తెలంగాణలో అబార్షన్లు అంటే గర్భవిచ్ఛిత్తి కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. దేశంలోనే రికార్డు స్థాయిలో గర్భవిచ్ఛిత్తి కేసులు ఇక్కడే నమోదవుతున్నాయి. మామూలు భాషలో చెప్పాలంటే శిశువును గర్భంలోనే చంపేస్తున్న వాళ్ల సంఖ్య మన రాష్ట్రంలో అత్యధికంగా ఉందన్నది ఒక చేదు నిజం. గడిచిన ఐదేళ్లలో చూసుకుంటే.. తెలంగాణలో అబార్షన్లు పదిరెట్లు పెరిగాయి. 2020-21తో పోల్చుకుంటే గత యేడాది 917.68 శాతం ఎక్కువగా నమోదయ్యాయి. ఈ లెక్కన చూసుకుంటే, తెలంగాణలో సగటున ప్రతి రెండు గంటలకు ఒక అబార్షన్‌ ‌జరుగుతోంది. స్వయంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లెక్కలివి.

2020-21 నుంచి 2024-25 మధ్య కాలంలో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో నమోదైన మెడికల్‌ ‌టర్మినేషన్‌ ఆఫ్‌ ‌ప్రెగ్నెన్సీ (ఎంటీపీ) వివరాలను కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పార్లమెంట్‌కు నివేదించింది. అయితే, ఇవి అధికారిక లెక్కలు మాత్రమే. కానీ రాష్ట్రంలో అనధికారిక అబార్షన్‌ ‌కేంద్రాలు గల్లీ కొకటి కనిపిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రథమ చికిత్స కేంద్రాల్లో జరిగే అబార్షన్ల సంగతి సరేసరి. ఇవన్నీ లెక్కలోకి రావు. అంటే.. అధికారిక, అనధికారిక అబార్షన్లన్నీ కలిపితే ఈ సంఖ్య మరిన్ని రెట్లు పెరుగుతుందనడంలో సందేహం ఎంతమాత్రం లేదు.

ఎంటీపీలు భారీగా పెరిగిన రాష్ట్రాల జాబితాలో తెలంగాణ దేశంలోనే మొదటిస్థానంలో ఉంది. మరో తెలుగు రాష్ట్రం ఆంధప్రదేశ్‌ ‌కూడా తక్కువేమీ తినలేదు. ఎంటీపీలు భారీగా పెరిగిన రాష్ట్రాల జాబితాలో ఏపీ రెండో స్థానంలో ఉంది. అంటే.. గర్భవిచ్చిత్తిలో రెండు తెలుగు రాష్ట్రాలు పోటీ పడుతున్నాయన్న మాట. గడిచిన ఐదేళ్లలో తెలంగాణలో అధికారికంగా జరిగిన అబార్షన్లు సంఖ్య పదిరెట్లు పెరిగితే.. ఆంధప్రదేశ్‌లో అబార్షన్లు నాలుగు రెట్లు పెరిగాయి. 917.6 శాతం పెరుగుదలతో దేశంలోనే తొలి స్థానంలో తెలంగాణ, 371 శాతం పెరుగుదలతో ఆంధప్రదేశ్‌ ‌రెండో స్థానంలో ఉన్నాయి. అంతేకాదు.. దక్షిణ భారతదేశానికే చెందిన మరో రెండు రాష్ట్రాలు వరుసగా మూడో స్థానం, నాలుగోస్థానంలో చేరాయి. 203శాతం అబార్షన్ల పెరుగుదల రేటుతో కేరళ మూడోస్థానంలో ఉండగా.. 156 శాతం పెరుగుదల రేటుతో కర్ణాటక నాలుగో స్థానంలో ఉంది. తెలంగాణలో 2020-21లో 1,578 ఎంటీపీలు జరగ్గా.. 2024-25 నాటికి ఆ సంఖ్య 16,059కు పెరిగింది. దేశవ్యాప్తంగా ఐదేళ్లలో ఎంటీపీల పెరుగుదలలో తెలంగాణ అగ్రభాగాన నిలిచింది. అలాగే 2020-21లో అన్ని రాష్ట్రాల్లో కలిపి 5,34,008 ఎంటీపీలు జరగ్గా.. 2024-25 నాటికి ఆ సంఖ్య 8,93,372కు చేరింది. అంటే దేశవ్యాప్తంగా గర్భస్రావాల పెరుగుదల ఐదేళ్లలో 67 శాతం పెరిగింది.

గడిచిన ఐదేళ్లలో తెలంగాణలో నమోదైన అబార్షన్ల సంఖ్య చూస్తే.. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 1,578 గా ఉంది. 2021-22లో ఆ సంఖ్య 3,114గా ఉంది. 2022-23 యేడాది చూసుకుంటే.. 4,071 కాగా.. 2023-24లో వాటి సంఖ్య 12,365గా నమోదయ్యింది. ఇక గడిచిన యేడాది అంటే.. 2024-25లో తెలంగాణలో అధికారిక అబార్షన్ల సంఖ్య 16,059గా నమో దయ్యింది. ఇదే ఆంధప్రదేశ్‌లో చూస్తే.. 2020-21 సంవత్సరం 2,282 ఆబార్షన్లు నమోదు కాగా, 2021-22 యేడాదిలో 9,119 ఎంటీపీలు జరిగాయి. 2022-23 సంవత్సరంలో 8,446 అబార్షన్లు, 2023-24 సంవత్సరంలో 8,949 అబార్షన్లు, గత యేడాది 2024-25లో చూస్తే.. 10,676 అబార్షన్లు నమోదయ్యాయి.

కేందప్రభుత్వం చేసిన ఈ అధికారిక ప్రకటన అందరినీ నోరెళ్లబెట్టేలా చేసింది. ఫలితంగా సృష్టికి ప్రతిసృష్టి చేసే అమ్మతనం పేగుబంధాన్ని తెంచేసుకుంటోంది. భయంతో కొందరు, సంతానాన్ని భారంగా భావిస్తున్నవారు మరికొందరు, బాధ్యతా రాహిత్యంతో ఇంకొందరు, తప్పుదారిలో గర్భం దాల్చిన వాళ్లు, తమ సహజీవన భాగస్వామితో మనస్పర్థలు తలెత్తిన వాళ్లు.. గర్భంలో ఉన్న శిశువుల్ని కళ్లు తెరవక ముందే తల్లులు కడుపులోనే చిదిమేస్తున్నారు.

ఓవైపు పునరుత్పత్తి శక్తి తగ్గుతోందని అధ్యయనాల్లో తేలడమే కాదు.. ప్రత్యక్ష సాక్ష్యాలు కూడా కనిపిస్తూనే ఉన్నాయి. పిల్లలు కలగని దంపతులు, సంతానోత్పత్తి కోసం ఫెర్టిలిటీ సెంటర్ల చుట్టూ తిరుగుతుండటం.. అక్కడ కూడా అక్రమాలు చోటు చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో పిల్లల కోసం లక్షల రూపాయలు ధారపోస్తున్నారు చాలామంది దంపతులు. ఈ పరస్థితులే ఆందోళన కలిగిస్తున్నాయనుకుంటే మరోవైపు చాపకింద నీరులా సాగుతున్న ఈ మెడికల్‌ ‌టర్మినేషన్‌ ఆఫ్‌ ‌ప్రెగ్నెన్సీ సవాల్‌గా మారుతోంది. రెండు భిన్నధృవాల వంటి ఈ పరిణామాలు ఆధునిక, నాగరిక సమాజాన్ని వేలెత్తిచూపిస్తున్నాయి.

పై రెండు కోణాల్లో ఇప్పుడు రెండోకోణాన్ని విశ్లేషించుకుంటే, ప్రస్తుత కాలంలో చాలా మంది దంపతులు వెంటనే పిల్లలను కనాలని ఆనుకోవడం లేదు. ముఖ్యంగా ఉన్నత చదువులు చదివి నగరాల్లో కొలువులు చేస్తున్న దంపతులు పిల్లలపై అంతగా ఆసక్తి చూపించడం లేదు. ఇంకా చెప్పాలంటే కెరీర్‌కు ఇస్తున్న ప్రాధాన్యం సంతానానికి ఇవ్వడం లేదు. దీంతో, ఇప్పటికే దేశంలో జనాభా వృద్ధి రేటు పడిపోయింది. ఇలాంటి వాళ్లు ఒక వేళ గర్భం దాల్చినా అబార్షన్ల (ఎంటీపీ) వైపు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు చూసుకుంటే రాష్ట్రంలో చాలామంది సరైన పౌష్టికాహారం అందక ఇబ్బందులు పడుతున్నారు. గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల గర్భిణులకు సరైన ఆహారం అందడం లేదు. దీంతో వారు బిడ్డలను కనాలని కలలు కంటున్నా అబార్షన్లు అవుతున్నాయి. అంతేకాదు, తెలిసీ తెలియని వయసులో మైనర్‌ ‌బాలికలు గర్భం దాల్చడం, పరువు పోతుందనే భయంతో తల్లిదండ్రులు కుల పంచాయతీలు పెట్టి గుట్టుచప్పుడు కాకుండా అబార్షన్లు చేయించడం కూడా గ్రామీణ ప్రాంతాల్లో తరచూ జరుగుతోంది.

ఇక, ప్రస్తుతం సమాజంలో పాతుకుపోయిన ఆధునిక నాగరిక వ్యవస్థలో కొత్త కొత్త ధోరణులు పెరిగిపోతున్నాయి. మెట్రో నగరాల్లో ముఖ్యంగా హైదరాబాద్‌లో కూడా సహజీవన సంస్కృతి విచ్చల విడిగా పెరిగిపోతోంది. హైదరాబాద్‌లో ఇప్పుడు కో-లివింగ్‌ ‌రూమ్‌లు, కో-లివింగ్‌ ‌హాస్టళ్లు అందుబాటులోకి వచ్చాయి. పెద్ద పెద్ద బోర్డులతో దర్శనమిస్తున్నాయి. ప్రధానంగా ఐటీ కంపెనీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కో-లివింగ్‌ ‌రూమ్‌లు, హాస్టళ్లు వెలుస్తున్నాయి. అంటే, ఏ సంబంధం లేకున్నా ఆడ, మగ ఇద్దరూ కలిసి ఒకే గదిలో సహజీవనం చేయొచ్చు. వాళ్ల అభిరుచులకు తగిన వాళ్లతో గదులు పంచుకోవచ్చు. అయితే, మన సంస్కృతికి భిన్నంగా సాగుతున్న ఈ ధోరణిలో అపశ్రుతులు, బ్రేకప్‌లే ఎక్కువగా ఉంటున్నాయి. కలిసి ఉన్నన్ని రోజులు అన్నింటినీ పంచుకుంటున్న వాళ్లు, ఏ మాత్రం మనస్పర్థలు వచ్చినా వెంటనే విడిపోవడానికి వెనుకాడటం లేదు. ఇలాంటి సందర్భాల్లో కడుపులో పెరుగుతున్న బిడ్డను తొలగించుకుంటున్నారు. లీగల్‌గా, వీలైతే ఎంటీపీ చేయించుకుంటున్నారు. లేదంటే అనధికారిక గర్భ విచ్చిత్తి చేయించు కుంటున్నారు. దీంతో, అబార్షన్ల సంఖ్య విచ్చల విడిగా పెరిగిపోతోంది.

దేశంలో ముఖ్యంగా హైదరాబాద్‌లో అసాధారణ స్థాయిలో అబార్షన్ల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణం రిపోర్టింగ్‌ ‌వ్యవస్థలో వచ్చిన మార్పులే అని వైద్యులు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రతీ నెలా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో నమోదయ్యే మెడికల్‌ ‌టర్మినేషన్‌ ఆఫ్‌ ‌ప్రెగ్నెన్సీ (ఎంటీపీ)ల వివరాలను డీఎంహెచ్‌వోలకు పంపించాల్సి ఉంటుంది. వాటిని విధిగా హెల్త్ ‌మేనేజ్‌మెంట్‌ ఇన్ఫర్మేషన్‌ ‌సిస్టమ్‌ (‌హెచ్‌ఎమ్‌ఐఎస్‌)‌లో ఎంటర్‌ ‌చేయాలి. గతంలో ఏడు వారాల్లోపు గర్భవిచ్ఛిత్తి అయ్యే వివరాలను నమోదు చేసేవారు కాదు. ఇప్పుడు ఆ వివరాలను కూడా డిజిటల్‌ ‌రిపోర్ట్ ‌చేస్తున్నారు. అలాగే శస్త్రచికిత్స ద్వారా చేసే అబార్షన్లనే గతంలో గర్భవిచ్ఛిత్తి కేసులుగా నమోదు చేసేవారు. ఇప్పుడు మాత్రం మందుల ద్వారా అబార్షన్‌ అయ్యే వివరాలను కూడా నమోదు చేస్తున్నారు. ప్రస్తుతం ఇవన్నీ పక్కాగా లెక్కల్లో చూపడం వల్లనే అబార్షన్లు (ఎంటీపీలు) అధికంగా నమోదవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. గణాంకాల స్వరూప స్వభావాలు ఏ రూపంలో ఉన్నా, ఇవన్నీ గర్భ విచ్ఛిత్తి పట్ల భారతీయ సమాజంలో వచ్చిన నిష్పూచీ తత్వానికి నిదర్శనమే. పతనమైపోతున్న నైతిక ప్రమాణాలకు కొలబద్దగా నిలిచేవే.

గతంలో గర్భం దాల్చిన 24 వారాలకు గానీ టిఫా స్కానింగ్‌ ‌చేసేవారు. ఇందులో శిశువుకు ఏ చిన్న లోపం ఉన్నా బయటపడేది. ఇప్పుడు 12-14 వారాలకే టిఫా స్కానింగ్‌ ‌చేయించుకుంటున్నారు. ప్రస్తుతం అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. దీంతో మూడు నెలలకే శిశువు పెరుగుదల, అనారోగ్యం, అవయవ లోపాలు ఆ స్కానింగ్‌తో బయట పడుతున్నాయి. గతంలో రేడియాలజిస్టులే స్కానింగ్‌ ‌చేసేవారు. ప్రస్తుతం ఫీటల్‌ ‌మెడిసిన్‌ అం‌దుబాటులోకి వచ్చింది. ఫీటల్‌ ‌స్పెషలిస్టులు స్కానింగ్‌ ‌చేసి, మూడు నెలల గర్భంలోని శిశువుల్లో లోపాలను చెప్పేస్తున్నారు. దాంతో శిశువుకు ఏ చిన్న లోపం ఉన్నా దంపతులు మెడికల్‌ ‌టర్మినేషన్‌ ఆఫ్‌ ‌ప్రెగ్నెన్సీకి మొగ్గుచూపుతున్నారు.

మరోవైపు.. ఎంటీపీ చట్టాన్ని సవరించిన తర్వాత 24 వారాల వరకు అబార్షన్‌ ‌చేసే అవకాశం కలుగుతోంది. గతంలో 14 వారాల లోపు శిశువుకు మాత్రమే ఎంటీపీ చేసేవారు. ప్రస్తుతం ఆలస్యంగా వివాహాలు చేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. బీపీ, షుగర్‌, ఇతర అనారోగ్య సమస్యలతో గర్భం ధరించడం కూడా ఎంటీపీలకు కారణమవుతోందంటున్నారు వైద్య నిపుణులు.

మెడికల్‌ అన్‌ఫిట్‌తో అబార్షన్లు కావడం వేరు, ఉద్దేశపూర్వకంగా గర్భ విచ్ఛిత్తి చేయించుకోవడం వేరు. ఇక మరో వైపు చూస్తే, లెక్కల్లోకి రాకుండా వేలాది అబార్షన్లు జరుగుతున్నాయి. ఆర్‌ఎం‌పీలు సైతం అనధికారికంగా అబార్షన్లు చేస్తున్నారు. టాబ్లెట్లు ఇచ్చి అబార్షన్‌ అయ్యేలా చేస్తున్నారు. ఈ క్రమంలో పలువురు మహిళలు మృత్యువాత పడుతున్నారు కూడా. సమాజంపై ముఖ్యంగా మహిళల మానసిక, శారీరక ఆరోగ్య పరిస్థితులపై అబార్షన్లు తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అబార్షన్ల సంఖ్య పెరుగు దలపై సమాజంలో ఆందోళనలు పెరుగుతున్నాయి. దీనిపై ప్రజలకు విస్త్రుత అవగాహన కల్పించాల్సిన బాధ్యత కచ్చితంగా ప్రభుత్వాలపై ఉంది.

ఓవైపు దక్షిణాది రాష్ట్రాల్లో జనాభాను పెంచాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్ని కోరుతున్నాయి. గతంలో కుటుంబ నియంత్రణ పాటిస్తే ఇచ్చిన ప్రయో జనాలకంటే, ఎక్కువ మంది పిల్లల్ని కంటే ఇంకా ఎక్కువ ప్రయోజనాలు కల్పిస్తామనీ హామీలు ఇస్తున్నాయి. ఈ సమయంలోనే ఇలా.. భారీగా పెరుగుతున్న అబార్షన్లు అందోళన కలిగిస్తున్నాయి. పైగా.. అబార్షన్లలో అత్యధికంగా పెరిగిన రాష్ట్రాల్లో మొదటి నాలుగు రాష్ట్రాలు దక్షిణాదిలోనే ఉండటం కూడా మరింత చర్చకు దారి తీస్తోంది.

భారతీయ సమాజం లేదా హిందూ సమాజం ఈ వికృత పరిణామంలో మరొక కోణాన్ని కూడా చూడవలసి ఉంది. ఒక వర్గం తన సంతానాన్ని విపరీతంగా పెంచుకుంటున్నది. అందులో రాజకీయ, మతోన్మాద ఉద్దేశాలు బలంగా ఉన్నాయి. అది వారే నిర్మొహమాటంగా చెబుతున్నారు. బహు భార్యాత్వంతో, ఇతోధికంగా సంతానం కంటున్నారు. ఇది తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందని ఈ పిల్లల కోసం ఇంకా ‘‘ప్లాన్‌’’ ‌చేయలేదంటూ అనాలోచిత కారణాలు చెప్పేవారు గమనించి తీరాలి. మరొకటి- మరొక 20, 25 సంవత్సరాలలో తయారు కాబోతున్న వృద్ధ భారతదేశంలో తమ తప్పిదమెంతో కూడా అంచనా వేసుకోవాలి. వాళ్లు కెరీర్‌ ‌కోసం ఆరాట పడవచ్చు. కానీ అది ముమ్మాటికీ తాత్కాలికం. కానీ సంతానం అలా కాదు. అది ఒక ధర్మానికి కొనసాగింపు. ఒక జాతి నిర్మాణానికి వనరు. దయచేసి ఈ తరం దీనిని గుర్తించాలని ఆశిద్దాం.

సుజాత గోపగోని

సీనియర్‌ ‌జర్నలిస్ట్, 6302164068

About Author

By editor