తిరుపతి లోక్‌సభ స్థానానికి జరిగే ఉపఎన్నికలో భారతీయ జనతా పార్టీ మాజీ ఐఏఎస్‌ అధికారి రత్నప్రభను బరిలో దింపింది. బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఆమె పోటీ చేస్తున్నారు. కర్ణాటక క్యాడర్‌కు చెందిన రత్నప్రభ తన సర్వీస్‌లో వివిధ హోదాల్లో ఎక్కువకాలం ఉమ్మడి ఆంధప్రదేశ్‌ ‌రాష్ట్రంలోనే పనిచేశారు. ప్రకాశం జిల్లాలో పుట్టి పెరిగిన ఆమె 16 అణాల తెలుగింటి ఆడపడుచు. ఆమె మాటల్లోనే చెప్పాలంటే ఆంధప్రదేశ్‌ ఆమె జన్మభూమి. కర్ణాటక ఆమె కర్మభూమి. కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి రిటైర్‌ అయిన తర్వాత బీజేపీలో చేరారు. కర్ణాటక సిల్క్ ‌డెవలప్‌మెంట్‌ ‌కార్పొరేషన్‌ ‌చైర్‌ ‌పర్సన్‌గానూ బాధ్యతలు నిర్వర్తించారు.

నిజానికి, తిరుపతి అభ్యర్థి ఎంపిక విషయంలో ఇతర పార్టీల కంటే బీజేపీ ఎక్కువగానే కసరత్తు చేసింది. అందరికంటే ముందుగా అభ్యర్థిని ప్రకటిం చిన తెలుగుదేశం పార్టీ.. గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన కేంద్ర మాజీ మంత్రి పనబాకలక్ష్మికే మళ్లీ అవకాశం ఇచ్చింది. ఆమె అందరికంటే ముందు నుంచే ప్రచారం మొదలుపెట్టారు. అలాగే, వైసీపీ కూడా ముందుగానే ఖరారైన డాక్టర్‌ ‌గురుమూర్తికే టికెట్‌ ఇచ్చింది. కాంగ్రెస్‌ ‌పార్టీ మాజీ ఎంపీ చింతా మోహన్‌ను బరిలో దించింది. బీజేపీ మాత్రం ముందు నుంచి వినిపించిన మరో మాజీ ఐఏఎస్‌ ‌దాసరి శ్రీనివాసులును కాదని వ్యూహాత్మకంగా రత్నప్రభ పేరును ఖరారు చేసింది.

అయితే ఇల్లు అలకగానే పండగ కాదు. అభ్యర్థులు ఖరారు కావడంతోనే కథ ముగిసిపోదు. అసలు కథ ఇప్పుడే మొదలైంది. అభ్యర్థుల మంచిచెడులు, కుల సమీకరణాలు కొంతవరకు ఓటర్లను ప్రభావితం చేస్తాయి. ఆ కోణంలో చూసినప్పుడు రత్నప్రభకు పరిస్థితి కొంత సానుకూలంగా ఉందనే చెప్పాలి. ఐఏఎస్‌ అధికారిగా ఆమె చేసిన సేవలు, ఆమె వ్యక్తిత్వం, నిజాయితీ కలిసివచ్చే అంశాలు. అలాగే, తిరుపతి ప్రధానంగా ఆధ్యాత్మిక కేంద్రం. పైగా విద్యాకేంద్రం. విద్యావంతులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం కావడం కూడా మహిళా ఐఏఎస్‌గా మంచి పేరున్న రత్నప్రభకు కలిసొచ్చే అంశమే అవుతుంది. అదేవిధంగా కుల సమీకరణాలు కూడా ఆమెకు అనుకూలిస్తాయని అంటున్నారు. తెలుగుదేశం, వైసీపీలు రెండూ మాల సామాజిక వర్గానికి చెందిన వారికి టికెట్‌ ఇస్తే.. బీజేపీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన రత్నప్రభకు టికెట్‌ ఇవ్వడం కూటమికి కలిసొస్తుందని స్థానిక రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

ముఖ్యంగా జనసేనతో పొత్తు, ఆ పార్టీ అధినేత పవన్‌ ‌కల్యాణ్‌ ‌ప్రచారం, సామాజిక సమీకరణాల పరంగా రత్నప్రభకు మరింతగా కలిసొచ్చే అంశాలుగా రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. పవన్‌ ‌కల్యాణ్‌ ఎం‌త విస్తృతంగా ప్రచారం చేస్తే అంతగా ప్రయోజనం ఉంటుందన్న మాట కూడా వినిపిస్తోంది. ముఖ్యంగా తిరుపతి నియోజకవర్గంలో గెలుపు ఓటములను నిర్ధారించే కాపు, బలిజ ఇతర అనుబంధ కులాలు పవన్‌ను తమ వాడిగా భావిస్తారు, ఆదరిస్తారు. ఆ విధంగా పవన్‌ ‌కల్యాణ్‌ ‌ప్రచారం కమల దళానికి కలిసొచ్చే అంశంగా పేర్కొంటున్నారు. అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పార్టీ అధినాయకత్వం పవన్‌ ‌కల్యాణ్‌ను కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా చూస్తోందంటూ చేసిన ప్రకటన ఇంతవరకు బీజేపీ, జనసేన మధ్య చిచ్చుపెట్టేందుకు, విబేధాలు సృష్టించేందుకు రాజకీయ ప్రత్యర్థులు, మీడియా చేసిన ప్రయత్నాలకు చెక్‌ ‌పెట్టిందని పరిశీలకులు భావిస్తున్నారు. అలాగే కూటమి అభ్యర్థి తరఫున పవన్‌ ‌ప్రచారానికే రారంటూ ప్రచారం చేసినవారికి కూడా జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ ‌స్పష్టతనిచ్చారు.

అలాగే, గత ఏడున్నర సంవత్సరాల కాలంలో తెలుగుదేశం, వైసీపీ ప్రభుత్వాలు రాష్ట్ర ప్రయోజ నాలను కాపాడటంలో విఫలమైన వైనాన్ని, కేంద్ర ప్రభుత్వ పథకాలకు తమ పేర్లు తగిలించుకుని చేస్తున్న మోసాలను, అడ్డూ అదుపూ లేకుండా సాగుతున్న ఆర్థిక అరాచక విధానాలను.. అన్నిటినీ మించి వెంకన్నదేవుని ఆస్తులు మింగేసేందుకు గతంలో టీడీపీ, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వాలు చేసిన, చేస్తున్న కుట్రలు, కుతంత్రాలు; ఇరు పార్టీల పాలనలో హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులను ప్రచార అస్త్రాలుగా చేసుకుని సాగే ప్రయత్నం వలన ప్రత్యర్థి పార్టీలకు బీజేపీ గట్టి పోటీ ఇవ్వగలదని పరిశీలకులు భావిస్తున్నారు.

అదలా ఉంటే, తిరుపతి లోక్‌సభ స్థానం ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాలను కొత్త మలుపు తిప్పు తుందా? ప్రాంతీయ పార్టీల ఆధిపత్య రాజకీయాలకు చరమగీతం పాడనుందా? అంటే అవునన్న సమా ధానమే వస్తోంది. ప్రాంతీయ పార్టీల అరాచకాలకు కాలం చెల్లిందని; తెలుగుదేశం, వైసీపీలను గెలిపించినా ప్రయోజనం ఉండదని.. అదే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని గెలిపిస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుందన్న అభిప్రాయం బలపడుతోందని అంటున్నారు విశ్లేషకులు.

మరోవైపు ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అడ్డదారుల్లో సాధించిన విజయంతో విర్రవీగుతున్న వైసీపీ తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో ఇప్పటికే గెలిచేశామన్నట్లు అహంకార పోకడలు పోతోంది. ఆ పార్టీ అభ్యర్ధ్థి నామినేషన్‌ ‌సందర్భంగా మంత్రి అనిల్‌కుమార్‌ ఈ ఉపఎన్నికలో వైసీపీ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి కానుకగా ఇస్తానని అన్నారు. ఆయన ఏ ఉద్దేశంతో ఆ మాట అన్నారో కానీ సోషల్‌ ‌మీడియాలో మరోలా ప్రచారం జరుగుతోంది.

తెలుగుదేశం పార్టీ ముందు నుంచి ప్రచారం చేస్తున్నా పెద్దగా ప్రభావం చూపలేకపోతోంది. గత ఎన్నికల్లో టీడీపీ రెండవ స్థానంలో నిలిచింది. అయితే ఈసారి ప్రధాన పోటీ వైసీపీ, బీజేపీల మధ్యనే ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. అంతే కాకుండా వైసీపీ అహంకారాన్ని, ముఖ్యంగా జగన్మో హన్‌రెడ్డి ప్రభుత్వం హిందువుల పట్ల చూపుతున్న వివక్షకు బీజేపీ అయితేనే గట్టిగా సమాధానం ఇవ్వగలదని ప్రజలు భావిస్తున్నారు. ప్రజలు, విద్యా వంతులు కూడా బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని తాజా సర్వేలలో స్పష్టమైంది. అన్నిటినీ మించి ప్రాంతీయ పార్టీల మీద పెట్టుకున్న భ్రమలు తొలగిపోయాయి. ఈ నేపథ్యంలో తిరుపతి ఉపఎన్నిక మరింత ఆసక్తికరంగా మారింది. అయితే, ప్రచారం ఇంకా పూర్తిస్థాయిలో ఊపందుకోలేదు. ఎన్నికల ప్రచారం ఊపందుకుంటేనే గాలి ఎటు వీస్తోందనేది స్పష్టం కాదు.

మరోవైపు.. జగన్మోహన్‌రెడ్డి సుప్రీంకోర్టు న్యాయ మూర్తి, జస్టిస్‌ ఎన్వీ రమణపై చేసిన ఫిర్యాదును సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేయడం, అదేరోజున జస్టిస్‌ ఎన్వీ రమణను కాబోయే ప్రధాన న్యాయమూర్తిగా ప్రకటించడం అధికార పార్టీని కలవరానికి గురి చేస్తోందని అంతర్గత వర్గాల సమాచారం. నిజానికి జగన్మోహన్‌రెడ్డి ఫిర్యాదుపై అంతర్గత నిబంధనల ప్రకారం సమూలంగా పరీక్షించిన న్యాయస్థానం ఆ ఫిర్యాదును కొట్టివేయడంతో పాటుగా ఇందుకు సంబంధించి విడుదల చేసిన ప్రకటనలో జగన్‌ ‌తమ ఫిర్యాదులో జస్టిస్‌ ఎన్వీ రమణ ఇతర న్యాయ మూర్తులపై చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధార మైనవని, అసత్యమైనవని న్యాయస్థానం చాలా తీవ్రంగా ముఖ్యమంత్రి దురుద్దేశాలను ఎండగట్టింది. అంతేకాదు, జగన్‌ ‌న్యాయ వ్యవస్థను బెదిరించేందుకు ఉద్దేశపూర్వకంగా నిరాధారమైన ఆరోపణలు చేశారని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. ఈ వ్యవహారం ప్రస్తుతానికి సమసి పోయినట్లు కనిపించినా రేపు ఎలాంటి మలుపు తీసు కుంటుందనేది ఊహించడం కష్టంకాదు.

అదలా ఉంటే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రోజురోజుకి అద్వాన్న స్థితి నుంచి పరమ అద్వాన్న స్థితికి చేరుకుంటోంది. రోజుకు రూ.500 కోట్ల మేర అప్పు పద్దు పెరుగుతోంది. విభజన వాటాగా వచ్చిన అప్పు; గత చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పుకు తోడు జగన్మోహన్‌రెడ్డి కేవలం ఇరవై నెలల పాలన లోనే చేసిన అప్పు రూ.1.70 లక్షల కోట్లు. ఇదిగాక మరో రూ.70వేల కోట్లు పెండింగ్‌ ‌బిల్లులున్నాయి. ఈ లెక్కన రాష్ట్రంలోని ప్రతి కుటుంబం రెండున్నర లక్షల రూపాయల అప్పు భారం మోస్తున్న. ఈ నేపథ్యంలోనే సంక్షేమానికి కోతలు విధించక తప్పని పరిస్థితి నెలకొంది. అందుకే పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రభుత్వం వాయిదా వేసిందని అధికార వర్గాల సమాచారం. తిరుపతి ఉపఎన్నిక ముగిసిన తర్వాత ఇంటికి ఒకే సంక్షేమ పథకం ప్రాతిపదికన బడ్జెట్‌ ‌ప్రవేశపెడతారని అంటున్నారు. అయితే బద్వేల్‌ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మృతితో మరో ఉపఎన్నిక వచ్చి పడింది. మరి ఇప్పుడు ఏం చేస్తారో చూడవలసి ఉంది.

– రాజనాల బాలకృష్ణ, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram