మందు అనేది ఒక రసాయన సమ్మేళనం మాత్రమే. అందులో మంచిమందు చెడ్డ మందు అని ఏమీ ఉండదు. ఈ మాటను అమెరికన్ న్యూరో సైంటిస్ట్, కొలంబియా యూనివర్శిటీ ప్రొఫెషర్ డాక్టరు కార్ల్హార్ట్ తన పుస్తకం ‘డ్రగ్ యూజ్ ఫర్ గ్రోన్ యుపిఎస్’లో వివరించాడు. శరీరానికి మందును అలవాటు చేస్తే దానికోసమే శరీరం చూస్తుంది. దాని విరుగుడు తిండిని తింటే శరీరం మళ్లా ఆ తిండికోసమే చూస్తుంది.
డయాబిటిక్, బి.పి. (బ్లడ్ ప్రెస్సర్) ఉన్నవారు కూడా తినడం, తినక పోవడం (పథ్యం) ద్వారా తగ్గించవచ్చని రసాయన సమ్మేళనానికి శరీరాన్ని అల వాటు చేస్తే తాత్కాలిక ఉపశమనమే గాని పూర్తిగా నయం చేయలేమని నవీన శాస్త్రవేత్తల వాదన, ఈ విషయాన్ని 17వ శతాబ్దంలో ‘భోజన కుతూ హలం’లో రఘునాథ సూరి తెలియజేశాడు.
అన్నమే ప్రాణాన్నిస్తుంది, అన్నమే సమస్త జీవులకు పోషణనిస్తుంది, ఆయుష్షునిస్తుంది. ఈ సృష్టి మొత్తాన్ని సంరక్షిస్తుంది. అన్నం లేకపోతే జీవి లేడు, జీవం లేదు, ప్రాణదాత అయిన అన్నానికి దణ్ణాలు చెప్పుకుంటూ సుమారు 350 సంవత్సరాల క్రితం ‘‘భోజన కుతూహలం’’ అనే గ్రంథాన్ని రఘునాథ సూరి సంస్కృతంలో 15 అధ్యాయాల గ్రంథంగా రాశాడు. ఇది అనేక ఆహార విషయాల సమాహారం.
హిపోక్రేటస్ అనే ప్రాచీన గ్రీకు వైద్య శాస్త్రవేత్త చెప్పినట్లు ‘లెట్ ఫుడ్ బి దై•• మెడిసిన్ అండ్ బి దై ఫుడ్’ ఆహారమే నీ మందు కావాలి. మందు కూడా ఆహారం కావాలి. మనం తీసుకునే ఆహారమే మనకు నిజమైన మందు. మనం ప్రతి రోజూ పోషకాలు ఉన్న సమతుల్య ఆహారం అంటే పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, ధాన్యాలు, మంచినీరు, మంచిగాలి స్వీకరిస్తూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే ఎక్కువకాలం ఆరోగ్యంగా జీవిస్తారు. రోగం వచ్చాక మందులు వాడటం కంటే రోగం రాకుండా మంచి పోషకాలు గల ఆహారం తినడమే ఉత్తమమైన మార్గం.
‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అనేది మన పెద్దలు చెప్పిన మాట. ఆ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనకున్న ఏకైకమార్గం సరైన ఆహారం తీసుకోవడం.
పూర్వికులు ప్రకృతి సిద్ధంగా లభించే పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, తృణధాన్యాలు ఎక్కువగా తినేవారు. వారు తీసుకొనే ఆహారంలోనే శరీరానికి కావలసిన విటమిన్లు, ఖనిజాలు వంటివి రోగ నిరోధకశక్తిని పెంచేవి. మరీ ముఖ్యంగా పసుపు, అల్లం, వెల్లుల్లి మన వం•ల్లో వాడడానికి కారణం రుచితో పాటు యాంటీ బయాటిక్స్‌గా పని చేస్తాయి. ఆకుకూరల్లోని పీచుపదార్ధం, అరుగుదలకు సహాయకారిగా ఉండి రక్తాన్ని వృద్ధి చేస్తుంది. ప్రధానంగా సమయానికి తినడం, తగినంత నీరు తాగటం అలవాటు చేసుకోవాలి.
నేడు జంక్ఫుడ్స్, పాస్ట్‌ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారం, అతి రసాయనాలు వాడిన పదార్థాలను తినడం వలన చిన్న వయస్సులోనే ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు, బి.పి. వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. అంటే ప్రస్తుతం ఆహారమే రోగంగా మారుతుంది. దీనికి కారణం సరైన పద్దతిలో ఆహారాన్ని తినకపోవడం.
పానుగంటి లక్ష్మీ నరసింహరావు ‘అభినవ చికిత్సా రత్నాకరము’ అనే పుస్తకానికి పీఠిక రాస్తూ మనం మనుషులం కావున రవంత బుద్ధి చేత ఆలోచించి యేదో వైద్యము చేసుకొందామను కుంటాము. పిల్లికి వైద్యము ఎవరు చెప్పిరి? గాడిద కెవరు చెప్పిరి? కుక్కకెవరు చెప్పిరి? గిలగిలలాడ జేయు కడుపునొప్పి రాగా పిల్లి ఒక విధమైన గడ్డి తిని వాంతి చేసుకొని కడుపునొప్పి ఆపుకొనును. కుక్కకు కాలిలో పుండునకు పురుగుపట్టగా అది నాకి నివృత్తి చేసుకొనును. నోటియందున్న ‘శలైవా’ (లాలా జలం)లో అట్టి పుండును మానుపగల గుణమున్నదని మన మెరుగుదుము. కాని కుక్క ఎట్లెరుగును? ఎవరు చెప్పినారు? అందుచే నేమనుకోవలెననగా, మానుపుకొను శక్తి శరీరములోనే యున్నది.
సాధారణముగా అందరూ వైద్యం ఎరిగిన వారే కడుపు నొప్పికి వాము వైద్యం. ఒకరు చెప్పవలెనా? తలనొప్పికి శొంఠి కొమ్ము గంధమని ఎవరు చెప్తారు. కరక్కాయ, లవంగం, పటిక పంచదార ముక్క ఒక్క తమలపాకుతో కలిపి నమిలితే దగ్గు తగ్గునని ఎవరు చెప్తారు. వరి బీజమునకు రవంత పుగాకు కట్టిన యా బాధ మాన్పును. జ్వరము పోగానే విరోచనమునకు ఔషధము వాడవలయును.
శరీరధారులందరకు చావునిక్కము. చావు రోగముచేగాని సిద్ధింపదు. అందుచేత శరీరము రోగ స్వభావము కలది. పైకెంతో యారోగ్యముగా ఉన్నను ఏదో ఒక రోగము బారినపడక తప్పదు. రక్త విరోచనములు అలనేరేడు పండుతో కుదిర్చెను. జముడు పాలతో నేత్రాం జనమును తయారు చేసెను. నారింజ పండ్లతో గోండ్రింపును తగ్గించి నారు చెన్నాప్రగడవారు. దురదృష్టం అయినా దీనిపై బాగా పరిశోధనలు జరగాలి. జబ్బు వస్తే మందులు తింటున్నారే తప్ప మంచి భోజనం తినడంలేదు. పూర్వం పథ్యం, లంకణం ద్వారా రోగాన్ని చాలా వరకు తగ్గించేవారు. ఇప్పుడది పూర్తిగా వదిలివేశారు.
ప్రాచీన భారతదేశంలో సమతుల్య ఆహారం ద్వారా ఆరోగ్యాన్ని పొందగలము అని తెలియజేస్తూ 17వ శతాబ్దంలో మహారాష్ట్రకు చెందిన రఘునాధ గణేష నవహస్త సూరి (1648-1712) సంస్కృతంలో ‘భోజన కుతూహలం’ అనే గ్రంథాన్ని రాశాడు. ఇతడు ప్రాచీన చరక సంహిత, సుశ్రుత సంహిత వంటి ఆయుర్వేద గ్రంధాలలోని ఆహార నియమాలను సామాన్యులకు సైతం అర్థమయ్యేలా సులభ శైలిలో క్రోడీకరించి మార్గదర్శిగా నిలిచాడు.
రఘునాధ సూరి మహారాష్ట్రకు చెందిన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు, ధర్మశాస్త్ర పండితుడైన అనంత దేవుని వద్ద శిష్యరికం ,చేశాడు. మహారాష్ట్రకు చెందిన సమర్ధ రామదాసు (ఛత్రపతి శివాజీ మహారాజ్‌కు గురువు) అత్యంత ఆప్తుడు, స్నేహితుడు. రామదాసు స్థాపించిన ‘చాఫల్ మఠం’ బాధ్యతలు కూడా నిర్వహించాడు.
తన ఆస్తిని 1683లో అల్లునికి ఇచ్చివేసి తంజావూరును పాలిస్తున్న మరాఠా రాజు ఏకోజీ (ఛ•త్రపతి శివాజీ సోదరుడు) భార్య అయిన మహారాణి దీపాంచిక ఆశ్రయంలో స్థిరపడ్డాడు. ఆమె ప్రోత్సాహంతోనే అనేక సంస్కృత గ్రంథాలను రాశాడు. రఘునాథసూరి సాహిత్య కుతూహలం, ప్రాయశ్చిత్త కుతూహలం, ప్రయోగరత్నభూషణ ధర్మామృత మహాదధి, నరకవర్ణన, వీటన్నింటిలోకి మంచి ప్రజాదరణ పొందిన గ్రంథం ‘‘భోజన కుతూహలం.’’ ఆయన రాసిన రాతప్రతులు నేటికీ తంజావూరులోని సరస్వతీ మహల్ లైబ్రరీలో ఉన్నాయి. భోజన కుతూహలం గ్రంథంలో ముఖ్యమైన ఆహార నియమాలు, వంటల పద్ధతులు, ఆయుర్వేద జీవనశైలి సూత్రాల వివరాలు ఉన్నాయి. ఇది ఒక ప్రాచీన ఆహా, ఆరోగ్య విజ్ఞాన గ్రంథం.
ఈ గ్రంథంలో 15 అధ్యాయాలున్నాయి. ప్రథమ పరిచ్ఛేదం మొదటి అధ్యాయంలో ఆహార పదార్థాల గుణాలు, ధాన్యాలు, పప్పు దినుసులు. ద్వితీయ పరిచ్ఛేదంలో, ఆహార భద్రత,భక్ష్యా భక్ష్య వివేచనం, విరుద్ధ ద్రవ్యప్రకరణం, భోజన విధి ప్రకరణం, క్షీర వర్గం, క్షీర వికృత ప్రకరణం, విరుద్ధ ద్రవ్య ప్రకరణం, మాంసాహార ప్రకరణం, 11వ అధ్యాయం జీర్ణశక్తిని పెంచడంలో అల్లం, కారెట్, ముల్లంగి వివిధ గడ్డదినుసుల పాత్ర, ఇక్షువర్గం (చెరుకు, బెల్లం పాత్ర). పానీయ ప్రకరణం (నీటి ప్రాముఖ్యత) మధువర్గం తేనె, తీపి , కృతాన్న వర్గం (వంటకాల తయారీ, సిద్ధాన్న ప్రకరణం) ఫలవర్గం.
‘‘ఇతి వ్యాస స్మరణాచ్ఛ భోజన ద్రవ్యాణి తద్గుణాచ్చోభిధీయ తేఖ’’ అంటూ వ్యాస భగవానుని స్మరిస్తూ, భోజన ద్రవ్యాలు వాటి గుణాలు చక్కగా వివరిస్తానని సంకల్పం చెప్పుకొని భోజనకుతూహలం గ్రంథాన్ని ప్రారంభించాడు పండిత రఘునాథ సూరి.
మొదటి ప్రకరణంలో భోజనం తయారీ, దాన్ని వడ్డించడం, తినడంలాంటి విషయాల్లోని శాస్త్రీయతను వివరించారు. రెండవ ప్రకరణంలో సవిషాన్న పరీక్ష అనేది ప్రాచీనకాలంలో ఆహారంలో విషాన్ని గుర్తించడానికి ఉపయోగించిన ఒక శాస్త్రీయ ఆయుర్వేదపద్ధతి. విషపూరితమైన ఆహారం వల్ల దాని రంగు రుచివాసన మారడం, ఉడికే విధానంలోని తేడాలను గుర్తించడం ద్వారా రాజుల, సామాన్యుల ప్రాణాలను రక్షించేవారు. ఈ ఆహారాన్ని పరీక్షించ డానికి కాకి, కోకిల, నెమలి, కోతి వంటి జంతువుల ప్రవర్తనను పరిశీలించేవారు, అలాగే వంటవాడి శారీరక, మానసిక మార్పులను బట్టి విషాన్ని పసిగట్టవచ్చని తెలియజేస్తున్నది.
మిగిలిన అధ్యాయాలలో ఈ శ్లోకం ప్రముఖంగా కన్పిస్తున్నది. ‘‘జీర్ణేహితం మితం చాద్యాత్ ఇత్యాయర్వేదోప దేశాత్ బోక్తవ్యం సఘృతం సోష్ణం హితమ్ పద్యం మిద్రం తధాఖ’’ అనే శ్లోకంలో ఎలాంటి ఆహారాన్ని తినాలనే విషయాన్ని వర్ణిస్తాడు. దీనిలో కొన్ని ముఖ్యమైన అంశాలున్నాయి. జీర్ణమయ్యే పదార్ధాలే తినాలి, అనారోగ్యానికి జీర్ణశక్తి వైఫల్యమే కారణం, హితాహారం, మితాహారం తీసుకోవాలి. అన్నంలో తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు ఈ ఆరు రుచులను ఉండేలా చూసుకోవాలి. సూరి, ఆహారానికి సంబంధించి నాలుగు సూత్రాలు చెప్పాడు. సఘృతం సోష్ణం హితమ్ పద్యం అంటే (1) కల్తీ లేని మంచి నెయ్యితో భోజనం (2) వేడిగా తాజాగా ఉన్న ఆహారం (3) శరీరానికి సరిపడే పదార్థాలను తెలుసుకొని తినడం (4) మోతాదెరిగి మితంగా తినడం. 3వ అధ్యాయం అశౌచ శుద్ధి ప్రకరణం, భోజన నియమాలను గురించి చర్చించింది.
నాలుగవ అధ్యాయం విరుద్ధ ద్రవ్య ప్రకరణం, ఏ ఆహార వస్తువుల కలయిక విషాహారంగా మారుతుందో వివరించాడు. పాలు-చేపలు, తేనె – వేడి పదార్థాలు, పాలు-పుల్లని పదార్ధాలు కలిపితింటే విషపూరితమై జీర్ణ కోశ సమస్యలు, చర్మ వ్యాధులు వస్తాయి. ఐదవది భోజనవిధి ప్రకరణం. సరైన భోజన సమయం, ఉపయోగించాల్సిన పాత్రలు అల్లం, సైంధవ లవణం తీసుకోవడం.
ఆరు, ఏడవ అధ్యాయాలు పానీయ ప్రకరణం – నీటి ప్రాముఖ్యత నిషిద్ధ జలాలు, వేడి నీళ్ళ వాడకం గురించి చర్చిస్తుంది. ఎనిమిదవ అధ్యాయం క్షీరవర్గం. పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి, వెన్నవంటి పాల ఉత్పత్తుల ఆయుర్వేద గుణాలు, వివిధ జంతువుల పాలవాడకం. ఆవు నెయ్యి, మధువర్గం తేనె, తీపి పదార్థాల వాడకం. పదవ అధ్యాయం మాంసాహార ప్రకరణం. వివిధ జంతువులు, పక్షులు, జలచరాల మాంసాల గుణాలు-వాటి ఆరోగ్య ప్రయోజనాలు, జలచరాల మాంసాల గుణాలు-వాటి ఆరోగ్య ప్రయోజనాలు – దోషాలు, సంప్రదాయ వంటకాల తయారీ విధానం. పదకొండవ అధ్యాయంలో అల్లం, క్యారెట్, ముల్లంగి, వివిధ గడ్డదినుసులు (దుంపలు), 12వ అధ్యాయం శాకవర్గం అనగా ఆకుకూరలు, కూరగాయలు గురించి చర్చించింది. 13వ అధ్యాయం తిలావర్గం.
ప్రధానంగా నువ్వులు, నువ్వు పిండి, తెలగపిండి వారి ఔషధ గుణాలను గురించి చర్చించింది. 14వ అధ్యాయం ఫలవర్గం (పండ్ల ప్రకరణ) చింతపండు, వెలగపండు, పనస పండు వంటి వివిధ పండ్ల ఆయుర్వేద గుణాల గురించి చర్చించింది. 15వ అధ్యాయం తాంబూల ప్రకరణం. భోజనానంతరం తాంబూలం సేవించడం వల్లకలిగే ఆయుర్వేద ప్రయోజనాలు, ఆరోగ్య సూత్రాలు ఈ విభాగంలో చర్చించారు.
చివరిగా ‘‘దాహపిత్తవమీ మేహా శోషఘ్నంచ రసాయనం’’ అని చెప్పాడు. అంటే అమలకి (ఉసిరి) పొట్టనిండా పోషకాలు నిండిన అమృత భాండం అని అర్థం. ఈ అమలకిని ఆహారానికి ముందు ఆహారంతోపాటుగానీ, ఆహారంగాగానీ లేదా ఆహారం తరువాత కూడా తీసుకోవచ్చును. కీళ్ళనొప్పులు, నడుంనొప్పి, పక్షవాతంలాంటి వాత వ్యాధులు, గ్యాసు, ఉబ్బరంగా ఉన్నవారికి అమలకి దివ్యౌషధం. దీని గుజ్జులో నువ్వుల నూనె కలిపి తీసుకున్నాక వేడినీళ్లు తాగితే ఫలితముంది. స్థూలకాయం, షుగరు వ్యాధి, ఉబ్బసం ఊపిరితిత్తుల వ్యాధులున్నవారు రోజుకు ఒకటి తింటే మేలు. కడుపులో మంట, అల్సర్స్, వాంతి, వేడిచేసిన లక్షణాలతో బాధపడేవారు, తేనె కలిపి తీసుకుంటే ఉపశమనం కలుగుతుందని భోజన కుతూహలంలో రఘునాథ సూరి తెలియజేస్తున్నాడు.

డా. కాశింశెట్టి సత్యనారాయణ
విశ్రాంత ఆచార్యుడు