యంలో ఒక కీలకమైన పాత్రధారిగా తనను తాను పాకిస్తాన్ ఇటీవల ప్రకటించుకున్నది. ఈ పరిమాణాన్ని ఆరఎసఎస్ ఎలా అంచనా వేస్తుంది?
ఇలాంటి రాజకీయాలను ఆరఎసఎస్ పట్టించు కోదు. అయితే భారత్ ప్రయోజనార్థం భారత ప్రభుత్వం చేసే ప్రకటనలకు, వెలిబుచ్చే భావనలకు మేము మద్దతుగా ఉంటాము.
ఆరఎసఎస్‌కు, భారత్‌లో పాలక పక్షానికి(బీజేపీ) మధ్య బంధం గాఢమైనది. ప్రధాని నరేంద్ర మోదీ తన జీవితంలో అధిక భాగాన్ని ఆరఎసఎస్‌లో ఒక చురుకైన కార్యకర్తగా గడపడానికి వెచ్చించారు. వందేళ్ల ప్రస్థానాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఆరఎసఎస్ తదుపరి కార్యాచరణ ఎలా ఉండనుంది?
అభినందన తెలిపిన మీకు ధన్యవాదాలు. మేం వృద్ధి చెందినప్పటికీ “బిగ్ బ్రదర్స” – పెద్దన్నలుగా మారలేదు. బలానికి తోడుగా అణకువ ఉండాలని హిందూ తాత్వికత బోధిస్తుంది. దానిని మేం ఆచరిస్తున్నాం. బలం, విజయం మమ్మల్ని వినయ సంపన్నులను చేస్తాయి. ఆ వినయాన్ని కలకలం కాపాడుకుంటాము.
కనుక వచ్చే దశాబ్దాలలో సమాజం, జాతి, మానవాళికి నిస్వార్థంగా సేవచేసే స్వయంసేవకులను సృష్టించే పనిని ఆరఎసఎస్ కొనసాగిస్తుందని వినయపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను. “నిజమైన హిందువు హిందువుగానే ఉంటాడు. అతడు ప్రపంచ పౌరుడిగా అవతరిస్తాడు” అని నానుడి. ఈ నానుడిని ఆరఎసఎస్ విశ్వసిస్తుంది. వచ్చే శతాబ్దపు వాకిట నిలిచిన ఆరఎసఎస్ ఐదు కీలకమైన విషయాలపై దృష్టి పెట్టింది.
- సామాజిక ఐకమత్యం, సామరస్యం: భారతీయ సమాజంలో ఐకమత్యాన్ని సాధించడానికి వివక్షలను అధిగమించడం.
- పర్యావరణానుకుల జీవనం: ప్రకృతికి ప్రజలను చేరువ చేసే క్రమంలో, పచ్చదనంతో కూడుకున్న పరిశుభ్రమైన జీవనాన్ని(నీరు, విద్యుత్ వినియోగంలో ఆదా) సాధారణ ప్రజలకు అందించ డానికి చిన్నవైన, చేయదగిన పనులను ప్రోత్స హించడం.
- కుటుంబ విలువలు: భావి తరాలలో సాంస్కృతిక, మానవీయ విలువలను పాదుగొల్పడం. ఒక ఆరోగ్యకరమైన కుటుంబం ఒక ఆరోగ్యకరమైన దేశానికి భరోసా ఇస్తుంది.
- జాతీయ స్వావలంబన: మన షరతులకు లోబడి ప్రపంచానికి మన తలుపులు తెరుస్తూనే ఆర్థికం, భద్రత, తదితర రంగాలలో స్వావలంబన సాధించడం.
- పౌర విధులు: వ్యక్తులు, సామాజిక సమÖహాలలో పౌరసత్వ గుణాలు, సత్‌ప్రవర్తనలు, పౌర కర్తవ్యభావనను పాదుగొల్పడం.
ఇవి అన్నీ విశ్వజనీన విలువలు. ఎక్కడైతే దురవస్థ, కష్టాలు ఉంటాయో అలాంటి చోట మానవాళికి సేవ చేయడానికి ఒక దృఢమైన, ఆత్మవిశ్వాసంతో కూడుకున్న జాతి(దేశం) అవసరమని మేం విశ్వసిస్తాము.
నిజమైన శాస్త్రవేత్త ఒక రుషిగా మారాలి
థ్రైవ్ 2026 సదస్సులో మేధోపరంగా జరిగిన ఎంతో విలువైన ఒక సంభాషణ, దత్తాత్రేయ హోసuలే, హడ్సన్ ఇన్‌స్టిట్యూట్ సీనియర్ ఫెలో, బిల్ డ్రెక్సెల్, మైక్రోస్టాఫ్ రెస్పాన్సిబుల్ ఏఐ పయనీర్ బెన్ ఓల్సెన్, స్టాన్‌ఫోర్డ్ న్యూరో సైంటిస్టు విలియం బి. హర్ల్‌బట్‌లను ఒకచోట చేర్చింది.
చర్చ ప్రారంభంలో, హర్ల్‌బట్ మాట్లాడుతూ మానవాళికి మెదడు పనితీరు కొంత మాత్రమే తెలుసునని అన్నారు.. ఆత్మవిశ్వాసానికి, అవగాహనకు మధ్య ఉన్న ఈ అంతరం ఒక కలవరపరిచే వైరుధ్యాన్ని వెల్లడిస్తుందని ఆయన సూచించారు: సాంకేతిక సామర్థ్యం వేగవంతమవుతున్నప్పటికీ, ప్రాథమిక అవగాహన పరిమితంగానే ఉంది అని తెలిపారు. ఈ అంశాన్ని కొనసాగిస్తూ, పెరుగుతున్న “జ్ఞానాహంకారం” పట్ల హోసబలే హెచ్చరించారు. కృత్రిమ మేధస్సును ఎక్కువగా చైతన్యపరంగా చర్చిస్తున్న ఈ కాలంలో, వాస్తవికతపై తనకున్న పట్టును మానవాళి అతిగా అంచనా వేసే ప్రమాదం ఉందని తెలిపారు. “మానవ మేధస్సునే మనం ఇంకా అర్థం చేసుకోలేదు. అలాంటప్పుడు దాన్ని మనం పునఃసృష్టించగలమని లేదా అధిగమించగలమని అంత సులభంగా ఎలా చెప్పుకోగలం?” అని హోసబలే ప్రశ్నించారు. ఆధునిక చర్చలు తరచుగా విజ్ఞానశాస్త్రాన్ని, ఆధ్యాత్మికతను పరస్పర విరుద్ధమైన రంగాలుగా చిత్రీకరించడం లోనే అసలు సమస్య ఉంది. ఇది ప్రాథమికంగా తప్పు అని అన్నారు. “విజ్ఞానశాస్త్రం ఆధ్యాత్మికతకు వ్యతిరేకం కాదు,” అని నొక్కి చెప్పారు. “దానిని అర్థం చేసుకోవడానికి, అనుభూతి చెందడానికి ఉన్న అనేక సాధనాలలో అది ఒకటి” అని తెలిపారు. ఈ రెండింటినీ సంఘర్షణలో ఉంచడం ద్వారా, సమకాలీన ఆలోచనా విధానం పరిశోధనాపరిధిని విస్తరించడానికి బదులుగా సంకుచితం చేస్తుందని అన్నారు. శాస్త్రీయ కృషితో పాటు ఆధ్యాత్మిక పరిశోధనకు కూడా గణనీయమైన కృషి చేసిన ఐజాక్ న్యూటన్ వంటి వ్యక్తులను హోసబలే ఉదహరించారు. టువంటి ఉదాహరణలు, జ్ఞానాన్ని విభాగాలుగా విభజించకుండా ఏకీకృతంగా చూసిన ఒక పూర్వపు మేధో సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తాయని సూచించారు. జ్ఞానానికి కేంద్రంగా “జ్ఞాపకాన్ని ఉంచుకోవడం” అనే భావనను పరిచయం చేయడం ద్వారా ఓల్సెన్ ఒక ఆలోచనా సరళిని విస్తరించారు. ఆయన సూత్రీకరణలో, మానవ మేధస్సు తరచుగా తన లోతైన మూలాలను మరచి పోతుంది. దానినే ఆధ్యాత్మిక మేధస్సు లేదా నాగరికత వారసత్వ జ్ఞానం అని పేర్కొన్నారు. ఈ సంభాషణ క్రమంగా సత్యాన్ని ఎలా చేరుకోవాలి? అనే ఒక తాత్విక ప్రశ్న వైపు మళ్లింది.
భారతీయ తాత్విక సంప్రదాయాల నుండి స్ఫూర్తి పొందిన హోసబలే సత్యం అనేది కేవలం ఒకే ఆవిష్కరణ పద్ధతికి పరిమితం కాదని వాదించారు. అనుభవపూర్వక ధ్రువీకరణపై ఆధారపడిన విజ్ఞానశాస్త్రం ఒక మార్గాన్ని అందిస్తుంది. కానీ అది ఒక్కటే మార్గం కాదు. “సత్యం ఒక్కటే”, సరళం చేయాలి. నొక్కిచెప్పారు. “కానీ దానిని చేరుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి” అని నొక్కి చెప్పారు. శాస్త్రీయ పరిశోధన అసాధారణమైన అంతర్ దృష్టులను అందించినప్పటికీ, అది మానవ అనుభవ పరిధిని పూర్తిగా ఆవరించదు.
డ్రెక్సెల్ తాను “చిన్న సత్యాలు” అని వర్ణించిన వాటికి, అవి సూచించే విశాలమైన, సర్వోన్నత సత్యానికి మధ్య భేదాన్ని చూపడం ద్వారా ఈ అంశానికి దోహదపడ్డారు. ఈ దృక్కోణంలో, శాస్త్రీయ ఆవిష్కరణలు క్రమంగా పోగుపడుతూ, అవగాహన పొరలను నిర్మిస్తాయి. అయినప్పటికీ, అంతిమ వాస్తవికత, అంటే “ఆంగ్లంలో పెద్ద అక్షరం టీ”తో మొదలయ్యే సత్యం, మరింత లోతైనదిగా, బహుశా కేవలం విశ్లేషణాత్మకమైన దానికంటే అనుభవపూర్వక మైనదిగా మిగిలిపోతుంది. ఈ చర్చ సహజంగానే తత్వశాస్త్రంలోని అత్యంత పురాతనమైన వాదోపవాదా లలో ఒకటైన మనస్సు, పదార్థం మధ్య సంబంధానికి దారితీసింది.
మానవులు ప్రధానంగా భౌతిక జీవులేనా? అనే ప్రశ్న ఉదయించింది. భారతీయ తత్వం నుండి మళ్లీ స్ఫూర్తి పొందుతూ, ‘మాయ’ అనే భావనను హోసబలే ప్రస్తావించారు. అంటే, భౌతిక ప్రపంచం అంతిమ వాస్తవికత కాదని, అది కేవలం ఒక తాత్కాలిక అభివ్యక్తి మాత్రమేనన్న ఆలోచనను వ్యక్తీకరించారు. ఈ చట్రంలో, చైతన్యం లేదా మనస్సు కేవలం పదార్థం ఉప ఉత్పత్తి మాత్రమే కాదు, అది ఒక ఉన్నతమైన అస్తిత్వ స్థాయిని కలిగి ఉంటుంది. భౌతిక పరిమితులను అధిగమించగల మనస్సు సామర్థ్యం, ‘సమాధి’ అనే భావనలో ఇమిడి ఉందని ఆయన వివరించారు.
అసలైన ప్రమాదం సాంకేతికతలో కాకుండా, దాని వినియోగాన్ని నిర్దేశించే ఉద్దేశ్యాలలోనే ఉందని హోసబలే నొక్కి చెప్పారు. విజ్ఞానశాస్త్రం, సాంకేతికత కేవలం వాణిజ్య ప్రయోజనాలు లేదా అధికార పరిగణనలతో వినియోగానికి నోచుకుంటే, అవి మానవ సంక్షేమ సాధనాలుగా కాకుండా దోపిడీ సాధనాలుగా మారే ప్రమాదం ఉంది అని తెలిపారు.
చర్చ కొనసాగుతున్న కొద్దీ, ప్రపంచ నాగరికత గమనం గురించి ఒక ఉమ్మడి ఆందోళన వ్యక్తమైంది. ఈ సందర్భంలో, శాస్త్రీయ పరిశోధనను ఆధ్యాత్మిక జ్ఞానంతో ఏకీకృతం చేయడం అనే ఒక బలమైన ఆదర్శాన్ని హోసబలే వ్యక్తీకరించారు.
“నిజమైన శాస్త్రవేత్త ఒక రుషిగా మారాలి” అని వ్యాఖ్యా నించారు. అత్యున్నత స్థాయి అవగాహనలో, సైన్సు, ఆధ్మాత్మికతల మధ్య వ్యత్యాసం కనుమరుగవు తుందని తెలిపారు.
అపార్థాల నుండి దృఢ నిశ్చయం వరకు
ఆర్ఎస్ఎస్ సర్‌కార్యవాహ దత్తాత్రేయ హోసబలే తన అమెరికా పర్యటనలో భాగంగా స్టాన్‌ఫోర్డ్, వాషింగ్టన్, చికాగోలలోని మేధోమథన బృందాలు, విద్యావేత్తలు, ప్రవాస భారతీయులతో సంభాషించారు. భారత్‌పై ఒక నాగరికతా దృక్పథాన్ని ప్రదర్శించారు. దీర్ఘకాలంగా పాతుకుపోయిన అపోహలను ఖండించారు. ధర్మం, ఐక్యత, ప్రపంచ బాధ్యతను నొక్కి చెప్పారు.
దత్తాత్రేయ హోసబలే వివిధ అంశాలపై ఆరఎసఎస్ వైఖరిని స్పష్టం చేయడం, అలాగే ఆరఎసఎస్, భారత్, హిందూ ధర్మంపై ఉన్న అపోహలను తొలగించడం, అమెరికాలోని మేధో మథన సంస్థలు, విద్యావేత్తలు, విధాన రూపకర్తలు, సాంకేతిక పారిశ్రామికవేత్తలు ప్రవాస భారతీయులతో సంప్రదింపులు జరపడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశ్యం. భారత్ హిందూ నాగరికతతో విలసిల్లు తున్నది. హిందూ విశ్వాసం పట్ల జరుగుతున్న వక్రీ కరణలు సమాజం, దేశంపై ఉన్న అభిప్రాయాలను ప్రభావితం చేస్తాయి. కులం, కూర, ఆవు వంటి సాధారణ మూసధోరణులు మనకు తెలిసినవే అయినప్పటికీ, అవి కేవలం ఉపరితలాన్ని మాత్రమే తాకుతాయి. ప్రాచ్యవాద కథనాలు తమ వలస పాలనను చట్టబద్ధం చేసుకోవడానికి హిందువులను ఆదిమవాసులుగా చిత్రీకరించాయి. భారతీయులను నాగరికత లేనివారిగా చూపిస్తూ, వలసవాదులను నాగరికులుగా, జ్ఞానవంతులుగా ప్రదర్శించాయి. అమెరికాకు వలస వచ్చిన తొలినాళ్ల నుంచే భారతీయ-అమెరికన్లు ఇటువంటి తప్పుడు ప్రాతినిధ్యానికి వ్యతిరేకంగా నిరంతర పోరాటం చేస్తున్నారు. హిందూ ధర్మం చిత్రణకు సంబంధించిన కాలిఫోర్నియా పాఠ్యపుస్తక ఉదంతం, కాలి ఫోర్నియాలో “కుల” చట్టానికి వ్యతిరేకంగా జరిగిన రాజకీయ, న్యాయ పోరాటం, ఈ గొప్ప సంస్కృతి, చరిత్ర పట్ల జరుగుతున్న వక్రీకరణకు వ్యతిరేకంగా పోరాడాలనే హిందూ అమెరికన్ల సంకల్పాన్ని పరీక్షించాయి.
పశ్చిమ దేశాలు తమ వలస రాజ్యాలలో మేధోపరమైన చర్చలపై నియంత్రణ సాధించడంతో, తమ వ్యాఖ్యానాల ద్వారా ఆయా సంప్రదాయాలకు చెందిన స్థానికులు తమ సొంత ధార్మిక, సాంస్కృతిక వారసత్వంపై స్వీయ అవగాహనలో కూడా తీవ్రంగా ప్రభావితులయ్యారు. వలస పాలనలో ఉన్న మనస్సులో, వలసవాద చైతన్యం స్వీయానుభూతి ప్రక్రియకు ఆటంకం కలిగిస్తుంది.
పరిశీలన అనే చర్య వాస్తవికతను ప్రభావితం చేస్తుంది అనేది క్వాంటం సిద్ధాంతంలోని అత్యంత ఆసక్తికరమైన భావనలలో ఒకటిగా ఉంది. హిందూ ధర్మాన్ని అధ్యయనం చేసే పశ్చిమ దేశాల పండితులకు ఈ భావన ఒక శక్తిమంతమైన ఉపమానంగా ఉపయోగపడుతుంది. పశ్చిమ దేశాల విద్యా పరిశీలన హిందూ ధర్మాన్ని తప్పుగా నమోదు చేయడమే కాకుండా, తరచుగా హిందువులను అపరిచితంగా లేదా ప్రతికూలంగా భావించే రీతులలో దానిని పునర్నిర్మిస్తుందనే హిందువుల ఆందోళనలను ఇది వివరిస్తుంది. “పరిశీలకుని పక్షపాతం” ఆ సంప్రదాయం పట్ల అందరి అవగాహనను, దానిని అనుసరిస్తున్న స్థానికుల స్వీయ అవగాహనను రెండింటినీ మార్చి వేసిందని చెప్పడానికి ఇది చాలు.
ఒక సార్థక పర్యటన
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి దాదాపు 79 సంవత్సరాల తర్వాత, ఆరఎసఎస్ స్థాపించి 100 సంవత్సరాల తర్వాత, హిందూ ధర్మానికి, భారత దేశానికి ప్రాతినిధ్యం వహించడంలో తమ ప్రాతినిధ్యాన్ని తిరిగి పొందాలన్న హిందూ సమాజపు ఆత్మవిశ్వాసం నుంచి ఉద్భవించిన ఆకాంక్షతో ప్రేరేపితులైన హోసబలే అమెరికాలో స్టాన్‌ఫోర్డ్, వాషింగ్టన్, చికాగోలను సందర్శించారు. శాస్త్రీయ, సాంకేతిక పురోగతి, ఆర్థిక లాభం కంటే నైతికత, సమానత్వం, పర్యావరణానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన నొక్కి చెప్పారు.
వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్న హడ్సన్ ఇన్‌స్టిట్యూట్‌లో నిర్వహించిన “న్యూ ఇండియా కాన్ఫరెన్స”లో కూడా పాల్గొన్నారు. హడ్సన్ స్కాలర్ వాల్టర్ రస్సెల్ మీడ్, ఫ్లోరిడా విశ్వవిద్యాలయం, హామిల్టన్ స్కూల్‌లో ప్రొఫెసర్ అలెగ్జాండర్ హామిల్టన్ లతో కలిసి అంతర్జాతీయంగా భారతదేశం పాత్రపై జరిగిన ఒక చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సదస్సులో ఇండో-పసిఫిక్ డైనమిక్స్, భారత్-అమెరికా వ్యూహాత్మక, ఆర్థిక సంబంధాలపై కూడా చర్చించారు. దత్తాజీతో పాటు ఇండియా ఫౌండేషన్‌కు చెందిన రామ్ మాధవ్, బీజేపీకి చెందిన విజయ్ చౌతైవాలే, మాజీ ప్రతిపక్ష ఎంపీ ప్రియాంక చతుర్వేదిలతో కూడిన ఉన్నత స్థాయి భారత ప్రతినిధి బృందం కూడా ఉంది.
హడ్సన్ సదస్సు తర్వాత, వాషింగ్టన్‌లో “ప్రస్తుత ప్రపంచంలో భారత్ అంతర్జాతీయ దృక్కోణం, దాని పాత్ర” అనే అంశంపై జరిగిన ఒక కార్యక్రమంలో ప్రముఖ విద్యావేత్త వాల్టర్ ఆండర్సన్, విదేశీ విధానంపై చరితక్రారుడు వాల్టర్ రస్సెల్ మీడ్ సహా భారతీయ-అమెరికన్ సమాజ సభ్యులు, పండితులు పాల్గొన్నారు. హోసబలే మాట్లాడుతూ హిందువులు ఎన్నడూ దండయాత్రలు చేయలేదని, ఎవ్వరినీ బానిసలుగా చేసుకోలేదని లేదా క్షమాపణ చెప్పదగిన చర్యలకు పాల్పడలేదని పేర్కొన్నారు. మీడియా, విద్యా రంగంలోని కొన్ని వర్గాలలో ఆరఎసఎస్‌కు వ్యతిరేకంగా ముద్ర వేసిన ‘హిందూ ఆధిపత్య వాదం’ను తిరస్కరించారు. చికాగోలో జరిగిన ఒక సామాజిక కార్యక్రమంలో హిందూ బహుళత్వాన్ని ప్రశంసిస్తూ, హిందూ ఐక్యత ఆవశ్యకతను హోసబలే నొక్కిచెప్పారు. హిందువుల మధ్య ఐక్యత లేకపోవడం హిందూ సమాజానికి శాపంగా మారిందని, దాని ఫలితంగా రాజకీయంగా బలహీనపడుతున్నామని విచారం వ్యక్తం చేశారు. బహుళత్వం, మత స్వేచ్ఛ, సహనాన్ని పరిరక్షించడం అనేది ప్రపంచవ్యాప్తంగా బలమైన హిందూ ఉనికిని కొనసాగించడంపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. “ఏకం సత్ విప్ర బహుధా వదంతి” (రుగ్వేదం 1.164.46) అనే వాక్యాన్ని కేవలం హిందూ ధర్మం మాత్రమే చెప్పగలదని, అంటే సత్యం ఒక్కటే, కానీ జ్ఞానులు దానిని అనేక విధాలుగా చెబుతారని అన్నారు. సమాజాన్ని సంఘటితం చేయడంలో, దేశ నిర్మాణాన్ని ప్రోత్సహించడంలో, సామాజిక సేవను ప్రోత్స హించడంలో, ఆ పదలలో సహాయాన్ని అందించడంలో, విద్యను అభివృద్ధి చేయడంలో, సామాజిక సామరస్యాన్ని పెంపొందించడంలో ఆరఎసఎస్ పాత్రను హోసబలే ప్రముఖంగా ప్రస్తావించారు.
పాశ్చాత్యులకు ఆరఎసఎస్ దృక్పథాన్ని తెలియజేయడం, సాంస్కృతిక, వ్యూహాత్మక సంబంధాలను నిర్మించడం ఈ పర్యటన లక్ష్యమని మీడియా పేర్కొంది. ప్రవాస భారతీయుల స్పందన ఎక్కువగా సానుకూలంగా ఉంది. అయితే, సమాజ నిర్మాణ సంస్థగా ఆరఎసఎస్‌కు పెరుగుతున్న ప్రభావంతో హిందూ వ్యతిరేక సమూహలు కలవరపడ్డాయి.
– అవతన్స్ కుమార్, భాషావేత్త, సీఎన్‌పీఏ, ఎసఈపీసీ
పాత్రికేయ పురస్కారాల గ్రహీత
ప్రతి స్థాయిలో సుస్థిర సమాజ నిర్మాణం
ఏప్రిల్ 28-29 తేదీలలో బెర్లిన్‌లో పర్యటించిన సందర్భంగా, జర్మనీ విధానరూపకల్పన సంస్థలు, ప్రవాస భారతీయులతో దత్తాత్రేయ హోసuలే మమేక మయ్యారు. వచ్చే 100 సంవత్సరాలలో ఆరఎసఎస్ కార్యాచరణను వివరించారు. స్టిఫ్టుంగ్ విస్సెన్‌షాఫ్ట్ అండ్ పొలిటిక్స్ (జర్మన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ అండ్ సెక్యూరిటీ అఫైర్స్), కొన్రాడ్-అడెనౌర్-స్టిఫ్టుంగ్ (కొన్రాడ్ అడెనౌర్ ఫౌండేషన్), అబ్‌గెయోర్డ్ నెటెన్‌హాస్ ఆఫ్ బెర్లిన్ (బెర్లిన్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్) సభ్యులు సహా ప్రముఖ జర్మనీ సంస్థల సీనియర్ ప్రతినిధులతో చర్చలు జరిపారు. పరస్పర అవగాహనను బలోపేతం చేసే లక్ష్యంతో ఈ సమావేశాలు జరిగాయి. ఈ చర్చల సందర్భంగా జర్మనీలోని ప్రవాస భారతీయుల ముఖ్యమైన పాత్రను పాల్గొన్నవారు గుర్తించారు. ఈ సంభాషణల సందర్భంగా హోసబలే మాట్లాడుతూ “కుటుంబాల నుండి సమాజాల వరకు ప్రతి స్థాయిలో సుస్థిర సమాజాల నిర్మాణానికి, పర్యావరణ బాధ్యతకు దోహదపడటమే వచ్చే 100 సంవత్సరాలకు ఆరఎసఎస్ దార్శనికతగా ఉంది. ఇది సమష్టి సార్వజనీన విలువలపై ఆధారపడి ఉంటుంది” అని అన్నారు. అన్ని సంభాషణలలోనూ స్థిరంగా వ్యక్తమైన అంశం ఏమిటంటే, భారత్, జర్మనీ సమాజాలు నిర్మాణ పరమైన సారూప్యతలను పంచుకుంటాయి. ముఖ్యంగా సామాజిక ధోరణి, సామాజిక వ్యవస్థీ కరణ, అభివృద్ధి చెందుతున్న కుటుంబ వ్యవస్థలలో ఈ సారూప్యతలు ఉన్నాయి. ఈ చర్చలు సాంస్కృతిక, విధానపరమైన సందర్భాలలో సుస్థిరత, సామాజిక సమైక్యతను కాపాడుకునే పద్ధతులు, పౌర సమాజ సంస్థల విస్తృత పాత్రను కూడా ప్రస్తావించాయి.
జర్మనీలో నివసిస్తున్న భారతీయులకు ఆ దేశ సామాజిక, ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మకంగా పాల్గొనవలసిన బాధ్యత ఉందని హోసలే నొక్కి చెప్పారు. విద్య, సేవా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు వంటి రంగాలలో సామాజిక అభివృద్ధి, సామాజిక సమైక్యత, క్షేత్రస్థాయి సమీకరణలో ఆరఎసఎస్ నిమగ్నమై ఉంది. అంతేకాకుండా ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో స్వచ్ఛంద సేవకులతో నడుస్తున్న సామాజిక సంస్థలలో ఒకటిగా ఆరఎసఎస్ నిలిచిందని తెలిపారు.
ఈ పర్యటనలో భాగంగా, బెర్లిన్‌లో హిందూ స్వయంసేవక్ సంఘ్ (హెచఎసఎస్) నిర్వహించిన ఒక సభలో ఆయన ప్రసంగించారు. ఈ సభకు 200 మందికి పైగా స్వయంసేవకులు హాజరయ్యారు.నాగరిక, సామాజిక మార్పిడుల ద్వారా భారతీయ సంస్కృతి ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిందని ఆయన ప్రముఖంగా పేర్కొన్నారు. శాంతియుత భాగస్వామ్యం, సాంస్కృతిక కొనసాగింపునకు ప్రాధాన్యతనిచ్చారు.
మైనారిటీలూ భారతీయులే
అమెరికాకు చెందిన మీడియా సంస్థ నేషనల్ పబ్లిక్ రేడియో (NPR)తో జరిపిన ఒక సుదీర్ఘ సంభాషణలో ఆరఎసఎస్ సైద్ధాంతిక వైఖరిని దత్తాత్రేయ హోసబలే వివరించారు. విమర్శలకు ప్రతిస్పందించారు. భారతదేశ నాగరికతా గుర్తింపు, మైనారిటీలు, ప్రపంచ దృక్పథంపై అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.
ఏప్రిల్ 24న హోసబలే హడ్సన్ ఇన్‌స్టిట్యూట్‌ను సందర్శించిన సందర్భంగా, వాషింగ్టన్‌లో NPRకు చెందిన రాబ్ ష్మిట్జ్ నిర్వహించిన ఈ ఇంటర్వ్యూ, పాశ్చాత్య మీడియాకు ఆరఎసఎస్‌ను చేరువ చేసిన తీరుకు ఒక నిదర్శనంగా నిలిచిపోయింది. సమాజంలో మైనారిటీల స్థానం, భారత్ పట్ల ఆరఎసఎస్ దార్శనికతలో వారి స్థానం గురించి అడిగిన ప్రశ్నకు హోసబలే స్పందిస్తూ, “వారు మన దేశంలో, సమాజంలో అంతర్భాగం. వారూ నాలాగే పౌరులే, వారి పూర్వికులు కూడా భారత్‌కు చెందిన వారే” అని పేర్కొన్నారు.
ముస్లింలను ఆక్రమణదారులుగా ముద్ర వేయడంపై వ్యక్తమవుతున్న ఆందోళనల గురించి ఆయన మాట్లాడుతూ, “భారత్‌పై దండయాత్ర అనేది చరిత్రలో ఒక వాస్తవం. ప్రస్తుత ముస్లింలను మేము ఆక్రమణదారులుగా పరిగణించము. ప్రస్తుత ముస్లింలు, వారి పూర్వికులు భారతీయ మూలాలకు చెందినవారే. అంటే వారిలో అధికశాతం మందికి దండయాత్ర వల్ల వచ్చిన వారసత్వం కాదు. కానీ భారత్‌పై దండయాత్ర జరిగింది, అది వాస్తవం” అని అన్నారు. మరో ముఖ్యమైన సంభాషణలో “నాగరికంగా, సాంస్కృతికంగా మేము వారిని హిందువులుగానే గుర్తిస్తాము. ఒకవేళ మీరు హిందువు అనేదాన్ని ఏదైనా మతపరమైన కోణంలో చూస్తే, హిందూ మతం అంటూ ఏదీ లేదు. అది ఒక జీవన విధానం” అని హోసబలే అన్నారు. హింసాత్మక ఘటనలతో హిందూ సంఘాలకు చెందిన వ్యక్తులకు సంబంధం ఉందనే ఆరోపణలను కూడా ఎన్‌పీఆర్ లేవనెత్తింది. దీనికి స్పందిస్తూ “ఆరఎసఎస్ ఒక తీవ్రవాద సంస్థ కాదు. మాది రహస్య సంస్థ కాదు. బహిరంగ సంస్థ. అది ఒక క్షేత్రస్థాయి సంస్థ. మేము ప్రతిరోజూ కనిపిస్తుంటాము. మేము తెర వెనుక ఏ కార్యకలాపాలు చేయడం లేదు” అని అన్నారు. ఇంటర్వ్యూలో ప్రస్తావించిన నిర్దిష్ట కేసుల గురించి మాట్లాడుతూ “ఆ ఘటనలన్నింటిపైనా కోర్టులో విచారణ జరిగింది. అవి నిరూపణ కాలేదు. వాటిలో ఆరఎసఎస్ సభ్యుల ప్రమేయం లేదు. ఆ దిశగా న్యాయస్థానం తీర్చు ఇచ్చింది” అని చెప్పారు.
“ఆరఎసఎస్ శతాబ్ది సంవత్సరంలో ఉంది. అది సామాన్యులతో కలిసి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నది. కనుక ఆరఎసఎస్ ప్రస్థానానికి, భారత్ ప్రస్థానానికి అవినాభావ సంబంధం ఉంది. ఆ క్రమంలో ఈ వృత్తాంతాన్ని ప్రపంచానికి తెలియ జెప్పాలని మేము ఆకాంక్షిస్తున్నాము. హిందువుల గురించి, ఆరఎసఎస్ గురించి, చివరకు భారత్ గురించి, దాని చారిత్రక పథం గురించి రకరకాల అర్థాలు, అపార్థాలు చోటు చేసుకున్నాయి. కనుక సమాజంలో వేర్వేరు రంగాలలో, భిన్నమైన వర్గాలలో ప్రముఖులతో నేరుగా సంభాషణ జరపాలి.
ఈ సంభాషణ ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నది. మరీ ముఖ్యంగా ఈ పర్యటన యూకే, ఐరోపా, ప్రత్యేకించి జర్మనీ, అమెరికా దేశాలపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం ప్రజలు భారత్ పట్ల ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. వారిలో కొందరు యోగా ద్వారా, మరికొందరు కుంభమేళా ద్వారా భారత్ లేదా హిందుత్వను అర్థం చేసుకున్నారు. అన్ని రంగాల్లోనూ ఆర్థికంగా భారత్ ఆవిర్భవించిన వైనాన్ని తెలుసు కోవడానికి ఇంకొందరు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఈ వృతాంత్తాన్ని తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరు ఆసక్తి చూపుతున్నారు. స్పందన చాలా బాగుంది. ప్రజలు కడకు విద్యావేత్తలు అత్యంత ఆసక్తితో, ఎంతో లోతుగా చర్చించారు. నేను లండన్‌లో పర్యటించినప్పుడు అక్కడి విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యావేత్తలు తాత్వికపరమైన అంశాలు, భారత్ వృద్ధి వృత్తాంతం, అందులో ప్రజల భాగస్వామం, ప్రజలను భాగస్వాములుగా చేయడంలో ఆరఎసఎస్ సహాయపడుతున్న వైనం గురించి చర్చించారు. వేర్వేరు దేశాల్లోని ప్రముఖ వ్యక్తులను మేము కలుసుకున్నాము. జపాన్, దక్షిణ కొరియా, ఇండోనేషియా, దక్షిణాఫ్రికా, చివరకు కజకిస్థాన్ లాంటి దేశాలు, పొరుగు దేశాలలో పర్యటించడానికి మేము ప్రయత్నిస్తున్నాము. ఆరఎసఎస్ ను పరిచయం చేయడానికి మాత్రమే మా లక్ష్యం (పర్యటనల ద్వారా) పరిమితం కాదు. అది హిందూ తాత్వికత, హిందుత్వం, భారత్ చరిత్ర, భారత్ భవిష్యత్తు గురించి చర్చించడం అందులో భాగం అవుతుంది”
– సునీల్ అంబేకర్, అఖిలభారతీయ ప్రచార ప్రముఖ్, ఆరఎసఎస్
సంఘ శతాబ్ది వేళ ప్రపంచవ్యాప్త సంభాషణ
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది సంవత్సరాన్ని పురస్కరించుకొని సర్‌కార్యవాహ దత్తాత్రేయ హోసబలే, అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్‌తో కలిసి, 2026 సంవత్సరం ఏప్రిల్ 10 నుండి 15 వరకు యునైటెడ్ కింగ్‌డమ్‌ను సందర్శించారు. ఈ శతాబ్ది సంవత్స రాన్ని సామాజిక సామరస్యం, దేశ నిర్మాణం, సమాజ సేవ అనే ఆశయాలకు పునరంకితం అయ్యే కాలంగా పాటిస్తున్నారు. ఈ స్ఫూర్తితో, సర్‌కార్యవాహ ఈ పర్యటన సందర్భంగా బ్రిటిష్ జనజీవనంలోని వివిధ వర్గాలతో సంభాషించారు. “ప్రపంచం పట్ల ఆరఎసఎస్ దృక్పథం” అనే శీర్షికతో ఒక ప్రైవేట్ రౌండ్‌టేబుల్ చర్చను రాయల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ అఫైర్స్‌కు చెందిన చాథమ్ హౌస్ నిర్వహించింది. సంఘను సామాజిక పరివర్తన కోసం పనిచేసే ఒక పౌర ఉద్యమంగా సర్‌కార్యవాహ అభివర్ణించారు. స్వయంసేవకులు విద్యార్థులు, రైతులు, నిపుణులు ఇలా సమాజంలోని అన్ని వర్గాల నుండి వస్తారని, ఈ సంస్థ చిన్న పాఠశాలల నుండి పెద్ద ఆసుపత్రుల వరకు 1,29,000కు పైగా సేవా కార్యక్రమాలను పూర్తిగా స్వయంసేవకుల ద్వారానే నిర్వహిస్తుందని తెలిపారు. భారతదేశ విదేశాంగ విధానం, యువత భాగస్వామ్యం, సాంస్కృతిక గుర్తింపు, పౌర జీవనం మధ్య సంబంధం సహా పలు అంశాలపై చర్చ జరిగింది.
లండన్ నగరంలోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబిలిటీ, “అండర్ స్టాండింగ్ ఇండియా ఫ్రమ్ ది గ్రాస్‌రూట్స” – క్షేత్రస్థాయి నుంచి భారత్ పట్ల అవగాహన అనే శీర్షికతో ఒక సదస్సును నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఆ కేంద్రం డైరెక్టర్, ఫెలోలు, పరిశోధకులు పాల్గొన్నారు. ఈ సదస్సులో భారత్‌ను ఒక నాగరికతా సంస్థ అనే భావనను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సర్‌కార్యవాహ రాష్ట్రానికి, ఆధునిక జాతి రాజ్యానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వివరిస్తూ “భూమి, ఉమ్మడి సాంస్కృతిక విలువలు, చరిత్ర, దాని ప్రజల కారణంగా ఒక జాతి ఉనికిలోకి వస్తుంది. రాష్ట్రం అనాది కాలం నాటిది, అయితే జాతి రాజ్యం అనేది ఫ్రెంచ్ విప్లవం తర్వాత వచ్చిన ఒక భావన” అని అన్నారు. వ్యవస్థాగత మార్పును సంఘం ఏ ప్రాతిపదికపై తీసుకువస్తుందో తెలిపే క్రమంలో హిందూ సమాజంలో స్వీయ-దిద్దుబాటు పాత్రను కూడా ఈ చర్చ స్పృశించింది.
“ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితులలో ప్రపంచం పట్ల ఆరఎసఎస్ దృక్కోణం”పై సర్‌కార్యవాహ ప్రసంగాన్ని వినడానికి వాణిజ్య ప్రముఖులు సమావేశమయ్యారు. గత వందేళ్లుగా సంఘం ఒక విస్తృత ప్రజా ఉద్యమంగా ఎలా ఎదిగిందో ఆయన ప్రస్తావిస్తూ, “వ్యక్తిగత స్థాయిలో సద్గుణాల ద్వారా వ్యక్తి నిర్మాణం, దానికి తోడు సామాజిక చైతన్యం” అనే రెండు స్థాయిలలో శాU పనిచేస్తుందని వివరించారు. స్వయంసేవకులకు ఎల్లప్పుడూ తగిన వనరులు ఉండకపోవచ్చు, కానీ వారు సమాజానికి తిరిగి సేవ చేయడానికి ఒక మార్గాన్ని కనుగొంటారు అని తెలిపారు.
విద్య, ఆరోగ్య సంరక్షణ, గిరిజన సంక్షేమం వంటి రంగాలలో సేవాభారతి వంటి సంస్థలు చేస్తున్న కృషి, ఈ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడంలో దాతృత్వం పోషిస్తున్న పాత్రతో సహా, సంఘ్ సేవా కార్యక్రమాలపై సభికులు ప్రత్యేక ఆసక్తిని కనబరిచారు. ఈ కార్యక్రమంలో ఆక్స్‌ఫర్డ్‌లోని హిందూ అధ్యయన కేంద్రానికి చెందిన ప్రొఫెసర్ గావిన్ ఫ్లడ్, స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్ – SOAS రాజనీతిశాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్ మాథ్యూ నెల్సన్, యూనివర్శిటీ కాలేజ్ లండన్ – UCL ప్రొఫెసర్ లూసియా మిచెలుట్టి వంటి పండితులు పాల్గొన్నారు. ఈ చర్చ సంఘ సంస్థాగత స్వరూపాన్ని, సామూహిక స్థాయిలో స్వచ్ఛంద సేవ అర్థాన్ని పరిశీలించింది. భారత్‌లోని సంఘ ప్రాజెక్టులను సందర్శించవలసిందిగా పండితులకు బహిరంగ ఆహ్వానం అందింది. హౌస్ ఆఫ్ కామన్స్, హౌస్ ఆఫ్ లార్డ్స్‌కు చెందిన వివిధ పార్టీల పార్లమెంటు సభ్యుల బృందం “భారత్ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఆరఎసఎస్ పాత్ర” అనే అంశంపై జరిగిన సదస్సులో పాల్గొంది. బ్యాక్‌బెంచ్ బిజినెస్ కమిటీ ఛైర్మన్ రాబర్ట్ బాబ్ బ్లాక్‌మన్ సహా కన్జర్వేటివ్ పార్టీ, లేబర్ పార్టీ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సంభాషణలో సంఘ మౌలిక సూత్రాలు, విద్య, ఆరోగ్య సంరక్షణ, గిరిజన సంక్షేమం, విపత్తు సహాయం వంటి క్షేత్రస్థాయి కార్యక్రమాలలో దాని కృషి, భారత్ భవిష్యత్తుపై దాని దృక్పథం వంటి అంశాలను ప్రస్తావించారు. యూకే-భారత్ సంబం ధాలను బలోపేతం చేయడంలో ప్రవాస భారతీయుల పాత్ర గురించి కూడా చర్చించారు. యునైటెడ్ కింగ్‌డమ్ నలుమూలల నుండి వచ్చిన సామాజిక నాయకులు, సామాజిక సంస్థల ప్రతినిధులతో సమావేశం జరిగింది. ఇది ఉమ్మడి ఆందోళన కలిగించే విషయాలపై సంభాషణకు, చర్చకు అవకాశం కల్పించింది. రగ్బీలో జరిగిన హిందూ స్వయంసేవక్ సంఘ్ యూకే కార్యకర్త మండలి సమావేశానికి సర్‌కార్యవాహ హాజరయ్యారు.
(ఆర్గనైజర్ నుంచి)
అనువాదం: మహేష్ ధూళిపాళ్ళ