పాక్‌ ‌వైఖరి మారిందా? ఇమ్రాన్‌ ‌భారత్‌తో నిజంగా శాంతి, సామరస్యాలను కోరుకుంటున్నారా? పాకిస్తాన్‌ ‌కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉండాలనే నిర్ణయం వెనుక ఎవరున్నారు? పాక్‌ ‌విషయంలో భారత్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది? పాకిస్తాన్‌ ‌మళ్లీ తన బుద్ధి చూపిస్తే భారత్‌ ఎలా స్పందిస్తుంది? గత కొన్నిరోజులుగా జరుగుతున్న పరిణామాలు పైప్రశ్నలకు బలం చేకూరుస్తున్నాయి. 

భారత ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల పాక్‌ ‌ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు రాసిన ఓ లేఖ ఉపఖండంతో పాటు ప్రపంచం దృష్టిని విశేషంగా ఆకర్షించింది. పాకిస్తాన్‌ ‌జాతీయ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఇమ్రాన్‌కు మోదీ లేఖరాశారు. అంతకు రెండురోజుల ముందు కరోనా బారినపడ్డ ఇమ్రాన్‌ ‌త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్‌ ‌చేసిన మోదీ.. తన తాజా లేఖలో మరోసారి కరోనా, స్నేహబంధం అంశాలతో పాటు కొన్ని చురకలు కూడా తగిలించారు. పాకిస్తాన్‌తో భారత్‌ ‌స్నేహాన్ని కోరుకుంటుందంటూనే కొన్ని షరతులు పెట్టారు. బీభత్సం, శత్రుత్వంలేని విశ్వసనీయ వాతావరణంలో మాత్రమే రెండు దేశాల మధ్య బంధం విలసిల్లుతుందని పేర్కొన్నారు.

అంతకు కొద్దిరోజుల క్రితం ఇమ్రాన్‌ శ్రీ‌లంక పర్యటన సందర్భంగా చేసిన ప్రకటన భారత ప్రజలదృష్టిని ఆకర్షించింది. భారత్‌-‌పాక్‌ల మధ్య ఉన్న సమస్య కేవలం కశ్మీరేనని, భారత్‌తో తమకున్న వివాదాలు దానిపైనేనని ఇమ్రాన్‌ అన్నారు. ఆ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని చెప్పారు. ‘నేను 2018లో పాక్‌ ‌ప్రధాని అయిన వెంటనే భారత ప్రధాని మోదీతో ఉపఖండంలో వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ప్రతిపాదించాను. కానీ ఆ విషయంలో నేను విఫలమయ్యాను. ఎప్పటికైనా చర్చల ద్వారా సమస్య పరిష్కారమవుతుందని ఆశాభావంతో ఉన్నాను. వాణిజ్య, వర్తక సంబంధాలను మెరుగుపరచడం ద్వారానే ఉపఖండంలో పేదరికాన్ని రూపుమాపగలం..’ అన్నారు. అంతేకాదు, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానాలకు అనుగుణంగా కశ్మీర్‌ ‌వివాదం పరిష్కరించాలని పాక్‌ ‌కోరుకుంటోందని.. భారత్‌తో తాము శాంతి కోరుకుంటున్నామని తెలిపారు. ప్రాంతీయ వివాదాలను సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలన్నది తమ అభిమతమని కూడా అన్నారు. ఇమ్రాన్‌ ‌వ్యాఖ్యలపై భారత విదేశాంగశాఖ స్పందించింది. ‘చర్చలపై భారత్‌ది కూడా ఒకేఒక్క మాట. పాక్‌తో మంచి సంబంధాలనే మేమూ కోరుకుంటాం. కానీ, ఉగ్రవాద నిర్మూలన, యుద్ధ వాతావరణం, హింస లేకుండా చూసినప్పుడే అది సాధ్యమవుతుంద’ని తెలిపింది. సరిహద్దుల్లో కాల్పుల విరమణ పాటిస్తూ ఉగ్రవాద వ్యతిరేక పోరాటాన్ని చిత్తశుద్ధితో చేపడితేనే పాకిస్తాన్‌తో చర్చలకు అవకాశం ఉంటుందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్‌ శ్రీ‌వాస్తవ చెప్పారు.

మరోవైపు పాక్‌ ‌ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ‌విమానం భారత గగనలతం మీదుగా కొలంబో వెళ్లేందుకు మన అధికారులు అనుమతి ఇచ్చారు. అయితే గతంలో భారత ప్రధాని మోదీ విమానం పాక్‌ ‌గగనతలం మీదుగా సౌదీ వెళ్లేందుకు ఆ దేశ అధికారులు అనుమతివ్వని విషయం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయినా పాత విషయాలను మనసులో పెట్టుకోకుండా భారత్‌ ఉదారంగా వ్యవహరించింది. ఇంతకీ భారత్‌, ‌పాకిస్తాన్‌ ‌దేశాల మధ్య ఏం జరుగుతోంది? ఒక్కసారిగా వాతావరణం ఎందుకు మారిపోయింది. ఈ రెండు ఘటనలు మాత్రమే కాదు, ఇటీవలి కాలంలో ఇరు దేశాల మధ్య సంబంధాల్లో చాలా వరకు పురోగతి కనిపిస్తోంది. అయితే ఈ మార్పులన్నీ ఒక్కరోజులో వచ్చినవి మాత్రం కాదు. తెర వెనుక చాలా తతంగమే నడిచిందని చెప్పాలి.

కాల్పుల విరమణ ఒప్పందం

గత కొద్ది సంవత్సరాలుగా భారత్‌-‌పాకిస్తాన్‌ ‌దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త వాతావరణంలో ఒక్కసారిగా మార్పు కనిపిస్తోంది. ఉప్పూ నిప్పుగా ఉన్న ఇరు దేశాలు శాంతి బాటపట్టాయి. ఈ దిశగా కీలక ముందడుగు పడింది. సుదీర్ఘ విరామం తర్వాత చర్చల పక్రియ మొదలైంది. నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) గుండా కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాటించడం సహా ఇతర అంశాల్లో పాత ఒప్పందా లన్నీ కఠినంగా అమలు చేయాలని ఇరు దేశాల డైరెక్టర్‌ ‌జనరల్స్ ఆఫ్‌ ‌మిలటరీ ఆపరేషన్స్ (‌డీజీఎం వోలు) మధ్య హాట్‌లైన్‌ ‌ద్వారా జరిగిన చర్చల్లో నిర్ణయం తీసుకున్నారు. పూర్తి స్నేహపూర్వక, సహృద్భావ వాతావరణంలో జరిగిన ఈ చర్చల్లో ఇరుదేశాల మధ్య మునుపటి అన్ని ఒప్పందాలను సమీక్షించారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఫిబ్రవరి 24 రాత్రి నుంచే కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ‘గతానికి పాతరేసి భవిష్యత్తుకు బాటలు వేసుకుందాం’ అని పాకిస్తాన్‌ ‌సైనికాధిపతి ఖమర్‌ ‌జావేద్‌ ‌బజ్వా చేసిన ప్రకటనకు ప్రాధాన్యం ఏర్పడింది.

తూట్లు పొడిచిన చరిత్ర పాక్‌దే..

భారత్‌-‌పాకిస్తాన్‌ ‌దేశాల మధ్య నిరంతరం కాల్పులు కొనసాగడం వార్తలలో చూస్తూనే ఉన్నాం. నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంట శాంతియుత వాతావరణం ఏర్పడాలనే ఇరుదేశాలు నిర్ణయిం చాయి. ఈ మేరకు 2003లో భారత్‌-‌పాకిస్తాన్‌ ‌మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. కానీ పాక్‌ ‌సైన్యం ఏనాడూ దీన్ని సక్రమంగా పాటించలేదు. కొన్నేళ్లుగా పలుమార్లు ఉల్లంఘనలు కొనసాగాయి. ఫలితంగా సరిహద్దు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారు. ఉగ్రవాదులను సరిహద్దు దాటించి భారత్‌లోకి పంపే లక్ష్యంలో భాగంగానే పాక్‌ ‌సైన్యం ఈ విధంగా వ్యవహరించేది. దీన్ని భారత సైన్యం కూడా దీటుగా తిప్పికొట్టేది. 2016లో ఉరి సెక్టార్‌పై ఉగ్రవాదుల దాడి తర్వాత కాల్పులు విరమణ ఒప్పందం ఉల్లంఘనలు కొనసాగుతున్నాయి.  గత మూడేళ్లలో పాకిస్తాన్‌ 10,752 ‌సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు ఇటీవల లోక్‌సభలో హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి వెల్లడించారు. పాక్‌ ‌కాల్పుల కారణంగా 70 మంది భద్రతా సిబ్బంది, మరో 70 మంది పౌరులు మృతి చెందినట్లు ఆయన పేర్కొన్నారు. తాజా ఒప్పందానికి అయినా పాకిస్తాన్‌ ‌కట్టుబడి ఉండాలి.

నియంత్రణ రేఖ గుండా కాల్పుల విరమణ ఒప్పందాన్ని కఠినంగా అమలు చేసేందుకు భారత్‌-‌పాకిస్తాన్‌ ‌నిర్ణయించడాన్ని జమ్ముకశ్మీర్‌ ‌నేషనల్‌ ‌కాన్ఫెరెన్స్,  ‌పీపుల్స్ ‌డెమోక్రటిక్‌ ‌పార్టీలతో పాటు వేర్పాటువాద సంస్థ హురియత్‌ ‌కాన్ఫరెన్స్ ‌స్వాగ తించాయి. ఈ ప్రకటన ఆచరణలో పక్కాగా అమలు కాగలదన్న విశ్వాసాన్ని జేకేఎన్‌సీ వ్యక్తం చేసింది. ఇరు దేశాల మధ్య జరిగిన ఈ నిర్ణయంతో సరిహద్దు గ్రామాల్లోని ప్రజలకు ఇబ్బందులు తొలగుతాయని, వారు కూడా అందరిలాగా సాధారణ జీవనానికి అలవాటు పడగలరని పీడీపీ తెలిపింది.

చక్రం తిప్పిన దోవల్‌ 

‌తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్లుగా మొండి పట్టుదలతో ఉన్న పాకిస్తాన్‌ ఎలా దారికి వచ్చింది? అందరి మదిలోనూ ఇదే ఆసక్తి నెలకొంది. దీని వెనక కీలకపాత్ర పోషించినది భారత భద్రతా సలహాదారు అజిత్‌దోవల్‌.. ఇరు దేశాల డీజీఎంవోలు సంయుక్త ప్రకటన విడుదల చేయడం వెనక దోవల్‌ అన్నీ తానై వ్యవహరించినట్లు చెబుతున్నారు. ఈ మేరకు కొన్ని నెలల ముందే ఆయన పాక్‌ ‌జాతీయ భద్రతా సలహాదారు ముయీద్‌ ‌యూసుఫ్‌తో చర్చలు జరిపారు. క్రమం తప్పకుండా చర్చలు జరుపుతూ నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ అంశాన్ని ముందుకు తీసుకెళ్లారు. తన చర్చల పురోగతిని ప్రధాని నరేంద్రమోదీ, రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, ‌హోం మంత్రి అమిత్‌ ‌షాలతో ఎప్పటికప్పుడు పంచు కుంటూ, వారి సూచనలు పాటిస్తూ తన వ్యూహ చతురతకు మరింత పదునుపెట్టారు.

అజిత్‌ ‌దోవల్‌ ‌భద్రతా సలహాదారు పదవి చేపట్టినప్పటి నుంచి అనేక అంతర్జాతీయ అంశాల్లో భారత్‌ను ఓ మెట్టు పైనే నిలుపుతూ వచ్చారు. సుదీర్ఘకాలంగా హింసనే నమ్ముకున్న పాక్‌ అధినాయకత్వం వైఖరిలో మార్పు రావడానికి ప్రయత్నాలు చేశారు. హింసతో ఏమీ సాధించలేమని నమ్మేలా చేశారు. భారత్‌ ‌మాత్రమే కాదు, పాక్‌ ‌కూడా ఉగ్రవాద బాధిత దేశమేనని ఇమ్రాన్‌ఖాన్‌ ‌బృందానికి అర్థమయ్యేలా తనదైన శైలిలో వివరిం చారు. మొత్తమ్మీద పాక్‌ను కీలక ఒప్పందం దిశగా నడిపించారు. అయితే పాకిస్తాన్‌ను అంత తేలికగా నమ్మలేం అనే విషయంలో భారత నాయకత్వానికి ఎలాంటి అనుమానాలూ లేవు.

యూఏఈ ప్రయత్నాలు

చాలా కాలంగా భారత్‌-‌పాక్‌ ‌దేశాల మధ్య బద్ధశత్రుత్వం కొనసాగుతోంది. కానీ హఠాత్తుగా శాంతియుత వాతావరణానికి కారణం ఏమిటి? ‘బ్లూమ్స్ ‌బర్గ్’ ‌వార్తా సంస్థ కథనం ప్రకారం భారత్‌, ‌పాకిస్తాన్‌ ‌మధ్య శాంతి ప్రణాళిక కోసం యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్(‌యూఏఈ) ప్రత్యేక చొరవ తీసుకుంది. ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉండాలని నిర్ణయం తీసుకున్న 24 గంటల్లోనే (ఫిబ్రవరి 26న) యూఏఈ విదేశాంగ మంత్రి షేక్‌ అబ్దుల్లా బిన్‌ ‌జయేద్‌ ‌ఢిల్లీకి వచ్చి మన విదేశాంగమంత్రి జైశకంర్‌తో భేటీ అయ్యారు. ఇండియా, పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తతలను తగ్గించ డానికి సౌదీ అరేబియా ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆ దేశ ఉప విదేశాంగ మంత్రి ఆదిల్‌ అల్‌ ‌జుబైర్‌ ‌మాటల ద్వారా తెలుస్తోంది. ఇటీవల అరబ్‌ ‌న్యూస్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని ఆయన  చెప్పారు.

యూఏఈ, సౌదీ అరేబియాలు గతంలో పాకిస్తాన్‌తో ఎక్కువ సాన్నిహిత్యంగా ఉండేవి. అయితే ఈ దేశాలకు పాక్‌ ‌కన్నా భారత్‌తో వాణిజ్య అవసరాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ కారణంగానే అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్‌ ‌పదే పదే కశ్మీర్‌ అం‌శాన్ని లేవనెత్తడాన్ని ఈ దేశాలు అడ్డుకున్నాయి. దీంతో పాకిస్తాన్‌ ‌మలేషియా, టర్కీలతో మరో ఇస్లామిక్‌ ‌దేశాల వేదిక ఏర్పాటు చేయాలనే ప్రయత్నం చేసి భంగపడింది. ఇందుకు ఆగ్రహించిన సౌదీ అరేబియా గతంలో తీసుకున్న రుణాలు వెంటనే చెల్లించాలని ఆదేశించడంతో దిక్కు తోచని పాక్‌.. ‌చైనా దగ్గర రుణం తీసుకొని చెల్లించక తప్పలేదు.

భారత్‌-‌పాక్‌ ‌దేశాల మధ్య శాంతియుత వాతావరణం ఏర్పడేందుకు యూఏఈతో పాటుగా అమెరికా కూడా ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. ట్రంప్‌ ‌హయంలో అంతర్జాతీయంగా దెబ్బతిన్న అమెరికా ప్రతిష్టను పునరుద్ధరించేందుకు కొత్త అధ్యక్షుడు జో బైడెన్‌ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం భారత్‌, ‌పాక్‌లను కూడా కలుపుకు పోవాలని భావిస్తున్నారు. అమెరికా రక్షణమంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ ఇటీవల భారత్‌ ‌వచ్చి వెళ్లడం వెనుక ఉన్న ఉద్దేశం కూడా ఇదే. మొత్తానికి తెర వెనుక పెద్ద మంత్రాంగమే కొనసాగుతోంది.

సింధూ  జలాల చర్చల్లో పురోగతి

వాస్తవాధీన రేఖ వద్ద కాల్పుల విరమణను పాటించాలని రెండు దేశాలు ఓ నిర్ణయానికి వచ్చిన తర్వాత సింధూ నదీ జలాల పంపిణీపై చర్చలు జరగడం విశేషం. ఇటీవలే ఢిల్లీలో ఇరు దేశాల అధికారుల మధ్య సామరస్య వాతావరణంలో చర్చలు జరిగాయి. సింధూ నదీ జలాల పంపిణీ విషయంలో జమ్ముకశ్మీర్‌, ‌హర్యానా, పంజాబ్‌ ‌రైతుల ప్రయోజనాల రక్షణ కోసం భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ దిశగా సింధూ ఉపనదులు చీనాబ్‌, ‌జీలంల మీద భారత్‌ ‌నిర్మిస్తున్న ప్రాజెక్టుల విషయంలో పాకిస్తాన్‌కు అభ్యంతరాలున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌తో సామరస్యంగా ఉంటేనే ఆ దేశానికి ప్రయోజనకరం అనే సందేశం వెళ్లింది.

ఇమ్రాన్‌కు సైన్యం ముప్పు?

ఇమ్రాన్‌ఖాన్‌కు ఆ దేశ సైన్యంతో మొదటి నుంచి మంచి సంబంధాలు ఉన్నాయి. ఒకవిధంగా చెప్పాలంటే ఆయన ప్రధాని పదవి చేపట్టడం వెనక సైన్యం నుంచి సంపూర్ణ సహకారం ఉంది. అయితే ఇటీవలి కాలంలో పాకిస్తాన్‌లో దిగజారుతున్న ఆర్థిక వ్యవస్థ, కొత్త సవాళ్లు విసురుతున్న ఉగ్రవాదులు ఆయనకు కంటి నిండా నిద్ర కరవు చేశాయి. ఇప్పటికే ఇమ్రాన్‌కు బలహీన ప్రధాని అనే పేరొచ్చింది. సైన్యం ఎక్కడ తన ప్రభుత్వాన్ని కూల్చి స్వాధీనం చేసు కుంటుందోనని దిగులుతో ఉన్నారు. ఇలాంటి పరిణామాలు పాకిస్తాన్‌కు కొత్తేమీ కాదని గత చరిత్ర  చెబుతోంది.

ఇమ్రాన్‌ ‌ప్రస్తుత సైన్యాధిపతి జనరల్‌ ‌కమర్‌ ‌బజ్వాతో సఖ్యతగా ఉన్నా సైన్యం కోరుకున్నట్లుగా పాలన లేకపోవడంతో ఆయనపై ఒత్తిడి పెరుగు తోంది. కరోనా కారణంగా దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థను దారిలో పెట్టడం ఆయన ముందున్న మొదటి కర్తవ్యం. లేకపోతే ప్రజల్లో పెరిగిపోతున్న అసంతృప్తిని అడ్డంపెట్టుకొని జనరల్‌ ‌బజ్వా తన ప్రభుత్వాన్ని కూలుస్తారని ఇమ్రాన్‌ ‌భయపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తీవ్రవాదం కంటే ఆర్థిక వ్యవస్థపైనే ఎక్కువగా దృష్టి పెట్టడం ఆయనకు అనివార్యం. అందుకే కశ్మీర్‌, ఆర్టికల్‌ 370 అం‌శాలపై వెనక్కి తగ్గి భారత్‌తో సత్సంబంధాలు మెరుగుపరచు కోవాలని, దీని ద్వారా అంతర్జాతీయంగా ప్రతిష్టను కాపాడుకొని పాకిస్తాన్‌ను అర్థిక కష్టాల నుంచి బయట పడేయొచ్చని ఇమ్రాన్‌ ‌భావిస్తున్నారని అంటున్నారు. ఇందులో భాగంగా కశ్మీర్‌ ‌వేర్పాటువాద నాయకుల విషయంలో, కొన్ని ఉగ్రవాద సంస్థల నాయకుల విషయంలో కఠినంగా వ్యవహరించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో పాకిస్తాన్‌ ‌పౌర నాయకత్వం భారత్‌తో సామరస్యం కోసం తీసుకున్న నిర్ణయాలను ఆ దేశ సైన్యం వ్యతిరేకించిన సందర్భాలున్నాయి. ఇప్పుడు సైన్యం కూడా ఇరు దేశాల మధ్య శాంతిని కోరుకుంటోందనే ప్రచారం జరుగుతోంది.

పాక్‌ను నమ్మొచ్చా?

కుక్క తోక వంకరను సరి చేయలేం. పాకిస్తాన్‌ ‌నైజాన్ని కూడా మార్చలేం. భారతదేశంతో గతంలో కుదుర్చుకున్న శాంతి ఒప్పందాలకు తూట్లు పొడిచిన చరిత్ర ఆ దేశానికి ఉంది. సిమ్లా, తాష్కెంట్‌, ‌లాహోర్‌ ఒప్పందాలు ఏమయ్యాయో అందరికీ తెలిసిందే. వాజపేయి బస్సుయాత్ర ద్వారా ఇరు దేశాల మధ్య సామరస్య వాతావరణం ఏర్పడేందుకు ప్రయత్నించిన కొద్దిరోజుల్లోనే కార్గిల్‌ ‌పర్వతాలను ఆక్రమించిన ఘనత పాక్‌ది.

తాను తీసుకున్న గోతిలో తానే పడ్డట్లు అంతర్జాతీయంగా పాకిస్తాన్‌ ఇప్పుడు ఏకాకిగా మారింది. దివాలా అంచుకు చేరింది. ప్రతిష్ట దిగజారడంతో అప్పులు కూడా పుట్టడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్‌లో నిజంగా మార్పు వస్తే ఆహ్వానించవచ్చు. కానీ తన పాత బుద్ధినే బయట పెట్టుకుంటే మూల్యం చెల్లించక తప్పదు. ఈ విషయంలో మోదీ ప్రభుత్వం అప్రమత్తంగానే ఉంటుందని ఆశించవచ్చు.

– క్రాంతిదేవ్‌ ‌మిత్ర, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram