నాలుగు పదులైనా నిండని ఆ మహనీయుడు శతాబ్దాలుగా తరతరాల భారతీయులకు స్ఫూర్తిగా నిలిచారు. ఆ కొద్ది జీవితంలోనే భారత ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రాచీన సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. హిందూ ధర్మ విశిష్టతను పాశ్చాత్యులకు పరిచయం చేసిన గొప్ప తత్త్వవేత్త. ‘హిందువునని గర్వించు.. హిందువుగా జీవించు..’ ఇది ఒక మంత్రంలా కోట్లాది మందిని కదిలించింది. ఇందులో సంకుచిత్వం, స్వార్థం లేవు. ఆత్మ విశ్వాసం, సార్వజనీనతను చూడవచ్చు.. ఇంతకీ ఈ నినాదం ఎవరిది? ఆ మహనీయుడు స్వామి వివేకానంద.
ఒకప్పుడు విశ్వగురువుగా ప్రపంచానికి జ్ఞానం అందించిన దేశ ప్రజలు తమ గత వైభవాన్ని మరచి ఆత్మ విస్మృతితో జీవిస్తున్న రోజులవి. పరాయి పాలనలో మగ్గిపోతున్న భారతీయులు నిరాశ నిస్పృహలతో ఉన్న కాలమది. విదేశీయులు తమను ఉద్ధరించడానికే వచ్చారనే భ్రమల్లో భారతీయులు ఉన్నారు. కానీ నూట పాతికేళ్ల క్రితం పాశ్చాత్యుల దృష్టిలో దేశంపై ఉన్న భావన-భారత్ అంటే పాములు ఆడించేవారి అనాగరిక దేశం. ప్రజలు రాళ్లు రప్పలను పూజిస్తారని, పేదరికం బానిసత్వం మధ్య కులాల పేరుతో కుమ్మలాడుకుంటారనే ప్రచారాన్నే నమ్ముతున్న వేళ.. ఓ యువ సన్యాసిగా వివేకానంద అమెరికాలోని షికాగో మహానగరంలో విశ్వమత వేదికపై గళమెత్తారు.‘మత భేదాలు ద్వేషానికి కాదు, అవి మానవాళి శ్రేయస్సుకు దారితీసే మార్గాలు’ అని ఆయన చెప్పిన మాటలు సభలో మార్మోగాయి.
చిన్న వయసులో సత్యాన్వేషణ
స్వామి వివేకానంద అసలు పేరు నరేంద్రనాథ్ దత్త. సంవత్సరం జనవరి 12, 1863న కలకత్తాలో విశ్వనాథ దత్త, భువనేశ్వరీదేవి దంపతులకు జన్మించారు. చిన్నప్పటి నుంచే దైవభక్తి అలవడిన నరేంద్రునిలో వయసు పెరిగే కొద్దీ ఆధ్యాత్మిక చింతన మొదలైంది. సత్యాన్వేషణలో భాగంగా ఎందరో మహనీయులను, ఆధ్యాత్మిక వేత్తలను కలిసిన నరేంద్రునికి భగవంతుని విషయంలో తనకున్న అనుమానాలు తీరనందుకు ఎంతో తపించిపోయాడు.
1881లో నరేంద్రుడు శ్రీ రామకృష్ణ పరమ హంసను కలుసుకున్న తర్వాత తన అసలైన గురువు ఆయనే అని తెలుసుకున్నాడు. దక్షిణేశ్వర్ కాళీ మందిరంలో ఆధ్యాత్మిక మార్గదర్శనం పొందారు. ‘‘నరేన్.. నువ్వు ఒక గొప్ప లక్ష్యానికి పుట్టావు. మానవాళి కోసం సేవ చేయాలి’’ అని గురువు చెప్పిన మాటలు ఆయన మనసులో నాటుకుపోయాయి. పరమహంస శిష్యరికంలో ఎన్నో ఆధ్యాత్మికాంశాలను తెలుసుకున్న నరేంద్రునికి తన జీవిత గమ్యం ఇంకా బోధ పడలేదు. ఒక రోజున తనకు నిర్వికల్ప సమాధిని అనుగ్రహించమని పరమహంసను కోరారు.. ‘ఇలా అడగడం అవమానకరం.. నీవు మరింత ఉన్నతికి ఎదిగి ప్రపంచంలోని ఎందరో బాధితులకు నీడనిచ్చే మహావృక్షంగా నిలుస్తావనుకుంటే, నీ వ్యక్తిగత విముక్తి కోసం అడుగుతున్నావా?..’ అని ప్రశ్నించారాయన..
వివేకానందగా జీవిత గమ్యం
రామకృష్ణ పరమహంస మహా సమాధి తర్వాత తన ఆధ్యాత్మిక యాత్రను కొనసాగించారు నరేంద్రుడు. 1886లో సన్యాసం స్వీకరించారు. కశ్మీరం మొదలు కన్యాకుమారి వరకూ పర్యటించారు. ఈ పర్యటనలో ఎన్నో బాధాకరమైన విషయాలను గమనించారు. పరాయి పాలనలో ఉన్న మన దేశంలో ఎక్కడ చూసినా దారిద్య్రం. ప్రజల్లో అవిద్యకు తోడు మూఢ నమ్మకాలు, సామాజిక దురాచారాలు స్పష్టం కనిపించాయి. దీనికి తోడు మహిళల దుస్థితి మరింత కలవర పెట్టింది. ఏమిటి ఈ దుస్థితి? ఈ పరిస్థితుల నుంచి బయటపడటానికి తానేవి• చేయలేనా? అని ప్రశ్నించుకున్నారు నరేంద్రుడు.
యాత్ర చివరి మజిలీలో నరేంద్రనాథుడు కన్యాకుమారిలో సముద్రంలోని పెద్ద శిలపై ధ్యానం చేశారు. భారతదేశ భూత, భవిష్యత్, వర్తమానాలను తన మనోనేత్రంపై విశ్లేషించుకున్నారు. పతనమైన దేశ పునర్నిర్మాణం కోసం ఆధ్యాత్మిక మార్గమే సరైనదని భావించారు. సనాతన హైందవ ధర్మ పరి రక్షణ, జాగరణే లక్ష్యంగా మార్చుకున్నారు.. నరేంద్రనాథ్ స్వామి వివేకానందగా మారారు.
విశ్వ వేదికపై హైందవ గళం
బ్రిటిష్ ఇండియాలో పాశ్చాత్య దేశాలకు మనమంటే చిన్న చూపు ఉండేది. ప్రపంచంలో తామే అధికులమని వారి భావన. తాము అవలంబిస్తున్న క్రైస్తవ మతాన్ని మన దేశం మీద రుద్దడానికి పెద్ద ఎత్తున మిషనరీలను దింపారు. ఇలాంటి పరిస్థితుల్లో హిందూ మత ఔన్నత్యం గురించి పాశ్చాత్యులకు చాటి చెప్పాలని నిర్ణయించుకున్నారు వివేకానంద. ఇందులో భాగంగా అమెరికాలోని షికాగో మహానగరంలో జరిగిన ప్రపంచ సర్వమత మహాసభలకు వెళ్లారు.
సెప్టెంబర్ 11,1893న ‘ అమెరికా సోదర సోదరీమణులారా..’ అనే సంబోధనతో వివేకానందుని ఉపన్యాసం ప్రారంభం కాగానే ప్రాంగణమంతా కరతాళ ధ్వనులతో మార్మోగింది. ప్రపంచంలోనే అతి పురాతనమైన రుషి సంప్రదాయం, సకల మతాలకు తల్లి అయిన సనాతన ధర్మం, కోట్లాది భారతీయుల తరపున మీకు వందనం అంటూ ఆయన చేసిన ఉపన్యాసం ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన ప్రతినిధులను మంత్ర ముగ్ధులను చేసింది.
అన్ని మతాలు సత్యమేనని ప్రపంచానికి చాటి చెప్పిన సనాతనధర్మం తనదని చెప్పేందుకు గర్విస్తు న్నానన్నారు వివేకానంద. నదులన్నీ సముద్రంలో కలిసినట్లే, విభిన్న ఆరాధనా పద్ధతులు పరమేశ్వరుడినే చేరుకుంటాయి. ఎవరు ఏరూపంలో నన్ను గ్రహిస్తారో, నేనూ ఆ రూపంలోనే వారిని అనుగ్రహిస్తాను అనే గీతాచార్యుని తత్వాన్ని వివరించారు. ప్రపంచంలోనే ప్రాచీనమైనవి హిందూ, జొరాష్ట్రియన్, యూదు మతాలు, ఇందులో చివరి రెండు మతాలు క్రూరమైన దాడుల కారణంగా జన్మస్థలాల నుంచి నిష్క్రమిం చాయి. కానీ సనాతన హైందవ ధర్మాన్ని కూకటివేళ్లతో కదిలించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సముద్రంలో నీరు వెనక్కి వెళ్లి తిరిగి బలం పుంజుకొని వచ్చినట్లు వైదికమతం ఎప్పటికప్పుడు అనేక సంప్రదాయాలను తనలో ఇముడ్చుకుంటూ నూతనోత్తేజం పొందుతోంది.
విగ్రహారాధన, నాస్తిక, అజ్ఞేయ వాదాలు, బౌద్ధం, జైనం తదితర ధర్మాలను హిందూత్వంలో దర్శించుకోవచ్చు. హిందూ ధర్మంలోని ఆంతరంగిక శక్తి, వేదాల నిత్యత్వం, సృష్టి, పరమాత్మ, ఆత్మ, రుషి పరంపర, నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక సత్యాలపై స్వామీజీ చేసిన ఉపన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. షికాగో సర్వమత సభల అనంతరం అమెరికా, బ్రిటన్, యూరోపియన్ దేశాల్లో పర్యటిస్తూ వివేకానంద ఇచ్చిన ఉపన్యాసాల కారణంగా పాశ్చాత్యులకు భారతదేశంపై ఉన్న దురభిప్రాయం దూరమైంది. స్వావి•జీ స్వదేశానికి తిరిగి వచ్చినప్పుడు దేశ ప్రజల నుంచి అఖండ స్వాగతం లభించింది..
హిందుత్వంలోనే విశ్వ శ్రేయస్సు
భారతదేశ పునర్నిర్మాణం ఆధ్యాత్మిక శక్తిపై నిర్మితం కావాలన్నారు స్వామి వివేకానంద. ఈ ప్రపంచంలో పుణ్యభూమి ఏదైనా ఉందన్నా, భగవంతుని చేరుకోవడానికి తపించే వారి చివరి గమ్యం ఆధ్యాత్మిక భారతమేనని చెప్పేవారు స్వావి•జీ.. మన పూర్వుల సదాచారాలను మరచిపోనంత కాలం హిందువులన• ఏ శక్తీ నాశనం చేయలేదు.
స్వామి వివేకానంద జీవితం సనాతన ధర్మ పరిరక్షణ, ప్రచారానికి అంకితమైంది. సనాతన ధర్మం అంటే హిందుత్వమే. భారతదేశం ప్రపంచానికి ఆధ్యాత్మిక సంపదను ఇచ్చింది. ప్రాచీనమైన రుషి పరంపర, వైదికధర్మానికి వారసులం మనమందరం. నా హిందూ జాతిని, నా పూర్వులను చూసి నేను గర్విస్తున్నాను. వి•రు కూడా హిందువులమని చెప్పుకోడానికి గర్వపడండి అని తన సందేశంలో చాటారు స్వావి•జీ. పాశ్చాత్య సంస్కృతిని, వారి వేషధారణ, ఆహారపు అలవాట్లను మనం అనుసరించాల్సిన అవసరం లేదన్నారు. భారతీయత, హైందవం మన రక్తంలో నిరంతరం ప్రవహిస్తోందని గుర్తు చేశారు.
హిందుత్వం లేకపోతే భారతదేశమే లేదు. భారతీయత కూడా లేదు. హిందుత్వం భారతీయుల శ్రేయస్సు కోసం మాత్రమే కాదు, విశ్వమానవ శ్రేయస్సు కోసం అవసరమని చెప్పేవారాయన. వివేకానందుల దృష్టిలో హిందుత్వమంటే జాతీయ చైతన్యం సాధించే సాధనం. మొత్తం విశ్వమానవ సమాజ అభ్యున్నతికి, వారి నైతిక తాత్వికస్థాయిని పెంపొందించేందుకు ఈ భావన ముఖ్యమని చెప్పేవారు.
మీ మతం అవసరం లేదు
భారతదేశంలో మత ప్రచారానికి వచ్చేవారిని స్పష్టంగా నిరసించారు స్వామి వివేకానంద. క్రైస్తవుల సద్విమర్శకు సిద్ధంగా ఉండాలని సూచించారు. కరవు, కాటకాల్లో వేలాది మంది మరణిస్తుంటే వారిని ఏ విధమైన సహాయం చేయకుండా చర్చిలు నిర్మిస్తున్నారు. కోట్లాది మంది అన్నం కోసం విలపిస్తుంటూ మీరు వారికి చేస్తున్న సహాయం ఏమిటి? అని ప్రశ్నించారు. ధనం కోసం మత బోధ చేసేవారు భ్రష్టులని అన్నారు. క్రైస్తవ ప్రచారకులు హిందూ మత వ్యతిరేకతను నూరిపోయడాన్ని తప్పు పట్టారు. క్రైస్తవులు హిందువుగా మారాలని తాను కోరుకోవడం లేదని, అలాగే హిందువులు క్రైస్తవులుగా మారాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రతి వ్యక్తి ఇతరుల భావాలను, మతాల సారాన్ని గ్రహించి సొంత వ్యక్తిత్వం ఏర్పరుచుకోవాలన్నారు. అంటరాని తనం, కులతత్వం, దురాచారాలు, మూఢ నమ్మకాలను వివేకానంద తీవ్రంగా ఖండించారు. వారిని ఆదుకునేందుకు సేవే మార్గమని సూచించారు. దరిద్రుల సేవే నారాయణ సేవ అన్నారు అన్నారు.
1897లో వివేకానంద తోటి శిష్యలతో కలిసి రామకృష్ణ మఠం ప్రారంభించారు. దీని ప్రధాన ఉద్దేశం? ఆధ్యాత్మికతను సమాజ సేవతో కలపడం. పేదలకు విద్య అందించడం, సహాయం చేయడం, కష్టకాలంలో సేవ చేయడం, యువతను స్ఫూర్తితో నింపడమే పనిగా మార్చారు.
యువతపైనే స్వావి•జీ ఆశలు
దేశ నిర్మాణం, అభివృద్ధి, పురోగతి దాని యువతపై ఆధారపడి ఉంటుంది. ఆధునిక భారత దేశ పునర్నిర్మాణంలో యువతపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు స్వామి వివేకానంద. ఆయన బోధనలన్నీ వారిని ఉద్దేశించినవే. యువతకు ‘‘లేవండి, మేల్కొనండి, లక్ష్యం చేరేవరకు ఆగకండి’’ అని పిలుపునిచ్చారు, ఆత్మవిశ్వాసం, సంకల్పం, సేవాభావం, శారీరక-మానసిక దృఢత్వాన్ని ప్రోత్సహించారు. ప్రతి యువకుడిలో అపారమైన శక్తి ఉందని, దేశ నిర్మాణం, ప్రపంచ మార్పులో వారే కీలకమని నొక్కి చెప్పారు, వ్యక్తిగత అభివృద్ధికి భౌతిక, సామాజిక, మేధోపరమైన, ఆధ్యాత్మిక అన్వేషణల ద్వారా సంపూర్ణ జీవితాన్ని గడపాలని సూచించారు.
‘ఆధునిక యువతపైనే నాకు విశ్వాసం ఉంది.. నేను నిర్మించిన ఆదర్శాన్ని దేశ మంతా వ్యాప్తి చేసేది యువతే. బలిష్టులు, జవ సంపన్నులు, ఆత్మ విశ్వాసుల, రుజువర్తనులు కావాలి. ఇలాంటి వారు వంద మంది ఉన్నా చాలు, ఈ ప్రపంచాన్నే మార్చేయవచ్చు. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్రసంకల్పితమైన మనస్సు అవసరం. బలమే జీవితం,బలహీనతే మరణం..’ అన్నారు వివేకానంద. మీరు నిజంగా నా బిడ్డలే అయితే దేనికీ భయపడరు. ఎక్కడా ఆగిపోరు. మీరు సింహాల్లా ఉండాలి. మన దేశాన్నే కాక, ప్రపంచాన్నే జాగృతం చేయాలి. ఉద్యమ నిర్వహణలో అవసరమైతే అగ్నిలో దూకడానికైనా సంసిద్ధంగా ఉండాలి అని ఉద్బోధించారు.
స్వామి వివేకానంద జీవించినది కేవలం 39 సంవత్సరాలు. కానీ మన సనాతన ధర్మవైభవం మరో వేయేళ్లు సాగేందుకు అవసరమైన మరమ్మతులు చేసి పోయారు. ఆయన కన్న కలలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు భారతీయులుగా మనందరిపైనా బాధ్యత ఉంది.
స్వామీజీ తన జీవిత పర్యంతం సమాజాన్ని జాగృతం చేసేందుకు శ్రమించారు. దేశ యువతను తట్టిలేపారు. చేయాల్సిన కార్యాన్ని బోధించారు. అంతటి మహనీయుడి జయంతి సందర్భంగా జనవరి 12న భారతదేశం ‘జాతీయ యువజన దినోత్సవం’ని జరుపుకుంటున్నాం.
క్రాంతిదేవ్ మిత్ర
సీనియర్ జర్నలిస్ట్