సంపాదకీయం
శాలివాహన 1948 శ్రీ పరాభవ భాద్రపద శుద్ధ దశమి – 21 సెప్టెంబర్ 2026, సోమవారం
అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్
భారతీయ ఆధ్యాత్మికత, హేతుబద్ధత వేర్వేరు ఆలోచనా స్రవంతులు కావన్న సత్యాన్ని ప్రచారం చేసేందుకు ఆదిశంకరులు దేశమంతా తిరిగారు. ఎందరో ఉద్దండులు ఎదుర్కొన్నారు. తన ఆలోచనా బలంతో తర్కశక్తితో ఉద్దండులందరినీ ఓడించడమే కాదు, మార్చివేశాడు. వ్యక్తి, సమాజం, సాహిత్యం, జీవితం అన్నింటినీ ఏకసూత్రంగా బంధించే ఏకాత్మ సందేశాన్ని అమృతంగా అందించి అదృశ్యమయ్యాడు. ‘ఏకమ్ సత్ విప్రాః బహుధా వదన్తి’ అనే సత్యంతో ప్రపంచానికి శాంతినివ్వాలన్నదే భారత్ ధ్యేయం. తరతరాలుగా దానినే పాటిస్తూ వచ్చిన భారత్, ప్రపంచంలోని అనేక దేశాల మధ్య విభేదాలు, ఆర్థిక ప్రయోజనాల సంఘర్షణ, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నవేళ బ్రిక్స్ దేశాల సదస్సులో న్యూఢిల్లీ డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయం సాధించడం ప్రపంచాన్ని విస్మయ పరిచింది. ఇది ప్రపంచ స్థాయిలో భారత్‌కు లభించిన గొప్ప విజయంగా భావించవచ్చు.
అగ్రరాజ్యమని అమెరికా విర్రవీగుతూ విధిస్తున్న సుంకాలు, ఆర్థిక ఒత్తిళ్లు, సభ్య దేశాల మధ్య ఉన్న భిన్నాభిప్రాయాల నేపథ్యంలో ఈ డిక్లరేషన్‌ను ఏకగ్రీవంగా ఆమోదితం చేయడం అంత తేలికైన విషయం కాదు. ముఖ్యంగా సౌదీ అరేబియా, ఇరాన్, ఈజిప్ట్ వంటి పరస్పర విరుద్ధ ప్రయోజనాలున్న దేశాలను ఒకే వేదికపైకి తీసుకొని రావడం ద్వారా భారత్ దౌత్య నైపుణ్యాన్ని చాటుకుంటున్నది. ముఖ్యంగా గ్లోబల్ సౌత్‌లోని అందరినీ కూడగట్టుకుంటూనే, తాము పాశ్చాత్య దేశాలకు వ్యతిరేకం కాదని స్పష్టం చేయడం భారత దౌత్యంలోని చమక్కు.
2023లో జీ 20 అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన సమయంలోను మన దేశం ఇదే తరహా విజయాన్ని సాధించింది. ఉక్రెయిన్ యుద్ధంవలన అమెరికా, యÖరోపి యన్ దేశాలు` రష్యా మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నప్పటికీ భారత్ అందరి ఆమోదంతో ఏకాభిప్రాయ ప్రకటనను సాధించింది. ఇప్పుడు బ్రిక్స్ వేదికపైన అదే దౌత్యవ్యూహ విజయం పునరావృతమైంది. ఎలాంటి సమస్య పరిష్కారానికైన మొదటిమెట్టుగా ఉపయోగపడే చర్చలను విశ్వాసంతో కొనసాగిస్తూ అందరికీ ఆమోదయోగ్యం, ఆచరణీయమైన ఉమ్మడి అంశాలను గుర్తించడం భారత్ విదేశాంగ విధానంలో చాలా కీలకమైన అంశంగా చెప్పుకోవాలి.
స్వాతంత్య్రానంతరం దెబ్బతిన్న దౌత్యనీతి, అటల్‌బిహారీ వాజపేయి విదేశాంగ మంత్రిగా, ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మొగ్గతొడిగింది. నేడు అది వికసిస్తున్నది. వికసిత భారత్‌వైపు మనం అడుగులేయడమే ఇందుకు నిదర్శనం. ఉగ్రవాదంపై తన వైఖరిని స్పష్టంగా వెల్లడిస్తూ 2025 ఏప్రిల్ 22న పహెల్గావ్‌లో జరిగిన ఉగ్రదాడిని బ్రిక్స్ ఢిల్లీ డిక్లరేషన్ తీవ్రంగా ఖండించింది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ప్రమాదకరమేనని పేర్కొంటూ, ఉగ్రవాదులకు సురక్షిత స్థావరాలను ఏర్పాటుచేసి, ఆర్థిక సహాయం అందించే వారిపై చర్యలు తీసుకోవాలని, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ద్వంద్వ ప్రమాణాలను అంగీకరించబోమని డిక్లరేషన్ పిలుపునిచ్చింది. ముఖ్యంగా చైనా సహా బ్రిక్స్‌లోని అన్ని సభ్య దేశాలు ఈ ప్రకటనలో భాగస్వాములయ్యాయి. పహెల్గావ్ దాడిని ఖండించడం ద్వారా ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటానికి పరోక్షంగా మద్దతు ఇవ్వడం కీలకమైన దౌత్య సందేశం. ఉగ్రవాదంపై ఏకాభిప్రాయం సాధించడంలో భారతదేశం ముందడుగు వేసింది.
బ్రిక్స్‌లో చురుకైన భాగస్వామి దేశంగా, షాంఘై సహకార సంస్థలోను, క్వాడ్‌లోను సభ్యదేశంగా భారత్ అనేక అంతర్జాతీయ వేదికలపై కీలకపాత్ర పోషిస్తున్నది. భిన్నప్రయోజనాలు కలిగిన దేశాలతో సంభాషణ (సంవాదం) కొనసాగిస్తూ ప్రపంచ రాజకీయాల్లో సమతుల్యత సాధించేందుకు ప్రయత్నిస్తున్నది. అందరినీ కలుపుకుపోవడమే భారత్ దౌత్య విధానానికి ప్రతీక.
కానీ, ఈ విజయం కూర్చుని విశ్రాంతి తీసుకునే సమయం కాదు భారత్‌కి. ప్రకటనలపై సంతకాలు చేయడం తొలి అడుగు మాత్రమే. అందులో పేర్కొన్న నిర్ణయాలకు ఆచరణ రూపం తీసుకురావాలి. అదే అసలైన సవాలు. భారత్ తన జాతీయ ప్రయోజనాలను కాపాడుకుంటూనే ఉమ్మడి ప్రయోజనాల కోసం పనిచేయాలి. అభివృద్ధి చెందుతున్న దేశాల గొంతుకగా బ్రిక్స్‌ను బలోపేతం చేయడంలో నేతృత్వం వహించాలి. ప్రపంచానికి శాంతినివ్వాలంటే ఆర్థికబలం, సాంకేతిక సామర్థ్యం, దౌత్యపటిమతోపాటు విశ్వసనీయమైన కార్యాచరణ కూడా అవసరం.
న్యూఢిల్లీ డిక్లరేషన్ ద్వారా భారత్ ఏకాభిప్రాయ సాధనకు మార్గం చూపింది. ఆ డిక్లరేషన్‌లోని హామీలను కార్యరూపంలోకి తీసుకురావడం ఇపుడు బ్రిక్స్ సభ్యదేశాల బాధ్యత. సామÖహిక ప్రయోజనం, కలిసి పనిచేసే సామర్థ్యాన్ని చాటినపుడే బ్రిక్స్ మరింత శక్తిమంతమైన అంతర్జాతీయవేదికగా అవతరించగలదు.
చర్చ అనేది నాగరికుల భాష, కత్తి అనాగరికుల భాష అని పద్మవిభూషణ్ గ్రహీత పరమేశ్వరన్ అన్న మాటలు గమనార్హం. భారత్ ఎప్పుడూ మొదటి భాషను ఉపయోగించుకొంటుంది. తన సరిహద్దుల లోపల, బయట కూడా హృదయాలను గెలిచింది. పరస్పర విరుద్ధ ప్రయోజనాలు కలిగి, యుద్ధంలో పాల్గొంటున్న దేశాలు బ్రిక్స్ చర్చలోనేకాదు, వ్యక్తిగత స్థాయిలో కూడా చర్చల్లో పాల్గొనేలా చేయడం సాధారణ విజయం కాదు. పశ్చిమాసియాలో శాంతి పవనాలు వీచాలంటే ఇటువంటి చొరవలు మరిన్ని అవసరం.
ఆధ్యాత్మిక విషయాలలోనే కాదు, దైనందిన జీవితంలోని రాజకీయాలు, ఆర్థిక వ్యవహారాలు, సామాజిక, సాంస్కృతిక విషయాలలో కూడా మన పరంపరను గౌరవంగా ప్రపంచం ముందు నిలబెట్టిన మహనీయుల అడుగుజాడలను అనుసరించి ప్రపంచానికి వైరుధ్యంలేని శాంతిని ప్రసాదిద్దాం.