ఆంధప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు, విశాఖపట్నంలోని రుషికొండపై నిర్మాణాలపై కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) అందించిన తాజా నివేదిక గత ప్రభుత్వ పాలనలోని తీవ్రమైన లోపాలను, ప్రజాధన దుర్వినియోగాన్ని నిశితంగా ఎత్తిచూపింది. కోట్ల మంది తెలుగు ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టులో, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం పాత గుత్తే దారును ఏకపక్షంగా తొలగించడం ద్వారా పనులను తీవ్ర అనిశ్చితిలోకి నెట్టేశారని కాగ్ స్పష్టం చేసింది. తగిన రక్షణ చర్యలు తీసుకోక పోవడం వల్ల గోదావరి వరదలకు ప్రధాన భూగర్భ పునాది గోడ (డయాఫ్రమ్ వాల్) ధ్వంసమై వేల కోట్ల రూపాయల అదనపు భారం పడింది. దీనికి తోడు భూసేకరణ, నిర్వాసితుల పునరావాసంలో అడుగడుగునా కనిపించిన నిర్లక్ష్యం, నిధుల మళ్లింపు అప్పటి ప్రభుత్వ బాధ్యతారాహిత్యాన్ని బయటపెట్టాయి. మరోవైపు, పర్యావరణానికి ప్రతీకగా నిలిచే రుషికొండపై ఉన్న పాత భవనాలను కూల్చివేసి, నిబంధనలను ఇష్టానుసారం ఉల్లంఘిస్తూ విలాసవంతమైన ప్రాసాదాన్ని నిర్మించడం పట్ల ఆడిట్ సంస్థ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కనీస ప్రాజెక్టు నివేదిక లేకుండా అంచనాలను భారీగా పెంచేసి రూ. వందలాది కోట్లు ఖర్చు చేయడం, న్యాయ సమీక్షనుంచి తప్పించుకోవడానికి అడ్డదారులు తొక్కడం వంటి చర్యలను నివేదిక ఎండగట్టింది. శాసనసభకు సమర్పించిన ఈ నివేదికలో 2017-18 నుంచి 2022-23 మధ్య జరిగిన పనులు, ఆర్థిక అక్రమాలను కాగ్ కళ్లకు కట్టింది.
పోలవరం బహుళార్థ సాధక సాగునీటి పథకం యావత్ తెలుగు ప్రజల చిరకాల స్వప్నం. రాష్ట్ర భవిష్యత్తును మార్చగలిగే జీవనాడి. జాతీయ స్థాయి గుర్తింపు పొందిన ఈ భారీ సాగునీటి పథకం పూర్తయితే గోదావరిలోని అపారమైన జలాలను కృష్ణా నదితో అనుసంధానం చేయడానికి మార్గం సుగమం అవుతుంది. దీని ద్వారా కరవు ప్రాంతాలైన రాయలసీమ సహా అనేక ఉత్తరాంధ్ర జిల్లాల్లో లక్షలాది ఎకరాల బీడు భూములకు నీరు అందుతుంది. తద్వారా రైతుల తల రాతలు మారతాయి. అనేక గ్రామాలు, పట్టణాల ప్రజల తాగునీటి కష్టాలు శాశ్వతంగా తీరిపోతాయి. వందలాది మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తి సాధించడానికి, పారిశ్రామిక అభివృద్ధికి కూడా ఈ కట్టడం అత్యంత కీలకం. ఇంతటి అపారమైన ప్రాధాన్యత గల ఈ సాగునీటి పథకం గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో అనాలోచిత నిర్ణయాల వల్ల తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని కేంద్ర ఆడిట్ సంస్థ తన నివేదికలో కుండబద్దలు కొట్టింది. 2019లో ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన వెంటనే, కనీస ముందస్తు ప్రణాళికలు లేకుండా, కేవలం రాజకీయ దురుద్దేశాలతో తీసుకున్న నిర్ణయాలు ఈ చారిత్రక కట్టడానికి తీరని నష్టాన్ని మిగిల్చాయి. పనుల వేగాన్ని పెంచాల్సిన తరుణంలో అనవసరమైన ప్రయోగాలు చేసి కట్టడ పురోగతిని దశాబ్దాల వెనక్కి నెట్టేశారు.
మునుపటి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అప్పటికే పనులు వేగవంతంగా చేస్తున్న గుత్తేదారును ఒప్పంద గడువు ముగియకముందే ఏకపక్షంగా మార్చివేశారు. ఇలా చేయడం వల్ల పనులు పూర్తిగా అనిశ్చితిలో పడతాయని, ఖర్చు తడిసి మోపెడవుతుందని పోలవరం అథారిటీ ముఖ్య కార్యనిర్వహణాధికారి స్వయంగా లేఖ రాసి హెచ్చరించినా అప్పటి పాలకులు కనీసం పట్టించుకోలేదు. జాతీయ హోదా కలిగి కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఒక నిపుణుల కమిటీని వేసి పాత గుత్తేదారును తొలగించింది. కొత్త గుత్తేదారు ఎంపికయ్యేలోపు అప్పటివరకు కోట్లాది రూపాయ లతో చేసిన పనులకు రక్షణ కరువైంది. పర్యవసా నంగా గోదావరికి వచ్చిన భారీ వరదలకు ప్రధాన భూగర్భ పునాది గోడ పూర్తిగా ధ్వంసమై రూ. 399.77 కోట్లకు పైగా ప్రజాధనం బూడిదలో పోసిన పన్నీరైంది. ఆ తప్పును సరిదిద్దడానికి మరో రూ. 2,020.05 కోట్లు, తాత్కాలిక ఆనకట్టల రక్షణకు అదనంగా రూ. 143.50 కోట్లు వృధాగా ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇక గుత్తేదారుల ఎంపికలో అనుసరించిన తిరోగమన వేలం విధానంలో నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించారు. గడువును 21 రోజులకు బదులు కేవలం 16 రోజులే ఇచ్చి, 14 మంది కాంట్రాక్టర్లు కనీస సమయం పెంచాలని కోరినా తిరస్కరించారు. కనీసం ఇద్దరు పాటదారులు పాల్గొనాలన్న నిబంధనను పక్కనపెట్టి, ఏకైక పాట దారుగా ఉన్న సంస్థకే పనులు కట్టబెట్టారు. ఈ వేలం ద్వారా రూ. 628.43 కోట్లు ఆదా అయిందని ప్రభుత్వం గొప్పలు చెప్పుకున్నా, అదే గుత్తేదారుకు సవరించిన ధరల ప్రకారం రూ. 669.48 కోట్లకు అదనపు పనులు అప్పగించడం ద్వారా ఆ వాదనలో ఏమాత్రం పసలేదని ఆడిట్ సంస్థ తేల్చిచెప్పింది. పైగా, అథారిటీ అనుమతి తీసుకోకుండా కుడి వైపు సొరంగాల ప్రవాహ సామర్థ్యం పెంచే నెపంతో అప్పటికే పూర్తైన నిర్మాణాలను కూల్చివేయడం వల్ల మరో రూ. 14.11 కోట్లు పూర్తిగా వృధా అయ్యాయి.
నిర్మాణంతో పాటే సమాంతరంగా వేగంగా జరగాల్సిన భూసేకరణ, నిర్వాసితుల పునరావాస కార్యక్రమాల్లోనూ తీవ్రమైన జాప్యం చోటుచేసుకుంది. మొత్తం 1,67,765 ఎకరాలు సేకరించాల్సి ఉండగా, కేవలం 1,13,119.70 ఎకరాలు మాత్రమే సేకరించగలిగారు. ముంపు పరిధిలోని 5,426.90 ఎకరాల ప్రభుత్వ భూములకు పంపిణీ పట్టాలు తప్పుగా ఇవ్వడం వల్ల, మళ్లీ అవే భూములకు కోట్ల రూపాయల అదనపు పరిహారం చెల్లించాల్సిన దుస్థితి తలెత్తింది. నిర్వాసితుల పునరావాసానికి రూ. 24,120 కోట్లు అంచనా వేయగా, ఐదేళ్లలో ఖర్చు చేసింది కేవలం రూ.1,806 కోట్లు మాత్రమే కావడం అక్కడి ప్రజల పట్ల వారి నిర్లక్ష్యానికి నిదర్శనం. నిధుల మళ్లింపు, బిల్లుల చెల్లింపుల్లోనూ పారదర్శకత లోపించింది. రాష్ట్ర ఆదాయవ్యయ పద్దుల్లో రూ. 9,750 కోట్లు మిగులు చూపించి నప్పటికీ, పనులకు సంబంధించిన రూ. 2,097 కోట్ల బిల్లులను ఉద్దేశ పూర్వకంగా నిలుపుదల చేశారు. ఖర్చుల లెక్కల్లో ప్రధాన ఇంజనీరు చెప్పిన దానికి, ఆర్థిక శాఖ పత్రాల్లో చూపించిన దానికి మధ్య ఏకంగా రూ. 1,490 కోట్ల వ్యత్యాసం ఉండటం అప్పటి ప్రభుత్వ పని తీరులోని డొల్లతనం, బాధ్యతా రాహిత్యాన్ని బట్టబయలు చేస్తోంది. ఇలా ఒక గొప్ప సంకల్పంతో వేగంగా ముందుకెళ్తున్న జీవనాడి అడుగడుగునా స్వార్థ రాజకీయాలకు, అనాలోచిత నిర్ణయాలకు బలైన ఒక చారిత్రక తప్పిదంగా మిగిలి పోయింది. ఆరు దశాబ్దాల కల సాకారం కావడానికి ఇంకెంత కాలం పడుతుందోనని యావత్ రైతాంగం తీవ్ర ఆవేదన చెందుతోంది.
రుషికొండ రాజభవనం-పర్యావరణ వినాశనం
విశాఖపట్నంలోని రుషికొండపై దశాబ్దాల పాటు పర్యాటకులకు సేవలందించిన, ఎంతో పటిష్టంగా ఉన్న పర్యాటక వసతిగృహాలను ఏకపక్షంగా కూల్చివేసి, వాటి స్థానంలో అత్యంత విలాసవంతమైన రాజభవనాలను నిర్మించడం తీవ్ర సంచలనమైంది. నాటి ముఖ్యమంత్రికి శాశ్వత విలాసవంతమైన నివాసంగా మార్చే దురుద్దేశంతోనే పర్యావరణాన్ని సైతం పణంగా పెట్టి ఈ నిర్మాణాలకు పూనుకున్నా రని విపక్షాలు తీవ్రస్థాయిలో ఆరోపించాయి. పర్యాటకాభివృద్ధి సంస్థ చేపట్టిన ఈ నిర్మాణాల్లో ప్రజాధన దుర్వినియోగం భారీగా జరిగిందని కాగ్ నివేదిక ఆధారాలతో సహా బట్టబయలు చేసింది. కనీస సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొందించకుండా, కేవలం అప్పటి ప్రభుత్వ పెద్దల మౌఖిక ఆదేశాలతో నిబంధనలను యథేచ్ఛగా తుంగలో తొక్కారని కాగ్ తీవ్రంగా ఆక్షేపించింది. లోపభూయిష్టమైన ప్రణాళికల వల్లే తొలుత రూ. 164 కోట్లుగా ఉన్న అంచనా వ్యయం ఏకంగా రూ. 350.16 కోట్లకు చేరిందని కుండబద్దలు కొట్టింది. ఏ తరహా భవనాలు నిర్మించాలి, లోపలి అలంకరణ పనులు ఎలా ఉండాలన్న కనీస అంచనాలు లేకుండానే కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఇష్టానుసారం ఖర్చు చేశారని నివేదిక స్పష్టం చేసింది.
రూ. వంద కోట్లు దాటిన పనులకు తప్పనిసరిగా చట్ట ప్రకారం న్యాయసమీక్ష జరగాలన్న అత్యున్నత నిబంధనను తప్పించుకునేందుకు అధికారులు పనులను ఉద్దేశపూర్వకంగా చిన్నచిన్న భాగాలుగా విడగొట్టి అడ్డదారిలో పనులు చేయించారు. తొలుత కొండకు వాయవ్యం వైపున నిర్మాణాలు చేయాలని ప్రతిపాదించి, ఆ తర్వాత ఎలాంటి హేతుబద్ధత లేకుండా దాన్ని నైరుతి వైపునకు మార్చేశారు. ఈ క్రమంలో నేల స్వభావానికి సంబంధించిన అధికారిక పత్రాలను సైతం ఇష్టానుసారం మార్చివేశారు. ప్రాథమిక అంచనాల ప్రకారం 7.02 లక్షల ఘనపు మీటర్ల మట్టిని మాత్రమే తవ్వాల్సి ఉండగా, పర్యావరణ నియమాలను పూర్తిగా గాలికొదిలేసి ఏకంగా 11.46 లక్షల ఘనపు మీటర్ల మేర కొండను విచక్షణారహితంగా తవ్వేశారు. ఇంత భారీ స్థాయిలో కొండను తొలిచి తీసిన 3.37 లక్షల ఘనపు మీటర్ల విలువైన మట్టి, రాతిని నిబంధనల ప్రకారం బహిరంగంగా విక్రయించకుండా, అకారణంగా వేరే ప్రాంతంలో పారబోయడం వల్ల ప్రభుత్వ ఖజానాకు అదనంగా రూ. 3.57 కోట్ల నష్టం వాటిల్లిందని కాగ్ నిగ్గుతేల్చింది. స్వార్థ ప్రయోజనాల కోసం ఒక ప్రకృతి రమణీయమైన కొండను విచ్ఛిన్నం చేస్తూ, వ్యవస్థలను ఎలా దుర్వినియోగం చేశారో ఈ నివేదిక ప్రజల కళ్లకు కట్టింది.
కాగ్ నివేదికను బట్టి చూస్తే, గత వైసీపీ ప్రభుత్వం పోలవరం లాంటి బృహత్తర ప్రాజెక్టును పట్టింపు లేకుండా నిర్వీర్యం చేయడమే కాకుండా, రుషికొండ లాంటి చోట్ల విలాసవంతమైన భవనాల నిర్మాణాల కోసం ప్రజాధనాన్ని ఎలా మంచి నీళ్లలా ఖర్చు చేసిందో అర్థమవుతోంది. నిపుణుల సలహాలను పక్కనబెట్టి, పారదర్శకత లేకుండా వ్యవహరించడం వల్లే రాష్ట్ర ఖజానాకు కోలుకోలేని నష్టం జరిగిందని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.

తురగా నాగభూషణం
సీనియర్ జర్నలిస్ట్