రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్ శతాబ్ది వేళ స్వయంసేవకులు అంకితమైన కొత్త సామాజికోద్యమం పంచపరివర్తన. ఈ ఉద్యమం ఉద్దేశం యుగధర్మాన్ని నిలుపుకోవడం అన్నారు సర్‌కార్యవాహ దత్తాత్రేయ హోసబళే. హిందూత్వం అంటే రామమందిర నిర్మాణమో, కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని ఇచ్చిన 370 అధికరణం రద్దు మాత్రమే అనుకోరాదని, అమ్మభాష, కుటుంబం, పౌరవిధి, సామాజిక సమరసత, మన ఆర్ష వాఙ్మయం చెప్పే పర్యావరణ పరిరక్షణ… వీటన్నిటిని గౌరవించడమేనని, అదే యుగధర్మమని, ఆ ధర్మాన్ని ఆచరించాలని హోసబళే అన్నారు. వందేమాతర గేయం పుట్టి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పార్లమెంట్‌ ప్రత్యేక చర్చను నిర్వహించడం హర్షణీయమని, వందేమాతరం జాతీయ భావన విలువలను ప్రజలకు అలవరుస్తుందని అన్నారు. పొరుగు దేశాలలో తలెత్తిన జెన్‌జీ అలజడి గురించి వ్యాఖ్యానిస్తూ, ఆ పేరు మాత్రమే కొత్తదనీ, నవతరం కొత్త ఆలోచనలతో వస్తుంటుందనీ గుర్తు చేశారాయన. ప్రతీ నవతరానికి కొన్ని ఆకాంక్షలు ఉంటాయి, అలాంటి ఆకాంక్షలను సమాజం లేదా ప్రభుత్వం నెరవేర్చాలి. లేనిపక్షంలో నవతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారుతుందని ఆయన స్పష్టం చేశారు. అయితే పొరుగుదేశం తరహాలో భారత్‌లో ఉన్నట్టుండి ఉద్యమం పుట్టుకొస్తుందని తానైతే అనుకోవడం లేదని అన్నారు. ఇవాళ సమాజాన్ని క్షోభ పెడుతున్న సామాజిక మాధ్యమాల విషయంలో స్వీయనియంత్రణే అత్యంత ముఖ్యమైనదని, ఆంక్షలు విధించడం వల్ల ప్రయోజనం ఉంటుందని తాను అనుకోవడం లేదని చెప్పారు. మావోయిస్టుల ఆఖరి అడుగుల గురించి ప్రస్తావించగా` అటవీ ప్రాంతానికి చెందిన నక్సలిజం, పర్వత ప్రాంతాలకు చెందిన నక్సలిజం, గిరిజన ప్రాంతాలకు చెందిన నక్సలిజం పట్టణ ప్రాంతాలకు వలసపోయిందని, ఈ పరిణామం, అంటే అర్బన్‌ నక్సలిజం  తలెత్తడం మరింత ప్రమాదకరమైనదని నిష్కర్షగా చెప్పారు. స్వదేశీ ఏ జాతికైనా జీవనాడి అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. స్వదేశీ ఉద్యమం స్వాతంత్య్ర ఉద్యమానికి చోదకశక్తి మాత్రమే కాదు. అది మన ఆత్మగౌరవం, మన భాష, మన సంస్కృతి, మన ప్రకృతికి సంబంధించినదని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో జరిగిన విశ్వసంఘ శిబిరంలో పాల్గొనడానికి వచ్చిన దత్తాత్రేయ హోసబళే తెలుగు జాతీయ వార పత్రిక జాగృతికి ప్రత్యేక ఇంటర్వ్యూ (డిసెంబర్‌ 26, 2025) ఇచ్చారు. ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంత విశ్వరూపం వారి మాటలలో దర్శనమిస్తుంది.

హిందూ ఐక్యత అన్న మూలసూత్రంతో సమంగా ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యాచరణలో పంచపరివర్తనకు ప్రాముఖ్యం ఇవ్వబోతున్నట్టు కనిపిస్తున్నది. ఆ పంథా ఎలా ఉంటుందో వివరిస్తారా? ఫలితాలు ఎలా ఉంటాయని అనుకోవచ్చు?

మొత్తంగా చూసినప్పుడు పంచపరివర్తన అనేది కొత్త విషయమేమీ కాదు. సంఘం దీనికి సంబంధించిన కార్యాచరణను ఇప్పటికే చేపట్టింది. కానీ సంఘ శతాబ్ది తరుణంలో మన సమాజంలో పరివర్తనను ఆశించి ఆ ఐదు సూత్రాలను ఒక సామాజిక ఉద్యమంగా చేపట్టాలని సంఘం భావించింది. ఇందులో ఉన్న అన్ని అంశాలు లేదంటే, కనీసం నాలుగు అంశాలు`సామాజిక సమరసత, పర్యావరణ పరిరక్షణ, కుటుంబప్రబోధన్‌ అంటే కుటుంబ నిర్వహణకు సంబంధించి కౌన్సెలింగ్‌, కుటుంబ వ్యవస్థ, స్వదేశీ భావనపై స్వయంసేవకులు పని చేస్తున్నారు. అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యాచరణ దేశవ్యాప్తంగా జరుగుతున్నప్పటికీ కొద్దిమందికి మాత్రమే పరిమితమైపోయింది. ఇక పంచపరివర్తనలో ఐదవ విషయానికి వస్తే.. అదే పౌరకర్తవ్యభావన, పౌరుల విధి. ఈ ఐదవ అంశాన్ని మేం ఇటీవల జోడిరచాం. స్వయంసేవకులు శాఖకు వెళుతున్నప్పటికీ వారు పౌరకర్తవ్యభావన, పౌరుల విధిని అనుసరిస్తున్నారు. కానీ ఈ ఐదింటిని ఒక సామాజిక ఉద్యమంగా చేపట్టాలంటే మనం వీటన్నింటిని కలిపి యుగధర్మంగా భావించాలి. అసలు హిందూత్వాన్ని ఎలా నిర్వచించాలి? హిందూత్వం అంటే అయోధ్యలో మందిర నిర్మాణమో, లేదా ఆర్టికల్‌ 370ని తొలగించడమో మాత్రమే కాదు. ఇది ఇలాగే కొనసాగితే హిందూత్వం అంటే ఇదే కాబోలు అని ప్రజలు అనుకుంటారు. కానీ అది సరికాదు. అలాగే హిందూత్వం అజెండా అఖండ భారత్‌ కానే కాదు. కనుక హిందూత్వం అనేది ఒక అజెండా కాదు. అది ఒకరి యావత్‌ జీవితాన్ని ఆవరించి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో నేటి సమాజానికి కావలసినది ఏమిటి? ఒక వ్యక్తి స్థాయిలో, సమాజం స్థాయిలో, జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఏమి కావాలి? దీనికి సమాధానంగా జీవితంలో, ముఖ్యంగా భౌతికజీవితంలో కొన్ని అంశాలను గురించి మేం ఆలోచించాం. పౌరకర్తవ్య భావన, పౌరుల విధిని చూసినప్పుడు వాటి ఆచరణలో కొన్ని నియమాలను అనుసరిస్తున్నట్టుగా ఉంటుంది. కానీ నియమాలను అనుసరించడంతోనే వాటి ఆచరణ పరిపూర్ణం కాదు. వాటిని కూడా ఒక ధర్మంగా పరిగణించాలి. ఎందుకంటే ఒక వ్యక్తి సమాజంలో నివసిస్తున్నప్పుడు అతడు/ఆమె ఇతరుల పట్ల అక్కరను కలిగి ఉండాలి. నేను ఒక ఆసుపత్రి ప్రాంగణంలోకి అడుగుపెట్టి నప్పుడు నేను ఏ విధంగా ప్రవర్తించాలి? లేదా ఒక విశ్వవిద్యాలయ ప్రాంగణం విషయానికి వస్తే, అదేమీ బజారు కాదు. అది మార్కెట్‌ కాదు. అక్కడ ఒక గ్రంథాలయం ఉంటుంది. అక్కడ విద్యాబోధన జరుగుతూ ఉంటుంది. పరిశోధన జరుగుతూ ఉంటుంది. అలాంటి చోట నేను వాహనాన్ని ఎలా నడపాలి? ప్రస్తుతం మనం ఉన్న ఈ విశ్వసంఘ శిబిర ప్రాంగణం విషయానికి వస్తే ఇక్కడ కొన్ని నియమ, నిబంధనలు అమలులో ఉన్నాయి. కనుక ప్రతిస్పందన చర్యలో భాగంగా వాటిని మనం అయాచితంగా అనుసరించడమే పౌరకర్తవ్యభావన, పౌరుల విధి అవుతుంది. మనం దేవాలయానికి వెళ్లినప్పుడు కొన్ని పద్ధతులను అనుసరిస్తాం. వాటిని మన జీవితంలో భాగంగా చేసుకున్నాం. పాదరక్షలను దేవాలయం వెలుపల విడిచిపెడతాం. ఒక నిర్దేశితమైన పంథాను అనుసరించి మనం అక్కడికి వెళతాం. అక్కడ ఉమ్మి వేయం. ఎందుకంటే అది ఒక పవిత్రమైన ప్రాంతం కాబట్టి. మన చుట్టూ ఉన్న ప్రతీ ఒక్కటి చివరకు ఉద్యానవనం కూడా పవిత్రమైనదే. మనం అక్కడ ఉమ్మి వేయరాదు. కానీ మనం ఆ విషయాన్ని మరిచిపోతున్నాం. అంటే మన ప్రవర్తన చుట్టూ ధర్మం ఆవరించి ఉంటుంది. ధర్మం కూడా సామాజిక జీవనానికి అనుసంధానమై ఉంటుంది. అందుకనే ఈ విషయాలన్నీ చాలా ముఖ్యమైనవి. ఆర్థికంగా మనం స్వయంసమృద్ధిని సాధించాలి. పరిస్థితులపై ఆధారపడి మనం స్వయంసమృద్ధిని సాధించాలి. భాష విషయానికి వస్తే.. తర్వాతి తరం భారతీయమైన వారి వారి భాషలను విస్మరించరాదు. మరచిపోరాదు. నేటి యువతరం విషయానికి వస్తే చాలా మందికి వారి మాతృభాష ఏమిటనేది కూడా తెలియదు. మాతృభాషలో ఉన్న పుస్తకాలను వారు చదవడం లేదు.

 మాతృభాష నిర్లక్ష్యానికి గురవుతున్నది. ఎవరు దీనికి బాధ్యులు? విధానాలకు రూపకల్పన చేసే ప్రభుత్వమైతే కాదు. కచ్చితంగా తలిదండ్రులే బాధ్యులు. వారు ఈ విషయాన్ని (మాతృభాష నిర్లక్ష్యం) పట్టించుకోవాలి. అందుకనే ఈ విషయాలన్నీ ఇమిడి ఉన్న పంచపరివర్తన ఒక సామాజిక ఉద్యమం అవుతుంది. ఇది హిందూత్వంలో భాగం. అదే యుగధర్మం. ఇక పంచపరివర్తనకు వస్తున్న స్పందన విషయానికి వస్తే` గడచిన ఆరుమాసాల్లో అనూహ్యమైన స్పందన వచ్చింది. పారిశ్రామికవేత్తలు, వయసులో పెద్దవారు, ప్రొఫెసర్లు, నిపుణులు, మతపెద్దలు లేదా కుటుంబ జీవనం గడుపుతున్నవారు, అన్ని వయసుల వారు ఇలా సమాజంలో అన్ని వర్గాల ప్రజలు అనుసరించ డానికి ఇది (పంచపరివర్తన) అద్భుతంగా ఉందని అంటున్నారు. ఇక్కడ చెప్పుకోవాల్సిన ముఖ్యమైన మొదటి విషయం ఏమిటంటే.. ఇది మతాలకు అతీతమైనది. ధార్మికపరంగా అత్యంత తటస్థమైనది. ఆర్థిక విషయాల పట్ల బాధ్యత, స్వదేశీ, కుటుంబ విలువలు అన్ని మతాలకు సంబంధించినవి. కాబట్టి అన్ని మతాలవారు అనుసరిం చాలి. ఇక రెండవ విషయం` దీనికి డబ్బుతో పనిలేదు. పంచపరివర్తనను ఆచరించేందుకు అదనంగా డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. మూడవ అంశంగా ప్రభుత్వం దీని కోసమని అదనంగా నియమ, నిబంధనలు రూపొందించాల్సిన పనిలేదు. దీని అమలుకు సమాజం పూనుకోవాలి. ఆ కారణంగానే పంచపరివర్తనకు ప్రజల నుంచి స్పందన అనూహ్యంగా ఉంది.

పంచపరివర్తన ఐదు అంశాలలో ఏది ప్రజలకు ఎక్కువ ఆకర్షణీయంగా ఉంది?

అది వ్యక్తులపైన, వారు ఉంటున్న పరిస్థితులపైన ఆధారపడి ఉంటుంది. కుటుంబ ప్రబోధన్‌ బాగుందని కొందరు అంటారు. ఎందుకంటే వారి కుటుంబంలో, వారి పరిసర ప్రాంతాల్లో అది సరిగ్గా సరిపోతుంది కాబట్టి. మరికొందరు పౌరకర్తవ్య భావన, పౌరుల విధి వైపు మొగ్గు చూపుతుంటారు. ఎందుకంటే సమాజంలోని వ్యక్తులతో నేను సంభాషించిన దాన్ని బట్టి వేర్వేరు సమూహాలకు చెందిన వ్యక్తులకు వారికంటూ ప్రాధాన్యమనిపించే అంశాలు కొన్ని ఉంటాయి. అందుకనే కొందరు స్వదేశీ ముఖ్యమైనది అంటారు. మరికొందరు పర్యావరణ పరిరక్షణ కీలకమైనది అంటారు. అందుకనే పంచపరివర్తనలో ఏది అగ్రస్థానంలో ఉంటుంది అనే విషయాన్ని నేను చెప్పలేను. చాలా సందర్భాల్లో వాటి గురించి మాట్లాడుతున్నప్పుడు పంచపరివర్తనలో అంశాల వరుస క్రమాన్ని మార్చి చెబుతుంటాను. అవి ఒకే వరుస క్రమంలో ఉండాల్సిన అవసరం లేదు. లేనిపక్షంలో ప్రజలు ఆచరణలో సామాజిక సమరతను మొదటిదిగాను పౌరకర్తవ్యభావన చివరిదిగానూ భావించే అవకాశం ఉంది. కనుక పంచపరివర్తనలో దేనికి అగ్రతాంబూలం ఇవ్వాలనేది వ్యక్తుల పైన, వారి జీవించే ప్రాంతాలపైన, అక్కడి పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది.

ప్రస్తుత సమాజంలో పౌరకర్తవ్య భావన చాలా ముఖ్య మైనదని భావించవచ్చునా?

చూడండి. నేను సూరత్‌లోని బుద్ధవిహార్‌కు వెళ్లాను. అక్కడ షెడ్యూల్డ్‌ కులాలకు చెందినవారు నివసిస్తున్నారు. వారికి పర్యావరణ పరిరక్షణ గురించి ఎలాంటి పట్టింపు లేదు. ఎందుకంటే వారి జీవన ప్రమాణాలు కడు దయనీయం కాబట్టి. వారు ఆలోచించేదల్లా సమాజంలో అందరితో సమానంగా తమను చూడాలని. అలాంటి చోట్ల సామాజిక న్యాయం ముఖ్యమైనది. ఇదంతా చూసినప్పుడు పంచపరివర్తనలోని అన్ని అంశాలూ అన్ని సందర్భాలలోను వారి వారి తీరును బట్టి ముఖ్యమైనవి అని చెప్పలేం. కనుక ఉన్న ఐదింటిలో ఏది మొదటిది అనేది మనం చెప్పలేం.

వందేమాతరం గీతానికి, ఆ గీతం జాతికి ఇచ్చిన స్ఫూర్తికి గొప్ప చరిత్ర ఉంది. ఆ గీతం ఇస్తున్న ప్రేరణ భవిష్యత్తులో భారతీయులలో మానసిక ఐక్యతను సాధించడంలో ఎలా  ఉపయోగపడుతుందని అనుకోవచ్చు? పార్లమెంట్‌ ఆ గీతం గురించి ప్రత్యేక చర్చకు అవకాశం కల్పించడం ఎలాంటి చర్య?

భారత ప్రభుత్వం వందేమాతరంపై పార్లమెంట్‌లో ప్రత్యేక చర్చను నిర్వహించడం మంచి పరిణామం. అలాగని అదేదో అదనంగా చేసిన పని అని భావించాల్సిన అవసరం లేదు. కానీ పార్లమెంట్‌ తీసుకున్న చొరవ ఇదే విషయంపై నేటి తరంలో లోతైన చర్చకు దారి తీసింది. నేటి తరానికి, వారికంటే ఒక ముందు తరానికి వందేమాతరం నేపథ్యం గురించి పెద్దగా తెలియదు. అలాగని ఇదేదో ఆర్‌ఎస్‌ఎస్‌ లేదా బీజేపీ గట్టిగా నొక్కి వక్కాణిస్తున్న విషయం కూడా కాదు. చూడండి! మొదటగా జనగణమన, వందేమాతర గీతాలకు సమాన హోదా ఇవ్వాలని, రెండిరటికీ సమాన గౌరవం ఇవ్వాలని భారత రాజ్యాంగం స్పష్టంగా చెప్పింది. రెండవది, నిజానికి పార్లమెంట్‌ సమావేశాలు వందే మాతరంతో మొదలై జనగణమనతో ముగుస్తాయి. రాజ్యాంగ పరిషత్‌ దీని గురించి విస్తృతంగా చర్చించింది. కానీ కాలం గడిచేకొద్ది, దేశానికి స్వరాజ్యం వచ్చిన తర్వాత జాతీయగీతం వందేమాతరాన్ని ప్రజలకు నేర్పిస్తున్న దాఖలాలు కనిపించడంలేదు. పాఠశాల అసెంబ్లీలో జనగణమన ఆల పించడం జరుగుతున్నది. ఇది స్వాగతించాల్సిన అంశమే. ఎందుకంటే అది జాతీయగీతం కాబట్టి. కానీ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో కనీసం కొన్ని సందర్భాల్లోనైనా వందే మాతరం ఆలపించాలి. ఎందుకంటే అది రాజ్యాంగానికి సంబంధించిన వ్యవహారం. వారు (స్వరాజ్యం వచ్చిన తర్వాత దేశాన్ని పాలించిన నాయకులు) తమకు అనుకూలమైన రీతిలో దానిని పక్కన పెట్టేశారు. ఎందుకంటే కొందరికి వందేమాతరం ఆలపించడంపై ఆసక్తి లేదు. మరికొందరు భారత్‌ను భారతమాతగా భావించరు. అదేమంటే లౌకికవాదం అంటారు. అదే నిజమైతే కాన్‌స్టిట్యూషన్‌ అసెంబ్లీ దాని గురించి ఎందుకు చర్చించింది? దానిని ఎందుకు జోడిరచింది? అంటే వారు(గత పాలకులు) ఉద్దేశపూర్వకంగానే దానిని రాజ్యాంగ బద్ధంగా తోసి రాజన్నారు. అక్కడితో ఆగకుండా ఆర్‌ఎస్‌ఎస్‌ రాజ్యాంగాన్ని అనుసరించడం లేదంటూ ఆరోపిస్తారు. వారు ఉద్దేశపూర్వకంగానే రాజ్యాంగం ప్రసాదించిన కొన్నింటిని ఉపేక్షించారు. ఇంక మూడో విషయం, వందేమాతరం స్వాతంత్య్రోద్యమంలో ఒక కీలకమైన పాత్రను పోషించింది. అదేదో ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రవేశపెట్టింది కాదు. వందేమాతరం పేరిట జాతిని దాస్యశృంఖలాల నుంచి విముక్తం చేసిన ఎన్నో త్యాగాలకు ఈ నేల సాక్షిగా నిలిచింది. కనుక ప్రతీ తరానికి ఇది స్మరించుకోదగినదిగా చెప్పాలి. దానికి గౌరవం ఇవ్వాలి. అదేదో నిర్బంధంగా విధించేది కారాదు. వందేమాతరానికి రాజ్యాంగబద్ధత ఉంది. రాజ్యాంగబద్ధమైన దాన్ని ప్రతీ ఒక్కరూ అనుసరించాలి. అది దేశం కోసం పనిచేసే విధంగా, అవసరమైతే దేశం కోసం త్యాగం చేసే విధంగా ప్రజలకు స్ఫూర్తిని ఇస్తుంది. వందేమాతరం జాతీయ భావన విలువలను ప్రజలకు అలవరుస్తుంది. బంకించంద్ర చటర్జీ అద్భుతమైన చరణాలతో వందే మాతర గీతాన్ని లిఖించారు. ఈ దేశపు సుదీర్ఘమైన ఘన చరిత్ర, నాగరికత, సంస్కృతిని గమనంలోకి తీసుకొని ఆ గీతం రచించారు. వందే మాతరంలో ఉన్నది రాజ్యాంగం తొలి ప్రతిలో చిత్రంగా ముద్రితమై ఉంది కూడా.

1937లో ముస్లింలు కోరిన మీదట వందేమాతరం నుంచి రెండు ముఖ్యమైన చరణాలను తొలగించారు. అయినప్పటికీ వారు దానిని పాడాలని కోరుకోవడం లేదు. దీని వెనుక ఇతర కారణం ఏదైనా ఉందా?

లేదు. మరే ఇతర కారణం లేదు. ఘనత వహించిన బూటకపు లౌకికవాద ప్రభావం ఇది. సరే, రెండు కీలకమైన చరణాలను వారు తొలగించారు. అయినప్పటికీ మిగిలిన వందేమాతరం గీతాన్ని మీరెందుకు ఆలపించడంలేదు? అదే ప్రశ్నార్థకమైంది. లౌకికవాదం కేవలం సమాజంలో ఒక వర్గాన్ని బుజ్జగించడానికి ఉన్నది. అలాగని ముస్లింలను మాత్రమే బుజ్జగిస్తున్నారని నేను అనడంలేదు. ఘనత వహించిన మన ప్రజల ఉదారవాద మనస్తత్త్వం కూడా గుర్తు చేసుకోవాలి. అలాంటి ప్రజలే ఇందుకు కారణం. అలాంటివారు వద్దు.. వద్దు.. వందేమాతరం ఆలపిస్తే అది మీ మతానికి దెబ్బ అని అంటున్నారు. అదేంటి? అలా జరగకూడదు. అందుకనే దీనికి (ఈ వివాదానికి) ఈ దేశంలో వలసవాద మనస్తత్త్వంతో కూడుకున్న వామపక్ష, ఉదారవాద, సామ్యవాద మూక కారణమైంది. వారు(ఆ మూక) రాతప్రతులను వక్రీకరించారు. భారతీయ భాషలను భ్రష్టు పట్టించారు. వందేమాతర గీతాన్ని అవమానించారు. అనేక విషయాలలో ఇలాగే వ్యవహరించారు. పాఠశాలలలో సరస్వతీ వందనం జోలికి వెళ్లారు. చరిత్రను నాశనం చేశారు. ఇంతటి నేరానికి వారు ఒడిగట్టారు. ఈ వాస్తవాలను అంగీకరించవలసిన సమయం సమాజంలో ఆసన్నమైంది.

మన పొరుగు దేశంలో జెన్‌జీ ఉద్యమాన్ని ఎలా చూడగలం?

చూడండి! జెన్‌జీ ఉద్యమం అనేది ఇదివరకూ ఉన్నది. కాకపోతే పేరు కొత్తది. నేను కాలేజీలో చదువుతున్నప్పుడు జేపీ (లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌) ఉద్యమం వచ్చింది. జేపీ ఉద్యమం ఎలా మొదలైంది?

సంపూర్ణ విప్లవం…

నిజమే. కానీ అది జయప్రకాశ్‌ నారాయణ్‌ ఆరంభించిన ఉద్యమం కాదు. విద్యార్థులు దానికి నాంది పలికారు.

గుజరాత్‌లో..

ఒక విద్యార్థిగా నేనూ అందులో పాల్గొన్నాను. అప్పట్లో అది కూడా జెన్‌జీనే. కాకపోతే వారు దానిని జెన్‌జీ అని పిలవకుండా యువత ఉద్యమం అని పిలిచారు. ఇవాళ మీరు జెన్‌జీ అని అంటున్నారు. సరే. పేరు మాత్రమే కొత్తది. ప్రతీ నవతరం కొత్త ఆలోచనలతో వస్తుంటుంది. అది ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తుంటుంది. ప్రతీ నవతరానికి కొన్ని ఆకాంక్షలు ఉంటాయి. అలాంటి ఆకాంక్షలను సమాజం లేదా ప్రభుత్వం నెరవేర్చాలి. లేని పక్షంలో నవతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారుతుంది. ఒక ఇంట్లో నివసించే కుటుంబంలోని పెద్దల మాట వినడానికి నవతరం సిద్ధంగా ఉండదు. కనుక ప్రతీ కుటుంబంలోనూ జెన్‌జీ ఉంటుంది. సహజంగా జరిగేది ఏమిటంటే, మా నాన్నగారు చెప్పే మాట మంచిదైనప్పటికీ నేను వినను. యువకుడిగా ఉన్నప్పుడు మా నాన్నగారు కూడా ఇదే పని (వారి నాన్నగారి మాట వినకపోవడం) చేసి ఉంటారు. కనుక జెన్‌జీ మానవ జీవనంలో సర్వ సాధారణమైన విషయం. కానీ జెన్‌జీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాత్రమే వ్యవహరించదు. అది అనేకసార్లు, అనేక అంశాలను ప్రశ్నిస్తుంది. అన్వేషణ సాగిస్తుంటుంది. పరిస్థితిని అర్థం చేసుకునే తర్ఫీదు పొంది ఉంటుంది. పరిశోధన చేస్తుంది. ఎందుకంటే ప్రతీ నవతరం సరికొత్త మేధా సంపత్తితో పురుడు పోసుకుంటుంది. అందుకనే జెన్‌జీకి చెందినవారికి కొన్ని విషయాల్లో తమ మునుపటి తరం వారి కంటే మెరుగైన పరిజ్ఞానం ఉంటుంది. అది అన్ని విషయాల్లో కాదు. అలాగే ప్రతీ తరానికి సాహసం చేయాలనే ఆలోచన ఉంటుంది. వారు(జెన్‌జీ) అన్యాయాన్ని సహించరు. అందుకే వారు ఉద్యమిస్తున్నారు. మనదేశంలో యువత బ్రిటిష్‌ వారిని వ్యతిరేకించారు. పాలకులపై బాంబులు వేశారు. ఉరికొయ్యలెక్కారు. కనుక ఇది ప్రతీ తరంలోనూ ఉంటుంది. అయితే.. నేడు మన పొరుగు దేశంలో ఎందుకు అలా జరుగుతోంది? ఎందుకంటే ఉపాధి కల్పనలోనూ, నవతరం ఆకాంక్షలను నెరవేర్చడం లోనూ అక్కడి ప్రభుత్వం విఫలమైంది కాబట్టి. అదీకాకుంటే, అక్కడి పాలకులు పీకల్లోతు అవినీతిలో ఉండవచ్చు. కనుక ఆర్థికపరమైన అంశాలు, అవినీతి, సామాజికపరమైన కొన్ని అంశాలు నెలకొన్నాయి. అందుకనే వారు(జెన్‌జీ) ప్రభుత్వంపై విశ్వాసాన్ని కోల్పోయారు. ఆ కారణంగానే వారు స్పందించారు. భారత్‌లో పరిస్థితి పూర్తిగా భిన్నమైనది. యువతరానికి నైపుణ్యాలు ఉన్నాయి. ప్రభుత్వం పట్ల, సామాజిక వ్యవస్థల పట్ల విశ్వాసం ఉంది. కొంత వ్యతిరేకత ఐతే ఉండవచ్చు. ఇది నిజం. ఉదాహరణకు యువత దేవాలయానికి వెళుతున్నారు. పెద్ద సంఖ్యలో కావడులు మోస్తున్నారు. దేశవ్యాప్తంగా వేలాది యువత దూరాభారాలను లెక్కచేయకుండా పవిత్రజలాలను తీసుకెళుతూ కనిపిస్తారు. ఇక్కడ వైవిధ్యం ఎక్కువ. అందుకనే అక్కడ (పొరుగుదేశం) జరిగింది భారత్‌లో జరగదు. యువత ఆకాంక్షలను పట్టించుకోవాలి. అందుకనే ఆర్‌ఎస్‌ఎస్‌లో యువతను పట్టించుకుంటాం. మనదేశంలో సాంస్కృతిక, ఆధ్యాత్మిక ఉద్యమాల్లో యువత పాత్ర ఉంది. యువత ఆకాంక్షలు భౌతికపరమైనవి. సాంస్కృతికంగా వారి(యువత) ఎదుగుదల, సమాజంలో వారి అనుసంధానం లాంటి అంశాలను సరిగ్గా పట్టించుకోవాలి. అలాగే ఏ వయసు వచ్చినప్పుడు ఒకరు వయోజనులు అవుతారు అని చెప్పడానికి సంస్కృతంలో ఒక వాక్యం ఉంది. ‘షోడశే వర్షం ప్రాప్తం పుత్రం మిత్ర వదాచరేత్‌,’ అంటే పుత్రుడికి 16 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు తండ్రి అతడితో ఒక మిత్రుడితో ఉన్నట్టుగా ప్రవర్తించాలి. కనుక 16 ఏళ్లు వచ్చినవారు జెన్‌జీ కిందకు వస్తారు. కనుక తండ్రి ఎలా ప్రవర్తించాలి? ఒక మిత్రుడులాగా ప్రవర్తించాలి. కుమారుడిగా మాత్రమే కాకుండా మిత్రుడిలా కూడా చూడాలి. మీరు అలా ప్రవర్తించాలి. దానిని (కుమారుడి మనస్తత్త్వాన్ని) అర్థం చేసుకోవాలి. తదనుగుణంగా మీరు కుటుంబస్థాయిలోనూ, సమాజం స్థాయిలోనూ, ప్రభుత్వం స్థాయిలోనూ ప్రవర్తించడం ప్రారంభించాలి. ప్రభుత్వం కూడా యువత ఆకాంక్షలను నెరవేర్చే దిశగా తగినన్ని చర్యలు చేపట్టాలి. అందుకనే ఇక్కడి ప్రభుత్వం ఆర్థిక రంగంలోనూ, విద్యారంగంలోనూ, పరిశోధనా రంగంలో ఆ దిశగా కార్యాచరణకు దిగింది. భారత్‌లో పొరుగు దేశం తరహాలో ఉన్నట్టుండి ఉద్యమం పుట్టుకొస్తుందని నేనైతే అనుకోవడం లేదు.

సోషల్‌ మీడియాకు సంబంధించిన ఒక ప్రశ్న. ఇది మానవ స్వభావానికి, సంస్కృతికి సంబంధించినది. సోషల్‌ మీడియాకు చెందిన కొందరు ప్రముఖులు దానిని చూడకుండా వారి కుటుంబాలపై ఆంక్షలు విధించారు. ఎందుకని?

అది నిజమే. అనేక కార్పొరేట్‌ కార్యాలయాలు, మరీ ముఖ్యంగా పశ్చిమ దేశాలకు చెందినవి ఆ పని చేశాయి. బిల్‌గేట్స్‌ తన కుమారుడు, కుమార్తెలతో సోషల్‌ మీడియా చూడవద్దని చెప్పిన సంగతిని నేను విన్నాను.

ఇదే తరహాలో మిగిలిన సమాజంపై ఆంక్షలు విధించవచ్చు కదా?

అసహజ ఆంక్షల విధింపు బెడిసికొడుతుంది. మరింత పోటీతత్త్వంతో కూడుకున్న ఫలితాలను ఇస్తుంది.  ప్రభుత్వం కొన్ని నిర్దేశిత అంశాలపై ఆంక్షలు విధించవచ్చు. జల్లెడ పట్టవచ్చు(స్క్రీనింగ్‌). నేపాల్‌ ప్రభుత్వం సోషల్‌ మీడియాపై ఆంక్షలు విధించినప్పుడు ఎలాంటి స్పందన వచ్చిందీ మనమంతా చూశాము.అందుకనే దానితో(సోషల్‌ మీడియా) చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. కానీ స్క్రీనింగ్‌కు అవకాశం ఉంది. ఉదాహరణకు అశ్లీలం (పోర్నో) వ్యాపించ రాదు. కొన్ని నిర్దేశిత పనులను ప్రభుత్వం చేయగలదు. చేయవచ్చు. ప్రభుత్వం కూడా టిక్‌టాక్‌ నిలుపుదలకు ప్రయత్నించింది. ఆ ప్రయత్నం ఎంతమేరకు విజయ వంతమైనదీ మనం చూశాం. ఎందుకంటే ఆధునిక సాంకేతిక, సమాచార అనుసంధాన యుగంలో ఇలాంటి పనులను విజయవంతంగా చేపట్టలేరు. అంతెందుకు, కుటుంబ పెద్ద కుటుంబంపై ఆంక్షలు విధించడమంటే ఆయన ఆలోచనలను వారిపై రుద్దుతున్నట్టుగా భావిస్తారు నవతరానికి చెందినవారు. వారిలో సంస్కారాన్ని సరైన మార్గంలో పాదుగొల్పాలి. మీరు యువతీయువకులతో చర్చించాలి. నీవు ఏం చెప్పాలనుకుంటున్నావు? నీ స్నేహితు లెవరు? వీటికి సంబంధించి నేనేమైనా నీకు సలహాలు ఇవ్వవచ్చునా? ఇలా మీరు వారితో చర్చించాలి. ఎందుకంటే యువత, చిన్నారులు సైతం జీవితానికి సంబంధించిన అనేక విషయాలను ఇట్టే అర్థం చేసుకుంటున్నారు. అవి ఎలాంటివంటే వారి వయసులో ఉన్నప్పుడు మీరు అర్థం చేసుకోలేకపోయినవి. కనుక స్నేహపూర్వకంగా వారిలో సంస్కారాన్ని పాదుగొల్పాలి. సోషల్‌ మీడియా వల్ల వచ్చే కీడును చెప్పాలి. అదేసమయంలో దాని వల్ల కలిగే ఉపయోగాలను గురించి కూడా చర్చించాలి. నీకు అందుబాటులో లేని సమాచారం సోషల్‌ మీడియాలో దొరుకుతుంది. ఆ విధంగా సోషల్‌ మీడియాను వినియోగించుకోమని చెప్పాలి. కనుక సోషల్‌ మీడియా సద్వినియోగం, దుర్వినియోగంపై చర్చించాలి. కానీ అదెలా? ఎప్పుడూ కూడా స్వీయనియంత్రణ అత్యంత ముఖ్యమైనది. ఆంక్షలు విధించడం వల్ల ప్రయోజనం ఉంటుందని నేను అనుకోవడం లేదు. అది మున్ముందు సమస్యను సృష్టిస్తుంది. మానసిక సమస్యలను సృష్టిస్తుంది. అప్పుడు మీరు వాటిని పరిష్కారించాల్సి ఉంటుంది. అందుకు బదులుగా సమాచారం వెల్లువలా వచ్చిపడుతున్నప్పుడు నన్ను నేను నియంత్రించుకునే శిక్షణ నేను పొందాలి. అలాంటి ఒక సంస్కారాన్ని వారిలో పాదుగొల్పాలి. ఇదే విషయాన్ని కుటుంబంలో చర్చించుకోవాలి. మా కుటుంబ ప్రబోధన్‌లో ఇలాంటి విషయాలను చర్చిస్తాం. యువ శిబిరాల్లోనూ చర్చిస్తాం. మా సంఘ శిక్షావర్గలో ఒక వయసు మళ్లిన వ్యక్తి స్వయంసేవకులతో చర్చిస్తారు. ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన కొన్ని ప్రాంతాలలో ఒక అనుభవజ్ఞుడైన వ్యక్తి స్వయం సేవకులతో చర్చిస్తారు. వ్యక్తిగత విషయాలు, చివరకు లైంగికాంశాలకు సంబంధించిన విషయాలు, స్నేహితులతో సంబంధాలు సైతం చర్చకు వస్తుంటాయి. అప్పుడిక వారు తమ మనసులోని మాటను బైటపెడతారు. కనుక ఈ విధంగా మనం యువతను సరైన దారిలో పెట్టాలి.

చివరి దశలో ఉన్న నక్సలిజాన్ని ఎలా చూడాలి?

అది 180 జిల్లాల నుంచి ప్రస్తుతం 11 జిల్లాలకు కుదించుకొనిపోయింది.

ఎక్కడైతే నక్సలిజం పుట్టిందో అక్కడ ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది. ఈ చారిత్రక వాస్తవాలను అర్థం చేసుకోవడంలో వారు(నక్సలైట్లు) ఎక్కడ విఫలమయ్యారు?

ప్రతీ ఉద్యమానికి ముగింపు ఉంటుంది…

అసలు అది ఉద్యమమా లేకుంటే విప్లవమా? అలా పిలవగలమా?

దానిని విప్లవం అని పిలవలేం. నిజమే. అది ప్రతిక్రియ మాత్రమే. ఎందుకంటే అది ఒక నిర్దేశిత పరిస్థితికి చెందినది. వారికి(నక్సలైట్లు) సమాజం పట్ల వల్లమాలిన ప్రేమ ఉండవచ్చు. వారు సమాజంలో అన్యాయంతో పోరాడారు. వారు సమాజంలో దోపిడీని చూశారు. వారు అందుకు స్పందించాలని కోరుకున్నారు. కానీ పంథా (స్పందించిన తీరు) తప్పు. వారి ఆందోళన తప్పు అని నేను అనడంలేదు. దోపిడీని మనం అంగీకరించాలా? లేదు. అన్యాయాన్ని మనం అంగీకరించాలా? లేదు. ఈ అరిష్టాలను తొలగించాలి. కానీ అందుకు ఒక ప్రజాస్వామ్య సమాజంలో ఎలాంటి పద్ధతి, ఎలాంటి పంథా ఉంటుంది? కనుక ఆయుధాలు చేతుల్లోకి తీసుకొని విప్లవం పేరిట సామాన్య ప్రజలను చంపడం బెడిసిగొట్టే వ్యవహారం. వారు దాదాపు 30 ఏళ్ల నక్సలిజం ప్రస్థానంలో చిట్టచివరకు ఏం సాధించారు? మీరు తెలంగాణ నుంచి వచ్చారు. గద్దర్‌కు ఎలాంటి అనుభవం ఎదురైంది? చిట్టచివరకు ఏమైంది?

ఆయన కాంగ్రెస్‌ పార్టీకి దగ్గరయ్యారు.

అంతిమంగా జరిగేది అదే. యుక్త వయసులో ఉడుకు రక్తం పొంగుతున్న తరుణంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు(నక్సలైట్లు) బలప్రయోగం చేశారు. అటవీ రేంజర్లు, సామాన్య ప్రజలతో పాటు అంతంత మాత్రపు వేతనంతో ఎవరిని దోచుకోకుండా విధులు నిర్వర్తిస్తున్న ఒక పోలీసును చంపేశారు. ఇది విప్లవం అనే ఆలోచనకు తప్పుడు అర్థాన్ని ఇస్తున్నది. అది మన దేశంలోనే కాకుండా ప్రపంచంలో ఎక్కడా కూడా ఏ విధంగానూ సాయపడిరది లేదు. చిన్నదేశాల్లో అక్కడి ప్రభుత్వాలు కొంతకాలంపాటు మద్యాన్ని నిషేధించాయి. ఆ తర్వాత మద్యం మళ్లీ అందుబాటులోకి వచ్చింది. సామాజిక మార్పు, సామాజిక పరివర్తన జరిగి తీరాలి. మనం అన్యాయానికి, దోపిడీకి చోటు ఇవ్వకూడదు. సామాన్య ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించాలి. అందుకోసం ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. సమాజం కూడా తన వంతు పాత్ర పోషించాలి.

వారు(నక్సలైట్లు) ఎక్కడ విఫలమయ్యారనే విషయానికి వస్తే వారు సమాజంలో త్వరితగతిన చోటు చేసుకున్న మార్పులను అర్థం చేసుకోలేకపోయారు. వారు ఇంకా పాతకాలంలోనే ఉండిపోయారు. ఇది మొదటి విషయం. ఇలాంటి చర్యలతో(హింసాత్మక) సమాజం భయభ్రాంతులకు గురవుతుందని, ప్రభుత్వం దిగి వస్తుందని వారు భావించారు. కానీ అలా జరగలేదు. కానీ వారేం చేశారు? ఇతర రంగాలలోకి చొరబడ్డారు. అర్బన్‌ నక్సల్స్‌ పుట్టు కొచ్చారు. కనుక అటవీ ప్రాంతానికి చెందిన నక్సలిజం, పర్వత ప్రాంతాలకు చెందిన నక్సలిజం, గిరిజన ప్రాంతాలకు చెందిన నక్సలిజం పట్టణ ప్రాంతాలకు వలసపోయింది. ఈ పరిణామం అత్యంత ప్రమాదకరమైనది. వారు ఆయుధాలను బాహాటంగా, తరచుగా ఉపయోగించడం లేదు కానీ, సమాజంలో వ్యక్తులను ప్రభావితం చేయడం ద్వారా ప్రభుత్వాలను మార్చడానికి ప్రయత్నించారు. అలాంటి ఒక ప్రయత్నం వెనిజులా లాంటి దేశాల్లో పనిచేసింది. భారత్‌లో కూడా అదే జరుగుతుందని వారు కలలు కంటున్నారు కానీ, అది జరిగే పనికాదు.

స్వదేశీ భావనకు భారత స్వాతంత్య్ర ఉద్యమంలో గొప్ప స్థానం ఉంది. అది మనల్ని వర్తమానం నుంచి 2047కు ఎలా నడిపిస్తుంది?

ప్రతీ దేశమూ తన ఆర్థిక విధానంలో కొంత చోటును స్వదేశీకి కేటాయిస్తుంది. అది ఆయా దేశాల అనుభవం, సామర్థ్యం, దక్షత మీద ఆధారపడి ఉంటుంది. జపాన్‌ కొన్ని రంగాల్లో స్వదేశీని అవలంబిస్తున్నది. ప్రతీ దేశం స్వదేశీ భావనను అనుసరిస్తుంది. బీ అమెరికన్‌… బై అమెరికన్‌ (అమెరికన్‌లా వ్యవహరించు… అమెరికా వస్తువులు కొను) అని అమెరికా కూడా నినాదం ఇచ్చింది. ఇది స్వదేశీలో భాగమే. జపాన్‌ స్వదేశీని ఆర్థిక జాతీయత అని ప్రకటించుకుంది. ఆ విధంగా ప్రతీ దేశమూ స్వదేశీకి సంబంధించి తనదైన ధోరణిని కలిగి ఉంది.

మనదేశంలో స్వదేశీ అంటే భవిష్యత్తులో సంపదను పోగుచేసుకునేందుకు ఉపకరించే ఆర్థిక విధానం లేదా స్వావలంబన మాత్రమే కాదు. దానికి జీవితంలో ఇతర విషయాలతో సంబంధం ఉంది. అది ప్రధానంగా ఆర్థిక విధానంతో ముడిపడి ఉంటుంది. 200 సంవత్సరాల బ్రిటీష్‌ పాలనలో దోపిడీకి గురయ్యాం. అందుకనే మన పరిశ్రమలు, మన ఆర్థిక చట్రం అస్తవ్యస్తమైపోయాయి. కనుక దేశానికి స్వరాజ్యం సిద్ధించిన సంవత్సరంలో పుంజుకోవడానికి ప్రయత్నించాం. మనం ఎలాంటి ప్రయత్నం చేయలేదని నేను అనడం లేదు. కొంతవరకు చేశాం. కానీ బహుళజాతి కంపెనీలు, రక్షణ రంగంలో దిగ్గజాలైన దేశాల వల్ల, సాంకేతికత పట్ల మన పరాధీనత అనేక సంవత్సరాలు కొనసాగింది. దీనికి అడ్డుకట్ట వేయాలి. కొన్ని రంగాల్లో పరిమితులు విధించుకోవాలి. మనం మరికొన్ని రంగాల్లో మన సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఉదాహరణకు అంతరిక్ష సాంకేతికతలో మనం వెనుకబడిలేం. అగ్రస్థానాల్లో ఉన్న మూడు దేశాల్లో ఒకటిగా ఉన్నాం. సూపర్‌ కండక్టర్‌ను కూడా ఉత్పత్తి చేశాం. పరం కంప్యూటర్లు, సూపర్‌ కంప్యూటర్లను కూడా సృష్టించాం. మెడికల్‌ సైన్స్‌లో మనం ఏమంత వెనుకబడిలేం. అనేక రంగాల్లో స్వావ లంబన సాధిస్తున్నాం. మనం పటిష్టంగా మారుతున్నాం. ఇక్కడే ప్రోత్సాహం కావాలి. ఎందుకంటే శాస్త్ర, సాంకేతిక రంగాలు సహా ప్రతీ రంగంలోనూ మన యువ పరిశోధకులు ప్రపంచంలో ఎవరితోనైనా పోటీపడగలరు. కనుక వారికి సమాజం నుంచి, ప్రభుత్వం నుంచి మద్దతు కావాలి. అందుకు సంబంధించిన అంశాలను ఒక దారిలో పెట్టాలి. ఇదంతా జరగాలి. ప్రధానమంత్రి ఆత్మనిర్భరత గురించి మాట్లాడినప్పుడు ఈ విషయాలనే ప్రముఖంగా ప్రస్తావించారు. ఆయన పంచప్రాణాస్‌, తదితరాల గురించి కూడా మాట్లాడారు. మరొక విషయం, స్వదేశీ ఉద్యమం స్వాతంత్య్ర ఉద్యమానికి చోదకశక్తి మాత్రమే కాదు. అది మన ఆత్మగౌరవం, మన భాష, మన సంస్కృతి, మన ప్రకృతికి సంబంధించినది. కనుక ఈ అంశాలు కూడా చాలా ముఖ్యమైనవి. కేవలం ఆర్థిక వ్యవస్థ, సంపద సృష్టి, శాస్త్ర, సాంకేతికతలు మనకు ఏ విధంగానూ సాయపడవు. వాటికి జీవితంలోని ఇతర అంశాల మద్దతు కావాలి. కనుక దీనికి సంపూర్ణత కావాలి.

ఆర్‌ఎస్‌ఎస్‌ శతాబ్ది కార్యక్రమాల పట్ల హిందువుల స్పందన ఎలా ఉంది? ఈ సందర్భంగా హిందూ సమాజానికి మీరు ఇచ్చే సందేశం ఏమిటి?

ఆర్‌ఎస్‌ఎస్‌ శతాబ్ది వేడుకలను సమాజంలో అన్ని వర్గాల ప్రజలు స్వాగతించారు. మేము సమాజంలోని సమూహాలతో వేర్వేరు స్థాయుల్లో సంభాషిస్తున్నాం. మొదటగా మన స్వయంసేవకులు ఇంటింటికి వెళుతున్నారు. ప్రజలతో సమావేశమవుతున్నారు. వారు నగదును సేకరించడంలేదు. వారు ఇదిగో ఈ పని చేయండి అని ప్రజలకు చెప్పడంలేదు. వారు 10 నుంచి 15 నిమిషాలపాటు నిర్దేశిత అంశంపై ప్రజలతో చర్చిస్తున్నారు. మేం పంచపరివర్తన గురించి తెలియజేస్తున్నాం. 99 శాతం ప్రజలు ఈ కార్యాచరణను స్వాగతిస్తున్నారు. చాలా మంచి కార్యక్రమం అంటున్నారు. ముందుకు వస్తున్నారు.

వందేళ్లుగా సమాజ అభ్యున్నతిలో ఆర్‌ఎస్‌ఎస్‌ భాగస్వామ్యాన్ని ప్రతీ ఒక్కరూ కొనియాడు తున్నారు. శతాబ్ది వేడుకలను స్వాగతిస్తున్నారు. వారిలో చాలా మంది శాఖకు రావడంలో తమకు సమయం ఉండటంలేదని చెబుతున్నారు. అదే సమయంలో మీరు చేసేది చాలా మంచి పని అని అంటున్నారు. ప్రజల వైపు నుంచి కనీసం ఈ విధమైన ప్రోత్సాహం ఉంది. ప్రజల నుంచి వచ్చిన సానుకూల స్పందనతో మన స్వయంసేవకులు సంతోషంగా ఉన్నారు. రెండవది, పంచపరివర్తన విషయానికి వస్తే వాటిని పాటించమని ప్రజలకు చెప్పాం. అందుకు బదులుగా ఆచరించడానికి ప్రయత్నిస్తామని వారు తెలిపారు. ఆ తర్వాత హిందూ సమాజంలో వేర్వేరు సమూహాల పెద్దలను కలుస్తున్నాం. సామాజిక సద్భావన పనిలో భాగంగా వారితో సమావేశమవుతున్నాం. హిందూ సమాజం గురించి ఆలోచించినప్పుడు వేర్వేరు సమూహాల పెద్దలను ఆర్‌ఎస్‌ఎస్‌ ఒకే వేదిక మీదకు తీసుకొనిరాగలదని వారు అన్నారు. సాధు, సంతులు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. హిందూధర్మాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ కాపాడుతోందని వారు దీవించారు. మద్దతు ఇస్తున్నారు. కడకు రాజకీయ రంగంలో వేర్వేరు పార్టీలకు చెందిన వారు రాజకీయాలకు అతీతంగా ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖలు, శిబిరాలు, కార్యక్రమాల నిర్వహణకు తమ స్థలాలను కేటాయిస్తున్నారు. ఎందుకంటే రాజకీయ పార్టీలకు పరిమితం కాకుండా జాతీయతా భావనతో మనం ముందుకు సాగుతున్నాం కాబట్టి. వారూ(రాజకీయ పార్టీలు) మనమూ ఎలాంటి దాపరికం లేకుండా ఉంటున్నాం. పరిశ్రమలు, వాణిజ్య రంగాలకు చెందిన వ్యక్తులను కలుస్తున్నాం. సినిమారంగానికి చెందినవారిని, వైద్యులను, న్యాయ వాదులను కలుస్తున్నాం.

నేను చండీగఢ్‌లో మాజీ సైనికోద్యోగులతో సమావేశ మయ్యాను. అన్ని వర్గాల ప్రజలను కలుసుకుంటున్నాం. సర్‌సంఘచాలక్‌జీ ఢల్లీి, బెంగళూరు, కోల్‌కతా, ముంబై లాంటి ప్రధాన నగరాల్లో ప్రజలతో సమావేశమవుతున్నారు. అన్ని చోట్లా ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. మూడు నుంచి నాలుగు గంటలపాటు కూర్చోవడానికి సిద్ధపడే వస్తున్నారు. వారి ప్రసంగాన్ని ఆసక్తిగా ఆలకిస్తున్నారు. ప్రశ్నలు అడుగుతున్నారు. సర్‌సంఘచాలక్‌జీ నుంచి అప్పటికప్పుడు నేరుగా సమాధానాలు పొందుతున్నారు. నాకు తెలిసి దేశంలో మరే ఇతర సంస్థకు చెందిన అధిపతి ఇలా మూడేసి గంటల సేపు కూర్చొని ప్రసంగించడం, ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం, ప్రజలు కూడా అంతే శ్రద్ధాసక్తులతో కూర్చోవడం జరిగింది లేదు. ప్రకృతి సంక్షేమం, పురోగతికి సంబంధించిన అంశాలపై సమావేశం, ఇష్టాగోష్టిలో సరికొత్త పంథాకు మనం తెరతీశాం. దీనికి ప్రజలతో పాటుగా సమాజమూ ఆమోదముద్ర వేసింది. అలాగని ఇదేదో ఆర్‌ఎస్‌ఎస్‌, దాని సంస్ధాగత కార్యకలాపాలకు సంబంధించిన విషయం కాదు. ఇది యావత్‌ దేశానికి సంబంధించిన కార్యక్రమం. మనం మన వనరులను విస్తరింపజేయాలి. మనం మన వనరులను పెంచాలి. మనం ఒకే సమాజంగా జీవించాలి. మనం ఇలా అంటున్నప్పుడే ఈ రకమైన సానుకూల ప్రకంపనలు దేశమంతటా ఉన్నాయి. స్పందన (ఆర్‌ఎస్‌ఎస్‌ శతాబ్ది వేడుకలకు) అద్భుతంగా ఉంది.

ఇక సందేశం అంటారా.. కొత్త సందేశం ఇవ్వడానికి ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రయత్నించదు. ఇదివరకే సందేశం ఇచ్చింది. ఆత్మనో మోక్షార్థం జగద్ధితాయ చ అని స్వామి వివేకానంద అన్నారు. దాని అర్థం మోక్షాన్ని పొందుతూనే ప్రపంచానికి మంచి చేయమని. ధర్మో రక్షతి రక్షితః అని మన పెద్దలు చెప్పారు. మీరు ధర్మాన్ని కాపాడితే అది మిమ్మల్ని కాపాడుతుంది. మన స్వాతంత్య్ర సమరయోధులు వందేమాతరం, భారత్‌మాతాకీ జై అన్నారు. ఎందుకని? జన్మభూమిని పూజించాలని. వచ్చే 50 సంవత్సరాలు భారతమాతనే పూజించండి. మిగతా దేవుళ్లను పక్కన పెట్టండి అని స్వామి వివేకానంద అన్నారు. కనుక మనకు కావాలంటే అనేక సందేశాలు ఉన్నాయి. అయితే వాటిని మనం మనసా, వాచా, కర్మణా, అనుసరిస్తామా? అనేది ఇక్కడ ప్రశ్నగా మిగిలింది. కానీ, మనం వాటిని ఆచరించాలి. ఆచరణ ముఖ్యమైనది. కనుక మీకు తెలిసిన మంచి పనిని ఆచరించండి అనేది ఆర్‌ఎస్‌ఎస్‌ ఇచ్చే సందేశం. సమాజ సంక్షేమానికి సంబంధించి మీ దగ్గర చింతన ఉంటే మా దగ్గర బృందం (దాని కార్యాచరణకు) ఉంది. మీ దగ్గర బృందం ఉంటే మా దగ్గర ఇతివృత్తం ఉంది. మంచి పని చేసేవారికి మద్దతు ఇవ్వడానికి మేం సిద్ధంగా ఉన్నాం. మీరు ఏదైనా మంచి పని అనుకున్న ప్పుడు, దానికి మద్దతు కోరుకున్నప్పుడు అందుకు అండగా ఆర్‌ఎస్‌ఎస్‌ ఉంటుంది. మీరు ఆర్‌ఎస్‌ఎస్‌తో కలవకుండానే సమాజానికి మేలు జరిగే పని చేస్తున్నప్పుడు మీరు చేస్తున్నది ఆర్‌ఎస్‌ఎస్‌ పని అవుతుంది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు.

జాగృతికి మా శుభాకాంక్షలు.


ప్రస్తుతం ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌కార్యవాహగా బాధ్య తలు నిర్వహిస్తున్న దత్తాత్రేయ హోసబళే కర్ణాటక లోని శివమొగ్గలో, 1955లో జన్మించారు. వారిది ఆర్‌ఎస్‌ఎస్‌ కుటుంబమే. 1968లో స్వయంసేవక్‌గా జీవితం ప్రారంభించిన హోసబళే 1972లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ బాధ్యతలు చేపట్టారు. జేపీ సంపూర్ణ విప్లవంలో భాగస్థులయ్యారు. అత్యవసర పరిస్థితి కాలంలో మీసా కింద అరెస్టయి ఏడాది పాటు జైలు జీవితం గడిపారు. ఆయన ఆంగ్ల సాహిత్యంలో పోస్టు గ్రాడ్యుయేషన్‌ చేశారు. బహు భాషావేత్త. కన్నడ మాస పత్రిక ‘అసీమా’ వ్యవస్థాపక సంపాదకులు.

ముఖాముఖి: డా॥ గోపరాజు నారాయణరావు
(జాగృతి సంపాదకుడు)

About Author

By editor

Twitter
YOUTUBE