ఆర్‌ఎస్‌ఎస్‌ ‌మీద విధించిన నిషేధం చట్టబద్ధం కాదని దేశం నలుమూలల నుంచి స్వతంత్ర భారత ప్రథమ ప్రభుత్వం మీద ఒత్తిడి తీవ్రమైంది.ఆ ఒత్తిడి ఉద్దేశం ఒక్కటే. నిన్నగాక మొన్న ఆవిర్భవించిన స్వతంత్ర భారతంలో, సార్వభౌమాధి కారం ప్రకటించుకుని, ప్రజాస్వామ్యాన్ని స్వీకరించిన దేశంలో నియంత పోకడలను చూసిన వారంతా, అవాంఛనీయ ధోరణులను గమనించిన వారంతా ఇలాంటి ఒత్తిడి తెచ్చారు. చర్చలకు ఆస్కారం కల్పిస్తూ ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సత్యాగ్రహాలను నిలిపివేసింది. తమ అలజడి తమదే, ప్రభుత్వమే దిగివచ్చి చర్చించాలన్న వితండవాదం నాడు ఆర్‌ఎస్‌ఎస్‌ ‌చేయలేదు. అందుకే టీఆర్‌ ‌వేంకటరామశాస్త్రి కేంద్రానికీ, ఆర్‌ఎస్‌ఎస్‌కూ నడుమ మధ్యవర్తిత్వం నెరిపారు. అయితే ఒక దశలో ఆయనను సైతం నాటి నెహ్రూ ప్రభుత్వం అవమానించిందనే చెప్పాలి. తిరువలంగడు రాజు వేంకటరామశాస్త్రి (టీవీఆర్‌, ‌ఫిబ్రవరి 6,1874- జూలై 2,1953) ఉదారవాది. 1924 నుంచి 1928 వరకు మద్రాస్‌ ‌ప్రెసిడెన్సీ అడ్వకేట్‌ ‌జనరల్‌గా పనిచేశారు. అన్ని రాజకీయ పార్టీలకు ప్రాధాన్యం ఇస్తూ కేంద్ర ప్రభుత్వం ఏర్పడాలంటూ 1945లో అభిప్రాయం వినిపించిన సంస్థ నేషనల్‌ ‌లిబరల్‌ ‌ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇం‌డియా. ఆ సంస్థ అధ్యక్షుడు టీవీఆర్‌.
‌నిషేధం ఎత్తివేతకు కేంద్రం పెట్టిన షరతు- ఆర్‌ఎస్‌ఎస్‌కు నియమావళి ఉండాలి. ఇదే అంశం మీద రెండు పర్యాయాలు టీవీఆర్‌ ‌గురూజీని నిర్బంధించిన సియోనీ (మధ్యప్రదేశ్‌) ‌జైలుకు వెళ్లారు. నియమావళి రూపొందించి, దానిని కేంద్రానికి సమర్పించారు. అయితే దానిని తాము అంగీకరించ బోమని, ఇది నేరుగా ఎంఎస్‌ ‌గోల్వాల్కర్‌ ‌నుంచి అందాలని కేంద్రం మెలిక పెట్టింది. దీనితో టీవీఆర్‌ ‌తన ప్రయత్నాలను విరమించారని అనిపిస్తుంది. ఈ మేరకు ఆయన ఇచ్చిన వివరణను జాగృతి, 13.7.1949 సంచికలో ప్రచురించారు. ఇలా హఠాత్తుగా మధ్యవర్తిత్వం వీడి, పత్రికల ముందుకు ఆయన రావడానికి పెద్ద నేపథ్యమే ఉంది. ఆ వివరం కూడా పైన పేర్కొన్న సంచికలోనే ఉంది.
జాగృతి వారపత్రిక కాబట్టి టీవీఆర్‌ ‌ప్రకటన 13.7.1949న వెలుగు చూసింది. నిజానికి ఒక్కరోజు ముందే అంటే 12.7.1949న సంఘం మీద నిషేధం ఎత్తివేశారు. నిషేధం విషయంలో కేంద్ర విచిత్ర వైఖరి టీవీఆర్‌ ‌ప్రకటనతో దేశానికి వెల్లడైంది. 9.7.1949న మౌళీచంద్రశర్మ గురూజీతో చర్చిం చారు. ఈ పరిణామమే సమస్యను ఒక కొలిక్కి తీసుకు వచ్చింది. శర్మ మొదట భారత జాతీయ కాంగ్రెస్‌లో పనిచేసిన ఢిల్లీ ప్రముఖుడు, న్యాయవాది. జనాధికార్‌ ‌సమితి అనే హక్కుల సంఘాన్ని స్థాపించి ఆర్‌ఎస్‌ఎస్‌పై నిషేధం ఎత్తివేత కోసం పనిచేశారు. కాందిశీకుల కోసం ఆర్‌ఎస్‌ఎస్‌ ‌పడిన తపన శర్మను సంస్థ వైపు నడిపించింది.
హత్య, నిషేధం, ఎత్తివేత మధ్య ఏం జరిగింది? 30.1.1948న గాంధీజీ హత్య జరిగింది. ఇందుకు సంతాప సూచకంగా 13 రోజుల పాటు శాఖా కార్యక్రమాలను నిలిపివేయాలని 1.2.1948న గురూజీ ప్రకటించారు. ఫిబ్రవరి 2న ఆయనను నాగపూర్‌లో అరెస్టు చేశారు. 4న ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధించారు. ఆగస్ట్ 6‌న గురూజీని తాత్కాలికంగా విడుదల చేశారు. సెప్టెంబర్‌ 24‌న గురూజీ-సర్దార్‌ ‌పటేల్‌ ‌మధ్య ఢిల్లీలో చర్చలు మొదలైనాయి. ఆర్‌ఎస్‌ఎస్‌పై ప్రభుత్వం చేస్తున్న తీవ్ర ఆరోపణలను నవంబర్‌ 2‌న గురూజీ ఖండించారు. నిషేధం ఎత్తివేసేది లేదనీ, తాను గోల్వాల్కర్‌ను కలుకోననీ నెహ్రూ ఆ నెల పదో తేదీన లేఖ రాశారు. ఇది జరిగిన మూడో రోజున అంటే నవంబర్‌ 14‌న మళ్లీ గురూజీని అరెస్టు చేశారు. నవంబర్‌ 19‌న సత్యాగ్రహాలు విరమించమని జైలు నుంచి గురూజీ పిలుపునిచ్చారు. 23.1.1949న సత్యాగ్రహోద్యమం నడుపుతున్న మహావీర్‌ ఈ ‌విషయం వెల్లడించారు. 19.3.1949న టీవీఆర్‌ ‌ద్వారా కేంద్రానికి ప్రణాళిక వెళ్లింది. దానిని కేంద్రం తిరస్కరించింది. 24.4.1949న తానే గురూజీ ప్రణాళికను కేంద్రానికి పంపారు. 9.7.1949న మౌళీచంద్రశర్మ వచ్చి కలిశారు. ఇది నిజంగా పెద్ద కుదుపు. తాను ఇంటర్వ్యూ ఇవ్వబోనని ప్రధాని నెహ్రూ, సిద్ధాంతపరమైన ఏకీభావం లేదు కాబట్టి చర్చలు అనవసరమని కేంద్ర హోం మంత్రి, ఉపప్రధాని పటేల్‌ ‌లేఖలు రాయడం ఈ మొత్తం ఉదంతంలో ప్రత్యేక అంశాలే.
ఆర్‌ఎస్‌ఎస్‌కూ తనకూ మూల సిద్ధాంతాలలో అభిప్రాయభేదాలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వానికీ, ఆ సంస్థకూ నడుమ సంప్రతింపులు జరగడం అనవసరమే కాక, నిష్ప్రయోజనమని టీవీఆర్‌కు నాటి హోంమంత్రి సర్దార్‌ ‌పటేల్‌ ‌రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖ టీవీఆర్‌ను బాధించి ఉండవచ్చు. మధ్య వర్తిత్వం ఇంతదూరం వచ్చిన తరువాత ఇప్పుడు సంఘం మీద మోపిన నిషేధాన్ని తొలగించబోమని ప్రభుత్వం మొండి పట్టుపట్టడం అన్యాయం, మోసమని ఆయన వ్యాఖ్యానించారు. తాను ఏ ఆశయంతో సంఘానికీ, ప్రభుత్వానికీ మధ్య సామరస్యాన్ని సాధించాలని అనుకున్నారో, అనేక పర్యాయాలు ప్రభుత్వమే అందుకు ఆయనను ఎలా ప్రోత్సహించిందో, ప్రణాళికను ఇవ్వడంతో అన్ని విధాలా ఆటంకం తొలగిపోయినా ప్రభుత్వం ఎలా మాట తప్పిందో విఫులీకరిస్తూ ఒక ప్రకటన చేయ దలుచుకున్నాను అని టీవీఆర్‌ ‌వెల్లడించారు.ఆపైనే పత్రికా ప్రకటన ఇచ్చారు.
ప్రజాస్వామ్యాన్ని ఏనాడూ గౌరవించని కాంగ్రెస్‌, ‌దాని ప్రథమ ప్రభుత్వం సంఘం నిర్మాణంలో ప్రజాస్వామ్యం లేదంటూ వీరంగం వేయడం కనిపిస్తుంది. నిజానికి టీవీఆర్‌ ఈ ‌వివరణ ఇవ్వడానికి కారణం, ఆయన మాటలలోనే, ‘ఆర్‌ఎస్‌ఎస్‌ ‌గురించి మీ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి? పర్యవసానం ఏమిటి? అని ప్రశ్నిస్తూ దేశం నలుమూలల నుంచి నాకు ఉత్తరాలు వచ్చాయి. మొదటే నేను సమాధానం ఇస్తే ఉపకారం కంటే అపకారమే ఎక్కువ కలిగిస్తుం దని నేను ప్రత్యుత్తరం ఇవ్వలేదు. ఈ విషయం గురించి పత్రికా ప్రకటన చేయడానికి తగు సమయ మిప్పుడాసన్నమైనదని నేను భావిస్తున్నాను.’
ఆయన చెప్పిన మరికొన్ని అంశాలు: ప్రణాళిక తయారు కావడంతోనే ఈ సమస్యతో తనకు సంబంధం తీరి పోయింది. రెండవసారి సియోనీ జైలుకు వెళ్లినప్పుడు గోల్వాల్కర్‌ ‌ప్రణాళికను ఆమోదిం చారు. ఆ విషయంలో లేఖ రాసి ఇచ్చారు. ప్రణాళిక ప్రతులు, లేఖ టీవీఆర్‌ ‌ప్రభుత్వానికి పంపారు. సెంట్రల్‌ ‌ప్రావిన్స్ ‌ప్రభుత్వం ద్వారానే గురూజీ తన లేఖను అందచేయాలని ప్రభుత్వం పట్టుపట్టింది. టీవీఆర్‌ అలాగే చేశారు. అంటే సెంట్రల్‌‌ప్రావిన్స్ ‌మంత్రి డీపీ మిశ్రాకు అందించారు. ఇక్కడితో టీవీఆర్‌ ‌పాత్ర ముగిసింది.1949 ఏప్రిల్‌లో ఈ అంశాలమీద గురూజీ రాసిన లేఖ టీవీఆర్‌కు అందింది. అది జైలుఅధికారులు సెన్సారు చేసినది కావడం విశేషం.
కేంద్రానికి నియమావళి లేదా ప్రణాళిక విషయంలో ఒక అభ్యంతరం కనిపించింది. అది ముఖ్యమైనది కూడా. సర్‌సంఘచాలక్‌ ‌తన ఉత్తరాధి కారిని నియమించడం అనేది ప్రజాతంత్రానికి వ్యతిరేకమూ ఫాసిస్టు వైఖరి అని ప్రభుత్వం భావించి నట్టు టీవీఆర్‌ ‌పేర్కొన్నారు. అయితే సంఘ నాయకుడు అంటే నేత నియామకం కేంద్ర కార్యకారిణి మండలి ద్వారా జరుగుతుంది. ఈ విధానంలో తనకు ఎలాంటి అభ్యంతరం కనిపించలేదని టీవీఆర్‌ ‌స్పష్టం చేశారు. సంఘం అంటే ఏమిటో అర్ధంకాక ఇలాంటి అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చిందంటారాయన. అంతేకాదు, ఒక ప్రభుత్వానికి గాని, లేక రాజ్యానికి గాని ఫాసిజం ఆపాదించవచ్చు. కానీ నిర్బంధ ప్రవేశం లేని ఒక ప్రైవేటు సంస్థకు ఫాసిజం ఆపా దించడం సాధ్యంకాదన్నది టీవీఆర్‌ ‌నిశ్చితాభి ప్రాయం. తమ ఉత్తరాధికారిని నియమించుకునే అధికారం కలిగి ఉన్న నాయకులు ఉన్న సంస్థలు ఈ దేశంలో చాలా ఉన్నాయి. ఇలాంటి నియామకం లేకుంటే నాయకుని అనుచరులు ఓట్లతో నిమిత్తం లేకుండా వారసుడిని నియమించుకునే పద్ధతి కూడా ఉంది.నిజానికి ధార్మిక విషయాలకు అసలు ఈ ఎన్నిక పద్ధతే వర్తించదు అంటారు టీవీఆర్‌. ఏమైనా నాయకుడి నియామకం ఆ సంస్థ సభ్యులది, ఇతరులది కాదు అన్నారాయన.
బాలురుని సంఘంలో చేర్చుకోవడం కూడా ప్రభుత్వానికి తప్పుగా కనిపించింది. వారికి శిక్షణ ఇస్తారు. అందుకు తల్లిదండ్రుల అనుమతి అవసరమని టీవీఆర్‌ ‌కూడా అభిప్రాయపడ్డారు. కానీ సభ్యత్వం అంశమే లేనప్పుడు ఒక వయసు వచ్చాక వారు ఇష్టం మేరకు నిర్ణయం తీసుకుంటారు కదా అన్నదే టీవీఆర్‌ అభిప్రాయం. కానీ ఈ అంశంలో ఇతర సంస్థలకు లేని అభ్యంతరం ఆర్‌ఎస్‌ఎస్‌ ‌విషయంలో ఎందుకు అంటారు టీవీఆర్‌. అయితే సంఘం ప్రారంభమైన తరువాత తమ పిల్లలను తమ ఇష్టానికి వ్యతిరేకంగా చేర్చుకున్నారని, శిక్షణ ఇస్తున్నారని ఎలాంటి ఆరోపణలు రాలేదని నిశ్చయంగా పేర్కొన్నారు టీవీఆర్‌. ‌జాతీయ పతాకం (రాజ్యధ్వజం) పట్ల ప్రణాళికలో గౌరం ప్రకటించారు. జాతీయ పతాకం పట్ల గోల్వల్కర్‌ ‌పదే పదే ఆమోదం తెలిపారని ఏపీఐ (వార్తా సంస్థ) రాసింది. అసలు జెండా విషయంలో ఎలాంటి అభ్యంతరానికి తావే ఉండదని తాను నిశ్చయంగా చెప్పగలనని టీవీఆర్‌ ‌వివరణ ఇచ్చారు.
సంఘ ప్రణాళికలో అది స్పష్టంగా లేకున్నా, సంఘం ప్రవృత్తిలో సాంప్రదాయకత ఉంది. ఎలాంటి విభేదాలు పాటించకుండా సంఘంలో హిందువు లంతా చేరవచ్చు. అన్ని వర్గాల పిల్లలు కూడా భేద భావం లేకుండా పాల్గొంటారు కూడా. కానీ సంస్థ ఆదర్శాలు, ప్రకృతి హిందువులు కాని వారికి సభ్యులుగా చేరడానికి ప్రోత్సాహకరంగా ఉండవని టీవీఆర్‌ అనుకున్నారు.కానీ స్వతంత్ర భారతదేశంలో క్రమేణా వీరి కార్యపద్ధతిలో మార్పు వచ్చి తీరుతుందని టీవీఆర్‌ ఆనాడే జోస్యం చెప్పారు.
గోల్వాల్కర్‌ ‌నాడు ప్రభుత్వానికి లొంగిపోయా రన్న కొందరి వాదన ఎంత అబద్ధమో టీవీఆర్‌ ‌మాటలు చెబుతాయి. కొందరు గోల్వాల్కర్‌ ‌ప్రవృత్తి ప్రభుత్వాన్ని లక్ష్యపెట్టని ధోరణిలోనే ఉందని అన్నారని వ్యాఖ్యానించారు టీవీఆర్‌. ఆ ‌ధోరణిలో తప్పులేదనే తాను అంటానని ఆయన చెప్పారు.కేంద్రంతో ఎలా వ్యవహరించాలో తాను చెప్పానని, కానీ ప్రభుత్వం అది గ్రహించలేదని అన్నారు. గోల్వాల్కర్‌ను నిర్బంధం నుంచి విడుదల చేసినట్లయితే ప్రణాళిక గురించి ఆయన తన సహచరులతో కొంత మథనం చేసే అవకాశం ఉండేది. కానీ అవకాశం లేకుండా ప్రభుత్వమే చేసిందని టీవీఆర్‌ ఆరోపించారు. తాను రాజ్యపతాకం లేదా జాతీయ జెండాను ఎల్లప్పుడూ గౌరవిస్తూనే ఉన్నానని, రహస్యంగా ఏ కార్యక్రమం సాగించలేదని, ఎవరిపట్లా విద్వేషాన్ని రెచ్చగొట్టలేదని, ప్రభుత్వానికి పంపించిన ప్రణాళిక పట్ల తనకు సంపూర్ణ విశ్వాసం ఉందని గోల్వాల్కర్‌ ‌చెప్పినట్టు కూడా ఏపీఐ వార్తా సంస్థ వెల్లడించిన సంగతిని టీవీఆర్‌ ‌గుర్తు చేశారు.
టీవీఆర్‌ ఉదారవాది. ఈ పేరు వినగానే నేటి ఉదారవాదులను, వారి మాటలను దయచేసి స్మరణకు తెచ్చుకోవద్దు. టీవీఆర్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ ‌గురించి ఎలాంటి అభిప్రాయం కలిగి ఉన్నారో పరిశీలించాలి. ఆయన కొన్ని అవమానాలు భరిస్తూనే మధ్యవర్తిత్వం నెరిపారు. కారణం ఇదే. అనేక విభేదాలకు లోనైన హిందూ సమాజాన్ని సమీకరించడానికి ఆర్‌ఎస్‌ఎస్‌ ‌చాలా ప్రయత్నించిందని స్పష్టంగా చెప్పగలనని నిర్మొహ మాటంగా చెప్పారాయన. మన కళ్ల ముందు విజృంభిస్తున్న దుష్టశక్తులను ఎదుర్కొనడానికి ఈ సంస్థ ఎంతో ఆవశ్యకమని తన దృఢ విశ్వాసమని ఆయన ఆ పత్రికా ప్రకటనలో తెలియచేశారు.
జాగృతి, 27.7.1949 సంపాదకీయం ప్రకారం టీవీఆర్‌ ‌పత్రికా ప్రకటన ఉద్దేశం, అంతవరకు జరిగిన తతంగాన్ని ప్రజలకు విన్నవించడమే. కాకతాళీయమే కావచ్చు, లేదా నిజమూ కావచ్చు. వెంటనే కేంద్రం ఆర్‌ఎస్‌ఎస్‌ ‌మీద విధించిన నిషేధాన్ని తొలగించింది. కేంద్రం ప్రణాళికలో చూపిన ఆక్షేపణలను సంఘం అంగీకరించి, పూచీపడ్డ తరువాతే నిషేధాన్ని రద్దు చేశామని ఒక కుంటి సాకు చూపింది. టీవీఆర్‌ ‌ప్రకటన ఇవాళ్టికి కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ ‌మీద ఉదార వాదుల ముసుగులో ఉన్న హిందూ వ్యతిరేకులు, అజ్ఞానులు చేస్తున్న ఆరోపణలకు మంచి సమాధానం.
గాంధీజీ హత్య తరువాత నిషేధం విధించారు. కానీ సంవత్సరం గడిచినా ఆర్‌ఎస్‌ఎస్‌పై కేంద్రం మోపిన ఆరోపణలలో ఒక్కదానిని కూడా నిరూపించ లేకపోయింది. క్రమంగా ఆ ఆరోపణల నుంచి కాంగ్రెస్‌ ‌పార్టీ నాయకులు కూడా వెనక్కి తగ్గారు. చాలా చిత్రంగా నిషేధం ఎత్తివేసిన తరువాత సంఘ సభ్యులు కాంగ్రెస్‌లో పనిచేయాలని కాంగ్రెస్‌ ‌పెద్దల నుంచి సందేశాలు రావడమే వింత. ఇదంతా నాటి నిషేధం ఒక తొందరపాటేనని రుజువు చేస్తుంది.

About Author

By editor

Twitter
YOUTUBE