భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ ‌మాధవ్‌ ‌నేతృత్వంలో పార్టీ సారథ్య కార్యక్రమం తొలి, రెండవ విడతలు విజయవంతంగా ముగిసి, మూడవ విడత ప్రారంభమైంది. ఆయన ఈ పర్యటనల ద్వారా పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేస్తూ, నాయకులకు స్పష్టమైన దిశానిర్దేశం చేస్తున్నారు. కార్యకర్తలను మరింత శక్తిమంతంగా తీర్చిదిద్దుతూ, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటున్నారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలను వివరిస్తున్నారు. ‘కష్టపడి పనిచేస్తే పదవులు స్వయంగా వస్తాయి’ అంటూ, అందుకు తననే ఉదహరిస్తూ, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. తనపై నమ్మకంతో పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్‌ ‌షా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీలను స్వయంగా కలసి కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసి, రాష్ట్ర రాజకీయాల్లో గట్టి పునాదులు వేసేలా కృషి చేస్తానని స్పష్టం చేశారు.

మాధవ్‌ ‌పర్యటనలు కార్యకర్తల్లో కొత్త ఉత్తేజాన్ని నింపడమే కాకుండా, స్థానిక స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా సాగు తున్నాయి. ఆయన పిలుపుతో కార్యకర్తలు ఇప్పటికే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలతో సంబంధాలు బలోపేతం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ కృషి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి కొత్త విజయాలను అందించగలదని పార్టీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతమే తమ లక్ష్యమని, తమ పర్యటనలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని స్పష్టం చేశారు. ఆగస్టు 30న స్ఫూర్తి పేరుతో సంచార జాతుల సదస్సు నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 36 సంచార జాతులకు డీఎన్డీ సర్టిఫికెట్లు, స్థిర నివాసం, విద్య, సంక్షేమ కార్యక్రమాలు అందిం చేందుకు ప్రయత్నిస్తామన్నారు. వైసీసీ అరాచకాల బాధితులను కలుస్తామని చెప్పారు

మాధవ్‌ ఆగస్టు 8న ప్రధాని నరేంద్రమోదీ కలిసి పార్టీ రాష్ట్ర సారథ్య బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలియచేశారు. రాష్ట్రంలో రైతులు, ఇతర వర్గాల సమస్యలను, ట్రంప్‌ ‌విధిస్తున్న టారిఫ్‌ ‌వల్ల రాష్ట్రంలో ఆక్వా రైతులు పడే ఇబ్బందులను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం ప్రణాళిక. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన రోడ్‌ ‌మ్యాపును వివరించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామంలో ‘హర్‌ ‌ఘర్‌ ‌తిరంగా’ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రధాని సూచించారు. పార్టీ అభివృద్ధికి కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చారు. ప్రతి కార్యకర్తను కలవాలని ప్రధాని సూచించారు.

ఆంధప్రదేశ్‌ ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి ప్రధాని అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా తెలుగును ప్రోత్సహించాలంటూ, మాతృభాషలో చదువుల వల్ల శాస్త్రీయ జిజ్ఞాస పెరగడంతో పాటు, జ్ఞాపకశక్తి మెరుగు పడుతుందన్న విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా ప్రచారం చేయాలని సూచించారు. ఆక్వా రైతులు ఇబ్బందులు పడకుండా ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నట్లు ప్రధాని తెలిపారు.

వైసీపీపై వచ్చిన అవినీతి ఆరోపణలకు వ్యతిరేకంగా పార్టీ రాజీలేని పోరాటం చేస్తోందని మాధవ్‌ ‌చెప్పార9. ‘అమరావతి భూ కేటాయింపుల్లో ఎటువంటి పక్షపాతం లేదు. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు సంస్థలకు భూ కేటాయింపుల్లో ఎటువంటి వివక్షతకు తావు లేదు. నిబంధనలు ఎక్కడా అతిక్ర మించలేదు. ఈ కేటాయింపులపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది’ అని మాధవ్‌ ‌వెల్లడించారు.

‘సారథ్యం’ పేరుతో నిర్వహిస్తున్న పర్యటనలు మూడో విడతకు చేరుకున్నాయి. తొలివిడతగా జూలై 27న దేవుని కడప నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం 28న నంద్యాల, 29న కర్నూలు, 30న అనంతపురం, 31న శ్రీసత్యసాయి జిల్లాల్లో సాగింది. రెండో విడత పర్యటన ఆగస్టు 4న పల్నాడు, 5న గుంటూరు, 6న బాపట్ల, 7న ప్రకాశం జిల్లాల్లో నిర్వహించారు. మూడో విడతలో ఆగస్టు 10న అన్నమయ్య, 11న చిత్తూరు, 12న తిరుపతి, 13న పొట్టి శ్రీరాములు నెల్లూరు తదితర జిల్లాల్లో సాగింది. జిల్లాల్లో పార్టీ పటిష్టతకు అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయా జిల్లా నేతలతో సమావేశమై చర్చించారు. జిల్లాల్లోని పరిస్థితులకు అనుగుణంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేస్తూనే..పార్టీ కూటమి ప్రభుత్వంలో భాగస్వామి అనే విషయం మరిచి పోవద్దంటూ నేతలకు స్పష్టం చేశారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఆయా వర్గాలకు వివరిస్తూనే వారి నుంచి సూచనలు, సలహాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ‘ఛాయ్‌ ‌పే’ చర్చా కార్యక్రమాల ద్వారా వాకర్స్, ‌సీనియర్‌ ‌సిటిజన్స్, ‌మేధావులు, విద్యావంతులు, న్యాయమూర్తులు.. తదితర వర్గాలతో సమావేశమవుతూ పార్టీని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు మార్గం సుగమం చేశారు. మరోవైపు ఆయా జిల్లాల్లో సంఘ స్వయంసేవకులతో సమావేశమై పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు. కార్యకర్తల సమావేశాలతో పాటు నేరుగా ప్రజలు, వివిధ వర్గాలను కలవడం ద్వారా పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం వచ్చిందనే అభిప్రాయాలను పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.

ప్రజా సమస్యల వేదికగా

పార్టీ జిల్లా కార్యాలయాలు ప్రజాసమస్యల పరిష్కార వేదికగా మారాలని మాధవ్‌ ‌పేర్కొన్నారు. ప్రతి సోమవారం అన్ని జిల్లాల్లో అధికారులు నిర్వహించే ప్రజాసమస్యల పరిష్కార వేదికకు ప్రజల సమస్యలు తీసుకెళ్లడం ద్వారా వారికి చేరువ కాగలమని అన్నారు.

శ్రీభాగ్‌ ఒప్పందం మేరకు రాయలసీమలో హైకోర్టు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కర్నూలు పర్యటనలో భాగంగా ఆ జిల్లా న్యాయ వాదులు మాధవ్‌ను కోరారు. రాయలసీమవాసులు ఎప్పటి నుంచో దీనిని కోరుతున్నారని, వారికి కోరిక న్యాయమైనదని, అన్ని ప్రాంతాల అభివృద్ధి బీజేపీ విధానమని తెలిపారు. ప్రాంతాల అసమానతలు తొలగిపోవాలంటే అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు అనుకూలంగా తమ పార్టీ గతంలో రాయలసీమ డిక్లరేషన్‌లో స్పష్టం చేసిందని తెలియజేశారు. ఈ ప్రాంతంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.

అనంతపురం జిల్లాను హార్టికల్చర్‌ ‌క్లస్టర్‌గా ఏర్పాటుచేసి పండ్లతోటల అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నామన్నారు. సత్యసాయి జిల్లాను కూడా కలుపుకొని, ఉద్యాన సాగును విస్తృత స్థాయిలో అభివృద్ధిపరిచి, ఈ జిల్లాలో పండుతున్న పలు పండ్లను దృష్టిలో పెట్టుకొని, కోల్డ్ ‌స్టోరేజీలు, ప్రాసెసింగ్‌ ‌యూనిట్లు వంటివి ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.

వెలిగొండ ప్రాజెక్టును పూర్తిచేయడంతోపాటు నిర్వాసితులకు నష్టపరిహారం అందిస్తామని ప్రకాశం జిల్లా పర్యటన సందర్భంగా చెప్పారు. కొత్తపట్నం వద్ద ఫిషింగ్‌ ‌హార్బర్‌ ‌నిర్మాణానికి ప్రభుత్వం రూ.400 కోట్లు కేటాయించిందని తెలిపారు. ఒంగోలు జాతి పశువుల రక్షణకు చర్యలు చేపడుతున్నామని, ఒంగోలు గిత్తల ప్రాధాన్యం దృష్ట్యా దేశమంతటా గిత్తల బ్రీడింగ్‌ ‌కేంద్రం తీసుకొస్తామన్నారు. రైతుల పొగాకును అవసరానికి మించి సాగుచేస్తూ ఇబ్బందులు పడుతున్నారని, వారి వద్ద గల పొగాకు దిగుబడులను అపరాధ రుసుం లేకుండా కొనుగోలు చేసేందుకు చర్యలు చేపడతామన్నారు.

బాపట్ల జిల్లాలో పర్యటనలో ప్రజలు మాధవ్‌ను కలసి స్థానిక సమస్యలు వివరించారు. రథం బజారులోని శ్రీమాకర్లవారి రామానుజకూటమును గత ప్రభుత్వ హయాంలో అక్రమంగా తొలగించారని, దాతల వంశీయులను సంప్రదించకుండా,పురావస్తు శాఖ వారి అనుమతులు కూడా లేకుండా దాతల ఆశయాలకు విరుద్ధంగా ఆ ప్రదేశంలో లాడ్జి నిర్మించారని విన్నవించారు. అంతే కాకుండా సదరు రామాను కూటమును ఏకపక్షంగా దేవదాయశాఖలో విలీనం చేశారని, అది గతంలో వచ్చిన కోర్టు తీర్పునకు విరుద్ధ్దమని, ఈ విషయమై జిల్లా దేవదాయ శాఖాధికారులను సమాచారహక్కుచట్టం కింద వివరణ అడిగినా కాలయాపన చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. 2021-22లో శ్రీభావన్నారాయణ స్వామి దేవాలయం జీర్ణోద్ధరణ పేరుతో జీర్ణోద్ధరణ కమిటి భక్తుల నుంచి విరాళాలుగా ఇబ్బడిముబ్బడిగా డబ్బు, బంగారం, వెండి వసూలు చేసి, ఇప్పటికీ లెక్కలు చెప్పడంలేదని తెలిపారు.

కార్యకర్తల్లో ఉత్సాహం

మాధవ్‌ ‌చేపట్టిన జిల్లాల పర్యటన కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఆయన ‘‘ప్రతి ఇంటిపై బీజేపీ జెండా’’ అనే నినాదాన్ని బలంగా ప్రచారం చేస్తూ, ప్రతి స్థాయి కార్యకర్తలో పోరాట స్పూర్తిని కలిగించారు. వచ్చే ఏడాది జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధమవ్వాలని మాధవ్‌ ‌పిలుపునిచ్చారు. ఆయా జిల్లాల్లోని రాజకీయ, సామాజిక పరిస్థితులను కార్యకర్తలతో మాట్లాడి తెలుసుకున్నారు. పార్టీ బలోపేతం కోసం, స్థానిక సమస్యల పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ప్రధానిగా నరేంద్ర మోదీ చేపట్టిన అభివృది, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరాన్ని ఉద్బోధించారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత, మోదీ హయాంలోనే అనేక సమస్యలకు పరిష్కారం లభించిందని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత కార్యకర్తలదేనని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి అందిస్తున్న నిధులను, రాష్ట్ర అభివృద్ధిపై చూపుతున్న ప్రత్యేక శ్రద్ధను ప్రజలకు తెలియజేయాలని సూచించారు.

తురగా నాగభూషణం

సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor