తెలంగాణ ప్రభుత్వం ఏం చేసినా సంచలనమే. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏ ‌నిర్ణయం తీసుకున్నా దాని వెనక ఏదో నిగూడార్థం దాగి ఉంటుంది. ఊరించి ఊరించి ఉసూరుమనిపించినా ఆమోదయోగ్యంగానే కనిపిస్తుందన్నది కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం. ఇది కేసీఆర్‌ ‌రాజనీతిజ్ఞత అని కొనియాడేవాళ్లూ లేకపోలేదు. నిబంధనల మేరకే ఎవరికి చెందాల్సినది వారికి చెందడానికి ఏళ్లకు ఏళ్లు సాగదీసి.. నైరాశ్యంలో ఉన్న సమయంలో హఠాత్తుగా ఆ విషయాన్ని ప్రకటించి వారి జీవితాల్లో తామే ఆశాదీపం వెలిగించామన్న భావనను కలిగించేలా చేయడం కేసీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య.

సరే.. ఆ విషయం పక్కనపెడితే.. ప్రభుత్వం తాజాగా తీసుకున్న కొన్ని నిర్ణయాలు తమ పిల్లలను ప్రైవేట్‌, ‌కార్పొరేట్‌ ‌పాఠశాలల్లో చదివిస్తున్న తల్లిదండ్రులను అప్పుల్లోకి నెట్టేవేశాయి. అంతేకాదు, విద్యార్థులను ప్రమాదపుటంచుల్లో పడేశాయి. కరోనా పూర్తిగా తగ్గకముందే ప్రభుత్వం అనాలోచితంగా రాష్ట్రవ్యాప్తంగా ఆరో తరగతి నుంచి ప్రత్యక్ష బోధనా తరగతులను ప్రారంభించింది. కానీ అంతలోనే కరోనా కేసులు వేగంగా వ్యాపిస్తున్నందున పాఠశాలలు మళ్లీ మూసేస్తున్నట్లు ప్రకటించింది. విద్యాసంస్థలు కరోనా విస్పోటన కేంద్రాలుగా మారిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని.. విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. దేశంలోని చాలా రాష్ట్రాలు ఇప్పటికే ఈ తరహా నిర్ణయాలు తీసుకున్నాయని కూడా చెప్పారు. పైగా తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అన్నారు. అంటే, ప్రభుత్వం చేసిన పొరపాటు ఏమీలేదని చాటిచెప్పే ప్రయత్నం చేశారు. కానీ, అసలు విషయం వేరే ఉందని విమర్శలు వినిపిస్తు న్నాయి. కొన్ని వర్గాల కోసమే ప్రభుత్వం లోపాయి కారిగా ఇలా వెంట వెంటనే అనాలోచిత నిర్ణయాలు తీసుకుందని, ఫలితంగా విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ముప్పుతిప్పలు పెట్టిందన్న అభిప్రాయాలూ ఉన్నాయి.

వాస్తవానికి దేశంలోని చాలా రాష్ట్రాలు అసలు పాఠశాలలు ప్రారంభించలేదు. విద్యాసంవత్సరం గడిచిపోయినా మంచిదేగానీ, చిన్నారులను కరోనా బారినుంచి కాపాడుకోవాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాయి. కొన్ని రాష్ట్రాలైతే ప్రాథమిక, ప్రాథమికోన్నత తరగతుల విద్యార్థులను పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్‌ ‌చేస్తున్నట్లు చెప్పాయి. కానీ, తెలంగాణ ప్రభుత్వం విభిన్న నిర్ణయం తీసుకొని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. వేసవి సమీపిస్తున్న సమయంలో, ఒంటిపూట బడులు మొదలెట్టాల్సిన వేళ.. ప్రాథమికోన్నత తరగతుల విద్యార్థులకు ప్రత్యక్ష బోధనా తరగతులు ప్రారంభించింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. దీంతో అప్పటిదాకా ఆన్‌లైన్‌ ‌క్లాసుల్లో మునిగితేలుతున్న విద్యార్థులు, ప్రధానంగా ప్రైవేట్‌ ‌పాఠశాలల విద్యార్థులు స్కూల్‌కు వెళ్లక తప్పని పరిస్థితి నెలకొంది. కార్పొరేట్‌, ‌ప్రైవేట్‌ ‌పాఠశాలల యాజమాన్యాలకు ఇది అందివచ్చిన అవకాశంగా మారింది.

విద్య అంటేనే వ్యాపారంగా మారిన నేటి పరిస్థితుల్లో విద్యాసంస్థలు పూర్తి వ్యాపార ధోరణిని అలవర్చుకున్నాయి. విద్యార్థులను స్కూల్‌లో చేర్పించినది మొదలు.. అడ్మిషన్‌ ‌ఫీజులు, కాషన్‌ ‌డిపాజిట్లు, యూనిఫామ్‌లు, పుస్తకాలు, ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ ‌యాక్టివిటీస్‌ ‌పేరుతో ప్రత్యేక సరంజామా అమ్మకాలు వంటివన్నీ స్కూళ్లే సొంతంగా నిర్వహిస్తు న్నాయి. కొన్ని స్కూళ్లు అయితే, యూనిఫామ్‌లు, పుస్తకాల అమ్మకాలను కాంట్రాక్ట్‌కు ఇచ్చేశాయి. ఆ పాఠశాలలో చదివే విద్యార్థులంతా తప్పనిసరిగా అక్కడే కొనాలన్న నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తున్నాయి. ఆ కౌంటర్లు నిర్వహిస్తున్నవాళ్లు పాఠశాల యాజమాన్యాలకు కమీషన్లు ముట్ట జెబుతున్నారు. ఇదంతా చెప్పుకోవడానికి, వినడానికి ఇబ్బంది కరంగా ఉన్నా ప్రైవేట్‌, ‌కార్పొరేట్‌ ‌స్కూళ్లలో ఉన్న వాస్తవ పరిస్థితి ఇదే. యూనిఫారాలకు కనీసం ఐదు నుంచి పదివేల రూపాయలు; ఒక విద్యార్థికి అవసరమయ్యే పాఠ్య పుస్తకాలకు, నోట్‌ ‌పుస్తకాలకే కనీసం పదివేల నుంచి పదిహేను వేల రూపాయలు వసూలు చేస్తున్న పరిస్థితి. బయట స్టేషనరీల్లో అయితే కనీసం డిస్కౌంట్‌ అడిగే అవకాశం ఉండేది. స్కూల్‌ ‌కౌంటర్‌లోనే కొనాలంటూ ముందుగానే ఏ తరగతి పుస్తకాలకు ఎంత డబ్బు అనేది నిర్ణయించి మరీ విద్యార్థులకు రశీదులు ఇస్తున్న పరిస్థితి. పైగా పది పదిహేను వేలు పెట్టి పుస్తకాలు కొంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఒక్కరూపాయి తక్కువిచ్చినా కౌంటర్‌ ‌సిబ్బంది ఒప్పుకోరు. ఇప్పుడు కరోనా మహమ్మారి కారణంగా ఈ వ్యాపారం దెబ్బతిన్నది. విద్యార్థులు స్కూల్‌కు వెళ్లడంలేదు కాబట్టి యూనిఫామ్‌, ‌షూ, టై వంటి వాటి అవసరం లేకుండా పోయింది. పుస్తకాలు మాత్రం కచ్చితంగా కొనాలని ఆన్‌లైన్‌ ‌క్లాసుల్లో నిత్యం టీచర్లు విద్యార్థులకు బోధిస్తారు.

అయితే, ఫిబ్రవరిలో ప్రాథమికోన్నత తరగతుల విద్యార్థులు స్కూల్‌కు వెళ్లాలని, ప్రత్యక్ష బోధన ప్రారంభించాలని ప్రభుత్వమే స్వయంగా ఆదేశాలు ఇవ్వడంతో ప్రైవేట్‌, ‌కార్పొరేట్‌ ‌పాఠశాలల ఆగడాలు మళ్లీ మొదలయ్యాయి. ఫిబ్రవరి నుంచి మే వరకు లెక్కేసుకున్నా నాలుగు నెలలు మాత్రమే తరగతులు నడవాలి. కానీ, అప్పటిదాకా స్కూల్‌కు రాని విద్యార్థులు తప్పనిసరిగా యూనిఫామ్‌, ‌షూ వంటివన్నీ కొనాల్సిందేనని పాఠశాలల యాజమాన్యాలు నిబంధనలు విధించాయి. పైగా పెండింగ్‌లో ఉన్న ఫీజు మొత్తం చెల్లించాలని చెప్పాయి. దీంతో తప్పనిసరిగా ఫీజులు చెల్లించాల్సిన అవసరం ఏర్పడింది. అసలే లాక్‌డౌన్‌ ‌కారణంగా ఆర్థికంగా చితికిపోయిన తల్లిదండ్రులు.. మొదట్లో స్కూల్‌ ‌యాజమాన్యాలతో మాట్లాడుకొని ఎంతోకొంత డిస్కౌంట్‌కు ఒప్పించారు. అయితే, అదీ కొంతమందికి మాత్రమే అవకాశం ఇచ్చారు. కానీ, ప్రత్యక్ష బోధన మొదలయ్యాక.. డిస్కౌంట్ల హామీలు అటకెక్కాయి. అందరి వద్దా ముక్కుపిండి మరీ ఫీజులు వసూలు చేశాయి. పనిలో పనిగా చాలా పాఠశాలలు వార్షిక పరీక్షలంటూ మార్చి మొదటి వారంలోనే పరీక్షలు పూర్తిచేశాయి. ఫీజు మొత్తం చెల్లించిన వాళ్లనే పరీక్షలకు అనుమతిస్తామని చెప్పడంతో ఏడాది వృథా అవుతుందేమో అన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ ఫీజు బకాయిలన్నీ చెల్లించారు.

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని ప్రైవేట్‌, ‌కార్పొరేట్‌ ‌పాఠశాలలన్నీ సంవత్సరానికి సరిపడా ఫీజులు వసూలు చేసేసుకున్నాయి. కరోనా తెచ్చిన నష్టాలను పూర్తిగా పూడ్చుకున్నాయి. అలా అని ప్రైవేట్‌, ‌కార్పొరేట్‌ ‌పాఠశాలలు ఉపాధ్యాయులకు ఠంచన్‌గా జీతాలు చెల్లించాయా? అంటే అదీ లేదు. తొలుత కరోనా అంటూ విద్యా సంవత్సరం ప్రారంభం లోనే చాలామందిని ఉద్యోగాల్లోంచి తొలగించారు. ఏకంగా ప్రిన్సిపాళ్లను కూడా తొలగించడంతో రోడ్డున పడ్డ పరిస్థితి నెలకొంది. అనేకమంది ఉపాధ్యాయులు పొలాలు, సంస్థల్లో కూలీలుగా మారిపోయారు. అతితక్కువ మంది టీచర్లను కొనసాగించిన ప్రైవేటు స్కూళ్లు.. వాళ్లతోనే ఆన్‌లైన్‌ ‌క్లాసులు చెప్పించారు. ఆన్‌లైన్‌ ‌బోధనే కాబట్టి ఉన్నవాళ్ల జీతాల్లోనూ కోత విధించారు. సగం జీతం కూడా ఇవ్వలేదు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో పాఠశాలలకు ఫీజులన్నీ వసూలయ్యాయి గానీ, టీచర్ల జీవితాలు బాగుపడలేదు. ఉద్యోగాల నుంచి తొలగించిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోలేదు. మరోవైపు విద్యార్థుల తల్లిదండ్రులు అప్పుల్లో మునిగిపోయారు.

ఈ తతంగం అంతా పూర్తయింది. ప్రైవేట్‌ ‌విద్యాసంస్థల ఫీజులు మొత్తం వసూలయ్యాయి. మరోవైపు చాలా విద్యాసంస్థల్లో చిన్నారులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ముఖ్యంగా గురుకుల విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు, హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులకు వందల సంఖ్యలో కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో.. తల్లిదండ్రుల నుంచి సహజంగానే ఒత్తిళ్లు వచ్చాయి. చిన్నారుల ప్రాణాల కంటే తమకు ఏదీ ముఖ్యం కాదని, స్కూళ్లు మూసేయాలని, కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టాకే పాఠశాలలు ప్రారంభించాలని పట్టుబట్టారు. ప్రభుత్వానికి ఈ డిమాండ్‌ ఓ అ‌స్త్రంలా పనికొచ్చింది. విద్యార్థులకు కరోనా వచ్చిందని, తల్లిదండ్రుల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయని చెబుతూ స్కూళ్లు, కాలేజీలు అన్నీ బంద్‌ ‌చేసింది. కేవలం వైద్య కళాశాలలు మాత్రమే పనిచేస్తాయని ప్రకటించింది. దీంతో ప్రైవేట్‌, ‌కార్పొరేట్‌ ‌స్కూళ్లకు నెలరోజుల కాలానికి యేడాది ఫీజులు చెల్లించిన, యూనిఫామ్‌లు కొన్న తల్లిదండ్రుల పరిస్థితి దయనీయంగా మారింది. అయితే, ఇదంతా ఒక పథకం ప్రకారమే జరిగిందని ప్రతిపక్షాల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. కార్పొరేట్‌ ‌సంస్థల ఫీజుల వసూళ్ల కోసమే నెలరోజుల కోసం ప్రభుత్వం ప్రత్యక్ష బోధన ప్రారంభించిందని, ఫీజులు వసూలు కాగానే… విద్యార్థులకు కరోనా సోకుతోందన్న సాకుతో మళ్లీ స్కూళ్లు, కాలేజీలు మూయించిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

నిజంగానే విద్యార్థుల భవిష్యత్తు పట్ల, పిల్లల తల్లిదండ్రుల పట్ల ప్రభుత్వానికి ప్రేమ ఉంటే, వాళ్ల సంక్షేమం కోసం ఆలోచించే పరిస్థితి ఉంటే.. పాఠశాలలు ప్రారంభించాల్సిన అవసరం లేదు. తమిళనాడు ప్రభుత్వం గతేడాది సెప్టెంబర్‌లోనే సంచలనాత్మక నిర్ణయాన్ని ప్రకటించింది. కరోనాతో అన్నివర్గాల వాళ్లూ కుదేలైన పరిస్థితుల్లో చాలామంది తల్లిదండ్రులు కార్పొరేట్‌, ‌ప్రైవేట్‌ ‌విద్యాసంస్థల్లో తమ పిల్లలను చదివించే స్థితిలో లేరన్న కారణంగా.. టీసీలు లేకుండానే ఏ స్కూళ్లో అయినా విద్యార్థులను చేర్చుకోవాలని ఆదేశాలు జారీచేసింది. టీసీలు ఇవ్వడానికి ప్రైవేట్‌ ‌విద్యాసంస్థలు మొండికేస్తున్న నేపథ్యంలో తల్లిదండ్రులు చేసిన విజ్ఞప్తికి అక్కడి ప్రభుత్వం స్పందించింది. దీంతో కరోనా కాలంలో తమిళనాడులో దాదాపు 70శాతం మంది విద్యార్థులు ప్రైవేట్‌ ‌విద్యాసంస్థల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోకి మారారు. తెలంగాణ ప్రభుత్వం కూడా అలాంటి నిర్ణయం తీసుకుంటే లక్షల మంది చిన్నారుల తల్లిదండ్రులకు ఊరట లభించేది. అలాంటి నిర్ణయం తీసుకోకపోగా ప్రైవేట్‌ ‌విద్యాసంస్థలు ముక్కుపిండి మరీ ఫీజులు వసూలు చేసుకొనే అవకాశం కల్పించడంపై తల్లిదండ్రులు భగ్గుమంటున్నారు.

– సుజాత గోపగోని, 6302164068, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram