సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం. ఎన్నికల కమిషన్‌ ‌రాజ్యాంగబద్ధ, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ. ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్నది. ఈ మూడు ఏం చెప్పినా తాము గౌరవించేది లేదన్న రీతిలో, రోడ్ల మీద తేల్చుకోవడమే మా సంస్కృతి అన్న చందంగా ఉంది కాంగ్రెస్‌ ‌ప్రముఖుడు, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ వ్యవహారం. ఓట్‌ ‌చోరీ (ఓట్ల దొంగతనం) వంటి అవమానకరమైన పదబంధం ప్రయోగించవద్దు. మీరు చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు చూపండి అని కేంద్ర ఎన్నికల సంఘం ఆగస్ట్ 14‌వ తేదీన కోరింది. మీరు చెబుతున్న ఒక వ్యక్తి ఒకే ఓటు అన్న సూత్రం దేశంలో తొలి ఎన్నికలు జరిగిన 1951-52 సంవత్సరం నుంచే అమలవుతున్నదని ఎన్నికల సంఘం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించింది. కానీ ఇదే పదాన్ని రాహుల్‌ ‌గాంధీ లోక్‌సభలో ప్రయోగించారు. అప్పుడు మోదీ ఇంటి పేరు వారంతా దొంగలేనని అన్నాడీ ప్రబుద్ధుడు. ఇప్పుడు దేశంలో ఓటు చౌర్యం అని ప్రజాస్వామ్యాన్ని, ఓటర్లనీ అత్యంత నీచంగా అవమానిస్తున్నారు.

ఎన్నికల సంఘం రాహుల్‌ ‌గాంధీ అర్థమయ్యే టట్టు చెప్పడానికి ఒక వాక్యం రాసింది. ఎవరైనా ఓటరు రెండు పర్యాయాలు ఓటు వేస్తే, ఆధారాలతో సహా, లిఖిత పూర్వక ఫిర్యాదును ఎన్నికల సంఘానికి ఇవ్వాలి. అంతేకాని, దేశంలోని ఓటర్లంతా దొంగ ఓటర్లే అన్న భావనను తీసుకురాకండి అని కూడా సూచించింది. ఓటు చౌర్యం వంటి మాటలు ప్రయోగించడం దేశంలోని కోట్లాది మంది ఓటర్లను అవమానించడమే కాదు, ఎన్నికల సిబ్బంది యావత్తును కూడా అవమానిస్తున్న సంగతిని గుర్తించాలని కూడా ఎన్నికల సంఘం తన ప్రకటనలో వ్యాఖ్యానించింది. వాస్తవానికి ఈ సమస్య గురించి నేరుగా కేంద్ర ఎన్నికల సంఘంతో చర్చించే ఉద్దేశం కాంగ్రెస్‌ ఉం‌దా? అంటే, అనుమానమే. ఆగస్ట్ 11‌వ తేదీ నాటి విపక్ష ప్రదర్శనతో కాంగ్రెస్‌ ఎం‌పీ జైరామ్‌ ‌రమేశ్‌ ‌సహా 30 మంది ఎంపీలతో సమస్య గురించి చర్చించడానికి సిద్ధంగా ఉన్నట్టు ఎన్నికల కమిషన్‌ ‌తెలియచేసింది. కానీ ఆ రోజు ఏ ఒక్కరు కమిషన్‌ అధికారులతో చర్చించడానికి వెళ్లలేదు. కమిషన్‌ అధికారులతో మధ్యాహ్నం 12 గంటలకు సమావేశం కావడానికి జైరామ్‌ ‌రమేశ్‌ ‌మొదట అంగీకరించినా తరువాత మొహం చాటేశారు. ఇంక కాంగ్రెస్‌ను ఎవరు నమ్ముతారు అంటూ ఒక అధికారి వ్యాఖ్యానించినట్టు హిందూస్తాన్‌ ‌టైమ్స్ ‌నమోదు చేసింది. నిజానికి పలు అంశాల మీద చర్చిండానికి మొదట జైరామ్‌ ‌రమేశ్‌ ఎన్నికల సంఘాన్ని సమయం కోరారు. దానితో ఆగస్ట్ 11 ‌మధ్యాహ్నం కమిషన్‌ ‌సమయం కేటాయించింది. ఓటర్ల జాబితాలలో తప్పొప్పులు ఎన్నికల సంఘంతో కాకుండా రాహుల్‌ ‌గాంధీ, విపక్షాలు వేరే ఎవరితో చర్చిస్తారు మరి?
సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశం పట్ల అయినా రాహుల్‌కు గౌరవం ఉన్నదా అంటే, అదీ కనపడడం లేదు. బిహార్‌లో తలపెట్టిన స్పెషల్‌ ఇం‌టెన్సివ్‌ ‌రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌)‌ను, అందుకు ఇచ్చిన 11 ధ్రువీకరణ పత్రాలను కూడా సుప్రీంకోర్టు ఆగస్ట్ 13‌న ఇచ్చిన ఆదేశంలో సమర్ధించింది. ఓటర్ల సంఖ్య కలకాలం స్థిరంగా ఉండిపోవడం శాస్త్రీయమే కాదని కూడా తేల్చి చెప్పింది. కాలానుగుణంగా ఓటర్ల సంఖ్య మారక తప్పదు. గతంలో ఓటరుగా నిరూపించు కోవడానికి ఏడు రకాల ధ్రువీకరణలే ఉండేవి. ఇప్పుడు ఆ సంఖ్యను 11 చేసి ఎన్నికల సంఘం ఆ పక్రియను మరింత సులభతరం చేసిందని కూడా అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.
నిష్పాక్షిక ఎన్నికలు, నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోనివ్వడం అన్న మాటలు కాంగ్రెస్‌ ‌పార్టీ చరిత్రకు తెలియని అంశాలు. దేశంలో వటవృక్షం మాదిరిగా కాంగ్రెస్‌ ‌రాజ్యమేలుతున్న కాలంలో ఏ రాష్ట్రంలోను ఆ పార్టీ సజావుగా ఎన్నికలు జరిపేందుకు సహకరించలేదు. ఓటరు జాబితాల తయారీ ఒక ప్రహసనం. ఇందుకు బీజేపీ చూపించిన తాజా ఉదాహరణ ఇది. కాంగ్రెస్‌ ‌మహారాజ్ఞి సోనియా గాంధీ భారత పౌరురాలు కాకుండానే ఇక్కడ ఓటరుగా ఆమె పేరు నమోదు చేశారు. ఇప్పుడు ఇదే అంశాన్ని బీజేపీ బయట పెట్టింది. 1946లో పుట్టిన సోనియా మెయినో సోనియా గాంధీ పేరుతో 1980 నుంచి 1982 వరకు ఇక్కరుగా చెలామణి అయ్యారు. అయితే ఆమె భారత పౌరురాలు అయినది మాత్రం 1983. ఈ అంశాన్ని కేంద్ర మాజీ మంత్రి అనురాగ్‌ ‌ఠాకూర్‌ ఆగస్ట్ 13‌న బయట పెట్టారు. ఇదే విషయాన్ని ఎన్‌డీటీవీ కూడా బయట పెట్టింది. బీజేపీ ఇప్పుడు వేస్తున్న ప్రశ్న ఒక్కటే. స్వతంత్ర భారత ఎన్నికల చరిత్రలో ఇంతకుమించిన అక్రమం మరొకటి ఉంటుందా? నాటి ప్రధాని ఇందిరాగాంధీ అధికార నివాసం చిరునామా ఈ అక్రమ ఓటు నమోదయింద న్నది గమనార్హం.
అసలు తనను ఓటరుగా నమోదు చేయమని సోనియా కోరనే లేదు. అధికారులే ఆమె పేరు రాసుకుని వెళ్లారు అంటూ 45 ఏళ్ల నాటి ఆ ఉదంతం గురించి తారిక్‌ అన్వర్‌ ఎన్‌డీటీవీతో అనడం మరీ విచిత్రం. ఇందుకు ఎన్నికల సంఘాన్ని తప్పు పట్టాలి తప్ప సోనియాను కాదు అంటాడాయన. అసలు 1952 నాటి భారత తొలి ఎన్నికల నుంచి కాంగ్రెస్‌ ఎన్నికల అక్రమాలకు పాల్పడుతూనే ఉందని అనురాగ్‌ ‌ఠాకూర్‌ ఆరోపించారు. రాహుల్‌ ‌గాంధీ ప్రస్తుతం ప్రతిదానికి ఒక ఎర్ర పుస్తకాన్ని గాల్లో ఊపుతూ రాజ్యాంగ రక్షణ అంటూ ఉంటాడు. ఇంతకీ తొలి ఎన్నికలలో కాంగ్రెస్‌, ‌సీపీఐ కలసి రాజకీయాలలో యోగి వంటి డా. బీఆర్‌ అం‌బేడ్కర్‌ను ఓడించడానికి ఎన్ని ఎన్నికల అక్రమాలకు పాల్పడలేదు? అని ప్రశ్నించారు అనురాగ్‌. ఆ ఎన్నికలలో డా. అంబేడ్కర్‌ 14,561 ఓట్ల తేడాతో ఓడిపోయారు. కానీ ఆ సమయంలో మొత్తం 74,333 ఓట్లను జాబితా నుంచి తిరస్కరించారు. కావాలంటే రికార్డులు చూసుకోవచ్చునని అనురాగ్‌ ‌సవాలు విసిరారు. భారత రాజ్యాంగ నిర్మాతనే ఓట్ల అక్రమాలతో కాంగ్రెస్‌ ‌పార్లమెంటులోకి రాకుండా చేయాలని చూసిందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్‌ ఎప్పుడు ఓడిపోయినా, పాతకాలం నుంచి నేటి రాహుల్‌ ‌వరకు ఆ నెపం ఎన్నికల సంఘం మీదకు నెట్టివేయడం సర్వసాధారణంగా వస్తున్నదని కూడా ఆయన అన్నారు. ఒక సమయంలో ఇందిరాగాంధీ ఓటర్లంటే దద్దమ్మల బృందమని వ్యాఖ్యానించారని చెప్పారు అనురాగ్‌.
‌బీజేపీకి అనుకూలంగా కేంద్ర ఎన్నికల సంఘం ఓటు చౌర్యానికి పాల్పడుతున్నదంటూ కాంగ్రెస్‌ ‌నాయకత్వంలో ప్రతిపక్షాలు నిర్వహిస్తున్న వీధి తమాషా దేశ ప్రజలలో అంతకంతకు వెగటు పుట్టిస్తున్నది. అంతేకాదు, రాహుల్‌ ‌గాంధీ అడ్డూ ఆపూ లేకుండా చేస్తున్న ఆరోపణలు ఎక్కువ వికటిస్తున్నాయి. స్పెషల్‌ ఇం‌టెన్సివ్‌ ‌రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) ‌పేరుతో ఎన్నికల సంఘం దొంగ ఓట్లను, మరణించిన వారి ఓట్లను తొలగించే పనిని ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయి. పార్లమెంటు నుంచి ఎన్నికల కమిషన్‌ ‌కేంద్ర కార్యాలయం వరకు 200 నుంచి 300 మంది ఎంపీలతో ఆగస్ట్ 11‌న జరిపిన ప్రదర్శనను పోలీసులు అడ్డుకున్నారు. తమ ప్రదర్శన రాజకీయ పరమైనది కాదని, రాజ్యాంగ పరిరక్షణకు సంబంధించినదని రాహుల్‌ ‌గాంధీ వ్యాఖ్యానించారు. ఈయన సోదరి ప్రియాంక మాత్రం ప్రభుత్వం పిరికిదని విమర్శించారు.
12వ తేదీన ఎన్నికల కమిషన్‌ ‌కార్యాలయం వరకు మరికొన్ని ప్రదర్శనలు నిర్వహించారు. ఈ ప్రదర్శనలో ఒక ఫోటోను ముద్రించిన టీ-షర్ట్‌ను ఎంపీలు, కార్యకర్తలు ధరించారు. రాహుల్‌ ‌గాంధీ, మరొక కాంగ్రెస్‌ ‌ప్రముఖుడు గౌరవ్‌ ‌గొగొయ్‌, ‌పియాంకా వాద్రా కూడా అదే టీషర్ట్ ‌ధరించారు. ఆ టీషర్ట్‌ల మీద ముద్రించిన ఫోటో ఇప్పుడు వివాదాస్పదమైంది. బిహార్‌కు చెందిన మింతా దేవి అనే మహిళ ఫోటో అది. ఆ ఫోటో కింది 124 నాట్‌ అవుట్‌ అన్న వ్యాఖ్య కూడా ఉంది. ఎన్నికల సంఘం ఓట్ల నమోదు లేదా తొలగింపు ఎంత హాస్యాస్పదంగా ఉన్నదో చెప్పడానికి ఆ ఓటరు ఉదంతమే గీటురాయి అని విపక్షాలు వీరంగం వేస్తున్నాయి. మింతా దేవి వయసు ఓటర్ల జాబితాలో 124 అని పడింది. ఆ టీషర్ట్‌ల మీద 124 నాటౌట్‌ ‌వ్యాఖ్య అందుకు సంబంధించిందే. ఇప్పుడు ఏమైందంటే, అసలు నా బొమ్మ టీషర్టుల మీద వేసుకు తిరగడానికి రాహుల్‌ ఎవరు? ప్రియాంక ఎవరు? నా ఫోటో ఉపయోగించుకునే హక్కు వాళ్లకి ఎవరు ఇచ్చారు అని ఏఎన్‌ఐ ‌వార్తా సంస్థ విలేకరి వద్ద మింతాదేవి ప్రశ్నించారు. నా వయసు గొడవ వాళ్లకెందుకంటున్నారామె. ఓటర్ల జాబితాలో కొన్ని పొరపాట్లు దొర్లాయి. ఇంతవరకు నాకు ఎవరూ ఫోన్‌ ‌చేయలేదు. కానీ ఇంతలోకే వాళ్లంతా నా శ్రేయోభిలాషులైపోయారు. నా వయసు గురించి, దానిని సవరించడం గురించి వాళ్లకెందుకు అంత శ్రద్ధ అని ప్రశ్నించారు మింతాదేవి. అదంతా నాకు అనవసరం. ఇలా చేయకూడదు అని ఆమె గడ్డి పెట్టారు. ఓటరు జాబితాలో తన వయసు 124 అని పడిందని, ఆధార్‌ ‌కార్డు ప్రకారం తాను జూలై 15,1990న పుట్టానని మింతా దేవి ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. అలాగే సివాన్‌ ‌జిల్లా కలెక్టర్‌ ‌కూడా ఇప్పటికే ఈ పొరపాటు గ్రహించి ఇది మానవ తప్పిదమని, పైగా మింతా దేవి భర్త ఆన్‌లైన్‌లో నమోదు చేసినప్పుడు చేసిన పొరపాటు మాత్రమేనని వివరణ ఇచ్చారు.
ఇక బెంగళూరు సెంట్రల్‌గా చెప్పే మహదేవపుర నియోజకవర్గంలో నకిలీ ఓట్లు అంటూ రాహుల్‌ ఇచ్చిన పవర్‌ ‌పాయింట్‌ ‌ప్రజంటేషన్‌ ఎం‌త ప్రహసనమో ఇప్పటికే తేలింది. ఒకే చిరునామాతో అనేక ఓట్లు నమోదయ్యాయంటూ రాహుల్‌ ‌చెప్పినవి వలస కార్మికులు నివసించే ప్రాంతాలలోనివేనని ప్రముఖ ఆంగ్ల దినపత్రిక వివరించింది. ఒకే ఇంటి నెంబరు కింద 40, 50 ఓట్లు ఉన్నాయని రాహుల్‌ ఆరోపణ. అసలు హైదరాబాద్‌ ఓల్డ్ ‌సిటీకి వస్తే ఇలాంటి కేసులు కుప్పలు తెప్పలుగా ఉంటాయి. ఈ విషయం పనిలో పనిగా రాహుల్‌ ‌స్వీకరిస్తే బాగుంటుంది. అయినా రాహుల్‌ ‌పూర్తి సమాచారం సేకరించకుండానే నిజానిజాలు తెలుసుకోకుండానే ఈ ఆరోపణలు చేశారని ఆ పత్రికే చెబుతోంది. రాహుల్‌ ‌గాంధీ పేర్కొన్న ఓటర్లలో ఇప్పటికీ అదే చిరునామాలలో 194 మంది ఉన్నారని కూడా ఆ పత్రిక లెక్క చెప్పింది.
ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి లోక్‌సభ నియోజక వర్గం వారణాసిలోను మరొక ప్రహసనం సృష్టించారు. అక్కడి కశ్మీర్‌ ‌గంజ్‌ అనే చోట 51వ వార్డులో యాభయ్‌ ‌మంది ఓటర్లకు తండ్రిగా రామ్‌కమల్‌ ‌దాస్‌ ‌పేరే ఉందని, చిరునామా బి 24/19 అనే ఉందని కాంగ్రెస్‌ ‌సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేసింది. ‘మన ఎన్నికల సంఘం వారి లీలలు చూడండి! యాభయ్‌ ‌మంది ఓటర్లకి రామ్‌కమల్‌ ‌దాస్‌ ఒక్కరే తండ్రి అట’ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. అందులో పెద్ద కొడుకు బన్వారీదాస్‌ ‌వయసు 72 ఏళ్లుగాను, ఆఖరి కొడుకు వయసు 28గాను వేశారు. ఇదెలా సాధ్యం? అన్నదే కాంగ్రెస్‌ ‌ప్రశ్న. ఆ ఓటర్ల జాబితా 2023 మునిసిపల్‌ ‌కార్పొరేషన్‌ ఎన్నికల సమయంలో తయారు చేసినది. కానీ ఇండియా టుడే చేసిన సర్వేలో కాంగ్రెస్‌ అత్యుత్సాహం బయటపడిపోయింది. ఆ చిరునామా ఆచార్య రామ్‌కమల్‌ ‌దాస్‌ ‌స్థాపించిన రామ్‌జానకి మఠ్‌ ఆలయం వీధిలోనిది. ఆ జాబితాలో తండ్రీకొడుకులంటే అది వందల ఏళ్లుగా వస్తున్న ఒక సంప్రదాయంలో భాగమని ఆ మఠం మేనేజర్‌ ‌రామ్‌భరత్‌ ‌శాస్త్రి ఇండియా టుడేకి చెప్పారు. ఆయన తండ్రీ కాదు, వాళ్లు కొడుకులూ కాదు. అది హిందూ ఆశ్రమ సంప్రదాయంలో గురు శిష్య పరంపర మాత్రమే. మా మఠం సంప్రదాయం ప్రకారం అనుచరులంతా గురువునే తండ్రిగా భావిస్తారు అని వివరించారాయన.
రాహుల్‌, ‌సోనియా తమ నియోజక వర్గాలలో జరిగిన ఓటర్ల జాబితాలో అవకతవకల గురించి ఏనాడు తెలుసుకోలేదని అనురాగ్‌ ‌ఠాకూర్‌ అన్నారు. రాయబరేలీ నియోజక వర్గంలో ఒక చిరునామాతో 45 మంది ఓటర్లు ఉన్నారని ఆయన తెలియచేశారు. మహమ్మద్‌ ‌కైఫ్‌ ‌ఖాన్‌ అనే ఓటరు పేరు రాయబరేలీ నియోజక వర్గంలోనే 83,151,218 బూత్‌ ‌నెంబర్లలో నమోదై ఉందని, బూత్‌ ‌నెంబర్‌ 131 ‌పరిధిలోని ఇంటి నెంబర్‌ 189‌లో 47 ఓట్లు ఉన్నాయని కూడా తెలియచేశారు. ఓటర్ల జాబితాలో అవకతవకల గురించి చెబుతున్న రాహుల్‌ ‌లేదా సోనియా ఈ వాస్తవాలను గమనించాలని కోరారు.
కాంగ్రెస్‌/ఇతర విపక్షాలు చేస్తున్న ఆరోపణలు బీజేపీ కంగు తినే స్థాయిలో భయపెట్టే స్థాయిలో లేవన్నది నిజం. ఇప్పుడు రాయ్‌బరేలీ (రాహుల్‌), ‌వయనాడ్‌ (‌ప్రియాంక), డైమండ్‌ ‌హార్బర్‌ (అభిషేక్‌ ‌బెనర్జీ), కనౌజ్‌ (అఖిలేశ్‌ ‌యాదవ్‌) ‌మొయిన్‌పురి (డింపుల్‌ ‌యాదవ్‌), ‌కొలతూర్‌ (ఎం‌కే స్టాలిన్‌) ‌నియోజక వర్గాలలో ఓటర్ల జాబితాలలో మతలబులు చూపిస్తే రాజీనామా చేస్తారా అని ప్రశ్నిస్తున్నది కమలం. కాంగ్రెస్‌ ఏ ‌సమస్యను లేవనెత్తుతున్నా అది పార్లమెంట్‌ ‌కార్యకలాపాలను స్తంభించప చేయడానికీ, వీధులలో పడి అల్లరి చేయడానికేనన్నది స్పష్టం.

– జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
YOUTUBE