‘‘‌న దేవో వర్తతే కాష్ఠే న పాషాణే న మృణ్మయే, భావే హి వర్తతే దేవస్తస్మాద్భావో హి కారణమ్‌’’ అం‌టే దేవుడు కేవలం కర్రలోనో, రాయిలోనో, మట్టిలోనో లేడు. దేవుడు మన పవిత్రమైన ఆలోచనలలో, నమ్మకంలోనే ఉన్నాడు. మనలోని భక్తే ఆ విగ్రహానికి దైవత్వాన్ని ఇస్తుంది.. ఇవి ఆచార్య చాణుక్యుడి అమృత వాక్కులు. ప్రస్తుతం పవిత్రమైన దేవాలయాలు వ్యాపార సంస్థలుగా, పర్యాటక స్థలాలుగా మారుతున్న నేపథ్యంలో ఆధ్యాత్మిక భావం కంటే అక్కడ వినోదకరమైన వాతావరణానికే ప్రాధాన్యత ఉంటోంది. ఇతర ఏ మతాలలో లేని విధంగా స్వేచ్ఛ పేరుతో సనాతన ధర్మం సంస్కృతిని, సంప్రదాయాలను, దేవాలయాను కించపరిచే పోకడలు ఎక్కువవుతున్నాయి. దీనికి ప్రధాన కారణం హిందూ ధర్మంపై విశ్వాసం, నమ్మకం సన్నగిల్లడం. సమాజంలో ఎవరి నమ్మకాలు, విశ్వాసాలు వారికి ఉండవచ్చు. అయితే సహనానికి మారుపేరైన సనాతన ధర్మంపై ఉద్దేశ్యపూర్వకంగా ఏమిచేసినా, ఏమి వ్యాఖ్యానించినా ప్రశ్నించేవారుండరనే బరితెగింపు ఈ మధ్య ఎక్కువైంది. దీనికి లౌకికవాదం, సోషలిజం, పౌరహక్కు, ప్రాథమిక హక్కు, వాక్‌ ‌స్వాతంత్రం అంటూ భాష్యాలు చెబుతుంటారు. అయితే ఇదే తీరుగా ఇతర మతాలతో వ్యవహరించరు. అదే ఎవరైనా హిందూయేతర మతాలపై వ్యాఖ్యానిస్తే మాత్రం వారి మనోభావాలను కించపర్చారని రోడ్డెక్కుతారు. అదే సనాతన ధర్మం విషయానికి వస్తే మాత్రం పరమత సహనం అంటూ చిలుకపలుకులు చెబుతుంటారు. ఈ నేపథ్యంలో దేవాలయాల్లోకి అన్య మతస్తుల ప్రవేశంపై మద్రాసు హైకోర్టు చారిత్రాత్మకమైన తీర్పు ఇవ్వడం ఆహ్వానించదగ్గ పరిణామం. హిందూ మతంపై విశ్వాసమున్న వారినే ఆలయాల్లోకి అనుమతించాలంటూ తీర్పు స్పష్టం చేసింది.

మద్రాసు హైకోర్టు తీర్పు పూర్వపరాలను పరిశీలిస్తే దేశంలో పలు దేవాలయాలలో జరుగుతున్న ఘటనలు ఇలాంటి  తీర్పు ఆవశ్యకతను తెలియ జేస్తున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న కొన్ని సంఘటనలతో ఆలయాల పవిత్రత, ఆగమ సంప్రదాయాలకు అవమానాలు జరిగి, భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. తమిళనాడులోని అరుణాచలేశ్వర ఆలయ ప్రవేశ వివాదంపై 2026 అక్టోబర్‌లో మద్రాస్‌ ‌హైకోర్టు ఆలయ ఆగమ సంప్రదాయాలు, నిబంధనల పాటింపుపై కీలక ఆదేశాలు జారీ చేసింది. కేరళలోని గురువా•••ర్‌ శ్రీ‌కృష్ణ ఆలయ పవిత్ర తీర్థంలో సోషల్‌ ‌మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ ‌జాస్మిన్‌ ‌జాఫర్‌ ‌వీడియో చిత్రీకరణ సందర్భంగా కాళ్లు కడుక్కున్న ఘటన 2025 ఆగస్టులో వివాదానికి దారితీసింది. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌ ‌హర్‌కీ పౌడీ వద్ద అరబ్‌ ‌సంప్రదాయ దుస్తులు ధరించి వీడియో చిత్రీకరించిన ఇద్దరు యువకులను పోలీసులు 2026 జనవరి 14న అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి ఘటనలు పవిత్ర స్థలాల్లో సంప్రదాయాలు, నియమ నిబంధనలను గౌరవించాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తున్నాయి. ఆలయాలు కేవలం నిర్మాణాలు కావు.. కోట్లాది మంది భక్తుల విశ్వాసాలకు, తరతరాల సంప్రదాయాలకు ప్రతీకలు. అందువల్ల ఆలయాలకు వచ్చే ప్రతి ఒక్కరూ అక్కడి నియమాలను గౌరవించాలి. మతపరమైన ప్రదేశాలను వ్యక్తిగత ప్రచారానికి, వివాదాలకు వేదికలుగా మార్చకూడదు.

భారతదేశం కేవలం భౌగోళిక సరిహద్దులతో కూడిన దేశంకాదు. వేల సంవత్సరాల నాగరికత, సనాతన ధర్మ సంప్రదాయాలు, ఆధ్యాత్మిక చింతన, కళలు, శిల్పాలు, వాస్తుశాస్త్రం, భక్తి ఉద్యమాల సమ్మేళనమే భారతీయ సంస్కృతి. మన దేవాలయాలు కేవలం రాతి కట్టడాలు కావు. అవి తరతరాల విశ్వాసానికి ప్రతీకలు, కోట్లాది భక్తుల ఆరాధనా కేంద్రాలు, మన నాగరికతకు సజీవ సాక్ష్యాలు. అందుకే ఆలయాల పవిత్రతను, ఆగమ శాస్త్రాల ప్రకారం నిర్వహించే పూజావిధానాలను, శతాబ్దాలుగా వస్తున్న సంప్రదాయాలను కాపాడటం భారతీయ సమాజానికి సంబంధించిన ముఖ్యమైన బాధ్యత. ఈ నేపథ్యంలో తమిళనాడు ఆలయాల ప్రవేశంపై మద్రాస్‌ ‌హైకోర్టు తాజాగా వెలువరించిన తీర్పు దేశవ్యాప్తంగా చర్చకు దారితీయడంతో ప్రముఖ రాజకీయ నాయకుల ఆలయ సందర్శనల  వివాదాలు, మత మార్పిడులు-రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కూడా భారతీయ సంస్కృతి, రాజ్యాంగ హక్కుల మధ్య ఉన్న సంబంధం వంటి అంశాలు మరోసారి తెరమీదకొచ్చాయి.

ఆలయాల పవిత్రత, ఆగమ సంప్రదాయాల పరిరక్షణపై మద్రాస్‌ ‌హైకోర్టులో న్యాయమూర్తులు జి.ఆర్‌.‌స్వామినాథన్‌, ‌పి. మురుగన్‌లతో కూడిన డివిజన్‌ ‌బెంచ్‌ 2026 అక్టోబర్‌ 23‌న ఇచ్చిన తీర్పును హిందూ సమాజం స్వాగతిస్తోంది. మదురైలోని మీనాక్షి ఆలయంతో పాటు తమిళనాడులోని వివిధ ఆలయాల్లో చోటుచేసుకున్న పరిణామాలను ప్రస్తావిస్తూ ఆగమ సంప్రదాయాలను అనుసరించే ఆలయాల్లోకి ప్రవేశించాలనుకునే ఇతర మతాల వారు సంబంధిత దైవంపై తమకు విశ్వాసం, గౌరవం ఉన్నట్లు లిఖితపూర్వకంగా అంగీకరించాలని, ఆలయ ఆచారాలు, సంప్రదాయాలను పాటించడానికి సమ్మతించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. మదురై స్థానిక ఎమ్మెల్యే బద్రుద్దీన్‌ ‌ముస్తఫా ఇస్లాం సంప్రదాయ టోపీ ధరించి పర్యవేక్షణ పేరుతో మీనాక్షి అమ్మవారి ఆలయంలోకి ప్రవేశించి గోపురాలపైకి వెళ్లిన అంశంతోపాటు,తిరువణ్ణామలై అరుణాచ లేశ్వర ఆలయంలో ఇతర మత చిహ్నాలతో కొందరు ప్రవేశించారనే వివాదాలను కూడా న్యాయస్థానం ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఈ తీర్పు ఆలయాల ఆచార వ్యవహారాలు, భక్తుల విశ్వాసాలు, మతపరమైన ప్రదేశాల పవిత్రతను గౌరవించాల్సిన బాధ్యతను మరోసారి గుర్తుచేసింది. దేవాలయం ఒక సాధారణ పర్యాటక ప్రాంతం కాదు. అక్కడి విగ్రహారాధన, పూజా విధానాలు, నైవేద్యాలు, ఉత్సవాలు, ధ్వజస్తంభం నుంచి గర్భగుడి వరకు ఉన్న ఆచార వ్యవస్థలకు ప్రత్యేకమైన ధార్మిక ప్రాధాన్యత ఉంటుంది. ఆలయాన్ని సందర్శించే వ్యక్తి అక్కడి నియమాలను గౌరవించాలి. ఒక క్షేత్రానికి వెళ్లడం ప్రచారానికి, రాజకీయ ప్రదర్శనకు, వ్యక్తిగత ప్రతిష్ఠ పెంచుకోవడానికి వేదికగా మారకూడదు.

హిందూ ఆలయ ప్రవేశాలకు సంబంధించి రాజకీయ వివాదాలు కొత్తవి కావు. ఓట్ల రాజకీయాల కోసం, పరపతి కోసం హిందూ దేవాలయాలను అస్త్రంగా మార్చుకునే సంప్రదాయం ఒకవైపు, సనాతన ధర్మాన్ని అవహేళన చేయాలనే లక్ష్యం మరోవైపు వివాదాలుగా మారుతున్నాయి.  దేశంలో అత్యున్నత పదవులు నిర్వహించిన నాయకులు, అంతర్జాతీయ ప్రముఖులు ఇలాంటి వివాదాలకు కేంద్రబిందువైన ఘటనలు దేశంలో ఉన్నాయి. 1984లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఒడిశాలోని ప్రసిద్ధ పూరి జగన్నాథ ఆలయాన్ని సందర్శించి నప్పుడు ఆమెకు ప్రవేశాన్ని అక్కడి ఆలయ నిర్వాహకులు నిరాకరించారు. ఇందిరా గాంధీ పార్సీ మతస్థుడైన ఫిరోజ్‌గాంధీని వివాహం చేసుకున్నారనే కారణంతో ఆలయ సంప్రదాయాల పరిరక్షకులు ఆమె ప్రవేశాన్ని వ్యతిరేకించారు. దీంతో ఆమె ఆలయం లోపలికి వెళ్లకుండా సమీపంలోని రఘునందన్‌ ‌గ్రంథాలయం వద్ద నుంచి ప్రార్థనలు చేశారు. ఈ ఘటన ఒక ముఖ్యమైన ప్రశ్నను ముందుకు తెచ్చింది. ఒక వ్యక్తి రాజకీయంగా ఎంతటి ఉన్నత స్థానంలో ఉన్నా, ఆలయ సంప్రదాయాల విషయంలో ప్రత్యేక మినహాయింపు కోరవచ్చా? అనే ప్రశ్నకు చట్టబద్ధమైన సంప్రదాయాలను వ్యక్తి హోదా ఆధారంగా మార్చకూడదనే సమాధానాన్ని పూరి ఘటన ఇచ్చింది. ప్రధాని అయినా, ముఖ్యమంత్రి అయినా, సామాన్య భక్తుడైనా సంబంధిత ఆలయ నిబంధనలను గౌరవించాల్సిందే.

1988లో నాటి ప్రధాని రాజీవ్‌గాంధీ నేపాల్‌ ‌పర్యటన సందర్భంగా ఆయన సతీమణి సోనియా గాంధీకి ఖాట్మండులోని పశుపతినాథ్‌ ఆలయ అంతర్భాగంలోకి ప్రవేశం నిరాకరించిన ఘటన కూడా అప్పట్లో చర్చకు వచ్చింది. హిందూయే తరులకు ఆలయ అంతర్భాగంలోకి ప్రవేశం కల్పించకూడదనే అక్కడి సంప్రదాయమే ఇందుకు కారణంగా పేర్కొన్నారు. ఈ ఘటన భారత్‌-‌నేపాల్‌ ‌సంబంధాలపై కూడా ప్రభావం చూపించే అవకాశాలున్నా ఆ ప్రభుత్వం వెనకడుగు వేయలేదు. ఉమ్మడి ఏపీలో, కాంగ్రెస్‌ ‌ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి ఆలయ దర్శనానికి సోనియాగాంధీ వచ్చిన సందర్బంగా కూడా ఆమె డిక్లరేషన్‌పై వివాదం చెలరేగింది.

2017 గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ ‌నాయకుడు రాహుల్‌గాంధీ సోమనాథ్‌ ఆలయాన్ని సందర్శించినప్పుడు ఆయన పేరు ఆలయంలోని హిందూయేతరుల రిజిస్టర్‌లో నమోదు చేసిన ఘటన నాటి  జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. రాహుల్‌గాంధీ ఇటీవల ఎన్నికల సమయాల్లో తాను హిందువునని చెబుతూ తన కులగోత్రాల గురించి వ్యాఖ్యానించడం పరిపాటిగా మారింది.  చివరికి ఆయన ఎన్నికల స్టంటు ఎక్కడిదాకా వెళ్లిందంటే తాను శివుడిని పూజిస్తానంటూనే ఇతర దేవుళ్లను తక్కువ చేసి మాట్లాడే స్థితికి వచ్చింది. అవకాశవాద రాజకీయాల కోసం హిందూ మతాన్ని, దేవుళ్లను వాడుకోవడం సనాతన ధర్మంపై విశ్వాసం లేనివారికి పరిపాటిగా మారిపోయింది.  ఆంధప్రదేశ్‌లో 2024 సెప్టెంబరులో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ ‌కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వై.ఎస్‌. ‌జగన్‌మోహన్‌ ‌రెడ్డి తిరుమల పర్యటన కూడా వివాదానికి కేంద్ర బిందువైంది. ఆయన ఆలయంలోకి ప్రవేశించే ముందు శ్రీవారిపై విశ్వాసాన్ని ప్రకటించే డిక్లరేషన్‌ ఇవ్వాలని ఇతర పార్టీలు డిమాండ్‌ ‌చేశాయి. ఆయన భద్రతా కారణాలను చూపుతూ పర్యటనను విరమించుకున్నారు.

ఇక్కడ వివాదం నేతలు ఏ మతాన్ని పాటిస్తున్నారన్నది కాదు. తిరుమలవంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో అమలయ్యే డిక్లరేషన్‌ ‌నిబంధనలు ఎవరికైనా ఒకే విధంగా వర్తిస్తుందనే విషయాన్ని రాజకీయనేతలు విస్మరించడమే వివాదానికి దారి తీస్తోంది. ఆలయానికి వచ్చే ప్రతివ్యక్తి రాజకీయాలకు అతీతంగా అక్కడి సంప్రదాయాలను గౌరవించాలనే ప్రాథమిక సూత్రాన్ని ఉద్దేశ్యపూర్వకంగా విస్మరిస్తుండ డంతో వివాదాలు రేగుతున్నాయి.

ఆలయ సంప్రదాయాల విషయంలో విదేశీ ప్రముఖులకు కూడా ప్రత్యేక మినహాయింపులు లేవు. పలు మార్లు వివాదాలు రేగాయి. 2005లో థాయ్‌లాండ్‌ ‌యువరాణి మహా చక్రి సిరింధోన్‌  ‌పూరి జగన్నాథ ఆలయాన్ని సందర్శించి నప్పుడు, విదేశీయులకు ప్రవేశం కల్పించకూడదనే సంప్రదాయం కారణంగా ఆమె ఆలయం వెలుపలి నుంచే దర్శనం చేసుకున్నారు. 2006లో స్విట్జర్లాండ్‌కు చెందిన క్రైస్తవ న్యాయవాది ఎలిజబెత్‌ ‌జిగ్లర్‌ ‌జగన్నాథ ఆలయానికి సుమారు రూ.1.78 కోట్ల విరాళం ఇచ్చినప్పటికీ, ఆమెకు ఆలయంలోకి ప్రవేశం కల్పించలేదు. విరాళం ఇచ్చినంత మాత్రాన ఆలయ ప్రవేశానికి సంబం ధించిన సంప్రదాయాలు మారవని ఈ ఘటన నిరూపిం చింది.

సంప్రదాయం, మత స్వేచ్ఛపై ఇటీవల న్యాయ స్థానాలు ఇస్తున్న తీర్పులు అన్య మతస్తులకు చెంపపెట్టుగా మారుతున్నాయి. హిందూ దేవాలయాల్లోకి అన్య మతస్తుల ప్రవేశంపై మద్రాసు కోర్టు తీర్పు కంటే ముందు సుప్రీం కోర్టు… మతం మారినవారికి రిజర్వేషన్లు చెల్లవని ఇచ్చిన తీర్పు కూడా ప్రలోభాలకు, ఓటు బ్యాంకు రాజకీయాలకు గొడ్టలిపెట్టు. మత మార్పిడులకు రిజర్వేషన్లు చెల్లవని పేర్కొంటూ 2026 అక్టోబర్‌ 15‌న సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు మతమార్పిడులను ప్రోత్సాహించే మిషనరీలకు, దేశ, విదేశీ ఎన్జీఓలకు కళ్లెం వేసింది. దీంతో అలాంటి సంస్థలు సనాతన ధర్మంపై, సంప్రదాయాలు, సంస్కృతి, దేవుళ్లు, పురాణాలపై ఎక్కడ అవకాశం వస్తే అక్కడ తమ అక్కసును వెళ్లగక్కుతుండడంతో పలు వివాదాలు రేగుతున్నాయి. వీటిని కూడా అరికట్టవలసిన సమయం ఆసనమైంది.

ఆలయ ప్రవేశంపై మద్రాస్‌ ‌హైకోర్టు తీర్పు, మత మార్పిడి-రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వేర్వేరు చట్టపరమైన అంశాలకు సంబంధించినవి. ఒకటి ఆలయ సంప్రదాయాలు, మతస్వేచ్ఛ, దేవాలయ నిర్వహణ గురించి కాగా, మరొకటి సామాజిక వర్గాల గుర్తింపు, రిజర్వేషన్ల అర్హతల గురించి. అయినప్పటికీ ఈ రెండు తీర్పుల్లోనూ ఒక సాధారణ సందేశాన్ని గుర్తించవచ్చు. హక్కులు, సంప్రదాయాలు, ప్రయోజనాలు అన్నీ చట్టబద్ధమైన ప్రమాణాలకు లోబడి ఉండాలి. ఇతర సంప్ర దాయాలను గౌరవించేలా ఉండాలి. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం నియమ నిబంధనలను మార్చడం లేదా అర్హతలేని వారికి ప్రత్యేక మినహా యింపులు కల్పించడం ప్రజాస్వామ్యస్ఫూర్తికి విరుద్ధమని ఈ రెండు చారిత్రాత్మక తీర్పులతో స్పష్టమైంది.

ద్రావిడ రాజకీయాలకు పేరుగాంచిన తమిళనాడులో, మత మార్పిడిలకు పుట్టినిల్లు అయిన కేరళ రాష్ట్రంలో స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం సనాతన ధర్మం సంస్కృతి, సంప్రదాయాలపై పెద్ద ఎత్తున విషం జిమ్ముతూ దాడులు జరుగుతున్న వేళ మద్రాసు హైకోర్టు తీర్పు ఆహ్వానించదగ్గ పరిణామం. ఇదే తీర్పును దేశవ్యాప్తంగా అన్ని దేవాలయాలకు కూడా వర్తింపచేయాలి. ఇదే సందర్భంలో యావత్‌ ‌హిందూ సమాజం నుండి మరొక డిమాండ్‌ ‌కూడా విని పిస్తుంది.

దేవాలయాలను ఆదాయ వనరులుగా మార్చుకున్న ప్రభుత్వాలు వాటి నుంచి వచ్చే నిధులను హిందూ ధర్మ పరిరక్షణ కోసం కాకుండా వేరే అవసరాల కోసం పక్కదారి పట్టిస్తున్నాయి. హిందూయేతర మతాలకు చెందిన ప్రార్థనా స్థలాల అభివృద్ధికి, అక్కడి సిబ్బంది జీతభత్యాలకు, వారి పండుగలకు నిధులు కేటాయిస్తున్న ప్రభుత్వాలకు వాటి నుండి ఎటువంటి ఆదాయం లభించడంలేదు. అదే సమయంలో హిందూ దేవాలయాల నుండి భారీగా నిధులు వస్తున్న నేపథ్యంలో దాన్ని కేవలం సనాతన ధర్మపరిరక్షణకే ఖర్చు చేయాల్సిన ప్రభుత్వాలు ఇతర అవసరాలకు మళ్లిస్తున్నాయి. దేవాలయాల్లో సంప్రదాయాన్ని గౌరవించేవారికే ప్రవేశం, మతం మారిన వారికి రిజర్వేషన్ల రద్దు తరహాలో ఆలయా నిధుల వినియోగంపై కూడా హిందూ సానుకూల నిర్ణయం రావాలని సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్న వారు డిమాండ్‌ ‌చేస్తున్నారు.

మన దేవాలయాలు మన చరిత్రకు ప్రతీకలు. ఆలయ పవిత్రతకు రక్షణ కల్పిస్తూ, సంప్రదాయాలను గౌరవిస్తూ సమన్వయంతో ముందుకు సాగినప్పుడే భారతీయత మరింత బలపడుతుంది. అదే సాంస్కృతిక జాతీయవాదానికి నిజమైన అర్థం. అదే ఐక్యతతో కూడుకున్న, శక్తిమంతమైన భారతదేశానికి, జాతీయవాదానికి బలమైన పునాది అవుతుంది. దీన్ని మరింత పటిష్ట పరిచేలా  ఇటీవల మద్రాసు కోర్టు ఇచ్చిన తీర్పు సంప్రదాయాలకు, సంస్కృతికి రక్షణ కవచంగా నిలబడుతుంది.

– శ్రీపాద

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.