సంక్రాంతి అంటే ఉత్సాహ పడనివారు ఉండరు. ముఖ్యంగా పల్లె సీమల్లో ఈ పండుగకు విశేష ప్రాధాన్యం ఉంది. పుష్య మాస బహుళ పక్షంలో వచ్చే తెలుగువారి ఈ పెద్ద పండుగ సమాజంలోని అన్ని వర్గాలకు ఆనందదాయకమైనది. దీనిని పెద్దల పండుగ, పంటల పండుగ, పశువుల పండుగ అనీ అంటారు. ఆ రోజున పితృదేవతలను స్మరిస్తూ దానధర్మాలు చేస్తారు. ప్రధానంగా కర్షకులకు అతి ముఖ్యమైనది. ధాన్యసిరులు కురిపించి వారి కళ్లలో ఆనంద కాంతులు నింపే పండుగ. అలసట చెందిన హృదయాల్లో ఒక్కసారిగా నవ్యశోభను నింపుతుంది. అప్పటివరకు గల కష్టాలను మరపింపచేస్తుంది.అయితే హార్దిక సంబంధా లను ఆర్థిక సంబంధాలు శాసిసున్న వేళ ఈ పండుగను ఎలా చేసుకుంటున్నాం!?

సంక్రాంతి ఆనందానికి, ఆరోగ్యానికి, ఐశ్యర్యానికి ప్రతీక. ‘సం’ అంటే మిక్కిలి, ‘క్రాంతి’ అంటే ప్రగతి పూర్వక మార్పు. ‘సంక్రమణం’ అంటే ‘చక్కగా క్రమించడం’ అంటే ‘నడవడం’ అని భావం. సమస్త ప్రాణులకు జీవప్రదాత సూర్యభగవానుడు పుష్య మాసంలో మకరరాశిలో ప్రవేశించడమే మకర సంక్రాంతి. ఆనాడు సూర్యారాధనకు ప్రత్యేక ప్రాధాన్య మిస్తారు. దక్షిణాయనానికి వీడ్కోలు పలుకుతూ ఉత్తరాయణానికి స్వాగతం పలుకుతుంది. మకర సంక్రమణాన్ని భోగి, మకర సంక్రాంతి, కనుమ పేర్లతో మూడు రోజులు పండుగను జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో నాలుగో రోజున కూడా పండుగ (ముక్కనుమ) చేసుకుంటారు.
ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభంతో ఉష్ణోగ్రతలలోనూ మార్పులు వస్తాయి. సూర్యకిరణాల్లో తీక్షణ హెచ్చుతుంది.
భోగి
భోగాలనిచ్చేది భోగి అని అర్థం చెబుతారు. భోగి అంటే ఉత్తమ యోగం. ఎలాంటి పరిణామాలనైనా సానుకూలంగా స్వీకరించి ముందుకు సాగాలని ఈ పండుగ బోధిస్తుంది. అమంగళాలు తొలగిపోయి, అసలైన భోగాలు ప్రసాదించాలని కోరుతూ అగ్నిహో త్రుడిని పూజించడం ఆనాటి విశేషం. రాగద్వేషాది దుర్గుణాలను, కోపతాపాలను, అజ్ఞానాన్ని దహింప చేసుకోవడమే భోగి మంటల పరమార్థం. ఆ రోజు వేకువజామున భోగిమంటలు వెలిగించి పాత వస్తువులు/సామగ్రిని అందులో వేస్తారు. దాంతో తమ దారిద్య్రం నశిస్తుందని కూడా విశ్వసిస్తారు. భోగి మంటలంటే పనికిరాని సామగ్రిని కాల్చివేయడం కాదని, నిరుపయోగ వస్తువులు/ పదార్థాలను అగ్నికి ఆహుతి చేసినట్లే, మన మనసులోని వికారాలను కాల్చివేయాలనే తత్వంతో ఏర్పడినదే భోగి మంటలని పెద్దల మాట. జడత్వాన్ని ఛేదించి, నవ్యత్వం దిశగా అడుగులు వేయాలన్నదే ఈ పండుగ అందిస్తున్న సందేశం. దక్షిణాయణ కష్టాలకు వీడ్కోలు చెప్పి ఉత్తరాయణ పుణ్యకాలానికి స్వాగతం పలికి నట్లుగా భావిస్తారు. భోగిని ‘ఇంద్రపండుగ’గా వ్యవహరిస్తారు. పంటలు ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియచేస్తూ, త్వరగా తొలకరిని అనుగ్రహించా లని, రానున్న వేసవి తీవ్రతను తగ్గించాలని ప్రార్థిస్తూ, పొంగలిని (‘ఇంద్ర పొంగలి’) నివేదిస్తారు. చిన్నారులకు బాలా రిష్టాలు, దిష్టి తొలగి సుఖశాంతులు కలుగుతా యన్న విశ్వాసంతో ఆ రోజున భోగి (రేగు) పండ్లు పోస్తారు. బదరికావనంలో తపస్సు సమయంలో బదరీ (రేగు) పండ్లతో ఆకలి తీర్చుకున్న నరనారాయణుల ఆశీస్సులు వారికి లభిస్తాయన్న విశ్వాసమూ ఉంది..
మరో గాథ ప్రకారం, గోదాదేవి, శ్రీరంగనాథుల ప్రణయభోగ జీవితానికి గుర్తుగా భోగి పండుగ ఏర్పడిందం టారు. విష్ణుచిత్తుడి కుమార్తె, మహాభక్తురాలు గోదాదేవి భగవంతుడినే భర్తగా పొందేందుకు ధనుర్మాస వ్రతం ఆచరించారు. ప్రతి వేకువన స్నేహితులరాళ్లతో శ్రీరంగ నాథుడిని అర్చిస్తూ, ఆ అనుభవాలను రోజుకు ఒక పాట (పాశురం)గా రాసి స్వామికి అంకితమిచ్చారు. అదే ‘తిరుప్పావై’. ‘తిరు’ అంటే ‘శ్రీ’, ‘పావై’ అంటే పాట(లు)లేక వ్రతమని అర్థం. తిరుప్పావై అనే తమిళపదానికి ‘శ్రీ వ్రతం/సిరినోము’ అని అర్థం. అమె భక్తికి, దీక్షకు మెచ్చిన రంగనాథుడు పరిణయమాడతాడు. ఆమె ఆయన పాదాల చెంత మోకరిల్లి స్వామిలో లీనమైపోయారు. శ్రీరంగం సహా 108 వైష్ణవ దివ్యక్షేత్రాలలో, ఇతర విష్ణ్వాలయాల్లో ఆ రోజున గోదా రంగనాథుల కల్యాణం జరుగుతుంది.
సూర్యుడు నెలకు ఒక రాశి వంతున ఏడాదిలో పన్నెండు రాశులలో ప్రవేశించే పక్రియను సంక్రమణం లేదా సంక్రాంతి అంటారు. అయితే పుష్య మాసంలో సూర్యుడు మకరరాశిలో ప్రవేశించే సంక్రాంతినే గొప్ప పర్వదినంగా జరుపుకుంటున్నారు. అప్పటివరకు భూమధ్య రేఖకు దక్షిణ దిక్కులో ఉన్న సూర్యుడు ఉత్తర దిక్కుకు మారతాడు. కనుకనే దీనిని ఉత్తరాయణం అంటారు. ఆ కాలంలో వాతా వరణంలో మార్పులు వస్తాయి. అప్పటి వరకు సుదీర్ఘంగా ఉండే రాత్రి వేళలు తగ్గి పగటి వేళలు పెరుగుతాయి.
తన పూర్వికులను పునీతులను చేసేందుకు భగీరథుడు గంగానదిని భువికి రప్పించిన రోజు మకర సంక్రాంతని ప్రతీతి. బలి చక్రవర్తిని మూడడుగులు దానమడిగిన శ్రీహరి తన మూడవ అడుగును ఆ రాక్షస రాజు తలపై ఉంచి పాతాళానికి పంపిన రోజు,ఆదిశంకరులు సన్యసించిన రోజు కూడా అదే. సృష్టి ఆరంభంలో శ్రీమన్నారాయడు మకరరాశిలోని శ్రవణ నక్షత్రంలోనే బ్రహ్మకు అనంత పద్మనాభ స్వామిగా సాక్షాత్కరించాడట. సంక్రాంతి నాడు పంచసూక్త సహితంగా శివుడికి ఘృతాభిషేకం(నెయ్యి) చేయడం వల్ల మాఘ పుణ్యఫలితం దక్కుతుందని పెద్ల్దలు చెబుతారు. మకరరాశికి శని అధిపతి కనుక శని ప్రీతి కోసం తిలదానం ఆచారంగా వస్తోంది.
కనుమ
గ్రామీణులకు…ముఖ్యంగా రైతులకు కనుమ అత్యంత ప్రీతిపాత్రమైన పండుగ కనుమ. ఏరువాక తరువాత ఘనంగా జరుపుకొనే పండుగ ‘కనుమ’ అంటే పశువు అని అర్థం. మానవ మనుగడకు సహకరించే పశుపక్ష్యాదులకు కృత్ఞతలు చెప్పుకోవడమే ఈ పండుగ పరమార్థం. గోసంరక్షణ,పశుపోషణ సమాజం కర్తవ్యమని ఇది చాటి చెబుతోంది. వ్యవసాయానికి ఆసరాగా నిలిచే పశువులను కృతజ్ఞతా పూర్వకంగా నాడు ప్రత్యేకంగా పూజిస్తారు. పంటలను చీడపీడల నుంచి కాపాడాలని కోరుతూ ఆరుబయట సూర్యునికెదురుగా కొత్త కుండలో పాయసం వండి నివేదిస్తారు. అనంతరం ప్రసాదంగా స్వీకరించి, పొంగలిలో పసుపు, కుంకుమ కలిపి పొలాల్లో చల్లుతారు. దీనిని ‘పొలి చల్లడం’ అంటారు.
ముక్కనుమ
కొత్తగా పెళ్లయిన యువతులు ముక్కనుమ నాడు సావిత్రీ గౌరీవ్రతం చేసి తొమ్మిది రోజుల బొమ్మల నోము ప్రారంభిస్తారు. దీనివల్ల భర్త పట్ల అనురాగం పెరుగు తుందని విశ్వాసం. స•ంతానం కోరే మహిళలు నట్టింట్లో ఊయల ఏర్పాటు చేసి తొమ్మిది మంది ముత్తయిదువలు తెచ్చిన బొమ్మలను అందులో ఉంచి ఊరేగిస్తారు.
ఏదీ నాటి వైభోగం…!
ధాన్యపు సిరులు కురిపించి కర్షకుల కళ్లలో ఆనందకాంతులు నింపే సంక్రాంతి పరిస్థితి వర్తమానంలో అలా ఉందా? అంటే సానుకూల సమాధానం రావడం కష్టమే. నాసిరకం వ్యవసాయ ఉత్పాదకాలు. అతివృప్టి- అనావృష్టితో సతమతం. గిట్టుబాటు ధరలు దక్కకపోవడం, దళారుల బెడద. వెరసి…అప్పుల బాధలు అన్నదాతలు వెన్ను విరుస్తున్నాయి. తాను అరకొరగా తింటూ పదిమందికి కడుపునిండా పెట్టే ‘వర్తమాన రైతు భారతం’గురించి మాధ్యమాలు కళ్లకు కడుతూనే ఉన్నాయి.
ఒకనాడు ఈ పండుగ అన్ని వృత్తులవారికి ఉపాధి కల్పించేదే. గంగిరెద్దుల వారు, హరిదాసులు, జంగాల తదితర సామాజికవర్గాల, వృత్తుల వారు వృత్తి నైపుణ్యాలను ప్రదర్శిస్తూ సమాజం నుంచి కానుకలు స్వీకరించేవారు. స•ంక్రాంతి వేళల్లో తప్పనిసరిగా కనిపించే వాటిలో గంగిరెద్దుల ఆట ముఖ్యమైంది. ‘గంగి’ని పవిత్రమైన ‘గంగ’కు ప్రతీకగా భావిస్తారు. ఇది ఒకనాటి మాట. నేడు హరికథ, గంగిరెద్దులు తదితర జానపద కళలు పల్లెల్లోనూ నామ మాత్రమవుతున్నాయి. నెలరోజుల పాటు హరిదాసులు వీధివీధులు తిరుగుతూ శ్రావ్యంగా హరినామ సంకీర్తన చేయడం మధురానుభూతి. కాల క్రమంలో…. కులవృత్తి కడుపునింపక పోవడంతో ప్రత్యామ్నాయ ఉపాధిని వెదుక్కుంటుండగా, పాత•తరం కళాకారులు కులవృత్తిని వదులుకోలేక…కొనసాగలేక కాలం వెళ్లదీస్తున్నారు. ఇంకొన్నాళ్లకు ఈ కళారూపాలు కనుమరుగై పోతాయేమోనని కళాభిమానులు కలత చెందుతున్నారు.
ఇక సంక్రాంతి సమయంలో కోడి పందాల గురించి ప్రత్యేకంగా చెప్పవలసింది లేదు. సంక్రాంతి అంటే కోడిపందాలు అనేలా పరిస్థితి మారింది. ఒకనాడు వినోదంగా ప్రారంభమైన ఈ పక్రియ రానురాను జూదంగా ‘వ్యాపార సంస్కృతి’గా పరిణ మించింది.భారీ నుంచి అతిభారీ మొత్తంలో ‘ఫణం’గా పెడుతూ ఆర్థికంగా కుదేలవుతున్న వారెందరో!.
పల్లెబాట
పల్లెలో పుట్టినవారికి దాని పేగుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకే సంక్రాంతి పండుగ వేళ పట్టణ ప్రజ పల్లెబాట పడుతోంది. కానీ, నాటి అనుభూతి కానరావడంలేదని అంటున్నారు. అందుకు ఎన్నో కారణాలు. తరానికి, తరానికి అంతరం ఏర్పడుతోంది. నాటి ఆప్యాయత అనురాగాలు నేటి యాంత్రిక జీవితం, క్షుద్ర,స్వార్థ రాజకీయాలతో కలుషితమవుతున్నాయనడంలో సందేహం లేదు.కులమతవర్ణ వర్గాలకు అతీతంగా వావివరుసలతో పిలుపులు, మమతానురాగాలు, ఆప్యాయతలను పంచుకోవడం కరవై పోతోంది. ఉళ్లల్లో ఉన్న ఆ కొద్దిరోజుల్లోనైనా మనసార ముచ్చట్లాడుకొనే అవకాశం లేదు. అందుకు ప్రధాన కారణం చేతుల్లోని ‘సంచారవాణి’ (మొబైల్‌ ‌ఫోన్‌) ‌ప్రధాన కారణమని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. పెరుగుతున్న సాంకేతిక, సౌకర్యాలు మానవ సంబంధాలను మసకబారుస్తున్నాయనేందుకు ఇది ఒక ఉదాహరణ మాత్రమే.అందరు ఒకేచోట కూడినా, ఎవరికి వారు ఒంటరే. ఏ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేని కాలంలో పల్లెసీమల్లో రోజులను క్షణాల్లా గడిపి, బరువెక్కిన గుండెలతో వీడ్కోలు తీసుకొన్న దశ నుంచి మొక్కుబడి సందర్శనకు, పండుగ వస్తే తప్ప పల్లె ముఖం చూడలేని స్థితికి వచ్చేశాం. అయితే… నేటి మన కర్తవ్యం ఏమిటి? స్వగ్రామాలకు వెళ్లగలిగి, వెళ్లలేకపోతున్నవారు తమ జీవితాలలో ఆనందాన్ని ఏ మేర కోల్పోతున్నారో ఆత్మపరిశీలన చేసుకుంటే… జన్మభూమి విలువ బోధపడుతుంది.
‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి’

డా।। ఆరవల్లి జగన్నాథస్వామి
సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE