రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఏడాదిన్నర క్రితం పూర్తికావలసి ఉండగా కారణాంతరాల వల్ల వాయిదాలు పడుతూన్నాయి. వెనుకబడి తరగతుల వారికి 42 శాతం అమలు, పోటీ చేయాలనుకునే వారికి సంతాన పరిమితి లాంటి అంశాలు ఈ జాప్యానికి కారణంగా చెబుతున్నారు. రిజర్వేషన్‌ ‌బిల్లు రాష్ట్రపతి పరిశీలనలో ఉంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు అడ్డంకిగా ఉన్న‘ఇద్దరు పిల్లలు’ నిబంధనను తొలగించాల్సి ఉంది. అందుకు కాంగ్రెస్‌ ‌సర్కార్‌ ‌కసరత్తు చేస్తోంది.

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఊరిస్తున్నాయి. ఏడాదిన్నర కాలంగా ఎన్నికలు వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉన్నాయి. ఎన్నికల నిర్వహణలో జాప్యంపై జోక్యం చేసుకొన్న న్యాయస్థానం, వీలైనంత తొందరగా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించినప్పటికీ ప్రభుత్వం మాత్రం సందిగ్ధంలో నుంచి బయటకు రావడం లేదు. ఈ ఎన్నికలపై తనదైన ముద్ర వేసుకోవాలని కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం తాపత్రయ పడుతోంది. పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించిన నిబంధనలు సడలించడం, ప్రత్యేకంగా బీసీలకు రిజర్వేషన్ల అమలు అనే ప్రధాన అంశాలపై దృష్టిపెట్టింది. ఇందులో భాగంగానే అసెంబ్లీలో బిల్లుకు ఆమోదం తెలిపి రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించింది. ఆ బిల్లు అక్కడ పెండింగ్‌లో ఉంది. అయినప్పటికీ ఈ ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు చేయాలన్న పట్టుదలతో ప్రభుత్వం న్యాయ నిపుణులతో వరుసగా చర్చలు సాగిస్తోంది. ఢిల్లీ స్థాయిలోనూ న్యాయ కోవిదులతో భేటీలు నిర్వహిస్తోంది. ప్రభుత్వం పరంగా సాధ్యం కాకపోతే పార్టీ పరంగా అయినా ఈ రిజర్వేషన్లను అమలు చేయాలన్న సమాలోచనలు చేస్తోంది. అవసరమైతే ఈ అంశంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు కూడా సిద్ధమవుతోంది.

రిజర్వేషన్ల అంశం పక్కన బెడితే మరో కీలక మార్క్‌ను సొంతం చేసుకోవాలనుకుంటోంది కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పటి వరకూ ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్లు మాత్రమే పోటీకి అర్హులు.ఉమ్మడి ఆంధప్రదేశ్‌ ‌ప్రభుత్వం చేసిన ఈ చట్టం ఇప్పటికీ కొనసాగుతోంది. 1994వ సంవత్సరంలో నాటి ప్రభుత్వం పంచాయతీరాజ్‌ ‌చట్టంలో ఈ నిబంధనను చేర్చింది. అయితే, గత బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం 2019లో మున్సిపాలిటీ ఎన్నికల సమయంలో ప్రత్యేక ఆర్డినెన్స్ ‌ద్వారా మున్సిపాలిటీ చట్ట సవరణ చేసింది. ఎంతమంది పిల్లలున్నా మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హులుగా నిబంధనలు మార్చేసింది. ఇప్పుడు మిగతా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ఇవే డిమాండ్లు చుట్టుముట్టడంతో సర్పంచ్‌, ఎం‌పీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ ఇద్దరు సంతానం నిబంధనను ఎత్తివేయాలని కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం యోచిస్తోందంటు న్నారు. పై కారణాల వల్లే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ ‌విడుదలలో ఆలస్యమవుతోందని సర్కారు పెద్దలు చెప్పుకుంటున్నారు. కానీ, ఇప్పటికిప్పుడు స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌ ‌పార్టీకి ఎక్కడా ఆదరణ ఉండదని, ఆ పార్టీ బలపరిచే అభ్యర్థులు ఓడిపోతారన్న స్పష్టమైన సంకేతాలు ఉన్నాయని, అందుకే ఎన్నికల నిర్వహణను ప్రభుత్వం వాయిదా వేస్తోందని విపక్షాలు విమర్శలు అంటున్నాయి.

అయితే, సంతాన పరిమితి నిబంధనను ఎత్తివేయాలని కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. వాస్తవానికి గత సంవత్సరమే ‘ఇద్దరు పిల్లల’ నిబంధనను ప్రభుత్వం తొలగిస్తుందని అందరూ ఎదురు చూశారు. ఇప్పుడు మాత్రం ప్రజాప్రతినిధుల నుంచి వస్తున్న ఒత్తిళ్ల మేరకు, పిల్లల సంఖ్యతో ప్రమేయం లేకుండా పోటీ చేయవచ్చుననే నిబంధన అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేపట్టిందంటున్నారు. ఈ నిబంధనను రద్దు చేసేందుకు పంచాయతీరాజ్‌ ‌చట్టం 2018 సెక్షన్‌ 21(3)‌ని తొలగించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. త్వరలో జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ అంశాన్ని ఎజెండాగా పెట్టుకొని నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ నిబంధనను ఎత్తివేసే ఆలోచన ఉందని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల వెల్లడించడంతో అధికారులు ఆ దిశగా చర్యలు చేపడుతున్నారట. సర్పంచ్‌, ఎం‌పీటీసీ•, జడ్పీటీసీలకు త్వరలో ఎన్నికలు జరగబోతున్నందున ఇద్దరు పిల్లల నిబంధనపై ఎత్తివేతపై ప్రభుత్వం తీసుకునే ఈ కీలక నిర్ణయం కోసం అభ్యర్థులు ఆశగా ఎదురు చూస్తున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో పాటు మిగిలిన వారు ఎన్నికల్లో పోటీ చేసేందుకు సంతాన పరిమితి నిబంధన తొలగింపు తప్పనిసరి అని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నిబంధనను సవరించడం ద్వారా పార్టీ సానుభూతి పరులు ఎక్కువ మందిని గెలుచుకునేందుకు కాంగ్రెస్‌ ‌పార్టీ వ్యూహ రచన చేస్తోంది. గ్రామ స్థాయి నుంచి పటిష్ట నాయకత్వం ఉండేందుకు ఈ అంశం దోహదపడుతుందని భావించిన ప్రభుత్వం 2018 సెక్షన్‌ 21(3)‌ని తొలగించే చట్టసవరణకు డిసైడ్‌ అయ్యింది.

అధిక జనాభాను నియంత్రించే ఉద్దేశ్యంతో కుటుంబ నియంత్రణ చర్యల్లో భాగంగా ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో ఈ నిబంధన 1995 మే 30 నుంచి అమల్లోకి వచ్చింది. పంచాయతీరాజ్‌ ‌చట్టంలోని 21వ పేజీలో 3వ అంశంగా ఈ నిబంధనను చేర్చింది. ఈ నిబంధన స్థానిక ఎన్నికల్లో పోటీకి చాలా మందికి అడ్డంకిగా మారింది. అయితే, ప్రస్తుతం కుటుంబ నియంత్రణపై ప్రజల్లో అవగాహన పెరిగినందున పాత నిబంధనను మార్చాలని, ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్న వారూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వాలని పలు రాజకీయ పార్టీలు, ప్రజా ప్రతినిధులు చాలా కాలంగా డిమాండ్‌ ‌చేస్తున్నారు. ఈ నిబంధనను మార్చేందుకు గతంలో ఒకసారి మంత్రివర్గ సమావేశంలో చేసిన ప్రతిపాదన ఆమోదం పొందలేదు. అయితే, ఇటీవల బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేసేందుకు ఉద్దేశించి ఇప్పుడు ఉన్న రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేసేందుకు అవకాశం ఇస్తూ చేసిన చట్ట సవరణ సమయంలోనూ ఇద్దరు పిల్లల నిబంధన తొలగింపు నకు సంబంధించి పంచాయితీ రాజ్‌ ‌చట్టం 2018లోని సెక్షన్‌ 21(3)‌ని తొలగింపుపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇందుకు అవసరమైన చట్టసవరణకు కూడా ప్రయత్నించలేదు. అయితే.. పంచాయితీ రాజ్‌ ‌చట్టం 2018లోని సెక్షన్‌ 21(3)‌ని తొలగించే ప్రతిపాదనను త్వరలో జరిగే మంత్రివర్గ సమావేశంలో ప్రవేశపెట్టాలని మంత్రులు సైతం కోరడంతో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో ప్రవేశపెట్టిన ఈ పరిమితిని ఎత్తివేయడానికి ప్రస్తుతం ఎటువంటి ఇబ్బందులు లేవని మంత్రులు అంతా మద్దతు ఇచ్చారు. త్వరలో జరిగే వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో ఈ చట్టసవరణను ఆర్డినెన్స్ ‌ద్వారా ప్రవేశపెట్టాలా, లేదా బిల్లు ద్వారా ప్రవేశపెట్టాలా అనే విషయాన్ని తెలంగాణ మంత్రివర్గ సమావేశం నిర్ణయించే అవకాశం ఉంది.

ఇద్దరు పిల్లల నిబంధనకు సంబంధించి ఈ చట్టం అమల్లోకి తీసుకు వచ్చిన సమయంలో కొన్ని ముఖ్యమైన అంశాలను చేర్చారు. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తేదీకి ముందు ఎంత మంది పిల్లలు ఉన్నా ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హులు అవుతారని ఆ చట్టంలో నిబంధనలు రూపొందించారు. అయితే, చట్టం అమల్లోకి వచ్చిన ఏడాదిలోగా అంటే 1995 మే 29వ తేదీలోగా మూడో బిడ్డ పుట్టినా అనర్హులు కాకుండా మినహాయింపును ఇచ్చారు. 1995 మే 30వ తేదీ తర్వాత పుట్టిన పిల్లలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటూ 1994లో ఆ చట్టం చేశారు.

ఇక దీనిలో భాగంగా దత్తతకు సంబంధిం చిన పిల్లలు కూడా అసలు తల్లిదండ్రుల లెక్కలోనే ఉంటారు. ఈ మేరకు 2006లో హైకోర్టు కూడా తీర్పు వెలువరించింది. అంటే ఒక అభ్యర్థికి ముగ్గురు పిల్లలు ఉండి ఒకరిని దత్తత ఇచ్చేసినా వారు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలులేదని పేర్కొంది.       ఇక.. అభ్యర్థి మొదటి భార్యకు ఇద్దరు పిల్లలు, రెండో భార్య ద్వారా మరో బిడ్డ ఉంటే వారినీ అనర్హులుగానే ఆ చట్టం పరిగణించింది. నామినేషన్‌ ‌వేసే నాటికి ముగ్గురు పిల్లలు ఉండి, పరిశీలన జరిగే రోజుకి అందులో ఒకరు చనిపోయినా వారు అర్హులు అవుతారని పేర్కొంది. ఇది ఇలా వుంటే గత ఏడాది చట్ట సవరణ ఆమోదించడంతో ఆంధప్రదేశ్‌తో పాటు పలు రాష్ట్రాలు ఇద్దరు పిల్లల నిబంధనను తొలగించాయి. పంచాయతీ రాజ్‌ ‌చట్టం నుంచి ఈ నిబంధనను తొలగిస్తూ ఏపీ•లో కూటమి ప్రభుత్వం గత ఫిబ్రవరిలో సవరణ తెచ్చి ఈ ఏడాది ఫిబ్రవరి 11 నుంచి అమలులోకి తెస్తూ ఈ సవరణపై న్యాయశాఖ గెజిట్‌ ‌నోటిఫికేషన్‌ ‌కూడా జారీ చేసింది. దీంతో ఇక తెలంగాణలో కూడా ఇద్దరు పిల్లల నిబంధనను తొలగించేందుకు రేవంత్‌రెడ్డి సర్కార్‌ ‌వేగంగా అడుగులు వేస్తోంది. రాబోయే వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో ఈ మార్పును ఆర్డినెన్స్ ‌ద్వారా ప్రవేశపెట్టాలా లేదా బిల్లు ద్వారా ప్రవేశపెట్టాలా వద్దా అనే విషయాన్ని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయి స్తుంది. తెలంగాణ హైకోర్టు ఇంతకుముందు ఇద్దరు పిల్లల నిబంధనను సమర్థించింది, దీనిని తొలగిం చడం ప్రభుత్వమే నిర్ణయించాలని పేర్కొంది. పట్టణ మున్సిపల్‌ ఎన్నికల కోసం ఇప్పటికే ఈ నిబంధనను రద్దు చేసినందున, గ్రామీణ అభ్యర్థులపై ఈ నిబంధన వివక్ష చూపుతుందని పిటిషనర్లు వాదించారు.

స్థానిక సంస్థల ఎన్నికలలో వెనుకబడిన తరగతులకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ప్రణాళిక నేపథ్యంలో ఈ మార్పు అత్యవసరమని ప్రభుత్వం విశ్వసిస్తోంది. ఈ నిబంధనను తొల గించడం వల్ల రాజకీయ పార్టీలకు బీసీల నుండి మాత్రమే కాకుండా ఇతర వర్గాల నుండి కూడా అభ్యర్థులను ఎంపిక చేయడంలో ఎక్కువ వెసులుబాటు లభిస్తుందన్న చర్చ జరుగుతోంది.

సుజాత గోపగోని

సీనియర్‌ ‌జర్నలిస్ట్, 6302164068

About Author

By editor

Twitter
YOUTUBE