ఫెంటానిల్‌ ‌పేరుకు నొప్పి నివారిణి అన్న మాటే కాని దాని వాడకం అమెరికా అంతటా విస్తరించింది. అక్కడి ట్రంప్‌ ‌ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తోంది. ఇది మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటా నికి పెను సవాల్‌గా మారింది. అయితే అమెరికా ప్రభుత్వం ఫెంటానిల్‌ను ఒక సాము హిక విధ్వంసక ఆయుధం- డబ్ల్యూఎండీగా పరిగణించాలా లేక దీని ద్వారా రసాయన ఆయుధాల తయారీపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలా అనే సందిగ్ధావస్థలో కొట్టుమిట్టాడు తోంది. రష్యా మాత్రం ఫెంటానిల్‌తో రసాయనిక ఆయుధాల తయారీకి ప్రయత్నాలను ముమ్మరం చేసింది. రష్యా ప్రయత్నాలకు బ్రిటన్‌ ‌దేశం బాసటగా నిలవడం విశేషం. అయితే ఫెంటానిల్‌ ‌రసాయనిక ఆయుధాలను భవిష్యత్తులో యుద్ధంలో కూడా వినియోగించే ప్రమాదం లేకపోలేదని ఆందోళన చెందుతున్న దేశాలు చాలానే ఉన్నాయి.

ఫెంటానిల్‌, ‌దాని సారూప్యాలు సింథటిక్‌ ‌నొప్పి నివారణులు లేదా మాదకద్రవ్యాలుగా ప్రాచుర్యంలో ఉన్నాయి. దీనిని మొదట 1959లో బెల్జియంలో పాల్‌ ‌జాన్సెన్‌ ‌సంశ్లేషణ చేశారు. దీనిని ఒక బాధానివారణిగా, మత్తుమందుగా కనుగొన్నారు. ఇది 1968లో అమెరికాలో వైద్యపరంగా వినియో గించడానికి ఆమోదం పొందింది. ఫెంటానిల్‌ ‌కేన్సర్‌ ‌బాధితులు, గాయపడిన సైనికులు, తీవ్రమైన నొప్పితో బాధపడేవారికి బాధానివారిణిగా ప్రముఖ పాత్ర పోషించింది. ఫెంటానిల్‌ ‌పరిసర ఉష్ణోగ్రతల వద్ద ఒక ఘన పదార్థం(లవణం)గా ఉంటుంది. కానీ అది ద్రావకంలో ద్రవంగా కూడా వ్యాప్తి చెందగలదు. అంతేకాకుండా ఒక ద్రావకంతో కలిసిపోయి చర్మం ద్వారా గ్రహించబడుతుంది. ఫెంటానిల్‌ ఔషధ ఉత్పత్తుల్లో లాజెంజెస్‌, ‌లాలీపాప్స్, ‌టాబ్లెట్లు, ట్రాన్స్‌డెర్మల్‌ ‌ప్యాచ్‌లు, స్ప్రేలు, ఇంజెక్షన్‌ ‌చేయగల ఫార్ములేషన్లు ఉన్నాయి. రహస్యంగా తయారైన ఫెంటానిల్‌ ‌పౌడర్‌ ‌లేదా నకిలీ టాబ్లెట్ల రూపంలో లభిస్తుంది. ఫెంటానిల్‌ను విడిగా కూడా విక్రయిస్తారు. దీనిని కొకైన్‌, ‌తదితర మాదక ద్రవ్యాలతో కలిపి అమ్ముతారు.

ఫెంటానిల్‌, ‌దాని సారూప్యాలు అమెరికాలో నియంత్రిత పదార్థాల చట్టానికి లోబడి ఉన్నాయి. ఫెంటానిల్‌, ఆల్ఫెంటానిల్‌, ‌రెమిఫెంటినల్‌, ‌కార్ఫెంటానిల్‌, ‌సుఫెంటానిల్‌, ‌థియాఫెంటినల్‌ ‌చట్టబద్ధమైన వైద్య లేదా పశువైద్య ఉపయోగాలను కలిగి ఉన్నాయి. చట్టంలోని షెడ్యూల్‌ 2 ‌కింద జాబితాకు నోచుకున్నాయి. అక్రమ ఫెంటానిల్‌ ‌సారూప్యాలకు గుర్తింపు పొందిన చట్టబద్ధమైన ఉపయోగాలు లేవు. ఇవి చట్టంలో షెడ్యూల్‌ 1 ‌కింద నియంత్రణలో ఉన్నాయి.

ఫెంటానిల్‌ ఒక అక్రమ మాదక ద్రవ్యం

ఫెంటానిల్‌ ‌దశాబ్దాలుగా ఒక నిషేధిత మాదకద్రవ్యంగా దుర్వినియోగమవుతోంది. కానీ ఇటీవలి సంవత్సరాల్లో ఇది ఓ సంక్షోభంగా మారింది. ఇది హెరాయిన్‌ ‌కంటే చాలా శక్తివంత మైనది. తక్కువ ధరకు దొరుకుతుంది. ఈ సౌలభ్యాలు దీనిని ఇతర నిషేధిత మాదక ద్రవ్యాలకు ఒక సాధారణ అనుబంధిత మాదక ద్రవ్యంగా మార్చాయి. బాధానివారణిని అధిక మోతాదులో తీసుకోవడం ద్వారా సంభవించే మరణాల సంఖ్యను గణనీయంగా పెంచాయి. అమెరికాలో అక్రమంగా వినియోగిస్తున్న ఫెంటానిల్‌, ‌దాని సారూప్యాలలో ఎక్కువ భాగం చైనాలో ఉత్పత్తి అవుతాయి. అవి అక్కడి నుంచి నేరుగా లేకుంటే మెక్సికో లేదా కెనడా గుండా అమెరికాకు రవాణా అవుతాయి. అక్రమ మాదక ద్రవ్యాల చరిత్రను ఒకసారి పరికిస్తే ఎక్కడ గిరాకీ ఉంటే అక్కడ సరఫరా ఉంటుందని అది సూచిస్తోంది.

అచేతనత్వానికి గురి చేసే ఏజెంటుగా ఫెంటానిల్‌

అనేక దేశాలు ఫెంటానిల్‌, ‌దాని సారూప్యాలపై పరిశోధన చేపట్టాయి. వాటిని అచేతనత్వానికి గురి చేసే ఏజెంట్లుగా నిర్ధారించాయి. అయితే ఈ విషయం పెద్దగా ప్రాచుర్యంలోకి రాలేదు. 1990 దశకంలో అమెరికాకు చెందిన రక్షణ శాఖ-డీవోడీ, న్యాయశాఖ ఇదే తరహా పరిశోధనలు జరిపాయి. అమెరికా, విదేశాలలో సైనిక, సైనికేతర భద్రతా సంస్థలు రసాయనాలు సహా అంతగా ప్రాణాంతకం కాని వాటి తయారీపై చాలా కాలంగా ఆసక్తిని చూపిస్తున్నాయి. రసాయనిక ఆయుధాల ఒడంబడిక- సీడబ్ల్యూసీ కుదిరేంతవరకుకూడా ప్రపంచవ్యాప్తంగా అనేక సైనిక దళాలు అల్లర్ల నియంత్రణకు బాష్పవాయువును వినియోగిస్తుండేవి. డీవోడీ 1960 దశకం మొదట్లో అచేతనత్వానికి గురిచేసే ఒక రసాయనిక ఆయుధాన్ని ఉత్పత్తి చేసింది. ఆయుధం కోసమని సైకోయాక్టివ్‌ ‌సమ్మేళనం బీజెడ్‌ (3-‌క్వినుక్లిడినిల్‌ ‌బెంజిలెట్‌)‌ను వినియో గించింది. కానీ 1989 నాటికి దానిని ఉపసంహరించుకుంది. అచేతనత్వానికి గురి చేసే ఏజెంట్‌ ‌కోసం చేసే పరిశోధనల్లో ఒక రసాయనం లేదా అంతకు మించిన రసాయనాల మిశ్రమాన్ని కనుగొంటారు. అది వైరి వర్గానికి చెందిన ఒక వ్యక్తి లేదా సమూహాన్ని అచేతనపరుస్తుంది. ముంచుకొస్తున్న ముప్పును అడ్డుకోవడానికి వీల్లేనంత వేగంగా లక్ష్యంపై దాడి చేస్తుంది. దాన్ని నిరాయుధీకరిస్తుంది. అది ఈ క్రమంలో ప్రత్యర్థికి ఏరకమైన శాశ్వత హానిని తలపెట్టదు. బాష్పవాయువు, బీజెడ్‌లు అచేతనత్వానికి గురిచేసే ఏజెంట్‌గా పనిచేయడంలో విఫలమైనాయి. బాష్పవాయువు ప్రత్యర్థిని పారిపోయేలా చేస్తుంది. బీజెడ్‌ అతడు లేదా ఆమెలో వింత ప్రవర్తనకు దారి తీస్తుంది.

అక్టోబర్‌, 2002‌లో మాస్కోలోని డుబ్రోవ్కా థియేటర్‌లో రసాయనిక ఆయుధ ప్రయోగం

డీవోడీ ప్రత్యర్థిని అచేతనపరచడంలో ఫెంటానిల్‌, ‌దాని సారూప్యాలు లేదా అలాంటి రసాయనాల సమ్మేళనాల సామర్థ్యాన్ని గుర్తించింది. కానీ భద్రత ఏ మేరకు ఉంటుందనేది కనుక్కోలేకపోయింది. దీంతో ఈ రసాయనిక ఆయుధ కార్యక్రమాన్ని మధ్యలోనే ముగించేసింది. భద్రత ఏ మేరకు ఉంటుందనేది ప్రత్యర్థిని అచేతనపరచడానికి, ప్రత్యర్థిని చంపడానికి ఉపయోగించే రసాయనాల మోతాదులో వ్యత్యాసాన్ని సూచిస్తుంది. ఆ వ్యత్యాసం వ్యక్తిని బట్టి మారుతుంటుంది. అయితే భారీ మోతాదులో రసాయనాన్ని వినియోగించినప్పటికీ అది ఎక్కువ మందిని అచేతనపరుస్తుంది లేదా ఎక్కువ మందిని చంపేస్తుంది అని అనడానికి ఎలాంటి గ్యారంటీ లేదు. అయితే డీవోడీ ఎప్పుడూ కూడా ఫెంటానిల్‌ ‌సమ్మేళనాలను ఆయుధీకరించలేదు. కానీ ఒక దేశం మాత్రం ఆ పని చేసింది. అక్టోబర్‌, 2002‌లో రష్యా ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల కోసమని ఫెంటానిల్‌ ‌సారూప్యాలను వినియోగించింది. 40 మంది చెచెన్‌ ఉ‌గ్రవాదులు మాస్కోలోని డుబ్రోవ్కా థియేటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. 800 మందికి పైగా సామాన్య పౌరులను బందీలుగా చేసుకున్నారు. థియేటర్‌ ‌చుట్టూ పేలుడు పదార్థాలను అమర్చారు. రష్యా చెచెన్యాలో తన సైనిక చర్యను విరమించుకోని పక్షంలో థియేటర్‌ను నామరూపాల్లేకుండా చేస్తామని, బందీలను చంపుతామని ఉగ్రవాదులు బెదిరించారు. ఇరు వర్గాల మధ్య అనేక రోజులు చర్చలు జరిగినప్పటికీ అవి ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో ఉగ్రవాదులు బందీలను వరుసపెట్టి చంపుతామని బెదిరించారు. ఈ నేపథ్యంలో రష్యా భద్రతా బగాలు థియేటర్‌ను ముట్టించడానికి నిర్ణయించాయి. థియేటర్‌లో ఉన్నవారిని అచేతనంగా ఉంచడానికి రెండు ఫెంటానిల్‌ ‌సారూప్యాల గాలి తుంపర మిశ్రమాన్ని థియేటర్‌లోకి పంపించాయి. ఈ ఘటనలో ఉగ్రవాదులు,బందీలను కలుపుకొని మొత్తం 130 మంది మరణించారు. మరణించిన బందీల్లో అత్యధికులు ఫెంటానిల్‌ ‌సమ్మేళనాల ప్రాణాంతాక మోతాదుకు గురయ్యారు(ఈ కథనంలో మొదట్లో ప్రస్తావించిన భద్రతా సమస్యను, మోతాదులో వ్యత్యాసాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలని చదువరికి మనవి). రష్యా భద్రతా బగాలు ఫెంటానిల్‌ ‌రసాయన ఆయుధ ప్రయోగాన్ని దృష్టిలో ఉంచుకొని అత్యవసర స్పందన బలగాలను, వైద్య సిబ్బందిని సిద్ధం చేసుకొని ఉండి ఉంటే బందీల మరణాల సంఖ్య వందకు పైగా ఉండేది కాదు. వారిలో కొంతమందినైనా కాపాడి ఉండేవారు. మత్తుమందుకు విరుగుడుగా పనిచేసే నలోక్సోన్‌, ‌తదితర ఔషధాలు మోతాదుకు మించిన మత్తుమందు దుష్ప్రభావాన్ని ఏమాత్రం లేకుండా చేయగలిగేవి.

రష్యాకు ప్రశంసలు..  రసాయనిక ఆయుధంపై ఆందోళనలు

రష్యా బందీల సమస్యను పరిష్కరించడంలో రసాయనాలను వాడటంపై అంతర్జాతీయంగా మొదట్లో సానుకూలమైన ప్రతిస్పందన వచ్చింది. బ్రిటిష్‌ ‌ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్‌ ‌సంక్షోభ పరిష్కారంపై అభినందనలు తెలియజేయడానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ ‌పుతిన్‌కు ఫోన్‌ ‌చేశారు. సైన్యం, పోలీసులు లాంటి చట్టబద్ధమైన సంస్థలు ఫెంటానిల్‌ను ఒక రసాయన ఆయుధంగావాడటం ముఖ్యమని సీడబ్ల్యూసీ పేర్కొంది. అదే సమయంలో దాని వాడకంపై ఎలాంటి నిషేధాన్ని విధించకపోవడం గమనార్హం. బహుశా బాష్పవాయువు వంటి అల్లర్ల నియంత్రణ ఏజెంట్లను దృష్టిలో ఉంచుకొని అలా చేసి ఉండవచ్చు. రష్యా లోని డుబ్రోవ్కా థియేటర్‌లో ఫెంటానిల్‌ను ప్రయోగించిన కారణంగా 130 మంది మరణించారు. అయితే దానిని ప్రయోగించడం వెనుక ముఖ్యమైన ఉద్దేశం ఉగ్రవాదులను అచేతనులను చేయడం, బందీలను సురక్షితంగా విడిపించడం. ఈ కారణంగా రష్యా తొలిసారిగా చేసిన రసాయన ఆయుధ ప్రయోగం యావత్‌ ‌ప్రపంచానికి ఆమోదయోగ్యమైంది. ఫెంటానిల్‌ ‌సమ్మేళనాలకు గురికావడం వల్ల దాదాపు 130 మంది బందీలు మరణించినప్పటికీ, ఉగ్రవాదులను అచేతనులను చేయడమే ఉద్దేశంగా రష్యన్లు చేసిన పని అందరికీ ఆమోదయోగ్యమైంది. అయితే కొన్ని పాశ్చాత్య దేశాలు ప్రాణాంతక మోతాదులో ఫెంటానిల్‌ ‌సమ్మేళనాలు లాంటి రసాయనాలను ఆయుధాలుగా వినియోగించడం వల్ల సంభవించే దుష్పరిణామాలను అంతర్గతంగా చర్చించుకున్నాయి. రసాయన ఆయుధాల కోసమని అమాయకుల ప్రాణాలు పణంగా పెడుతున్నారని ఆందోళన చెందాయి. ఆయుధాలుగా రసాయనాలను ఉపయోగించకుండా విధించిన కట్టుబాటుకు కోత పెడుతున్నారని విమర్శించాయి. సీడబ్ల్యూసీ సభ్యులు తమ స్వార్థానికి వాటిని వాడుకునే ప్రమాదం లేకపోలేదని హెచ్చరించాయి. వాటిని యుద్ధంలో ఉపయోగించే అవకాశంఉందని సూచించాయి.

ఖలిస్తాన్‌ ఉ‌గ్రవాదులతో చైనా ఫెంటానిల్‌ ‌బంధం

పాకిస్తాన్‌ ‌పెంచి పోషిస్తున్న భౌగోళిక రాజకీయ ప్రాజెక్టుగా ఖలిస్తాన్‌ ‌వేర్పాటువాదం ఉంది. పాకిస్తాన్‌ ‌దీనిని అడ్డం పెట్టుకొని దశాబ్దాల కాలంగా భారత్‌, ‌కెనడా, ఆస్ట్రేలియా, యూకే, అమెరికాలాంటి దేశాలకు సాయుధులైన ఖలిస్తానీ టెర్రరిస్టులను అక్రమ మార్గాల్లో పంపిస్తోంది. భారత్‌ను దెబ్బతీయడానికి జరుగుతున్న ఖలిస్తానీ కుట్రలో చైనాకు కూడా లంకె ఉంది. ఆ లంకె ఫెంటానిల్‌ ‌మాదకద్రవ్యం. ఇది అమెరికాకు ప్రాణాంతకంగా మారింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన డోనాల్డ్ ‌ట్రంప్‌ ‌మాదక ద్రవ్యాలను తయారుచేసే లాటిన్‌ అమెరికాకు చెందిన ఎనిమిది సంస్థలను ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించారు. ట్రంప్‌ అమెరికాలోకి ఫెంటానిల్‌ను అక్రమంగా రవాణా చేస్తున్న చైనా, కెనడా దేశాలపై సుంకాలను కూడా విధించారు.

– జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
YOUTUBE