రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ ‌ప్రత్యర్థులు జనవరి 30, 1948న ఢిల్లీలో జరిగిన గాంధీజీ హత్యోదంతాన్ని ఏడున్నర దశాబ్దాల తరువాత కూడా వారి వారి రాజకీయాలకు అనుగుణంగా ఉపయో గించుకునే ప్రయత్నం కొనసాగిస్తున్నారు. గాంధీజీ హత్య తరువాత నాడు ఆ నిందను మోస్తూ ఆర్‌ఎస్‌ఎస్‌ ఎదుర్కొన్న పరిస్థితులు బాధాకరమైనవి. ఇక హత్యో దంతం పట్ల కాంగ్రెస్‌ ‌వైఖరి అప్పటికే ధ్వంసమైన ఆ సంస్థ సామాజిక, రాజకీయ విలువలకు అద్దం పడుతుంది. దారుణమైన అణచివేతకు నాటి నెహ్రూ ప్రభుత్వం ఒడిగట్టింది. ప్రథమ ప్రధాని చెప్పిన ఉదారవాదం, ప్రజాస్వామ్యం కేవలం మేడిపండు చందమేనని ఆనాడే రుజువు చేసుకున్నారు. వేలాది మందిని అరెస్టు చేసింది. కేవలం స్వయంసేవకులు కావడమే వారు చేసిన పాపం. గాంధీజీ హత్య జరిగిన ఏడు రోజుల తరువాత, ఫిబ్రవరి 6,1948న సంఘం మీద నిషేధం విధించారు. స్వతంత్ర భారతదేశంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ఎదుర్కొన్న తొలి నిషేధం ఇదే. ఆ సమయంలో సర్‌సంఘచాలక్‌ ‌పరమపూజనీయ ఎంఎస్‌ ‌గోల్వాల్కర్‌ ‌ప్రభుత్వానికి ఒక్కటే సవాలు విసిరారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ‌మీద ప్రభుత్వం చేసిన ఆరోపణలను రుజువు చేయాలి. చేయలేకపోతే నిషేధం ఎత్తివేయాలి. దీనికి ప్రభుత్వం నుంచి స్పందనే లేదు. జైలులో, బయట కూడా స్వయం సేవకులను కాంగ్రెస్‌, ‌పోలీసులు సమంగా వేధించిన దాఖలాలు కనిపిస్తాయి.
ఆ అణచివేత, అక్రమ నిర్బంధాలకు, సంస్థ నిషేధానికి నిరసనగా డిసెంబర్‌ 9,1948 ‌నుంచి స్వయంసేవకులు దేశంలో సత్యాగ్రహాలు ప్రారంభిం చారు. ఈ మధ్యలో ఎంఎస్‌ ‌గోల్వాల్కర్‌ అరెస్టు కూడా జరిగింది. అప్పటి నుంచి 1949 జూలై వరకు ఆయన మధ్యప్రదేశ్‌లోని సియోనీ కారాగారంలో ఉన్నారు. కేంద్రంతో చర్చలన్నీ ఇక్కడ ఉండగానే జరిగాయి. నిషేధం ఎత్తివేతకు ఆర్‌ఎస్‌ఎస్‌ ‌పెద్ద ఉద్యమమే నడిపింది. ఆ ఉద్యమం ఎంత పారదర్శ కంగా, చట్ట బద్ధంగా జరిగిందో, ఎందరు పెద్దలు మధ్యవర్తి త్వంతో నిషేధం ఎత్తివేత సాధ్యమైందో గమనించడం అవసరం. అంతిమంగా తేలినది గాంధీజీ హత్యకూ, ఆర్‌ఎస్‌ఎస్‌కూ ఎలాంటి సంబంధం లేదనే. ఇదే చరిత్ర కూడా రుజువు చేసింది. 1966లో నియమిం చిన జీవన్‌లాల్‌ ‌కపూర్‌ ‌కమిషన్‌ ‌కూడా ఇదే ధ్రువీకరించింది.
తాను నష్టపోతున్నా సంఘం దేశంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని అనుకోలేదు. డిసెంబర్‌ 9,1948‌న స్వయంసేవకులు ప్రారంభిం చిన సత్యాగ్రహాలు నెలన్నర పాటు జరిగి, జనవరి, 1949 మూడోవారంలో ముగిశాయి. సుమారు లక్షకు పైగా నిర్బంధాలకు గురయ్యారు (జాగృతి, 29.1.1949). కేంద్రానికీ, సంఘానికీ మధ్య చర్చల పక్రియ ప్రారంభం కానున్న తరుణంలో గురూజీ పిలుపు మేరకు సత్యాగ్రహాలు ఆపారు. చాలా చిత్రంగా ఆర్‌ఎస్‌ఎస్‌లో మహిళలు సభ్యులు కారు. అయినా స్త్రీలను కూడా నిర్బంధంలోకి తీసుకున్నారు.
ఎలాంటి వాతావరణంలో చర్చల పక్రియ ప్రారంభమయింది? నాటి కేంద్రం ఆరోపించిన నేరాలను బహిరంగంగా రుజువు చేయాలనీ, లేకుంటే నిషేధం ఎత్తివేయాలని సంఘం కోరింది. దీనికి ప్రభుత్వం సమాధానం ఏమిటి? తమ జాతీయ దృక్పథానికే, అంటే కాంగ్రెస్‌ ‌దృక్పథానికే, ఇంకా ప్రజాతంత్ర సూత్రాలకు ఆర్‌ఎస్‌ఎస్‌ ‌ధోరణి విరుద్ధం కాబట్టి నిషేధం తొలగించే వీలు లేదని చెప్పింది. కాంగ్రెస్‌ ‌పార్టీ, ఆ పార్టీ ప్రభుత్వం దృక్పథంతో ఏకీభావం లేకుంటే నిషేధం విధిస్తారా? జైళ్లలో ఉంచి చంపుతారా? ఇది భిన్నత్వంలో ఏకత్వం అన్న సూత్రానికీ, పౌరహక్కులకు భంగం కాదని నెహ్రూ అంతటి అంతర్జాతీయ ప్రజాస్వామికవాది ఎందుకు భావించలేకపోయారు?
ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సత్యాగ్రహం వల్ల దేశంలో ఏర్పడిన క్లిష్ట పరిస్థితిని నివారించడానికి అనేకమంది లబ్ధప్రతిష్టులు రంగంలోకి దిగారు. నిజానికి సంఘం మీద నిషేధం ఎత్తివేయించడానికి 1948, ఆగస్ట్- ‌నవంబర్‌ ‌మాసాల మధ్య గురూజీయే తన వంతు ప్రయత్నం ప్రారంభించారు. కానీ అది సాగనీయలేదు. అయితే సంఘం మీద నిషేధం ఎత్తి వేయించడానికి ఆ సంవత్సరం డిసెంబర్‌ ‌నుంచి ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. సర్దార్‌ ‌పటేల్‌ ‌సన్నిహితుడు, మధ్య పరగణాల హోం మంత్రి డీపీ మిశ్రా, బొంబాయి శాసనసభ్యుడు ఎస్‌ఎల్‌ ‌కరందీకార్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ ‌ప్రముఖుడు డీఆర్‌ ‌లిమాయే, కేసరి పత్రిక సంపాదకుడు జీవీ కేత్కర్‌, ‌మద్రాస్‌లో ప్రముఖ న్యాయవాది టీఆర్‌ ‌వేంకటరామశాస్త్రి, కేంద్ర హోం శాఖ కార్యదర్శి హెచ్‌వీఆర్‌ అయ్యంగార్‌ (ఐసీఎస్‌) ‌తదితరుల పాత్ర ఇందులో కనిపిస్తుంది. గోకుల్‌చంద్‌ ‌నారంగ్‌, ‌సిబ్బన్‌లాల్‌ ‌సక్సేనా, జయకర్‌ ‌వంటివారి సలహా మీద కేత్కర్‌ ‌సర్కార్‌కూ, సంఘానికీ నడుమ సయోధ్య ఏర్పరచడానికి ముందుకు వచ్చారు. సత్యాగ్ర హాల విరమణకు కేత్కర్‌ ‌చొరవ ఉపకరించింది. కేత్కర్‌ ‌మొదట సియోనీ జైలులో గురూజీని కలుసుకుని, సత్యాగ్రహం, దేశంలో నాటి పరిస్థితులపై అది చూపుతున్న ప్రభావాల గురించి వివరించారు. దీనితో గురూజీ ప్రభుత్వం నిషేధం విషయం ఆలోచించడా నికి అవకాశం కల్పిస్తూ తాత్కాలికంగా సత్యాగ్రహాలు విరమించాలని పిలుపునిచ్చారు. నాడు సత్యాగ్రహోద్య మానికి నాయకత్వం వహించిన వారు మహావీర్‌జీ. ఆయనే గురూజీ పిలుపును స్వయంసేవకులకు అందచేశారు. మహావీర్‌జీ ఇచ్చిన ప్రకటనను బట్టి సత్యాగ్రహం నాటి దేశ పరిస్థితుల మీద గట్టి ప్రభా వమే చూపింది. నిజానికి ఆనాడు ఉన్న పరిస్థితులు అలాంటివి. ఒక పక్క కాందిశీకుల సమస్య, ఇంకో పక్క గాంధీజీ హత్య, వీటికి తోడు పాకిస్తాన్‌ ‌సైన్యం దొంగదాడి. నిజానికి మహావీర్‌జీ ప్రకటన గమనించ దగినది. ఇప్పుడున్న పరిస్థితులలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం తమ ఉద్దేశం కానేకాదని పేర్కొన్నా రాయన. అయితే ప్రజాస్వామిక లేదా ప్రజాతంత్రంతో కూడిన స్వాతంత్య్రాన్ని ప్రతిష్టించడానికి మాత్రమే తాము సత్యాగ్రహం చేశామని స్పష్టం చేశారు.
నిషేధం నేపథ్యంలో సంఘం మీద నాడు కేంద్రం చేసిన ఆరోపణలు ఏమిటి? ‘మత విరహిత’, అంటే సెక్యులర్‌ ‌రాజ్యానికి సంఘ్‌ ‌వ్యతిరేకమన్నది ఒకటి. సంఘం ఒక ప్రత్యేక సైన్యం, జాతీయ పతాకాన్ని అవమానపరుస్తుందన్నది మరొకటి. ప్రభుత్వాన్ని కూలదోయడమే ఆశయంగా ఉన్నదని, అందుకే తన నియమావళినీ, ప్రణాళికనూ బహిర్గతం చేయదన్నది మరొకటి. ఇదంతా బ్రిటిష్‌ ‌చట్టాలకి అనుగుణంగా, స్వాతంత్య్ర సమరయోధుల మీద స్వతంత్ర భారత తొలి ప్రభుత్వం చేసిన ఆరోపణల మాదిరిగానే కనిపిస్తాయి. ఆ ఆరోపణలకు గురూజీ ఎప్పటికప్పుడు సమాధానాలు ఇస్తూనే ఉన్నారు. తాము సెక్యులరిస్ట్ ‌స్టేట్‌కు వ్యతిరేకం కాదనే చెప్పారు. సంఘంలో ఇచ్చే శిక్షణ స్వీయరక్షణకు సంబంధించి నదే తప్ప, ప్రత్యేక సైన్యంగా ఏర్పడే ఉద్దేశం లేదని తెలియచేశారు. ఇక త్రివర్ణ పతాకాన్ని రక్షించడానికి అవసరమైతే స్వయంసేవక్‌ ‌ప్రాణాలనైనా ఇస్తాడని ఆయన చెప్పడం గమనార్హం. ప్రతి కార్యక్రమం సంఘం పెద్దల సమక్షంలోనే చేసిందనీ, ప్రభుత్వం పట్టుబడితే సంఘ నియమ నిబంధనావళిని సమర్పించడానికి అభ్యంతరమే లేదని కూడా గురూజీ తేల్చి చెప్పారు. ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చూసిన నెహ్రూ సర్కార్‌కు సంఘస్థాన్‌లకు గాంధీజీ, డాక్టర్‌ అం‌బేడ్కర్‌ ‌వంటివారు అప్పటికి చాలాకాలం క్రితమే హాజరైన సంగతి తెలియదని అనుకోగలమా? వారే కాదు, కట్జూ, కేఎం మున్షీ, నాటి బిహార్‌ ‌గ•వర్నర్‌ ఆణే, మద్రాస్‌ ‌ప్రధాన న్యాయమూర్తి రాజమన్నార్‌ ‌సంఘస్థాన్‌లకు వచ్చారు. ఈ వాస్తవాన్ని నెహ్రూ ప్రభుత్వం సౌకర్యంగా మరుగుపరచిందని నిరభ్యంత రంగా చెప్పవచ్చు. అలాగే జాతీయ పతాకాన్ని రాజ్యాంగ పరిషత్‌ ‌దేశానికి నిర్దేశించింది, ఆ నిర్ణయాన్ని ఎవరూ ప్రశ్నించలేరు అన్నది గురూజీ సమాధానం.
సంఘం ప్రారంభించిన సత్యాగ్రహాలను సమర్ధించి, కేంద్రం సత్వర నిర్ణయం తీసుకోవాలని సూచించిన ప్రముఖులలో టీఆర్‌ ‌వేంకటరామశాస్త్రి కూడా ఉన్నారు. తిరువలంగాడు రాజు వేంకటరామ శాస్త్రి (టీవీఆర్‌) 1924-1928 ‌మధ్య మద్రాస్‌ అడ్వకేట్‌ ‌జనరల్‌గా పనిచేశారు.ఉదారవాది. నిషేధం ఎత్తివేతకు నెహ్రూ ప్రభుత్వాన్ని ఒప్పించే పనిలో వేంకటరామశాస్త్రి చొరవ అధికంగా కనిపిస్తుంది. 1949 మార్చి మొదటివారంలో ఆయన పటేల్‌ను కలుసుకోవడానికి న్యూఢిల్లీ వెళ్లారు. నిషేధం తొలగింపు, ఆర్‌ఎస్‌ఎస్‌ ‌నుంచి ప్రభుత్వం కోరుతున్న నియమావళి రూపురేఖల గురించి పటేల్‌తో చర్చించ డానికే ఆయన వెళ్లారు. జాగృతి, 19.3.1949 సంచికలో ప్రచురించిన వార్త ప్రకారం గురూజీ ఆమోదం కోసం సంఘ నియమావళిని శాస్త్రి తీసుకుని సియోనీ జైలుకు వెళ్లారు. ఆ నియమావళిని సంఘ నేతలు కూడా ఆమోదించారు. సంఘ నేతలే కాకుండా ఇతర పార్టీల నాయకులు కూడా ఈ నియమావళిని శ్లాఘించారు. కానీ నిషేధం వెంటనే ఎత్తివేసే ఉద్దేశం నెహ్రూ ప్రభుత్వానికి లేదు. తమ వాదనలు, నియమావళి కేంద్రం ముందు ఉంచే అధికారం గురూజీ శాస్త్రికి అప్పగించారు. నియమావళికి గురూజీ తన ఆమోదంతో ఒక లేఖను కూడా జతపరిచారు. ఆ తరువాతే శాస్త్రి కేంద్రానికి అందించారు. గురూజీ ఆమోదించిన నియమావళిని శాస్త్రి తీసుకువెళ్లినప్పటికీ ఏవో సాకులతో కాలయాపన చేసింది. ప్రఖ్యాత న్యాయవాదులు, కార్మిక నాయకులు, కొన్ని పార్టీల నాయకులు కూడా నియమావళికి ఆమోదం తెలియచేయడంతో అప్పుడు మధ్యవర్తుల రాక కేంద్రానికి కన్నెర్రగా మారిందని అనిపిస్తుంది. అప్పటిదాకా మధ్యవర్తుల ప్రమేయాన్ని అనుమతించిన కేంద్రం సమస్య కొలిక్కి వస్తుండగా నిషేధం ఎత్తివేత ప్రయత్నంలో వారికి న్యాయంగా ఎలాంటి అధికారం లేదని కొత్త వాదన తెచ్చింది. ప్రణాళిక రావలసిన తీరుగా సంఘ అధికారుల నుంచి నేరుగా తమకు రాలేదని, ప్రణాళికను అందచేయవలసినది సియోనీ జైలులో ఉన్న గురూజీయే గాని మధ్యవర్తులు కాదని మెలిక పెట్టింది. చర్చల పక్రియకు మొదట సహకరించినప్పటికీ తరువాత డీపీ మిశ్రా కూడా ఏవో సాకులు చూపడం మొదలుపెట్టారు.
జూన్‌, 1949 ‌ప్రాంతానికి దేశంలో వాతా వరణం బాగా మారిపోయింది. ఇందుకు నాగపూర్‌ ‌హైకోర్టు న్యాయవాదులు చేసిన పత్రికా ప్రకటనే సాక్ష్యం. న్యాయవాదులు సీకేవీ నాయుడు, శ్రీనివాస రావ్‌, ‌ఠాకూర్‌ ‌రామచంద్రసింహపవార్‌, ‌సోస్‌టక్కే, జీబీ గంథే, ఎన్‌కే పెన్స్‌డే తదితరులు విడుదల చేసిన ఆ ప్రకటన చాలా విషయాలు వెల్లడించింది. గాంధీజీ హత్యానంతరం నెలకొన్న అవాంఛనీయ పరిస్థితులు ఇప్పుడు లేవు. అయినా ఆర్‌ఎస్‌ఎస్‌ ‌పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ప్రజలను విస్మయానికి లోను చేస్తోంది. గాంధీ పంథాలో సత్యాగ్రహం చేస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌ ‌వారిపైన కాంగ్రెస్‌ ‌వాదులు హింసాయుత ధోరణిని అవలంబించారని ఆ న్యాయవాదులు పేర్కొనడం విశేషం. కేంద్రానికి పంపించిన ప్రణాళికను తాము కూడా చూశామని అది శాస్త్రబద్ధంగా, నిర్దుష్టంగా ఉందని వారు చెప్పారు. న్యాయశాస్త్రం ప్రకారం ఆ ప్రణాళికను కాదనలేమని కూడా అంగీకరించారు. హిందువుల లోని విరుద్ధ ప్రవృత్తులను నాశనం చేయడానికి ఆర్‌ఎస్‌ఎస్‌ ‌చేసిన కృషిని చూసైనా నిషేధం ఎత్తివేయాలని కోరారు. వేంకటరామశాస్త్రి పట్ల ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని సుప్రసిద్ధ మరాఠీ దినపత్రిక హితవాది సంపాదకుడు ఏడీ మణి తప్పు పట్టారు కూడా. ఢిల్లీ నుంచి వెలువడే ‘స్టేట్స్‌మన్‌’ ‌పత్రిక సంఘ ప్రణాళిక మీద వ్యక్తం చేసిన అభిప్రాయం ఇలా ఉంది. ఇది హిరణ్యయ్‌ ‌లాల్‌ ‌వ్యాఖ్య. ‘సంఘ ప్రణాళికను అనుసరించి సంఘం రాజకీయాలతో సంబంధం లేకుండా కేవలం ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక సామాజిక కార్యకలా పాలకే కట్టుబడి ఉంటుందని విదితమవుతున్నది. ఆ ప్రణాళికలోనే హిందూ ధర్మానికీ, సంస్కృతికి చిహ్నమైన భగవాద్ధ్వజాన్ని సంఘ ధ్వజంగా స్వీకరించిందనీ, దానితో పాటే రాజధ్వజం పట్ల కూడా సంపూర్ణ విశ్వాసం చూపుతుందని స్పష్టంగా పేర్కొన్నారు. ఇంత స్పష్టంగా చెప్పిన తరువాత రాజ ధ్వజం పట్ల (సంఘం) తక్కువ గౌరవం ప్రదర్శించిం దన్న ప్రశ్నే రాదు… మిగిలిన సంస్థలన్నీ కాకుండా ఒక్క సంఘాన్ని మత సంస్థగా చూడడం హర్షించ దగ్గదిగా లేదు. కొన్ని విషయాలలో పక్షపాతాల ఆరోపణల నుంచి కాంగ్రెస్‌ ‌తప్పించుకోలేదు’ అని రాసింది. ఆపై ప్రభుత్వం కొంత పట్టు వీడింది, 1949 జూన్‌ ‌మొదటివారంలో దీనదయాళ్‌ ఉపాధ్యా యను, శ్రీలేఖరాజ్‌, ‌మరొక ముగ్గురు ప్రముఖులను నెల రోజుల నిర్బంధం తరువాత విడుదల చేసింది.
కానీ తన మధ్యవర్తిత్వం విఫలమయిందని చెబుతూ వేంకటరామశాస్త్రి ఒక వివరణ ఇచ్చారు. దానిని జాగృతి, 13.7.1949 సంచికలో ప్రచురిం చింది. సంఘ నిర్మాణం, నాయకత్వ ఎన్నిక వంటివన్నీ అప్రజాస్వామికంగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తన వద్ద ప్రస్తావించినట్టు శాస్త్రి పేర్కొన్నారు.
కాంగ్రెస్‌ ‌సుద్దుల వివరాలు వచ్చే సంచికలో..

About Author

By editor

Twitter
YOUTUBE