వాతావరణ మార్పులు నేడు ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ రంగాన్ని కుదిపేస్తున్నాయి. రాష్ట్ర జనాభాలో అధిక శాతం ప్రజలు ఇప్పటికీ వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. పసిఫిక్ మహాసముద్ర ఉపరితల జలాలు అసాధారణంగా వేడెక్కడం వల్ల ఏర్పడిన ఎల్‌నినో పరిణామం మన దేశంలో రుతుపవనాలను బలహీనపరుస్తోంది. దీని ప్రభావంతో మన రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు, సాగునీటి కొరత తలెత్తాయి. రాష్ట్ర జనాభాలో అధిక శాతం ప్రజలు ఇప్పటికీ వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రత్యామ్నాయ మార్గంగా విస్తృతంగా అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి, అందుకు సమగ్ర ప్రణాళికను సిద్ధం చేయనుంది. నేలలో తేమను కాపాడటం, పంటలపై వాతావరణ ప్రతికూలతల ప్రభావాన్ని తగ్గించడం, సాగు ఖర్చులను నియంత్రించడం, రైతుల ఆదాయాన్ని మెరుగుపరచడం ఈ ప్రణాళిక ప్రధాన లక్ష్యాలు.
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం సగానికి పడిపోయింది. 2026 ఖరీఫ్ సీజన్లో జూన్-ఆగస్టు మధ్య రాష్ట్రంలో సాధారణంగా 424.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావలసి ఉండగా, 197.6 మిల్లీమీటర్ల వర్షమే కురిసి, సాధారణం కంటే 53.4 శాతం లోటు నమోదైంది. ఇది జాతీయ సగటుకు 3.5 రెట్లు అధికం. ప్రభుత్వం 21 జిల్లాల పరిధిలోని 388 మండలాలను కరవు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించింది. ఇందులో 283 మండలాలు తీవ్ర కరవు, 105 మండలాలు మధ్యస్థ కరవు ప్రభావానికి గురయ్యాయి. రాయలసీమలోనే 186 మండలాలు కరవును ఎదుర్కొంటున్నాయి. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో వరి, వేరుశనగ, పత్తి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. కొన్ని ప్రాంతాల్లో దిగుబడులు తగ్గే పరిస్థితి ఏర్పడింది. ఆరు జిల్లాల్లో అతి తీవ్ర లోటు ఉండగా, 22 జిల్లాల్లో తీవ్ర లోటు ఉంది. డిసెంబరు వరకూ కూడా ఈ పరిస్థితి కొనసాగతుందంటున్నారు. రాష్ట్రంలో ఖరీఫ్ సాధారణ సాగు 30.84 లక్షల హెక్టార్లకుగాను 23 లక్షల హెక్టార్లలోనే రైతులు పంటలు వేశారు. అందులో 2.44 లక్షల హెక్టార్లలోని పంటలు ఎల్‌నినో కారణంగా తీవ్రంగా దెబ్బతిన్నాయి.
నీటి పొదుపే ప్రధానం
మనం సాధారణంగా అనుసరిస్తున్న వరి సాగు జపాన్ తరహా విధానానికి చెందినది. ఈ పద్ధతిలో పొలాల్లో మోకాలి లోతు వరకు నీరు నిలిపి వరి పండిస్తారు. ఫలితంగా ఒక కిలో వరి ధాన్యం పండించడానికి భూమి పరిస్థితిని బట్టి కనీసం 2,500 లీటర్ల నుంచి 5 వేల లీటర్ల నీరు అవసరమవుతుంది. ఎల్‌నినో వల్ల వర్షాలు తగ్గి, జలాశయాలు అడుగంటే పరిస్థితుల్లో ఇంత నీటిని సమకూర్చడం దాదాపు అసాధ్యం. మరోవైపు భూగర్భ జలాలు కూడా ఏటేటా అడుగంటుతున్నాయి. నీరు తక్కువగా ఉన్నా పండించగలిగే విధానమే ప్రకృతి వ్యవసాయం. ఈ పద్ధతిలో పంట అవశేషాలతో నేలను కప్పి ఉంచడం (ఆచ్ఛాదన) వల్ల ఎండ వేడికి తేమ ఆవిరి కాకుండా నేలలోనే నిలిచి ఉంటుంది. అందుకే వర్షాభావ పరిస్థితుల్లో ఇది రైతుకు రక్షణ కవచంగా నిలుస్తుంది.
జీరో బడ్జెట్ వ్యవసాయం
ప్రకృతి వ్యవసాయంలో రసాయన ఎరువులు, పురుగుమందుల అవసరమే ఉండదు. ఆవుపేడ, ఆవువ•త్రం, వేప ఆకులు, వివిధ గింజల కషాయాలతో రైతులే స్వయంగా ఎరువులు, క్రిమిసంహారకాలను తయారు చేసుకుంటారు. ఆవుపేడ, వ•త్రంతో తయారుచేసే జీవామృతం, బీజామృతం వంటి ద్రావణాలు నేలలో సూక్ష్మజీవులను, వానపాములను పెంచి భూమిని సజీవంగా మారుస్తాయి. వీటన్నిటికీ ఎకరానికి కేవలం రెండు వేల రూపాయలు మాత్రమే ఖర్చవుతుంది. పెట్టుబడి దాదాపు శూన్యం కావడం వల్లనే దీన్ని ‘జీరో బడ్జెట్ వ్యవసాయం’ అని పిలుస్తారు. మొదట్లో ఎకరానికి దిగుబడి పరిమితంగా వచ్చినా, రానురాను పెరుగుతుంది. రసాయనాల భారం తొలగడంతో భూమి తన సహజ సారాన్ని తిరిగి పొంది సారవంతమవుతుంది. పెట్టుబడుల భారంతో అప్పుల్లో కూరుకుపోతున్న చిన్న, సన్నకారు రైతులకు ఇది పెద్ద ఊరట. రసాయన అవశేషాలు లేని ఆహారం వినియోగదారుల ఆరోగ్యానికీ మేలు చేస్తుంది.
గోవే ఆధారం
ప్రకృతి వ్యవసాయానికి ఆవు వెన్నెముక వంటిది. ఆవుపేడ, వ•త్రం ఎరువులుగానూ, క్రిమిసంహారకాలుగానూ పనిచేస్తాయి. ముఖ్యంగా వట్టిపోయిన ఆవుల పేడ, వ•త్రాల్లో భూమిలో నత్రజని పెరగడానికి అవసరమైన అనుకూల బ్యాక్టీరియా ఉంటుందని, క్రిమిసంహారక మందులుగా కూడా అత్యుత్తమంగా పనిచేస్తాయని ప్రకృతి వ్యవసాయ నిపుణుడు సుభాష్ పాలేకర్ పేర్కొన్నారు. 2025 పశుగణాంకాల ప్రకారం రాష్ట్రంలో 45 లక్షల ఆవులు ఉండగా, వాటిలో సుమారు 10 లక్షలు వట్టిపోయినవే. కనీసం రెండెకరాల సాగుకు ఒక ఆవు సరిపోతుంది. ఈ లెక్కన కేవలం వట్టిపోయిన ఆవులతోనే దాదాపు 20 లక్షల ఎకరాల్లో ప్రకృతి సాగు చేపట్టవచ్చు. పాలు ఇవ్వడం ఆపేసిన ఆవులను భారంగా భావించకుండా ప్రకృతి వ్యవసాయానికి వినియోగించుకుంటే, అవి రైతుకు నిజమైన సంపదగా మారతాయి. ఆవు ఆధారిత సాగు వల్ల పశుపోషణ, వ్యవసాయం రెండూ పరస్పరం బలపడి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా పుంజుకుంటుంది.
ప్రభుత్వ కార్యాచరణ
ప్రస్తుతం రాష్ట్రంలో 22 లక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం అమలవుతోంది. దీన్ని తొలి దశలో 25 లక్షల ఎకరాలకు, ఆ తర్వాత 30 లక్షల ఎకరాలకు విస్తరించాలని వ్యవసాయ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. గుంటూరు జిల్లా నంబూరు వద్ద 2017లో 5 వేల మంది రైతులకు పది రోజుల పాటు ప్రకృతి సాగుపై శిక్షణ ఇచ్చారు. ఈ క్రమంలో ప్రకృతి సాగు చేసే రైతుల సంఖ్య అప్పట్లో ఉన్న 40 వేల నుంచి నేటికి 17 లక్షలకు పెరిగింది. ఇప్పుడు వాతావరణ మార్పుల నేపథ్యంలో రైతులకు సాగులో స్థిరత్వం కల్పించేందుకు, ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై వారిలో మరింత అవగాహన పెంచి ఈ విధానాన్ని విస్తృతంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సంప్రదాయ సాగుతో పోలిస్తే ప్రకృతి వ్యవసాయం వల్ల కలిగే మేలును రైతులు స్పష్టంగా అర్థం చేసుకునేలా క్షేత్రస్థాయిలో ఖర్చు, ప్రయోజనాల విశ్లేషణతో వివరించనున్నారు. లెక్కలు సహా లాభాన్ని కళ్లారా చూసినప్పుడే రైతులు ఈ విధానం వైపు నమ్మకంగా అడుగులు వేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా వాతావరణ ముప్పు అధికంగా ఉన్న 1,357 రైతు సేవా కేంద్రాల పరిధిలో ప్రకృతి సాగును విస్తరించి, సుమారు 9.60 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూర్చాలన్నది ప్రణాళిక. రైతులకు సాంకేతిక తోడ్పాటు అందించేందుకు వచ్చే జనవరి నాటికి 11 జిల్లాల్లో 3 వేల మందికి పైగా కవ్యనిటీ రిసోర్స్ పర్సన్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. అలాగే ఫిబ్రవరి నాటికి కొత్త గ్రామాల్లోని మరో 5 లక్షల మంది రైతులను ఈ కార్యక్రమంలో భాగ స్వాములను చేయనున్నారు. పంటల వైవిధ్యం, ముందస్తు విత్తన విధానాలతో పాటు ఏడాది పొడవునా పొలాల్లో పచ్చదనం కొనసాగేలా చూడటం కార్యాచరణ.
పొడి నేలలో ముందస్తు విత్తనం
ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ‘ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్’ (పీఎండీఎస్) విధానానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే పొడి నేలలో విత్తనాలు చల్లే ఈ పద్ధతి వల్ల నేలలో తేమను సంరక్షించడంతో పంటల ఎదుగుద లకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. పంటల ప్రణాళికను ముందుగానే రూపొందించుకోవడం, వర్షాల రాకను దృష్టిలో ఉంచుకుని విత్తనాలు వేయడం, నేలలో తేమను నిలుపుకునే పద్ధతులను అనుసరించడం ద్వారా వాతావరణ ప్రతికూలతల ప్రభావాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. ఈ విధానాలను రైతులకు వివరించి క్షేత్రస్థాయిలో అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ముఖ్యంగా అనంతపురం వంటి వర్షాభావ ప్రాంతాల రైతులకు ఈ విధానం ఎంతో ఉపయోగకరం.
2028 జూన్ వరకు దీర్ఘకాలిక ప్రణాళిక
ఈ చర్యలను 2028 జూన్ వరకు కొనసాగిం చేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. పొలాల్లో ఏడాది పొడవునా పచ్చదనం, నేలలో తేమ సంరక్షణ, వాతావరణ మార్పులను తట్టుకునే సామర్థ్యం పెంపు వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. జిల్లాల, పంటల వారీగా కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేయనున్నారు. అనంతపురం జిల్లాలోని ఎకాలజీ కేంద్రంలో ఇటీవల నిర్వహించిన రెండు రోజుల వర్క్‌షాప్‌లో 11 జిల్లాలకు చెందిన బృందాలు పంటల వారీ వ్యూహాలు, కాలానుగుణ కార్యాచరణ ప్రణాళికలను సమగ్రంగా సమీక్షించాయి. ఈ దీర్ఘకాలిక దృష్టి వల్ల ప్రకృతి వ్యవసాయం తాత్కాలిక ప్రయోగంగా కాకుండా శాశ్వత సాగు విధానంగా స్థిరపడే అవకాశం ఉంది.
ప్రకృతి వ్యవసాయ ప్రయోజనాలు
ప్రకృతి వ్యవసాయం వల్ల ఒకేసారి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. సాగునీటి వినియోగం గణనీయంగా తగ్గుతుంది. సాగు ఖర్చు తగ్గి రైతు నికర ఆదాయం పెరుగుతుంది. నేలలో సేంద్రియ కర్బనం, సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి భూసారం మెరుగుపడుతుంది. రసాయనాలు చెరువులు, వాగుల్లోకి చేరక పోవడంతో పర్యావరణానికీ రక్షణ లభిస్తుంది. పంటల వైవిధ్యం వల్ల ఒక పంట దెబ్బతిన్నా మరో పంట రైతును ఆదుకుంటుంది. అన్నిటికీ మించి వాతావరణ ఒడిదొడుకులను తట్టుకునే శక్తి పంటలకు, రైతులకు చేకూరుతుంది.
విజయానికి కావాల్సింది
ప్రణాళిక ఎంత మంచిదైనా రైతుల భాగస్వామ్యం తోనే అది ఫలిస్తుంది. ప్రారంభ దశలో దిగుబడి తగ్గుతుందనే భయాన్ని పోగొట్టేందుకు విజయవంతమైన రైతుల అనుభవాలను గ్రామగ్రామానా ప్రచారం చేయాలి. కషాయాల తయారీ, ఆవు ఆధారిత ఎరువుల వినియోగంపై ప్రత్యక్ష శిక్షణ ఇవ్వాలి. పంట మార్పిడి, అంతర పంటల సాగుపై కూడా రైతులకు మార్గదర్శనం అవసరం. మహిళా స్వయం సహాయక సంఘాలను భాగస్వాములను చేస్తే కషాయాల తయారీ గ్రామస్థాయి ఉపాధిగానూ మారుతుంది. ప్రకృతి ఉత్పత్తులకు ప్రత్యేక మార్కెట్ సౌకర్యం, గిట్టుబాటు ధర కల్పిస్తే రైతులు మరింత ఉత్సాహంగా ముందుకొస్తారు. రైతు సేవా కేంద్రాలు, కవ్యనిటీ రిసోర్స్ పర్సన్లు ఈ మార్పునకు వారధులుగా నిలవాలి. ఎల్‌నినో వంటి పరిణామాలను మనం ఆపలేం; కానీ వాటిని తట్టుకునే శక్తిని పెంపొందించుకోగలం. తక్కువ నీరు, తక్కువ ఖర్చు, ఆరోగ్యకరమైన ఆహారం, సారవంతమైన నేల ఈ నాలుగింటినీ ఒకేసారి అందించే ప్రకృతి వ్యవసాయం రైతుకు, నేలకు, సమాజానికి మేలు చేస్తుంది. వాతావరణ ముప్పులను ఎదుర్కొనే సామర్థ్యాన్ని రైతుల్లో పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ప్రభుత్వం, రైతులు, పశుసంపద కలిసి నడిస్తే మన రాష్ట్రం ప్రకృతి వ్యవసాయంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది.

తురగా నాగభూషణం
సీనియర్ జర్నలిస్ట్