అతివృష్టి, అనావృష్టుల దోబూచులాటల మధ్య నీటి సంక్షోభం నానాటికి పెరిగిపోతూనే ఉంది. అందుబాటులో ఉన్న కొద్దిపాటి నీటి నిర్వహణ, సంరక్షణ కత్తి మీద సాములాగా మారిపోయింది. ఇలాంటి పరిస్థితులలో ప్రపంచవ్యాప్తంగా సంప్రదాయ పద్ధతులలో నీటిని కాపాడుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంటున్నది. ఈ సందర్భంగా మనదేశంలో సంప్రదాయ జల నిర్వహణ ఊపందుకుంటున్నది.
ముందుగా తెలుగు ప్రాంతాల విషయానికి వస్తే, కాకతీయులు పాలించిన భౌగోళిక ప్రాంతంలో గోదావరి, కృష్ణ వంటి జీవనదులు, వాటి ఉపనదులైన పెన్‌గంగ, కడెం, స్వర్ణ, మానేరు, ప్రాణహిత, వైరా, కిన్నెరసాని, పాలేరు, మున్నేరు, ఆకేరు దిండి వంటి నదులు ప్రవహిస్తున్నాయి. సముద్ర మట్టానికి తక్కువ ఎత్తులో ఈ నదులు ప్రవహిస్తున్నాయి. అయితే వీటికి సమీపంలోని వ్యవసాయ భూములు మాత్రం 200 నుండి 650 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. అందువల్ల, వ్యవసాయ అవసరాల కోసం ఈ నదీ జలాలను నేరుగా ఉపయోగించుకోవడం సాధ్యం కాలేదు. ఇక్కడి భూములు పాక్షికంగా బీడు (సెమీ-ఎరిడ్) స్వభావం కలిగి ఉంటాయి. కృష్ణ, గోదావరి నదులు తమ సామ్రాజ్యం గుండా ప్రవహిస్తున్నప్పటికీ, భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా కాలువల ద్వారా నీటి పారుదల వ్యవస్థ ఇక్కడ సరిపడదని కాకతీయ రాజులు గుర్తించారు. ఈ సవాలును అధిగమించేం దుకు వారు ‘చెరువుల ద్వారా నీటి పారుదల’ (••అ• ఱతీతీఱస్త్ర••ఱశీఅ) విధానాన్ని ఎంచుకున్నారు. వ్యవసాయ అవసరాల కోసం నీటిని నిల్వ చేయడానికి, ప్రవాహాన్ని క్రమబద్ధీకరించడానికి, చెరువుల నిర్మాణానికి ఈ ప్రాంతపు భూస్వరూపం వర్షపాత సరళి ఎంతో అనువుగా ఉన్నాయి. దేవాలయాల పక్కనే చెరువులను నిర్మించడం కాకతీయుల ప్రత్యేకత. వీరి కాలం నాటి చెరువులలో, ప్రసిద్ధ రామప్ప దేవాలయం పక్కన ఉన్న రామప్ప చెరువు, పాకాల చెరువులు వాటి పరిమాణం దృష్ట్యా ఎంతో ముఖ్యమైనవి. ఇటువంటి చెరువులు కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితం కాకుండా, కాకతీయ సామ్రాజ్యం అంతటా విస్తరించి ఉన్నాయి. దీనివల్ల వ్యవసాయం విస్తరించడమే కాకుండా, సామ్రాజ్యంలోని అన్ని ప్రాంతాలు సమానమైన ఆర్థికాభివృద్ధిని సాధించాయి. కాకతీయ పాలకులు ఘనపురం చెరువును (ప్రస్తుతం దీనిని ములుగు ఘనపూర్ చెరువు అని పిలుస్తారు) నిర్మించారు; ఇది 1,620 హెక్టార్ల విస్తీర్ణంలో ఉండి, 1,430 మిలియన్ క్యూబిక్ అడుగుల (ఎమీ••) నీటిని నిల్వ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీని పరివాహక ప్రాంతం (బేసిన్) నుంచి 602 మిలియన్ క్యూబిక్ అడుగుల నీరు లభిస్తుంది. వరంగల్ సమీపంలోని ఘనపురం, రాజవరం చెరువులను అనుసంధానించే ఘనపూర్ రిజర్వాయర్ మట్టి ఆనకట్టను ఇటీవల ఆధునీకరించారు. 1.5 ట్రిలియన్ క్యూబిక్ మీటర్ల సామర్థ్యంతో ఉన్న ఈ ఆనకట్ట 8.06 కిలోమీటర్ల పొడవు, 15 మీటర్ల ఎత్తు కలిగి ఉంది. ఈ చెరువు నీటితో పండించిన వరి ధాన్యం ప్రత్యేకమైన రుచికి ప్రసిద్ధి చెందింది. సాగునీటి అవసరాలను తీర్చడం కోసమని చెరువులను ఒకదానితో ఒకటి అనుసంధానించి , ఒక సంక్లిష్టమైన గొలుసు వ్యవస్థను కాకతీయ రాజులు ఏర్పాటు చేశారు. సాగు భూములకు సాధ్యమైనంత ఉత్తమమైన నీటిపారుదల సౌకర్యాలను అందించేందుకు, అవసరాన్ని బట్టి కాలువలు, బావులు నిర్మించారు. వారి హయాంలో నీటి నిర్వహణ విధానాలు, పద్ధతులు పూర్తిగా శాస్త్రీయంగా ఉండేవి. కాకతీయ పాలకులు అభివృద్ధి చేసిన నీటిపారుదల వ్యవస్థలను తర్వాతి పాలకులు విస్మరించారు. ఆధునిక కాలంలోకి అడుగుపెట్టేసరికి, ఆ వ్యవస్థల స్థానంలో పెద్ద ఆనకట్టలు వచ్చాయి. నీటిపై నియంత్రణ కొరవడింది. పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా తాగునీరు, సాగునీరు అవసరాలను తీర్చడంలో సంప్రదాయ విధానాలను వినియోగించుకోవాలనే ఆలోచన పాలకులకు లేకుండా పోయింది. ఎల్‌నినో లాంటి విపత్తులు మానవాళికి ముప్పుగా మారుతున్నాయి. అయితే అతివృష్టి లేకుంటే అనావృష్టి లాంటి ప్రతికూల వాతావరణంలో మానవ మనుగుడ నానాటికి దుర్లభంగా మారిపోతోంది. నీటి అవసరాలు తీర్చుకోవడానికి ఎండాకాలంలో బావిని తవ్వుకుంటాం అనే ధోరణి సరికాదు. స్థానిక ప్రభుత్వాలు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవాలి. కాకతీయ పాలకుల నాటి నీటి నిర్వహణ పద్ధతుల నుంచి స్ఫూర్తి పొందాలి. నగరం, పట్టణం, గ్రామం అనే తేడా లేకుండా అందరి అవసరాలను తీర్చేలా నీటిపారుదల వ్యవస్థలను పునరుద్ధరించాల్సిన సమయం ఆసన్నమైంది.
కాలపరీక్షకు నిలిచిన జోహద్
చాలా కాలంగా నీటి కొరత అనేది మానవ నాగరికతలకు ఒక సవాలుగా మారిపోయింది. ముఖ్యంగా వర్షపాతం తక్కువగా, అస్థిరంగా ఉండే ప్రాంతాలను నీటి ఎద్దడి పీడిస్తోంది. అయినప్పటికీ రాజస్థాన్ బీడు భూములలో జోహద్ అనే ఒక పురాతనమైన నీటి నిర్వహణ పద్ధతి కాలపరీక్షకు నిలబడింది. శతాబ్దాల కాలంగా సరళమైన, అద్భుతమైన నిర్మాణాలుగా జోహద్లు వాసికెక్కాయి. నీటి కొరత సమస్యను అవి నిశ్శబ్దంగా పరిష్కరిస్తున్నాయి. ఇటీవల కాలంలో వాటి పునరుద్ధరణ జోహద్ల చారిత్రక ప్రాముఖ్యతకు నివాళిగా నిలిచింది. అంతేకాకుండా మన ఆధునిక ప్రపంచంలో సంప్రదాయ నీటి నిర్వహణ వ్యవస్థల శాశ్వతమైన ఔచిత్యానికి ఒక జ్ఞాపికగా కూడా మారింది. జోహద్ (పోఖర్ లేదా ఇంకుడు చెరువు) అనేది ఒక చిన్న, నెలవంక ఆకారంలో ఉండే మట్టి ఆనకట్ట. దీనిని సంప్రదాయకంగా గ్రామంలోని సహజ నీటిపారుదల మార్గాలలో నిర్మిస్తారు. ఈ నిర్మాణాలు వర్షపు నీటిని పట్టి, నిల్వ చేసే విధంగా జోహద్లు ఉంటాయి. అలా లేని పక్షంలో వర్షపు నీరు వృథా అయిపోతుంది. తరచుగా నేల కోతకు కారణమవుతుంది. భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా నీరు లేకుండా పోతుంది. నీటి ప్రవాహ వేగాన్ని జోహద్లు కట్టడి చేస్తాయి. అలా నిలబడిపోయిన నీరు భూమిలోకి ఇంకడానికి వీలు కల్పిస్తాయి. ఇది భూగర్భ జలవనరులను పునరుజ్జీవింప జేస్తుంది. వర్షాభావ కాలంలో కూడా ప్రజలకు నీటి లభ్యతను నిర్ధారిస్తుంది. మట్టి, రాళ్లు వంటి స్థానికంగా లభించే పదార్థాలతో నిర్మితమైన జోహద్లు వర్షపు నీటిని సేకరించడానికి తక్కువ ఖర్చుతో కూడిన, పర్యావరణ పరంగా స్థిరమైన మార్గంగా నిలుస్తున్నాయి. వీటిని పల్లపు ప్రాంతాలలో వ్యూహాత్మకంగా నిర్మిస్తారు. తద్వారా నీటి సేకరణను గరిష్ఠ స్థాయికి పెంచుతారు. ప్రతి నీటి చుక్కా విలువైనదే అయిన ప్రాంతాలలో అవ•ల్యమైన వర్షపు నీటి నష్టాన్ని కూడా నివారించవచ్చు. జోహద్లకు వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉంది. కరవుతో అల్లాడిపోతున్న తమ ప్రాంతాలలో సమర్థవంతమైన నీటి సంరక్షణ ఆవశ్యకతను రాజస్థాన్‌లోని వ్యవసాయ వర్గాలు మొట్టమొదటగా గుర్తించాయి. సుదీర్ఘమైన పొడి కాలాలు, అనూహ్యమైన రుతుపవనాలతో కూడిన ఈ ప్రాంతపు ప్రత్యేక వాతావరణం, స్థిరమైన నీటి సరఫరాను కొనసాగించడాన్ని కష్టతరం చేసింది. అనాదిగా నీటి కొరత సవాళ్లను స్థానిక వ్యవసాయ వర్గాలు ఎదుర్కొం టున్నాయి. ఆ క్రమంలో నీటి వనరుల నిర్వహణ కోసం ఒక వికేంద్రీకృత, సావ•హిక పరిష్కారం కోసం నడుం బిగించాయి. జోహద్లను నూతనంగా రూపొందించి, అభివృద్ధి చేశాయి. జోహద్లకు 14వ శతాబ్దంలోనే బీజం పడింది. కానీ వాటి విస్తృత వినియోగం 18, 19వ శతాబ్దాలలో ప్రాచుర్యం పొందింది. రాజస్థాన్‌లోని గ్రామాలు ఈ నీటి సేకరణ వ్యవస్థలను నిర్మించడం ప్రారంభిం చడంతో, జోహద్కు సంబంధించిన జ్ఞానాన్ని అనేక తరాలు పరంపరాగతంగా అందుకుంటూ వస్తున్నాయి. కేవలం నీటిని సేకరించే సాధనాలుగా మాత్రమే కాకుండా, గ్రామీణ జీవనంలో ఒక భాగంగా జోహద్లు మారాయి. ఈ వ్యవస్థలను నిర్మించడానికి, నిర్వహించడానికి, అవి సాధించిన విజయాన్ని జరుపుకోవడానికి గ్రామీణులు ఏకమయ్యేవారు. ఉమ్మడి వనరులను మానవ శ్రేయస్సుకు, మనుగడకు పునాదిగా భావించే గ్రామీణ రాజస్థాన్ సహకార స్ఫూర్తికి వారు ప్రతిరూపంగా నిలిచారు. జోహద్లు బావులు, చెరువులను నింపడమే కాకుండా, చుట్టుపక్కల నేలను కూడా పునరుజ్జీవింపజేస్తాయి. ఫలితంగా, రాజస్థాన్‌లోని కఠినమైన ఎడారి వాతావరణంలో కూడా పంటలు పండించగలిగే ఒక సమృద్ధమైన పర్యావరణ వ్యవస్థ ఏర్పడుతుంది. అలాగే, సాంప్రదాయ పునశ్చరణ వ్యవసాయ పద్ధతులు కూడా వర్ధిల్లుతూనే ఉంటాయి. ఆధునిక పర్యావరణ సవాళ్లకు ప్రాచీన జ్ఞానాన్ని ఎలా అన్వయించవచ్చో చెప్పడానికి జోహద్ల పునరుద్ధరణ ఒక ఉజ్వలమైన ఉదాహరణగా నిలుస్తోంది. వాతావరణ మార్పుల ప్రభావాలు, వనరుల క్షీణతతో సతమతమవుతున్న ప్రపంచంలో, జోహద్ల పునరుద్ధరణ నీటి కొరతకు ఒక సుస్థిరమైన, తక్కువ ఖర్చుతో కూడిన పరిష్కారాన్ని అందిస్తుంది. సహజవనరుల పరిరక్షణ, సామాజిక భాగస్వామ్యం, పర్యావరణ పునరుద్ధరణకు ప్రాధాన్యతనిస్తూ, నీటి నిర్వహణకు ఒక సంపూర్ణమైన విధానాన్ని ఈ సంప్రదాయ నిర్మాణాలు అందిస్తున్నాయి.
బిహార్ ప్రాచీన జల జీవనాధారం ఆహార్-పైన్ వ్యవస్థ
ఒకప్పుడు దక్షిణ బిహార్‌లోని సురుంగబిఘా సమతల వ్యవసాయ భూములలో, ఎండిపోయిన జలాశయం గతకాలపు వైభవానికి గుర్తుగా ఉండేది. అదే సమయంలో చిన్న కమతాను సాగు చేసే రైతులు అభివృద్ధి చేసిన ‘ఆహార్-పైన్’ సంప్రదాయ నీటిపారుదల వ్యవస్థను పట్టించుకునేవారు లేకుండా పోయారు. ఫలితంగా దాని చుట్టూ ఉన్న భూమి బీడుగా మారింది. ఒకప్పుడు నీరు ప్రవహించిన చోట కలుపు మొక్కలు గుంపులు గుంపులుగా మొలిచాయి. ఇది వలసవాద కాలానికి ఒక స్పష్టమైన గుర్తుగా స్థానిక రైతుల హృదయాలలో నిలిచిపోయింది. ఆ రోజుల్లో బ్రిటిష్ వారు రుద్దిన ‘‘ఆధునిక’’ నీటి పారుదల పద్ధతులు, భూ విధానాలు, సావ•హికంగా నిర్మించుకున్న వ్యవస్థలను, ఒకప్పుడు ఈ భూములను సారవంతంగా ఉంచిన జ్ఞానాన్ని తోసిరాజన్నాయి. కానీ ఇటీవల కాలంలో సురుంగబిఘాలోని ఆహార్ మళ్లీ జీవాన్ని సంతరించుకోవడం ప్రారంభించింది. ఒకప్పుడు బీటలు వారిన ఆహార్ ప్రస్తుతం 450కి పైగా చెట్లకు, దాని అంచుల వెంబడి ఒక పచ్చని కారిడార్‌కు నిలయంగా మారింది. పిల్లలు, పెద్దలు ఐక్యంగా పనిచేయడానికి కారణమైంది. వారి సావ•హిక భాగస్వామ్యానికి కేంద్రమైంది. దక్షిణ బిహార్‌లో వ్యవసాయాన్ని, దైనందిన జీవితాన్ని ఆహార్-పైన్ నీటిపారుదల వ్యవస్థ 2,000 సంవత్సరాల పైచిలుకు కాలంలో తీర్చిదిద్దింది. దీనిని మగధ రాజవంశం కాలంలో అభివృద్ధి చేశారు. వర్షాకాలం, వేసవి కాలం రెండింటిలోనూ నీటిని నిల్వ చేయడానికి, పంపిణీ చేయడానికి, సంరక్షించడానికి రూపొందించారు. ఇది అనాదిగా సావ•హికంగా నిర్వహించే ఒక నీటి వ్యవస్థగా నిలిచిపోయింది.
వ్యవస్థలో రెండు ప్రధాన భాగాలు
ఆహార్: సేకరించిన వర్షపు నీటిని లేదా మళ్లించిన నదీ జలాలను నిల్వ చేయడానికి వ•డు వైపులా గట్లుతో నిర్మించిన జలాశయాన్ని ఆహార్ అంటారు.
పైన్: నదులు లేదా వాగుల నుంచి నీటిని ఆహార్లలోకి, వాటి మధ్య, చుట్టుపక్కల పొలాలకు తీసుకువెళ్లే నీటి మళ్లింపు కాలువను పైన్ అంటారు. ఇవి ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి. నీటి నిల్వ, పంపిణీ వ్యవస్థను ఏర్పరుస్తాయి. ఇది ఒక సరళమైన, అద్భుతమైన రూపకల్పనగా అబ్బురపరుస్తుంది. నీటి నిల్వ సామర్థ్యం తక్కువగా ఉండటం, ఒకదాని తర్వాత ఒకటిగా వచ్చే వరదలు, కరవుల వల్ల దక్షిణ బిహార్‌లో వ్యవసాయం నిరంతరం సవాలుగా మారింది. అటువంటి చోట, ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేసుకోవడానికి ఈ వ్యవస్థ వీలు కల్పిస్తుంది.
ఆహార్-పైన్ వ్యవస్థ దక్షిణ బిహార్‌లోని రైతులకు, పర్యావరణ వ్యవస్థలకు రెండింటికీ జీవనాధారం కల్పిస్తుంది. ఏటవాలుగా ఉన్న ప్రాంతాలలో వర్షపు నీటిని, నదీ ప్రవాహాన్ని కట్టడి చేస్తుంది. దానిని జలాశయాలలో నిల్వ చేస్తుంది. కాలువల ద్వారా నీటిని పంపించడం ద్వారా, నీటి కొరత ఉన్న ప్రాంతాలలో కూడా స్థిరమైన నీటిపారుదలని ఈ వ్యవస్థ అందిస్తుంది. దీని ద్వారా ఉపయోగించని నీరు తిరిగి నదులలోకి ప్రవహిస్తుంది. భూగర్భ జలాలను పునరుద్ధరిస్తుంది. నీటిని సంరక్షిస్తుంది. స్థానికంగా వర్థిల్లుతున్న సంప్రదాయ జలవిజ్ఞానానికి మద్దతు ఇస్తుంది. ఆ విధంగా ప్రకృతి సిద్ధమైన ఒక సహజ వలయాన్ని పూర్తి చేస్తుంది.
ప్రధాన ప్రయోజనాలు
పోషకాలు అధికంగా ఉన్న నీటి మడుగులను సృష్టించడం ద్వారా నేల సారవంతాన్ని ఆహార్-పైన్ వ్యవస్థ మెరుగుపరుస్తుంది. పంట దిగుబడులను పెంచుతుంది. మిలీనియం వాటర్ స్టోరీ నివేదిక ప్రకారం, పటేసర్ గ్రామంలోని రైతుల అభిప్రాయంలో, కాలువలు లేదా భూగర్భ జలాలు వంటి ఇతర వనరుల నుంచి వచ్చే దిగుబడులతో పోలిస్తే, ఆహార్-పైన్ వ్యవస్థ ద్వారా వచ్చే దిగుబడులు 1.5 నుండి 2 రెట్లు ఎక్కువగా ఉంటాయి. అదనపు వర్షపు నీటిని కొట్టుకు పోనివ్వకుండా జలాశయాలలోకి మళ్లించడం ద్వారా వరద నష్టాన్ని తగ్గిస్తుంది. జలాశయాలు, కాలువల చుట్టూ ఉన్న సూక్ష్మ పర్యావరణ వ్యవస్థలను పరిరక్షించడం ద్వారా జీవవైవిధ్యానికి మద్దతు ఇస్తుంది.
బహుళార్థ సాధక జలాశయాలు
ఆహార్-పైన్ వ్యవస్థకు చెందిన జలాశయాలు సంవత్సరంలో 4 నుంచి 5 నెలలు మాత్రమే నీటితో నిండి ఉంటాయి. మిగిలిన సమయంలో రైతులు వాటిని పంటలు పండించడానికి, పశువులను మేపడానికి ఉపయోగిస్తారు. ఆహార్లు తక్కువ ఖర్చుతో కూడుకున్నవి, మన్నికైనవి. గ్రామీణ ప్రాంతాలలో రైతులకు అన్ని విధాలుగా ఆలంబనగా నిలిచేవి. ఆహార్-పైన్‌లను స్థానికంగా లభించే సామగ్రితో నిర్మిస్తారు. వాటి నిర్వహణ కూడా అత్యంత సులభంగా ఉంటుంది. ఇవి అధిక దిగుబడులు, ఆదాయానికి దారితీస్తాయి కాబట్టి రైతులకు ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటాయి. ఇవి వాతావరణ మార్పులను తట్టుకునే సామర్థ్యాన్ని పెంపొందించడంలో సాయపడతాయి. నేలలో తేమను మెరుగుపరచడం, నీటి లభ్యతను పెంచడం ద్వారా, వరదలు, కరవులను ఎదుర్కోవడంలోనూ సాయపడతాయి. ఒకే నీటి వనరుపై వివిధ వర్గాల ప్రజలు ఆధారపడి ఉంటారు కాబట్టి, జలాశయాల గట్టు నిర్వహణకు, నీటి పంపిణీ నిర్వహణకు, ప్రయోజనాలను సమానంగా పంచుకోవడానికి వారంతా కలసికట్టుగా పనిచేస్తారు. దీంతో సామాజిక ఐక్యత బలపడుతుంది. అనేక ఆధునిక నీటిపారుదల పద్ధతు తరహాలో జల దోపిడీకి ఆహార్-పైన్ వ్యవస్థ ఆస్కారమివ్వదు.ఇది సహజసిద్ధమైన ప్రకృతి వలయంతో కలిసి పనిచేస్తుంది, వ్యవసాయ అవసరా లను పర్యావరణ వ్యవస్థ ఆరోగ్యంతో సమతుల్యం చేస్తూ సామాజిక బంధాలను బలపరుస్తుంది. తరతరాలుగా, ఈ వ్యవస్థ వ్యవసాయ జీవనోపాధికి మద్దతు ఇవ్వడమే కాకుండా సామాజిక ఐక్యతను కూడా పెంపొందించింది. అనేక గ్రామాలలో ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చింది.వారి మధ్య సహకారం, భాగస్వామ్య బాధ్యతలతో పాటుగా, సావ•హికంగా వారు తీసుకునే నిర్ణయాలను ప్రోత్సహించింది.
– జాగృతి డెస్క్