భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీలో తృతీయ బహుమతి పొదిన రచన


డబ్బై యేళ్ల వయసులో కూడా ఆరోగ్యంగా తిరిగిన మాధవయ్య హఠాత్తుగా చనిపోయాడు. గాలిబుడగ జీవితం అనే ఎరుక ఉండదు మనుషులకి. వీలునామా ఏమీ రాయలేదు. పెద్దకొడుకు సుందరం పల్లెలోనే ఉండి వ్యవసాయం చేస్తూ తండ్రి పేరున ఉన్న ఆరెకరాలను పెంచలేకపోయాడు కానీ అమ్మేసుకోవాల్సిన పరిస్థితులు తలెత్తకుండా కాపాడుకొచ్చాడు. ఫలసాయంలో తమ్ముడు చంద్రానికీ, చెల్లి సుమతికీ వాటాలు పంచేసేవాడు.

చంద్రం పట్నంలో మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాడు. సుమతి తండ్రితోనూ, అన్న కుటుంబం తోనూ కలిసి ఉంటుంది. ఆమెకు పుట్టుకతోనే మతిస్థిమితం లేదు. మాట్లాడేది ఎవరికీ అర్థ్ధం కాదు. ఆమె సైగలతో ఏం చెప్పినా సుందరానికే అర్థం అవుతుంది. ఎప్పుడైనా పేచీ పెట్టినా సుందరం చెబితేనే వింటుంది. చిన్నతనంలో సుందరమే ఎత్తుకుని తిప్పేవాడు.

సుందరానికి ఒక కూతురు, ఒక కొడుకూ. పిల్ల పెద్దది.ఇంజినీరింగ్‌ ఆఖరు సంవత్సరం. చాలా బాగా చదువుతుంది. విదేశాల్లో పైచదువులు చదవాలని కోరిక. కానీ అదేమో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. సరస్వతి రాణించాలంటే లక్ష్మి తోడవ్వాల్సిన రోజులాయె. మన దగ్గర లేనిది ఆమెనే కదా అంటుంది •భార్య లక్ష్మి. తన వాటాకి ఆస్తి ఎక్కువ దఖలు పడితే కొంత అమ్మీ చదివించాలనే ఉంది సుందరానికి.

‘‘మా బాబాయ్‌ ‌కొడుకు విశ్వం అడుగుతున్నాడు. మన వసుధని ఇస్తే వాడి కొడుక్కి కాణీ కట్నం లేకుండా చేసుకుంటానని. ముడిపెట్టేద్దాం. పిల్లాడు బాగానే చదువుతున్నాడు కదా. కావాలంటే వాడిని నీ ఇష్ట ప్రకారం చదివించుకుందువుగాని’’

సుందరం అంతెత్తున లేచాడు.

‘‘ఆడపిల్లని వదిలించేసుకుందాం అని చూస్తున్నావా? దాని ఇష్టప్రకారం చదివించాల్సిందే’’

‘‘బాగుందయ్యా! అక్కడికేదో నువ్వు స్త్రీలని ఉద్దరించే సంస్కర్తవి, నేను చాందసురాలినీ అయి నట్టు. ఉన్న విషయం మాట్లాడాను. పొలంపుట్రా అమ్మేసి అలానే చదివించుకో. చాతనయితే పెద్దమనుషుల్ని కూర్చోబెట్టి ధర్మం ఏంటో నీ తమ్ముడికి విడమర్చి చెప్పించు’’

‘‘ఆస్తి మనకి ఎక్కువ ఇమ్మని పెద్దోళ్లు చెబితే బలవంతంగా ఒప్పుకుంటాడేమో. ఇష్టపూర్వకంగా ఇస్తాడా? రేపటి నుండి మన గడప తొక్కుతాడా? మన ఇంట్లో ఏ కార్యం జరిగినా రాడు. అలాంటి ఆస్తి మనకెందుకు?’’

అలాంటి మనిషి మన గడప తొక్కకపోతే మాత్రం ఏం అని అనాలనిపించినా ఊరుకుంది లక్ష్మి.

‘‘పెద్దాయన విల్లు రాసి చచ్చినా బాగుండేది’’ అంది. సుందరం కోపంగా చూసాడు.

‘‘అదే.. పోక ముందు రాసి ఉంటే బాగుండేది అంటున్నా’’ కోపంలో లేదా బాధలో ఉన్నపుడు మనిషికి తను ఉచ్ఛరించే మాటకుండే తీవ్రత తెలియదు.

దినానికి ఒకరోజు ముందే భార్య, కొడుకుతో కలిసి చంద్రం కారులో బయలుదేరాడు. తన స్నేహితుడైన ఒక లాయర్ని వెంటబెట్టుకొచ్చాడు. మంచివాడే కాదు..చెడ్డమనిషి కూడా లౌక్యంగా ఉండొచ్చు అనేది ఆ లాయర్తో మాట్లాడితే తెలుస్తుంది.

ఆస్తి అంతా మాధవయ్య స్వార్జితం.ఉన్న ఇల్లు తప్ప పిత్రార్జితం ఏమీ లేదు. కొంపదీసి ఏ విల్లో రాయలేదు కదా?…అని చంద్రం భయం.

‘‘రాసినా రిజిస్టర్‌ ‌చేసి ఉండరులే. చాలెంజ్‌ ‌చేద్దాం’’ అన్నాడు లాయరు.

చంద్రం భార్య రమకి ఎ.సి. కారులో కూడ ఊపిరాడ నట్టుంది. బావగారి కుటుంబా నికి ఆస్తి ఎక్కువ దక్కాలని ఆమెకి మనసులో ఉన్నా పైకి అనలేకపోయింది. ఒకసారి భర్తతో చూచాయగా అంటే ‘‘నీకు సంబంధం లేని విషయాల్లో తలదూర్చకు’’ అని కటువుగా హెచ్చరించాడు.

తోడికోడలు పిల్లలంటే రమకి చాలా ప్రేమ. ఎప్పుడైనా సెలవులకి తనే వాళ్లని పట్నం తీసుకెళ్లి పదిరోజులు ఇంట్లో పెట్టుకుని ఆప్యాయంగా చూస్తుంది.

‘‘సునీల్‌తో కలిసి పెట్టిన వ్యాపారం ఎలా ఉంది’’ అడిగాడు లాయర్‌.

‘‘‌చాలా బాగుందిరా! పెట్టుబడి ఎక్కువ చేస్తే ఇంకా బాగుంటుంది. వాడేమే నేను పెట్టలేను కావాలంటే నీ వాటా పెంచుకో అంటున్నాడు. ఇప్పుడు వచ్చే ఆస్తి అమ్మి మావాడిని కూర్చోబెడదా మనుకుంటున్నా. మావాడికి ఎలానూ చదువు ఎక్కడం లేదు’’ అన్నాడు చంద్రం.

‘‘నా వాటా నువ్వు తీసుకో అన్నయ్యా’’ అనే మంచి మనసు చంద్రానికి లేదు. సుమతికేమో ఏమీ తెలియదు. ఆస్తి అంటే ఏమిటో, అది తన పేరున రాయడం, ఏం చేసుకోవచ్చో తెలియదు. ఎంత ప్రేమ ఉన్నా సుందరానికి ఇచ్చేస్తే ఉపయోగం అనే విషయం ఇంక ఏం తెలుస్తుంది?

దిన మరుసటిరోజు సుందరం వాళ్ల బాబాయ్‌, ‌రాఘవరావు, మరో ఇద్దరు దగ్గర బంధువులూ సమావేశమయ్యారు. కాసేపు మాధవయ్యతో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ‘ఇంక అసలు విషయానికి రండి’ అన్నట్టు బాబాయ్‌ ‌వైపు చూసారు.

మంచి చెప్పేవాళ్లు, చెడగొట్టేవాళ్లు ఇలా రెండు రకాల మనుషులుంటారు. చెప్పినా వినకపోతే మన మర్యాద పోతుంది ఎందుకులే అని మౌనంగా ఉండేవాళ్లు మొదటి రకం. మీ అన్నయ్య సెంటిమెంట్‌ ఉపయోగిస్తాడేమో జాగ్రత్త అని హెచ్చరించారు రెండోరకం. సంప్రదింపులు అన్నీ తను అనుకున్నట్టు జరిగితే సరే లేకపోతే యుద్ధానికి సిద్ధపడి ఆయుధం కూడా తెచ్చుకున్నాడు చంద్రం.

ముప్పై లక్షల రూపాయలను వ•డు పదులుగా తన పేరునే బ్యాంకులో డిపాజిట్లు వేసాడు మాధవయ్య. ఒకో డిపాజిట్‌కి పిల్లల్ని ఒక్కొక్కరిని నామినీగా పెట్టాడు. సుమతిని నామినీగా పెడితే తదనంతరం ఇబ్బందులు వస్తాయని బ్యాంక్‌ ‌వాళ్లు చెబితే పెద్దకోడలి పేరు పెట్టాడు.

‘‘ఇప్పుడు సుమతి కోసం వేసిన డిపాజిట్‌ ‌సుందరానికి ఇచ్చేస్తే బాగుంటుంది. సుమతి బాగోగులన్నీ సుందరమే కదా చూస్తున్నాడు’’ అన్నాడు రాఘవరావు.

గుళ్లో పంతులుగారు..పురాణాల్లో అన్నదమ్ముల మధ్య అనుబంధాన్ని మైక్‌లో వివరిస్తున్నారు.

‘‘భోగభాగ్యాలు వదిలి అన్న వెంట అడవులకి పోయిన లక్ష్మణుడో, అన్నగారి పాదుకలకి పట్టాభిషేకం చేసిన భరతుడో కలియుగంలో ఉంటే అదృష్టమే. ధర్మపథాన్ని అనుసరించని అన్నగారిని వీడిన విభీషణుడి పాత్రా ఉదాత్తమైనదే’’

ఇలాంటివి వినడానికి బాగుంటాయి. కానీ చంద్రానికి అటువంటి ఆదర్శాలు, అభిమానం లేవు.

‘‘చెల్లెల్ని చూసిన మాట వాస్తవమే. కానీ ఆమె వాటా పంట వచ్చేది కదా?’’ అన్నాడు చంద్రం.

‘‘అది మేమెక్కడ వాడుకున్నాం చంద్రం. సుమతి పేరున ఖాతా తెరవడానికి బ్యాంక్‌ ‌నిబంధనలు ఒప్పుకోవట. మీ చెల్లి కోసమనే నా పేరున ప్రత్యేకంగా ఒక ఖాతా తెరిచి బ్యాంక్‌లో డిపాజిట్‌ ‌వేసేవారు మీ అన్నయ్య’’ అంది లక్ష్మి.

‘‘పంట ఎంత పండింది అని నేను ఎప్పుడూ లెక్కలు అడగలేదు. ఒకోసారి సరిగా పండలేదు అని చెప్పినా ఏమైనా ఆరా తీసానా?’’ తను చాలా ఉదాత్తుడ •నన్నట్టు చెప్పాడు చంద్రం.

‘‘అంటే మేము అబద్దం చెప్పామంటావా? కావాలంటే సుమతి వాటా డబ్బులు వేసిన బ్యాంక్‌ ‌పాస్‌బుక్‌ ‌చూసుకో. ఎంత వేశాం? సుమతి కోసం ఎంత ఖర్చు పెట్టాం? వివరాలన్నీ రాసి ఉంచాము’’ లక్ష్మికి కోపం వచ్చింది.

‘‘ఏరా మీ అన్నయ్య మీద నీకేమైనా అనుమానం ఉంటే చూసుకో’’ అన్నాడు బాబాయ్‌.

‘‘‌ఛ..ఛ.. అలాంటిదేం లేదు’’ అన్నాడు చంద్రం. తన మీద తనకే అనుమానం ఉంటుందేమో కానీ అన్నగారి మీద ఉండదు.

‘‘విషయం పెద్దది చెయ్యకు ’’భార్యతో అన్నాడు సుందరం.

‘‘అబ్బాయ్‌! ‌సుమతికి వచ్చిన పంట తాలూకు డబ్బు బ్యాంక్‌లో లక్ష్మి పేరున వేసారు కదా. వాటికి నామినీ ఎవరు?’’

‘‘నాన్న పేరే పెట్టాము’’ చెప్పాడు సుందరం.

‘‘ఇప్పుడు ఆ అకౌంట్‌, ‌పది లక్షల డిపాజిట్‌.. ‌సగం వాటికి సుందరంగారి పేరు, మిగిలిన సగానికి చంద్రంగారి పేరు నామినీగా పెడితే సరిపోతుంది’’ అన్నాడు లాయరు. అవునన్నట్టు తల ఊపాడు చంద్రం. ఇంత అన్యాయంగా ఉన్నాడేమిటా? అని అందరూ ఆశ్చర్యపోయారు.

పల్లెటూళ్లో ఇల్లు వ•డు వాటాలు వేసినా ఒరిగేదేముండదు.

‘‘ఇల్లు వదిలేద్దాంలెండి’’ అన్నాడు లాయరు. ఆహా ఏమి ఔదార్యం అని ముక్కున వేలేసుకున్నారు జనం.

‘‘నేను చెబితే సుందరం పట్ల పక్షపాతం చూపినట్టు అవుతుంది. నువ్వు మాట్లాడు’’ అని రాఘవరావుతో చెప్పి ఉన్నాడు బాబాయ్‌.

‘‘‌చంద్రం నాదో సలహా. ఇది మీ ముగ్గురికీ సంబంధించిన విషయం అయినా సుమతికి చెప్పినా ఉపయోగం లేదు. నువ్వు జీవితంలో బాగానే స్థిరపడావు. నీకు ఒక్కడే కొడుకు. వాడిని నీ వ్యాపారంలో పెట్టేద్దామని చూస్తున్నావని తెల్సింది. మీ అన్నయ్య పరిస్థితి అలా కాదు. భూమిని నమ్ముకుని బాగుపడని వాళ్లలో సుందరవ• ఒకడు. పిల్ల పైచదువులకి వెళతానంటోంది, తర్వాత పెళ్లి చెయ్యాలి. పిల్లాడు ఇంకా చదువులోనే ఉన్నాడు. ఇల్లు, డిపాజిట్ల సంగతి ఖరారు చేశారు కనుక పొలం విషయం మాట్లాడదాం. ఆరెకరాల్లో నాలుగు సుందరానికి, రెండు నీకు రాయిస్తే బాగుంటుందని అనుకుంటున్నాము’’

‘‘మరి చెల్లెలి సంగతేమిటి’’ అన్నాడు చంద్రం.

‘‘సుమతి పేరున ఆస్తి రాస్తే ఏమిటి ఉపయోగం? ఏ ఆస్తీ లేనపుడూ సుమతికి గార్డియన్‌గా సుందరమే ఉన్నాడు కనుక ఆమె వాటా సుందరానికి ఇవ్వచ్చు కదా’’ అన్నారు ఒకరు.

సుందరం ఒప్పుకోలేదు. భార్య తలపట్టుకుంది.

అలా రాయడం చంద్రానికి సుతారవ• ఇష్టం లేదు. అప్పుడు తనకి హక్కు పూర్తిగా పోయినట్టే కదా! అయితే తనకి చెడ్డపేరు రాకుండా అన్నగారే అడ్డుపడడంతో ‘హమ్మయ్య’ అని ఊపిరి పీల్చుకున్నాడు.

‘‘వీడెవడురా నాయనా. మాకు ఐదూళ్లు చాలు అన్న ధర్మరాజులా ఉన్నాడు’’ అని సుందరం గురించి అనుకున్నారు.

‘‘చంద్రం! ఆస్తి విషయంలో, సంపాదన విషయంలో నువ్వు మీ అన్నయ్యకన్నా మెరుగ్గా ఉన్నావు. ఇది వాస్తవమే కదా!’’ అన్నాడు బాబాయ్‌.

‘‘‌పట్నంలో నా ఇల్లూ, పడవలాంటి ఈ కారు చూసి ఏవేవో ఊహించు కోకండి. వీటికి నెలవారీ కిస్తీలు కట్టలేక చస్తున్నాను’’ అన్నాడు చంద్రం.

వాటికోసం చేసిన అప్పులు ఏనాడో తీరిపోయాయని భార్యకి తెలుసు. ఇంటి గురించి అందరికీ తెలుసు. కొన్న ఇళ్ల స్థలాలకి గృహప్రవేశం లాంటివి చెయ్యరు కనుక తెలీవు. పైగా నేను ఈ షేర్లు కొన్నాను, అక్కడ స్థలాలు కొన్నాను వాటి విలువ ఇంతగా పెరిగిపోయాయి అని తను గొప్పలు చెప్పుకోకపోవడం మంచిదయింది అనుకున్నాడు చంద్రం.

‘‘ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉన్న వాళ్లకన్నా వెనుకబడినవారికి ఎక్కువ ఆస్తి ముట్టజెప్పడం ధర్మం కదా’’ అన్నాడు రాఘవరావు.

దయార్ద్ర హృదయం చెప్పేవాడికి ఉంటే సరిపోదు, ఇచ్చేవాడికి ఉండాలి. ఇచ్చేవాడికి లేకపోతే, చెప్పేవాళ్లకి చెప్పింది అమలు చేసే అధికారం ఉండాలి.

మాట్లాడకుండా కూర్చున్న చంద్రం తరఫున వకాల్తా పుచ్చుకున్నాడు లాయరు.

‘‘చూడండి. డబ్బు సంపాదన అనేది ఒక్కొక్కరి తెలివితేటల్ని బట్టి ఉంటుంది. చంద్రం బాగా చదువుకున్నాడు. పెద్ద ఉద్యోగస్తుడయ్యాడు. తన తెలివితేటలతో స్నేహితుడితో కలిసి వ్యాపారం పెట్టి వృద్ధిలోకి వచ్చాడు. అంతమాత్రాన అతన్ని ఆస్తిపై హక్కు వదులుకోమనడం ఏం న్యాయం? సుందరం గారిని చదువుకోవద్దు అని ఎవరైనా చెప్పారా? వ్యవసాయం మీద ఆధారపడి డబ్బు కూడగట్టొద్దు అన్నారా? ఒకరు వృద్ధిలోకి రాకపోతే మరొకరు ఆ దురదృష్టాన్ని ఎందుకు మొయ్యాలి’’ అన్నాడు లాయరు.

ఆయుధాన్ని నెమ్మదినెమ్మదిగా పదును పెట్టుకుంటూ రమ్మని చంద్రమే చెప్పాడు.

‘‘అసలు నువ్వెవరవయ్యా ప్రతిదాంట్లో వేలు దూరుస్తావ్‌’’ అన్నాడు బాబాయి కోపంగా.

‘‘బాబాయ్‌. అతన్ని ఏమీ అనకు. నాకు మాట్లాడడం రాదనే అతన్ని తీసుకు వచ్చాను’’ అన్నాడు చంద్రం.

‘‘ఎవరు చెప్పారు నీకు సుందరం చదువుకోలేదని. డిగ్రీ చేసాడు తెలుసా. మంచి మార్కులతో పాసయ్యాడు. ప్రయత్నిస్తే పెద్ద ఉద్యోగమే వచ్చేది. మా అన్నయ్యే ఈ పల్లెటూరు వదలననీ, మీ అమ్మ కూడా లేదు, నన్ను వదిలేసి నువ్వు కూడా వెళ్లిపోతావా? అని సెంటిమెంట్‌తో సుందరాన్ని కట్టిపడేశాడు. సుమతి కోసం కూడా ఆగిపోయాడు వీడు…….’’ కోపం, బాధా కలగలిపిన స్వరంతో చెప్పాడు బాబాయ్‌.

‘‘‌నా కొడుకు వ్యాపారంలో ఏం సంపాదిస్తాడో తెలియదు. వసుధ విదేశాల్లో చదివి అక్కడే ఉద్యోగంలో కుదురుకుని బాగా సంపాదిస్తుందేమో! పిల్లాడు కూడా బాగా చదువుతాడని విన్నాను. మరి దేని గురించి మీ దిగులు’’ అన్నాడు చంద్రం.

తమ్ముడి మాటలకి నొచ్చుకున్నాడు సుందరం.

‘‘పిల్లల విషయాలు ఇప్పుడెందుకులే చంద్రం. రాఘవరావ్‌ ‌బాబాయ్‌! ఇం‌కా చర్చలు వద్దు. చట్టం ప్రకారం ఆస్తి వాటాలు పంచేసుకుంటాము’’ అని లేవబోయాడు సుందరం. బాబాయ్‌ ‌కూర్చోబెట్టాడు.

పల్లెల్లో బంధువులు తక్కువ, అత్మబంధువులు ఎక్కువ ఉంటారు. అలా దినానికి బాగానే ఖర్చయింది.‘‘ఖర్చులు ఎంత అయ్యాయో దినం అయిపోయాక చెప్పు అన్నయ్యా. నా వాటా ఇచ్చేస్తాను’’ అని చెప్పి ఉన్నాడు చంద్రం. ఆస్తి విషయంలో చంద్రం తగ్గేలా లేడని అర్థమయ్యి, కనీసం ఖర్చుల భారం అన్నా సుందరం మీద తగ్గిద్దామని ఆ మాట గుర్తు చేసాడు బాబాయ్‌.

‘‘అలాగే బాబాయ్‌. ‌వ•డోవంతు నేనిచ్చేస్తాను’’

‘‘వ•డోవంతు ఏమిట్రా, చెరి సగం కదా పెట్టుకోవలసింది’’ అర్థం కాక అడిగాడు బాబాయ్‌.

‘‘‌మరి సుమతి వాటా?’’ అన్నాడు చంద్రం.

తలిదండ్రులు మరణిస్తే ఖర్చులు కొడుకులు పెట్టుకోవడం ఆనవాయితీ. ఆడపిల్లకి పెళ్లయి వెళిపోతే వియ్యంకులు దినం రోజు స్వీట్‌ ‌ఖర్చుకని డబ్బు ఇస్తారు. వియ్యంకులు లేకపోతే కూతురు, అల్లుడూ ఇస్తారు.

‘‘అదంతా ఆస్తి మొత్తం కొడుకులకే చెందితే. కూతురికి పసుపు కుంకాల కోసం కొంత ఆస్తి ఇచ్చేవాళ్లు కానీ ఇలా సమాన వాటాలు వెయ్యరు. ఇప్పుడు ఆస్తి వ•డు వాటాలు చేస్తున్నారు కనుక మట్టి ఖర్చులు ముగ్గురూ భరించడమే న్యాయం’’ అన్నాడు చంద్రం.

భర్త తీరు చూస్తే అసహ్యం వేస్తోంది రమకి.

‘‘అక్కా! మావాళ్లు అప్పుడప్పుడూ ఇచ్చిన డబ్బుతో వ•డు తులాల బంగారం కొని మావాళ్ల దగ్గరే ఉంచాను. మీ మరిదికి తెలీదు. వసుధ పెళ్లికి పెడతాను. ఇంతకుమించి ఏం చెయ్యలేను. నన్ను క్షమించు’’ అని కళ్లనీళ్లు పెట్టుకుంది రమ. తోటికోడలు మంచితనం లక్ష్మికి తెలుసు.

చంద్రం కుటుంబంతో సహా వెళ్లిపోయాడు.

‘‘ఊళ్లో మంది బలాన్ని చూపించి నిన్ను లొంగదీసుకోవాలని చూసారు. చట్టాలే లేకపోతే నీకు ఎంత అన్యాయం జరిగేది’’ అన్నాడు లాయరు తిరుగు ప్రయాణంలో.

చట్టానికి కొన్ని పరిమితులు ఉంటాయి. చట్టాన్ని అమలు చేసే అధికారికి మనసు ఉండొచ్చు. కానీ చేతులు కట్టేసి ఉంటాయి. ధర్మానికి చట్టం ప్రత్యామ్నాయం కాజాలదు. చట్టం ఏదైతే తీర్పునిస్తుందో ఆ ప్రకారమే వాటాలు రాయించారు. చంద్రం ఈసారి వచ్చినపుడు రిజిస్టర్‌ ‌చేయించడమే మిగిలింది.

చట్టాన్ని చదివి, అర్థం విడమరిచి చెప్పి, అవసరమైతే అమలులో పెట్టడానికి చంద్రం పక్కన ఒక మనిషి నిలబడి ఉన్నాడు. ధర్మాన్ని అమలు చెయ్యడానికి సుందరం పక్కన ఎందరున్నా ఉపయోగం లేదు. ధర్మం నిర్వచనానికి అందనిది, చట్టంలాగా నిర్బంధంగా అమలు చెయ్యలేనిది, అందరికీ ఆమోదయోగ్యం అయితేనే ఆచరణలోకి వచ్చేది.

‘‘ఈ విషయం నలుగురిలో పెట్టకుండా నువ్వో, రాఘవరావు బాబాయో చంద్రాన్ని అడిగేస్తే పోయేది’’ అన్నాడు సుందరం. పల్లెల్లో ఏ విషయవ• దాగదు, ఆగదు. ఇప్పుడు ఊళ్లోవాళ్లంతా తనపై కురిపించే సానుభూతిని పక్కనపెడితే చంద్రాన్ని ఆడిపోసుకోవడం సుందరానికి కష్టం కలిగించింది.

‘‘చంద్రానికి ఆ వెరపేం ఉండదులే. తోలు మందం’’ అన్నాడు బాబాయ్‌.

‘‘‌పెద్దవాడిగా నేను ఆశించడమే తప్పు. ఆశించి భంగపడడం ఇంకా పెద్ద తప్పు’’ అన్నాడు సుందరం.

‘‘తోబుట్టువులు ఆస్తులు పంచుకోవడమే కానీ ఆప్యాయతలు పంచుకోవడం మానేశార్రా. సుమతి మాత్రం అదృష్టవంతురాలు’’ అన్నాడు రాఘవరావు.

సుందరానికి అర్ధం కాలేదు.

‘‘సుమతికి ఏది న్యాయం, ఏది అన్యాయం అనే మీమాంస లేదు. చట్టానికి లోబడి ఉండాలనే అయిష్టత ఉండదు, ధర్మం వైపు మొగ్గు చూపాలేమో అనే సందిగ్ధవ• లేదు. దేనిమీదా ఆశా, ఇది నాకు దక్కలేదే అనే నైరాశ్యవ• లేవు’’ సుందరం నవ్వాడు. ఈ లోకంలో మనఃస్థిమితం లేనివాళ్లకే మనశ్శాంతి ఉంటుందనే అర్థం ఉంది ఆ నవ్వులో.

అనిసెట్టి శ్రీధర్‌

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.