రాష్ట్ర ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అంచనాలు గత యేడాది కంటే పెరిగాయి. అయితే పైకి ఈ అంకెలు ఆకర్షణీయంగా కనిపిస్తున్నా ఈ బడ్జెట్‌ ‌వెనక దాగిన ఆర్థిక వాస్తవాలు మాత్రం అత్యంత ఆందోళనకరంగా ఉన్నాయని ప్రతిపక్షాల నాయకులు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను మార్చి 20న ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో, శాసనసభ వ్యవహారాల మంత్రి డి.శ్రీధరబాబు శాసనమండలిలో ప్రవేశపెట్టారు. మొత్తం రూ. 3,24,234 కోట్ల పద్దులో రెవెన్యూ వ్యయం కోసం ఏకంగా రూ. 2,34,406 కోట్లు, మూలధన వ్యయం కోసం రూ. 47,267 కోట్లు కేటాయించారు.
విద్య, మానవ వనరులకు రూ.26,674 కోట్లు, వ్యవసాయ శాఖకు రూ.23,179 కోట్లు, వైద్య ఆరోగ్య శాఖకు రూ.13,679 కోట్లు, విద్యుత్‌ ‌శాఖకు రూ.21,285 కోట్లు, పౌర సరఫరాల శాఖకు రూ.7,366 కోట్లు, పశుసంవర్ధక శాఖకు రూ.1,529 కోట్లు కేటాయించారు. కార్మిక సంక్షేమానికి రూ.999 కోట్లు, మహిళా శిశు సంక్షేమానికి రూ.3,143 కోట్లు, ఎస్సీ సంక్షేమానికి రూ.11,784 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి – రూ.7,937కోట్లు, బీసీ సంక్షేమానికి రూ.12,511 కోట్లు, మైనారిటీ సంక్షేమానికి రూ.3,769 కోట్లు కేటాయించారు. గృహ నిర్మాణశాఖకు రూ.7,430 కోట్లు, ఐటీ శాఖకు రూ.875 కోట్లు, పరిశ్రమల శాఖకు రూ.3,490 కోట్లు, చేనేతశాఖకు రూ.258 కోట్లు, పంచాయతీ రాజ్‌, ‌గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.33,688 కోట్లు, సాగునీటి ప్రాజెక్టులకు రూ.22,615 కోట్లు, రవాణా శాఖకు రూ.12,759 కోట్లు, న్యాయ శాఖకు రూ.2,367 కోట్లు పట్టణాభి వృద్ధి, పురపాలక శాఖకు రూ.17,907 కోట్లు, పర్యాటక శాఖకు రూ.1,224 కోట్లు ప్రతిపాదిం చారు. అదే విధంగా శాంతి భద్రతలకు రూ.11,907 కోట్లు, గోదావరి పుష్కరాలకు రూ.500 కోట్లు, కేటాయించారు. పథకాల వారీగా చూస్తే… మహాలక్ష్మి పథకానికి రూ.4,305 కోట్లు, చేయూత పథకానికి రూ.14,861 కోట్లు, ఇందిరమ్మ ఇళ్ల పథకానికి రూ.5,500 కోట్లు, రాజీవ్‌ ‌యువ వికాసం పథకానికి రూ.6వేల కోట్లు కేటాయింపులు జరిగాయి. అలాగే, పశుసంవర్ధక శాఖకు రూ.1,529 కోట్లు, వ్యవసాయ శాఖకు రూ. 23,179 కోట్లు కేటాయిం చారు.
కాంగ్రెస్‌ ‌తమ ఎన్నికల మానిఫెస్టోలో ప్రకటించిన పలు పథకాలు, కార్యక్ర మాలు ఇప్పటికీ పూర్తి స్థాయిలో అమలు కావడంలేదు. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఇప్పుడు మరో కొత్త పథకాన్ని బడ్జెట్‌ ‌ప్రసంగంలో ప్రకటిం చారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్స వాన్ని పురస్కరించు కొని ఈ జూన్‌ 2‌వ తేదీ నుంచి ఇందిరమ్మ కుటుంబ భీమా పథకం అమలు చేయనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ కాలేజీల్లోని ఇంటర్మీడియట్‌ ‌విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని వర్తింపజేస్తామని, ఐటీఐ విద్యార్థులకు నెలకు రూ.2,000 చొప్పున ఉపకార వేతనం అందించనున్నట్లు ప్రకటించారు. అమలు కాని పాత పథకాలకు తోడు.. కొత్తవిబ ఎలా అమలవుతాయో, ఎప్పటి నుంచి ప్రారంభ మవుతాయో అన్న చర్చ అప్పుడే మొదలయ్యింది.
క్లిష్టంగా ఆర్థిక పరిస్థితి
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత గడ్డు స్థితిలో ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యమంత్రే బహిరంగంగా చేసిన ప్రసంగాలు, వ్యాఖ్యలను ఉటంకిస్తున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ ‌లెక్కల ప్రకారం రాష్ట్ర ఆర్థిక లోటు రూ. లక్షల కోట్లలో ఉంది. అభివృద్ధి పనులు, సంక్షేమ పథకా లను కొనసాగించడం కోసం ప్రభుత్వం అనివార్యంగా కొత్తగా అప్పులు చేయాల్సి వస్తోందని మంత్రులు, అధికారులే చెబుతున్నారు. ఇప్పుడు బడ్జెట్‌లో చేర్చిన వ్యయాల కోసం కూడా మళ్లీ భారీగా అప్పులు తీసుకోవాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.
అప్పుల మీదనే ప్రభుత్వం ఆధారపడ్డట్లు ఈ బడ్జెట్‌తో స్పష్టమవుతోందని ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. విద్యాశాఖకు 15 శాతం నిధులు ఇస్తామన్న ప్రభుత్వం చెబుతున్నా గత మూడు బడ్జెట్లలో ఆ మేరకు కేటాయించలేదని విమర్శిస్తున్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. ‌రాంచందర్‌రావు ఈ బడ్జెట్‌ను ‘ఫెయిల్డ్ ‌బడ్జెట్‌’‌గా అభివర్ణించారు. రైతులకు బకాయిలు చెల్లించకపోవడం, విద్యకు సరిపడా నిధులు కేటాయించకపోవడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్‌ను ‘నంబర్‌ ‌గారడీ’ అని ఆరోపించారు. బీసీ సబ్‌ ‌ప్లాన్‌ ఊసే లేదని, బడ్జెట్లో బీసీలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. సామాజిక న్యాయమని గొంతు చించుకునే కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం బడ్జెట్‌లో వెనుకబడిన తరగతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఇది హాట్రిక్‌ ‌చీటింగ్‌ ‌బడ్జెట్‌, ఊహా జనిత బడ్జెట్‌ అని, హామీల అమలు ప్రస్తావన లేదని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్‌ ‌రెడ్డి విమర్శించారు. ఆరు గ్యారెంటీలకు కేటాయింపులు లేవని, మైనార్టీలకు బడ్జెట్‌లో మొండిచేయి చూపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన రెండున్న రేళ్లలోనే రూ.3.5 లక్షల కోట్లు అప్పు తెచ్చిందని, ఆ తెచ్చిన అప్పులు దేనికి ఖర్చు చేశారని ప్రశ్నించారు.
2023 ఎన్నికల సమయంలో రేవంత్‌ ‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఆరు గ్యారెంటీల పేరుతో మేనిఫెస్టో విడుదల చేశారు. హామీలు గుప్పించారు. మహాలక్ష్మి, రైతు భరోసా, చేయూత, గృహజ్యోతి, రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు వాటిలో ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే, ఇప్పటికే రెండున్నరేళ్లు గడిచిపోయినా, ఆ హామీలు పూర్తిగా అమలు కావడం లేదు. కొన్ని మాత్రం అమలవుతున్నా.. పూర్తి హామీల అమలు ప్రశ్నార్థకంగానే కనిపిస్తోంది.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇప్పటికే ఆందోళనకరంగా ఉంది. ఈ బడ్జెట్‌ ‌గణాంకాలను పరిశీలిస్తే, రాష్ట్రం వేగంగా అప్పుల ఊబిలో కూరుకుపోతున్న విషయం అర్థమవుతోంది. వచ్చే ఏడాది మార్చి నాటికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు రూ. 8.64 లక్షల కోట్లకు చేరనున్నాయి. ఇందులో ప్రభుత్వం నేరుగా ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలో చేసిన అప్పులు రూ. 5.62 లక్షల కోట్లు కాగా.. గ్యారంటీలు, కార్పొరేషన్ల బాకీలు కలిపి మరో రూ. 3.01 లక్షల కోట్లుగా ఉంటాయి. రాష్ట్రంలో ఒక్కొక్కరిపై రూ.2.46 లక్షల అప్పు ఉంది. ఒకవైపు సంక్షేమ పథకాల అమలుకు నిధుల వేట కొనసాగిస్తూనే, మరోవైపు పాత అప్పులకు వడ్డీలు, అసలు కట్టాల్సి రావడం రాష్ట్ర ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారింది.
వచ్చే ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి సర్కారు ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోని నేరుగా చేసే అప్పులే రూ. 5,62,363 కోట్లకు చేరుకుంటాయి. ఇది రాష్ట్ర జీఎస్‌డీపీలో ఏకంగా 29 శాతం కావడం గమనార్హం. సాధారణంగా ఈ మొత్తం 25 శాతంలోపే ఉండాలి. 2023-24లో 27 శాతంగా ఉన్న ఈ అప్పుల శాతం, కేవలం మూడేళ్లలో 29 శాతానికి పెరగడం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారు తుందనడానికి నిదర్శనమని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన భారీ అప్పులకు తోడు ప్రస్తుత ప్రభుత్వం కూడా ప్రతి ఏటా కొత్తగా అప్పులు చేయక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. కేవలం వచ్చే సంవత్సరంలోనే బహిరంగ మార్కెట్‌ ‌నుంచి రూ. 73,383 కోట్ల రుణాలను సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది కాకుండా కేంద్రం నుంచి రూ.5,500 కోట్లు, ఇతర రుణాలు రూ. వెయ్యి కోట్లు, ఇతర డిపాజిట్లు, అడ్వాన్స్‌లతో రూ.2,986 కోట్లు అప్పు తీసుకోనున్నట్టు వెల్లడించింది.
ఇటు కార్పొరేషన్లు ఇతర సంస్థలకు సర్కారు గ్యారంటీపై తీసుకున్న అప్పులు కూడా కొండలా పేరుకుపోతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఉన్న అప్పులు రూ.2,41,743 కోట్లు ఉండగా, గ్యారంటీ లేని కార్పొరేషన్‌ అప్పులు మరో రూ. 60,092 కోట్లు ఉన్నాయి. ఫలితంగా, నాన్‌- ఎఫ్‌ఆర్‌? ‌బీఎం అప్పులే రూ.3,01,835 కోట్లకు చేరుకున్నాయి.
ప్రజల నెత్తిన వడ్డీ భారం
రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం 2026-27లో రూ.1,48,186 కోట్లుగా ఉండవచ్చని అంచనా వేస్తున్నప్పటికీ, అందులో దాదాపు సగం మొత్తం పాత అప్పుల చెల్లింపులు, వడ్డీలకే వెచ్చించాల్సిన దుస్థితి నెలకొంది. రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 4.18 లక్షలతో దేశంలోనే ముందున్నామని చెప్పుకుంటున్నా, దానికి సమాంతరంగా ప్రతి పౌరుడిపై లక్షలాది రూపాయల అప్పుల భారం పెరిగి పోతోంది. అప్పుల ఊబి నుంచి గట్టెక్కేందుకు తక్కువ వడ్డీ రుణాల వైపు మళ్లుతున్నామని, ఆఫ్‌ -‌బడ్జెట్‌ ‌రుణాలను బడ్జెట్‌ ‌పరిధిలోకి తెస్తున్నామని ప్రభుత్వం వివరిస్తున్నా, అసలు రుణభారం మాత్రం పెరుగు తూనే ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.19,639 కోట్ల వడ్డీ చెల్లింపులు ఉంటాయని అంచనా వేయగా, జనవరి నాటికే రూ.24,085 కోట్లు చెల్లించారు. మార్చి నాటికి ఈ మొత్తం రూ.30,000 కోట్లకు చేరే అవకాశం ఉంది. ప్రజా సంక్షేమానికి వినియో గించాల్సిన డబ్బులు బ్యాంకులకు వడ్డీల రూపంలో వెళ్తోంది. దీనికి బాధ్యులు ఎవరు? ఈ ప్రశ్నకు రాష్ట్రాన్ని పాలించిన, పాలిస్తున్నవారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.

About Author

By editor

Twitter
YOUTUBE