మళ్లీ పేలిన అగ్ని పర్వతం

అఫ్ఘానిస్తాన్‌ ‌నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ ఆ రెండు దేశాలకు సంబంధించిన విషయం మాత్రమే కాదు. ఈ అంశంతో పలు దేశాలకు సంబంధించిన భద్రతాపరమైన అంశాలు ముడివడి ఉన్నాయి. ముఖ్యంగా దక్షిణాసియాలోని కీలకమైన భారత్‌కు ఇది కొంతవరకు సమస్యాత్మకమే. అందువల్ల అక్కడ జరుగుతున్న పరిణామాలకు మౌనసాక్షిగా న్యూఢిల్లీ మిగిలిపోజాలదు. తనవంతు భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకోక తప్పదు.

అఫ్ఘాన్‌- ‌భారత్‌ ‌రెండు దేశాలు సరిహద్దులను పంచుకుంటున్నాయి. డ్యూరండ్‌ ‌రేఖ ఉభయ దేశాలను వేరుచేస్తోంది. పాకిస్తాన్‌ ఆ‌క్రమిత కశ్మీర్‌ (‌పీవోకే) సమీపంలో రెండు దేశాల మధ్య రమారమి 106 కిలోమీటర్ల సరిహద్దు విస్తరించి ఉంది. సరిహద్దు పరంగా రెండు దేశాల మధ్య ఎలాంటి వివాదాలు లేవు. ఉభయ దేశాల పాలకుల మధ్య కూడా మంచి సంబంధాలే ఉన్నాయి. నాటి అఫ్ఘాన్‌ ‌పాలకుడు జహీర్‌ ‌షా నుంచి పదేళ్ల పాటు అధ్యక్షుడిగా పనిచేసిన హమీద్‌ ‌కర్జాయ్‌, ‌నేటి అధినేత అష్రఫ్‌ ‌ఘనీ వరకూ అందరూ భారత్‌కు మంచి మిత్రులే. ప్రతిఒక్కరూ భారత్‌కు స్నేహహస్తం అందించిన వారే. భారత అధినేతలు కూడా సదా అఫ్ఘాన్‌ ‌శ్రేయాన్ని ఆకాంక్షించారు. ఆ పేద దేశానికి అన్ని వేళలా ఆపన్నహస్తం అందించారు. ఢిల్లీ పీఠంపై ఏ పార్టీ ఉన్నా వారు అనుసరించిన విధానం ఇదే. ప్రస్తుతం నరేంద్రమోదీ నాయకత్వంలోని నేషనల్‌ ‌డెమొక్రటిక్‌ అలయన్స్ (ఎన్‌డీఏ) ప్రభుత్వం సైతం ఇదే పంథాను అనుసరించింది. గత ఏడేళ్లుగా మోదీ సర్కారు అఫ్ఘాన్‌కు అన్ని విధాలుగా అండగా నిలిచింది. అయితే భారత్‌కు ఉన్న సమస్య అంతా అక్కడి ఉగ్రవాద మూకలతోనే. అక్కడి అల్‌ఖైదా, తాలిబన్‌ ఉ‌గ్రవాదులు భారత్‌ ‌పేరు చెబితేనే విషం కక్కుతారు. వీరికి అండాదండా అంతా దాయాది పాకిస్తాన్‌. ‌భారత్‌ను శత్రువుగా పరిగణించే పాకిస్తాన్‌, ఆ ‌దేశ గూఢచార సంస్థ (ఐఎస్‌ఐ) అఫ్ఘాన్‌ ఉ‌గ్రవాద సంస్థలకు ఊతమందిస్తున్నాయి. వాస్తవాలు తెలుసుకోలేని ఉగ్రవాదులు చెలరేగిపోతున్నారు. అఫ్ఘాన్‌లోని భారతీయ సంస్థలు, కార్యాలయాలు, అధికారులు, ఆస్తులు, ప్రజల లక్ష్యంగా దాడులకు దిగుతున్నారు. ఇది ఇప్పటికిప్పుడు ఎదురైన పరిణామ మేమీ కాదు. అంతర్యుద్ధంతో సతమతమవుతున్న అఫ్ఘాన్‌ను ఆదుకునేందుకు రెండు దశాబ్దాల క్రితం భారత్‌ ‌ప్రారంభించిన అనేక పథకాల అమలుకు ఉగ్రవాదులు అడుగడుగునా ఆటంకాలు కలిగిస్తున్నారు. హత్యలు, కాల్పులు, కిడ్నాప్‌లు సర్వసాధారణ మయ్యాయి. తాజాగా అమెరికా దళాలు వైదొలగిన తరవాత ఉగ్రవాదులు మరింత పెట్రేగిపోయే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితిని ముందే అంచనా వేసిన భారత్‌ అం‌దుకు తగ్గట్లుగా దిద్దుబాటు చర్యలు చేపట్టింది.

మూడున్నర కోట్లకు పైగా జనాభా గల అఫ్ఘానిస్తాన్‌ ‌మధ్య, దక్షిణాసియాల మధ్య విస్తరించి ఉంది. పాకిస్తాన్‌, ‌చైనా, ఇరాన్‌, ఒకప్పటి సోవియట్‌ ‌యూనియన్‌ ‌దేశాలైన తర్కుమెనిస్తాన్‌, ఉజ్బెకిస్తాన్‌, ‌తజికిస్తాన్‌లతో సరిహద్దులు పంచుకుంటోంది. ఈ దేశం నాలుగు వైపులా భూభాగాలను కలిగి ఉంది. పేదరికంతోపాటు దశాబ్దాల తరబడి అంతర్యుద్ధంతో దెబ్బతిన్నది. తొలిరోజుల్లో సోవియట్‌ ‌యూనియన్‌, ‌తరవాత రోజుల్లో అంటే కొత్త శతాబ్ది నుంచి రెండు దశాబ్దాల పాటు అమెరికా పెత్తనం కింద మగ్గింది. 2001 సెప్టెంబరు 11న అమెరికాలోని వరల్డ్ ‌ట్రేడింగ్‌ ‌సెంటర్‌ (‌డబ్య్లూటీసీ), రక్షణశాఖ కార్యాలయమైన పెంటగాన్‌పై అల్‌ ‌ఖైదా ఉగ్రావాదుల దాడితో అగ్రరాజ్యం ఆగ్రహంతో ఊగిపోయింది. అల్‌ ‌ఖైదా అంతు చూస్తామని నాటి అధ్యక్షుడు జార్జిబుష్‌ ‌ప్రతిన బూనారు. ఆ మేరకు అమెరికా, నాటో (నార్త్ అట్లాంటిక్‌ ‌ట్రీటీ ఆర్గనైజేషన్‌) ‌బలగాలను అఫ్ఘాన్‌లో మోహరించారు. బరాక్‌ ఒబామా హయాంలో అమెరికా బలగాలు పాకిస్తాన్‌లో తలదాచుకున్న బిన్‌ ‌లాడెన్‌ను హతమార్చాయి. అమెరికా బలగాలు అఫ్ఘాన్‌లో అవిశ్రాంతంగా పోరాడినప్పటికీ ఉగ్రవాదాన్ని అంతం చేయలేక పోయాయి. పెద్దయెత్తున వందల కోట్ల రూపాయలు వ్యయం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. వందల మంది సైనికులు బలిదానాలు చేశారు. వేల మంది గాయపడ్డారు. 2014 తరవాత అమెరికా దళాలు దాడులు చేయడం దాదాపుగా ఆపివేశాయి. ఎంతచేసినా ఫలితం లేదన్న నిర్ణయానికి వచ్చిన అమెరికా పునరాలోచనలో పడి చివరకు దళాల ఉపసంహరణకు మొగ్గు చూపింది. ట్రంప్‌ ‌హయాంలో తీసుకున్న నిర్ణయం ఇప్పుడు బైడెన్‌ ‌పాలనలో కార్యరూపం దాల్చింది. అక్కడి పరిస్థితులు చక్కబడ్డాయా లేదా అన్నది తమకు సంబంధించిన విషయం కాదని, అఫ్ఘాన్‌ ‌జాతి నిర్మాణం తమ లక్ష్యమేమీ కాదని ఈ సందర్భంగా బైడెన్‌ ‌పేర్కొనడం గమనార్హం. అఫ్ఘాన్‌ ‌విషయంలో మున్ముందు భారత్‌ ‌తదితర దేశాలు క్రియాశీలకంగా వ్యవహరించాలని ఒక ఉచిత సలహా కూడా ఇచ్చారు అమెరికా అధినేత. దళాల ఉపసంహరణ నిర్ణయాన్ని పరిశీలించినప్పుడు ఎనిమిదో దశకం చివరలో శ్రీలంకలో తమిళ తీవ్రవాదాన్ని తుద ముట్టించేందుకు భారత్‌ అక్కడకు సైన్యాన్ని పంపిన సంఘటన గుర్తుకు రాక మానదు. తమిళ ఈలం పేరుతో పోరాడుతున్న ఎల్‌టీటీఈ (లిబరేషన్‌ ‌టైగర్స్ ఆఫ్‌ ‌తమిళ ఈలం) తీవ్రవాదుల ఆట కట్టించేందుకు నాటి ప్రధాని రాజీవ్‌గాంధీ ఐపీకేఎఫ్‌ (ఇం‌డియన్‌ ‌పీస్‌ ‌కీపింగ్‌ ‌ఫోర్స్)‌ను లంకకు పంపారు. ఈ ప్రయత్నంలో భారత సైన్యం భారీగా నష్టపోయింది. చివరికి తీవ్రవాదాన్ని అణచివేయలేక ఒట్టి చేతులతో వెనక్కి వచ్చింది. ఇప్పుడు అఫ్ఘాన్‌లో అమెరికా సైన్యానికి ఎదురైన చేదు అనుభవం ఇలాంటిదే. స్థానిక ప్రజల భాగస్వామ్యం లేకుండా కేవలం బలగాలతో శాంతిస్థాపన సాధ్యం కాదు. ఇది కాలపరీక్షలో నిగ్గుతేలిన సత్యం. ఈ వాస్తవాన్ని విస్మరించి ముందుకు వెళితే ఎవరైనా అందుకు తగిన మూల్యం చెల్లించక తప్పదు.

అమెరికా బలగాల ఉపసంహరణతో కాబూల్‌కు ఉత్తరాన గల పర్వాన్‌ ‌ప్రావిన్స్‌లోని బాగ్రమ్‌ ‌వైమానిక స్థావరం ఇప్పుడు బోసిపోతోంది. ఒకప్పుడు లక్షల మంది అమెరికా, నాటో సైనికులతో హడావిడిగా ఉండే ఈ స్థావరంలో ఇప్పుడు సైనికుల సంఖ్య బాగా పలుచన పడింది. మూడు వేల లోపునకే పరిమిత మైంది. అమెరికా బలగాల ఉపసంహరణతో అఫ్ఘాన్‌ ‌పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలోకి పడినట్ల యిందని అంతర్జాతీయంగా దౌత్య వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అమెరికా బలగాలు ఉన్నప్పుడే ఉగ్రవాదులు రెచ్చిపోయేవారు. బలగాల అత్యాధునిక ఆయుధాలు, వాటి నైపుణ్యం, ఎత్తులు, పైయెత్తులు, వ్యూహరచన ఉగ్రవాద సంస్థల ముందు తేలిపోయేవి. ఏళ్ల తరబడి బలగాలు ఇక్కడ తిష్టవేసినా ఉగ్రవాదుల అణచివేతలో విజయం సాధించలేకపోయాయి. ఏ లక్ష్యంతో వచ్చాయో అది నెరవేరకుండానే వెనుదిరుగు తున్నాయి. తాజాగా బలగాల ఉపసంహరణతో తాలిబన్లకు ఎదురులేకుండా పోయింది. వారిని అడ్డుకునే శక్తి, సామర్థ్యాలు అఫ్ఘాన్‌ ‌బలగాలకు కొరవడినాయి. అధునాతన ఆయుధాలు, తగిన శిక్షణలేని అఫ్ఘాన్‌ ‌బలగాలు ఉగ్రవాదుల ముందు చేతులెత్తేస్తున్నాయి. తాలిబన్లకు గట్టిగా జవాబివ్వలేక పోతున్నాయి. దీంతో బతుకు జీవుడా అంటూ పొరుగునున్న తజికిస్తాన్‌కు పలాయనం చిత్తగిస్తు న్నాయి. దీంతో ఆ దేశం అప్రమత్తమైంది. అఫ్ఘాన్‌ ‌సైనికుల రాకను అడ్డుకునేందుకు దాదాపు 20 వేల మంది సైన్యాన్ని మోహరించింది. మరోపక్క రోజు రోజుకూ తాలిబన్లు దేశంపై పట్టు బిగిస్తున్నారు. మొత్తం 400కు పైగా జిల్లాలకుగాను సుమారు 300కు పైగా తాలిబన్ల పరమయ్యాయని అంతర్జాతీయ మీడియా అంటోంది. 80లోపు జిల్లాలు మాత్రమే ప్రభుత్వ నియంత్రణలో ఉన్నాయి. రాజధాని కాబూల్‌ ‌తరవాత దేశంలో రెండో పెద్ద నగరమైన కాందహార్‌ ‌సరిహద్దుల వరకు తాలిబన్లు వచ్చారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ప్రభుత్వం కాందహార్‌ ‌నగరంలో రాత్రివేళ కర్ఫ్యూను విధించింది. కాందహార్‌లోకి తాలిబన్లు ప్రవేశించారంటే వారిని నియంత్రంచడం కష్టమైన పనే.

ఇక భారత్‌ ‌విషయానికి వస్తే అఫ్ఘాన్‌తో మనకు మంచి సంబంధాలు ఉన్నాయి. అక్కడి ప్రజలు సైతం భారతీయులను విశేషంగా ఆదరిస్తారు, అభిమానిస్తారు, గౌరవిస్తారు. ఇది దాయాది దేశమైన పాకిస్తాన్‌కు ఎంతమాత్రం మింగుడుపడని విషయం. దీంతో తాలిబన్‌ ‌తీవ్రవాదులకు భారత్‌పై విద్వేషాన్ని నూరిపోస్తోంది. భారత్‌ను అఫ్ఘాన్‌ ‌వ్యతిరేకిగా చిత్రిస్తోంది. తమ దేశంలోని తాలిబన్‌ ఉ‌గ్రవాదులకు పాకిస్తాన్‌ అం‌డదండలు ఉన్నాయని గతంలో అధ్యక్షుడిగా ఉన్న సమయంలో హమీద్‌ ‌కర్జాయ్‌ ‌బహిరంగంగా వ్యాఖ్యానించడం గమనార్హం. పాకిస్తాన్‌కు తాలిబన్లపైనే ప్రేమ తప్ప అఫ్ఘాన్‌ ‌పౌరులపై ఎంతమాత్రం లేదన్నది వాస్తవం. తాజాగా ఇస్లామాబాద్‌లోని అఫ్ఘాన్‌ ‌రాయబారి కూతురు కిడ్నాపైంది. దీనిపై పాక్‌ ఇం‌తవరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. కేవలం మాటలతోనే కాలక్షేపం చేస్తోంది. ఇందుకు నిరసనగా పాక్‌లోని తన రాయబారిని అఫ్ఘాన్‌ ‌వెనక్కు రప్పించింది.

వందల కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా అఫ్ఘాన్‌ ‌ప్రజల అభిమానాన్ని, ఆదరణను భారత్‌ ‌పొందుతుందన్న అసూయతో పాకిస్తాన్‌ ‌రగిలిపోతోంది. ప్రగతి పథకాలు చేపట్డడం ద్వారా ఎక్కడ అఫ్ఘాన్‌పై పట్టు సాధిస్తుందో, ప్రాబల్యం పెంచుకుంటుందో అన్నది పాకిస్తాన్‌ అనుమానం, ఆందోళన. ఒకవేళ అఫ్ఘాన్‌లో భారత్‌ ‌బలపడితే తనకు ముప్పు వస్తుందోనన్న ఆందోళన ఇస్లామాబాద్‌కు లేకపోలేదు. అందువల్లే తాలిబన్‌ ఉ‌గ్రవాదులకు ఉన్నవీ లేనివీ నూరిసోస్తూ వారిని వక్రమార్గం పట్టిస్తోంది. కాందహార్‌లోని భారత కాన్సులేట్‌ ‌కార్యాలయంపై ఉగ్రవాదులు గతంలో దాడులకు దిగారు. ఇటీవల కాలంలో కూడా దాడులు కొనసాగాయి. దీంతో భారత్‌ ‌ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. కార్యాలయంలో పనిచేసే దౌత్యవేత్తలు, ఉన్నతాధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేసింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని పేర్కొంది. తగినంత భద్రతతోనే బయటకు రావాలని విస్పష్టంగా సూచించింది. చివరకు పరిస్థితులు కుదుటపడకపోవడంతో కాందహార్‌ ‌నుంచి దౌత్యవేత్తలను ఉపసంహరించు కుంది. తాలిబన్లు ఈ నగరం పరిసర ప్రాంతాల్లోకి రావడంతో ఈ చర్యలు చేపట్టింది. కార్యాలయంలో పనిచేస్తున్న 50 మంది దౌత్యవేత్తలు, అధికారులు, సిబ్బందిని ప్రత్యేక విమానంలో తీసుకువచ్చింది. అయితే ఇది తాత్కాలికమేనని, కార్యాలయాన్ని పూర్తిగా మూసేయలేదని, మున్ముందు పరిస్థితులు కుదుటపడే వరకు స్థానిక సిబ్బందితో కార్యాలయం పనిచేస్తుందని విదేశాంగశాఖ స్పష్టంచేసింది. కాందహార్‌ ‌కార్యాలయ సేవలను కాబూల్‌ ‌కార్యాలయంలో అందిస్తామని పేర్కొంది. పాకిస్తాన్‌ ‌గగనతలంలోకి ప్రవేశించ కుండానే భారత వాయుసేన విమానం కాందహార్‌ ‌వెళ్లిరావడం విశేషం. కాందహార్‌తో పాటు కాబూల్‌లోని దౌత్య కార్యాలయం, మజారే ఎ షరీఫ్‌, ‌హీరత్‌, ‌జలాలాబాద్‌ల్లోని భారత కాన్సులేట్‌ ‌కార్యాలయాల్లోనూ పరిస్థితులు సానుకూలంగా లేవు. ఎప్పుడు ఏ క్షణాన ఎటువైపు నుంచి ఉగ్రవాద దాడులు జరుగుతాయోనన్న ఆందోళనతో సిబ్బంది బిక్కబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.

అఫ్ఘాన్‌తో భారత్‌కు కొన్ని చేదు అనుభవాలు లేకపోలేదు. 1999 డిసెంబరు 24న నేపాల్‌ ‌రాజధాని ఖట్మాండులోని త్రిభువన్‌ అం‌తర్జాతీయ విమానాశ్రయం నుంచి న్యూఢిల్లీకి బయలుదేరిన భారత విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్‌ ‌చేసి కాందహార్‌కు మళ్లించారు. జమ్ముకశ్మీర్‌ ‌జైల్లో ఉన్న ఉగ్రవాదులను విడిచి పెడితేనే ప్రయాణికులను వదిలిపెడతామని షరతు విధించారు. దీంతో గత్యంతరం లేక అమాయక ప్రయాణికుల ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని నాటి భారత ప్రభుత్వం ఉగ్రవాదులను విడిచిపెట్టింది. నాటి విదేశాంగ మంత్రి జశ్వంత్‌ ‌సింగ్‌ ‌స్వయంగా ఉగ్రవాదులతో కాందహార్‌ ‌వెళ్లి ప్రయాణికులను వెంటబెట్టుకుని వచ్చారు. అయినప్పటికీ అఫ్ఘాన్‌కు భారత్‌ అం‌దించిన మద్దతు, చేసిన సాయం మరే దేశమూ చేయలేదన్నది అక్షర సత్యం. విద్య, వైద్యం, మౌలిక వసతుల పరంగా భారత్‌ ‌చేసిన, చేస్తున్న సాయం అంతర్జాతీయ సమాజానికి తెలియనిది ఏమీ కాదు. ఏకంగా అఫ్ఘాన్‌కు 90 బిలియన్‌ ‌డాలర్ల వ్యయంతో పార్లమెంటు భవనాన్ని నిర్మించి కానుకగా ఇచ్చింది. 2015 డిసెంబరు 25న అధ్యక్షుడు అష్రఫ్‌ ‌ఘనీ, ప్రధాని మోదీ దీనిని ప్రారంభించారు. ఇందులో 294 మంది కూర్చొనేందుకు వీలుగా లోయర్‌ ‌హౌస్‌ (‌వోలేసి జిర్గా), 190 సీట్లతో ఎగువసభ (మెప్రాన్‌ ‌జిర్గా) ఉన్నాయి. దివంగత మాజీ ప్రధాని అటల్‌ ‌బిహారీ వాజపేయి పేరుతో ప్రత్యేకంగా అటల్‌ ‌బ్లాక్‌ ‌నిర్మించారు. 2007లో నాటి ప్రధాని మన్మోహన్‌ ‌పార్లమెంటు భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆంధప్రదేశ్‌కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ దీనిని నిర్మించింది. ఇరుదేశాల స్నేహ సంబంధాలకు గుర్తుగా నిర్మించిన అఫ్ఘాన్‌-ఇం‌డో ఫ్రెండ్‌షిప్‌ ‌డ్యామ్‌ను 2016 జూన్‌ 4‌న ప్రధాని మోదీ, అఫ్ఘాన్‌ అధినేత అష్రఫ్‌ ‌ఘనీ ప్రారంభించారు. ఇక్కడ జలవిద్యుత్‌ ఉత్పత్తి చేస్తారు. సాగనీరు కూడా భూములకు అందజేస్తారు. దీనిని చిప్తి షరీఫ్‌ ‌జిల్లాలో హరి నదిపై నిర్మించారు. దశాబ్దాల తరబడి అంతర్యుద్ధం కారణంగా దెబ్బతిన్న అఫ్ఘాన్‌లో మౌలిక వసతులను కల్పించేందుకు, విస్తరించేందుకు భారత్‌ ఎప్పుడో ముందుకు వచ్చింది. దాదాపు 300 కోట్ల డాలర్ల మేరకు పెట్టుబడులు పెట్టింది. రహదారుల నిర్మాణం, విస్తరణ, పాఠశాల భవనాల నిర్మాణం, విద్యార్థులకు ఉపకార వేతనాలు, తాగు, సాగునీటి వసతులు కల్పన, భద్రతా దళాలకు ఆధునిక ఆయుధాల అందజేత, వాటికి శిక్షణ వంటి కార్యకలాపాలను చేపట్టింది. ఇందుకు సంబంధించి 400లకు పైగా ప్రాజెక్టులను భుజాన వేసుకుంది. డెలారం నుంచి జరంజ్‌ ‌వరకు నిర్మించిన 218 కిలోమీటర్ల రహదారిని 2015లో ప్రారంభించారు.

ఇప్పుడు అఫ్ఘాన్‌లో తాలిబన్లు వేగంగా పట్టు పెంచుకుంటూ పోతుండటంతో అంతర్జాతీయ సమాజం ముఖ్యంగా భారత్‌ ఆం‌దోళన చెందుతోంది. గతంలో తాలిబన్ల హయాంలో ఆ దేశంలో రాక్షస పాలన కొనసాగింది. వారు మహిళలపై అనేక ఆంక్షలు విధించారు. బురఖాలు ధరించాలని, బయట తిరగరాదని, చదువుకోరాదని, ఇంటికే పరిమితం కావాలని అంటూ అర్థరహితమైన ఆంక్షలు అమలు చేశారు. ధిక్కరించిన వారికి బహిరంగ శిక్షలు అమలు చేశారు. బహిరంగంగా ఉరి శిక్షలు వేసి అమలు పరిచారు. యువతను ఉగ్రవాదంవైపు మళ్లించారు. గ్రామాలను ఉగ్రవాద కేంద్రాలుగా మార్చారు. అంతర్జాలాన్ని నిషేధించారు. తమ మాటకు ఎదురుచెప్పిన వారి అంతు చూశారు. ఒక్క మాటలో చెప్పాలంటే తాలిబన్లు మళ్లీ మధ్య యుగపు పాలన తీసుకువస్తారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా తాలిబన్లు యువతులు, మహిళలపై కన్నేశారు. తమపోరాట యోధులకు వివాహాలు చేసేందుకు 15 సంవత్సరాలు పైబడిన యువతులు, 45ఏళ్ల లోపు వితంతువులు కావాలని, వారి సమాచారం తమకు అందజేయాలని ఆదేశించారు. దీంతో మహిళలు హడలిపోతున్నారు. తమకు భద్రత కరవైందని ఆందోళన చెందుతున్నారు. ఒక్కసారి తాలిబన్ల చెరలోకి వెళ్లామంటే తమ జీవితాలను చేజార్చుకున్నట్లేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇరుగుపొరుగు దేశాలతో కఠినంగా వ్యవహ రించే తాలిబన్లు చైనా విషయంలో మాత్రం సానుకూలంగా ఉన్నారు. చైనాలోని జింజియాంగ్‌ ‌ప్రావిన్స్ అఫ్ఘాన్‌ ‌సరిహద్దులకు దగ్గర్లోనే ఉంది. అక్కడ స్థిరపడిన ‘వీగర్‌’ ‌తెగకు చెందిన ముస్లింలను చైనా సర్కారు వేధింపులకు గురి చేస్తున్నా పల్లెత్తు మాట అనడం లేదు. పైగా చైనా తమకు మిత్రదేశమని పేర్కొంటూ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారు. భారత్‌లోని కశ్మీరీల పట్ల ఎక్కడ లేని ప్రేమ, దయ ఒలకబోసే తాలిబన్లు చైనాలోని వీగర్‌ ‌ముస్లింల న్యాయబద్ధమైన హక్కులపై కనీసం నోరు మెదపడం లేదు. అంతేకాకుండా చైనాకు వ్యతిరేకంగా వీగర్‌ ‌ముస్లింలకు మద్దతిచ్చే ప్రసక్తి లేదని స్పష్టం చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఉగ్రవాదంపై పోరుకు తార్కిక ముగింపు పలకకుండా అగ్రరాజ్యం తన దారి తాను చూసుకుంటున్న తరుణంలో తాలిబన్‌ ఉ‌గ్రవాద మూకలు మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉంది. తాలిబన్ల నుంచి అఫ్ఘాన్‌ ఇరుగు పొరుగు దేశాలైన పాకిస్తాన్‌, ఇరాన్‌, ‌చైనా, ఉజ్బెకిస్తాన్‌, ‌తజికిస్తాన్‌ ‌తదితర దేశాలకు ప్రత్యేకంగా వచ్చే ఇబ్బందులేవీ లేవు. ఆయా దేశాల పట్ల దానికి సానుకూల వైఖరే ఉంది. భారత్‌పైనే దానికి వ్యతిరేకత ఉంది. ఈ విషయంలో కర్త, కర్మ, క్రియ పాత్రను సమర్థంగా పోషిస్తున్నది పాకిస్తాన్‌. అం‌దువల్ల న్యూఢిల్లీ విధాన నిర్ణేతలు అంతర్జాతీయ వేదికలపై తాలిబన్లు, పాకిస్తాన్‌ ‌కపటనీతిని ఎండగట్టాలి. ఆ రెండింటి మధ్య గల అవినాభావ సంబంధాన్ని విడమరచి చెప్పాలి. వాటి ద్వంద్వ వైఖరిని ఎరుకపరచాలి. మరో పక్క అఫ్ఘాన్‌లో పనిచేస్తున్న, నివసిస్తున్న భారతీయుల భద్రతకు పకడ్బందీ చర్యలు చేపట్టాలి. భారతీయుల ఆస్తులు, కార్యాలయాలకు భద్రతను పటిష్టం చేయాలి. ఈ విషయంలో అఫ్ఘాన్‌ ‌ప్రభుత్వంతో కలసి పని చేయాలి. అదే సమయంలో అఫ్ఘాన్‌ ‌ప్రగతే తమ లక్ష్యం తప్ప అక్కడి వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం, ఆ దేశంపై పట్టు సాధించడం, ప్రాబల్యం పెంచు కోవాలన్న ఉద్దేశం లేదన్న విషయాన్ని మాటల్లో, చేతల్లో చూపించాలి. అప్పుడే అంతర్జాతీయ సమాజం మన చిత్తశుద్ధిని, నిజాయతీని గర్తించగలుగుతుంది. అఫ్ఘానీల అభిమానాన్ని పొందగలుగుతుంది. దీనికి సంబంధించిన దౌత్యనీతికి మరింత పదును పెట్టాలి. పరిణతితో, సంయమనంతో, వివేకంతో, ఆచితూచి వ్యవహరించాల్సిన సమయమిది.

– గోపరాజు విశ్వేశ్వరప్రసాద్‌,  ‌సీనియర్‌ ‌జర్నలిస్ట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
Instagram