భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీలో విశిష్ట బహుమతికి ఎంపికైన రచన


‌ప్రొఫెసర్‌ ‌శంకరనారాయణ దీక్షగా జిమ్‌ ‌వైపే చూస్తున్నాడు. అతడికేమీ అర్థంకావడం లేదు. అసలు జిమ్‌ ‌కి ఏమైంది? చాలాసేపటి నుంచి టెస్ట్ ‌చేస్తున్నా ఏమీ అర్థం కావడం లేదు. శంకరనారాయణకి నిస్పృహ ఆవరించింది. కొన్ని సంవత్సరాల కఠోరశ్రమ ఫలితం చివరికి ఫెయిల్యూర్‌గా మిగిలిపోనుందా? కానీ ఇన్ని రోజులు జిమ్‌ ‌విజయవంతంగా పనిచేశాడు కదా? ఇప్పుడేమైంది? ఎన్నిసార్లు పవర్‌ ఆన్‌ ‌చేస్తున్నా జిమ్‌ ‌షట్‌ ‌డౌన్‌ అవుతున్నాడు. అసలు ఇదెలా జరుగు తోంది? శంకరనారాయణ అలసటగా కుర్చీలో వెనక్కి వాలాడు. అతడికి గతంలో జరిగిన విషయాలు, జిమ్‌ను తను అనుకున్నట్టు తీర్చిదిద్దడానికి తను పడ్డ పాట్లు అన్నీ ఒకసారి కళ్ళముందు కదలాడాయి.
* * *
‘‘జిమ్‌.. ‌నాకు నీరసంగా ఉంది.. జ్వరం వచ్చినట్టుగా అన్పిస్తోంది’’ చెప్పాడు శంకర నారాయణ. జిమ్‌ ఒకసారి కదిలి మళ్ళీ ఆగి పోయాడు. అతడి పొట్ట భాగంలో ఉన్న తెర మీద ‘వెయిటింగ్‌ ‌ఫర్‌ ఆర్డర్‌’ అని బ్లింక్‌ అయింది. శంకర నారాయణ నిట్టూర్చాడు. జిమ్‌ను భావోద్వేగాలకు ప్రతిస్పందించే విధంగా మలచాలని తను తీవ్రంగా చేస్తున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి రావడం లేదు. అయినా తను సాధించగలననే నమ్మకం శంకర నారాయణ కోల్పోలేదు.
కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్, ‌సైకాలజీ వంటి శాస్త్రాల కలయికతో మావుడిలాగే ప్రతిస్పందించ గలిగే రోబోను తయారుచెయ్యాలి. తనకొక నమ్మకమైన సేవకుడిగా జిమ్‌ను తీర్చిదిద్దాలి.. ఇదే తన ఆశయం! అందుకోసం ఎంత కష్టమైనా పడతాడు. మనసులోనే మరోసారి అనుకున్నాడు శంకరనారాయణ.
హ్యూమనాయిడ్‌ ‌రోబోలను ఇప్పటివరకూ వివిధ సంస్థలు తయారుచేశాయి. చైనాకు చెందిన •••నిట్రీ సంస్థ జీ వన్‌ ‌హ్యూమనాయిడ్‌ ‌రోబోను ఆవిష్క రించింది. జీ వన్‌ ‌సొంతంగా డ్యాన్స్ ‌చెయ్యడం, మెట్లు ఎక్కడం, ఏదైనా ఎదురుపడితే అందుకు తగినట్టు ప్రతిస్పందించడం చేస్తుంది. అలాగే ఫిగర్‌ ఏఐ ‌సంస్థ సౌత్‌ ‌కరోలినాలోని బీఎమ్‌ ‌డబ్ల్యూ తయారీ ప్లాంట్‌లో పనిచేసేందుకు హ్యూమనాయిడ్‌ ‌రోబోలను తయారుచేస్తోంది. ఇవి ప్లాంట్‌లో పనిచేసే సిబ్బందికి టీ, కాఫీలు ఇస్తాయి. కాఫీ చేసే క్రమంలో ఏదైనా పొరపాటు జరిగితే వాటికవే స్వయంగా ఆలోచిస్తూ సమస్యను పరిష్కరించుకుంటున్నాయి. బెంగు ళూరుకు చెందిన ఇన్వెంటో రోబోటిక్స్ ‌స్టార్టప్‌ ‌రోబో కష్టమర్‌ ‌సేవల కోసం రూపొందించబడింది. ఇది వ్యక్తులతో సంభాషించగలదు.. ముఖాలను గుర్తించ గలదు.. వివిధ భాషల్లో మాట్లాడగలదు. తను వీటి లక్షణాలన్నీ కలబోస్తూ ఇంకా మెరుగైన సేవలందించేలా ఒక రోబోను తయారుచేయాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. తను సృష్టించే ఆ రోబో ఒంటరి జీవితాన్ని గడిపే తనలాంటివాడికి అన్నీ తానై చూసుకోవాలి. ఒంట్లో బాగులేకపోతే గుర్తించి డాక్టర్‌కు ఫోన్‌ ‌చేసి రప్పించగలగాలి. తనకు వంట చేసి పెట్టి, సమయానికి కాఫీ అందించి తన పనులన్నింటినీ చూసుకోవాలి. ఇల్లు క్లీన్‌ ‌చెయ్యడం, తడిగుడ్డ పెట్టడం వంటి పనులు చెయ్యాలి. తనను జాగ్రత్తగా చూసుకునే ఒక నమ్మకమైన మనిషిలా ఉండాలి.
తన కృషిలో లోపం లేకుండా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. భావోద్వేగాలను అర్థం చేసుకునే విధంగా జిమ్‌ ‌న్యూరల్‌ ‌స్కీమాను అధునాతన న్యూరల్‌ ‌నెట్‌ ‌వర్క్ ‌తో అప్‌ ‌గ్రేడ్‌చేశాడు. జిమ్‌స్వరం కూడా వివిధ భావోద్వేగాలను వ్యక్తీకరించేలా కృత్రిమమేధ సహాయంతో వాయిస్‌ ‌సాఫ్ట్‌వేర్‌ ‌ను రూపొందిం చాడు.
డేటా సైన్స్ ‌విభాగంలో ప్రొఫెసర్‌గా రిటైరైన తర్వాత తన దృష్టంతా జిమ్‌ ‌మీదే పెట్టాడు. తనకు కావాల్సిన విధమైన రోబో తయారుచేసే క్రమంలో ఇంచుమించు తన రిటైర్మెంట్‌ ‌బెనిఫిట్స్ అన్నీ ఖర్చు పెట్టాడు. ఇంక నెలనెలా వచ్చే పెన్షన్‌ ‌మాత్రమే తన ఆదాయం. అందులో కూడా చాలా భాగం తన ప్రయోగాలకే వెచ్చిస్తున్నాడు.
జిమ్‌కు సంబంధించిన ఒక్కొక్క లోపాన్ని సరిచేసుకుంటూ వెళ్తున్నాడు శంకర నారాయణ. ఈ క్రమంలో తనకు పరిచయం గల ప్రముఖ రోబోటిక్స్ ‌మేధావుల సలహాలను తీసుకుంటున్నాడు. చివరకు వ•డు సంవత్సరాల నిర్విరామ కృషి తర్వాత జిమ్‌ ‌ను ఒక కొలిక్కి తేగలిగాడు. ఇప్పుడు జిమ్‌ ‌కొన్ని భావోద్వేగాలకు ప్రతిస్పందించడం చేస్తున్నాడు. తనకు ఒంట్లో బాగాలేదని చెప్పగానే బీపీ, షుగర్‌, ‌జ్వరం లాంటివి జిమ్‌ ‌చెక్‌ ‌చేస్తాడు. అవసరమైతే ఫీడ్‌ ‌చేసి ఉన్న డాక్టర్స్ ‌లిస్ట్‌లో వారి ఎవైలబిలిటీని కనుక్కుని తన బాస్‌ ‌శంకర నారాయణకు తెలియజేస్తాడు. ఒకవేళ శంకర నారాయణ మరీ జవాబివ్వలేని విధంగా అనారోగ్యం బారిన పడడం లేదా స్పృహ తప్పడం వంటివి జరిగితే ప్రాథమిక చికిత్స కూడా అందించగలడు. అంతేకాదు తనే డాక్టర్‌కు కాల్‌ ‌చేసి రప్పించగలడు. వంట చేయడం. ఇల్లు క్లీన్‌ ‌చేయడం లాంటి వాటితో సహా ఇంట్లో పనులన్నీ చక్కబెట్టగలడు. అంతేకాదు ఒక నర్స్ అం‌దించే సేవలను కూడా జిమ్‌ ‌చక్కగా నిర్వర్తించగలడు.
శంకరనారాయణ మళ్లీ ప్రస్తుతంలోకి వచ్చాడు. అంతా బాగుంది అనుకునే సమయంలో ఇదేమిటి? జిమ్‌ ఎం‌దుకు పదే పదే షట్‌డౌన్‌ అవుతున్నాడు? పాయింట్‌ ‌దగ్గరకు వెళ్లి తనంత తానుగా ఛార్జింగ్‌ ‌చేసుకోవడం అలాగే అత్యవసర పరిస్థితుల్లో షట్‌ ‌డౌన్‌ అవ్వడం అనేవి తను రూపొందించిన పోగ్రామ్‌ ‌లోనే ఉన్నాయి. దీనికి ఒక కారణం ఉంది! జిమ్‌ ‌గురించి బైట ప్రపంచానికి తెలిస్తే తన ఏకాంతానికి భంగం వాటిల్లుతుందని, జిమ్‌ ‌న్యూరల్‌ ‌స్కీమా తెలుసుకునేందుకు ప్రపంచం తన వెంట పడుతుందని భయపడ్డాడు. అసలు మరో మనిషి ప్రమేయం లేకుండా తను ప్రశాంతంగా బ్రతకడం కోసమే ఇంత కష్టబడి జిమ్‌ను రూపొందించాడు. ఒకవేళ ఎవరైనా జిమ్‌ ‌గురించి తెలుసుకుని అతణ్ణి కిడ్నాప్‌ ‌చేసి(?) ఉపయోగించుకోవాలని అనుకుంటే జిమ్‌ అది కనిపెట్టి వెంటనే షట్‌డౌన్‌ అవ్వగలడు. అలాగే జిమ్‌ ‌కోర్‌ ‌పోగ్రామింగ్‌, ఇం‌టలెక్చువల్‌ ఆర్కిటెక్చర్‌ ‌ని తెలుసుకోవాలని ఎవరైనా శోధిస్తే అది కూడా సాధ్యం కాదు. ఎందుకంటే కొత్త వ్యక్తి ఎవరైనా తన నుంచి ఏదైనా తెలుసుకోవాలని అనుకుంటే లోపలున్న చిప్‌ను తనంతతానుగా జిమ్‌ ‌డామేజ్‌ ‌చేసుకోగలడు.
అదంతా బాగానే ఉన్నా జిమ్‌ ఇప్పుడెందుకు షట్‌డౌన్‌ అవుతున్నాడో శంకరనారాయణకి అంతుపట్టకుండా ఉంది! ప్రస్తుతం జిమ్‌ ‌సహాయం అందకపోవడం చేత అన్ని పనులూ తనే చేసుకోవడం అతడికి కష్టంగా మారింది. జిమ్‌ ఉన్నాడన్న ధైర్యంతో ఇక తనకు పనిమనిషి అవసరం లేదని, వేరేచోట పనిచూసుకోమని రంగన్నకు చెప్పి పంపించేశాడు. ఇప్పుడేం చెయ్యాలో అర్థం కాకుండా ఉంది.
ప్రొఫెసర్‌ అక్కణ్ణుంచి లేచి బైట గార్డెన్‌ ఏరియా లోకి వచ్చి, అక్కడి సిమెంటు బెంచీ మీద కూర్చుని ఆలోచించసాగాడు. ఎదురుగా తన కాంపౌండ్‌లోనే ఉన్న చిన్న అవుట్‌ ‌హౌస్‌ ‌కనిపిస్తోంది. తన ఇంటికి గెస్ట్ ‌లెవరూ రారు కాబట్టి దాన్ని ఎప్పుడూ వాడింది లేదు. అది కూడా తనలాగే ఒంటరిగా బావురు మంటున్నట్టుగా అనిపించింది. దాని అవసరం లేదు కాబట్టి ఎప్పుడూ శుభ్రం చేయించే పని కూడా పెట్టుకోలేదు. దాని ఆవరణ చుట్టూ పిచ్చిమొక్కలు పెరిగాయి. అక్కడి జామచెట్టు మీద రెండు చిలకలు వాలి కనిపించాయి. ముక్కులు రాసుకుంటూ అవి ఏవో మాట్లాడుకుంటున్నట్టుగా అనిపించింది. ఆ దృశ్యాన్ని కెమెరాలో బంధిస్తే బాగుణ్ణు అనుకున్నాడు శంకరనారాయణ. అలా అనుకోగానే అతని మైండ్‌లో ఫ్లాష్‌లా ఒక ఆలోచన మెరిసింది. కెమెరాలు.. అవును.. జిమ్‌ ‌కార్యకలాపాలని పూర్తిగా అబ్జర్వ్ ‌చెయ్యడం కోసం ఇంట్లో కొన్ని చోట్ల తను సీసీ కెమెరాలు ఫిక్స్ ‌చేశాడు. వాటి సంగతి ఎలా మర్చిపోయాడు? ఆ పుటేజ్‌ ‌చూస్తే ఏమైనా తెలియొచ్చు! వెంటనే లేచి ఇంట్లోకి వచ్చాడు.
సిస్టం దగ్గరకు వెళ్లి సీసీ కెమెరాల పుటేజ్‌ని ఓపెన్‌ ‌చేసి చూడసాగాడు. జిమ్‌ ‌నార్మల్‌గానే పనులన్నీ చేయడం అందులో రికార్డయింది. ఇంకా వెనక్కు వెళ్లి చూశాడు. ఇప్పుడు ఇంట్లో రంగయ్య కూడా కనిపిస్తున్నాడు. అప్పటికింకా జిమ్‌ ‌గురించిన అబ్జర్వేషన్‌ ‌పూర్తి కాకపోవడం వల్ల రంగయ్యను ఇంకా పనిలోంచి తీసేయలేదు. ఆ పుటేజ్‌ ‌చూస్తూంటే చాలాసార్లు జిమ్‌తో రంగయ్య ఏదో చెప్తున్నట్టుగా అనిపిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
ప్రొఫెసర్‌కి రంగయ్య జిమ్‌తో ఏం చెప్తున్నాడో అర్థం కాలేదు. రంగయ్యకు జిమ్‌ను ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు. తానెప్పుడూ చెప్పలేదు కూడా! కానీ జిమ్‌, ‌రంగయ్య కలిసి ఒక పదిరోజులు పాటు ఉండడం మాత్రం జరిగింది. ఆ తర్వాత తనకు జిమ్‌ ‌మీద పూర్తి నమ్మకం ఏర్పడడంతో రంగయ్యను పని నుంచి తీసేశాడు. కానీ రంగయ్య ఇంట్లో ఉన్నప్పుడు జిమ్‌తో అంత సేపు ఏం మాట్లాడుతున్నాడు? కొంపదీసి రంగయ్యను ఎవరైనా ఉపయోగించుకుంటూ జిమ్‌ ‌తాలూకు రహస్యాలు కనిపెట్టడానికి ప్రయోగించారా? వారి ఆదేశాల ప్రకారం జిమ్‌ను ప్రశ్నలు అడుగుతూ సమాచారం రాబట్టడానికి రంగయ్య ప్రయత్నిం చాడా? శంకరనారాయణకు అది జరిగే పనిలా అనిపించలేదు. రంగయ్య నిరక్షరాస్యుడు. రోబో నుంచి సమాచారం రాబట్టేంత తెలివితేటలు అతడికి లేవు. అదీగాక రంగయ్య చాలా మంచి మనిషి, నెమ్మదస్తుడు! యజమానికి ద్రోహం చేసే తత్త్వం అతనికి లేదు.
శంకరనారాయణకి ఏం చెయ్యాలో ఫ్లాష్‌ ‌వెలిగింది. జిమ్‌తో రంగయ్య ఏం మాట్లాడుతున్నాడో తెలుసుకోవడం చాలా ఈజీ! జిమ్‌తో ఎవరు ఏం మాట్లాడినా, ఆదేశాలు ఇచ్చినా అంతా రికార్డవు తుంది.
వెంటనే జిమ్‌ ‌వీపు భాగంలో ఒక స్లాట్‌ను ఓపెన్‌ ‌చేసి అందులోని పెన్‌‌డ్రైవ్‌ను బైటికి తీశాడు శంకరనారాయణ. దాన్ని సిస్టంకి కనెక్ట్ ‌చేశాడు. గత వారంలో రికార్డయిన సౌండ్‌ ‌డేటాను ఆన్‌ ‌చేశాడు. తన మాటలు, జిమ్‌ ‌రెస్పాన్స్‌తో పాటు రంగయ్య మాటలు కూడా రికార్డయ్యాయి. జిమ్‌ను ఒక మనిషిలాగే భావిస్తూ రంగయ్య మాట్లాడు తున్నాడు. జిమ్‌ ‌కూడా ప్రతిస్పందిస్తూ పరిమితమైన సమాధానాలు చెప్తున్నాడు. ఆ సంభాషణని వింటున్న శంకరనారాయణకు ఒక విషయం స్పష్టమైంది. జిమ్‌లో భావోద్వేగాలు ప్రవేశపెట్టాక తనకు అవసర మైనంత వరకూ జిమ్‌ ‌స్పందిస్తున్నాడా? లేడా? అనేదే టెస్ట్ ‌చేశాడు తప్ప ఇంకా అనేక రకాలైన పరిస్థితులలో జిమ్‌ ఎలా స్పందిస్తాడనేది తను పూర్తిగా పరిశీలించ లేదు. జిమ్‌కు ఇంకొన్ని అదనపు నైపుణ్యాలను కల్పించాలని ప్రయోగాలు కొనసాగిస్తూ తను అందులో బిజీగా ఉండిపోయాడు. కానీ జిమ్‌ ‌తన భావోద్వేగాలను అవసరమైన ఇతర సందర్భాల్లో కూడా ప్రదర్శిస్తున్నాడు. అందులో భాగంగా ఒక ముఖ్యమైన పరిణామం సంభవించింది. అదే రంగయ్యను జిమ్‌ ‌స్నేహితుడిగా భావించడం! నిజానికి వారిద్దరూ చాలా ఆప్తులుగా మారిపోయారని వారి సంభాషణ ద్వారా శంకరనారాయణకు స్పష్టమైంది. రంగయ్య జిమ్‌ను తన మంచికోరే మనిషిలాగే భావిస్తూ కష్టసుఖాలన్నీ చెప్పుకుంటు న్నాడు. భావోద్వేగాలు ప్రవేశపెట్టబడిన జిమ్‌ ‌కూడా అలాగే స్పందిస్తున్నాడు.
రంగయ్యను పనిలోంచి తీసేసిన ముందు రోజు సంభాషణను ఆన్‌ ‌చేశాడు శంకరనారాయణ. అందులో జిమ్‌తో రంగయ్య చెప్పిన మాటలన్నీ వినిపించడం మొదలైంది.
‘‘సూడు బాబూ.. అయ్యగోరు సెప్పిన పన్లన్నీ నువ్వు సెయ్యగలవట. అంచేత నన్ను పన్లోకి రావొద్దని సెప్పేస్తన్నారు. అటు జూస్తే ‘మా బతుకులు మేవే బతకలేకపోతన్నాం.. మిమ్మల్ని సూడ్డం మా వల్ల గాదు’ అని మా కోడలు సణుగుతంది. మాయావిడకి ఒంట్లో బాగుండదు. దాని మందుల ఖర్చు గూడా ఎక్కువే అవుతంది. నా కొడుకు పెళ్ళాం పోరు పడలేక ‘అమ్మకీ, మాయావిడకీ పడ్డం లేదు.. అంచేత మీరు యేరే ఇల్లు సూసుకుంటే బాగుంటాది’ అంటున్నాడు. ఎక్కడికని ఎలిపోగలం? ఇంటద్దె ఎలా కట్టగలం? నా కొడుకు ‘నెలనెలా ఎంతో కొంత ఇస్తాన్లెండి’ అంటన్నాడు గానీ మా కోడలు ఇవ్వనివ్వదు. అయ్యగారి దగ్గర పని ఉండడం వల్ల మా బతుకులు ఎలాగోలా ఎల్లబుచ్చుతున్నాం. ఇప్పుడు ఈ పనీ పోయిందంటే మా గతేటో మాకే అరదం కావడం లేదు’ అంటూ ఎంతో బాధగా చెప్తున్నాడు రంగయ్య.
‘‘నేను సమస్య పరిష్కారం కోసం వెతుకుతాను’’ అనే మాటలు జిమ్‌ ‌నుంచి వినిపించాయి. ప్రొఫెసర్‌కి సమస్య మంచు విడిపోయినట్లుగా విడిపోయింది. భావోద్వేగాలు ప్రవేశపెట్టబడిన జిమ్‌ ఇం‌చుమించు ఒక మనిషిలాగే స్పందించాడు. తను సవ్యంగా పనిచేస్తే ఇంక తన బాస్‌కి రంగయ్యతో పనిలేదని అర్థం చేసుకున్న జిమ్‌ ‌కావాలని తనకు తానే షట్‌ ‌డౌన్‌ అయ్యాడు. తను లేకపోతే రంగయ్యను తిరిగి పనిలోకి తీసుకుంటారని జిమ్‌ ‌భావించాడు. అందుకే ఈ పరిణామం సంభవించింది!
ప్రొఫెసర్‌ ‌కుర్చీలో వెనక్కు వాలాడు. జిమ్‌ను మళ్ళీ పనిచేయించడం ఎలాగో ఆయనకి తెలిసింది. రంగయ్యను తిరిగి పనిలోకి తీసుకున్నాననీ, జిమ్‌తో పాటు రంగయ్య కూడా పనిచేస్తాడనీ జిమ్‌కు ఫీడ్‌ ‌చెయ్యగలిగితే చాలు.. జిమ్‌ ‌యధాతథ•ంగా వర్క్ ‌మోడ్‌లోకి వస్తాడు. అదిప్పుడు సమస్య కాదు. అయితే ప్రొఫెసర్‌ ఆలోచిస్తున్నది ఆ విషయం గురించి కాదు! తన దగ్గర ఎంతో నమ్మకంగా పనిచేసిన రంగయ్యను ఇంక అతడి అవసరం లేదని తెలియగానే పని నుంచి హఠాత్తుగా తీసేశాడు తను! రంగయ్య ఏ పరిస్థితులలో ఉన్నాడో ! అతడి కష్టసుఖాలేమిటో తెలుసుకునే కనీస ప్రయత్నం కూడా చెయ్యలేదు. తన వైపు నుంచే ఆలోచించాడు తప్ప మానవత్వం ఉన్న ఒక మనిషిగా ఏమాత్రం ప్రవర్తించలేదు. తన వల్ల భావోద్వేగాలు ప్రవేశపెట్టబడిన జిమ్‌ ‌మాత్రం రంగయ్య గురించి ఆలోచించగలిగాడు. తనకున్న పరిమితమైన జ్ఞానంతో రంగయ్యకు ఎలా మేలు చెయ్యగలడో పోగ్రామ్‌ ‌చేసుకోగలిగాడు! నిజంగా ఎంత కాంట్రాస్ట్ అయిన విషయం ఇది? ఒక ప్రొఫెసర్‌ ‌గా ఎంత ఘనత సాధిస్తే ఏమిటి? ఒక మనిషిగా తను ఫెయిలయ్యాడు! ఆ విషయం తన చేత రూపుదిద్దుకోబడిన ఒక యంత్ర మానవుడు రుజువు చేశాడు. దేన్ని సూచిస్తుంది ఇది? మనుష్యులు యంత్రాల్లా మారిపోతున్నారనడానికి సంకేతమా? అదే సమయంలో స్వలాభాపేక్ష ఏమాత్రం లేని యంత్రాలు తమలో ప్రవేశపెట్టబడిన భావోద్వేగాల ఫలితంగా మానవత్వాన్ని పుణికిపుచ్చు కుంటున్నాయనడానికి నిదర్శనమా?
శంకరనారాయణ జిమ్‌ ‌వైపు తేరిపార చూశాడు. తనింతకాలం ఒక యంత్రంగా మాత్రమే పరిగణిస్తూ వచ్చిన జిమ్‌ ఇప్పుడు ఒక మనిషిలా కనబడు తున్నాడు. ఆ యంత్రపు మనిషిలో అమాయకత్వంతో పాటు దైవత్వం కనబడుతోంది. శంకరనారాయణ ఒక నిశ్చయానికి వచ్చినట్టు లేచాడు. రంగయ్య ఎక్కడ నివసిస్తాడో తనకు తెలుసు. కారులో స్వయంగా అక్కడకు వెళ్లాడు. ఇంటి ముందు రావిచెట్టు దగ్గర దిగులుగా కూర్చుని కనిపించాడు రంగయ్య. హఠాత్తుగా అక్కడకొచ్చిన ప్రొఫెసర్‌ని చూసి తబ్బిబ్బుపడ్డాడు. శంకరనారాయణ రంగయ్యతో మాట్లాడుతూ ముందుగా తనని క్షమించమని కోరాడు. రంగయ్య అయోమయంగా చూస్తుండగా ‘‘రేపట్నుంచి నువ్వు ఎప్పటిమాదిరిగానే పనిలోకి రావచ్చు. అలాగే ఇంటి విషయంలో ఇబ్బంది పడుతున్నావని కూడా నాకు తెలిసింది. మీ భార్యాభర్తలిద్దరూ ఇక నుంచి మా అవుట్‌ ‌హౌస్‌లోనే ఉండొచ్చు. ఆ ఇల్లు శుభ్రం చేసుకోండి. ఇంక మీరు ఎక్కడికీ వెళ్ళాల్సిన పని లేదు. జిమ్‌తో కలిసి పనిచేసుకుంటూ నా దగ్గరే ఉండొచ్చు. మీ కోసం చూస్తుంటాను’’ అన్నాడు.
జరుగుతున్నది కలో నిజమో తెలియక, నోట మాట రాక చెమర్చిన కళ్ళతో తనకు నమస్కారం చేస్తున్న రంగయ్య భుజం తట్టి ‘‘నువ్వు నమస్కారం చెయ్యాల్సిన వ్యక్తి వేరొకరున్నారు. అతడే నీ స్నేహితుడు జిమ్‌!’’ అని చెప్పి వెనుదిరిగాడు ప్రొఫెసర్‌ ‌శంకరనారాయణ!

ఎం.‌రమేశ్‌ ‌కుమార్‌

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.