ఆయనకు అధికార పార్టీ మీద నమ్మకం లేదంటే అర్థం చేసుకోగలం. కానీ దేశాన్నే నమ్మడం లేదు. మన ఆంతరంగిక భద్రతను, ఆర్థికరంగాన్ని, రక్షణ వ్యవస్థను దెబ్బ తీయాలని ప్రయత్నించి బొక్క బోర్లాపడ్డారు. ఇప్పుడు మన ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తున్న ఎన్నికల వ్యవస్థ మీద పడుతున్నాడు. బట్ట కాల్చి మీదేసి తేల్చుకోండి అని సవాళ్లు విసరడం, బురద చల్లి కడుక్కోమని సలహా ఇవ్వడం ఆయన నైజం. ఇదీ హిట్ అండ్ రన్ కేసే. ఇదంతా రాహుల్ గాంధీ అనే విపక్ష నేత గురించే. ఇదంతా చూస్తే రాహుల్ ఉండగా మనకు శత్రుదేశం ఎందుకు? వేరే విదూషకుడు ఎందుకు? అన్న ప్రశ్నలు వస్తాయి.
రాహుల్ నిజమైన భారతీయుడేనా? ఇదేదో బీజేపీ ప్రశ్న కాదు. ఇటీవల సుప్రీంకోర్టు రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్య. నిజమే, దేశ రక్షణ వ్యవహారాలపై కూడా రాహుల్ ఉద్దేశపూర్వ కంగా పలు సందర్భాల్లో తన వాచాలత్వాన్ని ప్రదర్శిం చారు. ఫలితంగా న్యాయస్థానంలో చివాట్లు తినక తప్పలేదు. పలు సందర్భాల్లో న్యాయస్థానాలు మంద లించినా ఆయన తీరు మాత్రం మారలేదు. రాహుల్ దాదాపు 20 వరకు పరువు నష్టం, మోసం, వంచన వంటి కేసులను ఎదుర్కొంటున్నాడని ఆయన న్యాయవాది అభిషేక్ సింఘ్వియే చెబుతున్నారు. భారత్‌లో చేపట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’తో మన దేశానికి ఎలాంటి లాభం లేకపోగా చైనాయే ఎక్కువగా లాభపడిందని రాహుల్ విమర్శించారు. చివరకు మన దేశ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తున్న ఎన్నికల వ్యవస్థ మీద కూడా దాడి చేశారు. ఆరోపించడం, ఆధారాలు చూపకుండా పారిపోవడం అలవాటుగా మారింది.
వీరసావర్కర్ విషయంలో..
సావర్కర్ మీద రాహుల్ గాంధీ పలు సందర్భాల్లో అనుచిత వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఆ స్వాతంత్య్ర సమరయోధుని గురించి రాహుల్ గాంధీ చేసిన బాధ్యతారహిత ప్రకటనలు గందర గోళాన్ని సృష్టిస్తున్నాయని అభినవ్ భారత్ కాంగ్రెస్ వ్యవస్థాపకుడు పంకజ్ కుముద్‌చంద్ర ఫడ్నిస్ ఆరోపించారు. ఈ అంశంపై ఈ ఏడాది ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు ఆయన్ని తీవ్రంగా మందలించింది. ‘మీ నానమ్మ ఇందిరాగాంధీ ప్రధానిగా ఉండగా సావర్కర్‌ను ప్రశంసిస్తూ లేఖ రాశారని మీకు తెలుసా? మనకు స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు తెచ్చిపెట్టిన వారిని ఇలా అవమానిస్తారా?’ అంటూ ఆగ్రహం వెలిబుచ్చింది. ‘మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాటిని సుమోటోగా తీసుకుంటాం’ అని జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్ ధర్మాసనం హెచ్చరించింది. ‘‘ఇలాగే వదిలేస్తే మున్ముందు ‘గాంధీ బ్రిటిష్‌వారికి సేవకుడు’ అని కూడా చెబుతారు. వైస్రాయ్‌ను ఉద్దేశించి ప్రసంగించేటప్పుడు గాంధీ ‘మీ నమ్మకమైన సేవకుడు’ అంటూ మాట్లాడేవారు. స్వాతంత్య్ర యోధులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడాన్ని అను మతించబోం’’ అని స్పష్టం చేసింది. గాంధీజీని హత్య చేసినది ఆర్‌ఎస్‌ఎస్ అని చేసిన ఆరోపణలకు రాహుల్ ఒక కోర్టులో క్షమాపణ కోరాల్సి వచ్చింది. కర్ణాటలో గౌరీ లంకేశ్ హత్యలో ఆర్‌ఎస్‌ఎస్ హస్తం ఉందని ఆరోపించి కేసులో ఇరుక్కున్నాడు.
వ్యక్తిగత ఆరోపణలు.. అబద్దాలు
ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకొని ఎన్నో వ్యక్తిగత ఆరోపణలు చేశారు రాహుల్. మోదీ ఇంటిపేరు ఉన్నవాళ్లంతా దొంగలేనంటూ నిందించారు. ‘చౌకీదార్ చోర్ హై’ అంటూ ప్రధాని మోదీపై ఆరోపణలు చేసి వాటిని కోర్టుకు ఆపాదించా రంటూ బీజేపీ నేత మీనాక్షి లేఖీ అప్పట్లో కోర్టు ధిక్కరణ వ్యాజ్యం వేశారు. దీనిపై విచారించిన కోర్టు రాహుల్ గాంధీ భవిష్యత్తులో జాగ్రత్తగా వ్యవహ రించాలంటూ హెచ్చరించింది. చివరకు మోదీ వేసుకునే బట్టలను, ఆయన తినే తిండిని కూడా వదల్లేదు. వీటన్నింటికీ కోర్టులో క్షమాపణ చెప్పక తప్పదు. 2019లో లోక్‌సభ ఎన్నికల సమయంలో జార్ఖండ్‌లో జరిగిన బహిరంగసభలో అమిత్ షా హంతకుడు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై కేసు నమోదైంది.
దేశ పారిశ్రామికవేత్తలతో మోదీ కుమ్మక్కయ్యా రని నిత్యం ఆరోపిస్తూనే ఉంటారు రాహుల్. అంబానీ, అదాని.. మోదానీ అంటూ వ్యంగ్యోక్తులు విసిరాడు. దేశీయ పారిశ్రామిక రంగాన్ని, స్థైర్యాన్ని దెబ్బ తీయడమే రాహుల్ లక్ష్యమైపోయింది. అయితే రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్య మంత్రులు ఈ పారిశ్రామికవేత్తలను తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరడంతో ఇబ్బందుల్లో పడ్డారు రాహుల్.
దేశ రక్షణలో ఆటలా?
మన దేశ రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి కొనుగోలు చేసిన యుద్ధ పరికరాల విషయం లోనూ కుట్రపూరిత ఆరోపణలు చేశారు రాహుల్. ముఖ్యంగా ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసి రఫేల్ యుద్ధ విమానాల విషయంలో భారీ అవినీతి జరిగిందని రచ్చ చేసి చర్చకు పెట్టారు. ఈ అంశం న్యాయస్థానానికి చేరింది. ఫ్రాన్స్ కంపెనీ ద సాల్ట్ నుంచి భారత్ 36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో అవకతవకలు జరిగాయంటూ రాహుల్ చేసిన ఆరోపణలపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు డిసెంబరు 14, 2018న కేంద్ర ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చింది. ‘36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు పక్రియపై అనుమానాలు వ్యక్తం చేసేందుకు ఎలాంటి ఆస్కారం లేదని ప్రధాన న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ఈ విషయంలో రాహుల్ గాంధీని న్యాయ స్థానం మందలించడంతో క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది
భారత్‌లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని రాహుల్ గాంధీ మూడేళ్ల క్రితం ఆరోపణలకు దిగారు. బ్రిటన్ పర్యటన వేళ కేంబ్రిడ్జ్ యూనివర్సి టీలో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం పెగాసస్ స్పైవేర్ ను ఉపయోగించి తనపై గూఢచర్యం చేసిందని ఆయన ఆరోపించారు. అయితే దీనిపై దర్యాప్తు చేపడితే సహకరించలేదు.
హిండెన్‌బర్గ్, జార్జ్ సోరోస్..
అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ జనవరి 2023 నివేదికలో, అదానీ గ్రూప్ స్టాక్ మార్కెట్ అవకతవకలకు పాల్పడిందని ఆరోపించింది. దీని వెనుక రాహుల్ గాంధీ పాత్ర కూడా బయటకు వచ్చింది. ఇజ్రాయెల్ గూఢచార సంస్థ ‘‘మొసాద్’’ ఆపరేషన్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భారత ఆర్థిక వ్యవస్థను అస్థిరపరిచేందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రయత్నం జరుగుతోందని బయటపడింది. హిండెన్‌బర్గ్‌తో కాంగ్రెస్ పార్టీకి సంబంధాలున్నాయని ఆరోపణలు వచ్చాయి. ప్రపంచంలో బలమైన ఆర్థిక వ్యవస్థలో ఒకదానిని అస్థిర పర్చడం, కించపర్చడం, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాన్ని గందరగోళ పర్చడమే వారి లక్ష్యం అనే ఆరోపణలు వచ్చాయి. చివరకు హిండెన్‌బర్గ్ అనేదే మూత పడక తప్పలేదు. ఇదే అంశంపై పార్లమెంట్‌లో చర్చ సందర్భంగా భారత దేశంలో ప్రజాస్వామ్య విధ్వంసానికి కుట్రపన్నిన అమెరికా బిలియనీర్ జార్జ్ సోరోస్‌తో రాహుల్ గాంధీ బంధాన్ని బీజేపీ ఎండగట్టింది. మన దేశాన్ని అస్థిరపరిచేందుకు పనిచేస్తున్న అమెరికన్ ఏజెన్సీలతో రాహుల్ ప్రమాదకర బంధాన్ని కలిగి ఉన్నారని బీజేపీ ఎంపీలు సంబిత్ పాత్ర, డా.కె. లక్ష్మణ్ పార్ల మెంటులో ఆరోపించారు. రాహుల్ అత్యున్నతస్థాయి ద్రోహి అని చెప్పేందుకు నేను ఏ మాత్రం వెనుకాడను అంటూ తీవ్రంగా స్పందిం చారు సంబిత్ పాత్ర.
రాహుల్ నోట ట్రంప్ పాట
భారత్-పాక్‌ల యుద్ధాన్ని ఆపానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదేపదే చెప్పినా ప్రధానిమోదీ తిరిగి ఎందుకు స్పందించడం లేదని రాహుల్ ప్రశ్న. ఎన్ని భారత యుద్ధవిమానాలను పాకిస్తాన్ కూల్చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. పెహల్గావ్ ఉగ్రదాడి నిందితులను భారత సైన్యం మట్టుపెడితే.. ఇప్పుడే ఎందుకు వారిని ఎన్‌కౌంటర్ చేసిందని పార్లమెంట్ సమావేశాల మొదటి రోజునే కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. ఇందుకు పార్లమెంట్ వేదికగా ప్రధాని మోదీ సమాధానమిచ్చారు. ఉగ్రవాదుల్ని మట్టుబెట్టడానికి ఏమైనా ముహూర్తం కావాలా? అని ప్రశ్నించారు. ఆపరేషన్ సిందూర్‌ను ఆపమని ఏ ప్రపంచాధినేత చెప్పలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ ఎజెండాను దిగుమతి చేసుకునే పనిలో ఉందని ఆరోపించారు. మనదేశ సామర్ధ్యాలపై కాంగ్రెస్‌కు నమ్మకం లేదని, పాక్ తప్పుడు వార్తల్ని ఆ పార్టీ నేతలు ప్రచారం చేశారని మోదీ ధ్వజమెత్తారు. ‘రాహుల్ అడగాల్సింది.. ఎన్ని రఫెల్ విమానాలు కూలాయి అని కాదు.. ఎంతమంది ఉగ్రవాదులు చనిపోయారు అని అడిగితే బాగుండు. ఆయనకు 55 ఏళ్లు వచ్చినా, ఇంకా మెచ్యూరిటీ రాలేదు.ఈ జన్మలో ప్రధాని అయ్యే అవకాశం లేదు’ అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు.
దేశంతో పోరాడుతున్నా..
తాము దేశంతో పోరాడుతున్నామని ఈ ఏడాది జనవరిలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఢిల్లీలో కాంగ్రెస్ నూతన ప్రధాన కార్యాల యాన్ని ప్రారంభించిన రాహుల్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘బీజేపీ, ఆరెస్సెస్ దేశంలోని ప్రతి సంస్థను తమ గుప్పిట్లో పెట్టుకున్నాయి. మేము ఇప్పుడు బీజేపీ, ఆరెస్సెస్‌తోపాటు భారతదేశంపై కూడా పోరాడుతున్నాం’ అని వ్యాఖ్యానించారు.
రాహుల్ బ్రిటిష్ పౌరుడా?
ఇంతకీ రాహుల్ గాంధీ ఏ దేశ పౌరుడు? కొంత కాలంగా ఈ అంశంపై వివాదం నడుస్తోంది. బ్రిటన్ అధికారులకు సమర్పించిన పత్రాల్లో తనను తాను బ్రిటిష్ పౌరుడిగా రాహుల్ గాంధీ చెప్పుకున్నా రని డా. సుబ్రమణ్యంస్వామి ఆరోపించారు. రాహుల్ పౌరసత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో ఇలాంటి పిటిషన్ వేశారు. ఇదే అంశంపై కర్ణాటకకు చెందిన ఎస్. విఘ్నేష్ శిశిర్ న్యాయ పోరాటం చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకుడికి రెండు దేశాల పౌరసత్వాలు ఉండటం భారతీయ న్యాయ సంహిత, పాస్‌పోర్ట్ చట్టం కింద నేరమని రాహుల్ పౌరసత్వంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని ఆయన కోర్టును కోరారు.
ఎన్నికల సంఘం మీద దుమారం
బీజేపీ కోసం కేంద్ర ఎన్నికల సంఘం భారీగా ఓట్లు చోరీకి పాల్పడుతోందని రాహుల్ గాంధీ అదే పనిగా ఆరోపిస్తున్నారు. అది రుజువు చేసేందుకు అణుబాంబు లాంటి ఆధారాలున్నాయని అన్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ-ఎస్‌ఐఆర్ చేపట్టింది. అనంతరం ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేసింది. ఈ పక్రియను ముందు నుంచీ వ్యతిరేకిస్తోన్న రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘రాష్ట్ర స్థాయి నుంచి ఓట్ల చౌర్యం జరుగుతోందని మేం ఎప్పటినుంచో అనుమానిస్తున్నాం. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికల్లోనూ అక్రమాలు జరిగాయి. ఆరునెలలు మేం సొంతంగా దర్యాప్తు జరిపి ఆటంబాంబు లాంటి ఆధారాలను గుర్తించాం. ఆ బాంబు పేలిన రోజు ఎన్నికల సంఘం దాక్కోవ డానికి అవకాశమే ఉండదు’ అన్నారు. వాస్తవానికి కేంద్ర ఎన్నికల సంఘ దేశ వ్యాప్తంగా ఓటర్ల జాబితాల ప్రక్షాళన ప్రారంభిస్తున్నామని ప్రకటించింది. ఈ పనిని త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బిహార్ నుంచి ప్రారంభించింది. అక్కడ ప్రత్యేక సమగ్ర సవరణ-ఎస్‌ఐఆర్ పూర్తి చేసి, 65 లక్షల బోగస్ ఓట్లను గుర్తించి తొలగించారు. 22.34 లక్షల మంది ఓటర్లు చనిపోయారని, 36.28లక్షల మంది ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లడం లేదా ఆయా చిరునామాలో వాళ్లు ఇప్పుడు లేరని గుర్తించినట్లు ఎన్నికల సంఘం చెప్పింది. అయితే ఇదంతా బీజేపీకి అనుకూలంగా జరిగిందని ఆర్‌జేడీ, రాహుల్ ఆరోపించారు. బిహార్‌లో ఓటమిని ముందే ఊహించి రాహుల్ ఈ ఆరోపణలు చేస్తున్నారా? ఏ రాష్ట్రంలో అయినా ఓటర్ల జాబితాలో చేర్పులు, తొలగింపులు సహజం. అభ్యంతరాలు ఉంటే ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుంది. కానీ అభ్యంతరాలు, ఫిర్యాదులు ఇవ్వకుండా అక్రమ ఓట్లు అంటూ ఆరోపణలు చేయడం, నిరూపించలేకపోవడం కాంగ్రెస్, ఇతర విపక్షాలకు తంతుగా మారింది.
క్రాంతిదేవ్ మిత్ర
సీనియర్ జర్నలిస్ట్