సంపాదకీయం

శాలివాహన 1948 శ్రీ పరాభవ భాద్రపద బహుళ విదియ – 28  సెప్టెంబర్ 2026, సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్


సంస్కారం తెలియని వ్యక్తిత్వం, సమర్థత లేని నాయకత్వం అతి ప్రమాదకరం. ఎవరిని ఎప్పుడు విమర్శించాలో, గౌరవించాలో తెలియనితనం వారి వ్యక్తిత్వ వికాసాన్ని, దేశ భవితను భ్రష్టు పట్టిస్తుంది. విపక్ష నేతకు, విదూషకుడికీ వ్యత్యాసం తెలియని కాలంలో ఉన్నాం. ఆకతాయిల బృందమంతా కలిసి అధికార పీఠాన్ని చేజిక్కుంచు కోవాలని తాపత్రయపడినప్పుడు అగస్త్యభ్రాతలు కూడా అగ్రనేతలుగా చెలామణీ అవుతారు. ఆషాఢభూతులు అతిరథమహారథులవుతారు.
ఇటీవలే మధ్యప్రదేశ్‌ ‌వాణిజ్య రాజధాని ఇండోర్‌లో కాంగ్రెస్‌ ‌పార్టీ ‘ఛాత్రోంకీ గూంజ్‌’ ‌కార్యక్రమం చేసింది. అయితే ఇలాంటి ప్రాధాన్యంగల కార్యక్రమాలను నిర్వ హిస్తున్నప్పుడు…దానికి బాధ్యత వహించే పార్టీ, సదరు పార్టీ నేత కాస్తంత బాధ్యతగా ఉండటం అవసరం. అంతకుమించి రాజకీయ పరిణతిని ప్రదర్శిం చడం షరతు కూడా. మన దేశంలో ఇటీవలికాలంలో ఒక ధోరణి ప్రబలంగా మారుతోంది. ‘స్టాండప్‌ ‌కమేడియన్‌’‌లుగా పిలిచే ‘సద్యోజనిత విదూషకుల’ అవసరం రాజకీయ పార్టీలకు తప్పనిసరి అవుతోంది. తమ రాజనీతిని, అధికార రాజకీయాల్లో సమర్థతను ప్రదర్శించ లేని స్థితిలో..అవహేళనను ఆశ్రయించేందుకు ‘స్టాండప్‌ ‌కమేడియన్‌’‌లపై ఆధారపడటం స్వాతంత్య్రానంతర భారతదేశ రాజకీయ చరిత్రలో విషాదమని పేర్కొనాలి.
హాస్యస్ఫోరకమైన ఒక వినోద పక్రియను రాజకీయ సరుకుగా, కార్పోరేట్‌ ‌వస్తువుగా మార్చే అల్పత్వం వర్తమాన రాజకీయాల్లో కనిపిస్తున్న ఒక ఆకర్షణీయమైన వ్యవహారం. కొన్నేళ్ల క్రితం భారతీయ సంస్కృతి-సంప్రదాయాలను అవహేళన చేసే ఓ ‘స్టాండప్‌ ‌కమెడియన్‌’‌ను భాగ్యనగరానికి ఆహ్వానించింది. ఆహ్వానం వెనుక ఉన్న రాజకీయ విత్త ప్రాయోజితం బట్టబయలు కావడంతో…హిందూ సంఘాల ఆగ్రహానికి కారణమైంది. తాజాగా ఇండోర్‌లో కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారికంగా నిర్వహించిన ‘ఛాత్రోంకీ గూంజ్‌’ ‌కార్యక్రమంలో పాల్గొన్నది పులకిత్‌ ‌మణి అనే స్టాండప్‌ ‌కమెడియన్‌. ‌విదూషకుడు వేదికపై వచ్చింది లగాయితూ… ఆయన హాస్యం కన్నా…లక్ష్య నిర్దేశిత వెటకారం, పారితోషికానికి తగిన ప్రతిభ వ్యక్తమయ్యాయి. విపక్ష నేత రాహుల్‌గాంధీని ఆలింగనం చేసుకున్న తీరులో సైతం సహజత్వం కనిపించలేదంటే…తగు కానుక లభించిందని అర్థమైంది. కళాపోషణతో పాటు ఉపాధి స్పృహ ఉండటం…ఏ కళాకారుడికైనా ఉండాల్సిన ప్రాథమిక లక్షణం. కానీ ఎవరి చేతిలో ఆయుధంగా మారుతున్నాం, ఎవరి తుపాకీకి భుజాన్ని అరువుగా ఇస్తున్నాం అనే ఎరుక అతి ప్రధానం.
కళాకారులకు, మరీ ముఖ్యంగా హాస్యకారులకు రాజకీయ పర్యవసానాలు తెలియకో, అత్యుత్సాహంతో వారు సదరు ప్రదర్శనకు అంగీకారం తెలపొచ్చు. కానీ బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న ఓ జాతీయ పార్టీ ప్రతిపక్ష నేత దేశ ప్రధాని గురించి అపహాస్యం చేయడంలో ఇంగితం ప్రదర్శించాలి. ఎన్నికల రాజకీయాల్లో తలపడటం వేరు. వ్యక్తులు, వ్యక్తిత్వం పట్ల అవహేళన చేయడం వేరనే విషయం తెలియకపోవడం…ఆయన్ను జాతి ఉద్ధారకుడిగా కొన్ని రాజకీయ పక్షాలు పరిగణించడమే విచారకరం. రాజకీయ అధికారం సాధించాలంటే… పరిణతి, ఓరిమి, స్తిమితత్వం అత్యావశ్యకం. అలాంటి లక్షణాలేమీ లేకుండా…ఆకతాయి బృందాలను పోగుచేసుకుని తగుదునమ్మా…అని బయలు దేరితే…అంతిమంగా మిగిలేది అభాసే. ఈ స్థాయి పరిపక్వత రాహుల్‌ ‌గాంధీలో ఆశించడం అత్యాశే కాదు అజ్ఞానం కూడా. ‘తుమ్మెద అత్యాసక్తితో రెల్లుపూవు తేనెతాగటానికి ప్రయత్నిస్తే అదెలా విఫలమవుతుందో…అలాగే సంస్కారం లేనివారి సార్థకత గజస్నానమని విభీషణుడు రావణుని హెచ్చరించినట్లు వాల్మీకి రామాయణంలోని యుద్ధకాండలో అంటారు. అందుకనే మన దేశంలోని విపక్ష పార్టీల నుంచి అత్యున్నతమైన పరిణతి, ఓరిమి, గాంభీర్యాన్ని ఆశించడం అలాంటిదే అవుతుంది.
ఏ దేశంలో అయినా…అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. విమర్శ, ప్రతివిమర్శల పర్వంలో కొన్నిసందర్భాల్లో స్తిమితత్వం కోల్పోవచ్చు. అయితే మన ఉద్వేగ క్షణాల్లో జరిగేది అయితే అర్థం చేసుకోవచ్చు. అంతే తప్ప…అవహేళన చేయడం కోసం ప్రత్యేకంగా కార్యక్రమాలను రూపొందించడంలో మన స్థాయి అర్థమవుతుంది. రాజకీయ విమర్శలో పరిధి-పరిమితి ఉండాలి. అనుచితమైన వ్యవహారాలు, పరుష పదజాలం వాంఛనీయం కాదు. అది రాజకీయ భవిష్యత్తుకు ఏ మాత్రం ఉపకరించదు, సరికదా…అప్రతిష్ఠ తెస్తుంది.
ఇటీవలి కాలంలో భారతదేశ రాజకీయాల్లో అనేక అనారోగ్య పరిణామాలు ప్రస్ఫుటమవుతున్నాయి. వెకిలితనం, వెటకారం, మితిమీరిన వ్యంగ్యం…అంతకు మించిన అవహేళన పెచ్చుమీరుతున్నాయి. విపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ అందుకు అతీతుడేమీ కాదు. కాకపోతే..అధికార పీఠంపై గురిపెట్టినప్పుడు కాస్తంత మాట పెళుసుతనాన్ని, అప్రస్తుత ప్రసంగాన్నీ తగ్గించుకోవాలి. అధికార రాజకీయాలకు ఏ మాత్రం ఉపయోగపడని కార్యక్రమాలను రూపొందించడం వల్ల రాహుల్‌ ‌గాంధీ సైతం ఒక స్టాండప్‌ ‌కమెడియన్‌ ‌గానే మిగిలిపోతారు.
ప్రధాని నరేంద్ర మోదీ పాతికేళ్ల సుదీర్ఘ ప్రజా జీవితమున్న ప్రజా ప్రతినిధి. 76 ఏళ్లు నిండిన తలపండిన రాజకీయ నేత. పుష్కర కాలంగా అనేక జాతీయ, అంతర్జాతీయ సంక్షోభాల మధ్య దేశాన్ని ముందుకు నడిపిస్తున్న నేత. అలాంటి వ్యక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆత్మసంస్కారం, వ్యక్తిత్వ పరిణతి తప్పనిసరి. రాజదండాన్ని ధరించడానికి చాలా చేవ కావాలి. అందుకు తగిన అనుభవాన్ని సంపాదించాలి. అంతే తప్ప..పిల్ల చేష్టలు చేయడం వల్ల తుపాకీ రాముడిగా మిగిలిపోయే ప్రమాదముంది.

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.