నవంబర్ 15 జయంతి
మన దేశ స్వాతంత్య్రం కోసం, ధర్మం, సంస్కృతుల పరిరక్షణ కోసం ,వనవాసుల హక్కుల రక్షణ కోసం బిర్సా ముండా అసమాన మైన కృషి చేశాడు. చోటా నాగపూర్ (ఇప్పటి జార్ఖండ్) ప్రాంతంలోని వనవాసులలో చైత న్యం కలిగించాడు. ఆంగ్లేయులతో సాయుధ పోరాటాన్ని సాగించి అమరుడైనాడు. ఆయన సాగించిన ఉద్యమం ఎన్నో విధాల సత్ఫలితా లను ఇచ్చింది. జిల్లా కలెక్టర్ల ద్వారా వన వాసుల భూమి హక్కుల సంరక్షణ, వివాదాల పరిష్కారం దిశగా చట్టాల రూపకల్పనకు మార్గమేర్పరిచింది.
నవంబర్ 15, 1875లో జార్ఖండ్‌లోని ఉలిహతూ గ్రామంలో బిర్సా ముండా జన్మించాడు. తల్లి కర్మీ, తండ్రి సుగనముండా. ఈ దంపతులకు వ•డవ సంతానంగా జన్మించాడు. బృహస్పతి వారం (గురువారం) నాడు జన్మించాడని బిర్సా అని నామ కరణం చేశారు. ‘‘ముండా జాతిలో భగవంతుడు జన్మిస్తాడు. నంద, యశోదల ఇంట పెరిగిన భగవానుడు మళ్లీ జన్మిస్తాడు. ముండా తెగ ప్రజలను యుద్ధసన్నద్ధులు గావించే పాంచజన్యం పూరిస్తాడు. నీల మేఘ వర్ణంలో జన్మించే ఆ బాలుడు నీలమేఘ శ్యాముడే’’ అని అంతకుమునుపు ఒకరోజు అక్కడి వారికి భవిష్యవాణి వినిపించింది. పుట్టగానే మన సంరక్షకుడు జన్మించాడని, భూదేవత (ధర్తీ కా ఆభా) వచ్చాడని పెద్దలు పేర్కొన్నారు. బిర్సా ముండా వనవాసి బాలుడే అయినా మంచి ప్రతిభా సంపన్నుడు, శాంత చిత్తుడు, కళ్ళు, ముక్కు చక్కగా ఆకర్షణీయంగా ఉన్న స్పుర ధ్రూపమతనిది. ఐదారేళ్లు రాగానే పెద్ద ఆకారంతో మరింత పెద్ద వయస్కుడిలా కనిపించేవాడు. ఆవులు, మేకలను మేపటానికి అందరు గోపాలకులతో పాటు అడవికి వెళ్లేవాడు. నేలపై అందంగా బొమ్మలు గీసేవాడు. చక్కగా మురళి వాయించేవాడు. ఆ దారిన పోయే వారు కాసేపాగి వినేవారు. చిన్నికృష్ణుడే మళ్లీ అవతరించా డని భావించేవారు. 1886లో చాయి బాసా నగరం లోని జర్మన్ లూథరన్ మిషన్ హైస్కూల్లో బిర్సా చేరాడు. అక్కడి ఫాదర్ నుట్రేట్ వంచనతో హిందు వులను క్రైస్తవులుగా మార్చడాన్ని, తాము తల్లిగా భావించే గోమాంసం వండించడాన్ని వ్యతిరేకించాడు. దాంతో పాఠశాల నుండి వచ్చేశాడు. ప్రతిస్పందనగా అతని మనసు ధార్మిక విషయాల వైపు మళ్లింది. మాతృ ధర్మ చింతన పెరిగింది.
కూలీగా పని చేస్తూ ఆనంద పాఢా అనే మున్షి వద్ద ధార్మిక శిక్షణ పొందాడు.’’నేనెవరిని? ఈ విశ్వం ఏమిటి ? నా బాధ్యత ఏమిటి? ధర్మమంటే ఏమిటి?– ఇలాంటి ప్రశ్నలకు సమాధానాన్ని అన్వేషించాడు. రామాయణం, మహాభారతం, హితోపదేశం, భగవద్గీత వంటి ధార్మిక గ్రంథాలను అధ్యయనం చేశాడు. చైతన్య మహాప్రభువు బోధనలను పాటిం చాడు. తన జాతి ప్రజలలోని వ•ఢనమ్మకాలను, అనాచారాలను, దురాచారాలను తొలగించి వారిని సంస్కరించాలనుకున్నాడు. నాలుగేళ్లు సుదీర్ఘ సాధన చేశాడు. తపోసాధన, ధ్యాన- ధారణాదుల సాధన చేసి గురువుగా అవతరించాడు. తెల్లధోవతీ స్థానంలో పసుపు రంగు బట్టలు ధరించి స్వామీజీ అవతార మెత్తాడు. యజ్ఞోపవీతం, నుదుట తిలకం ధరించాడు. కర్ర చెప్పులు (పాదుకలు) తొడిగాడు. అలా బిర్సా డేవిడ్ కాస్త ‘‘భగవాన్ బిర్సా ముండా’’గా అవతరించాడు.
‘‘క్రైస్తవ మతం మన మాతృ ధర్మానికి చెందినది కాదు. అది విదేశీ మతం. అది మనల్ని మన పూర్వికుల పరంపరకు దూరం చేస్తుంది. మనం మన హక్కులను సాధించుకోవాలి. సుఖమైన జీవనాన్ని పొందాలి. మన సంస్కృతి ఆధారంగా, మన మాతృభూమి మట్టి ఆధారంగా మనల్ని మనం సంస్కరించుకోవాలి. తులసి పూజ చేయాలి. గోమాతను పూజించాలి. గోహత్యను మానుకోవాలి. రామాయణం, మహాభారతం, భగవద్గీత, హితోపదేశం- వంటివి నిత్యం పారాయణం చేయాలి. విశుద్ధ జీవనాన్ని గడపాలి. మాంసాహారం మానుకోవాలి. శుచి-శుభ్రతను పాటించాలి. దైవచింతన చేయాలి. సత్య వ్రతమును పాటించాలి. దృఢమైన ధర్మ మార్గంలో జీవించాలి’’.. ఇలా దృఢమైన తన అభిప్రాయాలను ప్రజలకు బిర్సా ముండా బోధించసాగాడు. వనవాసీ ప్రజలకు ముండారి భాషలో కథల రూపంలో వినిపించాడు.
బిర్సా బోధనలు క్రమంగా ప్రజలను ఆకర్షించ సాగాయి. అనేకమంది ఆయనకు శిష్యులుగా చేర సాగారు. వ•డు లేదా నాలుగు రోజులపాటు ఉండి ప్రవచనాలు విని వెళ్లేవారు ‘‘చాలా కందా ‘‘అనే గ్రామంలో తన కేంద్రాన్ని బిర్సాముండా ఏర్పాటు చేసుకున్నాడు. ఒక్కోసారి అక్కడికి వేల మంది ప్రజలు వచ్చేవారు. ఇది ధార్మిక తుపానుగా మారింది. ఇది ఎప్పుడైనా తమ ప్రభుత్వ వ్యతిరేక, క్రైస్తవ వ్యతిరేక తుపానుగా మారే ప్రమాదం ఉన్నదని ఆంగ్లేయులు గమనించారు. బిర్సాముండా ఇంకా ఇలా చెప్పాడు .‘‘ఆంగ్లేయ ప్రభుత్వం కాల్పులు జరి పితే ఆ తూటాలు నీళ్ల చినుకులుగా మారిపోతాయి. మనం ఇకపై ఎవరికి పన్నులు చెల్లించనక్కరలేదు. మన భూములపై మనకు హక్కులు ఉన్నాయి.మన సర్దారీల సంఘర్షణకు మనమంతా సిద్ధంగా ఉందాం’’ అని బిర్సా ముండా పిలుపునిచ్చాడు.
భగవాన్ అవతారం
చాలా కందా గ్రామం కేంద్రంగా అనేక గ్రామాలు తిరుగుతూ ముండా తెగ ప్రజలను బిర్సా జాగృతం చేయసాగాడు. ప్రజలలో చైతన్యం వెల్లివిరిసింది. వేలాది ప్రజలు ఆయన దర్శనానికి రాసాగారు. గ్రామాలలో పర్యటిస్తుండగా ఒక అద్భుతం జరిగింది. ఆయన ఒక శిష్యునితో కలిసి ఒక గ్రామానికి వెళ్తున్నారు. అడవి గుండా ప్రయాణం. వర్షం మొదలైంది.రాను రాను అది పెరిగింది. ఉరుములు, మెరుపులు, భయంకరమైన శబ్దంతో బిర్సా ముండాపై పిడుగు పడింది. దాని వేడికి మాడిపోవలసిందే. కానీ ఆయనపై అది ఎలాంటి ప్రభావం చూపించలేకపోయింది. బదు లుగా నల్లగా మాడిపోవలసిన శరీరం బంగారంలా పచ్చగా మెరిసిపోయింది. దూరంగా పరిగెత్తిన శిష్యుడు ఈ దృశ్యాన్ని చూసి గ్రామస్తులకు వివరిం చాడు. అద్భుత మహిమలతో కూడిన దైవాంశగా బిర్సాను తాను చూసినట్లు తెలిపాడు.
వనవాసులలో స్వదేశీ చైతన్యం
బిర్సా ముండాధార్మిక ప్రవచనాలతో వనవాసులలో అద్భుతమైన చైతన్యాన్ని తీసుకొని వచ్చాడు. తమ పూర్వికుల గౌరవమాయ పరంపర గురించి వారికి గుర్తు చేశాడు. వారిలో స్వాభిమానాన్ని పెంపొందించాడు. తమ పరంపరాగత హక్కులను ఆంగ్లేయులు హరించిన వైనాన్ని వివరించాడు. కోల్పోయిన హక్కులను తిరిగి సాధించుకోవడానికి సాయుధ సంఘర్షణకు సిద్ధపడాలని పిలుపునిచ్చాడు. వనవాసులలో నూతన ఉత్సాహం వెల్లివెరిసింది. క్రైస్తవులుగా మారిన వనవాసులందరూ తిరిగి తమ మాతృధర్మంలోకి వచ్చేసారు. ఈ మార్పును చూసిన ఆంగ్లేయ ప్రభుత్వం, క్రైస్తవ మిషనరీలు హడలిపోయాయి. ఆయనను అరెస్టు చేయడానికి ఆంగ్లేయులకు తొత్తుగా వ్యవహరిస్తున్న జమీందారు జగ్మో హన్ సింగ్, క్రైస్తవ మతాధికారి రెవరెండ్ లాస్ట్ టి, ఇన్స్పెక్టర్ పూనుకున్నారు. ఎవరూ లేని సమయంలో చాలా కందా గ్రామానికి వెళ్లారు. నిద్రపోతున్న బిర్సాముండాను బంధించారు. ఏనుగు పై ఎక్కించి బన్గావు తీసుకుపోయారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే దిశగా ముండా తెగ వాసులను రెచ్చగొట్టాడనే అభియోగాన్ని ఆయనపై మోపారు. రెండేళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. నవంబర్ 30, 1897న జైలునుంచి విడుదల య్యాడు. ‘‘ఆంగ్లేయుల దమనకాండ నుంచి దేశానికి విముక్తి లభించినప్పుడే వనవాసులకు శాంతి చేకూరుతుంది. ఆంగ్లేయుల రాజ్యాన్ని కూకటివేళ్లతో సహా నేలకూల్చాలి. అందుకు వనవాసులను సంఘటితపరచాలి. సాయుధ సంఘర్షణకు దిగాలి’’ అని ఆయన భావించాడు.‘ఉల్ గులాన్’అని నినదిం చాడు. ఉల్ గులాన్ అంటే తిరుగుబాటుకు సంకల్పం అని అర్థం. ప్రభుత్వంలో అలజడి సృష్టించడానికి నిర్ణయించుకున్నాడు. డిసెంబర్ 24, 1899న రాత్రిపూట పోలీసు స్టేషన్లు, క్రైస్తవ మిషనరీ సంస్థలు, ఆంగ్లేయుల క్లబ్బులపై ఏకకాలంలో ప్రణాళికా బద్ధంగా దాడి చేశారు. అన్ని వైపుల నుంచి బాణాల వర్షం కురిపించారు. దాడికి దీటుగా స్పందించడానికి ఆంగ్లేయులకు ఆస్కారమే లేకుండా పోయింది. ఆ విధంగా 400 కిలోమీటర్ల సువిశాల క్షేత్రంలో ఆంగ్లేయ ప్రభుత్వాన్ని పూర్తిగా స్తంభింపజేశాడు. అప్పటి దాకా డోన్ బరిగ్రామంలో ఉన్న బిర్సా ప్రభుత్వానికి దొరకకుండా, రహస్యంగా గ్రామ గ్రామానికి తిరగసాగాడు. ముండా తెగవాసు లను చైతన్యపరచసాగాడు. బిర్సా ముండాను పట్టించిన వారికి పెద్ద మొత్తంలో బహుమానాన్ని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఈ ప్రలోభాలకు వనవాసులు ఎవరూ లొంగలేదు. ఎట్టకేలకు ఆచూకీ తెలుసుకున్న పోలీసులు రాత్రిపూట నిద్రిస్తున్న ఆయనను చడీచప్పుడు లేకుండా రాంచీకి తరలించారు. బిర్సా ముండా తీవ్రమైన రక్తపు వాంతుతో బాధపడ్డాడు. జూన్ 9, 1900న వైద్యం అందక తనువు చాలిం చాడు. వనవాసుల స్వేచ్ఛ కోసం,ధర్మం కోసం అమరుడైనాడు. ఆయన ఉపదేశాలతో ముండా తెగ వనవాసుల జీవితాలలో మంచి మార్పు చోటు చేసుకుంది. వారికి విద్య, వైద్యం అందుబాటులోకి వచ్చింది. వనవాసులలో సేవ-సహకార భావనలు పెంపొందాయి. ధార్మిక చైతన్యం విస్తరించింది. వ•ఢనమ్మకాలు తొలగిపోయాయి. నేడు అనేక రంగాలలో వారు ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. ఆయన భగవాన్ బిర్సాముండాగా చిరస్మరణీయుడైనాడు.
– తాడేపల్లి శివరామకృష్ణ
క్షేత్ర సంఘటన మంత్రి, వనవాసి కళ్యాణ పరిషత్