ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి రాయలసీమ వరకు ఉగ్రవాదుల ఉనికి బయటపడుతోంది. స్థానికంగా వివిధ వృత్తుల్లో కొనసాగుతూ గుట్టుగా ఉగ్ర కార్యకలాపాలను సాగిస్తున్నారు. పట్టుచీరలకు ప్రసిద్ధి చెందిన శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉగ్రవాద మూలాలు బయటపడటం తీవ్ర కలకలం రేపింది. ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయన్న కారణంగా పట్టణానికి చెందిన కొత్వాల్ నూర్ మహమ్మద్ (45) ని పోలీసులు అరెస్టు చేశారు. అతనిపై ఉపా చట్టం కింద కేసు నమోదు చేశారు.
ధర్మవరంలోని మార్కెట్ వీధిలోని బిరియానీ సెంటర్లో వంటమనిషిగా పనిచేస్తున్న కొత్వాల్ నూర్ మహమ్మద్ కుటుంబం పట్టణంలోని లోనికోటలో నివసిస్తోంది. ఇతనికి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు కొన్నాళ్ల కిందటే ఐబీ, ఎస్‌ఐఏ గుర్తించి, స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిఘా పెట్టారు. ఆధారాలు సేకరించి, అరెస్టు చేశారు. ఉగ్రవాద సంస్థల వాట్సాప్ గ్రూప్‌లో నూర్ మహమ్మద్ చురుకుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతని ఇంట్లో సోదాచేసి మొబైల్‌ఫోన్, రెండు సిమ్‌కార్డులు, ఉర్దూ సాహిత్యం స్వాధీనం చేసుకున్నారు. అతడు పలు నిషేధిత ఉగ్రవాద సంస్థల వాట్సాప్ గ్రూపుల్లో ఉంటూ, ముస్లిం యువతను ఉగ్రవాదం వైపు ప్రేరేపిస్తున్నట్లు గుర్తించారు. అతనిపై క్రైమ్ నంబర్ 170/2025 కింద కేసు నమోదు చేశారు. బీఎన్‌ఎస్ సెక్షన్లు 152, 196, క్లాస్1, 196(2), ఉపా చట్టంలోని 13,38,39 సెక్షన్ల కింద నమోదు చేశారు. న్యాయాధికారి నిందితుడికి ఆగస్టు 29 వరకు రిమాండ్ విధించారు. పోలీసులు అతడిని భారీ బందోబస్తు మధ్య కడప సెంట్రల్ జైలుకు తీసుకెళ్లారు.
వంటమనిషి ముసుగులో
నిందితుడు కొత్వాల్ సూర్ మహమ్మద్ పాతికేళ్లుగా ధర్మవరంలోని వివిధ హోటళ్లలో వంట మనిషిగా పని చేశాడు. ప్రస్తుతం సల్మాన్ బిరియానీ సెంటర్‌లో పనిచేస్తున్నాడు. పదో తరగతి వరకూ ఉర్దూ మీడియంలో చదివాడు. చదువు మానేశాక ధర్మవరం తిరిగి వచ్చాడు. టీ స్టాల్ ప్రారంభించి, అది సాగడం లేదని మూసేశాడు. తల్లి, చెల్లెలు ఇంట్లో బీడీలు చుట్టి జీవనం సాగిస్తున్నారు. అతను పగలు వంట పనిచేస్తూనే రాత్రివేళల్లో – జైషే మహమ్మద్ లాంటి ఉగ్రవాద సంస్థలతో సత్సంబంధాలు కొనసాగించేవాడు. అలా పకడ్బందీగా ప్రణాళిక రూపొందించుకున్నాడు.
ఆరు ఉగ్రవాద సంస్థలు, 30 పాకిస్థాన్ గ్రూపుల్లో నూర్ మహమ్మద్ చురుగ్గా ఉన్నట్లు పోలీసుల విచారణలో వెలుగుచూచింది. ఇతర రాష్ట్రాలకు చెందిన వారితోనూ సంబంధాలు ఉన్నట్లు ఎన్‌ఐఏ, ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు గుర్తించారు. అతనికి తాడిపత్రికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్లు బయటపడటంతో అక్కడి ప్రజలు ఆందోళన చెందారు. సంబంధం కేవలం అతడి వరకేనా…ఉగ్ర కార్యకలాపాలపై ఉందా? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఫోన్ ఉగ్ర గుట్టు రట్టు
కొత్వాల్ నూర్ మహమ్మద్ మొబైల్ ఫోన్, రెండు సిమ్‌కార్డులను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. మొబైల్‌తో ఎవరెవరికి కాల్ చేశారు, ఎక్కడెక్కడి నుంచి కాల్స్ వచ్చాయి, నూర్ యాక్టివ్‌గా ఉన్న ఉగ్ర గ్రూపుల అడ్మిన్లు ఎవరు, ఏమి సందేశాలు పంపారన్న అంశాలు ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలో వెల్లడికావలసి ఉంది. ధర్మవరంలో అతనికి ఇంకా ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయో వెల్లడయ్యే అవకాశాలున్నాయి.
నూర్ మహహ్మద్ పాకిస్థాన్‌కు చెందిన నిషేధిత ఉగ్రవాద వాట్సాప్ గ్రూపుల్లో చురుగ్గా ఉంటూ ఉగ్రవాద భావజాలం, దేశవ్యతిరేక ప్రచారం చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఉగగ్రూపులతోపాటు పాకిస్థాన్ నిషేధిత వాట్సాప్ గ్రూపుల్లో వచ్చిన సమాచారాన్ని డౌన్‌లోడ్ చేసి, ప్రచురించి ధర్మవరంతోపాటు జిల్లాలోని పలు మసీదులు, ప్రార్థనా మందిరాల వద్ద యువతకు పంచిపెట్టినట్లు పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది. ఉగ్రవాద సంస్థలతో ఆర్థిక లావాదేవీలు సైతం సాగించినట్లు తెలుస్తోంది. ఇక్కడి సమాచారాన్ని ఉగ్రవాద సంస్థలకు చేరవేసేవాడని సమాచారం. ఏదైనా ఉగ్రసంస్థ పిలిస్తే శిక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. అతనికి ఉగ్రవాద గూపులతో సంబంధం ఎలా ఏర్పడింది? అందుకు ఎవరు సహక రించారు? ఉగ్రవాద గ్రూపుల నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న సమాచారాన్ని ఎవరెవరికి పంపించాడు? అనే కోణాల్లో పోలీసులు లోతుగా విచారణ చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో కడప సెంట్రల్ జైలులో ఉన్న నూర్‌ను కస్టడీకి తీసుకునేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు.
మరోవంక, ధర్మవరంలో ఎర్రగుంటకు చెందిన రియాజ్ అనే యువకుడు పాకిస్థాన్ జాతీయ జెండాతోపాటు సయ్యద్ బిలాల్ వీడియోలను వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవడాన్ని నిఘావర్గాలు గుర్తించాయి.అతనినిన అదుపులోకి తీసుకుని, విచారించి వదిలిపెట్టారు. ధర్మవరంతోపాటు హిందూపురం, కదిరి ప్రాంతాల్లో ఇలాంటి వాట్సాప్ స్టేటస్‌లపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఓవైపు నూర్ మమహ్మద్ ఉగ్రలింకులపై దర్యాప్తు చేస్తూనే…మరోవైపు జిల్లా వాప్తంగా ఉగ్రకదలికలపై పోలీసు యంత్రాగాన్ని అప్రమత్తం చేశారు. జిల్లాలో అనుమానం ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలతో నిఘా పెట్టారు.
అక్కడే పరిచయం
నూర్ మహమ్మద్ రెండేళ్ల క్రితం అన్నమయ్య, కడప జిల్లాల్లో నిర్వహించిన ఇజితిమా కార్యక్రమాలకు వెళ్లిన సమయంలో అక్కడ ఉగ్రవాదులతో సంబంధం ఉన్నవారు పరిచయమైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అప్పటి నుంచి ఉగ్రవాద సంబంధాలున్న వారితో పరిచయాలు పెరగడంతో తరచూ ఫోన్, వాట్సాప్ ద్వారా చాటింగ్ చేస్తుండేవాడని తెలిసింది. ఇలా ఉగ్ర సంస్థలతో పూర్తిగా మమేకమయ్యాడని భావిస్తున్నారు. స్థానికంగా మసీదుల వద్ద ముస్లిం యువతను.. ఉగ్రవాదం వైపు ప్రేరేపించేవాడని అనుమానిస్తున్నారు.
ప్రియురాలి కోసం ఆరా..
నూర్ మహమ్మద్ కొంతకాలంగా తాడిపత్రికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం నడుపుతున్నట్లు కుటుంబసభ్యులు పేర్కొంటున్నారు. దర్యాప్తు బృందాలు ఆ కోణంలో కూడా విచారణ చేపట్టాయి. అతడి ప్రియురాలి పూర్వా పరాల గురించి ఆరాతీస్తున్నట్లు తెలిసింది. ఆమెకు నిషేధిత ఉగ్రసంస్థలతో సంబంధాలున్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాయి. నూర్‌మహమ్మద్ అరెస్టుతో ప్రియురాలు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. అతను తరచూ వాట్సాప్ కాల్ ద్వారా ప్రియురాలితో సంభాషించిన ఆధారాలను కుటుంబ సభ్యులు బహిర్గతం చేశారు. దర్యాప్తు బృందాలు.. ఆమెను అదుపులోకి తీసుకుంటే మరిన్ని వివరాలు బయటపడే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.
పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థల సానుభూతిపరుడు నూర్ మహమ్మద్ అరెస్టుతో ధర్మవరం వాసులు ఉలిక్కిపడ్డారు. ఒకప్పుడు ఉమ్మడి అనంత అంటే ఫ్యాక్షన్‌కు పేరుగా చెప్పుకొనేవారు. కాలానుగుణంగా మార్పు, విద్యపై ఆసక్తి పెరగడంతో ఫ్యాక్షన్ సంస్కృతి దాదాపు కనుమరుగైంది. చిన్న గొడవలు జరుగుతున్నా.. ప్రజలు అటువైపు చూడటం లేదు. ఇలాంటి వారు ఇంకా ఎంతమంది ఉన్నారోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉగ్రవాద లింకులున్న వ్యక్తులు పట్టణాల్లో ఉంటూ ఉగ్రవాద వల విసురుతున్నట్లు తెలుస్తుంది. పట్టణంలో చేనేత రంగం వృద్ధిచెందుతున్న తరణంలో ఈ ఉగ్ర కదలికల ఉదంతం ఆ వ్యాపార రంగంపై ప్రభావం చూపవచ్చనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి ప్రత్యేక బృందాల ద్వారా మరింత లోతుగా దర్యాప్తు చేయించి ధర్మవరంలో ఉగ్రకదలికలు వెలికితీసి కఠినంగా వ్యవహరించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
జిల్లావ్యాప్తంగా నిఘా
నూర్ మహమ్మద్ అరెస్టుతో రాష్ట్ర నిఘా విభాగం, పోలీసులు ఉగ్ర మూలాలను జల్లెడ పడుతున్నారు. అనుమానిత ప్రదేశాల్లో నిఘా ముమ్మరం చేసింది. జిల్లాలోని అనుమానిత ప్రాంతాలకు ఇటీవల కాలంలో కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చారా? అనే దానిపై రహస్యంగా ఆరాతీస్తున్నారు. జిల్లా సరిహద్దులో ఉన్న హిందూపురం, కదిరి, ధర్మవరం, మరికొన్ని పట్టణాల్లో స్థానిక పోలీసు అధికారులు నిఘా పెంచాలి. బెంగళూరు దగ్గరగా ఉండటంతో ఈ ప్రాంతాల్లోకి వచ్చి కొన్ని రోజులపాటు స్థిరపడి బెంగళూరుపై గురిపెట్టే అవకాశాలు లేకపోలేదు.
ఉగ్ర కలకలం
గతంలో దీన్దార్ అంజుమన్ వంటి సంస్థల ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలకు నిలయంగా ఉన్న ఆంధప్రదేశ్‌లో, పాతికేళ్ల తర్వాత మళ్లీ ఉగ్ర కలకలం మొదలైంది. సుదీర్ఘకాలం ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో ఇటీవల వరుసగా విజయనగరం, అన్నమయ్య, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఉగ్రమూలాలు బయట పడటం ఆందోళన కలిగిస్తోంది. జూన్ 19వ తేదీన విజయనగరం జిల్లాల్లో ఉగ్రవాద సానుభూతి పరుడిని అరెస్ట్ చేయడంతో ఆ జిల్లా ఉలిక్కిపడింది. నగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహమాన్ పాటు హైదరాబాదుకు చెందిన సమీద్ సయ్యద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని చేసిన విచారణలో అందిన సమాచారంతో ఓ ఇంట్లో తనిఖీ చేయగా ప్రమాదకర పేలుడు పదార్థాలు బయటపడ్డాయి. పేలుళ్లకు వినియోగించే అమోనియా, సల్ఫర్, అల్యూమినియం పౌడర్ పట్టు బడ్డాయి.బీటెక్ చదివిన నిందితుడు సిరాజ్ ఉర్ రెహమాన్ భారీ విస్పోటం గురించి ఇంటర్నెట్ ద్వారా సమాచారం సేకరించాడు. హైదరాబాద్‌లో కొన్నాళ్లున్న సిరాజ్ పాకిస్తాను అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవాడు. ఉగ్రవాద కార్యకలాపాల వైపు మొగ్గుచూపే వ్యక్తులను ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం చేసుకునేవాడు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌కు చెందిన సయ్యద్‌తో పరిచయం కారణంగా చివరికి అరెస్ట్ అయ్యాడు.ండు తెలుగు రాష్ట్రాల కౌంటర్ ఇంటిలిజెన్స్, పోలీస్ విభాగాలు అతనిపై నిఘా పెట్టాయి. అన్నమయ్య జిల్లా రాయచోటిలో తమిళనాడుకు చెందిన ఇద్దరు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు (అబుబకర్ సిద్దిక్, మహమ్మద్ అలీ) దాదాపు 30 ఏళ్లుగా నకిలీ గుర్తింపులతో నివసిస్తూ పట్టుబడగా, ఇప్పుడు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో పాకిస్తాన్‌కు చెందిన జైషే మహమ్మద్ సంస్థతో సంబంధాలున్న నూర్ మహమ్మద్ అనే వ్యక్తిని ఎన్‌ఐఏ అరెస్ట్ చేసింది. నూర్, పాకిస్తాన్‌లోని ఉగ్రవాదులతో ఆన్‌లైన్ కాల్స్, ఛాటింగ్ ద్వారా సంబంధాలు నెరపగా, అదే ప్రాంతానికి చెందిన యువకుడు రియాజ్ పాకిస్తాన్ అనుకూల వాట్సాప్ స్టేటస్ పెట్టి అరెస్టయ్యాడు.
ఈ వరుస పరిణామాలు, రాష్ట్రాన్ని ఉగ్రవాదులు ఒక ‘షెల్టర్ జోన్’గా మార్చుకుంటున్నారనే బలమైన అనుమానాలకు తావిస్తున్నాయి. పట్టుబడిన ఉగ్రవాదులు, సానుభూతిపరులు సాధారణ పనులు చేసుకుంటూ, స్థానికుల్లో కలసిపోయి ఏళ్ల తరబడి తమ రహస్య కార్యకలాపాలు కొనసాగిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. స్థానిక పోలీసుల కళ్లుగప్పి దశాబ్దాల పాటు నివసిస్తున్న వీరిని ఎన్‌ఐఏ, ఐబీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు నేరుగా రంగంలోకి దిగి అరెస్టు చేయాల్సి వస్తోంది. ప్రశాంతమైన రాష్ట్రాన్ని తమ రహస్య స్థావరంగా మార్చుకుంటున్న ఈ కొత్త తరహా ఉగ్రవాదం, రాష్ట్ర పోలీసు యంత్రాంగానికి సరికొత్త సవాల్‌గా పరిణమించింది.
తురగా నాగభూషణం
సీనియర్ జర్నలిస్ట్