పశ్చిమాసియాలో ఇరాన్‌, ఇ‌జ్రాయెల్‌, అమెరికా దేశాల మధ్య కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం దేశ వ్యవసాయ రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి. భౌతికంగా యుద్ధం పశ్చిమ దేశాల్లో జరుగుతున్నప్పటికీ, దాని ఆర్థిక ప్రకంపనలు ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల రైతుల పాలిట శాపంగా మారుతున్నాయి. భారతీయ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు ప్రధాన కేంద్రమైన గల్ఫ్, ‌పశ్చిమాసియా మార్కెట్ల రవాణా మార్గాలు మూసుకుపోవడంతో వేలాది కోట్ల రూపాయల వ్యాపారం నిలిచిపోయి, రైతులు, ఎగుమతిదారులు తీవ్ర ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నారు.

మనదేశం నుంచి పశ్చిమాసియా దేశాలకు గతేడాది ఏకంగా రూ.1,08,898 కోట్ల విలువైన ఆహారోత్పత్తులు ఎగుమతి అయ్యాయి. ఇది మన దేశ మొత్తం వ్యవసాయ ఎగుమతుల్లో ఐదో వంతుకు పైమాటే. ఇందులో కేవలం బియ్యం ఎగుమతుల విలువే రూ.40,876 కోట్లు. ఈ బియ్యం ప్రధానంగా ఆంధప్రదేశ్‌, ‌తెలంగాణతో పాటు హరియాణా, కర్ణాటక, పంజాబ్‌, ‌మహారాష్ట్రల నుంచి ఎగుమతి అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా భారత్‌ ‌నుంచి ఎగుమతి అయ్యే బియ్యంలో ఇది 36.7 శాతం. అయితే, ఈ ఎగుమతి, దిగుమతుల రవాణాకు అత్యంత కీలకమైన ‘హోర్ముజ్‌ ‌జలసంధి’ యుద్ధ భయాల కారణంగా మూతబడటం లేదా అత్యంత ప్రమాదకరంగా మారడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. సాధారణ రోజుల్లో చెన్నై, కాకినాడ, విశాఖ, ముంబై, ముంద్రా వంటి ప్రధాన రేవుల నుంచి గల్ఫ్ ‌దేశాలకు (యూఏఈ, సౌదీ అరేబియా, ఒమన్‌, ‌కువైట్‌) ‌రోజూ 2500 నుంచి 3000 కంటెయినర్ల ఆహార ఉత్పత్తులు ఎగుమతి అయ్యేవి. ఇందులో 25% వాటా త్వరగా పాడయ్యే గుడ్లు, పండ్లు, కూరగాయలు, మాంసం (పెరిషబుల్‌ ‌గూడ్స్) ఉత్పత్తులదే. సముద్ర మార్గంలో దాడుల భయంతో ప్రస్తుతం ఈ కంటెయినర్ల సంఖ్య 1200 – 1500కు పరిమిత మైంది.అంటే ఎగుమతులు 40-50 శాతం క్షీణించాయి. సుమారు 4 లక్షల టన్నుల బాస్మతి బియ్యం ఓడరేవుల్లోనే నిలిచిపోయాయి. ఆంధప్రదేశ్‌ ‌లోని కాకినాడ, చెన్నై, కృష్ణపట్నం ఓడరేవుల నుంచి వెళ్లాల్సిన చేపలు, రొయ్యలతో పాటు సుమారు 3 లక్షల టన్నుల బియ్యం మార్గమధ్యంలోనే ఆగిపోయాయి. నాసిక్‌ ‌నుంచి దుబాయ్‌కి వెళ్లాల్సిన 800 కంటెయినర్ల ద్రాక్ష (సుమారు 10 వేల టన్నులు) రేవుల్లోనే ఉంది. ఉల్లిపాయలు, అరటిపండ్లు నింపిన 300 ఏసీ కంటెయినర్లు, ఒక్కో పోర్టులో 10 వేల టన్నుల ఇతర పండ్లు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ముంబయి, గుజరాత్‌, ‌చెన్నై పోర్టుల నుంచి వెళ్లాల్సిన సుగంధ ద్రవ్యాల పరిస్థితి కూడా ఇదే.
అరటి రైతులకు యుద్ధ సెగ
ఆంధప్రదేశ్‌లో సుమారు 70 వేల హెక్టార్లకు పైగా అరటి సాగువుతోంది. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి, ప్రకాశం, అనంతపురం, చిత్తూరు, కర్నూలు జిల్లాల రైతులు దీనిని ప్రధాన నగదు పంటగా సాగు చేస్తున్నారు. యూఏఈ, ఖతార్‌, ‌సౌదీ అరేబియా, ఇరాన్‌, ఇరాక్‌లో రంజాన్‌ ‌మాసంలో జి9, రోబస్టా రకం అరటికి అత్యంత డిమాండ్‌ ఉం‌టుంది. కానీ యుద్ధ ఉద్రిక్తతల వల్ల ఎగుమతులపై అనిశ్చితి నెలకొనడంతో వ్యాపారులు కొనుగోలు ధరలను అమాంతం తగ్గించేశారు. ఫిబ్రవరిలో టన్నుకు రూ.25 వేలు అరటి ధర, ఇప్పుడు స్థానిక మార్కెట్లలో రూ.16 వేలకు పడిపోయింది. ఎరువుల ధరలు, రవాణా ఖర్చులు, కార్మికుల కొరతతో సతమత మవుతున్న రైతులకు ఈ • ధరల పతనం చావుదెబ్బగా మారింది.
కుదేలైన కోనసీమ కొబ్బరి మార్కెట్‌
ఆం‌ధప్రదేశ్‌లో డాక్టర్‌ ‌బీఆర్‌ అం‌బేద్కర్‌ ‌కోనసీమ, ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లో దాదాపు 1.1 లక్షల హెక్టార్లలో కొబ్బరి సాగు జరుగుతోంది. రంజాన్‌ ‌మాసంలో దుబాయ్‌, ‌కువైట్‌, ఒమన్‌, ‌సౌదీ అరేబియా లాంటి దేశాలకు ఇక్కడి నుంచి కొబ్బరికాయలు భారీగా ఎగుమతి అవుతాయి. కానీ, ముంబయి, చెన్నై, తూత్తుకుడి పోర్టుల్లో కంటెయినర్లు నిలిచి పోవడం, షిప్పింగ్‌ ‌షెడ్యూళ్లు రద్దు కావడంతో స్థానిక మార్కెట్లో కొబ్బరికాయల సరఫరా విపరీతంగా పెరిగిపోయింది. నెల క్రితం వెయ్యి కొబ్బరి కాయల ధర రూ.18,000 – 20,000 వరకు ఉండగా, ప్రస్తుతం అది రూ.13,000 – 14,000కు పడిపోయింది (దాదాపు 30% క్షీణత). మార్కెట్లో రిటైల్‌ ‌ధర రూ.50 నుంచి రూ.30 కి పడిపోవడం వల్ల వినియోగ దారులకు లాభం చేకూరినా, రైతులు మాత్రం శివరాత్రి, ఉగాది, శ్రీరామనవమి పండుగలపై పెట్టుకున్న ఆశలన్నీ అడియాశ లయ్యాయి. నిల్వ ఉంచితే సరకు పాడయ్యే ప్రమాదం ఉండటంతో తక్కువ ధరకే అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.
నిలిచిపోయిన మామిడి గుజ్జు
అమెరికా, ఇరాన్‌ ఉ‌ద్రిక్తతల కారణంగా మధ్యప్రాచ్య ప్రాంతానికి ఆంధప్రదేశ్‌ ‌నుంచి జరిగే మామిడి గుజ్జు ఎగుమతులు ఒక్కసారిగా నిలిచి పోయాయి. రాష్ట్రంలో మామిడి గుజ్జు ఉత్పత్తి చిత్తూరు జిల్లాలో కేంద్రీకృతం అయింది. ప్రస్తుతం మామిడి సీజన్‌ ‌ప్రారంభ దశలో ఉండగా, తాజా పరిస్థితి రైతులు, పరిశ్రమల యజమానులను ఆందోళనకు గురి చేస్తోంది. రష్యా, ఉక్రెయిన్‌ ‌యుద్ధం కారణంగా గతేడాది మామిడి గుజ్జు (పల్ప్) ఎగుమతులు ఆగిపోయాయి. కిలో మామిడి నాలుగు రూపాయలు కూడా పలక లేదు. ఈ సంవత్సరం మామిడి గుజ్జు ఎగుమతులు ప్రారంభమై సగం పల్ప్ ఎగుమతి అయింది. ఇంతలో అమెరికా-ఇరాన్‌ ‌యుద్ధం రావడంతో పల్ప్ ఎగుమతులు పూర్తిగా ఆగిపోయాయి. క్రషింగ్‌ ‌సీజన్‌ ‌ప్రారంభమయ్యే లోపు ఈ పల్ప్ ఎగుమతులు పూర్తికాకుంటే, ఈసారి కూడా మామిడి రైతులకు కష్టాలు తప్పవని వ్యవసాయ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో ప్రధానంగా పండే తోతాపురి రకం మామిడి గుజ్జుకు గల్ఫ్ ‌దేశాల్లో మంచి డిమాండ్‌ ఉం‌టుంది. ఏటా మార్చి చివరి వారంలోనే మధ్యప్రాచ్య దేశాల నుంచి కొనుగోలు ఒప్పందాలు జరుగుతాయి. ఈసారి ఇరాన్‌ ‌యుద్ధ పరిస్థితుల ప్రభావంతో సముద్ర మార్గంలో నౌక రవాణాపై అనిశ్చితి నెలకొంది. ఫలితంగా దిగుమతి దారులు ఇప్పటికే కుదుర్చుకున్న సరుకు పంపిణీ ఒప్పందాలను తాత్కాలికంగా రద్దుచేస్తున్నట్లు పరిశ్రమల యజమానులు పేర్కొంటున్నారు.
జిల్లాలో ప్రస్తుతం 47 మామిడి గుజ్జు తయారీ పరిశ్రమలు ఉన్నాయి. గతేడాది నాలుగు లక్షల టన్నుల మామిడికాయలను ప్రాసెస్‌ ‌చేశారు. రెండు లక్షల టన్నుల పల్ప్ ‌ను ఉత్పత్తి చేశారు. వేసవి కావడంతో ఉత్పత్తి చేసిన గుజ్జు నిల్వల ఎగుమతులు ఇప్పుడిప్పుడే ప్రారంభ మయ్యాయి. లక్ష టన్నుల వరకు ఎగుమతి జరిగింది. ఈ సమయంలో యుద్ధం కారణంగా ఎగుమతులు ఆగిపోయాయి. హోర్ముజ్‌ ‌జలసంధి ప్రాంతంలో నౌకల రవాణాకు అంతరాయం ఏర్పడటం వల్ల సౌదీ అరేబియా, ఒమన్‌, ‌యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్ ‌వంటి గల్ఫ్ ‌దేశాలకు ఎగుమతులు నిలిచిపోయాయి. ప్రస్తుతం లక్ష టన్నులకు పైగా మామిడి గుజ్జు నిల్వగా ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
ఆక్వా ఉత్పత్తులపై ప్రభావం
అమెరికా, ఇరాన్‌, ఇ‌జ్రాయెల్‌ ‌మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఆంధప్రదేశ్‌ ఆక్వా రంగాన్ని నిలువునా ముంచేస్తున్నాయి. గల్ఫ్, ‌యూరప్‌ ‌దేశాలకు వెళ్లాల్సిన సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు అమాంతం ఆగిపోయాయి. తాజా నివేదికల ప్రకారం.. సుమారు 300 మిలియన్‌ ‌డాలర్ల విలువైన ‘సీ ఫుడ్‌’ ‌కంటైనర్లు వివిధ పోర్టుల్లో నిలిచిపోయాయి. ఈ భారీ నష్టంలో దాదాపు 60 శాతం వాటా ఒక్క ఆంధప్రదేశ్‌దే కావడం ఆందోళనకరం. విశాఖపట్నం, ముంబై పోర్టుల నుంచి గల్ఫ్ ‌దేశాలకు వెళ్లాల్సిన రొయ్యలు, చేపల కంటైనర్లు కదలడం లేదు. ఎర్ర సముద్రం, స్ట్రెయిట్‌ ఆఫ్‌ ‌హార్ముజ్‌ ‌మార్గాల్లో దాడుల భయంతో షిప్పింగ్‌ ‌నిలిచిపోయింది. ఒకవైపు ఎగుమతులు ఆగిపోతుంటే.. మరోవైపు షిప్పింగ్‌ ‌కంపెనీలు చార్జీలను రెట్టింపు చేశాయి. ఒక్కో కంటైనర్‌పై 1500 నుండి 4000 డాలర్ల వరకు ఎమర్జెన్సీ సర్‌చార్జీలు వసూలు చేస్తున్నాయి. ముఖ్యంగా రొయ్యలు పాడవకుండా ఉంచే రిఫ్రిజిరేటెడ్‌ ‌కంటైనర్ల అద్దెలు విపరీతంగా పెరిగిపోయాయి. ‘‘అమెరికా టారిఫ్‌ల దెబ్బ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో.. ఈ యుద్ధం మా వెన్ను విరిచింది’’ అని సీ ఫుడ్‌ ఎగుమతిదారుల సంఘ తెలిపింది. కోల్డ్ ‌స్టోరేజీలు నిండిపోవడంతో, స్థానిక మార్కెట్‌లో వ్యాపారులు కొనుగోళ్లు నిలిపివేశారు. దీనివల్ల పల్లెల్లో రొయ్యల ధరలు దారుణంగా పడిపోయే ప్రమాదం కనిపిస్తోంది.
పౌల్ట్రీ రంగంపై మోయలేని భారం
దేశంలో గుడ్ల ఉత్పత్తిలో ఆంధప్రదేశ్‌ అ‌గ్రస్థానంలో ఉంది. జాతీయ ఉత్పత్తిలో 18 శాతం వాటాతో, రాష్ట్రంలో రోజుకు 5 కోట్లకు పైగా గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి (ముఖ్యంగా ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో). అయితే, యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో సరఫరా గొలుసు దెబ్బతిని, కోళ్ల పెంపకానికి అత్యంత కీలకమైన మొక్కజొన్న, సోయాబీన్‌ (‌ఫీడ్‌) ‌ధరలు 20 నుంచి 30 శాతం పెరిగాయి. పౌల్ట్రీ ఉత్పత్తి వ్యయంలో 70 శాతం ఫీడ్‌ ‌కే ఖర్చవుతుంది. రవాణా ఖర్చులు పెరగడం, ఫీడ్‌ ‌ధరలు ఆకాశాన్నంటడంతో లాభాలు లేక చిన్న, మధ్య తరహా రైతులు కోళ్ల సంఖ్యను తగ్గించుకుంటు న్నారు. కొత్త బ్యాచ్‌లు వేయడానికి వెనుకంజ వేస్తున్నారు. ఇది భవిష్యత్తులో గుడ్లు, మాంసం కొరతకు దారి తీసే ప్రమాదం ఉంది.
బియ్యం, ఇతర ఉత్పత్తులపై అనిశ్చితి
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సీజన్‌ ‌ధాన్యం మార్కెట్లోకి భారీగా వస్తున్న సమయంలో ఎగుమతులు స్తంభించడం మిల్లర్లలో, రైతుల్లో ఆందోళన పెంచు తోంది. చెన్నై, విశాఖ, కాకినాడ పోర్టుల నుంచి ధాన్యం పశ్చిమ ఆఫ్రికా (నైజీరియా, బెనిన్‌, ‌టోగో), తుర్కియే, గల్ఫ్ ‌దేశాలకు వెళ్లే ఎగుమతులు ఆగి పోయాయి. ఈ నెల ప్రారంభంలో గల పుట్టి (850 కిలోలు) ధాన్యం ధర రూ.22,500 ఉండగా అది రూ.21,000 కి పడిపోయింది, ఇది మరింత తగ్గే అవకాశం ఉందని అంచనా. వీటితో పాటు ఏటా గల్ఫ్ ‌దేశాలకు వెళ్లే మామిడిపండ్లు, మామిడి పచ్చళ్లు, బత్తాయి, నిమ్మ, మిర్చి, పసుపు, చిరుధాన్యాల ఆర్డర్లు కూడా సందిగ్ధంలో పడ్డాయి.

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE