రాష్ట్రంలో మామిడి, నిమ్మ, బ్లాక్‌ ‌బర్లీ పొగాకు, ఆక్వా రైతులు ఈ ఏడాది నష్టాలపాలయ్యారు. ప్రత్యామ్నాయ మార్కెట్లు, నూతన పద్ధతులను అందిపుచ్చుకోలేకపోవడం, ప్రభుత్వ అలసత్వం ఈ సంక్షోభానికి కారణంగా కనిపిస్తోంది. మామిడి  అధిక దిగుబడి సాధించినా, యుద్ధాల కారణంగా ఎగుమతులు నిలిచి, ఫ్యాక్టరీల సిండికేట్‌తో ధరలు పడిపోయాయి. టన్ను  5-6 వేల రూపాయలే పలకడం వల్ల  లక్షల మంది రైతులు నష్టపోయారు. నిమ్మ కిలోకు రూ.70 నుంచి రూ.6కు ధర పడిపోవడంతో  రైతులు  పంటను పార బోస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో అధిక ఉత్పత్తి, నిల్వ సౌకర్యాల లోపం కారణంగా వారు నిరాశలో మునిగారు. బ్లాక్‌ ‌బర్లీ పొగాకు రైతులు 160 మిలియన్‌ ‌కిలోల అధిక ఉత్పత్తితో కంపెనీలు కొనుగోలు నిరాకరించాయి.తేమ శాతం, అంతర్జాతీయ ధరల పతనం వల్ల  తీవ్ర నష్టాలు మూటగట్టుకున్నారు. ప్రభుత్వం ముందుకు వచ్చి మార్క్‌ఫెడ్‌ ‌ద్వారా కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చినా కంపెనీలు మాత్రం పూర్తిగా సహకరించడం లేదు. ఆక్వా రైతులు అమెరికా టారిఫ్‌లతో 40 శాతం ఎగుమతులు తగ్గి, వైరస్‌లు, ఫీడ్‌ ‌ధరల పెరుగుదలతో నష్టపోతున్నారు. మొత్తంగా ఒకటి రెండు మార్కెట్‌లపై ఆధారపడటం, సరఫరా మిగులు ఈ సమస్యలకు మూల కారణాలుగా నిలుస్తున్నాయి.

రాష్ట్రంలోని మామిడి రైతులు ఈ ఏడాది నష్టాలపాలయ్యారు. అధిక దిగుబడి వారికి ఆనందాన్ని కాకుండా కన్నీళ్లను మిగిల్చింది. రష్యా-ఉక్రెయిన్‌, ఇ‌జ్రాయెల్‌ ‌యుద్ధాల కారణంగా విదేశీ ఎగుమతులు నిలిచిపోవడాన్ని సాకుగా చూపి స్థానిక పల్ప్ ‌ఫ్యాక్టరీలు సిండికేట్‌గా మారి రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేయడానికి ప్రయత్నించాయి. గిట్టుబాటు ధర లభించకపోవడంతో, చాలా మంది రైతులు పంటను అమ్ముకోలేక నష్టపోయారు. రాష్ట్రంలో మామిడి సాగువిస్తీర్ణం 4.03 లక్షల హెక్టార్లు కాగా, ఏటా 50 లక్షల మెట్రిక్‌ ‌టన్నులు దిగబడి వస్తుంది. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కాకినాడ, అనకాపల్లి, విజయనగరం, నెల్లూరు, ఏలూరు, ఎన్టీఆర్‌, ‌ప్రకాశం, అనంతపురం, కర్నూలు వంటి జిల్లాలలో మామిడి సాగు జరుగుతుంది. లక్షలమంది రైతులు ఈ పంటపై ఆధారపడి జీవిస్తున్నారు. చిత్తూరు జిల్లా మామిడి గుజ్జు పరిశ్రమకు ప్రసిద్ధి. ఇక్కడ దాదాపు 35కి పైగా గుజ్జు పరిశ్రమలు ఉన్నాయి. మామిడి ప్రాసెసింగ్‌ ‌యూనిట్లు చిత్తూరు, మదనపల్లి, తిరుపతి ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్నాయి. మన దేశంతో పాటు ఇతర దేశాలకు ఇక్కడి నుంచే ప్రాసెస్‌ ‌చేసిన మామిడి గుజ్జు ఎగుమతి అవుతుంది.

ఈ ఏడాది సుమారు 60 లక్షల టన్నుల వరకు మామిడి ఉత్పత్తి పెరిగినట్లు రైతులు చెబుతున్నారు. ఆ దిగుబడిని అమ్ముకుని అప్పులు తీర్చుకుందామనే ఆనందం ఫ్యాక్టరీలు సరకు కొనుగోలు చేయడానికి ముందుకు రాకపోవడంతో ఆవిరైపోయింది. దాంతో ధరల పతనం ప్రారంభమైంది. గతంలో టన్ను 15 వేల నుంచి 20 వేల వరకు అమ్మింది ఇప్పుడు టన్ను రూ.5-6 వేలకు మించి కొనబోమని ఫ్యాక్టరీల యజమానులు చెప్పారు. 2023-2024 సంవత్సరాల్లో తయారుచేసిన పల్ప్ ‌చిత్తూరు జిల్లాలోని ఫ్యాక్టరీల్లో సుమారు 40వేల టన్నులు అలాగే ఉండిపోయింది. 2023 నుంచి ఉత్పత్తిచేసిన మామిడి గుజ్జు నిల్వలు అలాగే ఉన్నాయని, ఇవి ఎగుమతి జరిగి ఉంటే రైతులకు మరింత మేలు జరిగి ఉండేదని నివేదికలు చెబుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో గుజ్జు ఎగుమతులు ప్రారంభమైనా, గతే డాది పేరుకుపోయిన నిల్వల్లో కేవలం 15 శాతం మాత్రమే ఎగుమతి అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా మామిడి గుజ్జుకు డిమాండ్‌ ‌తగ్గుతున్న సమయంలో, ఆంధప్రదేశ్‌లో దిగుబడి పెరగడం సరఫరా మిగులుకు దారితీసింది.ఈ ఏడాది జూన్‌ ‌ప్రారంభంలో, చిత్తూరు జిల్లాలో మామిడి ధరలు కిలోకు రూ. 5 నుంచి రూ.7 వరకు పడిపోయాయి. రైతుల ఆందోళనల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని, కిలో మామిడికి రూ.12 మద్దతు ధర ప్రకటించింది. ఇందులో రూ.8 గుజ్జు పరిశ్రమలు చెల్లించగా, మిగిలిన రూ.4 ప్రభుత్వం భరించింది.

నిమ్మ రైతుల నిరాశ

ఆరుగాలం శ్రమించి.. ఆటుపోట్లను అధిగమించి నిమ్మ సాగు చేసిన రైతులు పంట చేతికొచ్చే సమయానికి ధర లేదని వాపోతున్నారు. రెండు నెలలు క్రితం కిలో రూ.70 పలికిన నిమ్మ ధర ప్రస్తుతం రూ.6కు పడిపోవడంతో లబోదిబోమంటున్నారు. ఏపీలోని మెట్ట ప్రాంతాల్లో సుమారు 2 లక్షల హెక్టార్లలో నిమ్మ సాగు చేస్తున్నారు. ఈ పంట నాటిన తర్వాత మూడు, నాలుగేళ్లకు కాపు కొస్తుంది. ఏడాదిలో దసరా, చిత్తకాపు, సీజన్‌ ఇలా మూడు దశల్లో కాయలు కోస్తుంటారు. వాతావరణం అనుకూలిస్తే ఎకరానికి 7-8 టన్నుల దిగుబడి వస్తుంది. ఇతర రాష్ట్రాల్లో దిగుబడి పెరగడంతో ఇక్కడ కాయలకు డిమాండ్‌, ‌ధర తగ్గింది. ప్రస్తుతం కిలో ధర రూ.6కు పడిపోయిందని, ఏ- గ్రేడ్‌ అయితే రూ. 8, 9 పలుకుతుందని రైతులు వాపోతున్నారు. పండు కాయలు గంప(25 కిలోలు) రూ.150 ధర పలుకుతుందన్నారు. అదే బయట కూరగాయల మార్కెట్‌, ‌సంత బజార్లలో మూడుకాయలు రూ.10లకు విక్రయిస్తున్నారు. ఈసారి వాతావరణం అనుకూలించి నిమ్మ పంట దిగుబడి గణనీయంగా పెరిగింది. అయితే, పెరిగిన దిగుబడే వారికి శాపంగా మారింది. మార్కెట్‌లో సరఫరా ఒక్కసారిగా పెరిగిపోవడంతో ధరలు దారుణంగా పడిపోయాయి. కనీసం కోత ఖర్చులు కూడా రాని పరిస్థితి నెలకొంది. దీంతో దిక్కుతోచని రైతులు పంటను రోడ్ల పక్కన, చెత్తకుప్పల్లో పారబోశారు. నిమ్మనుంచి విలువ ఆధారిత ఉత్పత్తులను తయారుచేసే పరిశ్రమలు గానీ, నిల్వ చేసుకునేందుకు శీతల గిడ్డంగుల సౌకర్యం గానీ అందుబాటులో లేకపోవడం ఈ నష్టానికి ప్రధాన కారణం.

బ్లాక్‌ ‌బర్లీ పొగాకు కష్టాలు

వాణిజ్య పంట, బ్లాక్‌బర్లీ పొగాకు రైతులు సైతం ఇదే తరహా సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు. ఈ పొగాకును ప్రధానంగా సిగార్ల తయారీలో ఉపయోగి స్తారు. సాధారణంగా, ఈ రకం పొగాకుకు మంచి డిమాండ్‌, ‌ధర ఉండటంతో రైతులు ఈ సాగుపై ఆసక్తి చూపారు. అయితే, ఇటీవలి కాలంలో ఈ పంట సాగు, దిగుబడి, అమ్మకాల విషయంలో రైతులు తీవ్ర సవాళ్లను ఎదుర్కొన్నారు. బ్లాక్‌ ‌బర్లీ పొగాకును రాష్ట్రంలో ప్రధానంగా గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లోని నల్లరేగడి నేలల్లో అధికంగా సాగు చేశారు. గతంలో మంచి ధర పలకడంతో, ఈ ఏడాది ఎక్కువ మంది రైతులు ఈ పంట వైపు మొగ్గు చూపారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ఈ సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. అనుకూల వాతావరణ పరిస్థితుల కారణంగా దిగుబడి కూడా ఊహించిన దానికంటే ఎక్కువగా వచ్చింది. అయితే, ఈ అధిక దిగుబడే రైతులకు శాపంగా మారింది. ఒప్పందం చేసుకున్న దానికంటే అధికంగా పంట పండించడం ప్రధాన కారణంగా కంపెనీలు పేర్కొన్నాయి. డిమాండ్‌కు మించి సరఫరా పెరగడంతో కంపెనీలు కొనుగోలు చేయడానికి ముందుకు రాలేదు. 105 మిలియన్‌ ‌కిలోల ఉత్పత్తికి పొగాకు బోర్డు అనుమతి ఇవ్వగా 160 మిలియన్‌ ‌కిలోల ఉత్పత్తి అయింది. ఉత్తరాదిలో కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. దాంతో కొనుగోలుదారులు ధరను తగ్గించేశారు. పంటలో తేమ శాతం ఎక్కువగా ఉందనే కారణంతో కూడా కొన్ని కంపెనీలు కొనుగోలు చేయడానికి నిరాకరించాయి. ఇది ధరల పతనానికి కారణంగా మారింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గడం కూడా దేశీయ కొనుగోళ్లపై ప్రభావం చూపింది. గతంలో ఐటీసీ, జీపీఐ, డెక్కన్‌ అలయన్స్ ‌వంటి కంపెనీలు రైతులను ప్రోత్సహించినప్పటికీ, అధిక ఉత్పత్తి కారణంగా కొనుగోలు విషయంలో వెనక్కి తగ్గాయి. రైతులు తీవ్రంగా నష్టపోతున్న తరుణంలో, ఆంధప్రదేశ్‌ ‌ప్రభుత్వం వారిని ఆదుకోవడానికి ముందుకు వచ్చింది. ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ ‌ద్వారా రైతుల నుండి నేరుగా బ్లాక్‌ ‌బర్లీ పొగాకును కొనుగోలు చేసింది. ఇందుకోసం ప్రత్యేక కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. పొగాకు కొనుగోలు చేసిన రైతులకు వారి బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా డబ్బు జమ చేసింది. సుమారు రూ. 273 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఇలాంటి సమస్య పునరావృతం కాకుండా, రాబోయే సంవత్సరానికి బ్లాక్‌ ‌బర్లీ పొగాకు సాగుపై ‘క్రాప్‌ ‌హాలిడే’ ప్రకటించింది. రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని సూచించింది. ప్రభుత్వం పొగాకు కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపి, రైతుల నుండి వీలైనంత ఎక్కువ పంటను కొనుగోలు చేసేలా ఒత్తిడి తెచ్చింది. ఈ విధంగా, ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో బ్లాక్‌ ‌బర్లీ రైతులు కొంతమేర నష్టాల నుండి గట్టెక్కగలిగారు. అయితే, ఈ సంఘటన వ్యవసాయంలో సరైన ప్రణాళిక డిమాండ్‌-‌సరఫరా అంచనాల ప్రాముఖ్యతను మరోసారి గుర్తు చేసింది.

ఆక్వా రంగంపై అమెరికా దెబ్బ

రాష్ట్రంలోని ఆక్వా రంగానికి అమెరికా అతిపెద్ద మార్కెట్‌. అయితే, ఆ దేశం ట్రంప్‌ ‌రొయ్యలు, చేపల ఉత్పత్తులపై 25 శాతం అధికంగా పన్నులు (టారిఫ్‌లు) విధించడంతో పరిస్థితి తలకిందులైంది. ఈ నిర్ణయంతో భారత ఉత్పత్తుల ధరలు అమెరికా మార్కెట్‌లో పెరిగిపోయి, మన ఎగుమతులు ఏకంగా 40 శాతం పడిపోయాయి.

రష్యా నుంచి చమురు దిగుమతులను ఆపేయని పక్షంలో పెనాల్టీ సుంకాలు విధిస్తామని హెచ్చరించిన ట్రంప్‌ ఆక్వా ఉత్పత్తులపై 25 శాతం అదనపు పన్ను విధించడం, పక్కనే ఉన్న సాల్వెడార్‌కు ప్రోత్సాహ క•ంగా పన్నులు భారీగా తగ్గించడంతో భారత ఆక్వా ఉత్పత్తుల దిగుమతులను అమెరికా తగ్గించింది. సాల్వెడార్‌ ‌నుంచి ఎక్కువగా దిగుమతులు చేసు కుంటోంది. దానికి తోడు ఇటీవల వాతావరణంలో భారీ తేడాల వల్ల చెరువుల్లోని ఉష్ణోగ్రతల్లో తేడా వచ్చి రొయ్యలకు వైరస్‌లు సోకాయి. ఈ పరిమా ణంతో రైతులను వెంటనే రొయ్యలను పట్టేసి అందినకాడికి అమ్ముకున్నారు. ఇక వర్షాకాలంలో వాతావరణం రొయ్యల పెంపకానికి అనుకూలం కాదు. అందువల్ల రొయ్యల పెంపకాన్ని ఆపి చేపల పెంపకాన్ని చేపట్టారు. చేపల పెంపకం 9 నెలల నుంచి 12 నెలల వరకు సాగుతుంది. అయితే దీనికి ఇచ్చే ఆహారం ధర కూడా 79 శాతం పెరిగింది. గతంలో 10 టన్నుల డీఒబీ (చేపల ఆహారం) లక్ష వరకు ధర ఉండగా ఇప్పుడు రూ.1.79 లక్షలకు పెరిగింది. కాని చేపల ధర మాత్రం పెరగలేదు. దాంతో చేపల పెంపకం కూడా నష్టాలను మిగుల్చుతుంది.

ఈ సంఘటనలన్నీ ఒకే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అది – ప్రత్యామ్నాయాలను అన్వేషించ డంలో, నూతన మార్కెట్లను అందిపుచ్చుకోవడంలో మనం చూపుతున్న అలసత్వం. ఒకే మార్కెట్‌పై లేదా ఒకే కొనుగోలుదారుపై ఆధారపడటం ఎంత ప్రమాదకరమో ఈ సంక్షోభాలు గుణపాఠం నేర్పుతున్నాయి. ప్రభుత్వాలు, పరిశ్రమ వర్గాలు, రైతులు కలిసికట్టుగా ప్రత్యామ్నాయ మార్కెటింగ్‌ ‌వ్యూహాలను, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేనిచో, మానవ వనరులు, ఆర్థిక శక్తి రూపంలో మనం భారీ నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది.

తురగా నాగభూషణం

సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE