‘జాగృతి’ నిర్వహించిన స్వర్గీయ కొండపాక కిషన్‌రావు స్మారక నవలల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన రచన
బెంగాల్‌లోని నక్సల్బరీలో ఒక చిన్న రైతు తిరుగుబాటుగా మొదలైన ఉద్యమం కాలక్రమంలో దేశంలోని అనేక ప్రాంతాలకు విస్తరించింది భూమి, ఆకలి, దోపిడీ, సామాజిక అసమానత, అణచి వేతలకు వ్యతిరేకంగా పుట్టిన ఆ ఉద్యమం చివరకు తుపాకుల దారిలోకి మళ్లింది. దశాబ్దాలు గడిచాయి. తరాలు గడిచాయి. అడవులు, ప్రభుత్వాలు మారాయి. కానీ ఒక ప్రశ్న మాత్రం మారలేదు.ఈ పోరాటంలో నిజంగా గెలిచింది ఎవరు? పేదరికం అంతమైందా? గిరిజనుల జీవితాలు పూర్తిగా మారి పోయాయా? ప్రతి గూడెంలో పాఠశాల వెలుగు వెలిగిందా? ప్రతి గిరిజన కుటుంబానికి వైద్యం అందిందా? అడవిలో పుట్టిన పిల్లవాడికి తన భవిష్యత్తును తానే ఎంచుకునే అవకాశం వచ్చిందా? అంటే ఈ ప్రశ్నలకు సమాధానాలు ఒక్క మాటలో చెప్పలేం.
మావోయిస్టుల హింసను అణచివేయడానికి భారత ప్రభుత్వం భద్రతా చర్యలతో పాటు రహదారులు, పాఠశాలలు, ఆరోగ్యం, బ్యాంకింగ్, మొబైల్ కనెక్టివిటీ, పునరావాసం వంటి అభివృద్ధి కార్యక్రమాలను గత కొన్నేళ్లుగా చేపట్టింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం వామ పక్ష తీవ్రవాదం ప్రభావిత జిల్లాల సంఖ్య 2018లో గల 126 నుంచి 2025 చివరినాటికి 8 కి తగ్గింది. 2010లో 1,936గా ఉన్న హింసా ఘటనలు 2025లో 234కు తగ్గాయని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశం వామ పక్ష తీవ్రవాదం నుంచి విముక్తి పొందిందని 2026లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.అదే సమయంలో గిరిజన ప్రాంతాల్లో రహదారులు, మొబైల్ టవర్లు, ఆరోగ్యం, విద్య, బ్యాంకింగ్ వంటి సేవల విస్తరణను ఈ విజయానికి ముఖ్యమైన కారణంగా ప్రభుత్వం పేర్కొంది.
కానీ ప్రభుత్వ గణాంకాల్లో కనిపించే విజయం నాణేనికి ఒక వైపే. గిరిజనుడి ఇంటి ముందు నిలబడి అతని జీవితాన్ని చూస్తే కనిపించేది ఆ నాణెం రెండో వైపు.ఎందుకంటే ఒక ప్రాంతంలో తుపాకుల శబ్దం ఆగిపోవడం శాంతికి మొదటి మెట్టు మాత్రమే.శాంతి అంటే కేవలం కాల్పులు ఆగిపోవడం కాదు.శాంతి అంటే భయం లేకుండా జీవించడం. పోలీసులను, మావోయిస్టులను చూసి భయపడకుండా జీవించడం. తన పొలాన్ని కోల్పోతాననే భయం లేకపోవడం. తన అడవిలోకి తానే వెళ్లలేననే భయం లేకపోవడం. తన పిల్లవాడు చదువుకుంటే ఏదో ఒకరోజు తిరిగి వస్తాడనే నమ్మకం కలిగి ఉండటం. తన సమస్యను చెప్పడానికి ఒక ప్రభుత్వ కార్యాలయం అందు బాటులో ఉందనే భావన కలిగి ఉండటం. అదే నిజమైన అభివృద్ధి.
ధరణి,సోమన్నల కథలోని విషాదం ఇక్కడే ఉంది. సోమన్న చేతిలో తుపాకీ లేదు. ధరణి ఏ సిద్ధాంతానికీ నాయకురాలు కాదు. వాళ్లకు అధికారంపై ఆశ లేదు. ఆమెకు విప్లవం మీద పుస్తకాలు చదివే సమయం లేదు. వాళ్లకు కావలసింది రెండు పూటలా భోజనం. తమ పిల్లలకు చదువు, వైద్యం,తమ భూమిపై అడవిపై హక్కు, తమ జీవితంపై హక్కు. కానీ అవి దక్కని సోమన్న ,ధరణి లాంటి వారే ఎక్కువగా కనిపిస్తారు. ఒకవైపు తుపాకీ పట్టిన మావోయిస్టు, మరోవైపు సాయుధ పోలీసు, మధ్యలో తుపాకీ పట్టని అమాయక గిరిజనుడు. అతడే గాయపడతాడు. అతడే చనిపోతాడు. అతడి ఇల్లు కాలిపోతుంది. అతడి పిల్లల చదువు ఆగిపోతుంది. అతడి భవిష్యత్తు చీకటవుతుంది.ధరణి లాంటి పేదవాళ్లు ఒక సిద్ధాంతం కోసం పుట్టలేదు. వాళ్లు ఈ దేశంలో పుట్టారు. వాళ్లకూ ఈ దేశంలో సమానమైన హక్కు ఉంది.
నక్సల్బరీ ఉద్యమం ఎందుకు పుట్టిందనే ప్రశ్నకు చరిత్రలో అనేక సమాధానాలు ఉన్నాయి. పేదరికం, భూమి సమస్యలు, సామాజిక అసమానత, అడవులపై హక్కులు, స్వపరిపాలన లోపం, దోపిడీ వంటి అంశాలు గిరిజన ప్రాంతాల్లో అసంతృప్తికి కారణాలుగా ప్రభుత్వ నియమించిన 2008 నిపుణుల కమిటీ నివేదికను ఉటంకించిన పార్లమెంటరీ పత్రాలు పేర్కొన్నాయి.అయితే ఆ అసంతృప్తికి సమాధానంగా ఆయుధ పోరాటం ఎంచుకున్నప్పుడు మరో విషాదం మొదలైంది. హింసకు ప్రతి హింస వచ్చింది.అడవిలో తుపాకుల మోతలు ప్రతిధ్వనించాయి. మావోయిస్టులు భద్రతా బలగాలను, భద్రతా బలగాలు మావోయిస్టులను లక్ష్యంగా చేసుకున్నారు. మధ్యలో సామాన్య ప్రజలు చిక్కుకున్నారు. ప్రభుత్వం మావోయిస్టు హింస అభివృద్ధిని అడ్డుకుందని చెబుతోంది. మరోవైపు గిరిజన హక్కుల సంస్థలు భద్రతా చర్యలు, శిబిరాల విస్తరణ, భూమి, అడవి హక్కుల విషయంలో స్థానికుల ఆందోళనలను ప్రస్తావిస్తున్నాయి. ఈ రెండు దృక్కోణాల మధ్య వాస్తవ పరిస్థితులు ప్రాంతానికో విధంగా మారవచ్చు.
ఆపరేషన్ కగార్ వంటి సైనిక చర్యల ద్వారా మావోయిస్టు సంస్థాగత శక్తి తీవ్రంగా దెబ్బతింది. 2025లో కర్రెగుట్ట ప్రాంతంలో జరిగిన పెద్ద ఆపరేషన్‌లో 31 మంది మావోయిస్టులు మరణించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఆ తర్వాత కూడా అరెస్టులు, లొంగుబాట్లు కొనసాగాయి.2026 నాటికి కేంద్ర ప్రభుత్వం వామపక్ష తీవ్రవాదం (•ఔజు) ముగిసిందని ప్రకటించింది. అది భద్రతా పరంగా ఒక ముఖ్యమైన మార్పు కావచ్చు. కానీ మావోయిజం అంతరించడం ఒక లక్ష్యం. కానీ గిరిజనుడి జీవితం బాగుపడటం అసలు లక్ష్యం కావాలి.
రెండింటినీ ఒకటిగా చూడకూడదు.ఒక అడవిలో ఇక తుపాకీ శబ్దం వినిపించకపోయినా అక్కడ పాఠశాల లేకపోతే అభివృద్ధి పూర్తయినట్టు కాదు.పోలీసు క్యాంపు ఉన్నా ఆసుపత్రి లేకపోతే భద్రత పూర్తయినట్టు కాదు. రహదారి ఉన్నా స్థానికంగా ఉపాధి లేకపోతే అభివృద్ధి అసంపూర్ణమే. మొబైల్ టవర్ ఉన్నా తమ సమస్యలను చెప్పుకునే వ్యవస్థ లేకపోతే అనుసంధానం ఉన్నా ప్రజాస్వామ్యం ఇంకా దూరంగానే ఉంటుంది.
అందుకే ధరణి చనిపోయే ముందు చివరిసారిగా ఆకాశం వైపు చూసింది.ఆమె కళ్లలో కోపం లేదు. ఎన్నో సంవత్సరాలుగా తాను చూసిన తుపాకుల నీడలు ఆమె జ్ఞాపకాల్లో ఇంకా ఉన్నాయి.అందుకే ఆమె చనిపోయేముందు ‘‘మాకు జీవించే హక్కు కావాలి’’ అనుకుంది.
ఆమె మాటల్లో ఒక గిరిజన స్త్రీ బాధ మాత్రమే లేదు.అది తరతరాలుగా అడవుల్లో వినిపించని ఒక జాతి ప్రశ్న.‘‘మా కోసం పోరాడుతున్నామని చెప్పేవాళ్లూ, మా మీద తుపాకీ ఎక్కుపెట్టేవాళ్లూ మా గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఆ ప్రశ్నకు సమాధానం తుపాకీ ఇవ్వలేదు. ఇవ్వదు కూడా.
ఒకప్పుడు నక్సల్బరీలో మంటగా మొదలైన ఉద్యమం దాదాపు ఆరు దశాబ్దాల తరువాత చరిత్రలో ఒక దీర్ఘ అధ్యాయంగా మారిపోయింది.ఆ అధ్యాయం మనకు ఒక గొప్ప పాఠం చెబుతోంది.అన్యాయం ఉన్నచోట అసంతృప్తి పుడుతుంది.అసంతృప్తికి న్యాయమైన మార్గం లేకపోతే హింస పుడుతుంది.హింస పెరిగితే సాధారణ మనిషి ముందుగా నష్టపోతాడు.హింసను అణచవచ్చు.కానీ దానికి దారితీసిన ప్రతి సామాజిక సమస్యను పరిష్కరించకపోతే శాంతి సంపూర్ణం కాదు.అందుకే ఈ నవల ఒక ప్రశ్నతో కాకుండా ఒక ఆశతో ముగియాలి.ధరణి లాంటి వాళ్లు ఇక శలభాల్లా మాడిపోకూడదు. అవి వెలుగులై మారాలి.
నక్సల్బరీ మంటల నుంచి ఆపరేషన్ కగార్ వరకు సాగిన ఈ దీర్ఘ ప్రయాణం చివరికి మన ముందుంచే ప్రశ్న ‘‘ఎవరు గెలిచారు?’’ అనీ కాదు.‘‘ఇకపై ఎవ్వరూ చనిపోకుండా మనం ఏమి చేయాలి?’’అన్న ప్రశ్న. దానికి సమాధానం కోసం ఈ దేశం వెతకాలి.
ఎందుకంటే తుపాకీతో ఒక యుద్ధాన్ని గెలవవచ్చు.కానీ ఒక మనిషి హృదయాన్ని గెలవాలంటే న్యాయం కావాలి.ఒక ప్రాంతాన్ని శాంతింపజేయాలంటే అభివృద్ధి కావాలి.తమ సోమా జ్యోతిర్గమయ
(సమాప్తం)

– గన్నవరపు నరసింహ మూర్తి
