జూన్‌ 2 ‌నుంచి యమున పుష్కరాలు


‌త్రివేణి సంగమంలో వాహిని అయిన యమున దేశంలోని ప్రధాన నదుల్లో ఒకటి. హిమాలయాల్లో యుమునోత్రి అనే ప్రదేశంలో ఉద్భవించిన ఈ నది హరియాణా రాష్ట్రం గుండా ప్రవహించి ఉత్తరప్రదేశ్‌లోకి ప్రవేశిస్తోంది. ఢిల్లీ, నోయిడా, మధుర, బృందావనం, ఆగ్రా నగరాలలో ప్రవహిస్తూ ప్రయాగ్‌ ‌రాజ్‌ ‌వద్ద గంగానది అంతర్వాహిని అయిన సరస్వతీతో సంగమిస్తుంది. ఈ నది జన్మస్థలి నుంచి దాదాపు 860 మైళ్లు ప్రవహిస్తుంది.

యమున జీవనది. దాని ఆవిర్భావం,దాని మహత్తుల గురించి పురాణేతిహాసాల్లో, వైదిక గ్రంథాల్లో ఉంది. ఈ నదీమాత శ్రీకృష్ణ పరమాత్ముని పాదస్పర్శతో పునీతమై•నదని పురాణవాక్కు. ఆయన బాల్యమంతా ఈ నది పరీవాహక ప్రాంతం లోనే గడిచింది. శ్రీ శుకయోగీంద్రుడు నైమిశారణ్యంలో మహర్షులకు శ్రీమద్భాగవతాన్ని వినిపిస్తున్నప్పుడు పరమాత్ముని దివ్య లీలావైభవం వినేందుకు పురాణస్థలికి యమునే ముందుగా చేరేదని పురాణాలు పేర్కొంటున్నాయి. యమునోత్రి కూడా గంగోత్రిలానే పరమపావన ప్రదేశం. దీనికి ‘సూర్యతనయ, శమనస్వస్తా కాళింది’ అనే పేర్లు ఉన్నాయి. గంగా నదికి ఉపనది అయిన యమునకు ఎన్నో ఉప నదులున్నాయి. రంతిదేవుని కారణంగా జన్మించినట్టు చెప్పే చంబలి వాటిలో ముఖ్యమైనది. దీనికే చర్మణ్వతి అనే పేరు కూడా ఉంది. గౌరి, సాహిబి, సింధ్‌, ‌బెట్వా, ధసన్‌, ‌క్రైన్‌ అనే ఉపనదులు యమునలో సంగమిస్తున్నాయి. యమునోత్రిలో వేడి నీటి గుండాలున్నాయి. యమునోత్రి వద్ద యమునా మాత ఆలయం ఉంది. ఆ నదీ మతల్లి విగ్రహం ‘తాబేలు మీద నీటి కడవ పట్టుకొన్నట్టు’ ఉంటుంది. భరతుడు, అంబరీషుడు, శంతనుడు తదితర చక్రవర్తులు ఈ నది ఒడ్డున ఎన్నో పుణ్యకార్యాలు నిర్వహించారు.
త్రివేణీ సంగమం దేశంలోనే అత్యంత పుణ్య ప్రదమైన ప్రదేశాల్లో ఒకటిగా ప్రసిద్ధం. అక్కడ 60 కోట్ల పుణ్యతీర్థాలు సంగమించాయని, ఈ తావున స్నానం చేస్తే విశేష ఫలితం ఉంటుందని మహా భారతం పేర్కొంది. యుమునా నది నీటిని నోటి నిండుగా స్వీకరించిన వారికి సోమయాగం చేసినంత ఫలితం దక్కుతుందని కూడా తెలిపింది. పుష్కర స్నానాదికాలను అటుంచి, కార్తికంలో ఈ నదీస్నానం అత్యంత శుభద్రమంటారు. నదీ తీరంలోని మధురలో జనార్దనుడిని, శివకేశవులను, సూర్యుడిని ఆరాధించినా, పితృదేవతలకు పిండప్రదానం చేసినా ఎనలేని పుణ్యం దక్కుతుందంటారు.
జూన్‌ 2 ‌నుంచి యుమున పుష్కరాలు
పుష్కరం అంటే ‘పుణ్య జలం’ అనే అర్థం చెబుతారు. మనిషికి పుష్టినిచ్చే వాటిలో నీరు (పోషయతీతి పుష్కరం) ఒకటి. పుష్కరుడు నివాసం ఉన్నంత కాలంలో ఆయా నదులను మరింత పుణ్యదాయినులుగా భావిస్తారు. పుష్కరుడితో పాటు గురు (బృహస్పతి) గ్రహం ఏడాదికి ఒక రాశి వంతున పన్నెండు రాశులను పన్నెండేళ్లలో చుట్టి వస్తుంది. బృహస్పతి ఒక్కొక్క రాశిలో ప్రవేశించినప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తుంటాయి. .
‘మేషే గంగా వృషే రేవా మిధునేచ సరస్వతీ!
కర్కటే యమునా ప్రోక్తా సింహే గోదావరీ స్మృతా!!
కన్యాయాం కృష్ణవేణీ చ కావేరీ ఘటకే స్మృతా!
వృశ్చికే తామ్రపర్ణీ చ చాపే పుష్కర వాహినీ!!
మకరే తుంగభద్రా చ కుంభే సింధునదీ స్మృతా!
మీనే ప్రణీతా చ నదీ గురోస్సంక్రమణే స్మృతా!!!
మేషంలో (గంగ), వృషభం (రేవ), మిథ••నం (సరస్వతి), కర్కాటకం (యమున), సింహం (గోదావరి), కన్య (కృష్ణా), తుల (కావేరి), వృశ్చికం (భీమారథీ), ధనుస్సు (బ్రహ్మపుత్ర), మకరం (తుంగభద్ర), కుంభం (సింధు), మీనం (ప్రాణహిత) ఇలా పుష్కరాలు వస్తుంటాయి. ఈ ఏడాది బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశించడం ద్వారా యమున పుష్కర శోభను సంతరించుకొంటోంది.
‘జన్మప్రభృతి యత్పాతం స్త్రియావా పురుషైనవా
పుష్కరేత్‌ ‌స్నాన మాత్రస్య సర్వమేవ ప్రణశ్యతి’..
పుట్టినప్పటి నుంచి సంక్రమించే పాపాలు తొలగిపోయేందుకు పుష్కర సమయంలో నదీస్నానం చేయాలని శాస్త్రం చెబుతోంది. ‘దివ్యములై ఈ జలాలు మంగళకరములై మా అభీష్టములను నెరవేర్చుగాక! తాగేందుకు అనువైన నీటిని ఇచ్చుగాక! నీరు మా వైపు ప్రవహించుగాక’ (‘శంనో దేవీరభీష్టయ ఆపోభవంతు పీతయే/శంయోరభిస్రవస్తునః’) అని పుష్కరస్నానం వేళ జలదేవతా ప్రార్థన చేయాలి.
స్నానానంతరం శాస్త్రానుసారం జపం, హోమం, అర్చన, దానం, పితృతర్పణం వంటివి చేయాలి. పుష్కరసహిత బృహస్పతితో పాటు ముక్కోటి దేవతలు, పితృదేవతలు నదిలో ఉంటారని పురాణవచనం. బృహస్పతి పుష్కర నదిలో ఏడాది పొడవునా ఉన్నా, ఆది,అంత్య పుష్కరాలు (తొలి పన్నెండు రోజులు, తుది పన్నెండు రోజులు) శ్రేష్ఠమని చెబుతారు. మిగిలిన రోజుల్లో మధ్యాహ్న సమయంలో రెండు ముహూర్తాల(నాలుగు గడియలు) కాలం ఆ నదిలో పుష్కర ప్రభావము ఉంటుందట.
నీటిలో రెండు శక్తులున్నాయని వేదం చెబుతోంది. దాహార్తిని తీర్చడం, శుభ్రపరచడం బాహ్యశక్తులైతే; మేధ్యం, మార్జనం అంతర్గత శక్తులుగా వివరిస్తోంది. మేధ్యం అంటే నదీ స్నానం సమయంలో వ•డుసార్లు మునక వేస్తే తెలిసీ తెలియక చేసే పాపాలు పోతాయని, ‘మార్జన’ అంటే నీటిని చల్లుకోవడం అంటే సంప్రోక్షణ అని అర్థం. దీని వలన ద్రవ్యశుద్ధి జరుగుతుందని పురాణాల వర్ణన. నీరు నారాయణ స్వరూపం కనుక స్నాన పక్రియలో ఆయన స్పర్శతో పునీతులు అవుతారని విశ్వాసం.

డా।। ఆరవల్లి జగన్నాథస్వామి
సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE