దేశ రాజధాని ఢిల్లీలో వీధికుక్కల సమస్య తీవ్రత చివరకు సుప్రీంకోర్టు కలుగజేసుకునే స్థాయికి చేరుకోవడంతో ఒక్కసారిగా పతాక శీర్షికల్లో చోటు చేసుకోవడం మొదలైంది. ఇక విశ్లేషణలు, కథనాలు సరేసరి! ఒక సమస్యను చిలవలు పలవలు చేసి అసలు సమస్యను పక్కదోవ పట్టించడంలో మనకు మనమే సాటి అని ఈ వీధికుక్కల సమస్య మరోసారి వెల్లడించింది. ప్రజల సమస్యను మీడియా కథనాల ద్వారా చూసి సూమోటోగా స్వీకరించి సుప్రీం కోర్టు వీధికుక్కలను తరలించమని చెబితే, ఒక్కసారిగా జంతు ప్రేమికులకు ఎక్కడలేని ఆవేశాలు పూనడం ఈ ఎపిసోడ్‌లో విచిత్రం!
జంతువుల పట్ల ప్రేమ ఉండటంలో తప్పులేదు. కానీ వాటివల్ల ప్రమాదం వాటిల్లుతున్న ప్పుడు సముచిత పరిష్కారం కనుగొనడం అవసరం. సుప్రీంకోర్టు చూపిన పరిష్కారం నచ్చకపోతే ప్రత్యా మ్నాయ మార్గాలను కోర్టులో అప్పీలు చేయడం ద్వారా తెలియజేవచ్చు. ఏకంగా తీర్పును రద్దు చేయాలని కోరడం ద్వారా సమస్యకు ఈ జంతు ప్రేమికులు ఏవిధమైన పరిష్కారం చూపాలనుకుంటున్నారు? దీన్ని రాజకీయం చేసి, మతపరమైన ఉద్వేగాలను రెచ్చ గొట్టడం ద్వారా వీరు పావుకునేదేం లేదు. మీడి యాలో ప్రచారం తప్ప! వీధికుక్కలు చిన్న బిడ్డలవంటి వంటూ కన్నీళ్లు పెట్టుకొని ‘‘అతి’’ చేయాల్సిన అవసరం కూడా లేదు. పైగా కాలభైరవుడంటూ శివుడి పక్కనే వీటి ఫోటోలు పెట్టి సెంటి మెంట్‌ను రెచ్చగొట్టే యత్నాలు! ప్రతి దానికి ఒక పరిమితి ఉంటుందన్నది వీరు గుర్తించకపోవడం విచిత్రం! నీరు ప్రాణాధారమే, అట్లాగని ఏ రిజర్వాయ ర్లోనో లేక నదిలోనో దూకితే ప్రాణం పోతుంది. అగ్ని మనకు నిత్యావసరం. అట్లా గని అందులో వేలుపెట్టలేం కదా! వీధికుక్కలు ప్రాణులు! వాటికి హాని కలిగించకూడదు! కానీ వాటిని వీధుల్లో వదిలేస్తే మీదపడి కరుస్తున్నప్పుడు పరిష్కారం కనుగొనలేకుండా ఉండలేం! సుప్రీంకోర్టు కూడా వీటిని ఇతర ప్రాంతాలకు తరలించమన్నది కానీ, చంపమని కోరలేదు కదా! మరి ఎందుకింత రభస?
వీధికుక్కలపై తీర్పు రిజర్వ్
రాజధాని రీజియన్‌లోని జనావాసాలనుంచి వీధికుక్కలను తొలగించాలనే ఆదేశాలను తొలగించా లని వేసిన పిటిషన్లపై ఆగస్టు 14న సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఈ నేపథ్యంలో ఇచ్చిన ఆదేశాలను అత్యవసరంగా నిలుపుచేయాలని పిటిషనర్లు కోరగా అందుకు ధర్మాసనం తిరస్క రించింది. జంతుపరిరక్షణ సంస్థల తరపున ప్రముఖ లాయర్లు కపిల్ సిబల్, అభిషేక్ సింఘ్వి వాదించగా, ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తమ వాదనలను వినిపించారు. ఈ సంద ర్భంగా వీధికుక్కలను తరలించడానికి సరైన షెల్టర్లు లేవు, పోనీ ఒకేచోట వుంచితే వాటిలో అవి పోట్లాడు కుంటాయి. ఈ దాడుల్లో అవి మరణిస్తే ప్రాణాంతక వ్యాధులు వ్యాపిస్తాయి కనుక ఈ ఆదేశాలను తక్షణం ఉపసంహరించాలని పిటిషనర్ల తరపున న్యాయ వాదులు వాదించారు. అయితే జంతువులను ఎవరూ ద్వేషించడంలేదు. కుక్క కాట్లకు చాలామంది చిన్నా రులు మరణించారు. కేవలం స్టెరిలైజేషన్ చేస్తే రేబిస్ వ్యాప్తి ఆగదు. పిల్లలు బయటకు వచ్చి ఆడుకునే పరిస్థితి లేదు. కుక్కలను జనావాసాలనుంచి వేరు చేయడమే లక్ష్యమని సొలిసిటర్ జనరల్ తన వాదనను వినిపించారు.
గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలు ఇంకా ప్రజల్లోకి వెళ్లకముందే అధికారులు కుక్కలను పట్టుకోవడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకపక్క జంతు ప్రేమికుల ఆందోళన, మరోవైపు మనుషులు పడుతున్న బాధ, ఈ రెండింటిని పరిగణ లోకి తీసుకోవాల్సి ఉన్నదని ధర్మాసనం పేర్కొంది. ఈ క్రమంలో గత ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖ లైన పిటిషన్లపై తీర్పును జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ అంజరియాలతో కూడిన ధర్మాసనం రిజర్వ్ చేసింది. ఆగస్టు 12వ తేదీ నుంచే మున్సిపల్ అధికారులు కుక్కలను తరలించడం మొదలుపెట్టిన నేపథ్యంలో కోర్టు ఈ విధంగా ఆగ్రహం వ్యక్తంచేసి ఉండవచ్చు. అయితే ఇది కోర్టు ఆదేశాల మేరకు కాదని, కేవలం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ముందు తీసుకుంటున్న చర్య మాత్రమేనని మున్సిపల్ అధికారులు వివరణ ఇవ్వడం గమనార్హం.
సూమోటోగా స్వీకరించిన కోర్టు
వీధికుక్కల దాడులు, రేబిస్ బారిన పడి పలువురు మరణించిన సంఘటనలపై మీడియాలో వచ్చిన కథనాలను సుప్రీంకోర్టు సూమోటాగా స్వీకరించింది. ఈ క్రమంలో ఢిల్లీ ఎన్సీఆర్‌లో వీధిలో వున్న కుక్కలన్నింటినీ డాగ్ షెల్టర్‌కు తరలించాలని ఆగస్టు 11న జస్టిస్ జేబీ పార్థీవాలా, జస్టిస్ ఆర్. మహదేవన్ లతో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది. ఈ తరలింపునకు ఢిల్లీ ప్రభుత్వానికి ఆరునుంచి ఎనిమిది వారాల గడువు విధిస్తూ, మళ్లీ అవి జనావాసాల్లో కనిపిస్తే సంబంధిత అధికారులపై కఠినచర్యలు ఉంటాయని పేర్కొంది. అంతేకాదు శునకాల తరలింపును అడ్డుకుంటే కఠిన చర్యలుంటాయని జంతు ప్రేమికులను హెచ్చరించింది. దీంతో ఈ తీర్పు సమంజసం కాదంటూ వారు ఆందోళనకు దిగారు. ఇక సోషల్ మీడియాలో రాజకీయ వర్గాలకు చెందినవారు, రాజకీయే తరులు కూడా తమ అభ్యంతరాలను తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఆమోదయోగ్యంగా లేవంటూ కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా, సినీ నటులు జాన్వీ కపూర్, వరుణ్ ధావన్, సినీ నిర్మాత సిద్దార్థ్ ఆనంద్ వంటివారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడంతో ఈ సమస్యకు ఎక్కడలేని ప్రాచుర్యం లభించింది. శాస్త్రీయత బాగా అభివృద్ధి చెందిన నేటి కాలంనుంచి దశాబ్దాల వెనక్కు వెళ్లినట్టుగా సుప్రీంకోర్టు తీర్పు ఉన్నదని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఏకమొత్తంగా వీధికుక్కలను తరలించడం కేవలం హ్రస్వదృష్టితో కూడిన క్రూరమైన నిర్ణయంగా వర్ణించడంతో సమస్యకు రాజకీయ రంగు పులుము కుంది. మాజీ ఎంపీ వరుణ్ గాంధీ మాట్లాడుతూ క్రూరత్వాన్ని వ్యవస్థీకృతం చేసే నిర్ణయం ఇదంటూ వ్యాఖ్యానించారు. ఆయన మాతృమూర్తి మేనకాగాంధీ సుప్రీంకోర్టు నిర్ణయాన్ని అవాస్తవికమైన, ఆర్థికంగా సముచితం కాని, హానికారక నిర్ణయంగా అభివర్ణిం చారు. శునకప్రేమికులు కన్నాట్ ప్లేస్‌లో నిర్వహించిన నిరసన ప్రదర్శనలో ‘‘జాగ్రత్త కాలభైరవుడు చూస్తున్నాడు: సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా సంఘీభావం ప్రకటిస్తున్నాం’’ వంటి ప్లకార్డులను ప్రదర్శించడం ద్వారా ఇది మత, సాంస్కృతిక పరమైన సమస్యగా మార్చే ప్రయత్నం మొదలైంది. చాలామంది ప్రదర్శకులు శివుడు, ఆయన పక్కనే కుక్క ఉన్న ప్లకార్డులను ప్రదర్శించడం గమనార్హం. చిన్న పిల్లల వంటి ఈ కుక్కలను తరలించవద్దంటూ కొందరు జంతు ప్రేమికులు ఏకంగా కళ్లనీళ్లు పెట్టుకోవడం విశేషం. ఈ పరిణామాల నేపథ్యంలో కొందరు ఏకంగా కోర్టును ఆశ్రయించారు. దీంతో సుప్రీంకోర్టు ఆదేశాలను పరిశీలిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయ్ హామీ ఇచ్చి, కేసును ముగ్గురు న్యాయమూ ర్తులతో కూడిన ధర్మాసనానికి బదిలీ చేశారు.
దేశంలో 37 లక్షల కుక్కకాటు కేసులు
కిందటేదాది దేశవ్యాప్తంగా 37 లక్షల కుక్కకాటు కేసులు నమోదు కాగా 54 రేబిస్ మరణాలు సంభవించినట్టు పార్లమెంటుకు సమర్పించిన సమాచారం పేర్కొంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం 2023లో దేశంలో 27.5 లక్షల కుక్కకాటు కేసులు నమోదయ్యాయి. ఇది అధికారిక సమాచారం. నమోదు కాని కేసులు మరెన్నో ఉండవచ్చు. ఈ ఏడాది ఢిల్లీలో ఇప్పటివరకు 26,334 కుక్కకాటు కేసులు నమోదయినట్టు అధికారిక మున్సిపల్ సమాచారం వెల్లడి స్తోంది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ప్రస్తుతం 20 జంతు నియంత్రణ కేం ద్రాలను నిర్వహిస్తోంది. వీటన్నింటిలో ఐదువేల కుక్కలను మాత్రమే ఉంచడం సాధ్యం. కుక్కలను పట్టుకోవడం, వాటిని ఈ కేంద్రాలకు తరలించి, తగిన ఆహారం ఇవ్వడం పెద్ద శ్రమ మాత్రమే కాదు, ఎంతో ఖర్చుతో కూడింది. ముఖ్యంగా కుక్కలను పట్టుకునేవారు, వెటర్నరీ డాక్టర్లు, అంబులెన్స్‌లు, వాటిని నడిపేవారు, ఈవిధంగా ఎంతోమందిని నియమించాలి. ఇదంతా కార్పొ రేషన్‌కు తలకు మించిన భారం. ఇప్పుడు ఎంసీడీ ముందున్న ప్రధాన సమస్య ఇది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) కుక్కలకోసం మరిన్ని షెల్టర్లు నిర్మించాలని నిర్ణయించింది. కానీ వీటి నిర్మాణానికి స్థలం కేటా యింపు ఎట్లా అన్నదే ప్రధాన ప్రశ్న. అంతర్జాతీయ ప్రజారోగ్య మార్గదర్శకాలకు కోర్టు ఆదేశాలు విరుద్ధంగా ఉన్నాయని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ యానిమల్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్‌ఐఏపీఓ) సీఈవో భారతీ రామచంద్రన్ అభిప్రాయపడ్డారు. నగరంలోని వీధికుక్కలకు స్టెరిలైజేషన్ చేసి, ఇతర ప్రాంతాలకు తరలిస్తే, ఖాళీ అయిన ప్రదేశాల్లోకి ఇతర ప్రాంతాల కుక్కలు వచ్చి చేరతాయని, అందు వల్ల వీధికుక్కల తరలింపు సముచిత పరిష్కారం కాదని జంతుప్రేమికుల వాదన. కుక్కల తరలింపు విషయంలో భాగస్వాములందరినీ సంప్రదించిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాలను ఆగస్టు 15 నుంచి దశలవారీగా అమలు చేస్తామని స్పష్టం చేసింది.
ఏటా సగటున పదివేల స్టెరిలైజేషన్లు
ఎంసీడీ గణాంకాల ప్రకారం ప్రతినెల సగటున పదివేల వీధికుక్కలను స్టెరిలైజ్ చేస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు 65వేల కుక్కలకు స్టెరిలైజేషన్ కార్యక్రమం పూర్తయింది. 2024 ఏప్రిల్ నుంచి 2025 డిసెంబర్ మధ్యకాలంలో నగరంలో 98వేల కుక్కలకు స్టెరిలైజేషన్ నిర్వహించాలన్నది లక్ష్యం. 2023-24లో 79,959 కుక్కలకు, 2022-23లో 59,076 కుక్కలకు స్టెరిలైజేషన్ నిర్వహించినట్టు ఎంసీడీ రికార్డులు తెలుపుతున్నాయి. ప్రస్తుతం నగరం వ్యాప్తంగా 20 స్టె రిలైజేషన్ కేంద్రాలు నడుస్తున్నాయి. యానిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ) నిబంధనల కింద వీటిని స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్నాయి. ఈ నిబంధనల ప్రకారం స్టెరిలైజేషన్ పూర్తయిన తర్వాత ఆయా కుక్కలను తిరిగి వాటి ప్రదేశాలకు పంపేయాలి.
రాజస్థాన్, గోవాలు ఆదర్శం
ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా నమోదయ్యే రాబిస్ కేసుల్లో 36% భారత్‌లోనే నమోదవుతున్నాయి. ఇక భారత్‌లో నమోదయ్యే కేసుల్లో 30 నుంచి 60శాతం వరకు 15ఏళ్ల లోపు వయస్సు పిల్లలే ఉండటం గమనార్హం. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో జంతు పరిరక్షణ గ్రూపులు గత దశాబ్ద కాలంగా ఏబీసీ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాయి. దీంతో వీధికుక్కల సంఖ్య సగానికి సగం తగ్గింది. కొత్తగా జన్మించే కుక్కపిల్లల సంఖ్య మొత్తం వీధికుక్కల జనాభాలో 19% నుంచి 2%కు పడిపోయింది. గోవా రాష్ట్రం వీధికుక్కలకు సామూహిక రేబిస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇప్పటివరకు 70% కుక్కలకు విజయ వంతంగా వ్యాక్సినేషన్ పూర్తిచేయడం గమనార్హం. బెంగళూరులో కార్పొరేషన్ తీసుకున్న చర్యల వల్ల వీధికుక్కల సంఖ్య 10శాతం వరకు తగ్గింది. అయితే బెంగళూరు శాసనసభలో ఆగస్టు 13న వీధికుక్కలపై ఆసక్తికర చర్చ జరిగింది. ఈ సందర్భంగా జేడీఎస్ ఎమ్మెల్యే ఎస్.ఎస్. బోజేగౌడ్ మాట్లాడుతూ తాను చిక్కమగళూరు మున్సిపల్ ఛైర్మన్‌గా ఉన్నకాలంలో 2,800 వీధికుక్కలను చంపేయ డాన్ని స్వయంగా పర్యవేక్షించానని చెప్పడంతో సభ్యుల్లో ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తమైంది. చంపిన కుక్కల శవాలను చెట్ల కింద సమాధిచేయడం ద్వారా ఎరువుగా మారే విధంగా చర్యలు తీసుకున్నానని ఆయన వివరించారు. పైగా ఆయన ఈ విషయాన్ని నవ్వుతూ చెప్పడంతో సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవు తున్నాయి. ఆయన్ను ఒక క్రూరుడిగా వర్ణిస్తున్నారు. మొత్తంమీద పరిశీలిస్తే స్టెరిలైజేషన్ పక్రియ ఉత్తమ ఫలితాలిస్తున్నట్టు దేశంలోని ఇతర రాష్ట్రాలు అనుసరించిన విధానాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ వీధికుక్కల వ్యవహారం ఏవిధంగా పరిష్కారమవుతుందో వేచి చూడాలి!
జమలాపురపు విఠల్‌రావు
సీనియర్ జర్నలిస్ట్