సింహంభట్ల సుబ్బారావు, 6300674054
చాంద్రమాన ప్రకారం ఈ సంవత్సరాన్ని (2026-27) శ్రీ పరాభవనామ సంవత్సరంగా పిలుస్తారు. ప్రభవాది 60 సంవత్సరాల్లో 40వది. ఈ పరాభవనామ సంవత్సరానికి కేతువు అధిపతి. ఈ సంవత్సరం రజత(వెండి)దానం ఉత్తమ ఫలితాలు ఇస్తుంది.
యమునా పుష్కర నిర్ణయం.
శ్రీ పరాభవనామ సంవత్సరం, అధిక బహుళ పాడ్యమి సోమవారం (01.06.2026) రాత్రి బృహ స్పతి(గురుడు) మిథునం నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ మరునాడు మంగళవారం (02.06.2026) యమునా నదీ పుష్కరాలు ప్రారంభమై 13వ తేదీ ముగుస్తాయి.
అధిక మాసం
మేషం మొదలుకొని సూర్యుడు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నెల సంచరిస్తాడు. ఇలా సూర్యుడు రాశిలో ప్రవేశించడాన్ని మేష సంక్రమణం, వృషభ సంక్ర మణం అంటారు. సూర్య సంక్రమణం జరగని మాసాన్ని అధికమాసం అంటారు. ఈ ఏడాది జ్యేష్ఠ మాసం అధికమాసమైంది (17.05.26 నుండి జూన్15వ తేదీ వరకు). ఆ మాసంలో శుభముహూ ర్తాలు లేవు, నిజ జ్యేష్ఠ మాసంలోనే (జూన్16వ తేదీ నుంచి జూలై 14వరకు) శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. ఈ సంవత్సరం గ్రహణాలు లేవు.
మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
ఈ రాశి వారికి జూన్ నుంచి చతుర్థ. ఉచ్చస్థానాల్లో గురుసంచారం అత్యంత శుభకరం. ఏలిననాటి శని ప్రభావం వల్ల కొన్ని వృథా ఖర్చులు ఉంటాయి. మొత్తానికి మిశ్రమ ఫలితాలు ఇస్తాడు. రాహుకేతువులు డిసెంబర్ 5వ తేదీ వరకూ లాభ, పంచమ స్థానాల్లో సంచరించి 6వ తేదీ నుండి దశమ, చతుర్థ స్థానాలలోకి ప్రవేశిస్తారు. ఈ రీత్యా జూన్ నుంచి శుభకరమైన కాలంగా చెప్పవచ్చు. ఆదాయ మార్గాలు మరింత పెరిగి, అదనపు ఖర్చులు వచ్చినా తట్టుకునే స్థాయి కలుగుతుంది. సమాజం లోనూ, బంధువుల్లోనూ గౌరవప్రతిష్ఠలు సంపాది స్తారు. ఎంతటి కార్యానికైనా వెనుకడుగు వేయరు. అవివాహితులకు జూన్ నుంచి వివాహయోగం. ఆస్తుల విషయంలో సమస్యలు నిదానంగా పరిష్కార మవుతాయి. కొన్ని కేసుల నుంచి విముక్తి లభిస్తుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు కలుగుతాయి. ఇంటి నిర్మాణ యత్నాలు జూన్ తరువాత అనుకూలిస్తాయి. తీర్థయాత్రలు విరివిగా చేస్తూ ధార్మిక చింతన కలిగి ఉంటారు. విద్యార్థులకు అనూహ్యమైన ఫలితాలు ఆశ్చర్యపరుస్తాయి. రాజకీయనేతలకు మొదట ఇబ్బందులు వచ్చినా తరువాత సర్దుకుంటాయి. రచయితలు, క్రీడాకారులు, కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యవసాయదారులకు రెండవ పంట లాభదాయకంగా ఉంటుంది. ప్రభుత్వసాయం కూడా అందుకుంటారు. వ్యాపారులకు లాభనష్టాలు సమస్థాయిలో కనిపి స్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు/ ఇంక్రిమెంట్లు రావచ్చు. సాంకేతికవర్గాల వారికి మరింత అనుకూలం. డిసెంబర్ 5 నుంచి కేతువు అర్ధ్థాష్టమ స్థితి కలిగినా ఉచ్ఛస్థితిలో గురునితో కలయిక వల్ల శుభదాయకమే. ఏడాది మొదటి భాగంలో గురుబలం లోపించడం, వ్యయ శని కారణంగా ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు. జూలై చివరి వారం -డిసెంబర్ మొదటి వారం మధ్య వారం మధ్య శని వక్రగతి సంచారంతో ఆరోగ్య సమస్యలు. మనోనిబ్బరం, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయడం ఉత్తమం. వీరు గురుని, కేతువునకు పరిహారాలు చేయించు కోవాలి. నిత్యం శివారాధన, శివస్తోత్రాల పఠనం మంచిది.
వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు
ఈ రాశి వారికి జూన్1వ తేదీ వరకూ గురుడు విశేష ఫలితాలు ఇస్తాడు. ఆ తరువాత తృతీయంలో ఉచ్ఛస్థానంలో సంచార సమయం కూడా మంచిదే. శని లాభస్థానంలో సంచారం అత్యంత శుభకరం. డిసెంబర్ 5 వరకూ రాహుకేతు వులు దశమ, చతుర్థ స్థానాల్లోనూ తదుపరి భాగ్య, తృతీయ స్థానాలలో సంచారం అనుకూలం. మధ్య మధ్యలో కొన్ని చికాకులు కలిగినా మొత్తానికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఆర్థిక ఇబ్బందు లను తట్టుకుని నిలబడతారు. స్థిరాస్తులు కొంతమేర విక్రయించే అవకాశం ఉంది. గురుని తృతీయరాశి సంచారంలో సోదర సోదరీల నుంచి ఊహించని సాయం, మంచి సంబంధాలు నెలకొంటాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. జూలై-డిసెంబర్ మధ్య కాలంలో శని వక్రగతి కారణంగా ఆరోగ్యంపై ప్రధానంగా శ్రద్ధ చూపాలి. మీ నిర్ణయాలు కుటుంబసభ్యులందరికీ ఆమోదయోగ్యంగా ఉంటాయి. మిమ్మల్ని వ్యతిరేకించే వారిని సైతం ఆదరిస్తారు. గృహ నిర్మాణం లేదా కొనుగోలు యత్నాలు ద్వితీయార్థంలో ఫలిస్తాయి. పుణ్యక్షేత్రాల విరివిగా సందర్శనం, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం వంటివి చేస్తారు. వ్యాపారాలలో పెట్టుబడులకు అనుగుణంగా లాభాలు దక్కుతాయి. కొత్త వ్యాపారాల ప్రారంభానికి సన్నా హాలు కొనసాగిస్తారు. ఉద్యోగులకు మరిన్ని బాధ్య తలు దక్కవచ్చు. విధుల్లో ఆకస్మిక మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవేత్తలు, వైద్యరంగాల వారికి ఒత్తిడులు తగ్గుతాయి. విదేశీ పర్యటనలు ఉండవచ్చు. రాజకీయవేత్తల యత్నాలు మరింత వేగవంత మవుతాయి. విద్యార్థులు కొంత నిరాశ చెందినా చివరికి శుభదాయకంగానే ఉంటుంది. కళాకారులకు మరింత ఉత్సాహవంతంగా కొనసాగుతుంది. క్రీడా కారులకు మరిన్ని అవకాశాలు. వ్యవసాయదారులకు మొదటి పంట అనుకూలిస్తుంది. ఇంటిలో శుభ కార్యాలు నిర్వహిస్తారు. ఆంజనేయస్వామి పూజలు, అర్చనలు మంచిది.
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఈ రాశి వారికి జూన్ 5వ తేదీ వరకూ జన్మరాశిలో సువర్ణమూర్తిగా గురుబలం విశేషం. తదుపరి ద్వితీయంలో ఉచ్ఛస్థానంలో సంచారం మూర్తిమంతంతో కొంత ఇబ్బంది కలిగినా చివరికి శుభదాయకంగానే ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు మరింత ఆశాజనకంగా ఉంటాయి. సంతాన ఆరోగ్య, ఉద్యోగ సమస్యలు తీరతాయి. దశమంలో శని సంచారంతో ధార్మిక చింతన పెరుగుతుంది. రాహుకేతువులు డిసెంబర్ 5వ తేదీ వరకూ భాగ్య, తృతీయస్థానాల్లో సంచారం. తదుపరి అష్టమ, ద్వితీయస్థానాల్లో సంచారం. గురుబలం విశేషంగా కనిపిస్తోంది. ఆర్థిక లావాదేవీలు ఊపందుకుని స్థిరత్వం పొందుతారు. రుణబాధలు తప్పుతాయి. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ద్వితీయార్థంలో సొంత ఇంటి కల నెరవేరవచ్చు. వాహనాలు, ఖరీదైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సంఘంలో మంచి పేరు గడిస్తారు. నిరుద్యోగుల ఆశలు ఫలిస్తాయి. ఇంటిలో కొన్ని శుభకార్యాలు కోర్టు కేసులు తుది దశకు చేరుకుని ఊరట చెందుతారు. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు, హోదాలు దక్కవచ్చు. పారిశ్రామికవేత్తలు, పరిశోధకులు, వైద్యులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. క్రీడా కారులు రచయితలు,కళాకారులకు సన్మానాలు, ఊహించని అవార్డులు లభిస్తాయి. రాజకీయవేత్తలకు కొత్త పదవులు దక్కే సూచనలున్నాయి. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి సంతోషంగా గడుపుతారు. వ్యవసాయదారులకు రెండుపంటలూ లాభిస్తాయి. డిసెంబర్ 6వ తేదీ నుండి అష్టమ రాహువు, కుటుంబస్థానంలో కేతు సంచారం వల్ల తరచూ ఆరోగ్యసమస్యలు ఎదుర్కొంటారు. వాహనచోదకు లకు అత్యంత జాగరూకత అవసరం.మానసిక అశాంతి. ఇంటాబయటా సమస్యలు రావచ్చు. రాహుకేతువులకు పరిహారాలు చేయించుకోవాలి. అలాగే, దుర్గామాత పూజలు మంచిది.
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఈ రాశికి గురుడు వ్యయస్థాన సంచార మైనా మూర్తిమంతం వల్ల శుభుడు. అలాగే, జూన్ నుంచి జన్మరాశిలో ఉచ్ఛస్థితిలో సంచారం అత్యంత శుభదాయకం. భాగ్యస్థానంలో శని మిశ్రమ ఫలితాలకు సంకేతం. కష్టించి పనిచేసే వారికి విశేషంగా రాణిస్తుంది. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. డిసెంబర్ వరకు అష్టమం, తదుపరి సప్తమ రాశుల్లో రాహు సంచారం దోషకరం. డిసెంబర్ నుంచి జన్మరాశిలో కేతు సంచారం కూడా దోషకారకమే. వీరికి ఆర్థికంగా ఇబ్బందులు కనిపిం చవు. ఖర్చులు ఎదురైనా సర్దుబాటు అవుతాయి. కుటుంబంలో సంతోషకరంగా, ఉల్లాసంగా గడుపు తారు. సంతాన విషయంలో శుభవార్తలు అందు తాయి. శుభకార్యాల నిర్వహణపై కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ద్వితీయార్థంలో స్వగృహయోగ సూచనలున్నాయి. అలాగే, వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. కీర్తిప్రతిష్ఠలు సంపాదిస్తారు. అనుకున్న వ్యవహారాలు శ్రమ పడినా పూర్తి చేస్తారు. విద్యార్థులకు మంచి ర్యాంకులు దక్కుతాయి. వ్యాపారాలలో నష్టాల నుండి లాభాల వైపు సాగుతారు. పెట్టుబడులు సమకూర్చుకునేందుకు తగిన సమయం. ఉద్యోగస్తులకు ఆశించిన మార్పులు ఉంటాయి. పారిశ్రామికవేత్తలు, డాక్టర్లు, సాంకేతిక రంగాల వారికి విశేషయోగదాయకమైన కాలం. రాజకీయవేత్తలకు ప్రజాదరణ పెరుగుతుంది. కొత్త పదవులు దక్కించుకుంటారు. వ్యవసాయదారులకు రెండవ పంట లాభిస్తుంది. కళాకారులు, క్రీడాకారు లకు అవార్డులు, రివార్డులు దక్కుతాయి. ఏడాది మొత్తం రాహుకేతువుల సంచారం అనుకూలం కానందున ఆరోగ్యం, కుటుంబసమస్యలతో పోరాడ వలసి వస్తుంది. రాహుకేతువులకే ఎక్కువగా పరిహా రాలు చేయించుకోవాలి. శివాలయంలో అభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చనలు మంచిది.
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఈ రాశి వారికి జూన్ వరకు గ••రుడు శుభకారకుడు. తదుపరి వ్యయస్థితిలో సంచారమైనా ఉచ్ఛస్థితి కావడం వల్ల కొంతమేర సానుకూల కాలం. అష్టమ శని ప్రభావం అధికం. డిసెంబర్ 5 వరకు రాహు,కేతువులు సప్తమ,జన్మరాశుల్లో, త•దుపరి షష్ఠమ, వ్యయస్థానాలలో సంచారం. మొత్తానికి రాహుకేతువులు కూడా అంతగా అనుకూలురు కారు. కొన్ని ఖర్చులు తట్టుకునేందుకు రుణదాతలను ఆశ్రయిస్తారు. కుటుంబంలో అకార ణంగా కొన్ని విభేదాలతో సత మతమవుతారు. జూన్ లోగా కొన్ని శుభ కార్యాలు నిర్వ హించే అవకాశా లున్నాయి. ఇల్లు, వాహనాల కొనుగోలు ప్రయత్నాలు కలసివస్తాయి. సప్తమ రాహువు సంచార సమయంలో జీవిత భాగస్వాముల మధ్య విభేదాలకు అవకాశం ఉన్నందున సహనంతో మెలగడం మేలు. విద్యార్థులకు ద్వితీయార్థంలో శుభవార్తలు అందుతాయి. అష్టమ శని ప్రభావం వల్ల ఆరోగ్య సమస్యలు. ఎముకలు, వాత సంబంధిత బాధలు రావచ్చు. మీ నిర్ణయాలకు కుటుంబసభ్యులు మొదట విముఖత చూపినా తర్వాత అంగీకరిస్తారు. తీర్థయాత్రలు అధికంగా చేస్తారు. వ్యాపారాలలో లాభనష్టాలు సమానంగా స్వీకరించాలి. పెట్టుబడుల విషయంలో కొంత అయోమయంలో పడతారు. ద్వితీయార్థంలో ఊపందుకుంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు ఊరిస్తాయి, కానీ వాయిదా పడుతూ వస్తాయి. వ్యవసాయదారులకు మొదటి•పంట అనుకూలం. పారిశ్రామికవేత్తలు, సాంకేతిక రంగాల వారికి మిశ్రమంగా ఉంటుంది. కళాకారులు,క్రీడాకారులకు కొంత సానుకూల సమయమనే చెప్పాలి. రాజకీయవేత్తలు ఊహించని విదేశీ పర్యటనలు చేయవచ్చు. రచయితలకు సరైన గుర్తింపు లభించే సమయం. జూలై-డిసెంబర్ మధ్య శని వక్ర సంచారం మరింత చికాకు పరుస్తుంది. ఈ సమయంలో శనికి తైలాభిషేకాలు, రుద్రాభిషేకాలు చేయించుకోవడం మంచిది. ఆంజనేయ స్వామిని పూజించండి.
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు
గురుడు జూన్ వరకు దశమ స్థానం, తదుపరి లాభస్థానంలో సంచారం. అయితే మూర్తిమంతం చేత ఈ గురుడు మిశ్రమ ఫలితాలు ఇస్తాడు. శని ఏడాదంతా సప్తమ స్థానంలోనే సంచారం. రాహుకేతువులు డిసెంబర్ 5 వరకు షష్ఠమ, వ్యయ స్థానాల్లోనూ, తదుపరి పంచమ, లాభస్థానాల్లో సంచరిస్తూ అనుకూల ఫలితాలు ఇస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. తరచూ పుణ్యక్షేత్రాలు, వివిధ మఠాలు సందర్శిస్తారు. ఆర్థికంగా కొన్ని కొంత ఊరట చెందినా సరిపడక అప్పులు చేస్తారు. సంతానపరంగా కొన్ని ఇబ్బందులు రావచ్చు. కుటుంబంలో కొత్త బాధ్యతలు మోయాల్సిన పరిస్థితులు. శని ప్రభావం కారణంగా భార్యాభర్తల మధ్య తరచూ కలహాలు. జూన్ నుంచి గురుడు లాభస్థానంలో సంచారం వల్ల కొన్ని బాకీలు ఎట్టకేలకు వసూలవుతాయి. సంతానం కోసం ఎదురుచూసే వారికి కలలు ఫలిస్తాయి. చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. స్థిరాస్తి విషయంలో చిక్కులు ఏర్పడినా తెలివిగా బయటపడతారు. నిరుద్యోగులు యత్నాలు కలసివస్తాయి. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు లాభాలు కనిపిస్తాయి. ఉద్యోగస్తులు పదోన్నతులు, ఇంక్రిమెంట్లు రావచ్చు. అలాగే, బదిలీలు ఉండొచ్చు. పారిశ్రామికవేత్తలు, వైద్యులు, రచయితలు, సాంకేతి కరంగాల వారికి మంచి గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. రాజకీయవేత్తలకు శుభదాయకంగా ఉంటుంది. విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తారు. వ్యవసాయదారులకు రెండుపంటలూ అనుకూలి స్తాయి. ఏప్రిల్ నుంచి మే 11 వరకు కుజుడు, శని కలయిక వల్ల ఆరోగ్యసమస్యలు వేధిస్తాయి. ముఖ్యంగా నరాలు, చర్మ సంబంధిత రుగ్మతలు బాధిస్తాయి. సోదరులతో కలహాలు. మొత్తం మీద మిశ్రమంగా సాగిపోతుంది. శని, కుజులకు పరిహారాలు చేయించుకోవాలి. అలాగే, నిత్యం హనుమాన్ చాలీసా చదవడం ఉత్తమం.
తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
సంవత్సరమంతా గురుడు అను కూలుడు. జూన్ వరకు భాగ్యస్థానం. తదుపరి దశమస్థానంలో ఉచ్ఛస్థితి సంచారం అత్యంత శుభకరం. శని సంవత్సరమంతా షష్ఠమంలో మంచి ఫలితాలు ఇస్తాడు. రాహుకేతువులు డిసెంబర్ 5 వరకు పంచమ, లాభస్థానాల్లోనూ, తదుపరి చతుర్థ, దశమ స్థానాల్లోనూ సంచరిస్తారు. వీరికి డబ్బుకు లోటు రాకుండా గడిచిపోతుంది. ఖర్చుల కోసం ఆలోచించేవారికి త•క్షణం సొమ్ములు అందుతాయి. కొంతకాలంగా నిరాశతో గడిపిన వారు ఏడాది నూతనోత్సాహంతో గడుపుతారు. ఆత్మీయులు, బంధువుల ద్వారా తరచూ ఆహ్వానాలు, వర్తమానాలు అందుతాయి. వాహనాలు, ఖరీదైన ఆభరణాలు కొంటారు. స్థిరాస్తుల విషయంలో సమస్యలు తీరతాయి. గురుడు ఉచ్ఛస్థితి సంచారంలో అంటే జూన్ నుంచి రాజకీయవేత్తలకు అనూహ్యమైన పదవులు, హోదాలు రావచ్చు. విద్యార్థులు విశేషమైన ఫలితాలు సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం. శుభకార్యాల రీత్యా అధిక ధనవ్యయం. కార్యక్రమాలు కష్టసాధ్యమైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. దైవకార్యక్రమాలలో మరింత చురుగ్గా పాల్గొంటారు. శని శుభుడే అయినా షష్ఠమ రాశి సంచారంతో ఆరోగ్యపరంగా చికాకులు, వ్యాపార, వాణిజ్యవర్గాలకు లాభాలు పెరుగుతాయి. వ్యాపార లావాదేవీల్లో కొత్త ఒప్పందాలు చేసుకుం టారు. ఉద్యోగులు ఉన్నత హోదాలు దక్కించుకుంటారు. వ్యవసాయదారులకు రెండు పంటలు సానుకూలం. కళాకారులు, సాంకేతికరంగాల వారికి మంచి గుర్తింపు రాగలదు. క్రీడాకారులు అనుకున్న అవకా శాలు సాధిస్తారు. డిసెంబర్ 5 నుంచి రాహువు అర్థాష్ఠమ స్థితి వల్ల చేసే పనుల్లో అవాంతరాలు. వ్యయప్రయాసలు. మానసికంగా ఆందోళన. ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. మొత్తం మీద శుభ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాహువుకు పరిహారాలు చేయించుకోవాలి. సుందరకాండ పారాయణ మంచి ఫలితాలు ఇస్తుంది.
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ
గురుడు జూన్ 1వరకు అష్టమంలోనూ తదుపరి భాగ్యస్థానంలోనూ సంచారం. శని పంచమ స్థానం శుభకరం. ఇక రాహుకేతువులు డిసెంబర్ 5 వరకు అర్ధ్థాష్ఠమ, దశమస్థానాల్లో సంచారం. తదుపరి తృతీయ, భాగ్య స్థానాల్లోకి ప్రవేశిస్తారు. గురుడు అష్టమస్థితి అయినా సువర్ణమూర్తి కావడం శుభకరం. ఆర్థికసమస్యలు తీరే సమయం. రుణాలు తీరుస్తారు. కుటుంబంలో ప్రత్యేక అభిమానం చూర గొంటారు. శుభకార్యాలు వైభవంగా నిర్వహిస్తారు. విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు. బంధువుల ద్వారా విశేష సాయం అందుతుంది. స్థిరాస్తులను కొనుగోలు చేయాలన్న ప్రయత్నాలు కలసివస్తాయి. ఖరీదైన వాహనాలు కొంటారు. శని పంచమ స్థానంలో సంచారం వల్ల విశేష గౌరవం, పట్టుదలతో కార్యజయం కలుగుతుంది. సౌఖ్యమైన జీవనం సాగిస్తారు. సంతానరీత్యా మాత్రం కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. డిసెంబర్ 5 వరకు అర్ధాష్టమ రాహువు వల్ల ఈతిబాధలు. మానసిక ఆందోళన. వివాదాలు. ఆరోగ్యం కొంత చికాకు పరుస్తుంది. వ్యాపార, వాణిజ్యవర్గాలు ఆశించినమేర లాభాలు ఆర్జిస్తాయి. మరిన్ని పెట్టుబడులు సమీకరి స్తారు. ఉద్యోగులకు పదోన్నతులు, ఇంక్రిమెంట్లు రావచ్చు. పారిశ్రామిక, సాంకేతిక రంగాల వారు రెట్టించిన ఉత్సాహంతో గడుపుతారు. కళాకారులు అనుకున్న అవకాశాలు పొందుతారు. రాజకీయ వర్గాలపై అపవాదులు తొలగుతాయి. వైద్యులు, క్రీడాకారుల అంచనాలు నిజం కాగలవు. వ్యవసాయ దారులకు రెండవపంట లాభసాటిగా ఉంటుంది. ఏప్రిల్-మే నెలల్లో శని, కుజుల కలయిక వల్ల మానసిక సంఘర్షణ, జీవిత భాగస్వాముల మధ్య విభేదలు రావచ్చు. డిసెంబర్ 5 నుంచి రాహు గ్రహానికి పరిహారాలు చేసుకుంటే మంచిది. వీరు దుర్గా, సుబ్రహ్మణ్య ఆరాధనలు చేయడం మంచిది.
ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
గురుడు జూన్ వరకు సప్తమస్థితి లోనూ, తదుపరి అష్టమ స్థితిలోనూ సంచారం. అష్టమస్థితిలో ఉచ్ఛ సంచారం కొంత అనుకూలమైనా మొత్తానికి సామాన్యంగానే ఉంటుంది. శని సంవత్సరమంతా అర్ధాష్టమ స్థానంలో సంచారం ఇబ్బందికర పరిస్థితులను సూచిస్తోంది. రాహుకేతువులు డిసెంబర్ 5 వరకు తృతీయ, భాగ్యస్థానాలలో, త•దుపరి ద్వితీయ, అష్టమస్థానాల్లో సంచారం. మొత్తానికి వీరికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆశించినంత రాబడి లభించినా ఏవో ఖర్చులు వచ్చి నిల్వ అన్నది ఉండదు. కుటుంబంలో ప్రతి విషయం లోనూ వాదోపవాదాలతో సత్సంబంధాలకు ఇబ్బంది రావచ్చు. సంతానపరంగా కూడా కొన్ని చికాకులు రావచ్చు. తృతీయ రాహువు, భాగ్యస్థానంలో కేతువు శుభాలను ఇస్తారు. డిసెంబర్ నుంచి వీరు కూడా దోషకారులే. వివాహాది శుభకార్యాలు ప్రథమార్థంలో జరుగుతాయి. జూన్ నుంచి అష్టమ గురుడు, అర్ధాష్టమ శని ప్రభావం సమస్యలకు కారణమవు తాయి. ప్రతిదీ వివాదంగా మారవచ్చు. ఆరోగ్య పరంగా ముఖ్యంగా నరాలు, మెదడు, ఛాతీ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయి. తరచూ ప్రయాణాలతో అలసట. ఎక్కువ సమయం దైవచింతనలో గడుపుతారు. వ్యాపారస్తులు, వాణిజ్య వర్గాలు ఆటుపోట్లు ఎదుర్కొన్నా ప్రథమార్థమంతా లాభసాటిగా సాగుతుంది. పెట్టుబడులలో కొంత జాప్యం. ఉద్యోగులు పైస్థాయి అధికారుల వైఖరితో గందర గోళంలో పడతారు. ఆకస్మిక బదిలీలకు సిద్ధపడాలి. పారిశ్రామికవేత్తలు, సాంకేతిక రంగాల వారికి నిరాశాజనకంగా ఉంటుంది. విద్యార్థుల శ్రమ కొంత వృథా కాగలదు. వ్యవసాయదారులకు రెండవ పంట కొంత అనుకూలిస్తుంది. రచయితలు, క్రీడాకారులకు ప్రోత్సాహం అంతగా ఉండదు. రాజకీయనేతలకు ఒత్తిడులు పెరుగుతాయి. న్యాయవాదులు, కళాకారు లకు ప్రారంభంలో శుభదాయకంగా ఉంటుంది. శని,గురునికి పరిహారాలు చేయించుకోవాలి. కామాక్షి స్తోత్రాలు పఠించండి.
మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాలు
జూన్ నుంచి సప్తమ స్థానమైన ఉచ్ఛ స్థితిలో గురు సంచారం విశేషం. అప్పటి వరకూ షష్ఠమ సంచారం వల్ల మానసిక ఆందోళన. ధన వ్యయం. రాబడి తగ్గడం వంటి ఫలితాలు ఉంటాయి. ఇక శని అనుకూలుడు. అందరిలోనూ మంచి గుర్తింపు పొందుతారు. శ్రమపడినా ఫలితం ఇస్తాడు. డిసెంబర్ 5 వరకు రాహుకేతువులు ద్వితీయ, అష్టమ స్థానాల్లో, తరువాత జన్మ, సప్తమ రాశుల్లో సంచరి స్తారు. వీరు సామాన్య ఫలితాలు ఇస్తారు. మొత్తానికి ఈ రాశి వారికి ద్వితీయార్థమే అత్యంత సానుకూల మైనదిగా చెప్పొచ్చు. ఆర్థికంగా బలం చేకూరినా ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి. బంధు మిత్రులతో వివాదాలు పరిష్కారమవుతాయి. స్థిరాస్తుల కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. ఇంటి నిర్మాణయత్నాలు కార్యరూపంలో పెడతారు. చిరకాల కొన్ని సమస్యలు వీడతాయి. ఊహించని రీతిలో తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారులు, వాణిజ్యవర్గాలకు ద్వితీయార్థం విశేషంగా కలసివస్తుంది. అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగవర్గాలకు కొత్త పదవులు దక్కవచ్చు. పారిశ్రామికవేత్తలు, సాంకేతిక రంగాల వారికి నూతనోత్సాహం. న్యాయవాదులు, కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. సన్మాన, సత్కారాలు జరుగుతాయి. క్రీడాకారులు మరింత కీర్తి పొందుతారు. వ్యవసాయదారులకు రెండవ పంట అనుకూలిస్తుంది. అయితే ఆరోగ్యంపై ప్రథమార్ధం తగు జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా చర్మ, ఉదర, నరాల సంబంధిత రుగ్మతలు ఉండవచ్చు. గురు, రాహుకేతువులకు పరిహారాలు చేయించుకోవాలి. సూర్యారాధన మంచిది.
కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
జూన్ 1 వరకు పంచమ స్థానం, తదుపరి షష్ఠమమైనా సువర్ణమూర్తితో పాటు ఉచ్ఛస్థానం కావడం గురుని సంచారం శుభకరం. ఏలినాటి శని, జన్మరాశిలో రాహువు దోషకారులు. డిసెంబర్ నుంచి రాహువు వ్యయస్థానంలో మరింత దోషకారి. గురుని శుభత్వం ఆదాయానికి సరిసమానంగా ఖర్చులు కూడా చేస్తారు. సోదరులతో విభేదాలు పరిష్కరించు కుంటారు. మీ సేవలకు తగిన గుర్తింపు లభిస్తుంది. వివాహ ప్రయత్నాలు ద్వితీయార్థంలో ఫలిస్తాయి. ఆస్తి విషయాలలో ఒప్పందాలు చేసుకుంటారు. కోర్టు కేసులు తుది దశకు చేరతాయి. ఏలినాటి శని, జన్మ రాశిలో రాహువు, సప్తమంలో కేతువు ప్రభావం వల్ల తరచూ ఆరోగ్యసమస్యలు. ముఖ్యంగా నేత్ర, నరాలు, ఎముకలు, చర్మ సంబంధిత రుగ్మతలతో ఇబ్బంది పడవచ్చు. ఆప్తులతో అకారణంగా తగాదాలు ఏర్పడ తాయి. ఏ వ్యవహారం ముందుకు కదలని పరిస్థితి. అయితే శ్రమానంతరం పూర్తి కాగలవు. ఇంటి నిర్మాణాలు, కొనుగోలు యత్నాలలో కొంత పురోగతి ఉంటుంది. దైవకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారా లను విస్తరణ యత్నాలు క్రమేపీ ఫలిస్తాయి. కొత్త పెట్టుబడులు కొంతమేర సమకూరతాయి. ఉద్యోగ స్తులకు విధుల్లో ఒత్తిడులు రావచ్చు. అయితే ప్రథ మార్థంలో విధుల్లో మార్పులు ఉంటాయి. పారిశ్రామికవేత్తలు, సాంకేతిక వర్గాలకు కష్టానికి ఫలితం స్వల్పంగా ఉంటుంది. కళాకారులు అనుకున్న అవకాశాలు కొన్ని దక్కించుకుంటారు. విద్యార్థులు మంచి ఫలితాలు రావడంతో సంతోషంగా గడుపుతారు. క్రీడాకారులకు విజయాలు దక్కవచ్చు. వ్యవసాయదారులకు రెండవ పంట కలసివస్తుంది. వైద్యులు, న్యాయవాదులకు నిరాశా జనకంగా ఉన్నా క్రమేపీ సానుకూలత ఉంటుంది. శని,రాహుకేతువులకు పరిహారాలు చేయించుకోవాలి. సూర్యభగవానుని స్తోత్రాలు పఠించండి.
మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
గురుడు జూన్ 1 వరకు చతుర్థంలో, తదుపరి పంచమస్థానంలో ఉచ్చస్థితిలో సంచారం అనుకూలం. జన్మరాశిలో శనిసంచారం (ఏలినాటి శని). రాహుకేతువులు డిసెంబర్ 5 వరకు వ్యయ, షష్ఠమస్థానాల్లోనూ, తదుపరి లాభ, పంచమస్థానాల్లో సంచారం. గురుడు మూర్తిమంతం చేత సామా న్యుడైనా ఉచ్ఛస్థితి సంచారం సమయంలో శుభత్వం ఇస్తాడు. అనూహ్యమైన ధనలాభాలు. సహాయం అందించేందుకు సోదరులు, ఆప్తులు ముందుకు వస్తారు కొన్ని వ్యవహారాలలో క్రియాశీల పాత్ర పోషి స్తారు. సంఘంలో మరింతగా గౌరవం పొందుతారు. ఆలోచనలు వెంటవెంటనే అమలు చేస్తారు. స్థిరాస్తులు సమకూర్చుకునేందుకు కృషి చేస్తారు. కార్లు,స్కూటర్లు కొనుగోలు చేస్తారు. కొన్ని శుభ కార్యాలు నిర్వహిస్తారు. సంతానరీత్యా శుభవార్తలు వింటారు. అ రాశి వారికి ఏలిననాటి శని ఉన్నా ఉచ్ఛస్థితిలోని గురుడు స్వక్షేత్రమైన మీనరాశిని విశేష దృష్టితో వీక్షించడం శుభదాయకం. శని ప్రభావం అంతగా కనిపించదు. చాకచక్యం మసలుకోవడం మంచిది. ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడొచ్చు. తరచూ దూరప్రయాణాలు. ప్రముఖ పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. వ్యయంలో రాహువు వల్ల ప్రతి పనిలో ఆటంకాలు. వ్యయప్రయాసలు. డిసెంబర్5నుండి శుభదాయకంగా ఉంటుంది. వ్యాపారాలు ద్వితీయార్ధం నుంచి విశేషంగా రాణి స్తాయి. పెట్టుబడుల విషయంలో తీసుకొనే నిర్ణయం కలసివస్తుంది. ఉద్యోగులకు అనుకూల మార్పులు తప్పనిసరి. అధికారుల నుండి ఒత్తిళ్లను తట్టుకుని నిలబడతారు. రాజకీయ నేతలకు పదవులు ఊరిస్తాయి. సాంకేతిక రంగాలు, పారిశ్రామికవేత్తలకు కాస్త ఆశాజనకంగా ఉంటుంది. విద్యార్థులు శ్రమానంతరం మంచి ఫలితాలు సాధిస్తారు. వ్యవసాయదారులకు రెండవ పంట లాభిస్తుంది. సాంకేతిక రంగం, రచయితలు, కళాకారులకు గుర్తింపుతో పాటు, కొంత కష్టం కూడా తప్పదు. వీరు శని, రాహుకేతువులకు పరిహారాలు చేయించు కోవాలి. ఏప్రిల్-మే మధ్యకాలంలో సుబ్రహ్మణ్యారా ధన మంచిది.