హల్దీఘాటి యుద్ధానికి 450 ఏళ్లు
భారతీయ చరిత్రలో మహారాణా ప్రతాప్‌ను కేవలం ఒక వీర యోధుడిగా కాక, స్వతంత్రత, స్వాభిమానం, రాష్ట్ర గౌరవాలకు శాశ్వత ప్రతీకగా పరిగణిస్తారు. అంతేకాదు, జూన్ 1576, 18న జరిగిన హల్దీఘాటీ యుద్ధాన్ని భారత చరిత్రలో జరిగిన గొప్ప ఘటనల్లో ఒక దానిగా పరిగణిస్తారు. పరిమిత సాధనాలు ఉన్నా అకుంఠిత ధైర్యం, అజేయమైన సాహసం, మాతృభూమి పట్ల అచంచలమైన విధేయతతో ఎటువంటి సామ్రాజ్యవాదశక్తినైనా సవాలు చేయవచ్చని రుజువు చేసిన ఘట్టమిది.
ప్రపంచంలో జరిగిన ప్రముఖ యుద్ధాలలో ఒకటిగా హల్దీఘాటీ యుద్ధాన్ని పరిగణించాలి కానీ, దాని విశిష్టతను నిష్పక్షపాతంగా మూల్యాంకనం చేయకపోవడం దురదృష్టకరం. ఐతిహాసిక ప్రమాణాలు, సమకాలీన వివరణలు, ఇరుపక్షాల పత్రాలను అధ్యయనం చేసినప్పుడు, ఈ యుద్ధంలో భౌతిక, నైతిక, వ్యూహాత్మక, మానసిక విజయం రాణా ప్రతాప్, మేవాడ్ సైన్యానికే చెందిందనేది చరిత్రకారుల అభిప్రాయంలోని యథార్థ సత్యం. మొగలుల విషయానికి వస్తే, మేవాడ్ సేనలు తమను పరాజయం అంచులకు నెట్టాయని అంగీకరిస్తూనే, అంతిమంగా యుద్ధం తమకు అనుకూలంగా సాగిందని వారు పేర్కొంటారు.
కీలక అంశాలను నిర్లక్ష్యం చేయడం
కొన్ని ఇతర వ్యాఖ్యానాల్లో మొగల్ సేనలు మొదటి దెబ్బతోనే యుద్ధ మైదానం నుంచి 6-7 కోసుల దూరం పరుగులు తీశారు. అయితే, మొగలుల విజయానికి ప్రమాణాలను వారే స్వయంగా అంగీకరించలేదు. కానీ ఫార్సీ మూలంలో మాత్రం ఎటువంటి ఆధారాలు లేకుండానే విజయం సాధించామని రాసేసుకుం టారు. ఎందుకంటే, జానపద సాహిత్యం, ప్రసిద్ధ డింగల్ వీరగాథలు వంటి ముఖ్యమైన ఆధారాలతో పాటు, ప్రతాప్ జారీ చేసిన పత్రాలు, రాగి ఫలకాలు, వంశావళి తదితర పరిపాలనా ఆధారాలను వారు విస్మరించారు. అయితే, కొందరు ప్రముఖ చరిత్రకారుల, ప్రతాపుడి మీద పరిశోధన చేస్తున్న వారి అభిప్రాయాలు, హల్దీఘాటీలో యుద్ధంలో ప్రతాపుడి గెలుపును నిరూపిస్తున్నాయి.
యుద్ధాన్ని కళ్లతో చూసి, పరిస్థితి ఏమిటో చెప్పిన సమకాలీన మొగల్ చరిత్ర కారుడు అబ్దుల్ కాదిర్ బదయూనీ ఎటువంటి సంకోచం లేకుండా మేవాడ్ సేనల తొలి దాడులలో మొగల్ సేనలు అస్తవ్యస్తం అయిపోయి, పారిపోయి, బనాస్ నది వరకూ వెనక్కి తగ్గాయని అంగీకరించాడు. రామప్రసాద్‌ను తీసుకుని అక్బర్ వద్దకు వెళ్తున్నప్పుడు ప్రజల మనస్సుల్లో ఉన్న భావనల గురించి రాస్తూ, ‘మొగల్ సేనల విజయాన్ని ప్రజలు విశ్వసించడం లేదు. మేవాడ్ ప్రజలు అయితే అక్బర్ సేనలను అపహాస్యం చేస్తూ, వారిపై మట్టిగడ్డలు విసిరికొట్టడం ప్రారంభించారు, అయితే సేనలు ప్రతిఘటించకుండా అజ్మీర్ వైపు వెళ్లాయ’ని బదయూనీ రాశాడు. విజయం మహారాణా ప్రతాప్‌దే అని జనాభిప్రాయమని అనేందుకు పై ఘటనలే ప్రమాణాలు.
అనంతరం, యానల్స్ అండ్ యాంటిక్విటీస్ ఆఫ్ రాజస్థాన్‌ను రచించిన ఆంగ్లేయ చరిత్రకారుడు కర్నల్ జేమ్స్ టాడ్, హల్దీఘాటీ యుద్ధాన్ని రాజస్థాన్ థర్మోపైలే అని పేర్కొన్నాడు. ఆయన ప్రకారం ఇక్కడ యుద్ధం కేవలం సేనల మధ్య సంఘర్షణ కాదు, అది ఆర్య గౌరవానికి, స్వాతంత్య్రానికి, రాజపుత్రుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఒక గొప్ప పండుగ. రక్తరంజితమైన హల్దీఘాటీ భూమిపై మేవాడ్ వీరులు తమ ప్రాణాలను త్యాగంచేసి, స్వాభిమానాన్ని రక్షించుకోవడం కోసం ప్రాణత్యాగం కూడా గర్వకారణమనే సందేశాన్ని ఇచ్చారు.
చరిత్రకారుల అభిప్రాయం
రాజస్థాన్ చరిత్రలో అత్యంత విద్వాంసుడు అయిన చరిత్రకారుడు గౌరీశంకర్ హీరాచంద్ ఓఝా తన పుస్తకంలో ఉదయపూర్ రాజ్య చరిత్ర, హిందూ, ముస్లింలకు మధ్య జరిగిన యుద్ధంలో ముస్లిం పక్ష వర్ణణలు ఏకపక్షంగా ఉంటాయని, అయినప్పటికీ ముస్లింల కథనం నుంచే మొగల్ సేనలకు ఎంత దుర్దశ ప్రాప్తించిందో తెలుస్తుందని తొలి సంపుటిలోని 442వ పేజీలో పేర్కొన్నాడు. మహారాణా ప్రతాప్ సింగ్ తిరిగి వస్తున్నప్పుడు కూడా ఆ సేనల పరిస్థితి మళ్లీ వచ్చేలా కూడాలేదు. అలాగే, ఆ సేనల భయం ఎంతగా ఉందంటే, కలలో కూడా మహారాణా ప్రతాప్ తమను చంపడానికి పొంచి ఉన్నాడని భావించేవారు. రెండు రోజుల తర్వాత, అంటే జూన్ 21న మొగల్ సేనలు గోగుందా చేరుకున్నప్పుడు కూడా, మహారాణా ప్రతాప్ వచ్చి తమపై ఎక్కడ విరుచుకుపడతాడో అని ఆ గ్రామం నాలుగు దిక్కులా కందకాలు తవ్వించి, గుర్రాలు దాటలేని స్థాయిలో ఎత్తైన గోడలను నిర్మింపచేసి, గ్రామంలోని ప్రతి వీధిలోనూ తాత్కాలిక అడ్డుకట్టలను వేశారు. మొగల్ సేనలు గోగుందాలో ఖైదీలలాగా హద్దులలోనే ఉండి, చివరికి వరకూ వెళ్లలేకపోయారు. దీనివల్ల వారికి మరింత దుర్దశ దాపురించింది. ఈ విషయాలన్నింటినీ పరిశీలించినప్పుడు, యుద్ధంలో ప్రతాపసింహుడిదే విజయమని అంగీకరించవలసి వస్తుంది.
ఆధునిక చరిత్రకారులలో ఒకరైన డా।। దేవ్ కొఠారీ తన మహారాణా ప్రతాప్, అతడి యుగం (మహారాణా ప్రతాప్ ఔర్ ఉన్‌కా యుగ్) అన్న పుస్తకంలోని 13వ పేజీలో యుద్ధపు వాస్తవిక ముగింపు గోగుందాలో జరిగిందంటాడు. ‘ఇక్కడ మొగల్ సేనలు లాజిస్టిక్స్ లోటుతో, భయం, వైఫ ల్యంతో పోరాటం చేస్తూ ఉన్నారం’టూ వివరించారు. వారు మహారాణా ప్రతాప్‌ను బంధించలేకపోయారు, మేవాడ్‌ను శాశ్వతంగా కైవసం చేసుకొని తమ ఆధిపత్యాన్ని, అధికారాన్ని స్థాపించలేకపోయారు. యుద్ధ లక్ష్యం ప్రతాపుడిని ఓడించి, మేవాడ్‌ను మొగల్ సామ్రాజ్యంలో కలుపుకోవడమే అయితే, ఆ లక్ష్యం పూర్తిగా విఫలమైంది.
మరొక చరిత్రకారుడు డా।। దేవీలాల్ పాలీవాల్ రచించిన మహారాణా ప్రతాప్ మహాన్ (మహారాణా ప్రతాప్ ది గ్రేట్) 43వ పేజీలో, తనకు చెందిన అనేకమంది యోధులను కోల్పోయినప్పటికీ, ప్రతాప్, అతడి సేనలు అపరాజితులుగా సురక్షితమైన కొండలకు తిరిగి వెళ్లారని, మాన్‌సింగ్ వారిని వెంబడించలేక పోయాడని రాశారు. నిజానికి, మొగల్ సేనలకు దుర్దశ పట్టిన గోగుందాలో ఈ యుద్ధం ముగిసింది. వారు అక్కడ విఫలమై తిరిగి వెళ్లవలసి వచ్చింది. ఈ యుద్ధం 18 జూన్ ఖమణోర్ మైదానంలో ప్రారంభమై, సెప్టెంబరులో మొగలు సేనలు విఫలమై వెనుదిరిగిన గోగుందాలో అంతమైంది.
‘బహుఆయామీ రాష్ట్రనాయక్ ప్రతాప్’ (బహుముఖ జాతీయ నాయకుడు ప్రతాప్) అన్న పుస్తకంలో డా।। ఎన్.ఎం.మాధుర్, డా।। కె.ఎస్ గుప్తా, సజ్జన్‌సింగ్ రాణావత్ కూడా ఈ విషయాన్ని నిర్ధారించారు. హల్దీఘాటీ యుద్ధంలో మొగలులు ఊహించని ఓటమిని చవిచూడవలసి వచ్చింది. ఈ యుద్ధంలో మహారాణా ప్రతాప్ విజయం, భారతీయ దిగంతంలో మొగలులు అజేయులనే భ్రమను ధ్వంసం చేసింది. ఈ యుద్ధంలో లభించిన సఫలత కారణంగా ప్రతాపుడి నాయకత్వంపై ప్రజల విశ్వాసం మరింత బలపడేలా చేసింది.
ప్రొ. ఆర్.పి.వ్యాస్ రచించిన మహారాణా ప్రతాప్ 135 పేజీలో, మొగలులకు ఈ యుద్ధం అసఫలంగా మిగిలిపోయింది. యుద్ధమైన తర్వాత మహారాణాను వెంబడించలేకపోయారు, మేవాడ్‌ను మొగల్ సామ్రాజ్య అంగంగా చేసుకోలేకపోయారు. కొద్దికాలంపాటు మొగలులు ఏ ప్రాంతాన్ని అయితే అధీనం చేసుకున్నాయో, అది నిర్జనమైన, నిస్సారమైన, రాళ్లతో కూడిన ప్రాంతం. దీనివల్ల మొగలులకు లేశమైనా లాభం కలుగలేదు. హల్దీఘాటీ యుద్ధం లేదా దోపిడీ పేరుతో మాన్‌సింగ్‌కు లభించింది మహారాణా ప్రతాప్‌కు చెందిన ప్రసిద్ధ ఏనుగు రామప్రసాద్ మాత్రమే. ఈ యుద్ధంలో మొగలుల వైఫల్యం కారణంగా, మొగలు సేనలు అజేయమైనవనే భ్రమలు పటాపంచలైపోయాయి.
ఇతర వాస్తవాలు కొన్ని
చరిత్రకారుల ద్వారా ప్రతాప్ తప్పించుకోవడాన్నే ఓటమిగా పేర్కొన్నారని ప్రతాపుడిపై శోధిస్తున్న సమయంలో రచయిత తెలుసుకున్నారు. వ్యూహాత్మ కంగా చేస్తే తప్ప తప్పించుకోవడం పరాజయం అనలేం. వాస్తవానికి హల్దీఘాటీ యుద్ధంలోని రెండవ చరణం గోగుందాలో జరిగింది. యుద్ధం హల్దీఘాటీ యుద్ధభూమిలో సమాప్తం కాలేదు, కొనసాగుతూనే ఉంది. ప్రతాపుడు గోగుందాలో మొగల్ సేనలను ఎంతటి దుస్థితికి తెచ్చాడంటే, అవి విజయం సాధించిన సేనలలా కాకుండా పరాజయం పొందిన వాటిలా వ్యవహరించాయి.
ఖమణోర్‌లో మొగల్ సేనలు ఓటమిని ఎదుర్కోవలసి వచ్చిందని నిర్ద్వంద్వంగా చెప్పవచ్చని కేసరీ సింగ్ తన పుస్తకంలో పేర్కొన్నారు. దండ యాత్రకు వచ్చిన సేనను ఖమణోర్‌లో ప్రతాపుడు ఓడించాడు. ఈ యుద్ధంలో ప్రతాపుడు తన శత్రువుల మనసులో పుట్టించిన భయానికి వారి మనోబలం సడలిపోయింది. ఈ యుద్ధం కారణంగా, ప్రతాపుడి పేరు, కీర్తి దేశంలోని దూరప్రాంతాలకు కూడా వ్యాపించింది. మహారాణా ప్రతాపుడు స్వాతంత్య్రం కోసం నిర్భీతితో పోరాడిన తీరుకు దేశ ప్రజలలో ఆయన పట్ల గౌరవం పెరిగిపోవడమే కాదు, అతడి రాజ్యంలో స్వాతంత్య్రతా భావనలు ప్రబలంగా వృద్ధి చెందాయి.
మొగల్ సేనల విజయాన్ని అంగీకరించలేకపోవ డానికి కారణం, వారు పెట్టుకున్న లక్ష్యాలలో ఒక్కదానిని కూడా వారు సాధించలేకపోవడమేనని తన పరిశోధనలో రచయిత స్పష్టం చేశారు. అందుకే, మాన్‌సింగ్, ఆసఫ్‌ఖాన్‌లకు దర్బారులోకి రాకను నిషేధించి, అక్బర్ తన అసంతుష్టిని వ్యక్తం చేశాడు. తర్వాత అదే ఏడాది అక్బరే స్వయంగా సేనలను తీసుకుని, మేవాడ్‌పై విజయం కోసం బయలు దేరవలసి వచ్చింది. ఒకవేళ మేవాడ్‌ను గెలుచుకుని ఉంటే, అక్కడ ఇంకా గెలవడానికి ఏముందన్నది ప్రశ్న. ఇది ఆలోచించవలసిన ప్రశ్న. మొగల్ సేనలు గోగుందాలో తమ అధికారాన్ని నిలుపుకోలేక పోయాయి. ఈ ప్రాంతాలలో ప్రతాపుడిని నిలువ రించలేకపోయారు.
అందుబాటులో ఉన్న చారిత్రిక వాస్తవాలు, సమకాలీన వివరణలు, చరిత్ర కారుల సమ్మిళిత దృష్టి నుంచి హల్దీఘాటీ యుద్ధంలో వాస్తవిక విజయం మహారాణా ప్రతాపుడిదే అని స్పష్టమవుతోంది. ఈ విజయం కేవలం యుద్ధభూమిలో విజయమే కాదు, భారతీయ ఆత్మగౌరవం, స్వతంత్రత, జాతీయ చైతన్యపు విజయం.
భారతభూమిపై స్వాతంత్య్రం, స్వాభిమానం గురించి ఎప్పుడెప్పుడు చర్చ జరిగినా, హల్దీఘాటీ పుణ్యభూమి, మహారాణా ప్రతాపుడి శాశ్వత కీర్తి, పేరును సువర్ణాక్షరాలతో గుర్తుచేసుకుంటారు.
– డా।। మనీష్ శ్రీమాలీ,
అసిస్టెంట్ ప్రొఫెసర్ (చరిత్ర), మోహన్‌లాల్ సుఖాడియా విశ్వవిద్యాలయం, ఉదయ్‌పూర్