స్వదేశీయులే తమ వ•లాలను, భాషలను విస్మరిస్తున్న ఈ కాలంలో… యోగా, భరతనాట్యం, తత్వశాస్త్రం, సంస్కృత-హిందీ సాహిత్యాన్ని నిత్య నూతనంగా నిలుపుతూ ఎందరో విదేశీ మహిళలు భారతీయ విశిష్టతను విశ్వవ్యాప్తం చేస్తున్నారు. భాషా సరిహద్దులను చెరిపేసి భారతీయ జ్ఞాన సంపదకు పట్టం కడుతున్నారు. ఈ సాంస్కృతిక రాయబారుల సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం అందిస్తున్న పద్మ పురస్కారాలు, వసుధైవ కుటుంబకం అనే సూక్తిని సార్థకత చేకూరుస్తున్నాయి. మన సనాతన ధర్మానికి మరింత వన్నె తెచ్చిపెడుతున్నాయి.
ఇక్కడి జ్ఞాన సంపద, తత్వశాస్త్రం భాషల పట్ల ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణకు మనదేశం ఇటీవల ప్రకటించిన పద్మ పురస్కారాలే నిదర్శనం. గతంలో సి.పి. బ్రౌన్‌ ‌నుండి నేటి డాక్టర్‌ ‌లియుద్మిలా ఖోఖ్లోవా వరకు అనేకమంది విదేశీయులు భారతీయ సమాజానికి, సాహిత్యానికి వెలకట్టలేని సేవలు అందించారు. అటువంటి వారిని మన దేశం ఫెలోషిప్‌లు, ప్రవాసి భారతీయ సమ్మాన్‌ ‌వంటి ప్రోత్సాహకాల ద్వారా గౌరవిస్తోంది
డాక్టర్‌ ‌లియుద్మిలా ఖోఖ్లోవాకు భారత ప్రభుత్వం తాజాగా ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని అందజేసింది. రష్యాలోని మాస్కో స్టేట్‌ •••ని వర్సిటీలో సుదీర్ఘ కాలం పాటు హిందీ, పంజాబీ భాషలపై పరిశోధనలు చేయడమే కాకుండా, పవిత్ర సిక్కు గ్రంథాలైన ‘జప్‌ ‌జీ’, ‘జప్‌ ‌సాహిబ్‌’‌లను రష్యన్‌ ‌భాషలోకి ఖోఖ్లోవా అనువదించారు. వేలాదిమంది విదేశీ విద్యార్థులలో భారతీయ సాహిత్య అధ్యయనాలపై ఆసక్తి పెంచిన లియుద్మిలా కృషిని గుర్తిస్తూ ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది.
ఇక, వందేళ్ల వయసులోనూ యోగాను నేర్పిస్తున్న ఫ్రాన్స్‌కు చెందిన షార్లెట్‌ ‌షోపిన్‌, ‌భరతనాట్యాన్ని వ్యాప్తిచేస్తున్న సిల్వి మోర్గాన్‌ ‌వంటి విదేశీ మహిళల సేవలు…మన సాంప్రదాయాలను గౌరవించాల్సిన బాధ్యతను స్వదేశీయులకు గుర్తుచేస్తున్నాయి. ఇటీవల రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా సాహిత్యం, విద్య విభాగంలో డాక్టర్‌ ‌లియుద్మిలా ఖోఖ్లోవా ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని అందుకున్నారు. 1954లో పద్మ అవార్డులు ప్రారంభమైనప్పటి నుంచి ఈ పురస్కారం పొందినవారిలో పదిమంది వరకు రష్యన్‌ ‌పౌరులు ఉన్నారు.
మాస్కో స్టేట్‌ •••నివర్సిటీలో 1970లో హిందీ భాషా సాహిత్యంలో ఎంఏ పూర్తి చేసిన ఖోఖ్లోవా 1974లో హిందీ, రాజస్థానీ భాషల పోలికపై పరిశోధన చేసి డాక్టరేట్‌ ‌పొందారు. మాస్కో స్టేట్‌ •••నివర్సిటీకి చెందిన ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఏషియన్‌ అం‌డ్‌ ఆ‌ఫ్రికన్‌ ‌స్టడీస్‌లో ఇండియన్‌ ‌ఫిలాలజీ విభాగంలో అసోసియేట్‌ ‌ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. హిందీ, రష్యన్‌, ఇం‌గ్లీష్‌ ‌భాషలలో 6 పుస్తకాలు, 92 పరిశోధనా పత్రాలు ప్రచురించారు. హిందీతో పాటు పంజాబీ, సిక్కు భాషల్లో విశేష పరిశోధన చేశారు. సిక్కుల పవిత్ర గ్రంథాలైన గురునానక్‌ ‌దేవ్‌ ‌జీ, ‘జప్‌ ‌జీ’,10వ గురువైన గోవింద్‌ ‌సింగ్‌ ‌జీ ‘జప్‌ ‌సాహిబ్‌’‌లను పంజాబీ నుండి రష్యన్‌ ‌భాషలోకి లియుద్మిలా అనువదించారు. ఆమె పంజాబీ అధ్యయనాలకు చేసిన సేవలకుగానూ 2005లో లండన్‌లోని ‘పంజాబీ సాత్‌’ ‌నుండి అవార్డు పొందారు.
రష్యన్‌ ‌విద్యార్థులకు కేవలం హిందీ భాషనే కాకుండా, భారతదేశ చరిత్ర, సంస్కృతి, ఆర్థిక వ్యవస్థపై ఆసక్తిని పెంపొందిస్తూ భారతీయ సంస్కృతిపై ప్రేమ వ్యాప్తి చెందేలా చేశారు. ఖోఖ్లోవా మాత్రమే కాదు… భారత సేవా రంగంలో విదేశీయులు ఎందరో పని చేశారు. ఐర్లాండ్‌కు చెందిన మార్గరెట్‌ ‌నోబుల్‌ ‌సిస్టర్‌ ‌నివేదిత స్వామి వివేకానంద శిష్యురాలిగా భారత్‌కు వచ్చి, బాలికల విద్య, మహిళా సాధికారత, దేశభక్తి ఉద్యమానికి ప్రాణం పోశారు.
బ్రిటన్‌కు చెందిన చార్లెస్‌ ‌ఫిలిప్‌ ‌బ్రౌన్‌ (‌సి.పి. బ్రౌన్‌) ‌బ్రిటన్‌ ఆం‌ధ్రాలో కలెక్టర్‌గా పనిచేస్తూ, అంతరించిపోతున్న తెలుగు సాహిత్యాన్ని, వేమన పద్యాలను సేకరించి నిఘంటువులు రూపొందించి తెలుగు భాషా బాంధవుడుగా నిలిచారు. అలాగే బ్రిటన్‌కు చెందిన మార్క్ ‌టుల్లీ కూడా బీబీసీ ప్రముఖ పాత్రికేయుడిగా దశాబ్దాల పాటు భారతీయ గ్రామీణ జీవనం, రాజకీయం, సంస్కృతిని ప్రపంచానికి నిజాయతీగా చాటారు. ఫ్రాన్స్‌కు చెందిన ఫ్రాంకోయిస్‌ ‌గాథియర్‌ ‌భారతీయ చరిత్ర, సంస్కృతి, పరంపరలపై విపరీతమైన పరిశోధన చేసి, తన పుస్తకాల ద్వారా అంతర్జాతీయంగా ప్రాచుర్యం కల్పించారు. ఖాన్‌ అబ్దుల్‌ ‌గఫార్‌ఖాన్‌, ‌నెల్సన్‌ ‌మండేలా వంటి వారికి భారత రత్న ఇచ్చి గౌరవిం చారు.
వంద ఏళ్ల వయస్సులో పద్మశ్రీ పొందిన యోగా గురువు షార్లెట్‌ ‌షోపిన్‌. ఇటీవల పద్మశ్రీ పొందిన విదేశీ మహిళల్లో ఈమె ఒకరు. గత 40 ఏళ్లకు పైగా ఫ్రాన్స్‌లో వేలాది మందితో భారతీయ యోగా విద్యను ఉచితంగా సాధన చేయిస్తూ, యోగా విశిష్టతను ఐరోపాలో ప్రాచుర్యంలోకి తెచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సాధికారత, పేదరికం, మానవ హక్కులపై డాక్యుమెంటరీలు తీసిన ప్రముఖ వ్యాఖ్యాత, సినీ నిర్మాత అయిన ఫ్రెడరిక్‌ ‌బెడోస్‌ అం‌తర్జాతీయంగా అవగాహన కల్పించారు. భారతీయ సంప్రదాయ నృత్యమైన భరతనాట్యం పట్ల ఉన్న మక్కువతో, ఫ్రాన్స్‌లో నృత్య పాఠశాలను ప్రారంభించి ఐరోపా విద్యార్థులకు భరతనాట్యాన్ని నేర్పిస్తూ భారతీయ కళలను వ్యాప్తి చేస్తున్నారు ఫ్రాన్స్‌కు చెందిన సిల్వి మోర్గాన్‌. ‌స్పెయిన్‌లోని విశ్వవిద్యాలయాలలో భారతీయ సాహిత్యం, రవీంద్ర నాథ్‌ ‌ఠాగూర్‌ ‌కవితలు, భారతీయ తత్వశాస్త్రంపై పరిశోధనలు ప్రోత్సహిస్తూ దశాబ్దాలుగా అధ్యాపకు రాలిగా సేవలందిస్తున్నారు డాక్టర్‌ ‌రోజాలియా బైలో.
సరిహద్దులు, భాషలు, భౌగోళిక అడ్డంకులకు అతీతంగా మానవత్వమే పరమావధిగా భారతీయ సంస్కృతికి సేవ చేస్తున్న ఈ విదేశీ విద్వాంసుల ప్రయాణం ప్రతీ ఒక్కరికీ అత్యంత స్ఫూర్తిదాయకం. భారతీయ తత్వానికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్న వీరి సేవలను గౌరవించుకోవడం మన బాధ్యత మాత్రమే కాదు… మన వ•లాలను కాపాడు కోవాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పే మధురమైన జ్ఞాపిక.

జయశ్రీ ఆచంట
సీనియర్‌ ‌జర్నలిస్ట్

By editor