హైదరాబాద్ రాజకీయ చిత్రపటంపై నవంబర్ 2వ తేదీన బీజేపీ పతాకం మరింత విస్తృతంగా రెపరెపలాడింది. పాతబస్తీలోని చార్మినార్ వద్ద గల భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి మధ్యాహ్నం మొదలై.. సాయంత్రం మొజంజాహి మార్కెట్ వరకు సాగిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన, ఆయన ప్రసంగ పటిమత పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. వచ్చే ఎన్నికల వైపు కమలం పార్టీ వేస్తున్న తొలి బలమైన అడుగుగానే రాజకీయ వర్గాలు దీనిని అభివర్ణిస్తున్నాయి.ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కొనసాగిస్తామని అమిత్ షా స్పష్టం చేశారు.
కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని, ఆ వెంటనే చార్మినార్ సమీపంలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాతబస్తీ గడ్డపై నుంచే తన రాజకీయ పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఇది యాదృచ్ఛికమేమీ కాదన్న విశ్లేషణలు మొదలయ్యాయి. పాతబస్తీలో ఎంఐఎంకు ఉన్న పట్టును సవాల్ చేసే సంకేతంగా రాజకీయ పరిశీలకులు ఈ పర్యటనను పేర్కొంటున్నారు. ఏ కూటమి వైపు మొగ్గు చూపాలో తేల్చుకోలేని ఓటర్ల, సందిగ్ధంలో ఉన్న యువత..తమ ఆలోచనలను, అభిప్రాయాలను బీజేపీ నిర్భయంగా ముందుకు తెస్తుందన్న భరోసాను ఇవ్వడం ఈ ఆలయ సందర్శన లక్ష్యంగా కనిపించిందంటున్నారు.
కాంగ్రెస్ నిరసనకు కాషాయ ప్రతిస్పందన
ఇండి కూటమి, కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో నిరసనలు చేపడుతున్న వేళ, వాటికి దీటుగా బీజేపీ ‘‘లోక్‌తంత్ర బచావో-అరాచకత హటావో’’ (ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం- అరాచకవాదాన్ని అంతం చేద్దాం) నినాదాన్ని ఎత్తుకుంది. హైదరాబాద్‌లోని నిజాం కాలేజ్ సమీపంలోని బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహం నుంచి మొజంజాహి మార్కెట్ వరకు అమిత్ షా జాతీయ జెండాను చేతబూని వడివడిగా ముందుకు సాగారు. ఈ యాత్రలో కేంద్ర మంత్రులు జి. కిషన్‌రెడ్డి, బండి సంజయ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావుతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా తరలివచ్చిన వేలాది మంది కార్యకర్తలతో నగరంలోని మహాపాదయాత్ర సాగిన రహదారులు కాషాయమయం అయ్యాయి. యాత్రలో పాల్గొన్న కార్యకర్తల్లో కనిపించిన ఉత్సాహమే ఈ యాత్ర తొలి విజయమని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.
మహా పాదయాత్ర ముగింపున సందర్భంగా మొజంజాహి మార్కెట్ వద్ద జరిగిన బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగం ఆద్యంతం పదునుగా సాగింది. ‘ఇది ఢిల్లీ రాంలీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీగానీ, ఇండీ కూటమిగానీ నిర్వహించిన ఓట్ బచావో ర్యాలీ కాదని, అది చొరబాటుదారులను రక్షించే ర్యాలీ అని ఎద్దేవా చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను ఎట్టి పరిస్థితుల్లో నిలిపేదిలేదని తేల్చిచెప్పారు. బాంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చిన ప్రతి చొరబాటుదారుడి ఓటునూ తొలగిస్తామని ప్రకటించారు.
దేశంలో 13 కోట్ల ఓట్లు రద్దయ్యాయన్న కాంగ్రెస్ ప్రచారాన్ని అమిత్ షా ‘‘అబద్ధం’’గా కొట్టిపారేశారు. తనకు అందిన లెక్కల ప్రకారం, చనిపోయిన వారివి దాదాపు 3 కోట్లు, ఇతర ప్రాంతాలకు వెళ్లి స్థిరపడిన వారివి 6.5 కోట్లు, డూప్లికేట్-నకిలీవి మరో కోటి ఓట్లు మాత్రమే ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం తొలగించిందని అన్నారు. ‘‘రెండు చోట్ల ఓట్లున్న వారి పేర్లు తొలగించాలా వద్దా?’’ అని సభకు హాజరైన వారినే అడిగి, సమాధానం రాబట్టారు.
ఈవీఎంల వల్లే బీజేపీ గెలుస్తోందన్న రాహుల్ గాంధీ విమర్శలను అమిత్ షా ప్రశ్నల రూపంలోనే తిప్పికొట్టారు. ‘ఈవీఎంలతోనే గెలిస్తే తెలంగాణ, కేరళలో కాంగ్రెస్ ఎలా అధికారంలోకి వచ్చింది? తమిళనాడులో దాని మిత్రపక్షం టీవీకే ఎలా విజయం సాధించింది?’ అని నిలదీశారు.2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎస్‌ఐఆర్ లేకుండానే ప్రజలు కేంద్రంలో నరేంద్ర మోదీకి, భారతీయ జనతా పార్టీకి సంపూర్ణ మెజారిటీ ఇచ్చారని గుర్తుచేశారు. నరేంద్ర మోదీ విజయాలు ప్రజా సంక్షేమం, అభివృద్ధిపై ప్రజలు ఉంచిన నమ్మకానికి నిదర్శనమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రస్తుతం ‘‘వెంటిలేటర్‌పై’’ ఉందని, రాహుల్‌ను ఓడించడానికి బీజేపీ యువమోర్చా సాధారణ కార్యకర్త చాలని వ్యాఖ్యానించడం యువ కార్యకర్తల్లో కొత్త ఊపును నింపింది.
అవినీతిపై గురి.. పటేల్ స్మరణ
అవినీతిని అడ్డుకునే శక్తి కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్‌ఎస్‌లకు లేదని, అవినీతి రహిత పాలన బీజేపీ మాత్రమే ఇవ్వగలదని అమిత్ షా అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా రాహుల్ గాంధీకి అందుతున్న కమీషన్లే ‘‘ఆర్‌ఆర్‌ట్యాక్స్’’ అని తీవ్ర స్థాయిలో ఆరోపించారు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ దృఢ సంకల్పం లేకపోతే హైదరాబాద్ సంస్థానం భారత్‌లో విలీనమయ్యేది కాదని గుర్తుచేస్తూ, తెలంగాణ గడ్డతో బీజేపీకి ఉన్న చారిత్రక అనుబంధాన్ని ఆయన ప్రస్తావించారు. తెలంగాణలో భవిష్యత్తులో కాషాయ జెండా ఎగరడం ఖాయమన్న ఆయన ధీమా కార్యకర్తల్లో కొత్త విశ్వాసాన్ని నింపింది.
వ్యూహంలో కనిపిస్తున్న మార్పు
పశ్చిమ బెంగాల్ విజయం తర్వాత బీజేపీ జాతీయ నాయకత్వం దృష్టి తెలంగాణపై కేంద్రీకృతమైందనే విషయం పలు సందర్భాల్లో బాహాటమవుతూనే ఉంది. పార్టీ నూతన జాతీయ అధ్యక్షుడుగా నితిన్ నబిన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత, రాష్ట్ర •••నిట్లలో సమన్వయం, క్రమశిక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఇందులో భాగంగానే పార్టీ కేడర్‌ను ఎన్నికల వారియర్స్‌గా సిద్ధం చేసిన తర్వాతే అమిత్ షా స్వయంగా రంగం లోకి దిగారని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అంటే ఇది కేవలం ఒక్కరోజు రూపొందించిన కార్యక్రమం కాదని, భారతీయ జనతాపార్టీ సుదీర్ఘ ప్రణాళికలో తొలి మైలురాయిగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.
గడిచిన లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో సాధించిన గెలుపును నిలబెట్టుకుంటూ, స్థానిక సంస్థల ఎన్నికల నుంచి అసెంబ్లీ ఎన్నికల వరకు బీజేపీని ఏకైక ప్రత్యామ్నాయంగా ఓటర్ల మనసుల్లో నాటడం అమిత్ షా పర్యటన ప్రధాన లక్ష్యంగా నిలిచిందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అంతేకాకుండా.. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్నికల హామీల అమల్లో జాప్యం చేస్తుండటం, రైతు భరోసా పలు దఫాల్లో ఎగవేత, ప్త్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితులు వంటి అంశాలను ఇకపై ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యాచరణ రూపొందించు కునేందుకు బీజేపీ సంసిద్ధమవుతోందని చెబుతున్నారు. ఒకవైపు సంక్షేమ పథకాలు, పారిశ్రామిక ప్రాజెక్టులతో పట్టు పెంచుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీ, మరోవైపు క్షేత్రస్థాయి ఆందోళనలతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోన్న బీఆర్‌ఎస్ పార్టీ మధ్య, భారతీయ జనతాపార్టీ బలమైన శక్తిగా ఎదిగేందుకు, ఆ రెండు పార్టీలను అధిగమించి ప్రజల్లో అభిమానం, ఓటర్లలో ఆకర్షణ పెంచుకునేందుకు షా యాత్ర దోహద పడిందని కమలదళం ఘంటాపథంగా చెబుతోంది.
‘కమల’ ల క్ష్యాలు
రాష్ట్రంలో ఇప్పటికే నగర ప్రాంతాల్లో ఉన్న పట్టును గ్రామీణ తెలంగాణకు విస్తరించడం, ప్రతి నియోజకవర్గంలో బలమైన అభ్యర్థులను సిద్ధం చేయడం, ప్రజా సమస్యలపై పోరాడే కింది స్థాయి కేడర్‌ను బలోపేతం చేయడం తమ ముందున్న ప్రాధాన్యతలుగా ఆ పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు. ఆ దిశగా అడుగులు పడుతున్నాయనడానికి ఈ మహా పాదయాత్ర కార్యాచరణ, ఇది విజయవంతమైన తీరే ప్రత్యక్ష సాక్ష్యంగా ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఆలయ దర్శనంతో ఆత్మగౌరవ సందేశం, పాదయాత్రతో శక్తిప్రదర్శన, బహిరంగ సభతో ప్రజల్లో, యువతలో భరోసా… ఈ వ•డింటినీ ఒకే రోజులో మేళవించిన వ్యూహం తెలంగాణ రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి నాందిగా కనిపిస్తోందన్న చర్చ జరుగుతోంది.
మొత్తానికి అమిత్ షా పాదయాత్ర, బహిరంగ సభలో పదునైన ప్రసంగం వంటి పరిణామాలతో కాషాయ దళానికి కావాల్సిన ఊపు, భరోసా లభించిందంటున్నారు పార్టీ ముఖ్యనేతలు. ఇక ఆ జోష్‌ను ఎన్నికల దాకా కొనసాగించి చేసి.. దాన్ని విజయంగా మలచడమే పార్టీ ముందు ఉన్న సవాల్‌గా రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. భాగ్యనగరం నుంచి పూరించిన ఈ సమర శంఖారావం రాష్ట్రంలోని గ్రామ గ్రామానికి చేరేలా పార్టీ నాయకత్వం కార్యాచరణ రూపొందించి అమలు చేస్తే.. వచ్చే ఎన్నికల్లో కమలం వికసించడం ఖాయమన్న విశ్వాసం బీజేపీ శ్రేణుల్లోనే కాదు.. ప్రజల్లోనూ బలంగా వ్యక్తమవుతోంది.
సుజాత గోపగోని
సీనియర్ జర్నలిస్ట్, 6302164068