వార్తలకు ఒక విలువ ఉండాలి. మంచి వార్తకు గౌరవం, చెడు వార్తకు హెచ్చరిక చాలా అవసరం. ఈరోజుల్లో వార్తలు వింటున్నా, చదువుతున్నా మంచివార్తలు ఏమిటి, చెడువార్తలు ఏమిటి అనే కనీస వ్యత్యాసం కూడా శ్రోతలకు తెలియటంలేదు. దీనికి కారణం అదే వార్తలను ఒకటికి పదిసార్లు ప్రసారం చేయడం, నేరస్థులను గొప్పగా చూపటం, చివరికి నేరం ఎంత పెద్దదైనా న్యాయస్థానాలు వారికి క్షమాభిక్ష పెట్టడం. దీనివల్ల సభ్య సమాజం కృంగిపోతోంది. నిరపరాధుల బంధువులు, కుటుంబం కోర్టులు చుట్టూ తిరుగుతూ దోషులుగా మిగిలిపోతున్నారు
‘‘వార్త’’ అనేది కేవలం జరిగిన సంఘటనను చెప్పడం మాత్రమే కాదు. అది సమాజానికి దిశానిర్దేశం చేసే శక్తి. ఒక మంచి వార్త అనేక మందికి స్ఫూర్తినిస్తే, ఒక చెడు వార్త అప్రమత్తం చేస్తుంది. అయితే నేటి మీడియా ప్రపంచంలో మంచి-చెడులను ఒకే విధంగా చూపించడంవల్ల వాటి మధ్య ఉండాల్సిన విలువల తేడా చాలాసార్లు కనిపించకుండా పోతోంది.
అందుకే వార్తల ప్రసారంలో, వాటి రచనలో, వాటి వాచకంలో కూడా స్పష్టమైన భేదం ఉండాలనే ఆలోచనను మనం చర్చించాల్సిన అవసరం ఉంది.
మంచి వార్తలకు ప్రత్యేక స్థానం తప్పకుండా ఉండాలి. సమాజంలో ఎన్నో మంచి పనులు జరుగుతుంటాయి. ఒక రైతు కొత్త పద్ధతులతో అధిక దిగుబడి సాధించడం, ఒక విద్యార్థి జాతీయస్థాయిలో విజయం సాధించడం, ఒక వైద్యుడు పేదలకు ఉచిత సేవలు అందించడం, ఒక గ్రామం పర్యావరణ పరిరక్షణలో ఆదర్శంగా నిలవడం, ఇవన్నీ సమాజానికి ఆశను, ప్రేరణను ఇచ్చే వార్తలు.
ఇలాంటి వార్తలు పత్రికలో ప్రత్యేక రంగుతో, ఆకర్షణీయమైన, సౌమ్యమైన ఫాంట్లో, ప్రత్యేక కాలమ్‌లో ప్రచురిస్తే పాఠకుడు వాటిని సానుకూల దృష్టితో చదువుతాడు. ఉదాహరణకు, ఒక ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు జాతీయ విజ్ఞాన పోటీలో విజయం సాధిస్తే, వారి చిత్రాలు, వారి కృషి, ఉపాధ్యాయుల సేవలను ప్రధానంగా చూపించడం వల్ల మరెంతో మంది విద్యార్థులకు స్ఫూర్తి లభిస్తుంది.
చెడు వార్తలు కూడా అవసరమే,
నేరాలు, అవినీతి, ప్రమాదాలు, మోసాలు వంటి సంఘటనలను దాచిపెట్టడం సరైన జర్నలిజం కాదు. ప్రజలకు నిజాలు తెలియాలి. అయితే వాటిని సంచలనంగా కాకుండా బాధ్యతతో అందించాలి.
వార్తలలో నిర్ధారిత వాస్తవాలనే ఇవ్వాలి. ఆరోపణలు, దర్యాప్తు, కోర్టు తీర్పు వంటి అంశాలను స్పష్టంగా వేరు చేసి పేర్కొనాలి. ఉదాహరణకు, ఒక ఆన్లైన్ మోసంపై వార్త రాస్తే, కేవలం సంఘటనను చెప్పడం కాకుండా ప్రజలు ఎలా జాగ్రత్తపడాలో కూడా వివరించాలి. అప్పుడు ఆ వార్త సమాజానికి ఉపయోగపడుతుంది.
వార్త చదివే తీరు కూడా మారాలి. వార్త రాసే విధానం ఎంత ముఖ్యమో, చదివే లేదా వినిపించే విధానం కూడా అంతే ముఖ్యం. మంచి వార్తలను చదివేటప్పుడు స్వరంలో ఆనందం, గౌరవం, అభినందన కనిపించాలి. విజయాన్ని సాధించిన వారి కృషిని ప్రశంసించే భావం ఉండాలి.
అదే చెడు వార్తలను చదివేటప్పుడు సంచలన ధోరణి కాకుండా గంభీరత, బాధ్యత, అప్రమత్తత వ్యక్తమవ్వాలి. నేరాన్ని గొప్పగా చూపే విధంగా కాకుండా, అది సమాజానికి నష్టం కలిగించే చర్య అని స్పష్టంగా తెలియజేసే ధోరణి ఉండాలి.
మంచి పనికి గౌరవం, చెడు పనికి నిరసన చాలా అవసరం.
ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛతో పాటు బాధ్యత కూడా అవసరం. సమాజానికి మేలు చేసిన వ్యక్తులను గౌరవించడం ఎంత అవసరమో, చట్టవిరుద్ధమైన చర్యలను ఖండించడం కూడా అంతే అవసరం. అయితే ఈ ఖండన వ్యక్తిగత అవమానంగా కాకుండా, చట్టం, నైతిక విలువల ఆధారంగా ఉండాలి. నేరానికి సంబంధించి కేవలం ఆరోపణలు ఎదుర్కొంటున్న దశలో వ్యక్తులను దోషులుగా చిత్రీకరించడం తగదు. కోర్టు తీర్పు వచ్చే వరకు ప్రతి వ్యక్తికి చట్టపరమైన హక్కులు ఉంటాయి. జర్నలిజం కూడా ఈ సూత్రాన్ని గౌరవించాలి.
చిత్రాల వినియోగంలో బాధ్యత తప్పనిసరి
వార్తల్లో చిత్రాలు ప్రభావవంతమైన సాధనం. మంచి వార్తల్లో విజేతల చిరునవ్వులు, సేవా కార్యక్రమాలు, విజయ క్షణాలు ప్రజలకు ఆశను కలిగిస్తాయి.
నేర వార్తల్లో చిత్రాలను ఉపయోగించేటప్పుడు చట్టపరమైన, నైతిక ప్రమాణాలను పాటించాలి. విచారణలో ఉన్న వ్యక్తులను దోషులుగా చూపే విధంగా చిత్రాలను ఉపయోగించకూడదు. అలాగే బాధితుల గౌరవం, గోప్యతను కాపాడాలి.
మీడియా సమాజానికి దిక్సూచి, దీనిని ఎంతో బాధ్యతతో నిర్వహించాలి.
మీడియా కేవలం సమాచారం అందించే సాధనం కాదు. అది సమాజానికి దిశానిర్దేశం చేసే శక్తి. సంచలనానికి బదులుగా సత్యం, పక్షపాతానికి బదులుగా నిష్పాక్షికత, అవమానానికి బదులుగా బాధ్యత అనే విలువలు జర్నలిజానికి పునాది కావాలి. అందరికీ న్యాయం ఒక్కటేనని నిష్పక్షపాతంగా వ్యవహరించాలి.
జర్నలిస్టులు వార్తలను ముందుకు తీసుకు రావడమే కాకుండా, కొంత సమయం తరువాత ఆ వార్త ఎలా ముగిసింది, వాటికి న్యాయస్థానాలు ఎలాంటి తీర్పుని చ్చాయనేది తెలియ చేయాలి. ఇది కొంత కాలం పట్టినా, ప్రజలకు ఆ వార్తను గుర్తు చేసి దాని ముగింపు కూడా తెలిపే బాధ్యత తీసుకోవాలి. దీనివల్ల ప్రజలకు వ్యవస్థపై నమ్మకం, వార్తల మీద గౌరవం పెరుగుతుంది. సానుకూల సమాజం మనమే సృష్టించుకోవాలి. లేకపోతే గాలిలో వచ్చే ప్రతీ పోకడా సామాన్య ప్రజలు నిజమేనని నమ్మవలసివస్తుంది.
మంచిని గౌరవించడం, చెడును ఖండించడం అనేది వ్యక్తులపై ద్వేషాన్ని పెంచడం కోసం కాదు; సమాజంలో మంచి విలువలను బలపరచడం కోసం. చట్టపరమైన పక్రియను గౌరవిస్తూ, నిర్ధారిత వాస్తవాలను మాత్రమే ప్రజలకు అందిస్తూ, మంచి పనులను ఆదర్శంగా నిలబెట్టే జర్నలిజమే ప్రజాస్వామ్యానికి నిజమైన బలం. అలాంటి వార్తా సంస్కృతి ఏర్పడితే పత్రికలు, టెలివిజన్, డిజిటల్ మీడియా కేవలం సమాచార వేదికలుగానే కాకుండా, సమాజాన్ని సన్మార్గంలో నడిపించే మార్గదర్శకాలుగా నిలుస్తాయి.
చిన్నపనితో పెద్ద పరివర్తన
తింటే పెంట – పెడితే పంట, అనేది పశువుల (ముఖ్యంగా ఆవులు, గేదెలు) ప్రాధాన్యతను, వ్యవసాయంలో వాటి పాత్రను తెలియజేస్తుంది.
దీని అంతరార్థం చాలా స్పష్టమైనది.. రైతుకు పశువులు కేవలం మేత తినే జంతువులు మాత్రమే కావు, అవి ఇచ్చే పేడ సహజసిద్ధమైన ఎరువుగా మారి పంటలు పండడానికి, తద్వారా దేశానికి ఆహారం లభించడానికి కారణమవు తుందని ఈ సామెత చెప్తుంది. పశుపోషణ, వ్యవసాయం ఒకదానితో ఒకటి ఎలా ముడిపడి ఉన్నాయో చెప్పడానికి ఇదొక చక్కని ఉదాహరణ.
‘‘తింటే పెంట, పెడితే పంట’’ అనే ఈ సామెతలో జీవన సత్యం దాగి ఉంది. మనం తినే ఆహారం చివరికి వ్యర్థంగా మారుతుంది. కానీ అదే వ్యర్థాన్ని సరైన పద్ధతిలో వినియోగిస్తే అది పంటగా మారి మళ్లీ మన జీవితానికి ఉపయోగపడుతుంది. ఈ ఒక్క మాటలో ప్రకృతి చక్రం, వ్యవసాయ విజ్ఞానం, పర్యావరణ పరిరక్షణ అన్నీ ఇమిడిపోయాయి. ఈరోజుల్లో మనం అభివృద్ధి పేరుతో ఎన్నో మార్పులు స్వీకరిస్తున్నాం. కానీ వాటితో పాటు చెత్త ఉత్పత్తి కూడా పెరిగిపోతోంది. ముఖ్యంగా వంటింటి వ్యర్థాలు, ఆహార అవశేషాలు, పండ్ల తొక్కలు, కూరగాయల మిగులు భాగాలు పెద్ద మొత్తంలో చెత్తకుప్పల్లో చేరుతున్నాయి. ఒకప్పుడు గ్రామీణ జీవన విధానంలో ఇవన్నీ సహజంగానే ఎరువులుగా మారేవి. ఇప్పుడు అవి పర్యావరణ సమస్యలకు కారణమవుతున్నాయి. ప్రతి ఇంట్లో రోజూ కొంత ఆహార తప్పనిసరిగా వ్యర్థం అవుతుంది. మిగిలిన అన్నం, కూరగాయల తొక్కలు, పండ్ల మిగులు భాగాలు, టీ పొడి వంటి వాటిని సాధారణంగా చెత్తలో పడేస్తుంటాం. కానీ ఇవే పదార్థాలు కంపోస్ట్ తయారీకి ఉపయోగపడతాయి. అవి నేలలో కలిసిన తర్వాత సేంద్రియ ఎరువులుగా మారి మొక్కలకు పోషకాలను అందిస్తాయి. ఇప్పటి జీవన విధానంలో, ఫాట్స్‌లో మనం శ్రద్ధ పెట్టి ఆహార వ్యర్థాలను నేరుగా చెత్తకుప్పలో వేస్తున్నాము. దీనివలన తగిన రీతిలో వీటిని ఉపయోగించే అవకాశం లేదు.
మన పూర్వికుల జీవన విధానం ప్రకృతికి దగ్గరగా ఉండేది. ఇంటి దగ్గరే పశువులు ఉండేవి. పశువుల పేడ, ఇంటి ఆహార అవశేషాలు, ఎండిన ఆకులు కలిసి సహజ ఎరువుగా మారేవి. రైతులు రసాయన ఎరువులపై ఎక్కువగా ఆధారపడేవారు కాదు. నేల సారవంతంగా ఉండేది. పంటలలో రుచి, పోషక విలువలు కూడా ఎక్కువగా ఉండేవి. చిన్న స్థాయిలో అయినా ప్రతి కుటుంబం తడి చెత్తను వేరు చేసి కంపోస్ట్‌గా మార్చడం ప్రారంభిస్తే పెద్ద మార్పు సాధ్యమవుతుంది. ఒక చిన్న బకెట్, కొంత మట్టి, ఎండిన ఆకులు ఉంటే ఇంట్లోనే ఎరువు తయారు చేయవచ్చు. ఈ ఎరువుతో కూరగాయల మొక్కలు, పూల మొక్కలు పెంచవచ్చు. ఇది కేవలం వ్యవసాయానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు. ఆహారాన్ని వృథా చేయకుండా ఉండటం కూడా దీనిలో భాగమే. ప్రపంచవ్యాప్తంగా లక్షలమంది ఆకలితో బాధపడుతుంటే, మరోవైపు ఎంతో ఆహారం చెత్తలో పడిపోతుంది. మన ఇంటి వంటగది నుంచి ప్రారంభమయ్యే చిన్నమార్పు, సమాజంలో పెద్ద పరివర్తనకు దారితీస్తుంది. అందుకే ఆహారాన్ని గౌరవిద్దాం, వ్యర్థాన్ని తగ్గిద్దాం, ప్రకృతిని పరిరక్షిద్దాం.
డా।। జె.పి. భారతి కాజా