‌కాలం నిత్యనూతనం. దానికి పాత, కొత్త భేదం లేదు. ఎప్పటికప్పుడు ముస్తాబై మనలో ఆశలు, ఆశయాలు నింపుతూనే ఉంటుంది. అనంత సింధువులో ‘శ్రీ విశ్వావసు’ బిందువై ప్రభవాది ఆరు పదుల వత్సరాల కాలచక్రంలో 40వదిగా శ్రీ పరాభవ నామ సంవత్సరం మరోసారి కొలువు దీరుతోంది. చాంద్రమానం ప్రకారం, ఉగాది ఏ వారం వస్తే ఆ వారాధిపతి ఆ సంవత్సరానికి రాజు. అలా శ్రీ పరాభవ నామ సంవత్సరానికి గురుడు రాజు. ‘పరాభవం’ అంటే అవమానం అని సాధారణ అర్థం. పేరును బట్టి ఈ ఏడాది ప్రజ పరస్పరం శంకించుకుంటూ మనుగడసాగించే అవకాశం ఉందని, అయితే గురుడు రాజు కావడం వల్ల శుభప్రదంగానే ఉంటుందని పంచాంగకర్తలు అభిప్రాయపడుతున్నారు. దేశం ఆర్థిక, శాస్త్ర సాంకేతిక రంగాలు సహా వివిధ రంగాల్లో బలం పుంజుకుంటుందని రాశిఫలాలు చెబుతున్నాయి.

యుగ గణాంకాల ప్రకారం, మనం ప్రస్తుతం వైవస్వత మన్వంతరంలోని 28వ మహా యుగపు కలియుగంలో ఉన్నాం. సూర్య సిద్ధాంతం ప్రకారం, సృష్టి ఆరంభమై 1,95,58,85,128 సంవత్సరాలు చాంద్రమాన పంచాంగ కర్తల ప్రకారం, కలియుగం ప్రారంభమై ఇది 5,128వ సంవత్సరం. ఉగాది నూతన సంవత్సరానికి ఆరంభం కనుక ‘సంవత్సరాది’ అనీ వ్యవహరిస్తారు. ‘ఉగస్య ఆది ఉగాది’… ‘ఉ’ అంటే నక్షత్రం, ‘గ’ అంటే గమనం. ‘ఉగ’ అంటే.. నక్షత్రం గమనం, జన్మ, ఆయువు అనే అర్థాలు ఉన్నాయి. నక్షత్రాలు, గ్రహాల గమనం ఆధారంగా జన్మ వివరాలు, రాశిఫలాలు తదితరాలు అంచనావేసే రోజు అనే అర్థంగా చెబుతారు. శిశిరం తరువాత ప్రకృతి కొత్త అందాలు సంతరించు కుంటుంది. ఈ రుతువుతో ప్రారంభమమ్యే చైత్రంలో ప్రకృతి నూతనంగా వికసించినట్లే మనుషులు కొత్త దుస్తులను ధరించి, నూతన ఆలోచనలతో ముందుకు సాగుతారని స్థూలంగా చెబుతారు.
‘చైత్రే మాసే జగద్బ్రహ్మా ససర్జ ప్రథమే హని
శుక్లపక్షే సమగ్రం తు తదా సూర్యోయే సతి’ (చైత్రమాస శుక్లపక్ష ప్రథమ దినం సూర్యోదయ వేళ బ్రహ్మదేవుడు జగత్తును సృజియించాడు)అని చతుర్వర్గ చింతామణి తదితర ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. కృతయుగం వైశాఖ శుద్ధ తృతీయ నాడు, త్రేతాయుగం కార్తిక శుద్ధ నవమి నాడు, ద్వాపరయుగం శ్రావణ శుద్ధ త్రయోదశి నాడు, ఈ (కలి)యుగం చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ప్రారంభ మయ్యాయని ధర్మశాస్త్రాలు పేర్కొంటున్నాయి.
ఋతువుల్లో తాను వసంతాన్ని(ఋతూనాం కుసుమాకరః..)’ అని గీతాచార్యుడు చెప్పడాన్ని బట్టి ఉగాది ప్రాశస్త్యం అపారమని అంటారు. తెలుగు, కన్నడ, మరాఠీయులకు ఉగాది తొలిపండుగ. చాంద్రమానం రీత్యా ఇది సర్వ ప్రథమైన రోజు. రెండు తెలుగు రాష్ట్ల్రాలు, కర్ణాటకలో ఉగాదిగా, మహారాష్ట్రలో ‘గుడిపాడ్వా’గా, తమిళులు ‘పుత్తాండ’గా, మలయాళీలు ‘విషు’, బెంగాలీలు ‘పొయ్‌లా బైశాఖ్‌, ‌సిక్కులు ‘వైశాఖీ’ అనీ పేరుతో… ఇలా వివిధ ప్రాంతాలవారు సంవత్సరాదిని జరుపుకుంటారు. రాష్ట్రాలను బట్టి పండుగ పేర్లు, ప్రాంతాలను బట్టి దానిని జరుపుకునే తీరు వేర్వేరుగా ఉండవచ్చు గానీ, నూతన సంవత్సరం ఆరంభం మాత్రం ఒక్కటే.
ఉగాది పర్వానికి పౌరాణిక, చారిత్రక, సామాజిక పర్వంగా అనేక విశిష్టతలు ఉన్నాయి. సోమకుడనే దానవుడు అపహ రించిన వేదాలను కాపాడేందుకు శ్రీ మహావిష్ణువు చైత్ర శుద్ధ పాడ్యమి నాడే మత్స్యావతారం దాల్చాడని ఐతిహ్యం(దానిని స్మరించుకొంటూ ఆనాడు మత్స్యజయంతిని జరుపుకుంటారు.) శ్రీరామచంద్రుడు, ధర్మరాజు, మహావీరుడు విక్రమాదిత్యుడు, శాలివాహనుడు చైత్ర శుద్ధ పాడ్యమి నాడే పట్టాభిషిక్తుడయ్యాడు.
‘నూతన సంవత్సర కీర్తనాద్వారంభం/ప్రతి గృహ ధ్వజారోహణం/నింబ పత్రాశనం/వత్సరాది శ్రవణం, నవరాత్రారంభః’ అని ఉగాది నాడు ఆచరించవలసిన వాటిని ‘ధర్మసింధు’ పేర్కొంది. సంవత్సరాన్ని కీర్తించడం అంటే… గతించిన ఏడాదిలోని మంచి చెడులను సమీక్షించుకొని, కొత్త ఏడాదిలో శుభాల కోసం నిరీక్షించడం, ప్రతి ఇంటిని తోరణాలతో అలంకరించడం, ఇంటిపై ధ్వజాన్ని ఎగురవేయడం, వేపపూత ప్రసాదాన్ని స్వీకరించడం, పంచాంగ శ్రవణం.. ఉగాది నాటి విధులని తెలిపింది. సంవత్సరాదినాడు కలశస్థాపన చేసి నాలుగు రోజులపాటు దేవీపూజలు చేయడం వలన అపమృత్యుభయం ఉండదని ‘ధర్మసింధువు’ తెలియచేస్తోంది.ఈ పండుగ నాడు చేపట్టే పనులు సజావుగా సాగుతాయని అత్యధికుల విశ్వాసం. కొన్ని చోట్ల రైతులు వ్యవసాయ పనిముట్లకు పూజలు చేసి వ్యవసాయ పనులను లాంఛనంగా ప్రారంభిస్తారు. చలివేంద్రాలను ప్రారంభిస్తారు. సంవత్సరాది నాడు అతిథులకు, బాలసారులకు మజ్జిగ గాని, పానకం కానీ ఇచ్చినా ఫుణ్యప్రదమమని శాస్త్రవాక్కు. పితృదేవతలను స్మరించుకుంటూ తర్పణాలు వదులుతారు.
సృష్టి కర్తను, కాల సంబంధ పర్వదినం కనుక ఆదిత్యుడిని అర్చించి, ఇష్టదేవతారాధన తరువాత ఉగాది ప్రసాదం స్వీకరించాలని వేదజ్ఞులు చెబుతారు. కొత్త సంవత్సరంలో కలిగే సుఖదుఃఖాలకు, తీపిచేదు అనుభవాలకు ప్రతీక ఉగాది పచ్చడి. ‘త్వామష్ఠ శోక నరాభీష్ట,మధుమాస సముద్భవ/నింబామి శోక సంతప్తాం మమశోకం సదాకురు’(మధుమాసంలో పుట్టి శోకబాధలను దరిచేరనివ్వని వేప కుసుమమా! నన్నెల్లప్పుడు శోకరహితుడిని చెయ్యి) అనే శ్లోకాన్ని పఠిస్తూ ఉగాది ప్రసాదాన్ని స్వీక•రించాలని శాస్త్రవచనం. ఆరు రుచుల ఈ సమ్మిశ్రం మానవ జీవితంతో ముడిపడి ఉంది. కష్టసుఖాలను, సుఖదుఃఖాలను ఏకరీతిన స్వీకరించాలన్నదే దాని అంతరార్థం. ఈ ప్రసాదం వ్యాధి నిరోధకశక్తిని పెంచుతుందని, ఉగాది నుంచి చైత్ర పూర్ణిమ వరకు దీనిని స్వీకరించడం వల్ల అనారోగ్య లక్షణాలు పొడచూపవని, వాతపిత్త శ్లేష్మాల వలన కలిగే దోషాలు తొలగిపోతాయని ఆయుర్వేదం పేర్కొంటోంది. ‘శతాయుష్యం వజ్రదేహం దదాత్యర్థం సుఖానిచ/సర్వారిష్ట వినాశంచ నింబకందళ భక్షణమ్‌’ (‌వజ్రసమానమైన దేహం, దీర్ఘాయుష్షు లభిస్తాయి. సర్వ అభీష్టాలు తొలగిపోతాయి) అనీ చెబుతోంది. వేపపూత పచ్చడిని ఆరగించడం సకల అరిష్టాలకు విరుగుడు (‘సర్వ అరిష్ట వినాశయ నింబకందళ భక్షణం’) అని పేర్కొంటోంది.
ఈ ప్రసాదం తయారీలో వినియోగించే ప్రతి పదార్థానికి ఒక ప్రత్యేకత ఉందని వాటి వినియోగంలో తెలుస్తుంది. ఉదాహరణకు, బెల్లం-వేప కలిపి తినడం వల్ల దేహం వజ్ర సమమం అవుతుందట. చైత్ర పాడ్యమి నుంచి నవమి వరకు (వసంత నవ రాత్రులు) ఉప్పు,కారం, వగరు, చేదు, పులుపు, తీపి రుచులు కలగలసిన పచ్చడి తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు అని శాస్త్రాలు చెబుతున్నాయి.
తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే ఐదింటి కలయికే ‘పంచాగం’.
‘తిథి ప్రోక్తం మనుబ్రహ్మ వారస్య మయసంభవం
నక్షత్రం త్వష్టృ రూపంచ శిల్పయోగం తదైవచ
దైవజ్ఞం కరణం చైవ ఇత్వేతత్‌ అం‌గలక్షణం’ -మను బ్రహ్మ తిథిని, మయబ్రహ్మ వారాన్ని, త్వష్టృబ్రహ్మ నక్షత్రాన్ని, శిల్పి బ్రహ్మ యోగాన్ని, విశ్వజ్ఞ బ్రహ్మ కరణాన్ని సృష్టించారని శాస్త్రం. వీటిని దేవతా స్వరూపాలుగా సంభావించి నిత్యం తలచు కోవడం కాలదేవతాశక్తిని ఆరాధించడమేనని ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనేవి అయిదు అంగాలు. మానవుడు అనునిత్యం వాటిని సరిచూచుకుంటూ నిత్యకృత్యాలను, అభ్యుదయ కార్యాలను చేపడితే శుభ ఫలితాలు సిద్ధిస్తాయని విశ్వాసం.
‘శ్రీకళ్యాణగుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం/గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణాం/ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం/నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగ మాకర్ణ్యతామ్‌’ (‌పంచాంగ శ్రవణం వలన సంపదలు కలిగి సద్గుణాలు అలవడతాయి. శత్రువులు నశిస్తారు. చెడుకలలు తొలగిపోతాయి. గంగాస్నాన,గోదాన ఫలితం లభిస్తుంది. ఆయుష్షు పెరుగుతుంది.సంతానం కలుగుతుంది. అంటే వంశాభివృద్ధి సంప్రాప్తిస్తుంది) అని ‘పంచాగం’ శ్రవణం విశిష్టతను శ్లాఘించారు. పంచాగ శ్రవణం అంటే ఆయా రాశులలో జనించిన వారి రాజపూజ్య అవమానాలు, ఆదాయ వ్యయ పట్టికలు మాత్రమే కాదు…కాలమాన పరిస్థితులకు, గ్రహరాశుల సంచారానికి సంబంధించిన సమగ్ర సమాచారం. రాశిఫలాలు చూచి పొంగుకుంగులకు లోనుకాకూడదు. ఆయా రాశి ఫలాలకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా సాగాలన్నదే దాని అంతఃసూత్రం.
వసంత నవరాత్రులు
చైత్ర శుక్ల పాడ్యమి నాడు వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి. చివరినాడు (నవమి) శ్రీరామచంద్రుడు జన్మించాడని, ఈ కాలంలో విష్ణువు లేదా దుర్గతో పాటు శ్రీరాముడు, హనుమను ఆరాధించడం మేలని పురాణాలు పేర్కొంటున్నాయి. పూర్వం రాజులు వసంతోత్సవాలు నిర్వహించి, కవులు, కళాకారులను సత్కరించేవారు. వారి కవితా మధురిమలను అస్వాదించేవారు. రాయలవారి ‘భువన విజయం’ కవి నంది తిమ్మనామాత్యుడు చెప్పిన..
‘ప్రతివర్ష వసంతోత్సవ
కుతుకాగత సుకవినికర గుంఫిత కావ్య
శ్రుతిరోమాంచ విశంకిత
చతురాంతః పురవధూప్రసాదరసికా’.. పద్యం అందుకు ఉదాహరణగా చెప్పవచ్చు.
తిరుమలేశుడి ఆస్థానోత్సవం
తిరుమలలోని శ్రీనివాసుడికి నిర్వహించే ప్రధాన ఉత్సవాలలో ‘ఉగాది ఆస్థానం’ ఒకటి. ఆలయ కార్యక్రమాలు, ఉత్సవాలు ఉగాది నుంచే ప్రారంభమవుతాయి.ఆ రోజు సాయంవేళలో భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి మాడవీథుల్లో ఊరేగుతూ భక్తులకు దివ్యమంగళరూపంతో దర్శనం అనుగ్రహిస్తారు. ‘నిత్యోత్సవం’గా వ్యవహరించే ఇది నలభయ్‌ ‌రోజుల పాటు..అంటే వైశాఖ శుద్ధ దశమి వరకు కొనసాగుతుంది.
సర్వజగత్తుకు శుభం కలగాలని, ప్రాణులంతా సఖ్యంగా మెలగాలని, దుష్టగ్రహాలు అనుకూలంగా మారాలని, విశ్వశాంతిని కోరుతూ, ‘విశ్వావసు’కు ఘన వీడ్కోలు పలుకుతూ ‘శ్రీ పరాభవ’ వత్సరానికి స్వాగతాంజలి.

డా।। ఆరవల్లి జగన్నాథస్వామి
సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE