కర్షకుడికి ఆదాయం.. కమతానికి ఆరోగ్యం

సమస్యను పరిష్కరించడం అంటే మరొక సమస్యకు చోటివ్వడం కాకూడదు. పాత సమస్య స్థానంలో అంతకంటే భీతావహమైన కొత్త సమస్యను ప్రతిష్టించడం నిజమైన మార్పు అనిపించుకోదు. కానీ స్వతంత్ర భారతదేశంలో జరుగుతున్నది చాలా వరకు ఇదే. పురోగతి పేరుతో సాగుతున్న విధ్వంసం మానవాళి ఉనికికే విపత్తు తెచ్చే రీతిలో ఉందన్న వాస్తవాన్ని అంగీకరించడానికి ఇప్పుడు ఎవరూ వెనుకాడడం లేదు. విపత్తును గుర్తించడం వేరు. దానిని నివారించడానికి నడుం కట్టడం వేరు. పంచభూతాలను కూడా నాశనం చేస్తున్న విధ్వంసాన్ని ఆపడానికి ఇప్పటికైనా తొలి అడుగు పడాలన్న ఆలోచన కొన్ని సంస్థకైనా వచ్చింది. అందులో చెప్పుకోదగినది ఏకలవ్య ఫౌండేషన్‌.


‌గ్రామం ఆధారంగా, సేద్యం పునాదిగా, కర్షకుడి శ్రేయస్సే ధ్యేయంగా కడచిన పదిహేనేళ్లుగా పుడమితల్లికి సేవలు అందిస్తున్న సంస్థ ఏకలవ్య ఫౌండేషన్‌. ‌సమష్టి కృషితో గ్రామీణ సమస్యలు పరిష్క రించుకోవాలి. స్థానిక జన బాహుళ్యం ఇందుకు కదలి రావాలి. వీటిని సమన్వయం చేయడానికి ఫౌండేషన్‌ ‌గ్రామీణాభివృద్ధి కమిటీలను ఏర్పరిచింది. ఏకలవ్యతో ప్రభావితమైన గ్రామాల ప్రయాణమే స్వయం సమృద్ధి లక్ష్యం దిశగా ఆరంభమైంది. ఆదిలాబాద్‌ ‌జిల్లా, ఇంద్రవెల్లి మండలంలో ఏకలవ్య ప్రాజెక్ట్ ‌కిందకు వచ్చిన గ్రామాలలో స్థానిక ప్రజలు నెలలో ఒకరోజు స్వచ్ఛందంగా శ్రమదానం చేస్తారు. ఈ సమష్టి కృషి అనేక ఆకాంక్షలను ప్రతిబింబిస్తుంది. అందులో సాగును లాభదాయకమైన వ్యాపకంగా మలుచు కోవడం ఒకటి. సేద్యమంటే గతంలో జరిగిన లోపాలనే కొనసాగిస్తూ, పుడమితల్లికి మరింత చేటును చేస్తూ సాగించేది కాదు. 2015 నుంచి సేంద్రియ వ్యవసాయాన్ని ఫౌండేషన్‌ ‌ప్రోత్సహిస్తున్నది. రైతు రుణాల ఊబిలో కూరుకుపోవడం, నేలలో సారం క్షీణించిపోవడం ఇకనైనా ఆగిపోవాలి. సేంద్రియ వ్యవసాయం వల్ల ఒనగూడే లాభాలు ఏమిటే ప్రయోగాత్మకంగా చూపించే కార్యక్రమాలను ఏకలవ్య నిర్వహిస్తున్నది. సేంద్రియ వ్యవసాయంలో ఒక డిప్లొమో కోర్సును కూడా ఏకలవ్య నిర్వహిస్తున్నది. దీనికి ప్రొఫెసర్‌ ‌జయశంకర్‌ ‌వ్యవసాయ విశ్వ విద్యాలయం గుర్తింపు కూడా ఉంది. ఫౌండేషన్‌ ‌సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం కృషి విజ్ఞాన కేంద్రాన్ని కేటాయించింది. తెలంగాణలో ప్రధానంగా ఆదిలాబాద్‌, ‌నల్లగొండ, వనపర్తి, నిర్మల్‌, ‌వికారాబాద్‌, ‌సిద్దిపేట వంటి చోట్ల, ఆంధప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌ ‌కడప జిల్లా, విశాఖ జిల్లాలలోను ఫౌండేషన్‌ ‌తన సేవలను విస్తరించింది. ఉత్తరా ఖండ్‌లో కూడా డెహ్రాడూన్‌ ‌వంటి చోట సంస్థ కార్యకలాపాలు సాగుతున్నాయి. ఈ పదిహేనేళ్ల కాలంలో ఫౌండేషన్‌ ‌పలు విజయాలను సాధించింది.

ఉపేక్షిత వర్గాల అభ్యున్నతే ఫౌండేషన్‌ అసలు ధ్యేయం. ముఖ్యంగా రైతాంగ శ్రేయస్సును ఆకాంక్షిస్తూ సేద్యం, సహజ వనరుల నిర్వహణ, జీవనోపాధి అనే అంశాల కోసం సంస్థ శ్రమిస్తున్నది. అలాగే గ్రామాలలో ప్రధానంగా విద్య, వైద్యం సమస్యలను పరిష్కరించడానికి కూడా పాటుపడుతున్నది. వ్యవసాయోత్పత్తులను పెంచాలన్న అంశంతో ఫౌండేషన్‌ ‌విభేదించడం లేదు. అయితే అది పర్యా వరణ సమతౌల్యాన్ని గౌరవిస్తూ సాగాలంటున్నది. విలువలు పెంపొందించే విధంగా పాఠ్య ప్రణాళికలు రూపకల్పన ఉండాలని భావిస్తుంది. పట్టణాలు, నగరాలలోని బస్తీలలో ఉండే మహిళలు, చిన్నారులు; గ్రామీణుల ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నది. నిలకడగా ఆదాయం ఉండేలా చేస్తూ కుటుంబాలకు సాయంగా ఉండడం కూడా సంస్థ ఆశయం. రసాయనాల ప్రమేయం లేకుండా వచ్చే ఆధునిక విజ్ఞాన శాస్త్ర ఫలితాలను ప్రయోగ శాలలకు పరిమితం కాకుండా, పొలంలోని రైతు వరకు తీసుకురావడం కూడా ఈ సంస్థ ఆశయాలలో కీలకమైనది. భూమికి సంబంధించిన చట్టాల పట్ల అవగాహన కల్పించే పని కూడా చేస్తున్నది.

వాననీటిని ఒడిసి పట్టడం (వాటర్‌ ‌హార్వెస్టింగ్‌), ‌నీరు, మట్టి సక్రమ వినియోగం, సహజ వనరులను సద్వినియోగం చేయడం, వాటర్‌షెడ్‌ ‌పథకాలకు, పంట దిగుబడి పెంపునకు మధ్య సమన్వయం సాధించడం ఏకలవ్య చేపట్టే నిరంతర కార్య కలాపాలు. సేంద్రియ సేద్యాన్ని ప్రోత్సహించడానికి అవసరమైన మార్గదర్శనం చేయడం, ఇందుకు స్థానికంగా లభించే వనరులపైనే ఆధారపడడం ఏకలవ్య వాస్తవిక దృష్టికి అద్దం పడతాయి. అంటే ఇవన్నీ సంప్రదాయ విధానాలేనని గమనించాలి. రైతు సంఘాల (క్లబ్‌లు) ద్వారా వ్యవసాయోత్పత్తులకు గిట్టుబాటు వచ్చేటట్టు చూడడం, మార్కెట్‌ ‌సౌకర్యం కల్పించడం కూడా సంస్థ బాధ్యతగా స్వీకరిస్తున్నది. కేవలం సేద్యం, దాని వృద్ధి మీదే దృష్టి పెట్టడం రైతు సమస్యకు పూర్తి పరిష్కారంగా భావించలేం. అందుకే వారి కుటుంబాలలో పిల్లలకు విద్యా వసతి, పౌష్టికాహార సరఫరా, ఆరోగ్య రక్షణ చర్యలు, ఎట్టి పరిస్థితులలోను జీవనోపాధికి భంగం కలగకుండా చూడడం కూడా ఫౌండేషన్‌ ‌కర్తవ్యాలుగా భావిస్తున్నది. ట్రైబల్‌ ‌రిసోర్స్ ‌సెంటర్‌, ఏకలవ్య ఆర్గానిక్‌ అ‌గ్రికల్చర్‌ ‌పాలిటెక్నిక్‌ ‌కళాశాలల ద్వారా కృషి విజ్ఞాన కేంద్రం సహాయంతో వారికి సాంకేతిక విద్యను కూడా అందిస్తున్నది.

ఫార్మర్స్ ‌క్లబ్స్, ‌వాతావరణ మార్పులను మలుచు కునే పథకం, నేలల అభివృద్ధి, రైతు సమాఖ్యలు, సేంద్రియ మిత్ర, విద్యా వాహిని పాఠశాలలు, అక్షయ విద్య, ఏకలవ్య ఆర్గానిక్‌ అ‌గ్రికల్చరల్‌ ‌పాలిటెక్నిక్‌, ఆరోగ్య రక్షణ కార్యక్రమాలు, జీవనోపాధి కల్పన కార్యకలాపాలు, కృషి విజ్ఞాన కేంద్రం, స్కిల్‌ ఇం‌డియా, చట్టాలపై అవగాహన వ్యవస్థ వంటి విభాగాలతో ఏకలవ్య ఫౌండేషన్‌ ‌గ్రామానికి వైభవాన్ని తేవడానికి నిరంతరం శ్రమిస్తున్నది.

వేలాది సంవత్సరాలుగా మట్టిని ప్రేమించి, సేద్యాన్ని ప్రాణప్రదంగా చూసుకున్న కర్షకుడు నేడు పొలాలు వీడి, పట్టణాలకీ, నగరాలకీ వలస పోవడానికి కారణం ఏమిటి? లేకపోతే బలవన్మర ణానికి పాల్పడడం ఎందుకు? పంట దిగుబడి పెరిగినా రైతుకు దిగులెందుకు? లక్షల రూపాయలు ఖర్చు చేసి, కొత్త పద్ధతులతో పండించే పంట మానవాళి పాలిట విషతుల్యంగా మారడం ఏమిటి? నిజానికి ఈ ప్రశ్నలన్నీ అంతర్లీనంగా ఒకదానితో ఒకటి అవినాభావ సంబంధం కలిగినవే. అధిక దిగుబడి అధిక జనాభాకు పరిష్కారమని ఒకనాడు భారతదేశం నమ్మింది. ఆహార ధాన్యాల మిగులు సాధించాం. కానీ మన మట్టి, నీరు, గాలి కలుషితం చేసుకున్నాం.

రసాయనిక ఎరువుల దుష్ఫలితాలతో కొన్ని తరాలను రోగగ్రస్థం చేసుకున్నాం. పొలాన్ని వీడి పోతే సమస్య తీరిపోతుందని రైతు భావిస్తున్నాడు. కానీ ఆ పరిణామంతో కొత్త సామాజిక సమస్యలకు బీజాలు పడినాయి. రైతు కూలీ అవుతున్నాడు. ఆత్మ గౌరవం కోల్పోతున్నాడు. పట్టణంలో అడ్రస్‌ ‌లేని మనిషయ్యాడు. ఇది స్వతంత్ర భారతదేశం రైతుకు ఇచ్చిన గౌరవం. కర్షకలోకం ఆత్మ గౌరవాన్ని ఇంకా పతనం కాకుండా చూడవలసి బాధ్యత ప్రతి భారతీ యుని పైనా ఉన్నది. వారిని మరల సేద్యానికి రప్పిం చాలి. అందుకు అనువైన పరిస్థితులు కల్పించాలి. ఈ గురుతర బాధ్యతను విస్మరిస్తే అది ఘోర నేరమే. మన నేలనూ, నీటినీ, గాలినీ పరిశుభ్రం చేసుకో వాలన్న స్పృహ జాతికీ కలగాలి. ఇవే ఆశయాలతో అహరహం పని చేస్తున్న, తపిస్తున్న ఏకలవ్య ఫౌండేషన్‌ను దేశమంతా అభినందిస్తున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter
Instagram