అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు నోబెల్‌ ‌బహుమతి తిక్క ముదిరి ‘పిచ్చి’ స్థాయికి చేరింది. దౌత్యనీతిని పక్కనబెట్టి ఆయన పూర్తి వ్యాపార ధోరణి స్వదేశీయులకే గుదిబండగా మారింది. ఆయన వ్యవహార శైలి దేశాన్ని ఏలిన మహ్మద్‌బీన్‌ ‌తుగ్లక్‌ను మరోసారి గుర్తుచేస్తోంది. రాజధానిని ఢిల్లీ నుంచి దౌల్తాబాద్‌కు మార్చాలన్న తుగ్లక్‌ ‌నిర్ణయం సరైందే, కానీ ఢిల్లీలోని ప్రతి కుటుంబం తరలివెళ్లాలని ఆదేశించడం పెద్ద తప్పు. తీరా అక్కడికి వెళ్లాక తిరిగి ఢిల్లీకి మార్చడం ఇంకో తప్పు. ట్రంప్‌ ‌వ్యవహారశైలి సరిగ్గా ఇలాగే ఉంది!

రష్యా-యుక్రెయిన్‌ ‌యుద్ధాన్ని ఆపుతానని ప్రతిన బూని జెలన్‌స్కీతో చర్చలు జరిపి రష్యాను ఆంక్షల పేరుతో హెచ్చరించాడు. ఆ వెంటనే రష్యా అధ్యక్షుడికి రెడ్‌ ‌కార్పెట్‌ ‌స్వాగతం పలికి అలస్కా సమావేశంలో ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలపై చర్చించి, పుతిన్‌ ‌డిమాండ్లకు ఓకే అన్నాడు. ఇప్పుడు జెలన్‌స్కీని భూభాగాలు వదులుకోమంటున్నాడు. ఈ తీరుతో యుక్రెయిన్‌, ‌యూరోపియన్‌ ‌యూనియన్‌ ‌దేశాలు తలలు పట్టుకుంటున్నాయి. రష్యా యుద్ధం ఆపడానికి భారత్‌పై ఆంక్షలు విధిస్తామని బెదిరింపు! బోడి గుండుకు మోకాలికి ముడి పెట్టడమంటే ఇదే! చివరకు రష్యా-యుక్రెయిన్‌ ‌యుద్ధంతో తమకు సంబంధం లేదని మరో ప్రకటన. ఇంతటి అసంబద్ధ రాజకీయ విధానాన్ని అనుసరించిన దేశాధినేతలు దాదాపుగా ప్రపంచంలో ముఖ్యంగా అమెరికాలో ఎవరూ లేరు! ఆదాయం పేరుతో ‘బెదిరింపు-కాళ్లబేరం’ అనే విచిత్ర దౌత్యనీతిని ప్రవేశపెట్టిన ఘనత ట్రంప్‌కే దక్కుతుంది! పైగా ఆయన ఆంక్షల బెదిరింపును ఇతర దేశాలు బేఖాతరు చేయడమే కాదు, క్రమంగా కొత్త ప్రపంచ ఏర్పడేందుకు దోహదం చేస్తుందనడంలో ఎంత మాత్రం సందేహం లేదు!!

దౌత్యనీతిలో ‘నేనే గొప్ప’, ‘నేను చెప్పిందే వినాలి’ అనే విధానం ఎప్పుడూ సత్ఫలితాలివ్వదు. ‘గెలువు- గెలిపించు’ విధానం అనుసరించాలి. దురదృష్ట వశాత్తు ట్రంప్‌కు ఇటువంటి అవగాహన లేదు. పుతిన్‌-‌జెలన్‌స్కీల మధ్య సమావేశం ఏర్పాటు చేయడం నూనె-వెనిగర్‌లను కలపడం వంటి సంక్లిష్ట ప•క్రియ అని ట్రంప్‌ అసహనం వ్యక్తం చేయడం వెనుక కారణమిదే. ఇప్పుడు యుద్ధం ముగింపు విషయంలో వీరిద్దరూ కలిసి పనిచేస్తారా? లేదా? అనే విషయం ఆయనకే స్పష్టంగా తెలియడంలేదు. దీంతో ‘వైరాగ్యం’ ఆవహించి భవిష్యత్తులో వీరిద్దరి మధ్య జరిగే సమావేశానికి తాను హాజరయ్యే విషయం కూడా స్పష్టంగా చెప్పలేదనడం మరో విచిత్రం. ఇప్పటికే పది యుద్ధాలు ఆపిన తనకు రష్యా-ఉక్రెయిన్‌ ‌పోరు సంతోషం కలిగించడం లేదని ట్రంప్‌ ‌పేర్కొనడం అసంబద్ధం. ఈయన సంతోషంతో ఆ దేశాలకు ఏం పని? రెండు దేశాలు ఎడతెగని యుద్ధంలో ఉండడాన్ని బట్టి సమస్య తీవ్రతను అర్థం చేసుకోవాలి! నిజానికి ట్రంప్‌ ‌నిర్ణయాన్ని ఖాతరు చేస్తే యుద్ధం ఎప్పుడో ఆగివుండేది. కానీ పుతిన్‌.. ‌ట్రంప్‌ను ఒక ‘‘జోకర్‌’’‌గా పరిగణిస్తున్నారనుకోవాలి. ఇప్పటికే 20 వేల ఆంక్షలను ఎదుర్కొంటున్న రష్యా ఇప్పటికీ బలీయమైన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోంది. దీన్ని ట్రంప్‌ ‌గుర్తించడంలేదు. అయితే పుతిన్‌- ‌జెలన్‌స్కీల మధ్య చర్చలకు అమెరికా ఏర్పాట్లు చేస్తోందని, యుద్ధాన్ని ఆపాలంటే ఇద్దరూ కొంత భూమిని వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలనేది ఆయన చెప్పే మరోమాట! త్రైపాక్షిక చర్చలకు తాను సిద్ధమేనని జెలన్‌స్కీ స్పష్టం చేస్తున్నా రష్యా చర్చలకు సానుకూలంగా ఉంటూనే, అటు దాడులును కొనసాగిస్తోంది. ఇది పుతిన్‌ ఆడుతున్న రాజకీయ చదరంగపు క్రీడ! ఫలితంగా రష్యా-ఉక్రెయిన్‌ ‌యుద్ధం ముగింపులో ఎటువంటి పురోగతి లేదు. రష్యా తన దాడులను ఆపగపోగా,ఉక్రెయిన్‌లో అమెరికా కర్మాగారంపై రష్యా దాడి చేసిందన్న వార్తలను ఖండించడ మే కాదు.. ఇలా చేస్తే భారీ ఆంక్షలను ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించడం పెద్ద ‘‘జోక్‌’’. ‌రెండు వారాల్లో ఒక ఒప్పందానికి రాకపోతే తానే ఒక నిర్ణయం తీసుకుంటానని మరో హెచ్చరిక!! కాగా,రష్యా క్రమంగా ఉక్రెయిన్‌ను విలీనం చేసుకునే దిశగా ముందుకెళుతోంది. దౌత్యనీతి తెలియని ట్రంప్‌కు ఇదంతా అయోమయంగా ఉంది.పుతిన్‌ ‌తాను స్వాధీనం చేసుకున్న ప్రాంతాలతో పాటు మరికొన్ని కావాలని డిమాండ్‌ ‌చేస్తే, అందుకు జెనల్‌స్కీ అంగీకరించరు. ఇక యుద్ధం ముగిసే దెక్కడ? ఇరుదేశాలతో చర్చలు జరిపినా ఫలితం ఉండదు! మరి ట్రంప్‌కు నోబెల్‌ ‌బహుమతి ఆకాంక్ష అందని ద్రాక్ష లాంటి•.

ట్రంప్‌కు పట్టని దౌత్యనీతి

డోనాల్డ్ ‌ట్రంప్‌ ‌విధానాలను సునిశితంగా పరిశీలిస్తే అవి వ్యాపార సంబంధమైనవని సుస్పష్టం. ఆయన ఆదాయం పేరుతో దౌత్యనీతిని విస్మరించడంతో ప్రపంచ రాజకీయాలు పెను కుదుపులకు లోనవుతున్నాయి. ట్రంప్‌-‌పుతిన్‌లు అలాస్కాలో జరిపిన సమావేశం ఇది నిజమని నిరూ పించింది. దీనికి సంబంధించి మీడియాలో వచ్చిన కొన్ని కథనాలు ఆశ్చర్యపరిచేలా ఉన్నాయి. రష్యాపై నిప్పులు చెరిగిన ట్రంప్‌, ఆ ‌దేశాధ్యక్షుడికి రెడ్‌ ‌కార్పెట్‌ ‌స్వాగతం పలకడం అందరినీ ఆశ్చర్యపరచింది. ఇద్దరూ యు.ఎస్‌. అధ్యక్షుడి కారులో ప్రయాణించడమే కాదు రెండు గంటలపాటు స్నేహపూర్వక వాతావారణంలో చర్చలు జరపడం మరో విచిత్రం. జెలన్‌స్కీతో ట్రంప్‌ ‌సమావేశానికి పుతిన్‌తో జరిగిన చర్చలకు అసలు పొంతనే కనిపించదు. అన్నింటికీ మించి ఈ సమావేశం ప్రధాన అజెండా రష్యా- ఉక్రెయిన్‌ ‌యుద్ధంపై చర్చలు జరపడం. మీడియా కథనాల ప్రకారం అసలీ యుద్ధం ప్రస్తావనకు పెద్ద ప్రాధాన్యతనివ్వలే దని స్పష్టమవుతోంది. ప్రధానంగా రష్యా- అమెరికా మధ్య వాణిజ్యంపైనే దృష్టి కేంద్రీకరించినట్లు ఆ మీడియా కథనాలు వెల్లడించాయి. భారత్‌పై టారిఫ్‌ల విధింపు, మన విదేశాంగ మంత్రి జయశంకర్‌ ‌రష్యా ప్రయాణం, చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ ‌యీ మనదేశంలో ఏకంగా మూడు రోజులు పర్యటించడం, ప్రధాని నరేంద్రమోదీ ఈ నెలాఖరులో చైనా పర్యటన.. వీటన్నింటిని పరిశీలిస్తే ఒకదానికొకటి సంబంధం ఉందనుకోవాల్సి వస్తోంది.

రష్యా నుంచి ఎవరూ చమురు కొనుగోలే చేయరాదని ఒత్తిడి తెస్తున్న ట్రంప్‌.. ‌భారత్‌ను లొంగదీసుకునేందుకు టారిఫ్‌లు విధించడం ద్వారా తీవ్ర యత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. భారత్‌ ‌చమురు కొనుగోలు ద్వారా యుద్ధానికి అవసరమైన నిధులను సమకూర్చడం వల్లనే రష్యా యుద్ధం ఆపడంలేదన్నది ట్రంప్‌ ‌యంత్రాంగం ఆరోపణ.మరి మనకంటే చాలా పెద్ద మొత్తంలో రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న చైనాను ట్రంప్‌ ‌తన లక్ష్యం చేసుకోవడం లేదు? కేవలం మనదేశంపైనే టారిఫ్‌ల పేరుతో ఒత్తిడి పెంచడానికి కారణమేంటన్న ప్రశ్నలు ఉదయించడం సహజమే! ఇందుకు రెండు కారణాలున్నాయి.1.అరుదైన లోహాలు (రేర్‌ఎర్త్ ‌మెటల్స్) ‌చైనానుంచి ఎగుమతి అవుతాయి. ఈ రంగంలో ప్రపంచంలో చైనాదే ఆధిపత్యం. వీటి దిగుమతులు ఆగిపోతే అమెరికా సాంకేతిక రంగం మొత్తం కుప్పకూలడం ఖాయం.2.త•నపై అమల్లో ఉన్న ఆంక్షల కారణంగా అంతర్జాతీయ విపణిలో చైనా చమురు అమ్ముకోవడం సాధ్యం కాదు! ఇక మనదేశం, అమెరికాతో జరిపే వాణిజ్యంలో మన ఎగుమతులే అధికం. రష్యా నుంచి తక్కువ ధరకే ముడిచమురు కొనుగోలు చేసి,శుద్ధి చేసి యూరప్‌ ‌దేశాలకు అమ్ముతోంది. నిజానికి మనదేశం ఈ పని చేయకపోతే ప్రపంచ దేశాల్లో చమురు ధరలు విపరీతంగా పెరిగి తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకు పోయేవి. ఇలా రష్యాపై ఆంక్షలు విధించిన యూరప్‌ ‌దేశాలకు రష్యా చమురునే అమ్ముతూ భారత్‌ ‌లాభపడటం అమెరికాకు ఎంతమాత్రం గిట్టడం లేదు. ఈ నేపథ్యంలో యుక్రెయిన్‌ ‌పేరు చెప్పి మనదేశంపై 50% టారిఫ్‌లు విధించింది. ఇది పైకి కనిపించేది మాత్రమే. కానీ అసలు వాస్తవం మరోటుందని మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. అలాస్కా సమావేశంలో ట్రంప్‌ ‌ప్రధానంగా ప్రతిపా దించిన విషయం రష్యా చమురు గురించే. ‘మీరు మాకు చమురు పంపండి. మేం శుద్ధి చేసి విదేశాలకు అమ్ముకుంటాం. ఇలా మీరు, మేము లాభపడవచ్చు’ ఇది ట్రంప్‌ ‌ప్రతిపాదన. అలా అయితే రష్యాపై విధించిన ఆంక్షలన్నింటినీ ఎత్తేస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారట! ఆంక్షల వల్ల చైనా చమురు అమ్ముకోవడం సాధ్యంకాదు! టారిఫ్‌ల భయంతో భారత్‌ ‌లొంగి దారికొస్తుందనేది ట్రంప్‌ ‌గట్టి విశ్వాసం. అలా రష్యా చమురును కొనుగోలు చేయకుండా భారత్‌ను కట్టడి చేసి, ఇదే చమురును తాను కొనుగోలు చేసి వ్యాపారం ద్వారా లాభపడాల న్నది ట్రంప్‌ ‌యంత్రాంగం వ్యూహమని స్పష్టమవు తోంది. యుక్రెయిన్‌ ఆ‌క్రమించిన భూభాగాలను వదిలేసుకో వాలని పుతిన్‌ ‌డిమాండ్‌ను ముందుకు తేవడంతో..‘వ్యాపార’ లక్ష్యంగల ట్రంప్‌ ‌దీనికి అంగీకరించినట్లు ఈ కథనాలు పేర్కొన్నాయి. యూరోపియన్‌ ‌యూనియన్‌ ‌నేతలను వెంటబెట్టుకొని వచ్చిన జెలన్‌స్కీతో ట్రంప్‌ ‌మాట్లాడుతూ…. సంధి కుదరాలంటే కొన్ని భూభాగాలను వదులుకోక తప్పదని స్పష్టం చేయడం వెనుక ప్రధాన కారణం ఇదేనన్నది ఇప్పుడు మనకు తేలిగ్గా అర్థమవుతుంది.

టారిఫ్‌ల ద్వారా భారత్‌-‌రష్యాల మధ్య వాణిజ్య సంబంధాలను దెబ్బతీయడం తోపాటు, చైనాకు చమురు అమ్మొద్దని…ఈ రెండు దేశాలకు అమ్మే చమురు తామే కొనుగోలు చేస్తామని ప్రతిపాదించడం ద్వారా భారత్‌, ‌రష్యా, చైనాలను విడగొట్టాలని వేసిన ట్రంప్‌ ఎత్తుగడ ఇది! ఈ మూడు దేశాలు ఏకమైతే తన మనుగడకే కష్టమని స్పష్టంగా తెలియడంతో, ట్రంప్‌ ‌చేస్తున్న ‘‘వాణిజ్య తంత్రం’’ ఇది! తాము చమురును పూర్తిగా కొనుగోలు చేస్తామంటూ రష్యాను కూడా తమ గుప్పిట్లోనే పెట్టుకోవచ్చు! కానీ ఈ ప్రతిపాదనకు ప్రధాన ప్రతిబంధకం జెలన్‌స్కీ. యూరోపియన్‌ ‌యూనియన్‌ ‌నేతలతో అమెరికా వచ్చినప్పుడు, యుద్ధాన్ని ఆపడానికి జెలన్‌స్కీ ఎంతమాత్రం ఒప్పుకోలేదు. ఇందుకు ఆయన సమస్యలు ఆయనకున్నాయి. ఒకవేళ యుద్ధం ఆగిపోయి,ఎన్నికలు జరిగినా ఈయన కచ్చితంగా గెలవడు. వచ్చే ప్రభుత్వం కేసులు పెట్టి అరెస్ట్ ‌చేయవచ్చు. జైలుశిక్ష లేదా మరణశిక్షను ఎదుర్కొనక తప్పని పరిస్థితి ఏర్పడవచ్చు. అందువల్ల యుద్ధం కొనసాగించాల్సిందేననేది జెలన్‌స్కీ పట్టుదల!

ట్రంప్‌ అస్థిర వ్యవహారశైలి

ఇదిలావుండగా తాజాగా ట్రంప్‌ ‌మాట్లాడుతూ, రష్యా-యుక్రెయిన్‌ ‌యుద్ధంతో అమెరికాకు సంబంధం లేదని బాంబు పేల్చడంతో ప్రపంచమే దిగ్భ్రాంతికి లోనైంది. 2008లో జార్జియాలోని అబ్‌ఖాజియా, సౌత్‌ ఒస్సెటియా ప్రాంతాలను రష్యా ఆక్రమించుకున్న నేపథ్యంలో, యూరోపియన్‌ ‌దేశాలు రష్యాపై ఆంక్షలు విధించడమే కాకుండా, అప్పటి నుంచి ఏటా ఐ.రా.స. భద్రతా మండలిలో రష్యాకు వ్యతిరేకంగా ఉమ్మడి ప్రకటనలు చేయడం పరిపాటిగా వస్తోంది. వీటికి అమెరికానే నాయకత్వం వహిస్తోంది. విచిత్రంగా ఈసారి యు.ఎస్‌. ఈ ‌సంయుక్త ప్రకటన జారీలో పాల్గొనలేదు. ట్రంప్‌ ఇచ్చిన ఈ ట్విస్ట్ ‌నుంచి ఇప్పటికీ యూరప్‌ ‌దేశాలు కోలుకోలేదు. ఇందుకు ముఖ్య కారణం పుతిన్‌ ఆడుతున్న చదరంగం. అలాస్కాలో ఇద్దరు నేతల మధ్య ఏదో జరిగింది. ముఖ్యంగా పుతిన్‌ ‌తన చాణక్యంతో ట్రంప్‌ను బుట్టలో వేసారనుకోవాలి. శాంతి చర్చలకు ఓకే అంటున్న పుతిన్‌ ‌యుక్రెయిన్‌పై యుద్ధం ఆపడంలేదు. పుతిన్‌ను ఎలా అంచనా వేయాలో ట్రంప్‌ అనే వ్యాపారికి సాధ్యంకాదు కూడా. ఎందుకంటే ఈయనకు దౌత్య నీతి తెలియదు.

అత్తమీద కోపం…

రష్యానుంచి చమురు కొనుగోలు చేస్తున్నదంటూ భారత్‌పై టారిఫ్‌లు విధించిన నేపథ్యంలో రెండు దేశాల మధ్య సంబంధాల్లో అస్థిరత నెలకొన్న తరుణంలో, ఇలా వాణిజ్య సుంకాలు విధింపు తప్పన్న వారిపైనా ట్రంప్‌ ‌కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారు. అమెరికా మాజీ ఎన్‌.ఎస్‌.ఏ. ‌జాన్‌ ‌బోల్టన్‌ ‌నివాసంలో ఎఫ్‌.‌బి.ఐ. తనిఖీలు నిర్వహించడం ఇందుకు తాజా ఉదాహరణ. భారత్‌పై సుంకాలు విధించే ట్రంప్‌ ‌తీరును ఆయన తప్పుపట్టిన మరునాడే ఈ తనిఖీలు చేపట్టడం గమనార్హం. అంతేకాదు ట్రంప్‌ ‌తనకు వీర విధేయుడైన సెర్గియో గోర్‌ను భారత నూతన రాయబారిగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ పదవి ఖాళీ అయిన ఎనిమిది నెలల తర్వాత భర్తీ అయ్యింది. భారత్‌పై ఒత్తిడిని మరింత పెంచేం దుకే ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పడంలో ఎంతమాత్రం సందేహం లేదు. భారత్‌ను రెచ్చగొట్టే రీతిలో ట్రంప్‌, ‌పాక్‌ ఆర్మీ చీఫ్‌ ‌మునీర్‌ను ఆహ్వా నించడం, పాకిస్తాన్‌ ఎగుమతులపై కేవలం 19% టారిఫ్‌లు విధించడం, భారత అధికారులను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసిందన్న మాట నిజం. భారత్‌ ‌కూడా ట్రంప్‌ ‌టారిఫ్‌ ‌బెదిరింపులకు ఎంతమాత్రం భయపడటం లేదు. నిజానికి కొన్ని దశాబ్దాలుగా నిర్మించుకుంటూ వచ్చిన ద్వైపాక్షిక సంబంధాలను ట్రంప్‌ ‌తన మూర్ఖపు వైఖరితో దెబ్బతీసే రీతిలో వ్యవహరిస్తున్నప్పటికీ ఆయనను కట్టడి చేసే వ్యూహాలను భారత్‌ ‌నిశ్శబ్దంగా అమలు చేస్తూ ముందుకెళుతోంది.

రష్యా చైనాల అండ

 టారిఫ్‌లపై అమెరికా ప్రకటన నేపథ్యంలో, మన ఆప్తమిత్రుడు రష్యా అండగా నిలచి, ఈ టారిఫ్‌లు ఏకపక్షమని పేర్కొంది. మనదేశ ఉత్పత్తులను తమ మార్కెట్లలో అమ్ముకోవడానికి పూర్తి స్వేచ్ఛనిస్తూ రష్యా రాయబార కార్యాలయం ప్రకటించింది. చైనా అవకాశమిస్తున్నట్టు ప్రకటించింది. అంతేకాదు తమ ఇద్దరి మధ్య సరిహద్దు సమస్యను పరస్పరం పరిష్క రించుకుందామని చైనా ప్రతిపాదించింది. భారత్‌ ‌నుంచి చమురు కొనుగోలు చేయవద్దని యూరప్‌ ‌దేశాలు నిర్ణయించిన నేపథ్యంలో,చమురు కోసం ముంబయ్‌ ‌వచ్చిన యు.కె.కు చెందిన నౌక ఖాళీగానే వెళ్లిపోయింది. సరిగ్గా ఆ సమయంలో మనదేశంలోని నయారా సంస్థకు చెందిన ఓడలోని చమురును యూరప్‌ ‌దేశాలు తిరస్కరించగా, దానిని చైనా కొనుగోలు చేయడం అమెరికా సహా యూరప్‌ ‌దేశాలను ఉలిక్కిపడేలా చేసింది. చైనా, ఆఫ్రికా, ఆసియా దేశాలలో మార్కెట్లను విస్తరించుకునే పనిని భారత్‌ ‌చాపకింద నీరులా చేపట్టింది. భారత్‌పై ఆంక్షలు విధించాలని అమెరికా యూరప్‌ ‌దేశాలపై కూడా ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో ఫ్రాన్స్‌కు చెందిన 114 రఫేల్‌ ‌యుద్ధ విమానాల కొనుగోలు వైపు మొగ్గు చూపి, చర్చలకు సిద్ధమవుతోంది. దీంతో అమెరికా ఎఫ్‌-35, ‌రష్యా సుఖోయ్‌-57 ‌విమానాల కొను గోలును పక్కన పెట్టినట్లయింది. రష్యా సహకా రంతో సూపర్‌ ‌సుఖోయ్‌ ‌యుద్ధ విమానాల తయారీ జరుగుతున్న నేపథ్యంలో దానితో ఇబ్బంది లేదు. 120 కిలోటన్‌ ‌సామర్థ్యం గల యుద్ధ విమానాలకు సంబంధించిన ఆధునిక ఇంజిన్‌ను భారత్‌-‌ఫ్రాన్స్ ‌మనదేశంలోనే ఉమ్మడిగా ఉత్పత్తి చేయడానికి పరస్పం అంగీకరించడం మరో తాజా పరిణామం. నిజంగా ఆత్మనిర్భర్‌ ‌భారత్‌ ‌సాధనకు ఇది అత్యంత కీలక నిర్ణయం. ప్రస్తుతం అమెరికాకు చెందిన ప్రముఖ సంస్థ జి.ఇ.తో ఎఫ్‌414 ‌జెడ్‌ ఇం‌జిన్‌ ‌కోసం ఒప్పందం కుదుర్చుకున్నాం. ఈ ఒప్పందంలో 80శాతం సాంకేతిక పరిజ్ఞాన బదలాయిపు అత్యంత కీలకం. ఇప్పటికే ఈ ఇంజన్ల సరఫరాలో తీవ్ర జాప్యం జరగడం, యు.ఎస్‌. ఏకపక్ష టారిఫ్‌ల విధింపు ఈ ఒప్పందంపై నీలినీడలు కమ్మే అవకాశం ఉంది. తాజాగా ఫ్రాన్స్‌తో కుదుర్చుకోబోయే ఒప్పందం అమెరికాకు చెంపపెట్టు లాంటిదనే చెప్పాలి. మరోవంక, జర్మనీతో పి-75ఎ జలాంతర్గాముల కొనుగోలు ఒప్పందానికి చర్చలకు సిద్ధమవుతోంది. ఈ ఒప్పందం విలువ రూ.75వేల కోట్లు. ఇలా యూరప్‌ ‌దేశాల్లోని అత్యంత శక్తిమంతమైన ఈ రెండు దేశాలతో రక్షణ పరమైన వాణిజ్య ఒప్పందాల ద్వారా మనదేశం ఈయూను కట్టడి చేసినట్టే అవుతుంది. అంతేకాదు ట్రంప్‌ 50% ‌సుంకాల విధింపు ప్రకటన వెలువడిన కొద్ది రోజులకే భారత్‌ అగ్ని-5 పరీక్ష నిర్వహించడం ద్వారా రక్షణ రంగంలో మన ఎదుగుదలను చెప్పకనే చెప్పినట్ల యింది. మల్టిపుల్‌ ఇం‌డిపెండెంట్లీ టార్గెటబుల్‌ ‌రీ-ఎంట్రీ వెహికిల్‌ (ఎంఐఆర్‌వీ) సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఇటువంటి క్షిపణులు ప్రస్తుతం ఐదు దేశాల వద్ద మాత్రమే ఉన్నాయి. ట్రంప్‌ ‌మనపట్ల అనుసరిస్తున్న విధానం వల్ల ఇప్పటికే అమెరికా వాణిజ్యపరంగా ఎంతో నష్టపోయింది. అలాస్కా చర్చలు విఫలమైతే భారత్‌పై సెకండరీ టారిఫ్‌లను విధిస్తామని అమెరికా ట్రెజరీ డిపార్ట్ ‌మెంట్‌ ‌హెచ్చరింది. మరిప్పుడు అలాస్కా చర్చలు ఫలితమివ్వలేదు. ఏం జరుగుతుందో చూడాలి. ‘భారత్‌ ‌నుంచి ముడి చమురు సహా వివిధ రకాల శుద్ధి చేసిన వస్తువులు ఇబ్బంది అనుకుంటే అసలు కొనవద్దు. మా సరుకులు కొనాలని మేం మిమ్మల్నేం ఒత్తిడి చేయడంలేదు. మీరు కాక•పోతే వేరే దేశాలు కొంటాయి. యూరప్‌, అమెరికాల మాదిరిగానే భారత్‌ ‌కూడా తన సరుకులను అమ్ముతోంది. అమెరికా సంప్రదాయ విదేశాంగ విధానాలకు ట్రంప్‌ ‌తిలోదకా లిచ్చారు. ఏ దేశం గురించి ఆయన ఏమను కుంటు న్నారో ఎవ్వరికీ తెలియదు. ఆయన సారథ్యంలో అమెరికా విదేశాంగ విధానం అగమ్య గోచరంగా తయారైంది. ఇటువంటి విదేశాంగ విధానాన్ని బాహాటంగా అమలు చేసిన అమెరికా అధ్యక్షుడిని ప్రపంచం ఇప్పటివరకు చూడలేదు’’…అని మన విదేశాంగ మంత్రి జైశంకర్‌ ‌వ్యాఖ్యానించారు. దౌత్య వేత్తగా అపార అనుభవం సొంతం చేసుకున్న ఆయన ఇలా మాట్లాడారంటే, ట్రంప్‌ ‌వ్యవహారశైలితో ఎంతగా విసిగిపోయారో అర్థమవుతుంది.

తగ్గిన వలసలు

అక్రమ వలసల పేరుతో పెద్దఎత్తున స్వదేశాలకు తిప్పి పంపడం, అరెస్ట్‌లు, చట్టపరమైన ప్రవేశాలపై ఆంక్షలతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ‌ట్రంప్‌ ‌వలసదారులపై విరుచుకుపడటమే కాకుండా, అమెరికా ఆర్థిక వ్యవస్థకు వెన్ను దన్నుగా నిలిచేవారిపై కఠినచర్యలు తీసుకుంటున్నారు. దీంతో ఆ దేశానికి వెళ్లేవారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది.1960 తర్వాత వలసదారుల సంఖ్య ఇంతగా తగ్గిపోవడం ఇదే ప్రథమం.

జోబైడెన్‌ ‌హయాం నుంచి, ఇప్పటివరకు అమెరికా చేసే ప్రతి దౌత్య వ్యవహారం మనకు వరంగానే మారుతూ వస్తోంది. జోబైడెన్‌ ‌తనయుడు హంటర్‌ ‌బైడెన్‌ ‌యుక్రెయిన్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు. ఈ నేపథ్యంలో ఏదోవిధంగా యుక్రెయిన్‌ను తమ అదుపులోకి తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో డీప్‌స్టేట్‌ ఆదేశాల మేరకు సహాయం పేరుతో నాటో దళాలను యుక్రెయిన్‌కు పంపే యత్నం చేయడంతో పుతిన్‌ అడ్డుకున్నారు. ఫలితంగా రష్యా-యుక్రెయిన్‌ ‌యుద్ధం మొదలైంది. రష్యాపై ఆంక్షల నేపథ్యంలో, ఆ దేశం నుంచి చమురును చవక ధరకే మనం కొనడం మొదలైంది కూడా సరిగ్గా అప్పుడే! ఈ చమురును శుద్ధి చేసి యూరప్‌ ‌దేశాలకు అమ్మి లాభాలు అర్జిస్తున్నాం. ఆవిధంగా జోబైడెన్‌ ‌మనకు పరోక్షంగా సహాయం చేశారు.

జమలాపురపు విఠల్‌రావు

సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE