-తురగా నాగభూషణం

రాష్ట్రంలో ఒక వర్గం ప్రజలు ఉద్యోగం కోసం ఒక ప్రపంచంలో, ఇంటి వద్ద మరో ప్రపంచంలో విహరిస్తున్నారు. తమకు అన్నం పెడుతున్న మొదటి ప్రపంచాన్ని దూషించి రెండో ప్రపంచాన్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఆ మొదటి ప్రపంచం హిందూమతమైతే – రెండో ప్రపంచం క్రైస్తవం. క్రైస్తవ మతం స్వీకరించినా హిందూ మత ఎస్సీ రిజర్వేషన్లు పొందుతూ హిందువులకు అన్యాయం చేస్తున్నారు. ఇలా అన్యాయానికి గురైన ఎస్సీ సోదరులు ఆగ్రహంతో ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన కమిషన్‌ విచారణ చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన రైతు చైతన్య యాత్రలు ప్రభుత్వానికి తలనొప్పి తెప్పించాయి. వ్యవసాయానికి ప్రభుత్వ చేయూత, సాంకేతిక సలహాలు, మేలైన యాజమాన్య పద్ధతులపై ప్రభుత్వం నిర్వహించిన రైతు చైతన్య యాత్రల్లో రైతులు కనిపించలేదు. వచ్చిన కొద్దిమందీ తమ సమస్యలను ఏకరవు పెట్టుకోవడంతో ప్రజా ప్రతినిధులు నీళ్లు నమిలారు. అధికారులు బిత్తర చూపులు చూశారు.

ఆంధ్రప్రదేశ్‌లో క్రైస్తవ మతమార్పిడి ప్రక్రియతో ఎస్సీ రిజర్వేషన్లు పెద్ద ఎత్తున దుర్వినియోగం అవుతున్నాయనే విషయం అందరికీ తెలుసు. కాని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఫ్‌ు; భారతీయ జనతా పార్టీ తప్ప ఏ రాజకీయ పార్టీ కూడా ఈ విషయంలో నోరు విప్పవు. మతమార్పిడికి వ్యతిరేకంగా మాట్లాడితే ఎక్కడ ఆయా వర్గాల ఓట్లు కోల్పోతామేమోనన్న భయమే దీనికి కారణం. దేశ రాజ్యాంగం ప్రకారం ముస్లిం, క్రైస్తవ మతాలు తప్ప హిందూ, సిక్కు, బౌద్ధ మతానికి చెందిన వారు మాత్రమే ఎస్సీ జాబితాలో నమోదై ఉన్నారు. ఎస్సీలు వేరే మతం స్వీకరిస్తే ఎస్సీల జాబితా నుంచి తొలగిపోయి గ్రూప్‌ సి కిందకు వస్తారు. కాని ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఎస్సీల జాబితాలో ఉన్న హిందువులను యథేచ్ఛగా మతం మార్చివేస్తున్నారు. అయినా వారంతా ఎస్సీల జాబితాలోనే కొనసాగు తున్నారు. ఫలితం ఎస్సీ జాబితాలో ఉన్న అసలైన హిందువులకు లబ్ధిచేకూరడం లేదు. రాష్ట్రంలో ఉద్యోగులు, ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలు 90 శాతం ఈ రకంగానే క్రైస్తవ మతంలోకి మారి ఇప్పుడు హిందూ ఎస్సీ సర్టిఫికెట్‌తో ప్రభుత్వాన్ని మోసం చేసి ఉద్యోగాలు, పదవులు వెలగబెడుతున్నారు. బయట ప్రపంచంలో ఒకలా, లోపల మరో ప్రపంచంలో ఉంటున్నారు. క్రైస్తవ సంప్రదాయాలు పాటించడం, చర్చిల్లో ప్రార్థనలకు వెళ్లడం, అనధికారంగా క్రైస్తవ పేర్లు కలిగి ఉండటం, హిందువులను దూషించడం ఇవన్నీ వీరి రోజూవారి దినచర్యలు. అంతెందుకు తిరుమల, తిరుపతి దేవస్థానంలో హిందూ ఎస్సీ రిజర్వేషన్ల పేరుతో ఎందరో క్రైస్తవ మతాన్ని స్వీకరించిన వ్యక్తులు ఉద్యోగం పొంది పనిచేస్తున్నారు. మతం మారి ఎస్సీ పేరుతో విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పొందుతున్నారని పలువురు ఆరోపించినా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తాజాగా రాష్ట్రంలో క్రైస్తవులు ఎస్సీ రిజర్వేషన్లు పొందడంతో రిజర్వేషన్లు దుర్వినియోగం అవుతున్నాయన్న ఆరోపణలపై నివేదిక సమర్పించాలని జాతీయ ఎస్సీ కమిషన్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 15 రోజుల్లో వాస్తవిక సమాచారంతో నివేదిక అందజేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీస్‌ జారీ చేసింది. నిర్ణీత వ్యవధిలోగా సమాధానం ఇవ్వకపోతే రాజ్యాంగం లోని ఆర్టికల్‌ 338 ప్రకారం సివిల్‌ కోర్టుల అధికారాలను జాతీయ ఎస్సీ కమిషన్‌ ప్రయోగించాల్సి వస్తుందని హెచ్చరించింది. ఆర్టికల్‌ 338కి లోబడి, కమిషన్‌ ముందు వ్యక్తిగతంగా హాజరు కావలసి ఉంటుందని సీఎస్‌కు తెలియజేసింది. కాని క్రైస్తవులకు అండగా ఉంటున్న ప్రభుత్వం నివేదిక పంపడం కష్టమే. ఒక వేళ పంపినా.. ఎలాంటి మత మార్పిళ్లు లేవనే చెబుతుంది.

ఎలా కనిపెట్టాలి?

పుట్టుక, వివాహం, మరణం వంటి కార్యాలు ఆయా మతాల సంప్రదాయాల ప్రకారం జరుగుతాయి. క్రైస్తవులు ఇంటి వద్ద ఒకపేరు, బయట మరోపేరు పెట్టుకుని మోసం చేస్తున్నా, వారి మత సంప్రదాయాలు పాటిస్తారు. క్రైస్తవ సంప్రదాయంలో చర్చిలో వివాహం, వస్త్రధారణ, ఫాస్టర్ల నిర్వహణ, మరణిస్తే సమాధి చేయడం వంటివి సాధారణం. ఇవే వ్యక్తులు క్రైస్తవాన్ని స్వీకరించారనేందుకు సాక్షంగా నిలిచే అంశాలు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్‌పై ఉద్యోగం పొందిన అధికారులు, ఉద్యోగులు, ఎమ్యెల్యేలు, ఎంపీలను గుర్తించి వారిపై చర్యకు పూనుకోవాలి. వీరు చర్చిల్లో దిగిన పెళ్లి ఫొటోలు సేకరిస్తే చాలు అడ్డంగా దొరికిపోతారు. ఇదే జరిగితే దేశంలో గొప్ప సంచలనం అవుతుంది. మత మార్పిడులకు అడ్డుకట్టపడుతుంది.

ఆర్థిక భారంగా యాంత్రీకరణ పథకం

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న యాంత్రీకరణ పథకం రైతులకు వెసులుబాటు మాట అటుంచి ఆర్థిక భారంగా మారింది. రౖౖెతుల నుంచి రెండేళ్లుగా వస్తున్న ఒత్తిడి తట్టుకోలేక ప్రభుత్వం ఎట్టకేలకు వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని ప్రారంభించింది. కాని ఈ పథకం నిబంధనలు రైతులకు ప్రతిబంధ కంగా మారడంతో కొద్దిమంది పెద్ద రైతులు మాత్రమే వినియోగించుకోగలుగుతున్నారు. గతంలో రైతులకు వ్యక్తిగతంగా 40 శాతం రాయితీపై వ్యవసాయ పనిముట్లను అందజేసేవారు. ఇప్పుడు ప్రభుత్వం చెల్లించాల్సిన రాయితీ సొమ్మును రైతులే ముందుగా చెల్లించాలని షరతు విధించారు. ఒక పక్క వ్యవ సాయానికి పెట్టుబడిలేక ఇబ్బందిపడుతుంటే, లక్షల రూపాయల రాయితీ సొమ్ము ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలని రైతులు వాపోతున్నారు.

రైతులు దూరం

రాష్ట్రంలో 10,778 రైతు భరోసా కేంద్రాలున్నాయి. ఒక్కో రైతు భరోసా కేంద్రం పరిధిలో ఒక్కో రైతు గ్రూపును ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వం లక్ష్యం. దీని ప్రకారం రాష్ట్రంలోని అన్ని ఆర్‌బీకేల పరిధిలో రైతు గ్రూపులను ఏర్పాటు చేసి, కస్టమ్‌ హైరింగ్‌ కేంద్రాలను (సిహెచ్‌సి) నెలకొల్పాలి. అయితే ప్రభుత్వం 2021 బడ్జెట్‌లో 10246 కస్టమ్‌ హైరింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపింది. కాని ఇప్పుడు మొదటి విడతగా 1898 రైతు భరోసా కేంద్రాల్లో 1192 కస్టమ్‌ హైరింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. ఒక్కో సిహెచ్‌సికి రూ.15 లక్షలు విలువ చేసే యంత్ర పరికరాలను కొనుగోలు చేయించి, ఆ గ్రామంలోని రైతులకు అద్దె ప్రాతిపదికన ఇవ్వాలి. గతంలో వ్యక్తిగతంగా వ్యవసాయ పరికరాలను రాయితీపై అందించేవారు.

ఒక్కో రైతు బృందానికి రూ.15 లక్షల పరికరాలను అందిస్తారు. ఇందులో రైతులు పది శాతం మొత్తాన్ని జిల్లా కేంద్ర సహకార బ్యాంకుకు చెల్లించాలి. దీంతోపాటు ప్రభుత్వ రాయితీ 40 శాతం. అంటే.. రూ.6 లక్షలను కూడా రైతు గ్రూపులు బ్యాంకులో జమ చేయాలి. మిగిలిన 50 శాతం సొమ్మును జిల్లా కేంద్ర సహకార బ్యాంకు రుణం ఇస్తుంది. ఒక పక్క సేకరించిన ధాన్యానికి ఇంతవరకు డబ్బులు చెల్లించలేదు. ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితుల్లో విత్తనాలు, ఎరువులకే డబ్బుల్లేక రైతులు అప్పులు చేస్తున్నారు. పరికరాలకు రూ.లక్షల సొమ్ము ఎక్కడి నుంచి తేవాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇలా అయితే తమకు పరికరాలే అవసరం లేదని రైతులు అంటున్నారు. గతంలో వ్యక్తిగతంగా ఇచ్చే యంత్రాలను రైతులు తమ స్థలాల్లో భద్రపరుచుకునేవారు. ఇప్పుడు రైతు గ్రూపులకు పరికరాల నిర్వాహణ బాధ్యతను అప్పగించడంతో వాటిని భద్రపరిచే షెడ్డు నిర్మాణానికి అదనపు ఖర్చులు భరించలే మంటున్నారు. గతంలో రైతు రథం పేరుతో ట్రాక్టరును రాయితీపై ఇచ్చేవారు. కాని ప్రస్తుతం ట్రాక్టరును ఇవ్వడానికి ముందుకు రాలేదు. దీంతో కస్టమ్‌ హైరింగ్‌ కేంద్రాలు లక్ష్యంలో పదిశాతం కూడా ఏర్పాటు చేయలేకపోతున్నారు.

తలబొప్పి కట్టించిన రైతు చైతన్య యాత్రలు

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన రైతు చైతన్య యాత్రలు ప్రభుత్వానికి తలనొప్పి తెప్పించాయి. అదిచ్చాం, ఇదిచ్చాం అంటూ నాయకులు కాసేపు గొప్పలు చెప్పుకుని అధికారులతో భజన చేయించు కోవాలని వచ్చారు. తీరా తమ గోడు చెప్పుకుంటున్న రైతులకు సరైన సమాధానం చెప్పలేక, అనునయించలేక హడావిడిగా చిత్తగించారు. వ్యవసాయ, ఇతర అనుబంధ రంగాలకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, ఆయా రంగాల్లో మేలైన యాజమాన్య పద్ధతులు, సాంకేతిక అంశాలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్బీకేల్లో ఈ నెల 9 నుంచి 23 వరకు రైతు చైతన్య యాత్రలను నిర్వహించింది. కాని ఈ యాత్రల్లో జరిగే సభలు రైతులు లేక వెలవెలబోయాయి. ఇక్కడకు రావడానికి ఎవరూ ఆసక్తిని చూపించడం లేదు. వచ్చినవారు గిట్టుబాటు ధరలు, రాయితీ యంత్రాలపై అధికారు లను ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ పథకాలపై పెదవి విరుస్తున్నారు. రైతు భరోసా డబ్బులు రాలేదని అధికారులను నిలదీస్తున్నారు. దీంతో అధికారులు నీళ్లు నములుతున్నారు. మత్స్యపరిశ్రమలు ఉన్న ప్రాంతాల్లో రైతులు సీడ్‌, ఫీడ్‌ ధరలు ఆకాశాన్నంటు తున్నాయని, రొయ్యలకు మాత్రం ధరలు లేవని ఆక్వా రైతులు నిలదీస్తున్నారు.

క్రమబద్ధీకరణలో జాప్యమెందుకు?

రెండేళ్ల క్రితం గ్రామ, వార్డు సచివాలయాల పరీక్ష రాసి ఉద్యోగాల్లో చేరిన 1.34 లక్షల మంది సిబ్బందిని ఇప్పుడు క్రమబద్ధీకరించే సమయం వచ్చింది. ఒకేసారి అంతమందిని రెగ్యులర్‌ చేస్తే తమపై ఆర్థికభారం కానుందని ప్రభుత్వం భావిస్తోంది. రకరకాల నిబంధనలను పెట్టి ఈ ప్రక్రియను జాప్యం చేయడానికి ప్రయత్నిస్తోందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. డిపార్ట్‌మెంటల్‌ పరీక్ష పాసయితేనే రెగ్యులర్‌ చేస్తామన్న ప్రభుత్వం, ఇప్పుడు కొత్త సిలబస్‌ ప్రకటించింది. అది పాసయితేనే రెగ్యులర్‌ చేస్తామని పేర్కొంది. ఈ సిలబస్‌ గ్రూప్‌`1 కంటే కష్టంగా ఉందని సాక్షాత్తూ భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు పేర్కొనడం ఆందోళన కలిగించే అంశం. నెలకు రూ.15 వేలు మాత్రమే ఇస్తున్నా వీరంతా విధులు నిర్వహిస్తున్నారు. మంచి ఉద్యోగాలు వచ్చినా వదలివెళ్దామంటే తీసుకున్న జీతం తిరిగి ఇవ్వాలని నిబంధన విధించడంతో వీరు హతాశులౌతున్నారు.

వ్యాసకర్త : సీనియర్‌ జర్నలిస్ట్‌

About Author

By editor

Twitter
Instagram