గతంలో పట్టభద్రుల (గ్రాడ్యుయేట్‌) ఎమ్మెల్సీ ఎన్నికలకు రాజకీయ పార్టీలు పెద్దగా ప్రాధాన్యం ఇచ్చేవి కావు. కారణాలేవైనా సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీ ఖాతాలోనే ఈ విజయాలు నమోదు అయ్యేవి. పైగా ఈ ఎన్నికలకు మీడియాలో కూడా పెద్దగా ప్రచారం దక్కేది కాదు. దీంతో ఎన్నికలు ఎప్పుడు వచ్చాయో, ఎప్పుడు పూర్తయ్యాయో అన్నట్లుగా ఉండేది పరిస్థితి. అయితే ఇందుకు భిన్నంగా ఇటీవల తెలంగాణలో జరిగిన రెండు ఎమ్మెల్సీ (హైదరాబాద్‌, ‌రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌; ‌ఖమ్మం, వరంగల్‌, ‌నల్గొండ) ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా కూడా అందరి దృష్టిని ఆకర్షించాయి. పోటాపోటీ మాటల యుద్ధం, సవాళ్లు, ప్రతిసవాళ్లు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయ పార్టీల ప్రచారం వాడీవేడీగా సాగింది. ఈ ఎన్నికల్లో కచ్చితంగా గెలిచి తీరాలన్న కసి అన్ని ప్రధాన పార్టీల్లో  కనిపించింది. ఇందుకు కారణాలు చాలానే ఉన్నాయి.

దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్‌ఎం‌సీ ఎన్నికల్లో చావుతప్పి కన్ను లొట్టపోయిన చందంగా మారిన అధికార టీఆర్‌ఎస్‌ ‌పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మరోవైపు రాష్ట్రంలో తామే ప్రత్యామ్నాయం అంటూ టీఆర్‌ఎస్‌కు ముచ్చెటమలు పట్టిస్తూ.. ప్రభుత్వ విధానాలను సూటిగా ప్రశ్నిస్తూ  జోరుమీదున్న భారతీయ జనతా పార్టీ కూడా దుబ్బాక, జీహెచ్‌ఎం‌సీ ఎన్నికల్లో కనబర్చిన ఉత్సాహన్నే ఈ ఎన్నికల్లోనూ చూపించింది. ఇక కాంగ్రెస్‌, ‌టీడీపీ, కమ్యూనిస్టులు రాష్ట్రంలో తమ ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నించాయి.

అయితే.. అనూహ్యంగా రెండు స్థానాల్లోనూ అధికార టీఆర్‌ఎస్‌ ‌విజయం సాధించింది. కానీ విజయం వరించిన గులాబీ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం మాత్రం కంగారు పెట్టిస్తోంది. పైకి విజయాన్ని ఆస్వాదిస్తున్నా లోలోపల మాత్రం ఆలోచనలో పడ్డారు గులాబీ నేతలు. బీజేపీని నేరుగా ఎదుర్కోలేకనే మాజీ ప్రధాని పీవీ నరసింహరావు ఫొటోతో టీఆర్‌ఎస్‌ ఈ ఎన్నికల్లో గెలుపొందిందని, ఇది కేసీఆర్‌ ‌విజయమా? పీవీ విజయమా? చెప్పాలంటూ బీజేపీ చేసిన విమర్శలకు టీఆర్‌ఎస్‌ ‌నాయకుల ‘మౌనం’ మరింత బలం చేకూరుస్తోంది.

ఈ ఓటమి వల్ల బీజేపీకి పెద్దగా నష్టం జరగలేదని ఆ పార్టీ నాయకులు చెబుతున్నా సిట్టింగ్‌ ‌స్థానం కోల్పోవటానికి గల కారణాలపై లోతుగా విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందని రాజకీయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ ఎన్నికల ద్వారా అధికార టీఆర్‌ఎస్‌ ‌కొత్త ప్రత్యర్థులను కూడా తెచ్చిపెట్టుకుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కేసీఆర్‌ ‌ప్రభుత్వంపై సానుకూలత ఉన్న సమయంలోనే గెలిచిన రామ్‌చందర్‌రావు.. తాజా ఎన్నికల్లో ఓడిపోవడం ఆ పార్టీ వర్గాలను ఆలోచింపచేస్తోంది.

టీఆర్‌ఎస్‌ ‌గెలుపుకు కారణమదేనా?

ఈ ఎన్నికల్లో ఓట్లు తక్కువగా వచ్చినా పలు అంశాలు కలిసొచ్చి టీఆర్‌ఎస్‌ ‌విజయం సాధించిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. పోలింగ్‌కి ముందు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌హామి ఇచ్చారంటూ ఫిట్‌మెంట్‌పై ఉద్యోగసంఘాల లీడర్లు ఇచ్చిన లీకులు, ఎక్కువ మంది పోటీచేయడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవడం వంటివి టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా మారాయని చెబుతున్నారు. ఖమ్మం, నల్గొండ, వరంగల్‌ ‌స్థానం నుంచి అనేక మంది పోటీకి దిగడం టీఆర్‌ఎస్‌కు కలిసొచ్చింది. కోదండరాం, తీన్మార్‌ ‌మల్లన్న, చెరుకు సుధాకర్‌, ‌విజయసారధిరెడ్డి, రాణీ రుద్రమదేవి వంటివారు బరిలోకి దిగడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయిందని చెబుతున్నారు. హైదరాబాద్‌, ‌రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ ‌నియోజకవర్గంలో పీవీ నరసింహరావు ఫొటోని చూసి ఓటేస్తే.. ఖమ్మం, నల్గొండ, వరంగల్‌లో పల్లా రాజేశ్వర్‌రెడ్డి సొంత కాలేజీల స్టాఫ్‌తో చేసిన ఓట్ల నమోదు ఆయన గెలుపుకు సహకరించాయని విశ్లేషకులు చెబుతున్నారు.

స్వంతంత్ర అభ్యర్థి తీన్మార్‌ ‌మల్లన్నకు గెలుపు స్థాయిలో ఓట్లు పడ్డాయంటే.. ప్రభుత్వంపై ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదే సమయంలో పట్టభద్రులు, ఉద్యోగ వర్గాల్లో ఎంతో ఆదరణ ఉన్న కోదండరాం కూడా ఇదే స్థానం నుంచి పోటీ చేయడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఎక్కువగా వారి మధ్యే చీలిపోయాయి. ఇక హైదరాబాద్‌ ‌స్థానంలోనూ అంతే. బీజేపీతో పాటు స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్‌ ‌నాగేశ్వర్‌ ‌మధ్య ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోవడాన్ని గమనించవచ్చు.

టీజేఎస్‌ ‌భవిష్యత్తు ప్రశ్నార్థకం?

ఎమ్మెల్సీ ఎన్నికలు తెలంగాణ జనసమితి అధినేత ప్రొఫెసర్‌ ‌కోదండరాం రాజకీయ భవిష్యత్‌ను ప్రశ్నార్థకం చేశాయనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. పార్టీ ఆవిర్భాం తర్వాత చెప్పుకోదగ్గ ఒక్క విజయమూ ఇప్పటివరకు సాధించకపోవటం, స్వయంగా కోదండరాం పోటీ చేసినప్పటికీ ఓడిపోవటంతో ఆయన ఇకపై రాజకీయాల్లో కొనసాగుతారా? లేదా? ఒకవేళ కొనసాగితే కోదండరాంతోపాటు, ఆయన పార్టీ అడుగులు ఎటు వైపు? అనే చర్చ కూడా నడుస్తోంది.

కాంగ్రెస్‌ ‌కథ ముగిసినట్టేనా?

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌పార్టీ కథ ముగిసిందా? ప్రజల్లో ఆ పార్టీ పట్ల విశ్వాసం సన్నగిల్లుతున్నదా? అంటే తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు అవుననే సమాధానమే ఇస్తున్నాయి. తెలంగాణ ఏర్పడిన తరువాత వరుసగా ఎదురవుతున్న ఘోర ఓటములతో ఇప్పటికే పతనావస్థకు చేరిన పార్టీని.. తాజా ఎమ్మెల్సీ ఎన్నికలు పాతాళంలోకి నెట్టివేశాయి. ఈ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపకుండా పూర్తిగా చతికిలపడిపోయింది. హైదరాబాద్‌-‌రంగారెడ్డి-మహబూబ్‌గర్‌ ‌నియోజకవర్గంలో నాలుగో స్థానంలో; నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ ‌స్థానంలో ఐదో స్థానంలో నిలిచి కాంగ్రెస్‌ ‌పార్టీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ప్రధాన పార్టీలను పక్కన పెడితే కనీసం స్వతంత్ర అభ్యర్థులకు కూడా హస్తం పార్టీ గట్టి పోటీ ఇవ్వలేకపోయింది.

ప్రశ్నించే గొంతుకు ప్రజా మద్దతు

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖమ్మం, నల్గొండ, వరంగల్‌ ‌స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన తీన్మార్‌ ‌మల్లన్న చరిత్ర సృష్టించారు. అధికార పక్షం అరాచకాలపై గొంతెత్తిన మల్లన్నకు ఓట్లతో ప్రజలు మద్దతు తెలిపారు. తీన్మార్‌ ‌మల్లన్న వంటి ప్రశ్నించే గొంతులు రాజకీయాల్లో అద్భుతాలు చేయగలరన్న నమ్మకాన్ని ఈ ఫలితాలు స్పష్టంచేశాయి. మల్లన్నకు లక్షకు పైగా ఓట్లతో ఓటర్లు బ్రహ్మరథం పట్టారు.

నాలుగు రోజుల పాటు సాగిన ఓట్ల లెక్కింపులో అధికార పార్టీకి దీటుగా ఓట్లు సాధించారాయన. ఒకానొక దశలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై గెలుపు ఖాయమన్నట్టుగా కనిపించారు. 12 వేల ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా వ్యవహరించిన ప్రొఫెసర్‌ ‌కోదండరాంను మించి మల్లన్న ఓట్లు సాధించడం విశేషం. సోషల్‌ ‌మీడియాలో అధికార టీఆర్‌ఎస్‌ అరాచకాలను, కేసీఆర్‌ ‌కుటుంబ రాజకీయాలను ప్రశ్నిస్తూ మల్లన్న బాగా పాపులర్‌ అయ్యారు.

వృత్తిపరంగా జర్నలిస్ట్ అయిన చింతపండు నవీన్‌కుమార్‌ ఒక ప్రముఖ తెలుగు టీవీ చానల్‌ ‌నిర్వహించిన ‘తీన్మార్‌’ ‌పోగ్రాంలోని తన పాత్ర పేరునే తన పేరుగా మార్చుకున్నారు. 2015లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌పార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. ఇటీవల జరిగిన హుజూర్‌నగర్‌ ఉపఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా ఓటమి తప్పలేదు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఉమ్మడి వరంగల్‌, ‌నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో పాదయాత్ర నిర్వహించారు. ఓటర్లను నేరుగా కలిసి వారి సమస్యలు తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, ఉద్యోగ, యువజన వ్యతిరేక విధానాలపై పదునైన విమర్శలు గుప్పించారు. తన యూట్యూబ్‌ ‌చానల్‌ ‌ద్వారా రోజూ దినపత్రికల్లో వచ్చిన వార్తల విశ్లేషణలతోపాటు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్లోని లోగుట్టును ప్రజలకు చెప్పి ఎక్కువ మందికి చేరువయ్యారు. ఈ ఎన్నికల్లో మల్లన్న ఓడిపోయినా ప్రజాభిమానం సొంతం చేసుకోగలిగారు.

– కోరుట్ల హరీష్‌

By editor

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
Instagram