సంపాదకీయం

శాలివాహన 1948 శ్రీ పరాభవ ఆశ్వీయుజ శుద్ధ అష్టమి -19 అక్టోబర్‌ 2026, ‌సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్


‌ప్రజాస్వామ్యంలో అసమ్మతి అవసరం. నిరసన తెలియచేయటం రాజ్యాంగం ప్రసాదించిన హక్కు. ఆ రెండు వాక్యాలతోపాటుగా జోడించిన మిగిలిన రాజ్యాంగపరమైన అంశాలను మీడియాగాని, ప్రతిపక్షాలుగాని పట్టించుకోవటం లేదు. నిరసనలకు ఒక పరిధి, పద్ధతి ఉంటుంది. ఇతరుల హక్కులకు భంగంకలిగించకూడని స్వేచ్ఛ మాత్రమే హక్కు అనేది రాజ్యాంగం చెప్పినవి, ప్రజాస్వామ్యంలో పాటించాల్సినవి. ఆ వాస్తవాన్ని మరచిపోతున్నాయి ప్రతిపక్షాలు, వారి అండతో నడుస్తున్న నిరసనకారులు. అందుకే నేడు ఢిల్లీ వీధుల్లో దేశ ప్రజలు తిలకిస్తున్న అరాచక నిరసనలు. తమ నిరసనను ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా తెలియచేయాలన్న ప్రాథమిక పద్ధతిని గాలికి వదిలేస్తున్నాయి అరాచకమూకలు. చట్టాన్ని తమ దచేతిలోకి తీసుకుని మూకస్వామ్యంగా మార్చాలనుకుంటున్నారు.
రాజకీయ క్షేత్రంలో పదే పదే ఓడిపోతున్న ప్రతిపక్షాలు ప్రజాస్వామ్య మూలసూత్రాన్ని విస్మరిస్తున్నాయి. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు తమ పదవీ కాలాన్ని ముగించి మరోమారు ప్రజా తీర్పుకోరక తప్పదు. అధికారపక్షం అందుకు సిద్ధం. అయినప్పటికీ ప్రజల తీర్పును ఎదుర్కోవాల్సిన కొన్ని విపక్షపార్టీలు, విదేశీ శక్తుల ప్రభావంలో ఉన్న యువతీయువకులను ముందుపెట్టి, జాతి ప్రయోజనాలకంటే, స్వార్థప్రయోజనాలకు ప్రాధాన్యతనిస్తూ వ్యవహరిస్తున్నాయి. దీని ఫలితమే జంతర్‌ ‌మంతర్‌ ఆం‌దోళనలు.
శాంతియుతంగా నిరసన తెలియజేయటం నచ్చని మూకలు అవి. నిరసనల విషయంలో పోలీసు వ్యవస్థ నిర్దేశించిన నిబంధనలు పాటించాల్సిన కనీసం జ్ఞానం కరువైన గుంపులవి. వ్యక్తిగత ఎజెండా, ఒక కుటుంబ లబ్ది, కొందరు నాయకుల రాజకీయ ఎదుగుదల కోసం దేశ ప్రగతినిని నిరోధించటానికి సిద్ధమైన తీవ్రవాద భావజాలం కలవారు.
సమిష్టిగా వారు అరాచక శక్తులు. వీరి ఆ నిరసన తెలియచేయటం ప్రాథమిక లక్ష్యం కాదు. అశాంతిని సృష్టించటం వారి అసలు లక్ష్యం. భారత వ్యతిరేక విదేశీ శక్తుల చేతిలో కీలుబొమ్మలైనారు. విదేశాలన్ని అభివృద్ధిమార్గాలు తెలియక, ఆర్థిక ప్రగతిని కుంటుపడి, వ్యవస్థలు కుదేలవుతున్నవేళ భారత్‌ ‌సుస్థిర అడుగులు వేయటం, అందునా ఒకే దృఢచిత్త, జాతీయ నాయకత్వంలో ‘నేషన్‌ ‌ఫస్ట్’‌గా సాగటం, ఎదగటం నచ్చని విదేశీ శక్తులు అనేకం. అంతర్జాతీయ వేదికలమీద భారత్‌కి, దానిని నడిపించే నాయకత్వానికి లభిస్తున్న గుర్తింపు, గౌరవం, గిట్టనివారున్నారు. ప్రపంచ నాయకుల ప్రజావిశ్వాసం సన్నగిల్లి, నరేంద్రమోదీ 79 శాతం ఆదరణతో తొలి స్థానంలో నిలిచిననాడే దేశ, విదేశీ భారత వ్యతిరేక మెదడ్లు ఏకమయ్యాయి. ఇది మోదీ వ్యక్తిగత విజయం కాదు, భార్‌త్‌కి ఆయన నాయకత్వం సాధించి పెట్టిన మహోన్నత స్థానం అనే విషయం స్వదేశంలోని ప్రతిపక్షాలు అంగీకరించలేకపోవటం వారి మానసిక రోగం. ఒక వ్యక్తి, ఒక నాయకుడు శాశ్వతం కాదు. జాతి స్థిరం, జాతీయతా భావం బలం సుస్థిరం. దేశాన్ని, నాయకురాలిని ఏకంచేసి, ‘ఇందిరా ఈజ్‌ ఇం‌డియా, ఇండియా ఈజ్‌ ఇం‌దిరా’ అన్న నినాద సృష్టికర్తలు కాంగ్రెస్‌వారు. ఆ మానసిక జబ్బు నుంచి అర్థ శతాబ్దం దాటినా బయటపడలేని రాజకీయ మనస్తత్వం నెహ్రు కుటుంబ వారసులది. వారు అంతకన్నా ఎదగరు. దేశ ప్రగతికి ఆ పార్టీ, ఆ కుటుంబం ఒక గుదిబండ. ఆ గుదిబండ బరువు దించుకుని భారతీయులు పరుగులు తీయాలని 2014లో తీసుకున్న నిర్ణయం గిట్టని కాంగ్రెస్‌ అరాచకవాదులు, తిరిగి ఆ కుటుంబ గుదిబండను దేశం మోసుక ఎత్తాలన్న ప్రయత్న ఫలితమే నేటి అరాచకత్వం.
రాజ్యాంగ వ్యవస్థల మీద అరాచక కాంగ్రెస్‌కి విశ్వాసం లేదన్నది నాటి ఎమర్జెన్సీ నిరూపించింది. సరిగా ఆ విశ్వాసమే నేడు వీధుల్లో ప్రదర్శితమవుతోంది. ఎన్నికల సంఘం తీరు గిట్టదు, సుప్రీంకోర్టు పాటించే పద్ధతి నచ్చదు. పార్లమెంట్‌ అం‌టే గౌరవం లేదు, ప్రధాని పదవికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదు. ఆ భావజాలమే నేడు రాజ్యాంగబద్ధ వ్యవస్థలపై భౌతికదాడులకు తెగపడేలా చేస్తున్నది. తమ అరాచక ఉద్యమాలకు విదేశీ నిధులు అందుకుంటున్నారు. విదేశీ ‘టూల్‌కిట్ల్’ ‌సూచనలను యథాతథంగా పాటిస్తున్నారు. విదేశీ మీడియా సహకారం, సారోస్‌ ‌వంటి వ్యక్తుల ఆర్థిక దన్ను అందుకుంటున్నారు. సుస్థిర భారతీయ ప్రజాస్వామ్య వ్యవస్థను పలచన చేయటమే లక్ష్యంగా అరాచకానికి తెగపడుతున్నారు.
మన చుట్టూ మోహరించిన మతతత్వమూకలను తమతో కలుపుకున్నారు. ప్రభుత్వాలకు ముందస్తు సమాచారం అందించే నిఘా వ్యవస్థ ఉంటుంది. ఆ వ్యవస్థ సేకరించిన సమాచారం ఆధారంగా ప్రభుత్వాలు స్పందిస్తాయి. హింసాత్మకంగా ఢిల్లీ వీధులను తయారుచేస్తారన్నది, అందుకు తగిన ఉగ్రసిద్ధం చేసుకున్నారన్నది నిఘాలో తెలిసినపుడు ఏ ప్రభుత్వం అయినా ఎలా స్పందిస్తుందో అలాగే స్పందించింది కేంద్ర ప్రభుత్వం. దీనిని తప్పుపట్టే మీడియా సంస్థలు, సంపాదకులు, వ్యాఖ్యాతలు అంతా అరాచకానికి మద్దతు పలుకుతున్నట్టే. మోదీ, బీజేపీ పట్ల వ్యతిరేకత జాతీయ వ్యతిరేకతగా మార్చుకోవటం ఈ అరాచక శక్తుల అతి పెద్దతప్పు.
ప్రజాస్వామ్యంలో సైద్ధాంతికంగా ప్రజల మనసులను గెలుచుకోవాలేగాని, అసత్య ప్రచారాలు, అసంబంద్ధ ఆరోపణలతో ఏదో సాధించాగలమనుకుంటే అది అపోహగానే మిగులుతుంది. దశాబ్దాల అడవి ఆధారిత పోరాటంలో సాధించింది ఏమీ లేదు. హింసాత్మక హత్యలు తప్పించి. అడవిలో ఓడిన శక్తులు, అదే హింసను నగరాలలోకి తెస్తామంటే దేశం అంగీకరించదు. అరాచకం అడవిలో అయినా, జంతర్‌ ‌మంతర్‌లో అయినా అణచివేయాల్సిందే. అవసరమైన కొత్త మార్గాలను కనుగొని ప్రయోగించాల్సిందే తప్పించి, అరాచక శక్తులకు ఎటువంటి పరిస్థితులలో ప్రభుత్వాలు లొంగిపోకూడదు. అది నేటి భారత్‌ ఆవశ్యకత.

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.