సంపాదకీయం
శాలివాహన 1948 శ్రీ పరాభవ కార్తీక శుద్ధ చతుర్దశి – 23 నవంబర్ 2026, సోమవారం
అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్
అదిగో బూచి అని బెదరించి తల్లులు తమ పిల్లల దృష్టి మరల్చుతుంటారు. సరిగ్గా అలాగే అదిగో మన ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ •×= లో లేని విషయాలను బూచిగా చూపి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. మరోవైపు ఇదే సమయంలో లౌకిక శక్తులను ఏకం చేయడానికి తాను ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసానని సోనియాగాంధీ నవంబర్ 17న విడుదలచేసిన ‘బిలాంగింగ్ – ఏ జర్నీ ఆఫ్ లవ్’ అనే పుస్తకంలో పేర్కొనడం విడ్డూరమేగాదు, మనలను ప్రక్కదోవ పట్టించడమే.
ఆమె చేసిన ఆ గొప్ప త్యాగమేమిటి?1999 ఏప్రిల్ 17న పార్లమెంటులో నాటి ప్రధానమంత్రి అటల్‌బిహారి వాజపేయి ప్రభుత్వం ధర్మ పోరాటంలో భాగంగా విశ్వాస పరీక్ష నెదుర్కొంటోంది. ఆ సమయంలో తన పార్లమెంటు సభ్యత్వానికి ఇంకా రాజీనామా సమర్పించని నాటి ఒరిస్సా ముఖ్యమంత్రి గిరిధర్ గోమాంగోతో ఎన్‌డిఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటువేయించింది కాంగ్రెస్ అధినేత్రి. దానివలన విపక్షానికి 270, ఎన్‌డీఏకి 269 ఓట్లు వచ్చాయి. గిరిధర్ గోమాంగో ఎంపీకి రాజీనామా చేయలేదనే సాంకేతిక కారణంతో ఓటు వేసి విమర్శలను ఎదుర్కొన్నాడు. ఆ సమయంలో వాజ్‌పేయి అనుకొని ఉంటే ఒక ఓటు కొనగలిగేవారు. కాని ఆనాడు రాముడు ధర్మానికి కట్టుబడి మౌనంగా వనవాసానికేగిన అంశాన్ని ఆదర్శంగా స్వీకరించి నేరుగా రాష్ట్రపతిభవన్‌కు వెళ్లి రాజీనామా సమర్పించారు. వాస్తవానికి కాంగ్రెస్ దగ్గర బలం లేదు. ములాయం యూపీఏకి సమర్ధన తెలపడానికి అంగీకరించ లేదు. అయినప్పటికీ ఇదే అదనుగా సోనియాగాంధీ రాష్ట్రపతిని కలిసి కాంగ్రెస్ కూటమికి 272 మంది బలం ఉందని నమ్మించి ప్రధాని కావాలని ఆశించారు. ఇంతలో ప్రతిపక్ష నేతగా తనను సంప్రదించకుండా రాష్ట్రపతిని కలిసినందుకు కినుక వహించిన శరద్‌పవార్, పిఎం సంగ్మా, తారిక్ అన్వర్ వంటి బలమైన నేతలు ఆమె విదేశీ మూలాల అంశాన్ని లేవనెత్తి ఆమెను ప్రధానమంత్రి కానివ్వకుండా అడ్డుపడ్డారు. 2004లో యూపిఏ స్పష్టమైన మెజార్టీ సాధించినప్పటికి ఆ పదవిని ఎందుకు వదులుకొన్నట్లు? 1999లో శరద్‌పవార్ మొదలైనవారు లేవనెత్తిన సోనియాగాంధీ విదేశీ మూలాల అంశాన్ని తిరిగి 2004లో సుష్మాస్వరాజ్, ఉమాభారతి వంటి దిగ్గజ నేతలు తీవ్రంగా ప్రచారం చేయడంతో అది ఇంకా బలపడింది. దాంతోపాటు సుబ్రహ్మణ్య స్వామి నేరుగా రాష్ట్రపతి అబ్దుల్‌కలామ్‌ను కలిసి ఆమె పౌరసత్వంపై ఫిర్యాదు చేశాడు. దాంతో ఆమె ఆశలు అడియాసలయ్యాయి. ఇది చారిత్రక వాస్తవం.
అయితే ఇలాంటి పరిస్థితుల్లో తాను ప్రధాని అయితే ప్రభుత్వం తీవ్ర ఇబ్బందుల్లో పడే ప్రమాదముందని, ప్రభుత్వ మనుగడ భయంతో ఆమె వెనక్కి తగ్గారు తప్ప- ఆ పదవిపై వ్యామోహం లేక కాదు. ఇది త్యాగం ఎలా అవుతుంది? అంతేగాదు, ఆ పదవిపై వ్యామోహం వదులుకోకపోతే స్వాతంత్య్రం వచ్చాక ఎన్నడూ లేని విధంగా రాజ్యాంగ వ్యతిరేకమైన ప్రధానమంత్రి జాతీయ సలహామండలి (చీ) ని ఏర్పరచి, ప్రభుత్వ చర్యలకు ఏ మాత్రం బాధ్యత వహించకుండా, అదే సమయంలో ప్రభుత్వంపై పూర్తి నియంత్రణ కలిగి ఉండేటట్లు జాతీయ సలహామండలికి చైర్‌పర్సన్‌గా, సూపర్ ప్రధానిగా అధికారాన్ని పరోక్షంగా చెలాయించిన సంగతి ప్రజలు ఇంకా మరచిపోలేదు.
1999లో వాజ్‌పేయిప్రభుత్వంపై అవిశ్వాసతీర్మానం ప్రవేశపెట్టడానికి తగిన సంఖ్యాబలం లేకపోయినా పార్లమెంటు సంప్రదాయాలను ప్రక్కనపెట్టి 272 మంది మద్దతున్నారనేది ప్రధానిపదవి అనే అధికార దాహానికి నిదర్శనం కాదా?
అసలు ఆ పుస్తకంలో తన ప్రేమకథ గురించి రాయకుండా రాజకీయ అంశాలకే ప్రాధాన్యతనిచ్చినట్లుంది. దీనినిబట్టి పుస్తకం పేరు ఒకటి, అందులో ఉన్న అంశం మరొకటి అని తేటతెల్లమవుతుంది. 10 సంవత్సరాల ముందే ఈ పుస్తకం వ్రాస్తున్నట్లు ప్రకటించారు. ఉన్నట్టుండి పుస్తకం తయారుకాలేదు. ఎంతో ముందు నుంచి రాస్తున్న ఈ పుస్తకంలో పొందుపరిచిన అనేక సంఘటనలు చారిత్రక వాస్తవాలకు దూరంగా ఉన్నాయి. అనేక తప్పులున్నాయి. ఉదాహరణకు 1994లో నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవడానికి రాష్ట్రపతి ఆర్ కె నారాయణ వెళ్లాడని పుస్తకంలో రాశారు. కానీ ఈయన రచయిత మాత్రమే. అలాగే నాడు ఉప రాష్ట్రపతిగా కెఆర్ నారాయణన్ ఉన్నారు. రాష్ట్రపతి శంకర్‌దయాళ్ శర్మ.
కార్గిల్‌లో పాకిస్తాన్ సైనికుల చొరబాటును గమనించిన తాషీమ్ నామ్ గ్యార్ అనే భారతదేశానికి చెందిన గొర్రెల కాపరి మన సైనికాధికారులకు విషయం తెలియజేసిన తరువాతనే పాకిస్తాన్ మీద అధిక ప్రేమను కనబరుస్తూ వాజపేయి నవాజ్‌షరీఫ్‌ను కలవడానికి వెళ్లాడని వాజపేయిని తక్కువచేసి చూపే విధంగా ఇందులో లిఖించారు. వాస్తవానికి 1999 ఫిబ్రవరిలో వాజపేయి పాకిస్తాన్ వెళ్లారు. కానీ గొర్రెల కాపరి ద్వారా పాకిస్తాన్ సైనికులు చొరబడుతున్న విషయం మూడు నెలల తరువాత 1999 మే నెలలో మనకు సమాచారం అందింది.
ఇంకా ఎమర్జెన్సీని సమర్థించడం, కాంగ్రెస్ విధేయులైన అహ్మద్‌పటేల్ మరణం తేదీని తప్పుగా చూపించడం, ప్రణబ్‌ముఖర్జీ వ్యక్తిత్వాన్ని చిన్నబుచ్చే విధంగా వర్ణించడం మొదలైన అవాస్తవాలు ఎన్నో ఈ పుస్తకంలో చోటు చేసుకున్నాయి.
సోనియాగాంధీ తన ఆత్మకథలో చెప్పిన విషయాలను పాఠకులు ప్రశ్నించే హక్కు కలిగి ఉన్నారు. అబద్ధాల ద్వారా నిజాన్ని కప్పిపుచ్చలేరు. మౌనంతో ప్రశ్నలను సమాధి చేయలేరు. స్వీయ సమర్ధనలతో చరిత్రను మార్చలేరు. చివరకు నిలిచేది వ్యక్తులు రాసుకున్న కథనం కాదు… కాలం నిర్ధారించిన సత్యం మాత్రమే.
